1 ENS Live Breaking News

సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపండి..

 ఉన్నతాధికారులు తమ అధికారాన్ని సామాన్యుల జీవితాల్లో మార్పులు తెచ్చేందుకు, వెలుగులు నింపేందుకు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక జెడ్పీ కార్యాలయంలోని డీపీఆర్సీ భవన్ లో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆత్మీయ వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రథమ పౌరుడిగా బాధ్యతలు నిర్వహించిన కాలంలో తనకు సహకరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలోని అధికారుల సహకారంతోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టగలిగానన్నారు. కోవిడ్ పై పోరాటంలో కుటుంబ సభ్యుల్లాంటి అధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. జిల్లాలో తాను చేపట్టిన పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సామాజిక ఎజెండానే స్ఫూర్తి అన్నారు. "అనంతపురము జిల్లా వాసుల మాట కటువు, మనసు వెన్న- ఈ ప్రాంతంలో దొరికేటంత రుచికరమైన పండ్లు మరో చోట  దొరకవు" అన్నారు. జిల్లాను కుటుంబం లాగానే భావించానన్నారు. అనంత జిల్లాను వెనుకబడిన జిల్లాగా పరిగణించ కూడదనుకున్నానని, అభివృద్ధి చెందిన జిల్లాగా ఉండాలనే తపనతో అనేక అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలపై పనులు వేగవంతం చేయడం జరిగిందన్నారు. సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా పరిష్కారం దొరుకుతుందని ఆలోచించడం తన నైజమన్నారు. అందుకే కోవిడ్ సమయంలో వైద్య రంగంలో మౌలిక వసతులు అభివృద్ధి చేయగలిగేందుకు కృషి చేశానన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు మంచి సేవలు అందించారని కొనియాడారు. జిల్లాలో పనిచేయడం గొప్ప సంతృప్తి ఇచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ లు నిశాంత్ కుమార్, డా.సిరి, నిశాంతి, గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ సూర్యతేజ,  మున్సిపల్ కమిషనర్లు, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2021-06-10 13:50:56

అనంత ఆత్మీయత ఎన్నటికీ మరువలేనిది..

 ప్రభుత్వ ఉద్యోగికి వృత్తిరీత్యా బదిలీ కావడం సహజమని అయితే తన జీవితంలో అనంతపురం జిల్లా ప్రజలు , అధికారులు , ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు తదితర వర్గాలు చూపిన ఆత్మీయత ఎన్నటికీ మరువలేనని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ అయిన నేపథ్యంలో వ్యక్తిగతంగా ఆయనను కలవడానికి అనేకమంది హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు , సేవా సంస్థల ప్రతినిధులు,  జర్నలిస్టులు, కవులు, రచయితలు, విద్యార్థులు, కియా మోటార్స్ ప్రతినిధులు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు తదితరులు పాల్గొని  ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా ప్రజల ఆత్మీయత మరువలేనిదని ఇంతటి ప్రజల అభిమానం చూరగొనటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ అభిమానం మరింత బాధ్యతను కూడా  పెంచిందని తెలిపారు. తాను జిల్లా నుండి బదిలీ పై వెళ్లే క్రమంలో జిల్లా యంత్రాంగం ఇచ్చిన సహకారం ఎనలేనిదని తెలియజేస్తూ ఒక సందర్భంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనపై ఉన్న అభిమానంతో ఎంతోమంది స్వచ్ఛందంగా వీడ్కోలు పలుకడానికి తరలి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా కలెక్టర్ గా అవకాశం కల్పించడం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలలో తన వంతు భాగస్వామ్యంతో అమలు చేయడం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నానన్నారు.

 కరువు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యంలో భాగంగా   సామాజిక ,ఆర్థిక అజెండాలను  ప్రజల్లోకి తీసుకెళ్ళి వారి యొక్క జీవన విధానాలను వారి అభ్యున్నతి వైపు పయనింప చేసేందుకు కృషి చేశానన్నారు. తాను పనిచేసిన కాలంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉరవ కొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి ,  కియాప్రతినిధులు , పలువురు ఉద్యోగులు , ఎమ్మార్పీఎస్, ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ సంఘాలకు చెందిన నాయకులు , విద్యార్థి సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు . ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలతో కూడిన వినతులను కలెక్టర్ కు అందజేశారు. 

Anantapur

2021-06-10 13:43:52

కొండవాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలి..

 మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని కొండవాలు ప్రాంతాల్లో చెత్తవేయకుండా చర్యలు తీసుకోవాలని జివిఎంసీ కమిషనర్ డా.జి.స్రిజన అధికారులను ఆదేశించారు. గురువారం ఈ మోరకు ఎనిమిదవ జోన్ 94వ వార్డు వేపగుంట పరిధిలోని గౌతమ్ నగర్, బి.సి.కోలనీ తదితర ప్రాంతాలలో జివిఎంసి కమిషనర్ స్థానిక కార్పొరేటర్ బల్ల శ్రీనివాసరావుతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె కోలనీ వాసులతో మాట్లాడుతూ, కొండవాలు ప్రాంతం పైన నివసిస్తున్న వారు కాలువలో చెత్త వేయరాదని, దాని వలన కొండ దిగువ భాగంలో చెత్త పేరుకుపోయి కాలువలు పొంగిపోతాయని తెలిపారు. ప్రతీ రోజు తడి-పొడి చెత్తను విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వలేకుండా చూడాలని, ప్రతీ రోజు త్రాగు నీరు సమయానికి వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం అధికారులతో మాట్లాడుతూ, రానున్నది వర్షాకాలమని, కాలువలలో నీరు సాఫీగా ప్రవహించే విధంగా చూడాలని, ప్రధాన కాలువలోను చెత్తను, రోడ్లపైన ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి డంపింగు యార్డుకు తరలించాలని ఆదేశించారు. ఖాళీ  స్థలాలలో తుప్పలు, చెత్త పేరుకు పోకుండా ఆ  స్థల యజమానిచే శుభ్రం చేయించాలని, లేకుంటే వారికి జరిమానా విధించాలని, పిన్ పాయింట్ వారిగా పారిశుధ్య కార్మీకులను సర్దుబాటు చేయాలని, భూ గర్భ డ్రైనేజీ నుండి మురికి నీరు బయటకు పొంగకుండా ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రతీ ఇంటికి వెళ్లి సీజనల్ వ్యాధులపై సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. 

ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ చక్రవర్తి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మధు కుమార్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు, ఎఎంఓహెచ్ లక్ష్మి తులసి, శానిటరి సూపర్వైజర్, శానిటరి ఇన్స్పెక్టర్, వార్డు సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. 

విశాఖ సిటీ

2021-06-10 13:36:35

కౌలుదారునికి సాగుదారు హక్కు కార్డు ఉండాలి..

