పార్వతీపురం మన్యం జిల్లా మలేరియా రహిత జిల్లా కావాలని జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభల కుండా పటిష్ఠమైన చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. వచ్చే వర్షాకాలంలో లేదా అకాల వర్షాలు కురిసే కాలంలో జ్వరాలు వ్యాప్తి ఉండే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో ఎక్కడా వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. మలేరియా, డెంగ్యూ, ఇతర వ్యాధులపై కలెక్టర్ కార్యాలయంలో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మలేరియా నివారణకు ముఖ్యంగా ప్రతి శుక్రవారం డ్రై డే గా పాటించాలన్నారు. తద్వారా లార్వా పెరుగుదల లేకుండా చూడగలమని ఆయన పేర్కొన్నారు. లార్వా పెరుగుదల లేకుండా తగిన చర్యలు కూడా చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. ఇంటింటికి వెళ్లి డ్రై డే పై అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రభల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై సైతం చైతన్యం కల్పించాలని ఆయన చెప్పారు. ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. నీరు నిల్వ జరిగే గ్రామాల జాబితాను ఉపాధి హామీ పిడికి అందజేయాలని ఆర్.డబ్ల్యు.ఎస్ అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నీటి కుంతలలో నీరు నిల్వ ఉండరాదని ఆయన స్పష్టం చేశారు. ఫాగింగ్, స్ప్రేయింగ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని ఆయన ఆదేశించారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వైద్య అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బందిని భాగస్వామ్యం చేసి పకడ్బందీగా స్ప్రేయింగ్, ఫాగింగ్ జరుగుటకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వసతి గృహాలకు దోమల నివారణకు మెష్ లను పెట్టాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. స్ప్రేయింగ్ కార్యక్రమాలపై ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు.
జిల్లా మలేరియా అధికారి కె. పైడి రాజు మాట్లాడుతూ మే 16 నుండి జిల్లాలో స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నామన్నారు. గంభూషియా చేప పిల్లలను విడిచి పెట్టడం ద్వారా లార్వా నివారణకు చర్యలు చేపడుతున్నామని ఆయన వివరించారు. జిల్లాకు రెండు లక్షల గంభూషియస్ చేప పిల్లలు అవసరమని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి వాగ్దేవి, జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ఇ ప్రభాకర రావు, ఉపాధి హామీ శ్రీనివాస రావు, మునిసిపల్ కమీషనర్ పి.సింహాచలం, మత్స్య శాఖ క్షేత్ర అధికారి గంగాధర రావు తదితరులు పాల్గొన్నారు.