శ్రీకాకుళం జిల్లాలో ఆర్ధికంగా వెనుకబడిన కులవృత్తులు యస్.సి, యస్.టి విద్యుత్ బిల్లుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021-22 సం.కు రాయితీ ప్రకటించిందన్నారు. కావున సదరు విద్యుత్ వినియోగదారులు అవసరమైన ధృవపత్రాలను దగ్గరలోని విద్యుత్ శాఖ నందు సమర్పించి రాయితీలను పొందాలని ఏ.పి.ఇ.పి.డి.సి.ఎల్ పర్యవేక్షక ఇంజినీర్ యల్.మహేంద్రనాధ్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాయితీ పొందగోరు వినియోగదారులు తమ విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు , కులధృవీకరణ, తెలుపురేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రం, మొబైల్ నెంబరు, అద్దెకు ఉన్నట్లయితే యజమాని ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ ప్రతులను సమర్పించాలని అన్నారు. షెడ్యూల్డు కులాలు మరియు తెగలు వారికి 200 యూనిట్లు, లాండ్రీ షాపు / రజక మరియు నాయీబ్రాహ్మణ కులం వారికి 150 యూనిట్లు, బంగారు ఆభరణాలు తయారీ, చేనేత కార్మికులు, అత్యంత వెనుకబడిన తరగతులు (ఎంబిసి) వారికి 100 యూనిట్లు వరకు రాయితీ లభించనుందని ఆయన చెప్పారు. జి.ఓ.యం.యస్.నెం.17, తేది08.06.2016 ప్రకారం బలవంతు/బహురూపి, బండారు, బుడబుక్కలు, దాసరి, దొమ్మర, గంగిరెడ్డువారు, జంగం, జోగి, కాటిపాపల, కురచ, మొండివారు, బాండ, మొండిబండ, పిత్చిగుంట్ల, వంశరాజ్, పాముల, పార్థి(నిషికారి), పంబల, దమ్మలి, దమ్మల, దమ్ముల, దమల్, పెద్దమ్మవాండ్లు, దేవరవాండ్లు, ఎల్లమ్మవాండ్లు, ముత్యాలమ్మవాండ్లు, వీరముష్టి, నెత్తికొట్ల, వీరభద్రీయ, గుడాల, కంజర-భీభట్ట, కోపమరే, రెడ్డికే, మొండిపట్ట, నొక్కారు, పరికిముగ్గుల, యాత, చోప్మారి, కైకది, జోపినందివాలస్, మందుల, కూనపులి, పాత్ర, రాజన్నల, రాజన్నలు, కసికపడి, కసికపూడి కులాలకు చెందినవారు అత్యంత వెనుకబడిన తరగతులు(ఎంబిసి) క్రింద వస్తారని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. విద్యుత్ వినియోగదారులకు ఏ విధమైన సమస్యలున్న 1912 నెంబరుకు ఫిర్యాదు చేయాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు.