1 ENS Live Breaking News

జాపాలి ఆంజనేయునికి పట్టు వస్త్రాలు..

తిరుమలలోని జాపాలి తీర్థంలో గల శ్రీ ఆంజనేయస్వామివారికి హనుమజ్జయంతి సంద‌ర్భంగా టిటిడి అద‌న‌పు ఈవో  ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు శుక్ర‌వారం ఉద‌యం పట్టు వస్త్రాలు స‌మ‌ర్పించి ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అద‌న‌పు ఈవో మీడియాతో మాట్లాడుతూ ఆకాశ గంగ తీర్థంలో అంజ‌నాదేవి త‌ప‌స్సు చేసి వాయుదేవుని ఆశీర్వ‌దంతో ఆంజ‌నేయ‌స్వామివారికి జ‌న్మ‌నిచ్చింద‌న్నారు. త్రేత‌యుగంలో అంజ‌నాద్రి కొండ‌పై జాపాలి మ‌హ‌ర్షి త‌ప‌స్సు చేసి ఆంజ‌నేయ‌స్వామివారిని ప్ర‌స‌న్నం చేసుకున్నార‌ని తెలిపారు. కావున ఈ క్షేత్రానికి జాపాలి క్షేత్రం అని పేరు వ‌చ్చింద‌ని, ఇక్క‌డ ఉన్న స్వామివారు స్వ‌యంభూ అని వివ‌రించారు. దుష్ట శ‌క్తుల‌ను సంహ‌రించే ఆంజ‌నేయ‌స్వామివారు క‌రోనా మ‌హ‌మ్మ‌రిని నిర్ములించి లోకంలోని ప్ర‌జ‌ల‌కు ఆయురారోగ్యాల‌ను ప్ర‌సాదిస్తార‌న్నారు. అంత‌కుముందు ఆల‌యం వ‌ద్ద‌కు చేరుకున్న టిటిడి అద‌న‌పు ఈవో దంప‌తులకు, సివిఎస్వో  గోపినాధ్ జెట్టి దంప‌తుల‌కు హ‌థీరాంజీ మ‌ఠం మ‌హంతు  అర్జున్‌దాస్ స్వాగ‌తం ప‌లికారు.  కారోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా శ్రీ ఆంజ‌నేయ‌స్వామివారికి అభిషేకం, పూజ కార్య‌క్ర‌మాల‌ను ఏకాంతంత‌గా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా జాపాలి క్షేత్రంలో టిటిడి దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి  పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌ళాకారులు ఉద‌యం 10 నుంచి 11 గంటల వరకు హనుమాన్ చాలీసా ప‌ఠించారు. అనంత‌రం అన్న‌మాచార్య ప్రాజెక్టు సంచాల‌కులు ఆచార్య ద‌క్షిణామూర్తి శ‌ర్మ ఆధ్వ‌ర్యంలో అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ వెంక‌టేశ్వ‌ర్లు భాగ‌వ‌తార్ ఆంజ‌నేయ‌స్వామివారి అవిర్భంపై హ‌రిక‌థ పారాయ‌ణం చేశారు.  ఈ కార్యక్రమాల్లో  శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో  హ‌రీంద్ర‌నాధ్‌, ఒఎస్‌డి  పాల శేషాద్రి, ఆరోగ్యశాఖాధికారి డా.ఆర్.ఆర్.రెడ్డి, ఎస్టేట్ విభాగం డెప్యూటీ ఈవో  విజ‌య సార‌ధి, విజివో  బాలిరెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirumala

2021-06-04 15:26:55

హ‌నుమ‌త్ సేవ.. అష్ట‌సిద్ధుల‌కు త్రోవ..

