విజయనగరం జిల్లా కలెక్టర్ గా డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ జిల్లాకు అమోఘమైన సేవల ను అందించారని. ఆయన పేరును జిల్లా ప్రజలు ఎన్నడూ మర్చిపోలేరని పలువురు కొనియాడారు. ఇంతవరకూ జిల్లాలో ఎంతోమంది కలెక్టర్లుగా పనిచేసినప్పటికీ, జిల్లాపై హరి జవహర్ లాల్ వేసిన ముద్ర చెరగరానిదని పేర్కొన్నారు. పదోన్నతిపై బదిలీపై వెళ్తున్న కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ను, స్థానిక డిఆర్‌డిఏ సమావేశ మందిరంలో డిఆర్‌డిఏ, బిసి, ఎస్‌సి, సాంఘిక సంక్షేమశాఖలు మంగళవారం ఘనంగా సన్మానించాయి. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది కలెక్టర్‌ను దుశ్శాలువలతో సత్కరించి, పూలగుత్తెలు అందించారు. ఈ సందర్భంగా డిఆర్‌డిఏ పిడి కె.సునీల్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, తన ఉద్యోగ జీవితంలో డాక్టర్ హరి జవహర్ లాల్ ఐఏఎస్ అధికారిని ఇంతవరకూ చూడలేని అన్నారు. సానుకూల దృక్ఫథం, సహనశీలత, నిరాడంబరత, ఓర్పు, అందరికీ మంచిచేసే నైజం ఆయన సొంతమని పేర్కొన్నారు. ఎటువంటి బేషజాలు, అధికార దర్పం లేని హరిజవహర్ లాల్ నుంచి, తాము ఎంతో నేర్చుకున్నామని అన్నారు. ప్రజా కలెక్టర్‌గా, ప్రగతిశీల కలెక్టర్‌గా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.
జిల్లా బిసి కార్పొరేషన్ ఇడి ఆర్.వి.నాగరాణి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్.జగన్నాధరావు, ఎపిఇడబ్ల్యూఐడిసి ఇఇ ఎం.శ్యామ్యూల్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్దికి కలెక్టర్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన హయాంలో జిల్లాకు సుమారు 20కి పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయని చెప్పారు. కలెక్టర్ మార్గదర్శకత్వంలో తమ శాఖలను ఉన్నతంగా తీర్చిదిద్దామని అన్నారు. ఆయన హయాంలో పనిచేయడం తమ అదృష్టమని పేర్కొన్నారు.
డిఆర్‌డిఏ ఏపిడి ఎం.సావిత్రి, వివిధ విభాగాల ప్రతినిధులు మాట్లాడుతూ, కలెక్టర్ హరి జవహర్ లాల్ జిల్లాను హరిత విజయనగరంగా మార్చి, తన పేరును సార్థకం చేసుకున్నారని అన్నారు. చెరువులను శుద్దిచేసి, భూగర్భజలాలను పెంచడం ద్వారా జిల్లా ప్రజల దాహార్తిని తీర్చారని అన్నారు. ఒక సాధారణ వ్యక్తికి సైతం అందుబాటులో ఉండే కలెక్టర్‌ను తాము ఇంతవరకూ చూడలేదని అన్నారు.
అభివృద్దిని కొనసాగించాలి ః డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్, జిల్లా కలెక్టర్.
తన హయాంలో జరిగిన అభివృద్దిని, భవిష్యత్తులో కూడా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ కోరారు. తాను జిల్లాకు ఎంతో రుణపడి ఉంటానని, భవిష్యత్తులో కూడా జిల్లా అభివృద్దికి తనవంతుగా పూర్తి సహకారాన్ని అందిస్తానని అన్నారు. సన్మానం అనంతరం ఆయన ఉద్వేగభరితంగా ప్రసంగించారు. తాను మునిపంపుల అనే ఒక మారుమూల గిరిజన తండాలో పుట్టినప్పటికీ, ఒక ఐఏఎస్ అధికారిగా ముస్సోరీలో శిక్షణ పొందే స్థాయికి ఎదిగానంటే, దానికి కారణం మహిళలేనని కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత వెనుకబడిన కుటుంబంలో పుట్టిన తనను, తన తల్లి తీర్చిదిద్దిందని, డిఆర్‌డిఏ పిడిగా పనిచేసిన సమయంలో మహిళల నుంచి, ఓర్పు, సహనం నేర్చుకున్నానని చెప్పారు. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న ప్రతీ అవమానాన్నీ, ఆయుధాలుగా మార్చుకొని తన ఎదుగుదలకు బాటలు వేసుకున్నానని అన్నారు. వృత్తిరీత్యా తొలుత డాక్టర్ కావడం వల్ల సహనశీలత అలవడిందన్నారు. ఎన్నడూ తాను అవార్డులు కోసం ప్రాకులాడలేదని, కష్టపడి పనిచేస్తే, అవే వస్తాయని చెప్పారు. జిల్లా ప్రజలు తనపట్ల చూపించిన అభిమానం, ఆదరణను ఎన్నడూ మర్చిపోలేనని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఓ జె.విజయలక్ష్మి, డిఆర్‌డిఏ, వైకెపి ఏపిఎంలు, ఏరియా కో-ఆర్డినేటర్లు, డిపిఎంలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా సన్మానించిన వైద్యారోగ్యశాఖ
జిల్లా కలెక్టర్‌గా విశేషమైన సేవలందించి, పదోన్నతితో బదిలీపై వెళ్తున్న డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్‌ను వైద్యారోగ్యశాఖ ఘనంగా సన్మానించింది. ఆశాఖ సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్ఓ డాక్టర్ ఎస్‌వి రమణకుమారి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జి.నాగభూషణరావు, ఇతర అధికారులు, మాట్లాడుతూ కలెక్టర్ గా హరి జవహర్ లాల్ చేసిన సేవలను కొనియాడారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం తమ అధృష్టమని పేర్కొన్నారు. పలువురు వైద్యులు, వివిధ సంఘాలు కూడా కలెక్టర్‌ను దుశ్శాలువలతో సత్కరించాయి.