జిల్లాలో ప్ర‌తి కౌలుదారునికి త‌ప్ప‌నిస‌రిగా పంట సాగుదారు హ‌క్కు కార్డు (సీసీఆర్‌సీ) అందించాల‌ని, ఈ కార్డుల జారీకి రైతు భ‌రోసా కేంద్రం స్థాయిలో శుక్ర‌వారం నుంచి 15 రోజుల పాటు ప్ర‌త్యేక స‌ద‌స్సులు నిర్వ‌హించాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌ను ఆదేశించారు. సీసీఆర్‌సీ కార్డుల‌పై అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌, 100 శాతం కార్డుల జారీ ప్ర‌క్రియ‌కు సంబంధించి గురువారం జాయింట్ క‌లెక్ట‌ర్.. మండ‌ల‌, డివిజ‌న‌ల్‌, జిల్లాస్థాయి వ్య‌వ‌సాయ‌, రెవెన్యూ అధికారుల‌తో వర్చువ‌ల్ విధానంలో స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ రైతుల‌తో పాటు కౌలు రైతుల సంక్షేమానికి ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోంద‌ని.. గౌర‌వ ముఖ్య‌మంత్రి, వ్య‌వ‌సాయ శాఖా మంత్రి మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు అర్హ‌త ఉన్న ప్ర‌తి కౌలుదారునికీ సాగుదారు కార్డు అందించి, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు స‌క్ర‌మంగా అందేలా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించి అమ‌లుచేస్తున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో 1,10,000 కార్డులు జారీచేశామ‌ని.. ఇప్పుడు అద‌నంగా మ‌రో రెండు ల‌క్ష‌ల కార్డులను జారీచేయాల‌ని లక్ష్యంగా నిర్దేశించిన‌ట్లు వెల్ల‌డించారు. గ్రామ‌స్థాయిలోని వీఆర్వో, వీఏఏ మొద‌లు జిల్లాస్థాయిలోని జేడీ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌మ‌న్వ‌యంతో వ్య‌వ‌హ‌రించి, ప్ర‌జాప్ర‌తినిధుల భాగ‌స్వామ్యంతో కార్డుల జారీ ల‌క్ష్యాన్ని చేరుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఆర్‌బీకే స్థాయిలో జ‌రిగే స‌ద‌స్సుకు మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి (ఎంఏవో), త‌హ‌సీల్దార్ త‌ప్ప‌నిస‌రిగా హాజ‌రుకావాల‌న్నారు. కౌలుదారునికి కార్డు అందించ‌డం ఎంత ముఖ్య‌మో భూ య‌జ‌మానికి ఎలాంటి ఇబ్బంది త‌లెత్త‌ద‌నే విష‌యంపై అవగాహ‌న క‌ల్పించ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని, ఈ దిశ‌గా జ‌రిగే స‌ద‌స్సుల్లో రైతులు, కౌలు రైతుల సందేహాల‌ను నివృత్తి చేయాల‌ని సూచించారు. కార్డుల జారీలో పురోగ‌తిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తామ‌ని, నిర్ల‌క్ష్యం వ‌హించే సిబ్బందిపై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. క్షేత్ర‌స్థాయిలో సిబ్బంది స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసి, జిల్లాను ముందు వ‌రుస‌లో నిలిపేందుకు కృషిచేయాల‌న్నారు. పంట వైవిధ్యంపైనా సీసీఆర్‌సీ స‌ద‌స్సుల్లో రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, కేవ‌లం వ‌రికే ప‌రిమితం కాకుండా ఆవ‌ర‌ణ వ్య‌వ‌స్థ‌ను దృష్టిలో ఉంచుకొని నీటి ల‌భ్య‌త స‌రిగా లేని ప్రాంతాల్లో లాభ‌సాటి ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌పై దృష్టిసారించేలా అవగాహ‌న క‌ల్పించాల‌ని సూచించారు. రైతులు ఏయే వ‌రి ర‌కాల‌ను సాగుచేయాల‌నే అంశంపైనా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, వినియోగం, లాభ‌దాయ‌క‌త‌, డిమాండ్‌, మార్కెటింగ్ సౌక‌ర్యాలు త‌దిత‌రాల ఆధారంగా వ్య‌వ‌సాయ అధికారులు సూచించిన ర‌కాల‌ను వేసేలా చూడాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. స‌మావేశంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, జేడీ (ఏ) ఎన్‌.విజ‌య్‌కుమార్‌, డీడీ(ఏ) ఎస్‌.మాధ‌వ‌రావు, స‌బ్ క‌లెక్ట‌ర్లు, ఆర్‌డీవోలు, త‌హ‌సీల్దార్లు, ఎంఏవోలు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-10 13:29:28

జూన్ 20వరకూ కోవిడ్ కర్ఫ్యూ అమలు..

కోవిడ్‌-19 విప‌త్తు నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర‌కు జిల్లాలో అమ‌ల‌వుతున్న క‌ర్ఫ్యూ జూన్ 20 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని, శుక్ర‌వారం నుంచి రోజూ మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి ఉద‌యం 6 గం. వ‌ర‌కు క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. ఈ మేర‌కు గురువారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆసుప‌త్రులు, డ‌యాగ్నోస్టిక్ ల్యాబ్‌ల‌కు, ఫార్మ‌సీలతో పాటు అత్య‌వ‌స‌ర స‌ర్వీసుల పంపిణీతో ముడిప‌డిన వాటికి క‌ర్ఫ్యూ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని తెలిపారు. క‌ర్ఫ్యూ నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై విప‌త్తు నిర్వ‌హ‌ణ చ‌ట్టం, 2005లోని 51-60 సెక్ష‌న్లతో పాటు ఐపీసీ సెక్ష‌న్ 188, ఇత‌ర వ‌ర్తింపు చ‌ట్టాల మేర‌కు చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు హెచ్చ‌రించారు. కోవిడ్ వైర‌స్ వ్యాప్తిని నిరోధించేందుకు నిబంధ‌న‌ల క‌చ్చిత అమ‌లుకు ఎస్‌పీలు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, ఇత‌ర జిల్లా, డివిజ‌న‌ల్‌, మండ‌ల స్థాయి అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. 

Kakinada

2021-06-10 13:24:00

జిల్లా కలెక్టర్ కి ఎంపీ మాగుంట సత్కారం..