లోకంలోని మాన‌వులలో ఎవ‌రైతే హ‌నుమంతుడిని సేవిస్తారో వారికి అష్ట‌సిద్ధులు సిద్ధిస్తాయ‌ని ప్ర‌ముఖ పండితులు, జాతీయ సంస్కృత విశ్వ విద్యాల‌యం ఆచార్యులు రాణి స‌దాశివ‌మూర్తి ఉద్ఘాటించారు. తిరుమ‌ల‌లో హ‌నుమ‌జ్జ‌యంతి ఉత్స‌వాల్లో మొద‌టి రోజైన శుక్ర‌వారం నాద‌నీరాజ‌నం వేదిక‌పై  హ‌నుమంతుడు - అష్ట‌సిద్ధులు అనే అంశంపై ప్ర‌వ‌చన‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఉప‌న్య‌సిస్తూ యోగశాస్త్రంలో ప్ర‌సిద్ధి చెందిన ఎనిమిది సిద్ధులు ఉన్నాయ‌ని, అందులో అణిమ, మహిమ, ల‌ఘిమ‌, గ‌రిమ‌, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశ‌త్వం, వ‌శీత్యం ఉన్నాయ‌న్నారు. వెంక‌టాద్రి క్షేత్రంలోని అంజ‌నాద్రి కొండ‌పై జ‌న్మించిన ఆంజ‌నేయ‌స్వామిలో జ‌న్మ‌తః ఈ అష్ట‌సిద్ధులు ఉన్నాయ‌ని, అందువ‌ల‌నే సూర్యుని పండుగా భావించి సూర్య మండ‌లానికి వెళ్లాడ‌ని తెలిపారు. సుంద‌ర‌కాండ‌లో హ‌నుమంతుని ప్ర‌వేశం నుండి యుద్ధ కాండ చివ‌రి వ‌ర‌కు అష్ట‌సిద్ధుల వ‌ల‌న ఆయ‌న లోకానికి అద్భుతాల‌ను చూపించి రామాయ‌ణాన్ని ఒక సుంద‌ర‌ ఇతి హ‌సంగా మ‌ల‌చ‌డానికి కార‌ణం అయ్యార‌న్నారు.   స‌క‌ల దేవ‌తా స్వ‌రూప‌ముగా, రుద్రావ‌తార మూర్తిగా, వాయుదేవుని అంశ‌తో ఉద్భ‌వించిన ఆంజ‌నేయ‌స్వామి లోకాల‌ను అలంరించిన తీరు అద్భుత‌మ‌న్నారు. యోగ శాస్త్రంలో వాయు బంధ‌నం చేసి య‌మ నియ‌మ ఆశ‌నాదుల ద్వారా సాధ‌న చేసిన సాధ‌కుడు అష్ట‌సిద్ధుల‌ను పొంద‌గ‌ల‌ర‌ని చెప్పారు. అన్ని వ్య‌వ‌హ‌రాల్లో సాఫ‌ల్యం సాధించ‌డానికి ఆంజ‌నేయ‌స్వామిని ఉపాస‌న చేయ‌డం వ‌ల‌న అష్ట‌సిద్ధులు పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.   మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహానికి మ‌ధ్యాహ్నం 3 నుండి 3.30 గంట‌ల వ‌ర‌కు టిటిడి పూజా కార్యక్రమాలను నిర్వహించింది.

Tirumala

2021-06-04 15:24:32

స్వచ్ఛంద సంస్థలకు సహకారం అవసరం..

కోవిడ్ పై పోరులో స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యం అత్యంత విలువైనదని  జిల్లా సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. శుక్రవారం  కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సంయుక్త కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ)  దినేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి స్వచ్ఛంద సేవా సంస్థల సమన్వయ కమిటి సమావేశం జరిగింది. సందర్భంగా సంయుక్త కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్ నివారణ కొరకు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ యంత్రాంగం కలిసి ప్రణాళికా బద్ధంగా పని చేసినట్లైతే మంచి ఫలితాలు వస్తాయని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లాస్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కోవిడ్ ను ఎదుర్కొనడానికి చేపడుతున్న చర్యలలో భాగంగా అవసరమైన ప్రాజెక్ట్ నివేదికలను తయారుచేయడానికి, పరికరాలను సమకూర్చుకోవడానికి, మానవ  వనరుల సైన్యాన్ని తయారు చేసుకోవడానికి, వివిధ స్థాయిలలో నిధులను సమకూర్చుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థల నుండి నిష్ణాతులైన వ్యక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లాలోని మారుమూల ప్రాంతాల కు కూడా వెళ్లి  ప్రజల అవసరాల మేరకు సేవలందిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు జిల్లా ప్రభుత్వ యంత్రాంగం నుండి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భాగస్వామ్యాన్ని క్షేత్రస్థాయిలో పటిష్ట పరచడానికి డివిజన్ మరియు మండల స్థాయి, గ్రామ స్థాయిలో కమిటిల ఏర్పాటుకు అవసరమైన ఉత్తర్వులను అధికారులకు త్వరలో జారీ చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లా స్థాయి ప్రభుత్వ సంస్థలు మరియు ఎన్.జి.ఓ కో- ఆర్డినేషన్ కమిటీకి సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన రావు, కన్వీనర్ గా పిల్లల రక్షణ అధికారి విజయ్ కుమార్ సభ్యులుగా నియమిస్తున్నట్లు తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని మనోరంజని వివిధ స్వచ్ఛంద సంస్థ లైన  రెడ్ క్రాస్, డి బి ఆర్ సి, సీడ్స్, వి ఆర్ ఓ, అసిస్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Guntur

2021-06-04 15:22:07

ప్రాధమిక ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పేదల ఆరోగ్య పరిరక్షణకి పెద్ద పీట వేస్తున్నారని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. శుక్రవారం అనకాపల్లి జోన్ లో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలకు ఆమె ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్, ఎంపీ బివి సత్యవతిలతో కలసి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, సీఎం హెల్త్ సెంటర్స్ ద్వారా మెరుగైన ప్రాధమిక ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. వై.ఎస్.ఆర్. ఆరోగ్యశ్రీ పధకం క్రింద అనేక జబ్బులకు ఉచితంగా కార్పోరేట్ వైద్యం అందిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, పాదయాత్రలో ఇచ్చిన హామీలు 90శాతం  నేరవేర్చిన సీఎం వైఎస్ జగన్ మాత్రమేనన్నారు. ఎంపీ మాట్లాడుతూ, అనకాపల్లిలో రెండు ఆసుపత్రులు ఒక్కొక్కటి రూ.80లక్షల వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు.  ఈ రెండు ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని జివిఎంసి ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ జియ్యని శ్రీధర్, కార్పొరేటర్ ఎం. చినతల్లి, 84వ వార్డు వై.సి.పి. ఇంచార్జ్ పలక రవి, పర్యవేక్షక ఇంజినీరు రాజా రావు, కార్యనిర్వాహక ఇంజినీరు మత్స్యరాజు, జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.      

