1 ENS Live Breaking News

పేదలకు తక్కువధరకే ఇంటి స్థలాలు..

మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరకే ఇంటి స్థలాలు కేటాయించే ప్రక్రియను వేగంగా చేపట్టాలని జిల్లా స ంయుక్త కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్.) జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు. అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి, రెవిన్యూ అధికారులతో సోమవారం ప్రకాశం భవనంలోని జె.సి. ఛాంబర్లో ఆయన సమావేశం నిర్వహించారు. మధ్యతరగతి కుటుంబాలకు చవకగా ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందని జె.సి. మురళి చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల పరిధిలో నివాసముంటున్న 20,509 మంది ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారని ఆయన వివరించారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు పట్టణాల పరిధిలో ఈ పథకానికి అవసరమైన ప్రభుత్వ భూములను గుర్తించాలన్నారు. పట్టణాలలో అవి లేని పక్షంలో ప్రత్యామ్నాయంగా అసైన్ఢ్‌మెంట్ భూములు గుర్తించాలన్నారు. ఆ భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారినుంచి భూసేకరణ చేయాలన్నారు. మధ్యతరగతి కుటుంబాల వారికి భారం లేకుండా చూడటమే పథకం ముఖ్య ఉద్థేశ్యమన్నారు. తక్కువ ధరకే భూమి కేటాయించేలా ప్రభుత్వం ప్రారంభించిన పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఒంగోలు, మార్కాపురం, కందుకూరు ప్రాంతాలలో గుర్తించిన భూముల లేఅవుట్లను ఆయన పరిశీలించారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఒంగోలు, మార్కాపురం ఆర్.డి.ఓ.లు ప్రభాకర రెడ్డి, ఎమ్.వి. శేషిరెడ్డి, ఉడా వైస్ ఛైర్మన్ పి. భవాని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Ongole

2021-06-07 16:06:12

మ్రుతుల కుటుంబాలకు ఆర్ధికసాయం..

కరోనా వైరస్ , రోడ్డు  ప్రమాదాలకు గురై మ్రుతిచెందిన ఇద్దరు రెవెన్యూ ఉద్యోగుల కుటుంబాలకు రూ. 2.50 లక్షల ఆర్ధిక సయాహాన్ని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అందించారు.   సోమవారం కలక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్  లు  బాధిత కుటుంబాలకు ఆర్ధిక సాయం క్రింద రూ. 2.50  లక్షల చెక్కులను అందించారు. ఏప్రిల్ 22 న గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న కే. శ్రీనివాసరావు కోవిడ్ కు గురై  చికిత్స పొందుతూ మృతి చెందారు.  మాచవరం మండలం  రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న షేక్.బాజీ మే 8 న రోడ్డు  ప్రమాదంలో మృతి చెందారు.  మృతుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో గుంటూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఒక్కొక్క కుటుంబానికి రూ. 2.50 లక్షల చొప్పున  జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్  చేతుల మీదుగా ఆర్ధిక సాయం క్రింద చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి, సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి, నరసారావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్, ట్రైనీ సహాయ కలెక్టర్  శుభం భన్సాల్, జిల్లా రెవెన్యూ అధికారి పి. కొండయ్య, కలక్టరేట్ ఏ.ఓ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-07 15:49:01

ప్రణాళికాబద్దంగా కోవిడ్ వేక్సినేషన్..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కోవిడ్ వేక్సినేషన్ ప్రక్రియ ప్రణాళికా బద్దంగా చేపట్టాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.  సోమవారం ఆరిలోవ (ఎఫ్.ఆర్.యు.) సెంటర్ ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరూ ఎటువంటి అపోహలకు తావివ్వకుండా వ్యాక్సినేషన్ వేయించుకోవాలన్నారు. ఆ సమయంలో ఖచ్చితంగా భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని, వ్యాక్సినేషణ్ వేసే సిబ్బందికి సహకరించాలని సూచించారు. అనంతరం డాక్టరు అనిత, సిబ్బందితో మాట్లాడుతూ వ్యాక్సిన్ వేయంచుకొనుటకు వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేయాలని ఆదేశించారు. ఎఫ్.ఆర్.యు. సెంటర్ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచాలని, చెత్తను ఎప్పటికప్పుడు తోలాగించాలని, పరిసరాలను శానిటేషన్ చేయించాలని శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అనంతరం 11వార్డులను క్లాప్ (CLAP) పధకంలో భాగంగా కాలువలను, రోడ్డులను తనిఖీ చేశారు. ప్రతి ఇంటి నుండి చెత్త సేకరించే విధానాన్ని స్వయంగా పరిశీలించారు. చెత్తను వెంట వెంటనే డంపింగు యార్డుకు తరలించాలని, కాలువలలోను రోడ్డు ప్రక్కన బ్లీచింగు చల్లాలని శానిటరి ఇన్స్పెక్టర్ ని  ఆదేశించారు. ఈ పర్యటనలో అరిలోవ (ఎఫ్.ఆర్.యు.) ఆసుపత్రి సిబ్బంది, వార్డు శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-06-07 15:27:39

ఆ 2180 ఎకరాల భూమి రైతులకే..

