1 ENS Live Breaking News

ఈవీఎంల భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌ (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్  కృతికా శుక్లా ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. గురువారం ఉదయం కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా..రెవెన్యూ అధికారులతో కలిసి  పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. అదేవిధంగా ప్రతి మూడు నెలకు ఒకసారి జిల్లాలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోదామును పరిశీలించడం జరుగుతుందని కలెక్టర్ వివ‌రించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తుల, స్పందన, అగ్నిమాపక అధికారి ఎన్ సురేంద్ర ఆనంద్, కాకినాడ ఆర్‌డీవో బీవీ.రమణ, కాకినాడ పట్టణ త‌హ‌సీల్దార్ వైహెచ్ఎస్ సతీష్‌, పట్టణ, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్లు జె.రమేష్, ఎం. జగన్నాథం త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-14 14:04:56

రాజ్యాంగంతోనే భారతదేశ పాలన..

డాక్టర్ బాబా సాహెబ్ బిఆర్ అంబేద్కర్ గొప్ప దేశభక్తులేకాకుండా ఆయన రచించిన రాజ్యాంగం తోనే భారత దేశ పాలన జరుగుతున్నదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి సుభాష్ పటంశెట్టి పేర్కొన్నారు. గురువారం ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యకు గల ప్రాముఖ్యాన్ని గుర్తించి మాతృదేవత అభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సర్వసత్తాక రాజ్యాంగం మన అందరికీ పూజనీయ మని రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని రాజ్యాంగం అమలులో భాగస్వామ్యం తప్పక ఉండాలన్నారు.  స్వాతంత్ర్య భారతదేశ నిర్మాణానికి ఆయన దార్శనికుడిగా నిలిచారన్నారు. అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు బి వి సత్యవతి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ మన దేశానికి అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించి పటిష్టమైన న్యాయ వ్యవస్థ పాలనా వ్యవస్థను రూపొందించారని  కొనియాడారు. పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ అంబేద్కర్ వల్లనే దేశంలో సామాజిక మార్పు సాధ్యమైందన్నారు అనకాపల్లి లో అంబేద్కర్ భవన్ నిర్మించాలని కోరారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ విద్య లేనిదే భవిష్యత్తు లేదని అంబేద్కర్ తెలిపారని న్యాయానికి పెద్దపీట వేస్తూ భారత రాజ్యాంగాన్ని మనకు అందించారని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలను యువత ఆకళింపు చేసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలన్నారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి అంబేద్కర్ చిత్రపటానికి  పూలమాలవేసి అంజలి ఘటించారు.  డి ఏ వి పాఠశాల విద్యార్థినులు ప్రదర్శించిన "అంబేద్కర్ జీవిత చరిత్ర" నాటక ప్రదర్శన అందరినీ అలరించింది.  అంబేద్కర్ గురించి ప్రసంగించిన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న బాలబాలికలకు రాజ్యాంగాన్ని గురించి తెలియజేసే పుస్తకాలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్ డి ఓ చిన్ని కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వర రెడ్డి, డి ఎస్ డబ్ల్యూ ఓ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Anakapalle

2022-04-14 13:51:08

నూకాలమ్మకు మంత్రి అమర్నాథ్ పూజలు..

ఆంధ్రప్రదేశ్  పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గురువారం సాయంత్రం నాలుగు గంటలకు నూకా లమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా విజయవాడ నుండి వచ్చిన అమ్మవారి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. ఏ కార్యక్రమం తలపెట్టినా అమ్మ ఆశీర్వాదం తీసుకోవడంలో క్రమం తప్పకుండా అమర్నాద్ పూజలు చేపడుతూ వస్తున్నారు. మంత్రి అమర్నాద్ తో పాటు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త కెకెరాజు దాడి రత్నాకర్ పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Anakapalle

2022-04-14 13:38:37

61రోజులు సముద్రంలో చేపలవేట నిషేధం.. మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ నిర్మలకుమారి