Anakapalle

2021-06-04 15:18:35

ఫిషింగ్ హార్బర్ల కోసం ప్రత్యేక పరిశీలిన..

విజయనగరం జిల్లాలో  ఫిషింగ్ హార్బర్ నిర్మాణం, ఫిష్ ల్యాండ్ లకు అనువైన ప్రదేశాల ఎంపికపై సాధ్యాసాధ్యాలను చెన్నై నుంచి వచ్చిన బ్రుందంతో కలిసి పూసపాటి రేగ మండలంలో పరిశీలించినట్టు మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మండలంలోని చింతపల్లిలో ఆమె బ్రుందంతో కలిసి పర్యటించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ఏడు ప్రాంతాల్లో ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండ్ లను నిర్మించ తలపెట్టిందని, అందులో భాగంగా జిల్లాలో నిర్మించ తలపెట్టిన ఫిషింగ్ హార్బర్ కోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ కి చెందిన నిపుణులతో  అక్కడి ప్రాంతాలను పరిశీలించామన్నారు. అంతేకాకుండా మత్స్యకారుల ద్వారా ఈ ప్రాంతం యొక్క బౌగోళిక పరిస్థితులు, తుఫానులు వచ్చినపుడు సంభవించే పరిస్థితులు, ఇతరత్రా అంశాలను చర్చించి స్వయంగా  బ్రుందంతో కాలిపి పరిశలించామన్నారు. పైగా ఏ ప్రాంతంలో అయితే హార్బర్ కి అనువుగా వుంటుందనే కోణంలో కొన్ని అంశాలపై స్థానిక మత్స్యకారులతో కూడా మాట్లాడినట్టు చెప్పారు. ఓడరేవులకు మార్గాలు, తీరాలకు జాతీయ స్థాయిలో సాంకేతికతకు సంబంధించిన అంశాలు కూడా ప్రత్యేక బ్రుందంతో చర్చించామన్నారు. ఇక్కడి ప్రాంతాల పరిశీలన అనంతరం ఫిష్ ల్యాండ్ కి సంబందిచిన విషయాన్ని ప్రభుత్వానికి చెన్నై బ్రుందం నివేదిక ఇస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ సహాయ సంచాలకులు కిరణ్ కుమార్,  అభివ్రుద్ధి అధికారిణి చాందిని, గ్రామ మత్స్యశాఖ సహాయకులు, మత్సకార మిత్రాలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Pusapatirega

2021-06-04 15:08:53

పన్ను నవీకరణలపై సూచనలివ్వండి..

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని కొత్తగా వేసే పన్నులపై ప్రజాభిప్రాయ సేకరణ, అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తున్నట్టు కమిషనర్ డా.జి.స్రిజన తెలియజేశారు. ఈమేరకు శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ సవరణ చట్టం 1955 ప్రకారము తేది.24.11.2020న జారి చేసిన జి.ఓ.ఎం.ఎస్.నెం.198లోని “ఆస్థి పన్ను విధింపు నియమాలు –2020” ననుసరించి, ఆస్తుల క్రయ విక్రయాలకు రిజిస్ట్రేషన్ & స్టాంప్స్ శాఖ నిర్ణయించిన భవనాలు, వాటి స్థలముల “మూలధన విలువల” ఆధారముగా తేది.01.04.2021 నుండి ఆస్థి పన్ను విధించుటకు నిర్ణయించి, నివాస భవనముల “మూలధన విలువ” మొత్తమునకు 0.15% మరియు నివాసేతర భవనముల “మూలధన విలువ” మొత్తముపై 0.30% ,  ఖాళీ స్థలముల “మూలధన విలువ” మొత్తముపై 0.50% విధించుటకు కార్పోరేషన్ తరపున ప్రతిపాదించామని పేర్కొన్నారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలు,  Email:- revenuegvmc@gmail.com కి మెయిల్ చేయాల్సిందిగా కోరారు. 