రాష్ట్ర ప్రభుత్వ చారిత్రాత్మ నిర్ణయాని కనుగుణంగా కాకినాడ ఎఈజడ్ లో సేకరించిన 2180 ఎకరాల భూములను తిరిగి రైతులకు వెనుకకు ఇచ్చి రిజిష్ట్రేషన్ చేసే ప్రక్రియను వారం రోజుల్లోపు పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం  ఆయన, రాష్ట్ర ప్రభుత్వ  పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వల్లవన్ తో కలిసి సంయుక్తంగా  జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, కెఎస్ఈజడ్ ప్రతినిధులు, రైతులతో కలెక్టరేట్ వివేకానంద హాలులో ప్రత్యేక సమావేశం నిర్వహించి  కాకినాడ ఎస్ఈజడ్ లో సేకరించిన 2180 ఎకరాల భూములను  రైతులకు తిరిగి ఇచ్చే ప్రక్రియ పురోగతిని సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు.  ఈ సందర్భంగా మంత్రి  కన్నబాబు మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా ఎస్ఈజడ్ కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చే బోల్డ్ నిర్ణయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గైకొన్నారని, దేశంలో ఎస్ఈజడ్ భూములకు సంబంధించి ఎదురైయ్యే సమస్యల పరిష్కారానికి మిగిలిన రాష్ట్రాలు ఈ నిర్ణయాన్నే అనుసరణీంగా స్వీకరిస్తున్నాయన్నారు.    కెఎస్ఈజడ్ లో 2180 ఎకరాల భూములను రైతులకు తిరిగి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత మార్చి నెలలో ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ జీఓ అంశాలను త్వరితగతిన అమలు పరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు.  ఈ మేరకు ఇప్పటికే యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో గ్రామ సభలు నిర్వహించి వెనుకకు తిరిగి ఇవ్వాల్సిన భూములను గుర్తించడం జరిగిందన్నారు.  మొత్తం 2180 ఎకరాల విస్తీర్ణానికి గాను 1357 ఎకరాలను ఎవరి భూములను వారికే ఇంచేందుకు గుర్తించగా,  కెఎస్ఈజడ్ లో పరిశ్రమల స్థాపనకు అనువుగా భూమి ఒకే చోట ఏక ఖండంగా ఉండేందుకు వీలుగా, మరో 823 ఎకరాల భూములకు ప్రత్యామ్నాయంగా మరోక చోట భూములను గుర్తించారన్నారు.  ఈ భూములను వచ్చే అవార్డు లిస్ట్ ల ప్రకారం సేకరించిన రైతులకు వెనుకకు ఇస్తూ రిజిష్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభించాలని మంత్రి అధికారులకు, కెఎస్ఈజడ్ ప్రతినిధులకు సూచించారు.  రైతులకు వెనుకకు ఇస్తున్న భూముల రిజిష్ట్రేషన్ ప్రక్రియకు స్టాంపు డ్యూటీ లేకుండా ఉచితంగా చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోందని ఆయన తెలిపారు.  స్థానిక ప్రజల కోరిక మేరకు శ్రీరాంపురం, బండిపేట, ముమ్మిడివారిపోడు, పాటివారిపాలెం, రావివారిపోడు, రామరాఘవపురంలోని కొంత భాగం ఆవాసాలను కెఎస్ఈ జడ్ పరిధిలో నుండి మినహాయించడం జరిగిందని, అలాగే ఆవాసాలకు దగ్గరగా ఉన్న స్మశాన వాటికలను కూడా యధతధంగా కొనసాగించాలని నిర్ణయించామన్నారు.  కెఎస్ఈజడ్ భూముల సేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణకు పోలీస్ సూపరింటెండెంట్ కు సూచించడం జరిగిందన్నారు.  స్థానికులకే కెఎస్ఈజడ్ పరిశ్రమలలో 75 శాతం ఉద్యోగాలు కల్పించేందుకు స్కిల్ డెవలెప్ మెంట్ శిక్షణా కేంద్రాన్ని ములపేటలో నిర్వహిస్తుండగా, ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేయాలని కెఎస్ఈ జడ్ ను కోరామన్నారు.   అలాగే తొండంగి మండలం కోనలో సేకరించిన 657 ఎకరాల  అస్సైన్డ్ భూములకు పరిహారం తీసుకోని ఎస్తైనీలకు ఎకరాకు 5 లక్షల అదనపు పరిహారంతో వెరసి 10 లక్షల పరిహారం పంపిణీ ప్రక్రియను కూడా రెవెన్యూ అధికారుల సమన్వయంతో వచ్చే పక్షం రోజుల్లో పూర్తి చేయాలని  కెఎస్ఈజడ్ ప్రతినిధులను మంత్రి కన్నబాబు సూచించారు. 
  పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రభుత్వ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ ఆర్.కరికాల వల్లవెన్ సమావేశంలో మాట్లాడూతూ రైతులకు  తిరిగి ఇచ్చే 1357 ఎకరాల అవే భూములు, 823 ఎకరాల ప్రత్నామ్నాయ భూముల రిజిష్ట్రేషన్, కోన అసైన్డ్ భూములకు అదనపు పరిహారం చెల్లింపు ప్రక్రియలను రేపటి నుండే ముమ్మరంగా నిర్వహించాలని రెవెన్యూ, కెఎస్ఈజడ్ అధికారులను ఆదేశించారు.   ఈ ప్రక్రియలను 2007 నాటి అవార్డులను, ఒరిజినల్ అస్సైనీల సమాచారాన్ని ప్రాతిపదికగా చేపట్టి ముందుగా ఎటువంటి అభ్యంతరాలు లేని కేసులను వెంటనే పూర్తి చేయాలని, అభ్యంతరాలు వ్యక్తమైన వాటిపై మరో మారు క్షేత్ర పరిశీలన నిర్వహించి పరిష్కరిచాలని ఆయన సూచించారు.  రైతుల భూముల్లో ఫలసాయం ఇస్తున్న చెట్లకు కూడా ఉద్యానవన శాఖ నిర్ణయించిన విలువ ప్రకారం పరిహారం అందించడం జరుగుతుందన్నారు.    
సమావేశంలో రైతు ప్రతినిధులు వ్యక్తం చేసిన సందేహాలను  జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి నివృత్తి చేస్తూ భూసేకరణలో అవార్డు పాసై, గజెట్ లో ప్రకటించిన భూములు ప్రభుత్వ భూములుగా పరిగణింప బడతాయని, వాటిని తిరిగి వెనుకకు రిజిష్టరు చేయడం వల్ల రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావవని స్పష్టం చేశారు. రేపటి నుండి నిర్వహించే రిజిష్ట్రేషన్ కార్యక్రమాలపై ఆయా గ్రామాల్లో టాంటాం, వలంటీర్లు, మాద్యమాల ద్వారా రైతులకు సమాచారం అందించాలని తహశిల్దారులను ఆదేశించారు.  
కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ రైతు సంక్షేమ దృక్పధంతో రాష్ట్ర ప్రభుత్వం గైకొన్న ఈ నిర్ణయానికి పట్టువిడుపులను పాటిస్తూ భూములిచ్చిన రైతులందరూ సహకరిచాలని  కోరారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మిశ,  డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, కాకినాడ ఆర్డిఓ ఎ.జి.చిన్నికృష్ణ, కెఎస్ఈజడ్ ఎస్డిసి కె.మనోరమ, కెఎస్ఈజడ్ ప్రోజెక్ట్ హెడ్ బి.హెచ్.ఎ.రామరాజు, జియం సి.ఆర్.ఎం.నాయుడు,  తొండంగి తహశిల్దారు చిన్నారావు, యు.కొత్తపల్లి తహశిల్దారు శివకుమార్, పరిశ్రమలు, ఎపిఐఐసి, కాలుష్యనియంత్రణ, వ్యవసాయ, ఉద్యానవన, మత్స్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Kakinada

