విజయనగరం జిల్లాలో ఈ వేసవిలో త్రాగునీటి కొరత రానివ్వకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వేసవిని ఎదుర్కొనడానికి ఇప్పటికే క్రాష్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని 49వ డివిజన్ పరిధిలోని గాజులరేగ గుభేలుపేట నుంచి జెఎన్‌టియు జంక్షన్ వరకు, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.62.50 లక్షలతో నిర్మించిన రహదారిని, మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్శంగా మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో, విజయనగరం పట్టణాభివృద్దికి ప్రణాళికాబద్దమైన కృషి జరుగుతోందని ప్రశంసించారు. శత శంకుస్థాపనలను, ద్విశత శంకుస్థాపనలు, చేపట్టిన ఇతర అభివృద్ది కార్యక్రమాలను వివరించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా, విజయనగరంలో మహిళలకోసం ప్రత్యేకంగా ఒక పార్కును నిర్మించాలని ఎంఎల్ఏ నిర్ణయించడం అభినందనీయమన్నారు. ఇదొక ఆదర్శనీయ ప్రయత్నంగా మంత్రి పేర్కొన్నారు. ఈ పార్కులో మహిళలకోసం వాకింగ్ ట్రాక్, జిమ్, స్విమ్మింగ్ ఫూల్ లాంటి సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని చెప్పారు. పట్టణాల్లో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నామని, త్రాగునీటి వనరులను అభివృద్ది చేస్తున్నామని చెప్పారు.
రాజధాని విషయంలో తన వ్యాఖ్యలను పూర్తిగా అర్థం చేసుకోకుండా, ప్రతిపక్ష నాయకులు ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారంటూ, వారి ప్రకటనలను మంత్రి బొత్స ఖండించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు. మనకు అమరావతే రాజధాని అని చెప్పి, చంద్రబాబునాయుడు తన కుటంబంతో హైదరాబాద్‌లో నివాసం ఉన్నారంటూ ఆక్షేపించారు. రాష్ట్రంలో చంద్రబాబుకు చిరునామా ఉందా ?... ఆయన అమరావతికి ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. అడ్రస్‌లేని వ్యక్తి మన రాష్ట్రాన్ని పరిపాలించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శివరామకృష్ణ కమిషన్ సిఫార్సులను ఏమాత్రం పట్టించుకోకుండా, అమరావతిని రాజధానిగా ప్రకటించారని అన్నారు. కేవలం ఒక సామాజిక వర్గం కోసం, ఈ వంకతో నిధులు దోచుకుతినడానికే అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారని విమర్శించారు. అమరావతి విషయంలో కేంద్రం నుంచి ఆమోదం కూడా తీసుకోలేదని చెప్పారు. అయినప్పటికీ తాము అమరావతి ప్రాంతాన్ని రాష్ట్ర శాసన రాజధానిగా అభివృద్ది చేస్తామని, సిఆర్‌డిఏ చట్టానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, మున్సిపల్ కమిషనర్ ఎస్ఎస్ వర్మ, మున్సిపల్ ఇంజనీర్ కె.దిలీప్, కార్పొరేటర్లు కర్రోతు రాధామణి, నడిపిల్లి ఆంజనేయులు, వైకాపా నగరాధ్యక్షులు ఆశపు వేణు, ఇతర కార్పొరేటర్లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.