GVMC office

2021-06-04 14:10:52

రోజుకి 5వేల కరోనా పరీక్షలు చేయాలి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌తి రోజూ 5వేల క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు ఖ‌చ్చితంగా జ‌ర‌గాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ వైద్యాధికారుల‌ను ఆదేశించారు. ఆయా పి.హెచ్‌.సి.ల‌కు నిర్దేశించిన ల‌క్ష్యం మేర‌కు త‌ప్ప‌నిస‌రిగా టెస్టులు నిర్వ‌హించాల‌న్నారు. వైద్యాధికారుల‌తో క‌లెక్ట‌ర్ శుక్ర‌వారం టెలి కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. వైద్యాధికారులు త‌మ వ‌ద్ద ఉన్న వ్యాక్సిన్ నిల్వ‌ల‌ను పూర్తిస్థాయిలో వినియోగించి చివ‌రి డోసు వ‌ర‌కూ పూర్తిచేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జిల్లాలో 21 వేల డోసుల వ్యాక్సిన్ మిగిలి వుంద‌ని ఈ వ్యాక్సిన్ నిల్వ‌ల‌ను శుక్రవారం సాయంత్రంక‌ల్లా పూర్తిచేయాల‌న్నారు. వ్యాక్సినేష‌న్ పై జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ధి) డా.ఆర్‌.మ‌హేష్ కుమార్‌, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మ‌నాథ్‌, స‌బ్ క‌లెక్ట‌ర్ విధేఖ‌రే, డి.ఎం.హెచ్‌.ఓ. డా.ర‌మ‌ణ‌కుమారి, జిల్లాపరిష‌త్ సి.ఇ.ఓ. వెంక‌టేశ్వ‌ర‌రావుల‌కు ప‌ర్య‌వేక్ష‌ణ బాధ్య‌త‌లు అప్ప‌గించామ‌న్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 72 కోవిడ్ వ్యాక్సినేష‌న్ కేంద్రాల ద్వారా సాయంత్రానికి ప‌దివేల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తిచేశారు.

Vizianagaram

2021-06-04 13:59:45

అప్పన్న ఆదాయం రూ.29.99 లక్షలు..

విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన మూడు హుండీల లెక్కింపులో రూ.29లక్షల 99వేల 975 రూపాయాలు ఆదాయం సమకూరినట్టు ఈఓ ఎంవీసూర్య కళ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో అన్ని నిబంధనలు అమలు చేసి ఆలయ సిబ్బందితోనే పరకామణిలో హుండీ లెక్కింపు చేపట్టి నట్టు చెప్పారు. హుండీలో నగదుతోపాటు 10 కతార్ రియాల్స్, ఒక యుఎస్ డాలర్, రెండు సామ్లు, రెండు గ్రాముల బంగారం కూడా లభించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమం ట్రస్టు సభ్యుల సమక్షంలో ఈఓ పర్యవేక్షణలో నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

Simhachalam

2021-06-04 13:55:35

అప్పన్న భక్తులకు మెరుగైన సౌకర్యాలు..

 శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు అనువంశిక ధర్మకర్త సంచయిత గజపతి పేర్కొన్నారు. శుక్రవారం సింహాచలం కొండ దిగువన, పైన అన్ని సౌకర్యాలతో మెరుగులు దిద్దిన బస్ టికెట్ కౌంటర్ ను ఆమె ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భక్తులకు ఆలయ వాతావరణంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు అన్ని ప్రాంతాలను ఎంతో పరిశుభ్రంగా ఉంచుతున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక క్లీనింగ్ డ్రైవ్ చేపడుతున్నట్టు చెప్పారు. 
అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అన్నదాన సత్రం, ప్రసాదాల కౌంటర్లును కూడా ఆధునీకరించడానికి డిజైన్లను కూడా ఆహ్వానించినట్టు చెప్పారు. త్వరలోనే స్వామివారి ఆలయంలో మరిన్ని అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు సంచయిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎంవీ సూర్యకళ, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు...

Simhachalam

2021-06-04 13:46:05

రూ.28.లక్షల ఆక్సిజన్ మిషన్లు వితరణ..

అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్‌, పేటీఎం ఫౌండేష‌న్ సంయుక్తంగా తూర్పుగోదావ‌రి జిల్లాకు దాదాపు రూ.26 ల‌క్ష‌ల విలువైన 38 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను స‌మ‌కూర్చాయి. ఈ మేర‌కు అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్, పేటీఎం ఫౌండేష‌న్ ప్ర‌తినిధులు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డికి ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను అంద‌జేశారు. కోవిడ్ బాధితులకు అవ‌స‌ర‌మైన ప్రాణ వాయువును అందించే ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్లు స‌మ‌కూర్చిన అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్‌, పేటీఎం ఫౌండేష‌న్‌ల‌కు క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి అభినంద‌న‌లు తెలియ‌జేశారు. కోవిడ్ విప‌త్తు స‌మ‌యంలో బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో త‌మ వంతు స‌హాయంగా కాన్సంట్రేట‌ర్ల‌ను అందించ‌డం గొప్ప విష‌య‌మ‌ని పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో జేసీ (డీ) కీర్తి చేకూరి, డీఆర్‌వో సీహెచ్ స‌త్తిబాబు, అమెరిక‌న్ ఇండియా ఫౌండేష‌న్ ట్ర‌స్ట్ ప్ర‌తినిధి, స్టేట్ ప్రోగ్రాం మేనేజ‌ర్ కృష్ణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 13:38:55

కాకినాడ ఇనోదయ ఆసుపత్రికి కలెక్టర్ షాక్..