2021-06-07 15:17:41

ల్యాండ్ సెటిల్ మెంట్ వేగవంతం కావాలి..

గుంటూరు జిల్లాలోని వరికపూడి సెల ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ శాఖ నుంచి తీసుకునే భూములకు ప్రత్యామ్నాయ ప్రభుత్వ భూములు  అందించే ప్రక్రియ  వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ వరికపూడి సెల లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి భూముల సేకరణ అంశంపై వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా జిల్లా సంయుక్త కలెక్టర్ ( రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్. దినేష్ కుమార్, నీటిపారుదల శాఖ, రెవెన్యూ శాఖ రెవెన్యూ డివిజన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వరికపూడి సెల ప్రాజెక్ట్  నిర్మాణానికి రూ.340 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. త్వరిత గతిన వరికపూడి సెల నీటిప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అటవీశాఖ నుంచి సుమారు 50 ఎకరాల భూములను తీసుకోవాల్సి ఉందన్నారు. దీనికి ప్రత్యాన్మాయంగా ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించి అటవీశాఖకు అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని  రెవెన్యూశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల  గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఏఏ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములను గుర్తించారని రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి బొల్లాపల్లి, వెల్ధుర్తి రెవెన్యూ  అధికారులతో మాట్లాడారు. 
కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్( రెవెన్యూ, రైతు భరోసా) ఏ.ఎస్.దినేష్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశామని జిల్లా కలెక్టర్ కు తెలిపారు. రెవెన్యూ డివిజనల్ అధికారుల ఆధ్వర్యంలో భూముల గుర్తింపు కార్యక్రమాలను చేపట్టామన్నారు. త్వరితగతిన గుర్తించిన  రెవెన్యూ భూములను అటవీశాఖ అధికారులకు చూపించి, అధికారులు సమ్మతిస్తే సర్వే చేయిస్తామన్నారు. అవసరమైతే అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయ పరుచుకొని త్వరతిగతిన భూములను అటవీశాఖ అధికారులకు అప్పగించే  ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆదేశించారు. వచ్చే వారంలో మరోసారి సమావేశం నిర్వహించి పనుల వేగాన్ని పెంచి భూములను అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.  
ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఎస్.ఇ  బాబురావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్సు అసిస్టెంట్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి, మార్కాపురం డి.ఎఫ్.వొ బబిత, గుంటూరు డి.ఎఫ్.వొ రామచంద్రరావు, గురజాల ఆర్.డి.వొ. పార్ధ సారధి, నరసరావుపేట సబ్ కలెక్టర్ శ్రీవాస్ నుపూర్, బొల్లాపల్లి,వెల్దుర్తి తహాశీల్ధార్లు తదితరులు పాల్గొన్నారు.

Guntur

2021-06-07 15:14:41

థర్డ్ వేవ్ ని సమర్ధవంతంగా అడ్డకోవాలి..

కోవిడ్–19 మూడవ వేవ్ లో ఎక్కువుగా పిల్లలకు కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉన్నందున చిన్నపిల్లలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లపై వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్యాదవ్ వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కోవిడ్–19 మూడవ వేవ్  ముందస్తు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, సంయుక్త కలెక్టర్ (రైతుభరోసా, రెవెన్యూ) ఏఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (సచివాలయాలు, అభివృద్ధి) పి ప్రశాంతితో కలిసి వైద్యారోగ్యశాఖ అధికారులు, పిల్లల వైద్య నిపుణులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్ సోకిన పిల్లలకు అత్యుత్తమ వైద్యం అందించటానికి పిడియాట్రిక్ వార్డులను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా ఆస్పత్రులలో పిల్లలకు వైద్యసేవలు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పిల్లల చికిత్సకు సంబంధించి సీహెచ్సీ, పీహెచ్సీతో పాటు అన్ని వైద్యశాలలోని  నర్సింగ్ సిబ్బందికి, వైద్యులకు చిన్నపిల్లల వైద్యనిపుణులతో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పిల్లలకు వైద్యచికిత్సకు వినియోగించాల్సిన మందులు, పరికరాలు, బయోమెడికల్ ఎక్విప్మెంట్ పై వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు అందిస్తే వైద్యనిపుణుల కమిటీలో చర్చించి ప్రభుత్వానికి పంపుతామన్నారు. 
  రాష్ట్ర పిడియాట్రిక్స్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు డా. చంద్రశేఖర్ రెడ్డి ధర్డ్ వేవ్లో కరోనా వైరస్ బారిన పడే పిల్లలకు అందించాల్సిన వైద్యచికిత్సలు, నివారణ చర్యలపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డా. యాస్మిన్, గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి సూరింటెండెంట్ డా. ప్రభావతి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డా. కళ్యాణ్ చక్రవర్తి, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల పీడియాట్రిక్స్ విభాగం హెచ్వోడీలు పాల్గొన్నారు.

Guntur

2021-06-07 14:16:58

బలవర్థక ఆహారంతో రోగనిరోధక శక్తి పెంపు..

కరోనా సోకిన సమయంలో మంచి ఆహారం తీసుకుంటూ, కోవిడ్ తగ్గిన తరువాత కూడా బలమైన పోషక ఆహార పదార్ధాలను మరియు చిన్న పిల్లలు, చిన్న పిల్లల తల్లితండ్రులు వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకునేందుకు తగిన జాగ్రత్తలు  తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక రెవిన్యూ కళ్యాణ మండపం నందు  జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన పోషక ఆహార ప్రదర్శన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ  కోవిడ్ నుండి కోలుకున్న వారు  ఆహారం మంచిగా తీసుకోవాలని మరియు చిన్న పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు ఆకుకూరలు, పండ్లు, కోడి గ్రుడ్డు, అనేక రకాలైన పోషక విలువలు కలిగిన పదార్ధాలను అందివ్వడం వలన నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పోషకాహార ఆవశ్యకత గురించి మండలాల్లో, గ్రామాల్లో ఇదే విధమైన పోషకాహార ప్రదర్శనలు ఏర్పాటు చేసి ప్రజలు అవగాహన కల్పించాలన్నారు.  థర్డ్ వేవ్ వస్తుందన్న ఉహాగానాల నేపధ్యంలో చిన్న పిల్లల తల్లి తండ్రులు తగిన శ్రద్ధ వహించి జాగ్రత్తలు పాటించాలన్నారు. ప్రజలందరూ మంచి ఆహార అలవాట్లను అలవరచుకోవాలని, చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వుండాలని ఆయన సూచించారు. ఆరోగ్యమే మహా భాగ్యమన్నారు. 
 
  సంయుక్త కలెక్టర్ పి. ప్రశాంతి ( సచివాలయాలు, అభివృద్ధి )  మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు ఈ కోవిడ్ సమయంలో   గర్భవతులు, బాలింతలు, పసి పిల్లలు, చిన్న పిల్లలు కోవిడ్ రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ చిన్న పిల్లల ఇమ్యునిటి పెరిగేందుకు తీసుకోవలసిన ఆహార పదార్ధాలతో ప్రదర్శన పెట్టడం చాలా బాగుందన్నారు.  సంయుక్త కలెక్టర్ ( హౌసింగ్ ) అనుపమ అంజలి  మాట్లాడుతూ కోవిడ్ రెండవ  వేవ్ తగ్గుతున్న దశలో థర్డ్ వేవ్ వస్తుందనే ప్రచారం ఉన్నందున చిన్న పిల్లల తల్లి తండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.  ట్రైనీ సహాయ కలెక్టర్ శుభం భన్సాల్ మాట్లాడుతూ అంగన్ వాడీ సెంటర్లు, సచివాలయాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు చిన్న పిల్లల తల్లితండ్రులకు కరోనా మహమ్మారీ పై ఎక్కువగా అవగాహన కల్పించాలన్నారు.  
  గుంటూరు ఆర్డిఓ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న పిల్లల కొరకు కోవిడ్  కేర్ కేంద్రం అడవి తక్కెళ్ళపాడు లో ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ పిల్లలకు అవసరమైన పౌష్టికాహారం, వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. జే. యాస్మిన్ మాట్లాడుతూ  ఈ కోవిడ్ సమయంలో సమతుల్య ఆహార విటమిన్లు ఎక్కువగా తీసుకోవడం వలన కరోనా సోకిన వ్యక్తులు త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. న్యూట్రిషియన్ అనేది అన్ని రకాల ఆహార పదార్ధాలలో ఉంటుందని గమనించాలన్నారు. గర్బవతులు, బాలింతలు, చిన్న పిల్లలు ఏ సమయంలో ఎలా తినాలి అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. పిల్లలకు ఇష్టమైన రీతిలో  మంచి బలమైన ఆహారాన్ని పెట్టాలన్నారు. 

