మానవాళిని పట్టిపీడిస్తున్న ఆధునిక విపత్తే ఊబకాయమని దీంతో పలు దీర్ఘకాలిక రోగాలతో జీవితకాలం తగ్గుతుందని డాక్టర్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. కాకినాడ సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో స్థూలకాయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఫాస్ట్ ఫుడ్, శారీరక వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, నొప్పి నివారణ మందులు వాడకం వంటివాటితో బరువు పెరుగుతున్నారని అన్నారు. ముఖ్యంగా పొత్తి కడుపు, కంటి భాగం, పిరుదులు, బుగ్గలు, మెడ, వీపు కింద భాగంలో కొవ్వు బాగా పేరుకు పోతుందన్నారు. దీని నివారణకు గాను క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, ఆహారంలో పీచు పదార్ధాలు అధికంగా తీసుకోవాలని డాక్టర్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్ ,రాఘవరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.