పార్వతీపురం జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈ ప్రక్రియ జనవరి 12వ తేదీన ముగిసింది. తుది ఓటరు జాబితా ప్రచురణ ప్రతిని సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు. ప్రత్యేక సవరణ ప్రక్రియ అనంతరం పార్వతీపురం మన్యం జిల్లాలో 1031 పోలింగ్ కేంద్రాలలో తుది ఓటర్ల జాబితాలో 3,78,764 మంది పురుషులు, 3,96,766 మంది స్త్రీలు, 68 మంది థర్డ్ జెండర్ వెరసి నికర ఓటర్లు 7,75,598గా నమోదు అయింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తప్పులు లేని ఓటరు జాబితా తయారు చేయుటకు శాయశక్తుల కృషి చేశామన్నారు. మృతి చెందిన ఓటర్లను తొలగించడం, శాశ్వతంగా వలసలు వెళ్లినవారిని గుర్తించడం, యువతను ఓటరుగా నమోదు చేయడం, జంక్ ఓటర్లను సరిచేయడం, పది కంటే ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లను విచారణ చేయడంలో ప్రత్యేక శ్రద్ద వహించామని అన్నారు. బూత్ స్థాయి అధికారి నుండి శత శాతం దృష్టి సారించారని చెప్పారు. ప్రతి బుధవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి సమాచారం ఇచ్చి పుచ్చు కోవడం జరిగిందని తెలిపారు. ఫారం 8 దరఖాస్తులు దాదాపు 98 వేలు విచారణ చేశామని ఆయన చెప్పారు. జిల్లా ఏర్పడిన నాటికి దాదాపు పదకొండు వందల మంది యువ ఓటర్లు మాత్రమే ఉండగా జిల్లా యంత్రాంగం చేసిన కృషి కారణంగా ప్రస్తుతం 14 వేల వరకు ఓటర్లుగా నమోదు అయ్యారని తెలిపారు.
జిల్లాలో 7,75,598 మంది ఓటర్లు ఉండగా అందులో పాలకొండ (ఎస్.టి) నియోజక వర్గంలో 94,328 మంది పురుషులు, 99,325 మంది మహిళలు, 14 మంది థర్డ్ జెండర్ వెరసి 1,93,667 మంది ఓటర్లు., కురుపాం (ఎస్.టి) నియోజక వర్గంలో 93,592 మంది పురుషులు, 99,005 మంది మహిళలు, 39 మంది థర్డ్ జెండర్ వెరసి 1,92,636 మంది ఓటర్లు., పార్వతీపురం (ఎస్.సి) నియోజక వర్గంలో 92,655 మంది పురుషులు, 95,188 మంది మహిళలు, 11 మంది థర్డ్ జెండర్ వెరసి 1,87,854 మంది ఓటర్లు., సాలూరు (ఎస్.టి) నియోజక వర్గంలో 98,189 మంది పురుషులు, 1,03,248 మంది మహిళలు, 4 థర్డ్ జెండర్ వెరసి 2,01,441 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు.
ముసాయిదా ఓటరు జాబితాను అక్టోబర్ 27వ తేదీన ప్రచురించారు. అనంతరం డిసెంబరు 9వ తేదీ వరకు క్లైములు, అభ్యంతరాలను స్వీకరించడం జరిగింది. దానిని జనవరి 12వ తేదీ నాటికి పొడిగించారని చెప్పారు. తుది జాబితాను ప్రచురణకు అవసరమగు అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ఓటరు జాబితా వివరాలు తాజా పరచి (update) సోమ వారం విడుదల చేశామని ఆయన అన్నారు. నవంబరు 4,5 తేదీలు., డిసెంబరు 2,3 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు.
జిల్లాలో 10,271 మంది మృతి చెందిన ఓటర్లు, 6674 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినవారు, 1093 మంది ఎక్కువ సార్లు ఓటరుగా నమోదు (multiple entries), 2587 ఇతరులు ఉన్నట్లు రాజకీయ పార్టీలు పిర్యాదు చేయగా వాటన్నింటినీ విచారించిన తరువాత 1316 మంది ఓటర్లు మృతి చెందినట్లు, 382 మంది శాశ్వతంగా వలసలు వెళ్లినట్లు, 358 మంది ఎక్కువ సార్లు ఓటరుగా నమోదైనట్లు గుర్తించామని ఆయన వివరించారు. 2,314 పిర్యాదులు అందక ముందుగానే విచారణ చేసి తొలగించామని ఆయన చెప్పారు. 16,255 మంది తమ చిరునామాలోనే ఉన్నట్లు గుర్తించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.
2023 జూన్ నాటికి 8009 జంక్ / "0" గృహ సంఖ్యతో (సరైన చిరునామా లేని) ఉన్న ఓటర్లలో డబుల్ ఎంట్రీ గల 138 మినహా అన్నీ విచారణ చేశామని, పది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న 64,550 గృహాలను విచారణ చేశామని అందులో డబుల్ ఎంట్రీ గల 132 మినహా అన్నీ విచారణ చేశామని, సాంకేతిక కారణాల రీత్యా ఫారం 7,8 గల 290 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, ఇ ఆర్ ఓ నెట్ ఓపెన్ అయిన వెంటనే వాటిని పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఫారం 6,7,8 దరఖాస్తులను నామినేషన్ల చివరి తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. తుది ఓటరు జాబితా అన్ని పోలింగ్ కేంద్రాలు, సహాయ ఓటరు నమోదు అధికార్లు, ఓటరు నమోదు అధికార్లు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణ నిమిత్తం అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు ఫోటోలతో కూడిన ఓటరు జాబితా ఒకటి, ఫోటోలు లేకుండా ఉన్న ఓటరు జాబితా ఒకటి ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి జె వెంకట రావు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి పారిశర్ల అప్పారావు, తెలుగు దేశం పార్టీ ప్రతినిధి జి వెంకట నాయుడు, బహుజన సమాజ్ పార్టీ ప్రతినిధి తామరఖండి వెంకట రమణ, సిపిఐ (ఎం) పార్టి ప్రతినిధి ఆర్ వేణు, వై.ఎస్.అర్. సి.పి పార్టీ ప్రతినిధి వి శ్రీనివాస రావు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పి రవి కుమార్, జిల్లా కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులు రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.