  అనంతరం కోవిడ్ కు సంబంధించి చైల్డ్ రైట్స్ అడ్వేజరీ  ఫౌండేషన్  సంస్థ స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ ప్రాన్సిస్ తంబి చిన్న పిల్లల ఆహార పదార్దాలపై రూపొందించిన  బ్రోచర్ రిలీజ్ చేసారు.  ఈ కార్యక్రమంలో  ప్రాజెక్ట్ డైరెక్టర్ జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ                        బి. మనోరంజని, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా. ప్రభావతి,  సిపిడిఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. 

Guntur

2021-06-07 14:13:12

పారిశుధ్య సిబ్బందిని ఏర్పాటుచేయండి..

మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పిన్ పాయింట్ వారీగా పారిశుధ్య సిబ్బందిని సర్దుబాటు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. సోమవారం కమిషనర్ 5వ జోన్ 53వ వార్డు పరిధిలోని మర్రిపాలెంలో సాయినగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. పిన్ పాయింట్ వారీగా సిబ్బందిని సర్దుబాటు చేయనందున శానిటరి ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనికి నిర్దేశించిన పారిశుధ్య సిబ్బందిని అదే పనికి వినియోగించాలని ఒకరికి రెండు, మూడు పనులు చెప్పరాదని ఆదేశించారు. డోర్ టు డోర్ చెత్తను వేరు వేరుగా తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లను, కాలువలను శుభ్రంగా ఉంచాలని, రోడ్లను శుభ్రం చేసిన చిన్న చిన్న చెత్త కుప్పలను వెను వెంటనే తోలగించాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయరాదని ఆదేశించారు. 24x7 మంచినీటి కొరకు తవ్విన రోడ్లను పూడ్చలేదని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా, వెంటనే రోడ్లను రిపేరు చేయాలని ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైధ్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ సింహాచలం, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, డిసిపి శిల్పి, ఎఎంఒహెచ్ రాజేష్, కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి, శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.     

Visakhapatnam

2021-06-07 13:56:49

రిమ్స్ కు పూర్తిస్థాయి ఆక్సిజన్..

శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో ఎన్.ఏ.సి.యల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంటును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. తొలుత అక్సిజన్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఆయన అనంతరం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజుతో కలిసి స్విచ్ ఆన్ చేసి ఆక్సిజన్ ప్లాంటును ప్రారంభించారు. సుమారు రూ.75 లక్షల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్లాంటును టాటా కన్సల్టెన్సీ ఇంజినీరింగ్ విభాగం కేవలం 20రోజుల్లోనే పూర్తిచేయడం గమనార్హం. ఈ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభంతో రిమ్స్ ఖాతాలోకి మరో ఆక్సిజన్ ప్లాంట్ అదనంగా చేరింది. దీంతో నేటినుండి రిమ్స్ లో మరింత మంది రోగులకు ఆక్సిజన్ అందించే అవకాశం కలగనుంది. ఈ ఆక్సిజన్ ప్లాంట్ నిమిషానికి సుమారు 800 లీటర్ల వరకు ఆక్సిజన్ అందించనుందని, అలాగే 94 శాతం వరకు ప్యూరిటీ కలిగిఉంటుందని   రాష్ట్ర మంత్రులకు ఎన్.ఏ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.వరదరాజులు వివరించారు. సుమారు రూ. 75 లక్షల పెట్టుబడితో నిర్మించిన  ఈ ప్లాంటులో కొద్దిపాటి మార్పుల కొరకు దాదాపు రూ.30 లక్షలు వెచ్చించడం జరిగిందని మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్, రిమ్స్ సూపరింటెండెంట్   డా. ఎ.కృష్ణమూర్తి, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.జె.కిశోర్, ఎన్.ఎ.సి.ఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంజినీరింగ్ సిబ్బంది , బృందం తదితరులు పేర్కొన్నారు.

Srikakulam

2021-06-07 13:48:20

రూ.1.30 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లింపు..

విశాఖ  జిల్లాలో కోవిడ్-19 వలన మరణించిన వారి పిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాన్ని విశాఖ జిల్లాలో 13 మంది పిల్లలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ. ఒక కోటి  30 లక్షలు అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు.  జిల్లాలో మొత్తం 13 మంది అనాధ పిల్లలను గుర్తించి వారికి ఎక్స్ గ్రేషియా చెల్లించడం జరిగిందన్నారు వీరు, (1) మీసాల శ్రావణి (గాజువాక); (2) రెడ్డి భాగ్యశ్రీ, (సబ్బవరం); (3) పాంగి విష్ణు,(4) పాంగి జగన్ (పాడేరు), (5) పెర్ల మనోహర్ (విశాఖ మహరాణిపేట), (6) మీసాల ప్రసీద(కంచరపాలెం, గోపాలపట్నం), (7) చదరం బాల సాయి లక్ష్మీ(పెందుర్తి); (8) బుద్ధ ఉషశ్రీ, (9)బుద్ధ ప్రజ్వల్ కుమార్ (సీతమ్మధార, విశాఖపట్నం), (10) జెర్సింగి సందీప్  (పెదబయలు); (11) మంత్రి కౌషిక్ సూర్యప్రకాష్ (అనకాపల్లి), (12) కాండ్రకోట శ్రీచందన (13)కాండ్రకోట శ్రీమిధున్(అనకాపల్లి), పిల్లలకు రూ.10 లక్షల చొప్పున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందన్నారు.  సదరు మొత్తాన్ని ఈ పిల్లలకు 25 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత వారికి ఇస్తారని,  అంత వరకూ ఈ సొమ్ము పై వచ్చే వడ్డీ వీరి పోషణకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. 

Collector Office

2021-06-07 13:26:05

10వేల కోవిడ్ టెస్టులు చేయండి..

విశాఖ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం గావించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు తన ఛాంబరులో వైద్యాధికారులతో వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్స్, కోవిడ్ కేసులు, అసుపత్రులలో ఆరోగ్యశ్రీ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రోజుకు 10 వేల కోవిడ్ పరీక్షల నిర్వహణను ప్రణాళికబద్దంగా, యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. ఈ విషయంపై వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.సూర్యనారాయణను ఆదేశించారు. టెస్ట్ లు నిర్వహించిన తదుపరి  శాంపిల్స్ ల్యాబ్ కు 24 గంటలలోగా  చేరాలన్నారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. పాజిటివ్ కేసులు 20 శాతం మించి వస్తున్న మండలాలను గుర్తించాలన్నారు. జిల్లాలోని ప్రవేటు ఆసుపత్రులలో  కోవిడ్ కేసుల సంఖ్యపై  వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు.  ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్స్ పరిస్థితిపై చర్చించారు.  కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 1లక్ష చొప్పున జిల్లాలో 13 మంది పిల్లలకు వారి ఖాతాలో జమ గావించాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు - 2 పి.అరుణ్ బాబు, ఎ.ఎమ్.సి ప్రిన్సిపాల్ డా.సుధాకర్, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి డా.సూర్యనారాయణ, ఎల్.డి.ఎమ్ తదితరులు పాల్గొన్నారు.

Collector Office

2021-06-07 13:23:12

సంక్షేమ పథకాలు ప్రజలకి అందించే బాధ్యత సర్పంచులదే..

గ్రామ స్వ‌రాజ్యం సాకారం ల‌క్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్రమాలు విజ‌య‌వంతంగా అమ‌ల‌య్యేలా కృషిచేస్తూ, గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి స‌ర్పంచ్‌లు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని ఎంపీడీవో కార్యాల‌యంలో కాకినాడ గ్రామీణ మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ స‌మీక్షా సమావేశం జ‌రిగింది. కొత్త‌గా ఎన్నికైన గ్రామ స‌ర్పంచ్‌లు, ఆయా గ్రామాల పంచాయ‌తీకార్య‌ద‌ర్శులు పాల్గొన్న ఈ స‌మావేశానికి మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌తి గ్రామ స‌ర్పంచ్‌తో మాట్లాడి ఆయా గ్రామాల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల వివ‌రాల‌తో నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవ‌ల గ్రామ ప్ర‌థ‌మ పౌరులుగా ఎన్నికైన స‌ర్పంచ్‌లకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో ప‌నిచేయాల‌ని సూచించారు. వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరుపై పూర్తి అవగాహ‌న ఏర్ప‌ర‌చుకోవాలన్నారు. నేరుగా న‌గ‌దును జ‌మజేసే దాదాపు 22 ప‌థ‌కాల‌కు ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే విష‌యంలో పూర్తి అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని సూచించారు. గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తయ్యేలా చూడాల‌ని.. నిర్మాణాలు ప్రారంభం కానివాటి విష‌యంలో కార‌ణాల‌ను గుర్తించి, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయాల‌న్నారు. ఏ స‌హాయం కావాల‌న్నా తాను 24 గం. అందుబాటులో ఉంటాన‌ని మంత్రి వెల్ల‌డించారు. 

*ప్ర‌తి అర్హునికీ ప‌థ‌కాలు అందాల్సిందే:*
ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు కుల‌, మ‌త, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి అర్హునికి అందేలా చూడాల‌ని, ల‌బ్ధిదారుని ఎంపిక‌కు అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక అని మంత్రి స్ప‌ష్టం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రెయిన్ల శుద్ధి, ర‌హ‌దారులు త‌దిత‌రాల్లో పోటీత‌త్వంతో ప‌నిచేసి ప్ర‌తి గ్రామం నెం.1గా నిలిచేందుకు కృషిచేయాల‌ని త‌ద్వారా నియోజ‌క‌వ‌ర్గాన్ని ముందు వ‌రుస‌లో నిల‌పాల‌ని సూచించారు. ఉత్త‌మ ప్ర‌తిభ  క‌న‌బ‌ర‌చిన సర్పంచ్‌లు, అధికారుల‌ను స‌త్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. నాడు-నేడు రెండోద‌శ‌కు సంబంధించిన పాఠ‌శాల‌ల‌ను గుర్తించి, నివేదిక ఇవ్వాల‌న్నారు. తూరంగి నీటి స‌మ‌స్య‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. మండ‌ల‌, గ్రామ వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌ళ్ల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్నారు. ప్ర‌స్తుతం కోవిడ్ విప‌త్తు నేప‌థ్యంలో మ‌న‌ల్ని మ‌నం ప‌రిర‌క్షించుకుంటూ ప్ర‌జ‌ల్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని, అంద‌రికీ వీలైనంత త్వ‌ర‌గా టీకా అందించాల‌నేది ముఖ్య‌మంత్రి ఆశ‌య‌మ‌ని పేర్కొన్నారు. ఈ దిశ‌గా ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు. స‌మావేశం అనంత‌రం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు అయిన సంద‌ర్భంగా మంత్రిని ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌త్క‌రించారు. అదే విధంగా కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్‌ల‌ను మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు శాలువాల‌తో స‌త్క‌రించారు. స‌మావేశంలో ఏఎంసీ ఛైర్మ‌న్ గీసాల శ్రీను, ఎంపీడీవో పి.నారాయ‌ణ‌మూర్తి, త‌హ‌సీల్దార్ వి.ముర‌ళీకృష్ణ‌, ప్ర‌త్యేక అధికారి ప‌ద్మ‌శ్రీ, గ్రామాల స‌ర్పంచ్‌లు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-07 11:17:44

విధినిర్వహణలో అందించిన సేవలే గుర్తుండిపోతాయ్..

ఉద్యోగ జీవితం ప‌రంగా విధుల నిర్వ‌హ‌ణ ఎంత ముఖ్య‌మో వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా ఉద్యోగులు త‌మ‌తో పాటు వారి కుటుంబాల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కూడా అంతే ముఖ్య‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. కోవిడ్ బారిన‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గ‌త నెల 26న మ‌ర‌ణించిన తాళ్ల‌రేవు మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి (ఏవో) ఎ.సిరి సంతాప స‌భ సోమ‌వారం కాకినాడ‌లోని కృషిభ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు సిరి చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప‌నిప‌ట్ల అంకిత‌భావం, రైతుల స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణం స్పందించి, ప‌రిష్కారానికి కృషిచేసే మంచి మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌వ‌సాయ అధికారి సిరి కోవిడ్ బారిన‌ప‌డి మ‌ర‌ణించ‌డం తీవ్ర బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా అందాల్సిన స‌హాయం వెంట‌నే అందేలా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌సాయ రంగానికి అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని, ప్ర‌భుత్వ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తూ వ్య‌వ‌సాయ అధికారులు మంచి ఫ‌లితాలు సాధిస్తున్నార‌ని.. అయితే విధి నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి సూచించారు. తొలివేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో ప్ర‌తి కుటుంబంపైనా ఏదో ఒక రూపంలో కోవిడ్ ప్రతికూల ప్ర‌భావం చూపింద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కాలంలో కోవిడ్ కార‌ణంగా రాష్ట్రంలో ఎనిమిది మంది వ్య‌వ‌సాయ అధికారుల‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని, వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని వెల్ల‌డించారు. నిత్యం రైతుల‌తో మ‌మేక‌మ‌వుతూ క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వ‌హిస్తున్న త‌మ‌ను ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లుగా గుర్తించి, అంద‌రికీ వ్యాక్సిన్ వేయాల‌ని వ్య‌వ‌సాయ అధికారులు చేసిన విజ్ఞ‌ప్తిని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తామ‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్‌.విజ‌య్‌కుమార్‌, ఏపీ వ్య‌వ‌సాయ అధికారుల అసోసియేష‌న్ జిల్లా యూనిట్ ప్రెసిడెంట్ డీవీ కృష్ణ‌, కార్య‌ద‌ర్శి డి.అరుణ్‌, వైస్ ప్రెసిడెంట్ దుర్గ‌, వ్య‌వ‌సాయ శాఖ డీడీలు మాధ‌వ‌రావు, నాగాచారి, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-06-07 10:42:09

మూడోద‌శ ముప్పుని కలికట్టుగా త‌ప్పిద్దాం..