కోవిడ్ చికిత్స‌కోసం డా. వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం కింద చేరిన‌ప్ప‌టికీ, నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తూ రోగి నుంచి వ‌సూలు చేసిన రూ.4,50,000 సొమ్మును కాకినాడ‌లోని ఇనోద‌య ఆసుప‌త్రి తిరిగి బాధితునికి చెల్లించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం క‌లెక్ట‌రేట్‌లో క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి, జేసీ (డీ) కీర్తి చేకూరి స‌మ‌క్షంలో బాధితునికి రిఫండ్ చెక్కును అందించింది. ఆరోగ్య‌శ్రీ కింద కోవిడ్ చికిత్స అందించేందుకు ఆసుప‌త్రిలో చేర్చుకున్న‌ప్ప‌టికీ త‌మ నుంచి రూ.4,50,000 మొత్తాన్ని వ‌సూలు చేశారంటూ రోగి మార్ని స‌త్తిరాజు కుమారుడు కాశీవిశ్వ‌నాథం, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర శేఖరరెడ్డితో క‌లిసి క‌లెక్ట‌ర్‌కు ఇటీవ‌ల ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జేసీ (డీ) నేతృత్వంలోని ఆరోగ్య‌శ్రీ జిల్లా క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ విచారించింది. క‌మిటీ నివేదిక మేర‌కు ఇనోదయ ఆసుప‌త్రికి రూ.22,50,000 పెనాల్టీ విధించారు. రోగి నుంచి వ‌సూలు చేసిన మొత్తాన్నితిరిగి ఆయ‌న‌కు చెల్లించాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు తాజాగా బాధితునికి రిఫండ్ చెక్కు అందించారు. ఆసుప‌త్రిలో ప‌నిచేస్తున్న ఆరోగ్య‌మిత్ర‌ను విధుల నుంచి టెర్మినేట్ చేశామ‌ని, ఆసుప‌త్రి నుంచి పెనాల్టీ మొత్తాన్ని వ‌సూలు చేసిన‌ట్లు జేసీ (డీ) తెలిపారు. జిల్లాలో ఆరోగ్య‌శ్రీ కింద చేరిన రోగుల నుంచి డ‌బ్బులు వ‌సూలు చేసినా, వైద్య సేవ‌లు అందించ‌డంలో వివ‌క్ష చూపినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని క‌లెక్ట‌ర్ హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమం లో డా.వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త డా. పి.రాధాకృష్ణ పాల్గొన్నారు.

Kakinada

2021-06-04 13:36:31

పండుగలా జగనన్న కాలనీ నిర్మాణాలు..

గుంటూరుజిల్లాలో నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతున్నాయని  గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. శుక్రవారం పొన్నూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 99.89 ఎకరాల్లో  నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళు నిర్మాణ కార్యక్రమాన్ని పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్యతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన లబ్ధిదారుల బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య అధ్యక్షత వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇంత పెద్దత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం ద్వారా పేదల సొంత ఇంటి కలలను సాకారం చేయబోతున్నామని కలెక్టర్ అన్నారు. ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే పేదలందరికీ తక్కువ ధరలకు నిర్మాణ సామగ్రిని అందజేస్తుందని ప్రకటించారు. ఒకేసారి లబ్ధిదారులంతా పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణం చేపట్టడం ద్వారా పేదలకు నిర్మాణ సామాగ్రి తక్కువ ధరలకు లభించడం, ప్రయాణ ఖర్చులు, కూలీల సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆలోచించి ఈ తరహా ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. 

స్థానిక శాసన సభ్యుల చొరవతో గ్రామీణ ప్రాంతాలు,పట్టణ ప్రాంతాలకు దగ్గరలో మరిన్ని కొత్త కాలనీలు  రూపుదిద్దుకోవడం జరుగుతుందని అన్నారు. అధికారులు దగ్గరుండి మరీ పేదల ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయ్యేలా సహయ,సహకారాలు అందిస్తారని పేర్కొన్నారు. ఇళ్ళ నిర్మాణాల పనుల విషయంలో రాజీ లేకుండా లబ్ధిదారులకు ఇష్టమైన రీతిలో పూర్తిచేసి ఇవ్వాలన్నారు. ఒక్క పొన్నూరు పట్టణంలోనే టిడ్కో బహుళ అంతస్తుల సముదాయాల పక్కన సుమారు 4,544 మంది లబ్ధిదారుల కోసం అన్ని వసతులతో కూడిన లేఅవుట్ ను ఏర్పాటుచేశామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా మొత్తం మీద వారం రోజుల్లో 10 వేల ఇళ్ళ నిర్మాణాల పనులను చేపడతామన్నారు. పేదల ఇళ్ళ నిర్మాణ కార్యక్రమానికి సహకరిస్తున్న అధికారులు, శాసన సభ్యులు, ప్రజా ప్రతినిధులను అభినందిస్తున్నానని అన్నారు. ఈ ఇళ్ళ నిర్మాణ ప్రక్రియను చేపటట్టడం ద్వారా రాష్ట్ర ఆర్ధిక పురోగతిలో బలమైన మార్పులు వస్తాయన్న నమ్మకాన్ని ముఖ్యమంత్రి అందరిలో కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు. టిడ్కో రహదారి పనులకు సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉందని, త్వరలో వాటిని విడుదల చేస్తామని అన్నారు.

పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పేదలు ఇళ్ళ స్థలాల కోసం ఎదురు చూడకుండానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల బతులకుల్లో వెలుగులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఇటువంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పని చేయడం గొప్పవరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో పేదలకు ఈ తరహా సేవలు అందించే ముఖ్యమంత్రిని చూడబోమని అన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి వంటి గొప్పనాయకుడి తనయుడిగా రాష్ట్ర ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారన్నారు. రానున్న తరాలకు సరిపోయే విధంగా నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు కార్యక్రమం రూపొందించారని అన్నారు. నూతన ఇళ్ళ నిర్మాణాల కాలనీల్లో మౌలిక వసతులను సైతం వెంటనే కల్పించడం దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం  చేపట్టలేదని అన్నారు. కోవిడ్ సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఇళ్ళ నిర్మాణాల ద్వారా ఉపాధి పనులు చూపించారని పేర్కొన్నారు.

 ప్రజల చేతుల్లో నిరంతరం డబ్బులు ఉండేలా సంక్షేమ పధకాలను రూపొందించడం ద్వారా ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా ముఖ్యమంత్రి పని చేస్తున్నారని ప్రశంసించారు. నవరత్నాల పథకాల పేరుతో చేపట్టే ప్రతీ కార్యక్రమాన్ని ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి చేపట్టిన పధకాలు అన్నింటిలోనూ నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ళ నిర్మాణాల పధకం తనకు స్వహతగా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య పేర్కొన్నారు.  ఇళ్ళ నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలంటే గృహనిర్మాణ శాఖ అధికారులకు టిడ్కో గృహనిర్మాణాల చెంత గదిని కేటాయించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. అందుకు కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రజల జీవన విధానం మారబోతుందనడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పధకాలే నిదర్శనమని వెల్లడించారు.

సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు,అభివృద్ధి ) పి.ప్రశాంతి మాట్లాడుతూ వారం రోజుల్లో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళ నిర్మాణాల కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్నామని అన్నారు. సుమారు 10వేల ఇంటి నిర్మాణాలు ప్రారంభమయ్యేలా అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి పని చేస్తున్నామని అన్నారు. లబ్ధిదారులకు అవసరమైన నిర్మాణ సామగ్రిని అందుబాటులో ఉంచామన్నారు. ఒకే సారి ఇళ్ళ నిర్మాణ పనులు చేపట్టడం వలన లబ్ధిదారులకు పెద్దఎత్తున ఖర్చు తగ్గుతుందని అన్నారు. నిర్మాణాలు పలు దశల్లో ఉండగానే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. ప్రజలంతా సంతోషంగా సొంత ఇళ్ళను నిర్మించుకోవాలని పిలుపు నిచ్చారు. 

తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు నిర్మాణాల కార్యక్రమం పూర్తి చేసేందుకు తమవంతు కృషి చేస్తున్నామని అన్నారు. డివిజన్ లో అధిక సంఖ్యలో పేదలకు ప్రభుత్వం లక్షల విలువ చేసే ఇళ్ళ స్థలాలను ఉచితంగా అందివ్వడం గొప్ప విషయమన్నారు. తొలిదశలో తెనాలి డివిజన్ లో విడుదల చేసిన 3వేల ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేయిస్తామన్నారు. పొన్నూరు వంటి ప్రాంతాల్లో టిడ్కో ఇళ్ళతో పాటుగా పేదలకు ఆదునిక తరహాలో ఇళ్ళనిర్మాణాలు పూర్తిచేసి  మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.

గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ వేణుగోపాలరావు మాట్లాడుతూ నవరత్నాలు- నిరుపేదలకు ఇళ్ళు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర కార్యక్రమం చేపట్టిందని అన్నారు. జిల్లాలోని ఇల్లులేని పేదప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సొంత ఇంటి కలలను సాకారం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఇళ్ళ నిర్మాణ కార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేసేందుకు తమశక్తి వంచన లేకుండా పనిచేసి మంచిపేరు తెచ్చుకుంటామని పేర్కొన్నారు.