సముద్రంలో 61రోజులు (15-04-2022 నుంచి 14-06-2022) పాటు చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం జీఓనెంబరు 56, 74 జారీ చేసిందని విజయనగరం జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి తెలియజేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె తన కార్యాలయంలో జిల్లా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సముద్రజలాల్లో చేపలు, రొయ్యలకి ఇది సంతానోత్పత్తి సమయమని ఆ సమయంలో తల్లిచేపలకు ఎలాంటి ఆటకం రాకుండా, మత్స్య ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చేపల వేటను నిషేదించిందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాలార్లు మెకనైజ్డ్, మోటారైజ్డ్ బోట్లతో ఎలాంటి చేపల వేట చేయకూడదని చెప్పారు. అలా కాకుండా ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చేపల వేట చేపడితే ఏపీఎంఎఫ్ఆర్ చట్టం 1994 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  చేపలవేట నిషేద సమయంలో ఉపాది కోల్పోయిన ఒక్కో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా రూ.10వేలు ఆర్ధిక సహాయం కూడా అందించనున్నదని తెలియజేశారు. దానికోసం ఈనెల 16వ తేదిన జిల్లాలోని అన్ని పంచాయతీల్లో మత్స్యకారులను గుర్తించే నిమిత్తం మత్స్యశాఖ అధికారులు, సిబ్బందితో సర్వే కూడా నిర్వహించనున్నామన్నారు. దాని కోసం మత్స్యకారులు బోటు, బోటు రిజిస్ట్రేషన్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఫిషింగ్ లైసెన్స్(బోటు యజమాని తేవాల్సి వుంటుంది), ఆధార్ కార్డు, రైస్ కార్డు, బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజి, ఫోన్ నెంబర్లతో సర్వే జరిగే రోజు మత్స్యకారులు అంతా సిద్దంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో మత్స్యకార లబ్దిదారుడు అర్చకులు, చేదోడు, రైతు భరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, కాపునేస్తం, నేతన్న నేస్తం, పాస్టర్,  వైఎస్సార్ చేయూత మరే ఇతర ప్రభుత్వ పథకాలు కూడా పొందకుండా ఉండేవారు మాత్రమే ఈ వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకానికి అర్హులని తెలియజేశారు. లబ్దిదారుడు 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉండి, గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.20లక్షలు ఆదాయం, పట్టణ ప్రాంతంలో అయితే రూ.1.44లక్షల ఆదాయం మించకుండా ఉండాలని, అదే సమయంలో కుటుంబంలో ఎవరికీ నాలుగుచక్రాల వాహనాలు కలిగి ఉండకూడదని, విద్యుత్ కనెక్షన్ 300 యూనిట్లు దాటకుండా ఉండాలని అదీ కూడా దీనిని ఆరు నెలల విద్యుత్ చార్జీలు పరిగణలోకీ తీసుకుంటారని, మున్సిపల్ ప్రాంతంలో వెయ్యి చదరపు గజాల్లోపు ఇంటిలో నివాసం ఉండాలని, ఈ కుటుంబాల్లో ఎవరైనా ప్రభుత్వ పించను తీసుకుని ఉండకూడదని, మరీ ముఖ్యంగా మత్స్యాకార కుటుంబాల్లో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదని తెలియజేయశారు. ప్రభుత్వం పొందు పరిచిన నిబంధనలను సర్వే చేపట్టే మత్స్యశాఖ సిబ్బంది, అధికారులు పరిగణలోకి తీసుకుంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా అర్హులైన లబ్దిదారులు సర్వే సమయంలో అన్ని రకాల పత్రాలు, వాటి జెరాక్సులతో సిద్దంగా ఉండాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు మీడియా ద్వారా మత్స్యకారులకు తెలియజేశారు.

Vizianagaram

2022-04-12 12:43:25

నవరత్నాల పథకాలు పేదలకు చేర్చాలి..

రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రతీ సంక్షేమ, అభివృద్ధి పథకాలను జిల్లాలో సమర్ధవంతంగా అమలు చేసి జిల్లా ప్రతిష్టను  పెంచాలని అన్నిశాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూమ్ వీడియోలో జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమీషనర్లు, తహాశీల్ధార్లు, ఎమ్.పి.డి.ఒ లతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా హౌసింగ్ జగనన్న పేదలందరికీ ఇల్లు,(హౌసింగ్ కనస్ట్రక్షన్) స్పందన, వార్డు/గ్రామ సచివాలయాలు, ఓ.టి.ఎస్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం   (లేబర్ బడ్జెట్, వై.యస్.ఆర్ జలకళ), రెవెన్యూ (రీసర్వే, సర్వే) కార్యక్రమాలు అమలు అవుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అమలులో జరుగుతున్న జాప్యానికి గల కారణాలు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గాలపై దిశా నిర్ధేశం చేశారు. చిన్న సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు అంతా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంతో పాటు, జిల్లాలో నిరంతర అభివృద్ధి జరిగేలా లక్ష్యాలను పెట్టుకొని పనిచేయాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి సూచించారు. ప్రభుత్వ నిర్ధేశిత ఆర్డర్ల ప్రకారం అధికారులు పని చేయాలని సూచించారు. మండలాల వారిగా తహాశీల్ధార్లు, ఎమ్.పి.డి.ఒ లు, మున్సిపల్ కమీషనర్లు, పలువురు జిల్లా అధికారులతో పనుల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జి. రాజకుమారి, డి. ఆర్. ఒ చంద్రశేఖరరావు డి.ఆర్.డి.ఎ పి.డి ఆనంద్ నాయక్, డ్వామా పి.డి. యుగంధర్ కుమార్, హౌసింగ్ పి.డి. సాయి నాథ్, ఎస్సీ కార్పోరేషన్ ఇ.డి ప్రేమ కుమారి, సి.పి.ఒ శేషశ్రీ, హౌసింగ్, రెవెన్యూ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Guntur

2022-04-08 16:11:42

రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు..కలెక్టర్

తూర్పుగోదావరి  జిల్లాలో నాడు - నేడు పనులతో పాటు 84 అదనపు తరగతి గదులు నిర్మాణంతో కలిపి , మొత్తం 49 పాఠశాలల్లో  133 పనులను సుమారు రూ.100 కోట్లతో చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా.కె. మాధవీలత తెలిపారు. శుక్రవారం సాయంత్రం విద్యా శాఖ పై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో  నాడు నేడు ద్వారా రెండవ ఫేజ్ లో చేపట్టవలసిన పనులకు సంబంధించి మండలవారి అధికారులతో సమీక్షించి పలు సూచనలు అందించారు. చేపట్టే పనుల్లో నాణ్యత కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో నాడు నేడు రెండవ ఫేజ్ లో 49 పాఠశాలలను ఆధునీకరణ త్వరితగతిన చేపట్టాలన్నారు. అదేవిధంగా 84 అదనపు తరగతి గదులను పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. తరచు పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు అందుబాటులో ఉండే  త్రాగు నీరు, టాయిలెట్స్ అపరిశుభ్రంగా వున్నట్లు అయితే సంబంధించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి త్వరలో జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి రానున్నారని సూచన ప్రాయంగా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన తేదీలోగా ప్రతి అధికారి వారికి కేటాయించిన , నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

అంతకుముందు విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండో దశ నాడు నేడు అభివృద్ధి పనులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తలపించేలా ఉండాలన్నారు. నూతనంగా భాద్యతలు చేపట్టిన కలెక్టర్ లను అభినందిస్తూ, ఇంజినీరింగ్ అధికారులు పనులను నిబద్ధతతో చేపట్టాల్సి ఉందన్నారు. రెండో దశలో అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర కపోనెంట్స్  కలిసి ఉన్నందున పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ లు పాఠశాలలు తనిఖీ చేసి, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించాలన్నారు. ఈ సమావేశానికి డీఈఓ  ఎస్. అబ్రహం, ఎమ్ ఈ ఓ లు,  పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఏ పి డబ్ల్యు ఐ డి సి, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు హాజరయ్యారు.