ప్రకాశం జిల్లా కలెక్టర్ గా ఇటీవల  బాధ్యతలు స్వీకరించిన  ప్రవీణ్ కుమార్ ను  ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డి లు పుష్పగుచ్ఛాలచ్చి, శాలువాలతో ఘనంగా సన్మానించారు.  ఇటీల విధుల్లోకి చేరిన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన వీరు జిల్లా అభివ్రుద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. అనంతరం జిల్లా యొక్క స్తితిగతులు, గతంలో పనిచేసిన కలెక్టర్ల అభివ్రుద్ధి, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై మాగుంట కలెక్టర్ కి వివరించారు. ఎంపీ సూచనలపై సానుకూలంగా స్పందిచిన కలెక్టర్ అన్ని వర్గాల సహకారంతో జిల్లాని అభివ్రుద్ధి పదంలో నిలిపేందుకు శక్తి వంచన లేకుంగా క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు.

Ongole

2021-06-10 09:53:46

స‌కాలంలో గృహ‌నిర్మాణాలు పూర్తి చేస్తాం..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో స‌కాలంలో గృహ‌నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తామ‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ (హౌసింగ్‌) కె.మ‌యూర్ అశోక్ అన్నారు. ఆయ‌న జాయింట్ క‌లెక్ట‌ర్‌గా గురువారం బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయ‌న‌, ఇంత‌కుముందు తెనాలి స‌బ్ క‌లెక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హించి, జిల్లాకు బ‌దిలీపై వ‌చ్చారు.  బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ సంద‌ర్భంగా చెన్నారెడ్డి భ‌వ‌న్‌లోని త‌న ఛాంబ‌ర్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, న‌వ‌ర‌త్నాలు కార్య‌క్ర‌మంలో భాగంగా అర్హులంద‌రికీ ప్ర‌భుత్వం ఇళ్లు కేటాయిస్తోంద‌ని చెప్పారు. ఏడాదికి సుమారు 15ల‌క్ష‌ల ఇళ్లు నిర్మించాల‌న్న‌ది ప్ర‌భుత్వ లక్ష్య‌మ‌ని చెప్పారు. ఇది దేశంలోనే అతిపెద్ద కార్య‌క్ర‌మ‌మ‌ని, ప్ర‌భుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొని, ప్ర‌త్యేకంగా ఒక జాయింట్ క‌లెక్ట‌ర్‌ను నియ‌మించింద‌ని చెప్పారు. గృహ‌నిర్మాణం తోపాటు మౌలిక స‌దుపాయాల‌ను కూడా క‌ల్పిస్తామ‌ని తెలిపారు. జిల్లాలోని అధికారులను స‌మ‌న్వ‌యం చేసుకొని, ప్రభుత్వ ల‌క్ష్యానికి అనుగుణంగా కార్య‌క్ర‌మాన్ని న‌డిపిస్తాన‌ని అన్నారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సామాన్య ప్ర‌జ‌లు సైతం నేరుగా త‌న‌ను క‌లిసి, త‌మ స‌మ‌స్య‌లను చెప్పుకోవ‌చ్చ‌ని సూచించారు. జిల్లా గృహ‌నిర్మాణ‌శాఖ పిడి ఎస్‌వి ర‌మ‌ణ‌మూర్తి, ఇత‌ర అధికారులు జెసిని క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు.

Vizianagaram

2021-06-10 09:47:22

దశలవారీగా అందరికీ కోవిడ్ టీకా..

తూర్పుగోవరి జిల్లాలో అందిరికీ ద‌శ‌ల వారీగా కోవిడ్ టీకా డోసుల ల‌భ్య‌త ఆధారంగా పంపిణీ చేప‌ట్ట‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. గురువారం ఉద‌యం క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి.. కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని ఉన్న‌త‌పాఠ‌శాల‌లో జ‌రుగుతున్న వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. టీకాల పంపిణీ స‌జావుగా సాగేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, సంతృప్తి వ్య‌క్తం చేశారు. రిజిస్ట్రేష‌న్‌, వ్యాక్సినేష‌న్‌, నిరీక్ష‌ణ గ‌దుల‌ను ప‌రిశీలించి, అక్క‌డి ల‌బ్ధిదారుల‌తో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మూడో వేవ్‌లో కోవిడ్ చిన్నారుల‌పై అధిక ప్ర‌భావం చూపుతుంద‌నే సంకేతాల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త ఆధారంగా ఆరు నెల‌ల నుంచి అయిదేళ్ల లోపు పిల్ల‌లు గ‌ల త‌ల్లుల‌కు గురువారం నుంచి టీకాలు వేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇందుకు ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయిలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ ల‌బ్ధిదారుల‌ను గుర్తించి, వ్యాక్సినేష‌న్ జ‌రిగేలా చూస్తున్న‌ట్లు తెలిపారు. న‌గ‌ర‌పాల‌క సంస్థ ప‌రిధిలో 45 ఏళ్ల‌కు పైబ‌డిన వారికి దాదాపు వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. క‌లెక్ట‌ర్ వెంట కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, అద‌న‌పు క‌మిష‌న‌ర్ నాగ‌న‌ర‌సింహారావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-10 09:45:31

ఆక్సిజన్ కాన్సంట్రేటర్ వితరణ..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానానికి విశ్వహిందూపరిషత్ (వీహెచ్పీ) ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ విరాళంగా అందించింది. ఈ మేరకు బుధవారం ఆలయ ఈఓ ఎంవీ సూర్యకళకు పెదపూడి శర్మ ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవస్థా అధికారుల కోరిక మేరకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మాణానికి కూడా సమాలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. వీహెచ్పీ నాయకులు టీపీవీ రావు, జీ. సుబ్రమణ్యం, మీసా రవీంద్ర కృషివల్ల విశాఖపట్నానికి మూడు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు వచ్చాయని ఆయన చెప్పారు.  ఈ మూడింటిలో రెండు ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్న కోవిడ్ సెంటర్లకు అందించామని ఒకటి సింహాచలం దేవస్థానం కోసం ఇచ్చామని చెప్పారు. కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-09 13:19:08

అప్పన్న దర్శన సమయం పెంపు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలోని సింహాద్రి అప్పన్న స్వామివారి దర్శన సమయం 2గంటల పెంచినట్టు ఆలయ ఈఓ ఎంవీసూర్యకళ తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఈఓ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వామివారి దర్శన సమయం పెంచినట్టు వివరిచారు. ఈ పెంచిన సమయం 11వ తేది నుంచి అమలులోకి వస్తుందన్నారు.  ఉదయం 6 :30 నుంచి 1:30 మధ్యలో  భక్తులు దర్శించుకోవచ్చనని తెలియజేశారు. దర్శన సమయంలో ప్రభుత్వ నిర్ధేశించిన కర్ఫ్యూ నిబంధనలు...మాస్కు ధారణ, బౌతిర దూరం, పరిశుభ్రత,  అమలు జరుగుతాయన్నారు. మధ్యలో 11:30 నుంచి 12:00 కు రాజభోగం ఉంటుందని చెప్పారు. సుప్రభాతం నుంచి పవళింపు వరకు ... స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ సంప్రదాయబద్ధంగా జరుగుతాయని వివరించారు. ఈ నియమం 20 వ తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని స్వామివారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Simhachalam

2021-06-09 12:48:24

దేవాలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు..

