1
ప్రత్యక్ష దైవం, అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రథసప్తమి వేడుకలు సోమవారం అర్ధరాత్రి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి దర్శనానికి ప్రక్క రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు. సూర్య జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసారు.విజయనగరం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్ర స్వామి, సంయుక్త కలెక్టర్ ఎం.విజయ సునీత, తూర్పు గోదావరి జిల్లా కాకినాడ శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణనంద స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యదేవుని ఆశీస్సులతో
ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మంత్రి ఆకాంక్షించారు. రథసప్తమి వేడుకల నిర్వహణపై మంత్రి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వివిధ శాఖల సమన్వయంతో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేశారని, తద్వారా భక్తులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కోవిడ్ దృష్ట్యా దర్శనానికి హాజరైన భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనాలు చేసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు.