1 ENS Live Breaking News

10వేల కోవిడ్ టెస్టులు చేయండి..

విశాఖ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం గావించాలని జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరు తన ఛాంబరులో వైద్యాధికారులతో వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్స్, కోవిడ్ కేసులు, అసుపత్రులలో ఆరోగ్యశ్రీ అమలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ రోజుకు 10 వేల కోవిడ్ పరీక్షల నిర్వహణను ప్రణాళికబద్దంగా, యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. ఈ విషయంపై వైద్యాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు జారీ చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డా.సూర్యనారాయణను ఆదేశించారు. టెస్ట్ లు నిర్వహించిన తదుపరి  శాంపిల్స్ ల్యాబ్ కు 24 గంటలలోగా  చేరాలన్నారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదన్నారు. పాజిటివ్ కేసులు 20 శాతం మించి వస్తున్న మండలాలను గుర్తించాలన్నారు. జిల్లాలోని ప్రవేటు ఆసుపత్రులలో  కోవిడ్ కేసుల సంఖ్యపై  వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు.  ఆరోగ్యశ్రీ నిబంధనలు పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హోమ్ ఐసోలేషన్ కిట్స్ పరిస్థితిపై చర్చించారు.  కోవిడ్ వలన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ. 1లక్ష చొప్పున జిల్లాలో 13 మంది పిల్లలకు వారి ఖాతాలో జమ గావించాలని అధికారులను ఆదేశించారు. 
ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టరు - 2 పి.అరుణ్ బాబు, ఎ.ఎమ్.సి ప్రిన్సిపాల్ డా.సుధాకర్, జిల్లా వైద్యా ఆరోగ్యశాఖాధికారి డా.సూర్యనారాయణ, ఎల్.డి.ఎమ్ తదితరులు పాల్గొన్నారు.

Collector Office

2021-06-07 13:23:12

సంక్షేమ పథకాలు ప్రజలకి అందించే బాధ్యత సర్పంచులదే..

గ్రామ స్వ‌రాజ్యం సాకారం ల‌క్ష్యంగా సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో ప్ర‌భుత్వం అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్రమాలు విజ‌య‌వంతంగా అమ‌ల‌య్యేలా కృషిచేస్తూ, గ్రామాల సంపూర్ణ అభివృద్ధికి స‌ర్పంచ్‌లు, అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం కాకినాడ ర‌మ‌ణ‌య్య‌పేట‌లోని ఎంపీడీవో కార్యాల‌యంలో కాకినాడ గ్రామీణ మండ‌ల ప్ర‌జాప‌రిష‌త్ స‌మీక్షా సమావేశం జ‌రిగింది. కొత్త‌గా ఎన్నికైన గ్రామ స‌ర్పంచ్‌లు, ఆయా గ్రామాల పంచాయ‌తీకార్య‌ద‌ర్శులు పాల్గొన్న ఈ స‌మావేశానికి మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ప్ర‌తి గ్రామ స‌ర్పంచ్‌తో మాట్లాడి ఆయా గ్రామాల స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధిత అధికారుల‌కు ఆదేశాలిచ్చారు. చేప‌ట్టాల్సిన అభివృద్ధి ప‌నుల వివ‌రాల‌తో నివేదిక‌లు స‌మ‌ర్పించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇటీవ‌ల గ్రామ ప్ర‌థ‌మ పౌరులుగా ఎన్నికైన స‌ర్పంచ్‌లకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాన‌ని, ప్ర‌జ‌ల‌కు సేవ చేసే విష‌యంలో పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో ప‌నిచేయాల‌ని సూచించారు. వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ల ప‌నితీరుపై పూర్తి అవగాహ‌న ఏర్ప‌ర‌చుకోవాలన్నారు. నేరుగా న‌గ‌దును జ‌మజేసే దాదాపు 22 ప‌థ‌కాల‌కు ల‌బ్ధిదారుల‌ను ఎంపిక చేసే విష‌యంలో పూర్తి అప్ర‌మ‌త్త‌త అవ‌స‌ర‌మ‌ని సూచించారు. గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వైఎస్సార్ ఆరోగ్య కేంద్రాలు, బ‌ల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాల శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తయ్యేలా చూడాల‌ని.. నిర్మాణాలు ప్రారంభం కానివాటి విష‌యంలో కార‌ణాల‌ను గుర్తించి, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషిచేయాల‌న్నారు. ఏ స‌హాయం కావాల‌న్నా తాను 24 గం. అందుబాటులో ఉంటాన‌ని మంత్రి వెల్ల‌డించారు. 