శిక్షణా కలెక్టర్ శుభం బన్సాల్ మాట్లాడుతూ పేద ప్రజలకోసం గృహ నిర్మాణ పధకం అందుబాటులోకి రావడం ప్రశంసనీయమన్నారు. ఇందుకోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పధకాల సేవలను కొనియాడారు. ప్రభుత్వ పధకాలు సమర్ధంతంగా పేదలకు వచ్చేలా చూడటంలో తనవంతు పాత్రను పోషిస్తామని వెల్లడించారు. అనంతరం సుజాత అనే మహిళా  లబ్ధిదారురాలి గృహ నిర్మాణానికి కలెక్టర్ వివేక్ యాదవ్, పొన్నూరు శాసన సభ్యులు కిలారి వెంకట రోశయ్య, సంయుక్త కలెక్టర్ ప్రశాంతి, తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, ట్రైనీ కలెక్టర్ శుభం బన్సాల్ లు కొబ్బరి కాయలు కొట్టి, నవ ధాన్యాలు చల్లి, శంఖుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో నవరత్నాలు- నిరుపేదలకు ఇల్లు నిర్మాణ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ రూత్ రాణి, తహాశీల్ధార్ పద్మనాభుడు, ఎం.పి.డి.వొ అత్తోట దీప్తి, గృహనిర్మాణ, విద్యుత్తు, రెవెన్యూ, ఎపి ఫైబర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.      

Ponnuru

2021-06-04 13:13:56

కరోనా పరీక్షలు మరింతగా పెంచండి..

విశాఖజిల్లాలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ వైద్యాధికారులతో కలక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లాలో టెస్టింగ్ నిర్వహణ, టెస్టుల రిపోర్టులు, వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్స్ అందించడం, ఆక్సిజన్ సిలిండర్లు మొదలగు అంశాలపై సమీక్షించారు జిల్లాలో కోవిడ్ పరీక్షలు విస్తృతంగా నిర్వహించాలని పాజిటివ్ లను గుర్తించి వారికి అవసరమైన చికిత్సలు అందించడం ఖచ్చితంగా జరగాలన్నారు.

కోవిడ్-19 అరికట్టడానికి గానూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం  అందరూ తప్పక పాటించాలన్నారు. ఈ విషయాలపై విస్తృతంగా ప్రచారం గావించాలన్నారు. ఐసోలేషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కిట్స్ అందించాలని, ఇది సమస్య కారాదన్నారు. ఏజెన్సీలో పరీక్షల నిర్వహణ లాబ్ కి పంపి రిజల్ట్ తెలపడంలో ఆలస్యం జరుగుతోందని దీన్ని నివారించాలన్నారు. ఇందుకుగాను మధ్యాహ్నం వరకు టెస్టింగ్ చేసి వాటిని పాడేరు, అరకు మండల కేంద్రాల నుండి రెండు వాహనాల్లో సేకరణ చేసి తీసుకురావడానికి తగు చర్యలు చేపట్టాలన్నారు. దీనివల్ల టెస్ట్ శాంపిల్స్ కలెక్ట్ చేసిన పిదప రిజల్ట్ ఆలస్యము నివారించవచ్చన్నారు.  జిల్లా వ్యాప్తంగా రేపటి నుండి రోజుకు పది వేల పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
  కోవిడ్ పరీక్షల నిర్వహణ రిజల్ట్ వెల్లడిలో సూక్ష్మ స్థాయిలో సమస్యలు గుర్తించి పరిష్కరించాలన్నారు. 104 కాల్ సెంటర్ ను కోవిడ్ లక్షణాలు ఉన్నవారు సంప్రదించి సహకారం పొందాలన్నారు.

వ్యాక్సినేషన్ : జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం గావించాలన్నారు. ఏవైనా సంస్థలు ప్రైవేటు ఆసుపత్రులలో వారి సిబ్బందికి పరీక్షలు చేయించుకుంటామని ముందుకు వస్తే అనుమతించాలన్నారు. ఈ విషయంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి తగు చర్యలు తీసుకోవాలన్నారు కోవిడ్ వర్కర్స్, స్టాఫ్ నర్సులు, పారామెడికల్ వైద్య సిబ్బంది జీతాల బిల్లును సత్వరమే తయారు చేసి సబ్మిట్ చేయాలని ఆదేశించారు

కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు పేరిట రూ.10 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్ చేయడానికి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపై చర్చించారు. పాడేరు జిల్లా ఆసుపత్రికి; అరకు ఏరియా ఆసుపత్రి మరియు సి.హెచ్.సి చింతపల్లికి ఆక్సిజన్ సిలిండర్లు పంపాలన్నారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.వి.సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  డాక్టర్ సూర్యనారాయణ, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసరు జీవన్ రాణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ రామలింగరాజు, డాక్టర్ మురళీ మోహన్, డాక్టర్ వసుంధర తదితరులు హాజరయ్యారు.

విశాఖ కలెక్టరేట్

2021-06-04 12:54:43

ఆదివారం మాంసం అమ్మకాలు నిషేధం..

