పుష్ కార్టులలోని చెత్తను కింద వేయకుండా నేరుగా చెత్త తరలించే వాహనంలోనికి ఎత్తించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన శానిటరీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆమె జివిఎంసి పాత సమావేశ మందిరంలో ప్రజా ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లు, కాలువలు సరిగా శుభ్రం చేయడం లేదని, బహిరంగ ప్రదేశాలలో చెత్త కుప్పలు అధికంగా కనిపిస్తున్నాయని, శానిటరీ ఇన్స్పెక్టర్లు రెండు పూటలు వార్డులో తిరిగి పారిశుద్ధ్య కార్మికులచే పనిచేయించాలని, అనధికారికంగా పార్కింగ్ చేసి వదిలేసిన వాహనాలను పోలీసుల వారి సహాయంతో తొలగించాలని ఆదేశించారు. చెత్త నిర్వహణపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని, రోడ్లు, కాలువలలో చెత్త కనిపిస్తే సహించేది లేదని హెచ్చరించారు. చెత్త వాహనాలపై కవర్లు తప్పనిసరిగా ఉండాలని, డ్రై వేస్ట్ రోడ్లపై పడకుండా చూడాలని, వాహనాలు రాలేదని చెత్త సేకరణ ఆపవద్దని, వాహనం వచ్చే వరకు పుష్ కార్టులు ద్వారా చెత్త సేకరించాలని, కొన్నిచోట్ల చెత్త సేకరణ సంతృప్తిని ఇచ్చినా, మరికొన్నిచోట్ల సరిగా జరగడం లేదని తెలిపారు. రోడ్లు స్వీపింగు చేసే యంత్రాలు వాటి నిర్దేశించిన సమయాలలో పని చేసే విధంగా వాటిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. పుష్ కార్టులు రిపేర్ వస్తే వాటిని వెంటనే రిపేరు చేయించాలని కార్య నిర్వాహక ఇంజినీరు(మెకానికల్) వారిని ఆదేశించారు. ప్రతి చిన్న, పెద్ద దుకాణాల ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండాలని, దుకాణాదారులు ముందు ఉన్న వ్యర్థాలను వారి సిబ్బందిచే ఎత్తించాలని సూచించారు. చెత్త నిర్వహణ వారు చేయని యెడల, వారి ట్రేడ్ లైసెన్స్ లు రద్దు చేయాలని తెలిపారు. ఇపిడిసిఎల్ వారు తొలగించిన చెట్ల కొమ్మలను ఎత్తడం లేదని అందుకు ఇపీడీసీఎల్ వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూలు చేయాలని ఆదేశించారు. రాత్రి పారిశుద్ధ్య సిబ్బంది శుభ్రం చేసిన చెత్తను వెంటనే ఎత్తించాలని ఆదేశించారు.హోం కంపోస్ట్ తయారు చేయు వారికి సహాయ సహకారాలు అందించాలని, 10 ఇల్లు ఉన్నచోట ఆర్.పి.లు, సి.వో.లు, ఆర్.డబ్ల్యూ.ఎ.ఎస్.ల ద్వారా హోం కంపోస్ట్ పై అవగాహన కల్పించాలని సూచించారు.
రానున్న మూడు నెలలు సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం అధికంగా ఉన్నందున, అందుకు ఏ.ఎల్.ఒ. కార్యక్రమాలు జరిపి ప్రజలకు అవగాహన కల్పించాలని, మలేరియా సిబ్బంది వారంలో ఒకరోజు ప్రతి ఇంటితో పాటు, వారి ఏరియాలో ఉన్న కార్యాలయాలు, స్కూళ్ళు, ఆసుపత్రిలు మొదలైనవి సర్వే చేసి డెంగ్యూ, మలేరియా అధికం అవకుండా స్ప్రేయింగ్, ఫోగింగ్ చేయించాలని ఆదేశించారు. యూజర్ చార్జీలు అన్ని వార్డుల్లో వసూలు చేయాలని, ప్రత్యేకంగా మోడల్ వార్డులో వంద శాతం యూజర్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశించారు. యూజర్ ఛార్జీలు ప్రతి 3 నెలల ఒకసారి వసూలు చేయాలని, ఎవరు ఏవిధంగా కడితే ఆ విధంగా వసూలు చేయాలని ఆదేశించారు.జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు మాట్లాడుతూ స్పందనలో, గ్రీవెన్స్ లో, ఆన్లైన్లో, డయల్ యువర్ మేయర్, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమాల్లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పూర్తి చేయాలని, పెండింగు లో ఉంచరాదని ఆదేశించారు. ఒ.డబ్ల్యూ.ఎం.ఎస్. స్కానర్సు రిపేర్లు ఉంటే, వెంటనే రిపేర్లు చేసి, ప్రతి ఇల్లు స్కాన్ చేయాలని 100 శాతం చెత్త నిర్వహణ జరగాలని, పారిశుద్ధ్య కార్మికులకు యాప్రాన్లు, గ్లౌజులు, చీపుర్లు మొదలైనవి అందించాలని, వారు హాజరు పక్కాగా ఉండాలని, చెత్త తరలించే వాహనాలకు మైక్ సిస్టం ఉండాలని, వార్డు ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ఉదయం వార్డుల్లో పర్యటించి, మలేరియా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, కార్యనిర్వాహక (మేకికల్) ఇంజినీరు చిరంజీవి, ఎఎంఒహెచ్ లు, వార్డు ప్రత్యేక అధికారులు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రజా ఆరోగ్య సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.