ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలు, నగరాల్లోని యువతులు, మహిళల రక్షణను ద్రుష్టిలో ఉంచుకొని గ్రామ, వార్డు మహిళా సంరక్షణా కార్యదర్శిలను జీఓ నెంబరు 59 ద్వారా సాధారణ మహిళా పోలీసులుగా మార్చారు. సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులతో పోల్చితే వీరితో 5 ప్రభుత్వం హోంశాఖ, ఐసిడిఎస్, ఈఎస్ఈబి, హెల్త్, మరియు కార్యాలయంలోల డిజిటల్ అసిస్టెంట్లకు సహాయకులుగా కూడా విధులు అప్పగించి పనులు చేయిస్తుంది. వీటితోపాటు సచివాలయాలకు నగదు తెచ్చేసమయంలోనూ, ప్రజాప్రతినిధులు వచ్చే సమయంలోనూ, అధికారుల పర్యటన సమయంలో ప్రత్యేక ఎస్కార్ట్ గా కూడా వీరినే వినియోగిస్తుంది ప్రభుత్వం. ప్రత్యేక జీఓ ద్వారా వీరిందరిని సాధారణ పోలీసులుగా మార్చినా.. వీరి పే స్కేలు, జీతాల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. పైగా డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న వీరి పదోన్నతుల విషయంలో కూడా సాధారణ పోలీస్ కానిస్టేబుల్స్ ఇచ్చినట్టుగా హెడ్ కానిస్టేబుల్ మాదిరిగా ఇస్తామని ప్రభుత్వం ఆ జీఓ 59లో పేర్కొంది. దీనితో ప్రభుత్వం తమ విద్యార్హతలను బట్టి పదోన్నతి ఎస్ఐగా కల్పించడంతోపాటు, పేస్కేలు కూడా కానిస్టేబుల్ పేస్కేల్ కి మార్పు చేయాలనే డిమాండ్ ను తెరపైకి తీసుకు బలంగా తీసుకు వస్తున్నారు. సాధారణ పోలీసు విధులతోపాటు, గతంలో ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ శాఖల విధులు మహిళల సంరక్షణార్ధం దిశ యాప్, దిశ చట్టం చేసి మహిళలకు, యువతులకు ప్రత్యేక రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం ఒక్కో మెట్టు ఎక్కుతూ గ్రామ, వార్డు సంరక్షణకు ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. వీరికి త్వరలోనే కాకీ యూనిఫారం ఇచ్చి గ్రామాల్లో ఒక ప్రత్యేక వ్యవస్థను తయారు చేయనుంది ప్రభుత్వం. అయితే వీరికి స్టేషన్ కి వెళ్లి విధులు నిర్వహించేలా కాకుండా సచివాలయాల పరిధిలోనే ప్రజలకు, మహిళలకు రక్షణగా ఉంటూ వీరిద్వారానే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదులు వెళ్లే విధంగా చేయాలని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి డిజిపి గౌతం సవాంగ్ ను ఆదేశించారు. ఇంత వరకూ బాగానే వున్నా.. గ్రామ, వార్డు సంరక్షణా కార్యదర్శిలను సాధారణ పోలీసులుగా మార్చడాన్ని ప్రస్తుతం పోలీసు శాఖలో ఉన్నవారు(హోంగార్డు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐలు) జీర్ణించుకోలేకపోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దానికి అనుగుణంగానే వీరి స్టేషన్ శిక్షణ సమయంలో కాస్త చులకన భావంగా మాట్లాడుతున్నారని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పోలీసులంటే స్టేషన్ నుంచి గ్రామాలకు వెళితే ఆ గౌరవం, భయం తమకే దక్కేదని అయితే ఇపుడు అవన్నీ మహిళా పోలీసుకు దక్కుతున్నాయని, పైగా వాళ్లకి యూనిఫారం కూడా ఇచ్చేశారని తెగ ఫీలైపోవడంలో అర్ధం లేదని మహిళా పోలీసులు వాపోతున్నారు. తమకేమీ ఉద్యోగాలు ఊరకనే ప్రభుత్వం ఇవ్వలేదని.. ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా ఎంతో శ్రమించి పోటీపరీక్షలు రాసి ఈ ఉద్యోగాలు పొందినా, ప్రభుత్వం అప్పనంగా మహిళా పోలీసులకు ఉద్యోగాలు ఇవ్వడంతోపాటు తమతోపాటు సమానంగా చూస్తుందని, పదోన్నతుల విషయంలో కూడా తమతో పాటే సమానంగా ఇచ్చేయడానికి జీఓ కూడా ఇచ్చిందని తెగ మదన పడిపోవడంతో అర్ధం లేదని చెబుతున్నారు. అక్కడికీ వీరందరికీ జీతాలు, విధులు స్థానిక పోలీసు స్టేషన్ లోని సిబ్బందే తమ జేబుల్లో నుంచి ఇస్తున్నట్టుగా వ్యవహరించడం రాష్ట్రవ్యాప్తంగా మహిళా పోలీసు వర్గాల్లోని, వారి యూనియన్లలోనూ పెద్ద స్థాయిలో చర్చజరుగుతోంది. వాస్తవానికి మహిళా పోలీసులకు యూనిఫారం ఇవ్వడం చాలా మంది మహిళా పోలీసులకు ఇష్టం లేదు. కాకపోతే ప్రభుత్వం ఉద్యోగ ధర్మం మీది ఇచ్చిన జీఓలు, ఆదేశాలు, నిర్ణయాలు తూచ తప్పకుండా పాటించాలనే ఒక్క కారణంతోనే వీరంతా ప్రభుత్వ నిర్ణయాన్ని శిరసా వహిస్తున్నారు. అయితే ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ తెలిసే నేరుగా డిజిపి ద్వారా ఈ ప్రత్యేక జీఓ ప్రభుత్వం జారీచేయించిందని చెబుతున్నారు. ఇంత చేసిన ప్రభుత్వం తమ ఉద్యోగాలను మార్పు చేన ప్రభుత్వం ఐదు ప్రభుత్వ శాఖలకు పైగా విధులు నిర్వహించే తమ పేస్కేలు కూడా మార్పుచేయాలని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్నతమలో 14వేలకు పైగా సిబ్బందిలో 25 నుంచి 30ఏళ్లు లోపు వున్న వారు సుమారు 60శాతం వున్నారని చెబుతున్నారు. ప్రభుత్వం మహిళా పోలీసుల కోసం ప్రత్యేక వ్యవస్త ఏర్పాటుచేసి, దిశ యాప్, చట్టాన్ని అమలు చేస్తున్న తరుణంలో తమ జీత భత్యాల విషయంలో ప్రభుత్వం సముచిత మైన నిర్ణయం తీసుకోవడంతోపాటు పదోన్నతులు కూడా ఎస్ఐగా కల్పించడం ద్వారా తమ న్యాయపరమై డిమాండ్ ను పరిష్కరించినట్టు అవుతుందని మహిళా పోలీసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఎక్కడా లేని విధంగా విలేజ్ పోలీస్ వ్యవస్తను ఏర్పాటు చేయడంతోపాటు మంచి పదోన్నతులు కల్పించిన ప్రభుత్వంగా కూడా కీర్తి దక్కుతుందని మహిళా పోలీసులంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వీరి డిమాండ్ పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచిచూడాల్సిందే..!