కరోనా వైరస్ కేసులు అధికంగా నమోదవుతున్న ద్రుష్ట్యా  మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఆదివారం(జూన్ 6న) మాంసం, చేపలు, రొయ్యలు  అమ్మకాలు నిషేధ ప్రక్రియ కొనసాగుతుందని  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ప్రకటించారు. అధికంగా మాంసం దుకాణాల దగ్గర జనం అత్యధికంగా గుమిగూడుతున్నట్టు తమ ద్రుష్టికి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.  కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం  కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు చెప్పారు. ఇకపై కర్ఫ్యూ సమయంలో ఎవరు బయట తిరిగినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టిలో ఉంచుకొని, కోరనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కమిషనర్ వివరించారు.

GVMC office

2021-06-04 12:40:43

అక్రమ కట్టడాలకు సహకరిస్తే చర్యలు..

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని అక్రమ నిర్మాణాలు కనిపిస్తే ఉపేక్షించేది లేదని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పట్టణ ప్రణాళికా అధికారులను హెచ్చరించారు. శుక్రవారం ఆమె చీఫ్ సిటీ ప్లాన్నర్ విద్యుల్లత, సిటీ ప్లానర్లు, ఎ.సి.పి., డి.సి.పి., టి.పి.ఒ. లు మరియు వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా నగరంలో అనధికార నిర్మాణాలపై దృష్టి పెట్టాలని ఎటువంటి ఒత్తిళ్లకు లోను కావద్దని, వార్డు ప్లానింగు కార్యదర్శులను ఆదేశించారు. మీ మాట వినని యడల,  పై అధికారుల దృష్టికి తీసుకురావాలని చాలా వరకు స్లాబ్ లెవెల్స్ వచ్చిన తరువాత గుర్తించి వాటిపై చర్యలు తీసుకునే బదులు గ్రౌండ్ లెవల్స్ లోనే గుర్తించి వాటిని ఆపాలని ఆదేశించారు. వార్డు ప్లానింగ్ కార్యదర్శులు రూల్ పొజిషన్ తెలుసుకోవాలని, ప్లాన్ ఇచ్చేముందు అన్ని డాక్యుమెంట్స్ సక్రమంగా ఉంటేనే ప్లాన్ ఇచ్చేందుకు ముందుకు వెళ్ళాలని సూచించారు. గతంలో ప్లానింగు అధికారులు చాలా తక్కువుగా ఉండేవారని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యార్ధం ప్రతీ సచివాలయానికి ఒక ప్లానింగు కార్యదర్శిని నియమించిందని మీ పరిధిలో ప్రతీ రోజు తిరిగినట్లయితే అనధికార కట్టడాలు ఉండవన్నారు. జివిఎంసి పరిధిలో 570 మంది ప్లానింగు కార్యదర్శులు ఉన్నారని, వారంతా నిబద్దతతో పని చేయాలని కమిషనర్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాలలో అక్రమ కట్టడాలు, దుకాణాలు, బడ్డీలు కనిపిస్తే మొదటిగా వార్డు ప్లానింగు కార్యదర్శిలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కమిషనర్ హెచ్చరించారు. కొన్ని కూడళ్ళలో హాకర్సు జోన్లు ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా దుకాణాలన్ని ఒకే దగ్గర ఉండే విధంగా యు.సి.డి విభాగంతో కలసి పనిచేయాలని వారికి ఐ.డి. కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. పట్టణ ప్రణాళికా అధికారులు ప్రతి రోజు వార్డులలో పర్యటించాలని కమిషనర్ ఆదేశించారు. నగరంలో హోర్డింగ్స్, బ్యానర్లు ఎక్కువగా దర్శనం ఇస్తున్నాయని, వాటిని నిర్మూలించాలని అధికారులను ఆదేశించారు. గతంలో సరిగా పని చేయని 12 మంది అధికారులను ప్రభుత్వానికి సరండర్ చేసానని, అయినా మీలో ఎటువంటి మార్పు రాలేదని టౌన్ ప్లానింగు అధికారులను హెచ్చరించారు. ప్రతి రోజు స్పందనలోను, సోషల్ మీడియాలోను, వాట్స్ యాప్ లోను, న్యూస్ పేపర్ క్లిప్పింగ్సు లోను యాడ్వర్స్ న్యూస్ కనిపిస్తే వాటిపై 24గంటలలో చర్యలు తీసుకోవాలని, రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. గృహ నిర్మాణ వ్యర్ధాలను రోడ్డు ప్రక్కన డంపింగు చేస్తున్నారని, వాటిని గుర్తించాలని, భవనములు నిర్మించుటకు వాడే ఇసుక, పిక్క, బ్రిక్స్ లాంటివి రోడ్డుపై వేసి రోడ్లను బ్లాక్ చేస్తున్నారని వారిపై తగు చర్యలు తీసుకొని జరిమానా విధించాలని ఆదేశించారు. 
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చీఫ్ సిటీ ప్లాన్నర్ విద్యుల్లత తో పాటు సిటీ ప్లానర్లు, ఎ.సి.పి.లు, డి.సి.పి., టి.పి.ఒ.లు, వార్డు సచివాలయ ప్లానింగు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.        

GVMC office

2021-06-04 12:35:25