గోదావరి వరద పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విపత్తు నియంత్రణ కార్యాచరణను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను కోరారు. శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ కలెక్టరేట్ కోర్టు హాలులో జాయింట్ కలెక్టర్లు, ఐటిడిఏ పిఓలు, ఇరిగేషన్ అధికారులతో సమావేశమై గోదావరి వరద నియంత్రణ, సహాయక చర్యలపై సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (ఆర్) డా.లక్ష్మీశ స్క్రీన్ ప్రెజెంటేషన్ ద్వారా వరద సంసిద్ధతా ప్రణాళిక క్రింద చేపట్టిన ముందస్తు చర్యలను, గత అనుభవాల నేపద్యంలో అవసరమైన ప్రత్యేక చర్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లాలో గోదావరి నదీ ప్రవాహానికి ఆనుకుని ఉన్న 27 మండలాలు వరదలకు, సముద్ర తీరానికి అనుకుని ఉన్న 13 మండలాలు తుఫానులకు గురౌతుండగా, వీటిలో 7 మండలాలు రెండిటి ప్రభావానికి లోనౌతున్నాయని జెసి తెలిపారు. జిల్లాలో గోదావరి తీరం పొడవు 530 కిమీలు వెంబడి 27 మండలాల్లోని 357 గ్రామాలు తరచుగా వరద ప్రభావాన్ని చవిచూస్తున్నాయన్నారు. గోదావరి వరద స్థాయి భద్రాచలంలో 43 అడుగులు, ధవిళేశ్వరం వద్ద 11.75 అడుగులకు చేరిన వెంటనే మొదటి వరద హెచ్చరిక జారీ చేసి తీర మండలాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. భద్రాచలం వద్ద వరద మట్టం 48 అడుగులకు చేరినపుడు రెండవ హెచ్చరిక, 53 ఆడుగుల స్థాయికి చేరినపుడు మూడవ హెచ్చరిక జారీ చేసి వరద రక్షణ, సహాయక ప్రణాళికలను వివిధ శాఖల సమన్వయంతో చేపడుతున్నామన్నారు. గతంలో 1986వ సంవత్సరంలో సంభవించిన వరదలలో గరిష్ట స్థాయిలో 75.6 అడుగుల మట్టం భద్రాచలం వద్ద నమోదైందని, గత సంవత్సరం వరద స్థాయి 61.6 అడుగులు ఉందన్నారు. జూలై, ఆగష్టు నెలలో ఎదురైయ్యే వరద పరిస్థితులను నియంత్రించేందుకు జిల్లా కేంద్రంతో పాటు 7 డివిజన్ కేంద్రాలలో కూడా రేయింబవళ్లు పనిచేసే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని, 6 డివిజన్ల పరిధిలో సుమారు 84 వేల మంది ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకు 137 రిలీఫ్ కేంప్ లను ప్రతిపాధించామని, ఇందుకు 101 పాఠశాలలను గుర్తించామన్నారు. వరద ప్రభావానికి లోనైయ్యే గ్రామాల్లో ప్రజలలో అవహగాహన కల్పించి ఆప్రమత్తం చేసామని, ముంపు ప్రాంతాలలోని మండల స్టాక్ పాయింట్ లలో 2 రెండు నెలలకు సరిపడా నిత్యావసర వస్తువుల నిల్వలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ భద్రాచలంతో పాటు గోదావరి నదికి మరింత ఎగువ తెలంగాణ లోని పేరూరు, దుమ్మగూడెం నమోదౌతున్న వరద సమాచారన్ని ఎప్పటి కప్పుడు పరిశీలించాలని, తద్వారా వరద సహాయక చర్యలను మరింత ముందుగా చేపట్టేందుకు సమయం ఉంటుందని సూచించారు. వరద సహాయక చర్యలకు వాడే జేసిబిలు, బోట్లు తదితర, యంత్రాలు, ఇన్వెంటరీ సామాగ్రి నిల్వలను ప్రతి 3 నెలల సమీక్షించి కొకసారి ఎప్పటికప్పుడు పరిపుష్టం చేయాలన్నారు. ప్రామాణిక వరద నియంత్రణ ప్రణాళికలపై రక్షణ, సహాయక అధికారులు, సిబ్బందికి తాజా సమాచారం అందించాలని తెలిపారు. వరద మండలాల్లోని ఎంఎల్ఎస్ పాయింట్లలో రెండు నెలల నిత్యావసర సరుకుల నిల్వను ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి వరద గట్లును నిశింతంగా తనిఖీ చేసి బలహీనత గుర్తించిన ప్రదేశాలలో గట్లను పటిష్ట పరచాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ (హెచ్) ఎ.భార్గవ్ తేజ, రంపచోడవరం ఐటిడిఏ పిఓ ప్రవీణ్ ఆదిత్య, చింతూరు ఐటిడిఏ పిఓ ఎ.వెంకటరమణ, పోలవరం ఫ్రోజక్ట్ ప్రత్యేక అధికారి ఓ ఆనంద్, రంపచోడవరం సబ్ కలక్టర్ కట్టా సింహాచలం, డిఆర్ఓ సిహెచ్ సత్తిబాబు, ఇరిగేషన్ ఎస్ఈలు రాంబాబు, నర్శింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.