Rajahmundry

2022-04-08 16:04:07

ఈనాడు ఆంధ్రజ్యోతి టీవి5 లను వదిలేదు..

తనపై అసత్య ప్రచారాలు చేసిన టీడీపీ నాయకులు, బండారు సత్యనారాయణ,పలువురి టిడిపి నాయకులపైన ఈనాడు,ఆంధ్రజ్యోతి  టీవీ5,మీడియా సంస్థలపై ఎంపీ విజయసాయిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఈ మేరకు ఫిర్యాదుని పిఎం పాలెం పోలిసు స్టేషన్లో  అందజేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలోనే ఎన్సీసీ భూముల లావాదేవీలు జరిగాయని,  ఆ విషయమై తిరుపతి వేంకటేశ్వర స్వామిపై ఒట్టు పెట్టి నిజాలు చెప్పగలరా అని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు తీసుకుని  ఎన్.సి.సి కంపెనీకి లబ్ది చేకూర్చింది చంద్రబాబు కాదా అని మండి పడ్డారు.చంద్రబాబు ఆల్జీ మర్స్ అనే వ్యాధితో బాధ పడుతున్నారని,  దేవుడు ఆయుష్హు ఇస్తే వచ్చే ఎన్నికల వరకు మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తారని..కానీ వచ్చే పరిస్థితి ఏపీ ప్రజలు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బీసీల కడుపు కొట్టి భూములను టిడిపి సామాజిక వర్గం ఆక్రమించిందన్న ఆయన ఆ భూముల విలువ కనీసం 10వేల కోట్లు ఉంటుందన్నారు. భూముల అక్రమాలను సహించేది లేదని, భూములు అన్నీ స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. సుజనా చౌదరి ఆర్ధిక నేరగాడని, అయ్యన్నపాత్రుడు మోస్ట్ వాగుడుకాయని, ఆయన ఇంటి పేరు చింత కాయ కాదు మిరపకాయల అంటూ చురకలు అంటించారు. అయ్యన్న తాగితే మనిషే కాదని..రాత్రీ,పగలు తాగుతునే ఉంటాడని అన్నారు. ఆయన కొడుకు విజయ్ కి బినామీ కంపెనీలు ఉన్నాయిని, తండ్రి కోడుకులు బెంగుళూరులో మోసాలకు  పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయమై ఈడీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. అంతేకాకుండా అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి బండారు సత్యన్నారాయణ మూర్తిని వదిలి పెట్టే ప్రసక్తే లేదని క్రిమినల్ , సివిల్ డిఫార్మేషన్ కేసులు పెట్టి న్యాయస్థానంను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డితోపాటు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణశ్రీనివాస్, ఎమ్మెల్యే అదీప్ రాజ్, తిప్పలనాగిరెడ్డి, ఉత్తర నియోజవకర్గ ఇన్చార్జి కెకె రాజు, ఐటి విభాగం ప్రతినిధి మిలీనియం శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-08 15:58:01

పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు..

పదవతరగతి  పరీక్షలను  ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించాలని విశాఖజిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాధన్ అధికారులను ఆదేశించారు.  శుక్రవారం ఉదయం వారు పదవతరగతి పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్ సమావేశమందిరంలో   సమన్వయ కమిటి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ పరీక్షలను  జిల్లాలోని 318 పాఠశాలలను పరీక్షా కేంద్రాలగా ఎంపిక చేయడం జరిగిందని,  ఇందులో 155 పాఠశాలలను విశాఖ జిల్లాలలోను,  122 పాఠశాలలను అనకాపల్లి జిల్లాలోను , 41 పాఠశాలలను  అల్లూరి సీతారామరాజు జిల్లాలోను  ఎంపిక చేయడం జరిగిందని  వీటిలో  మొత్తం 58,256 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరగుతారని తెలిపారు.  318 పరీక్షా కేంద్రాలలో 10 సమష్యాత్మక కేంద్రాలుగా గుర్తించి వాటిలో  సి.సి కెమెరాలు ఏర్పాటు చేయుటకు  అధికారులను సూచించినారు.  జిల్లా అధికారులందరూ  సమన్వయంతో పని చేసి, పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేటట్లు చూడాలన్నారు. 10వ తరగతి పరీక్షలు  తేది 27-4-2022 నుండి 9-4-2022 వరకు జరుగుతాయన్నారు.  

పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, నిరంతర విద్యుత్తు ఉండేటట్లు చూడాలని ఆదేశించారు.  పరీక్ష సమయం ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 నిల వరకు  ఆయా ప్రాంతాలలో 144 వ సెక్షన్ అమలులో ఉంటుందని మరియు  పరీక్షా కేంద్రాలలో  అనుమతి లేనిదే ప్రవేశించరాదని, అతిక్రమించిన వారికి చట్ట పరమైన చర్యలు తీసుకోబడునని తెలియజేసారు. ఏ ఒక్క విద్యార్ధి కూడా నేలపై పరీక్షలు వ్రాయరాదని అధికారులను ఆదేశించారు.  ఇదే విదంగా ఏప్రిల్ నెలలో జరగబోయే  సార్వత్రిక పది మరియు ఇంటర్ పరీక్షలను సజావుగా  నడిపించాలని  ఆదేశించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి విజయకుమార్, మూడు జిల్లాల విద్యాశాఖాదికారులు, ఉప విద్యాశాఖాదికారులు, ప్రభుత్వ పరీక్షల సహయ కమిషనర్, విద్యుత్తు, వైద్య ఆరోగ్య, రవాణా, తపాలా , పోలీసు తదితర అధికారులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-04-08 15:21:22

సకాలంలో ప్రజలకు రేషన్ అందించాలి..

ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు ప్రజలందరికీ సకాలంలో అందేలా చూడాలని కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ.ఎస్‌ పంపిణీ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం  కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో ఎండీయూ వాహ‌నాల ద్వారా జ‌రుగుతున్న రేష‌న్ పంపిణీ ప్ర‌క్రియ‌ను ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ప్రజా పంపిణీ వ్య‌వ‌స్థ (పీడీఎస్‌) స‌రుకుల‌ను కార్డుదారులకు స‌క్ర‌మంగా అందిస్తున్నారా? లేదా? అనే అంశాన్ని ప‌రిశీలించారు. ఏప్రిల్ నెల‌కు సంబంధించి పీడీఎస్ స‌రుకుల పంపిణీ జిల్లాలో శుక్ర‌వారం ప్రారంభ‌మైంది. ఈ నేప‌థ్యంలో జాయింట్ క‌లెక్ట‌ర్‌.. కాకినాడ‌లో ప‌లు ప్రాంతాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేసి రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క మొబైల్ వాహ‌నాల ద్వారా ఇళ్ల వ‌ద్ద‌కే పీడీఎస్ స‌రుకులు అందించే బృహ‌త్త‌ర కార్య‌క్రమం క్షేత్ర‌స్థాయి అమ‌లుతీరును ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలించారు. కార్య‌క్ర‌మం సాఫీగా, విజ‌య‌వంతంగా పూర్తిచేసేందుకు ఎండీయూ ఆప‌రేట‌ర్లు, వాలంటీర్ల‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ ఇల‌క్కియ ప‌లు సూచ‌న‌లు చేశారు.

Rajahmundry

2022-04-08 13:33:20

ఆనం కళాకేంద్రం సందర్శించిన కమిషనర్..

రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కె.దినేష్ కుమార్ నగర పాలక సంస్థ లోని వివిధ విభాగాలను పరిశీలించి, ఆయా విభాగాల పనితీరు పై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర ఆనం కళాకేంద్రం ను పరిశీలించి శనివారం ఉదయం 11 గంటలకు  ప్రారంభోత్సవం కోసం తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. కోవిడ్ కారణంగా గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించలేదని అధికారులు తెలిపారు. కళా ,  సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా నిలిచి నగరంలో ఒక సాంస్కృతిక కళా వేదికగా ఆనం కళాకేంద్రంకి పునర్ వైభవాన్ని తీసుకుని రావడం జరుగుతుందని దినేష్ కుమార్ తెలిపారు. స్టేజి డెకరేషన్ , లైటింగ్, సిట్టింగ్ కెపాసిటీ వంటి వాటిపై సమీక్షించి, సూచనలు చేశారు. కమిషనర్ తో నగర పాలక సంస్థ డీఈ జి. పాండురంగారావు, ఈఈ  ఆర్.శేషగిరిరావు, డీఈ  పి. ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

Rajahmundry

2022-04-08 13:04:12

తూ.గో.జి.కలెక్టర్ ను కలిసిన కమిషనర్

రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ  కమిషనర్ కె. దినేష్ కుమార్ శుక్రవారం భాద్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా.మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసిన కలెక్టర్ డా.మాధవీలత, జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరానికి చరిత్రాత్మకమైన ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.  నగరాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసి అభివృద్ధి పరచాలని సూచించారు. రాజమహేంద్రవరం నగరాభివ్రుద్ధికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తానని జిల్లా కలెక్టర్ డా.మాధవీలతకు కమిషన్ తెలియజేశారు.

Rajahmundry

2022-04-08 13:02:10

అప్పన్న ఉత్సవాలు విజయవంతం చేద్దాం..

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఈ నెల 12న జరగనున్న స్వామి  కళ్యాణ మహోత్సవం, మే 3న జరగనున్న అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవాలుకి సంబందించి ట్రస్ట్ బోర్డు సభ్యులతో అధికారులు కలసి పూర్తి స్థాయిలో విజయ వంతం చేద్దామని ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ తో కలిసి స్వరూపానంద సరస్వతి స్వామీజీ ని కలిసి ఆహ్వాన పత్రిక ఇచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు తదుపరి. శుక్రవారం దేవస్థానం కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు సభ్యులతో ఈవో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈసందర్భముగా ఉత్సవాలు కి సంబందించిన  పలు అంశాలపై బోర్డ్ సభ్యులు తో  చర్చించారు. అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఇ ఓ, ఈఈ శ్రీనివాసరాజు  బోర్డు సభ్యులకు వివరించారు,, స్వామి కళ్యాణం జరిగే వేదికను అందంగా తీర్చిదిద్దాలని ఇంజనీరింగ్ అధికారులను బోర్డ్ సభ్యులు ఆదేశించారు.. అంతేకాకుండా కళ్యాణ మహోత్సవం కు వచ్చే భక్తులకి ఏటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు. కళ్యాణ మహోత్సవానికి ఈ యేడాది అందరినీ ఆహ్వానిస్తున్నట్లు ఈవో చెప్పారు. అదేవిధంగా స్వామి కళ్యాణముకి మీడియాకు  కూడా గతంలో మాదిరిగానే అనుమతి ఉంటుందన్నారు. కళ్యాణ వేదిక ఎదురుగా గతంలో మాదిరిగా మీడియాపాయింట్ ఉంటుందని ట్రస్ట్ బోర్డు సభ్యులు తెలియజేశారు.. ఈ దిశగా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చందనోత్సవానికి సంబంధించి తదుపరి జరిగే ట్రస్ట్ బోర్డు సమావేశంలో సభ్యులు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆలయ అభివృద్ది లో  మీడియా సహకారం  అవసరం. కాబట్టి చందనోత్సవం కి కూడా మీడియాకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు బోర్డు సభ్యులు తెలియజేశారు. రాష్ట్రము లో ఇతర ఆలయాల మాదిరిగానే సింహగిరి పైన అందరికి అందుబాటులో మీడియా పాయింట్ ఉంటుందని ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు.
సమావేశం లో ఆలయ అధికారులు ట్రస్టు బోర్డు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వారణాసి దినేష్ రాజ్, దొడ్డి రమణ, సువ్వాడ శ్రీదేవి, పాత్రుడు, సతీశ్,  నిర్మల, శ్రీదేవి వర్మ, రాధ, రాజేశ్వరీ, చందు తదితరులున్నారు.

