శ్రీకాకుళం జిల్లాలో ఎన్నికైన సర్పంచ్ లకు ఈనెల 22వ తేదీ నుండి ఆగస్టు 14వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి, జిల్లా వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ బి.లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్ ను జిల్లా వనరుల కేంద్రంలో బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా లక్ష్మీపతి మాట్లాడుతూ మూడు డివిజన్లలో శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. శ్రీకాకుళం డివిజన్ కు చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కాలేజ్ లోను, పాలకొండ డివిజన్ కు సీతంపేట యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను, టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి టెక్కలి అయితం కళాశాలల్లోనూ, మందస యూత్ ట్రైనింగ్ సెంటర్ లోను శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. బ్యాచ్ ల వారీగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఈనెల 22వ నుండి 24వ తేదీ వరకు గార, ఎల్.ఎన్.పేట, శ్రీకాకుళం, సీతంపేట, మందస, కోటబొమ్మాలి, టెక్కలి మండలాలకు., 20 నుండి 28వ తేదీ వరకు ఆమదాలవలస, సరుబుజ్జిలి, మెలియాపుట్టి, పాతపట్నం, కవిటి, సోంపేట, పలాస, జలుమూరు మండలాలకు., 29 నుండి 31వ తేదీ వరకు ఎచ్చెర్ల, జి.సిగడాం, పాలకొండ, వీరఘట్టం, ఇచ్ఛాపురం, కంచిలి, నందిగాం మండలాలకు., ఆగస్టు 2 నుండి 4వ తేదీ వరకు బూర్జ, పొందూరు, కొత్తూరు, రాజాం, సంతబొమ్మాలి మండలాలకు.,ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు లావేరు, నరసన్నపేట, హిరమండలం, ఆర్ ఆమదాలవలస, వజ్రపుకొత్తూరు మండలాలకు., 9 నుండి 11వ తేదీ వరకు రణస్థలం, పోలాకి, సంతకవిటి, సారవకోట మండలాలకు.,12 నుండి 14 వ తేదీ వరకు వంగర, భామిని మండలాలకు శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.
శిక్షణ తరగతులకు హాజరు అయ్యే సర్పంచుల వివరాలను కేంద్ర ప్రభుత్వ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. తదనుగుణంగా వారి హాజరు, పనితీరును గమనించి నిధులు మంజూరు కూడా ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. జిల్లాలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే సర్పంచులకు ప్రయాణ, భోజన, వసతి సౌకర్యాలు కల్పస్తున్నట్లు లక్ష్మీపతి తెలిపారు. సామర్లకోట శిక్షణ కేంద్రంలో 112 మంది సర్పంచులు శిక్షణ పొందారనీ ఆయన తెలిపారు. ప్రతి శిక్షణ కార్యక్రమానికి 5 గురుతో శిక్షణా బృందాన్ని నియమించామని ఆయన చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన శిక్షణ అందించడం జరుగుతుందని, సర్పంచులు సద్వినియోగం చేసుకావాలని కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ప్రత్యేకంగా సర్పంచులకు ఒక లేఖ రాయడం జరిగిందని లక్ష్మీపతి పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి మీ చేతుల్లో ఉందని అందుకు తగిన విధంగా మంచి పనితీరును కనబరిచాలని, శిక్షణను సర్పంచులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారని ఆయన చెప్పారు.