 దేవాలయాల అద్భివృద్ధి , ఆస్తుల పరిరక్షణ పై పూర్తి స్థాయి లో దృష్టి పెదుతున్నట్లు రాష్ట్ర  దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు.  జిల్లాలో ఏ ఏ దేవాలయాలు అభివృద్ధికి అవకాశం ఉందో  నియోజక వర్గం వారీగా  ఎమ్మెల్యే  అంగీకారం తో ప్రతిపాదనలు పంపాలని దేవాలయాల అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి కలెక్టరేట్ ఆడిటోరియం లో ప్రజాప్రతినిధులతో కలసి దేవాదాయ శాఖ  అధికారులతో  సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  దేవాలయాల భద్రతకు సి సి కెమెరాలు,  పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  నియోజక వర్గం వారీగా  ఉన్న దేవస్థానాల స్థితి గతుల పై పూర్తి నివేదికను 15 రోజుల్లోగా అందించాలని, తదుపరి  ఏ గుడికి ఎలాంటి అభివృద్ధి అవసరం , ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. అన్ని  దేవాలయాల ఈ.ఓ లు ఆయా ప్రజా ప్రతినిధులతో మాట్లాడి నివేదిక నివ్వాలన్నారు. కోవిడ్ ను దృష్టి లో పెట్టుకొని  భక్తుల మనో భావాల కనుగుణంగా  భక్తులను భగవంతుని సన్నిధికి చేర్చేలా ఈ-పూజ విధానాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని  తెలిపారు.  టి టి డి ఆధ్వర్యం లో ఉత్తరంధ్రకు చెందిన మూడు జిల్లాల్లో వెయ్యి దేవాలయాలను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. సుమారు 100 కుటుంభాలు ఉన్న ఛోట 10 లక్షల వ్యయం తో  ఎస్.సి., ఎస్.టి , బి.సి , మత్స్యకార  గ్రామాల్లో  అక్కడి ప్రజల కోరిక మేరకు హిందూ దేవాలయాలను నిర్మించడం జరుగుతుందని అన్నారు.  ఈ కార్యక్రమం క్రింద జిల్లా నుండి కనీసం 100  ప్రాంతాలను ఎంపిక చేసి 15 రోజుల్లో  నివేదిక పంపాలని అన్నారు. 
జగనన్న కాలనీల్లో  దేవాలయాల నిర్మాణం:      రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి 
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం అబినందనీయమని టీటీడీ  ఆధ్వర్యం లో చేపట్టనున్న దేవాలయాలను జగనన్న కాలనీలలో కూడా నిర్మించాలని    రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖామంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. రాష్ట్రం లో 17 వేల  జగనన్న కాలనీలు గ్రామాలుగా మారాయని, అన్నీ సౌకర్యాలతో నిర్మిస్తున్నామని, ఈ కాలనీలు వర్ణ, జాతి బేధాలు లేకుండా అందరికీ సమానంగా నిర్మించడం జరిగిందని, అక్కడ టీటీడీ ద్వారా ప్రజలు  కోరిన విధంగా దేవాలయాలను నిర్మించడానికి చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. మొదటి దశ లో కనీసం 100  దేవాలయాల నిర్మాణాలకు శాసన సభ్యుల అంగీకారంతో ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.  దేవాలయాల ఆస్తులను పరిరక్షించడం ముఖ్యమని,  దేవాలయాల సిబ్బంది, అధికారులు వారి పరిధి లోనున్న  ప్రతి దేవాలయాన్ని ప్రత్యక్షంగా తనిఖీ చేసి దేవాలయాల భూములు, ఆభరణాలు,ఇతర  ఆస్తుల పై  సమగ్రంగా నివేదికలు తయారు చేయాలని సూచించారు.  ఏ ఏ దేవాలయాలకు ట్రస్ట్ బోర్డు లు ఏర్పాటు చేయవలసి ఉందో శాసన సభ్యుల సిఫార్శు లతో ప్రతిపాదనలు మంత్రివర్యులకు పంపాలని సూచించారు.  విజయనగరం ఇలవేల్పు పైడి తల్లి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం లోకి దేవాలయం పక్కనున్న దుకాణాలను తరలించి అబివృద్ధి చేయడానికి   దేవాదాయ శాఖ సహకరించాలని కోరారు.  రహదారి విస్తరణకు 5 అడుగులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందని, మరో 5 అడుగులు ఇస్తే సమస్య తీరిపోతుందని అన్నారు.  దుకాణాల వారికి ఇబ్బంది లేకుండా, పండగల్లో ఇరుకుగా లేకుండా అందరికీ  సౌకర్యవంతంగా ఉంటుందని, మరో  5 అడుగులు వెనక్కు వెళ్లడానికి దేవాదాయ కమిషనర్ అనుమతిని ఇవ్వాలని కోరారు.  
పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్ర శేఖర్ , నెల్లిమర్ల శాసన సభ్యులు బద్దుకొండ అప్పల నాయుడు, బొబ్బిలి శాసన సభ్యులు శంబంగి వెంకట చిన్న అప్పల నాయుడు,  పార్వతిపురం శాసన సభ్యులు అలజంగి జోగా రావు ,  ఎస్.కోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాస రావు వారి నియోజక వర్గాల్లో నున్న దేవాలయాల సమస్యలు,  అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. 
ఈ సమావేశం లో   సంయుక్త కలెక్టర్ జి.సి. కిషోర్ కుమార్, రెవెన్యూ డివిజినల్ అధికారి భవాని శంకర్, దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున రావు,  ప్రత్యేక అధికారి భ్రమరాంబ,  డిప్యూటీ కమిషనర్ జ్యోతి మాధవి, మాన్సాస్ ఈ.ఓ వేంకటేశ్వర రావు,  జిల్లా సహాయ కమిషనర్ వినోద్ కుమార్, పలు దేవాలయాల ఈ.ఓ లు పాల్గొన్నారు. 

Vizianagaram

2021-06-09 12:32:03

జనవరి నాటికి రామతీర్ధ ఆలయం..

విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థం కొండపై గత ఏడాది డిసెంబర్ లో కొందరు దుండగుల దాడిలో దెబ్బతిన్న రామస్వామి వారి ఆలయ నిర్మాణాన్ని వచ్చే ఏడాది(2022) జనవరి నాటికి పూర్తి చేసి సీతారామలక్ష్మణుల విగ్రహాలను ప్రతిష్టిస్తామని రాష్ట్ర ధర్మాదాయ దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు వెల్లడించారు. ఆలయాన్ని ప్రారంభించేందుకు జనవరిలో ముహూర్తాన్ని చూస్తున్నట్టు పేర్కొన్నారు. దేవాలయాన్ని రాతి కట్టడంగా రూపొందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చిలకలూరిపేట వద్ద రాతి నిర్మాణాలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు.  జనవరి నాటికి ఆలయ నిర్మాణాన్నిత్వరితగతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థకు అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. కొండపై ఆలయాన్ని నిర్మించడంలో చాలా ఇబ్బందులు వున్నాయని, నిర్మాణానికి అవసరమైన సామగ్రిని తరలించడం, విద్యుత్ సరఫరా, నీటి వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. నిర్మాణంలో ఎలాంటి ఇబ్బందులు వున్నా వాటిని పరిష్కరించేందుకు దేవాదాయ శాఖ ప్రాంతీయ కమీషనర్ భ్రమరాంభ ను ప్రత్యేకాధికారిగా నియమిస్తున్నట్టు చెప్పారు. అనుకున్న సమయానికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృతనిశ్చయంతో వున్నట్లు పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే రూ.3 కోట్లు మంజూరు చేసిందని, నిర్మాణ సంస్థను కుడా ఖరారు చేయడం జరిగిందని తెలిపారు. భక్తుల మనోభావాలు కాపాడే విధంగా పూర్తి శాస్త్రోక్తంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ పునర్నిర్మాణం, విగ్రహాల పునఃప్రతిష్ఠ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ నెలలో కొండపై ఆలయంలో ఘటన జరిగిన వెంటనే నెల రోజుల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో సీతారాముల విగ్రహాలను తయారు చేయించి ఇక్కడకు రప్పించామన్నారు. వెనువెంటనే రాతి కట్టడంగా ఆలయాన్ని నిర్మించేందుకు మూడు కోట్ల రూపాయలతో దేవాదాయ శాఖ ప్రతిపాదనలు రుపొందించగా ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఆమోదం తెలిపారని పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినపుడే ఒక ఏడాదిలో ఆలయం నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి చెప్పారు.

రామతీర్థంలోని రామస్వామి వారి ఆలయాన్ని మంత్రి వెలంపల్లి శ్రీనివాస రావు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. విజయనగరం ఎం.పి. బెల్లాన చంద్రశేఖర్, నెల్లిమర్ల శాసన సభ్యులు బడుకొండ అప్పల నాయుడుతో కలసి మంత్రి ఆలయంలో పూజలు చేసారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కొండపై నిర్మించనున్న ఆలయ నమూనా చిత్రపటాలను విడుదల చేశారు.

మీడియాతో మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, దీనిలో భాగంగా ఆలయాల్లో సి.సి. కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. దేవాలయాలకు సంబంధించిన వ్యవహారాలను రాజకీయం చేయడం తగదని మంత్రి చెప్పారు.

ఈ పర్యటనలో మంత్రి వెంట దేవాదాయ శాఖ కమీషనర్ అర్జున రావు, దేవాదాయ శాఖ జాయింట్ కమీషనర్ భ్రమరాంభ, ప్రాంతీయ కమీషనర్ సురేష్ బాబు, ఆర్.డి.ఓ. భవానీ శంకర్, సహాయ కమీషనర్లు డి.వి.ప్రసాదరావు, వినోద్ కుమార్, పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఇ.ఓ. కిశోర్ కుమార్, ఆలయ నిర్మాణ కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డి, దేవాదాయ ఇంజనీరింగ్ విభాగం డి.ఇ. సైదా, ఏ.ఇ. కృష్ణ, నెల్లిమర్ల తహశీల్దార్ రాము తదితరులు పాల్గొన్నారు.

Vizianagaram

2021-06-09 09:54:01

ఈవిఎంల భద్రతకి పటిష్టచర్యలు..

ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) భ‌ద్ర‌త‌కు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, క‌ట్టుదిట్ట‌మైన ర‌క్ష‌ణ ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఎన్నిక‌లు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను ఆదేశించారు. బుధ‌వారం ఉద‌యం  కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను ప‌రిశీలించి, అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం మార్గ‌నిర్దేశాల మేర‌కు ఎప్ప‌టిక‌ప్పుడు ఈవీఎం, వీవీ ప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. మూడు నెల‌ల‌కు ఒక‌సారి గుర్తింపు పొందిన రాజ‌కీయ పార్టీల ప్ర‌తినిధుల స‌మ‌క్షంలో త‌నిఖీలు చేప‌ట్టి నివేదిక‌లు రూపొందిస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, క‌లెక్ట‌రేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం.జ‌గ‌న్నాథం,  ఎస్‌.అప్పారావు (బీఎస్‌పీ), టి.మధు (సీపీఐ), ఎం.రాజ‌శేఖ‌ర్ (సీపీఎం), డీఎన్‌వీ భ‌ద్ర‌రావు (తెదేపా), ఆర్‌.వెంక‌టేశ్వ‌ర‌రావు (వైఎస్సార్ సీపీ) త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-09 09:39:22

చీని, నిమ్మ సంవత్సరంగా 2021-22..

చీని, నిమ్మ సంవత్సరంగా ఈ  ఏడాది (2021-22) ని ప్రకటిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ,  సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం సిట్రస్ పంటల విస్తరణ అంశంపై నిర్వహించిన జూమ్ కాన్ఫెరెన్స్ లో  మంత్రి  తమ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం చేకూర్చడమే  కాకుకండా, గ్రామాల్లో ఉపాధి, జీవన ప్రమాణాలు పెంపొందించే నిమ్మ , బత్తాయి (చీని ) పంటల సాగుకు ప్రాధాన్యం కల్పిస్తూ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దేశానిర్దేశం చేశారన్నారు. తదనుగుణంగా బత్తాయి, నిమ్మ పంటల సాగు, దిగుబడి, ఎగుమతులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఈ  ఏడాదిని "నిమ్మ, బత్తాయి సంవత్సరంగా" ప్రకటించాలని నిర్ణయించామని మంత్రి కన్నబాబు తెలిపారు. మంచి లాభదాయకమైన ఉత్పత్తుల సాధనకు ధృవీకరించిన నాణ్యమైన మొక్కలు, అంట్లను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా ఉద్యాన శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ సమన్వయంతో కృషి చేయాలని ఆయన కోరారు. అలాగే శాస్త్రీయ పరమైన యాజమాన్య, సాగు పద్దతులపై రైతులకు అవగాహనా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు.  ఆర్ బి కె ల ద్వారా నిమ్మ మరియు బత్తాయి సాగు శిక్షణ , సమగ్ర యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.  సిట్రస్ జాతి పండ్ల ఉత్పత్తిలో మన రాష్టం దేశంలోనే అగ్ర స్థానంలో వుందని, మన రాష్ట్ర బత్తాయి , నిమ్మ పండ్ల దేశీయ రకాలకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో  మరింత ప్రాచుర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నిమ్మ, బత్తాయి జాతి కాయలు, పండ్లు రోగ నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయని, వాటిని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చి స్థానిక వినియోగాన్ని పెంచాలని కోరారు.  సిట్రస్ పంటల విస్తరణ ప్రణాళికలపై పలువురు శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు, నిమ్మ,బత్తాయి సాగు చేస్తున్న రైతులతో మంత్రి కన్నబాబు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో వసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనమ్ మాలకొండయ్య , డాక్టర్ వై ఎస్ ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ జానకి రామ్ , ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీధర్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-08 15:01:22

ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని దివ్యాంగులకు (వివిధ ప్రతిభావంతులు)  ప్రత్యేక వ్యాక్సినేషన్ ను ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో వేస్తారని నగర మేయర్  గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. మంగళవారం దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వివిధ ప్రతిభావంతులు నగర మేయర్ ను క్యాంప్ ఆఫీసులో కలసి వారి సమస్యలపై,  కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు ఒక వినతి పత్రాన్ని సమర్పించారు. నగర మేయర్ వెంటనే స్పందించి జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రితో మాట్లాడి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు) సెంటర్ లో దివ్యాంగుల కొరకు ప్రత్యేక వాక్సినేషన్ సెంటర్ ను తెరవాలని ఆదేశించారు. స్పందించిన వైద్యాధికారి, రేపటి(బుధవారం) నుంచి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వినతిపత్రంలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని పరిశీలించి అవి అమలయ్యే విధంగా చూస్తానని మేయర్ వారికి హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ సంఘం సభ్యులు సురేష్ మేనన్,  రామదాసు శ్రీనివాస రావు,  తిరుపతి, మోహన రావు, 11వ వార్డు ఇంచార్జ్ గొలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.   

Arilova

2021-06-08 13:53:03