విద్యాదీవెన పథకం క్రింద జిల్లాలో 57,545 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.30.02 కోట్లు జమ అయ్యింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంనుంచి గురువారం విద్యాదీవెన రెండో విడత నిధులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, ఎంఎల్ఏలు శంబంగి వెంకట చినప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, కోలగట్ల వీరభద్రస్వామి, విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్(సంక్షేమం) జె.వెంకటరావు, సాంఘిక సంక్షేమశాఖ డిడి కె.సునీల్ రాజ్‌కుమార్, డిబిసిడబ్ల్యూఓ కీర్తి, మైనారిటీ సంక్షేమాధికారి బి.అరుణకుమారి, కార్పొరేటర్ కోలగట్ల శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాదీవెన మొత్తానికి సంబంధించిన చెక్కును, విద్యార్థుల తల్లితండ్రులకు, ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి లాంఛనంగా అందజేశారు.
జిల్లాలో 57,545 మందికి లబ్ది
డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, ఇన్‌ఛార్జి కలెక్టర్
విద్యాదీవెన పథకం ద్వారా జిల్లాలో సుమారు 57,545 మందికి లబ్ది చేకూరుతోందని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ డాక్టర్ జిసి కిశోర్ కుమార్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన పథకం క్రింద జిల్లాకు రూ.30.02 కోట్లు విడుదలవుతుందని చెప్పారు. ఈ పథకం ద్వారా సాంఘిక సంక్షేమశాఖ విద్యార్థులు 5,419 మంది, గిరిజన సంక్షేమశాఖ ద్వారా 3,708 మంది, బిసి సంక్షేమశాఖ ద్వారా 44,220 మంది, ఇబిసిలు 3,001 మంది, ముస్లిం మైనారిటీలు 227 మంది, కాపు విద్యార్థులు 929, క్రిష్టియన్‌లు 41 మంది లబ్ది పొందుతున్నారని వివరించారు.
మేనమామగా బాధ్యత తీసుకున్నారు
చిప్పాడ లావణ్య, విద్యార్థిని తల్లి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి ఒక మేనమామలా, తమ పిల్లల చదువుల బాధ్యతను తీసుకున్నారని, విద్యార్థిని జ్యోతిక తల్లి చిప్పాడ లావణ్య అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె ముఖ్యమంత్రితో మాట్లాడుతూ, విద్యాదీవెన విడుదల చేసినందుకు, జిల్లాలోని విద్యార్థులు, తల్లుల తరపున ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్థోమత లేనప్పటికీ, విద్యాదీవెన పథకం వల్లే తమ ఇద్దరు పిల్లలూ చదువుకోగలుగుతున్నారని ఆమె చెప్పారు. ఇద్దరూ ఉన్నత చదువులు చదువుకుంటుండటంవల్ల, వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడతారన్న ధీమా కలుగుతోందన్నారు. తమ పిల్లలకు వసతి దీవెన వచ్చిందని, తమ కుటుంబానికి జగనన్న ఇళ్లు కూడా మంజూరయ్యిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన అత్తకు వృద్దాప్య పింఛన్ కూడా వస్తోందని, తమ కుటుంబంలో ప్రభుత్వం వెలుగులు నింపిందని ఆమె ఆనందాన్ని వ్యక్తం చేశారు.
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత
ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి
తమ ప్రభుత్వం విద్య. వైద్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఎంఎల్ఏ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పిల్లలందరూ చదువుకొని, విద్యావంతులు కావాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమన్నారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి, వాటిని ప్రజలందరికీ అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలన్నీప్రజలకు చేరువ చేసేందుకు జిల్లా అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేస్తున్నారని, వారికి తమవంతుగా సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, పారదర్శకంగా పథకాలు అందుతున్నాయని స్వామి చెప్పారు.