Simhachalam

2022-04-08 12:42:15

వారికి గ్రూప్1,2 పరీక్షలకు ఉచిత శిక్షణ..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన‌ నిరుద్యోగ అభ్య‌ర్థుల‌కు త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే బ్యాంకు పీవో, గ్రూప్ -1 ప‌రీక్ష‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యేందుకు తిరుప‌తి, విజ‌య‌వాడ ఏపీ స్ట‌డీ స‌ర్కిళ్ల‌లో ఉచిత శిక్ష‌ణ అంద‌జేయనున్నుట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సునీల్ రాజ్ కుమార్ తెలిపారు. పీవో ప‌రీక్ష‌లకు స‌న్న‌ద్ధ‌మ‌య్యే వారికి తిరుప‌తిలోని డా. బి. ఆర్‌. అంబేద్క‌ర్ ఏపీ స్ట‌డీ స‌ర్కిల్ లో, గ్రూప్-1 ప‌రీక్ష‌కు స‌న్న‌ద్ధ‌మ‌య్యే వారికి విజ‌య‌వాడ బ్రాంచి ఏపీ స్ట‌డీ స‌ర్కిల్‌లో శిక్ష‌ణ ఉంటుంద‌ని శుక్ర‌వారం విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. వార్షిక ఆదాయం రూ.6 ల‌క్ష‌లు క‌లిగిన ఎస్సీ, ఎస్టీ సామాజిక, ఇత‌ర‌ వ‌ర్గాల‌కు చెందిన ప‌ట్ట‌భ‌ద్రులు ఈ నెల 18వ తేదీ లోగా apstdc.apcfss.in వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్ లో ద‌ర‌ఖాస్తులు స‌మ‌ర్పించాల‌ని సూచించారు. అభ్య‌ర్థుల సౌక‌ర్యార్థం ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ గ‌డువును ఈ నెల 10 నుంచి 18వ తేదీ వ‌ర‌కు పొడిగించిన‌ట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్  ప‌రీక్ష నిర్వ‌హించ‌టం ద్వారా శిక్ష‌ణ‌కు అభ్య‌ర్థుల ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంద‌ని, ఎంపికైన వారికి ఉచిత వ‌స‌తి, ఉచిత శిక్ష‌ణ అందజేస్తార‌ని వివ‌రించారు.

Vizianagaram

2022-04-08 12:33:02

రభీ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయండి..

కాకినాడ జిల్లాలో ర‌బీ సీజ‌న్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం సేక‌రించే ప్ర‌క్రియ మొద‌టి నుంచి చివ‌రి వ‌ర‌కు సాఫీగా సాగేలా ఇప్ప‌టినుంచే ప్ర‌ణాళికల‌తో స‌న్న‌ద్ధంగా ఉండాల‌ని కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇల‌క్కియ‌.ఎస్‌.. అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ విధానగౌతమి సమావేశ మందిరంలో వ్యవసాయం, రెవెన్యూ, పౌరసరఫరాలు, సహకార శాఖలతో ఏర్పాటు చేసిన ధాన్యం సేకరణ అధికారుల పునశ్చరణ సమావేశంలో జేసీ ఇల‌క్కియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల మూడో వారం నుంచి రబీ ధాన్యం సేకరణ ప్రారంభంకానున్నందున ప్రభుత్వ నిబంధనల‌ను అమ‌లుచేస్తూ రైతుల నుంచి ధాన్యం సేకరించేందుకు అధికారులు సమాయత్తంకావాలన్నారు. సేకరణలో ధాన్యం తూకం, తేమ శాతం స‌రిగా ఉండేలా చూడాల‌న్నారు. ప్రధానంగా రైతులకు కనీస మ‌ద్ద‌తు ధరపై అవగాహన కల్పించి, రైతులు తమ పంటను మద్దతు ధ‌రకే అమ్ముకునేలా అధికారులు కృషిచేయాలన్నారు. ధాన్యం సేకరణలో ఈ-క్రాప్ బుకింగ్‌, ఈ-కేవైసీ వివరాలు కీలకమైనందున రైతులు అందరూ తప్పనిసరిగా ఈ-క్రాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకునేలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. ఖరీఫ్ ధాన్యం సేకరణలో ఎదురైన సమస్యలను అధిగమించి క్షేత్ర స్థాయిలో రైతుల‌కు ఇబ్బందులు రాకుండా రబీ ధాన్యం సేకరణ సజావుగా జరిగేందుకు అధికారులు కృషిచేయాలని జేసీ ఇల‌క్కియ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ ఎన్.విజయ్ కుమార్, పౌర సరఫరాల శాఖ డీఎం  ఇ.లక్ష్మి రెడ్డి, డీఎస్వో పీ.సురేష్, పెద్దాపురం ఆర్డీవో జే.సీతారామరావు, కాకినాడ ఇంచార్జ్ ఆర్డీవో కె.శ్రీరమణి, మండల స్థాయి రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-04-08 12:21:17