విజయనగరం జిల్లాలో మూడోద‌శ ముప్పు త‌ప్పించేందుకు సిద్దంగా ఉండాల‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు త‌గిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను త‌యారుచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు గానూ ముంద‌స్తుగా టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, థ‌ర్డ్‌వేవ్ వ‌స్తుంద‌న్న వైద్య‌నిపుణుల హెచ్చిక‌ల నేప‌థ్యంలో, దానిని ఎదుర్కొన‌డానికి త‌గిన ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. జిల్లాలో థ‌ర్డ్‌వేవ్ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని చెప్ప‌లేమని, అయిన‌ప్ప‌టికీ మ‌నమంతా ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ మూడోద‌శ మొద‌లైన ప‌క్షంలో, దానివ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వీలైనంతగా త‌గ్గించాల‌ని సూచించారు. ముఖ్యంగా థ‌ర్డ్ వేవ్ వ‌స్తే, పిల్ల‌లు ఎక్కువ‌గా ప్ర‌భావితుల‌య్యే అవ‌కాశం ఉంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని సిద్దం కావాలని సూచించారు. పిల్ల‌ల వ‌య‌సు, ఆరోగ్యం, వారి మాన‌సిక స్థితిని బ‌ట్టి మ‌న కార్యాచ‌ర‌ణ ఉండాల‌ని అన్నారు. దీనికి అవ‌స‌ర‌మైన అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు, నివార‌ణా చ‌ర్య‌లు, వ్యాధి నిర్ధార‌ణ‌, వ్యాధికి చికిత్స‌, అందుకు అవ‌స‌ర‌మైన నిపుణుల‌కు శిక్ష‌ణ, రిపోర్టింగ్‌ త‌దిత‌ర అంశాల‌వారీగా, పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌న్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా, వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాల‌న్నారు. కోవిడ్ పిల్ల‌ల‌కు రాకుండా ఉండాలంటే, వారి తల్లితండ్రుల‌కు వేగంగా వేక్సినేష‌న్ పూర్తి చేయాల‌న్నారు. కోవిడ్ మొద‌టి ద‌శ‌లో పెద్ద‌లు ఎక్కువ‌గా ప్ర‌భావితుల‌య్యార‌ని, రెండో ద‌శ‌లో వ‌య‌సుతో సంబంధం లేకుండా యుక్త‌వ‌య‌సు వారు కూడా వ్యాధి బారిన ప‌డ్డార‌ని చెప్పారు. ఆయా ద‌శ‌లను అదుపు చేసేందుకు వేర్వేరు ప్ర‌ణాళిక‌లు, చికిత్సా ప‌ద్ద‌తులు, నివార‌ణా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు.  అందువ‌ల్ల‌, మూడోద‌శను ఎదుర్కొనేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లూ, వైద్య నిపుణులు చ‌ర్చించి, స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను సిద్దం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్  ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం జిల్లాలో రెండోద‌శలో కేసుల సంఖ్య రోజురోజుకూ త‌గ్గుతోంద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ మూడోద‌శ‌ను దృష్టిలో పెట్టుకొని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారంలో క‌నీసం రెండుసార్లు జ్వ‌రాల స‌ర్వేను నిర్వ‌హించాల‌ని సూచించారు. ఈ స‌ర్వేలో ప్ర‌ధానంగా పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితిపై దృష్టి పెట్టాల్సి ఉంద‌న్నారు. స‌చివాల‌యాల వారీగా జాబితాల‌ను త‌యారు చేయాల‌ని, ఎక్కువ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసి, వేక్సినేష‌న్‌, కంటైన్‌మెంట్ కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ముఖ్యంగా విద్యాశాఖ‌, స్త్రీశిశు సంక్షేమ‌శాఖ‌లు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, పిల్ల‌ల‌కు, త‌ల్లితండ్రుల‌కు త‌గిన అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు.  

                 జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, థ‌ర్డ్ వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు వ్యాధి సోకితే, త‌ల్లితండ్రులు ఎక్కువ‌ ఆందోళ‌న చెందే అవ‌కాశం ఉంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, పిల్ల‌ల‌కు, త‌ల్లితండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. పిల్ల‌ల వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా చికిత్సా విధానాన్ని కూడా రూపొందించాల్సి ఉంటుంద‌ని సూచించారు.

                  ఈ స‌మావేశంలో ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ప‌లువురు వైద్య నిపుణులు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొని, కోవిడ్‌ మూడోద‌శ‌ను ఎదుర్కొనేందుకు ప‌లు సూచ‌న‌లు చేశారు. 

Vizianagaram

2021-06-07 09:13:11

శ్రీవివేకానంద సంస్థకు గంట్ల విరాళం రూ.75వేలు..

మహా విశాఖ నగరంలోన పలువురు అనాథ, వృద్ధులకు శ్రీ వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల  ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం ఈ మేరకు శ్రీనుబాబు వివేకానంద స్వచ్ఛంద సంస్థకు తన సొంత నిధులు రూ.75 వేల విరాళాన్ని అందజేశారు. ఆ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, ఈ నిధులను అన్నప్రసాదానికి వినియోగించాలని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావును కోరారు. అనంతరం  నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. అంతేకాకుండా  అనాధలు, వృద్ధులు సేవలో కొనసాగుతున్న సంస్థ మహిళా సభ్యులుకు పలు నిత్యావసరాలను కూడా అందజేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తన పరిధిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. గత ఏడాది కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ కూడా దశలవారీగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. పలువురు జర్నలిస్టు మిత్రులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు,
నిరుపేదలకు తన వంతు, సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.. ప్రతియేటా వివేకానంద స్వచ్ఛంద సంస్థకు లక్షకు మించి విరాళం అందజేస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు పాపా హోమ్, ప్రేమ సమాజం మనసు, స్వచ్ఛంద సంస్థలకు కూడా దశల వారీగా తన వంతు సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అప్పారావు సంస్థ సభ్యులు సోంబాబు,ఇతర మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-07 08:45:48