ఓటిఎస్ పై ప్రత్యేకంగా ద్రుష్టిసారించాలి..

కాకినాడ జిల్లాలో న‌వ‌ర‌త్నాలు పేద‌లంద‌రికీ ఇళ్లు, సంపూర్ణ గృహ హక్కు (ఓటీఎస్) పథకాలపై దృష్టిసారించి ల‌బ్ధిదారుల‌కు మేలు జ‌రిగేలా ప్ర‌ణాళికాయుత చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం క‌లెక్ట‌రేట్ కోర్టుహాల్ నుంచి క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. జాయింట్ కలెక్టర్ ఇలక్కియ.ఎస్‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్ విధానంలో ఆర్‌డీవోలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, మండ‌ల ప్ర‌త్యేక అధికారులు, త‌హ‌సీల్దార్లు, ఎంపీడీవోల‌తో హౌసింగ్, సంపూర్ణ గృహ హక్కు, ఇత‌ర ప్ర‌భుత్వ ప్రాధాన్య కార్య‌క్ర‌మాల‌పై తొలిసారిగా స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో పురోగ‌తి వివ‌రాల‌ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రధానంగా ఓటీఎస్‌కి సంబంధించి రిజిస్ట్రేషన్, స్కానింగ్, ఈ-సైనింగ్ అంశాలపై దృష్టిసారించాల‌న్నారు. ఇందుకు గ్రామ/వార్డు సచివాలయం డిజిటల్ అసిస్టెంట్, ఇతర సిబ్బందితో మండల స్థాయి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో టెక్నికల్ సమస్యలు ఉంటే వెంటనే  జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో వైఎస్సార్ జగనన్న కాలనీలలో వివిధ దశలో ఉన్న గృహ నిర్మాణాల పురోగతిపై శ్రద్ధ వహించి స్టేజ్ అప్‌డేష‌న్‌పై దృష్టిసారించాల‌న్నారు. హౌసింగ్ లబ్ధిదారులకు అవగాహన కల్పించి వర్షాలు పడకముందే గృహాలు నిర్మించుకునేవిధంగా చూడాల‌న్నారు. గ్రామ/వార్డు సచివాలయాలలో స్పందన అర్జీలు, ఇతర సేవ‌ల‌ను సకాలంలో పరిష్కారించాలన్నారు. జగనన్న విద్యాదీవెన‌, జ‌గ‌న‌న్న తోడు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల నుంచి సకాలంలో ఎక్నాలిజిమెంట్ ప్రక్రియను పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో డీఆర్‌వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, హౌసింగ్ పీడీ బి.సుధాక‌ర్ పట్నాయక్, డీపీవో ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్‌, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎం.శ్రీనివాసు, ఈఈ బీవీ సత్యనారాయణ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Kakinada

2022-04-08 12:18:32