*ప్ర‌తి అర్హునికీ ప‌థ‌కాలు అందాల్సిందే:*
ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు కుల‌, మ‌త, రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తి అర్హునికి అందేలా చూడాల‌ని, ల‌బ్ధిదారుని ఎంపిక‌కు అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక అని మంత్రి స్ప‌ష్టం చేశారు. పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, డ్రెయిన్ల శుద్ధి, ర‌హ‌దారులు త‌దిత‌రాల్లో పోటీత‌త్వంతో ప‌నిచేసి ప్ర‌తి గ్రామం నెం.1గా నిలిచేందుకు కృషిచేయాల‌ని త‌ద్వారా నియోజ‌క‌వ‌ర్గాన్ని ముందు వ‌రుస‌లో నిల‌పాల‌ని సూచించారు. ఉత్త‌మ ప్ర‌తిభ  క‌న‌బ‌ర‌చిన సర్పంచ్‌లు, అధికారుల‌ను స‌త్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. నాడు-నేడు రెండోద‌శ‌కు సంబంధించిన పాఠ‌శాల‌ల‌ను గుర్తించి, నివేదిక ఇవ్వాల‌న్నారు. తూరంగి నీటి స‌మ‌స్య‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. మండ‌ల‌, గ్రామ వ్య‌వ‌సాయ స‌ల‌హా మండ‌ళ్ల ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిచేయాల‌న్నారు. ప్ర‌స్తుతం కోవిడ్ విప‌త్తు నేప‌థ్యంలో మ‌న‌ల్ని మ‌నం ప‌రిర‌క్షించుకుంటూ ప్ర‌జ‌ల్ని కాపాడాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని, అంద‌రికీ వీలైనంత త్వ‌ర‌గా టీకా అందించాల‌నేది ముఖ్య‌మంత్రి ఆశ‌య‌మ‌ని పేర్కొన్నారు. ఈ దిశ‌గా ప్ర‌భుత్వం కృషిచేస్తోంద‌న్నారు. స‌మావేశం అనంత‌రం మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి రెండేళ్లు అయిన సంద‌ర్భంగా మంత్రిని ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు స‌త్క‌రించారు. అదే విధంగా కొత్త‌గా ఎన్నికైన స‌ర్పంచ్‌ల‌ను మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు శాలువాల‌తో స‌త్క‌రించారు. స‌మావేశంలో ఏఎంసీ ఛైర్మ‌న్ గీసాల శ్రీను, ఎంపీడీవో పి.నారాయ‌ణ‌మూర్తి, త‌హ‌సీల్దార్ వి.ముర‌ళీకృష్ణ‌, ప్ర‌త్యేక అధికారి ప‌ద్మ‌శ్రీ, గ్రామాల స‌ర్పంచ్‌లు, పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు పాల్గొన్నారు.

Kakinada

2021-06-07 11:17:44

విధినిర్వహణలో అందించిన సేవలే గుర్తుండిపోతాయ్..

ఉద్యోగ జీవితం ప‌రంగా విధుల నిర్వ‌హ‌ణ ఎంత ముఖ్య‌మో వ్య‌క్తిగ‌త జీవితం ప‌రంగా ఉద్యోగులు త‌మ‌తో పాటు వారి కుటుంబాల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ కూడా అంతే ముఖ్య‌మ‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, స‌హ‌కార‌, మార్కెటింగ్‌, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. కోవిడ్ బారిన‌ప‌డి ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ గ‌త నెల 26న మ‌ర‌ణించిన తాళ్ల‌రేవు మండ‌ల వ్య‌వ‌సాయ అధికారి (ఏవో) ఎ.సిరి సంతాప స‌భ సోమ‌వారం కాకినాడ‌లోని కృషిభ‌వ‌న్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు సిరి చిత్ర‌ప‌టానికి పూల మాల‌లు వేసి ఘ‌న నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప‌నిప‌ట్ల అంకిత‌భావం, రైతుల స‌మ‌స్య‌ల‌పై త‌క్ష‌ణం స్పందించి, ప‌రిష్కారానికి కృషిచేసే మంచి మ‌న‌స్త‌త్వం ఉన్న వ్య‌వ‌సాయ అధికారి సిరి కోవిడ్ బారిన‌ప‌డి మ‌ర‌ణించ‌డం తీవ్ర బాధాక‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలా అండ‌గా ఉంటామ‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా అందాల్సిన స‌హాయం వెంట‌నే అందేలా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి వ్య‌వ‌సాయ రంగానికి అత్యంత ప్రాధాన్య‌మిస్తున్నార‌ని, ప్ర‌భుత్వ ఆశ‌యాల‌కు అనుగుణంగా ప‌నిచేస్తూ వ్య‌వ‌సాయ అధికారులు మంచి ఫ‌లితాలు సాధిస్తున్నార‌ని.. అయితే విధి నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో కోవిడ్ జాగ్ర‌త్త‌లు పాటిస్తూ చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి సూచించారు. తొలివేవ్‌తో పోల్చితే రెండో వేవ్‌లో ప్ర‌తి కుటుంబంపైనా ఏదో ఒక రూపంలో కోవిడ్ ప్రతికూల ప్ర‌భావం చూపింద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల కాలంలో కోవిడ్ కార‌ణంగా రాష్ట్రంలో ఎనిమిది మంది వ్య‌వ‌సాయ అధికారుల‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని, వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. బాధిత కుటుంబాల‌ను ప్ర‌భుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంద‌ని వెల్ల‌డించారు. నిత్యం రైతుల‌తో మ‌మేక‌మ‌వుతూ క్షేత్ర‌స్థాయిలో విధులు నిర్వ‌హిస్తున్న త‌మ‌ను ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లుగా గుర్తించి, అంద‌రికీ వ్యాక్సిన్ వేయాల‌ని వ్య‌వ‌సాయ అధికారులు చేసిన విజ్ఞ‌ప్తిని ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తామ‌ని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు వెల్ల‌డించారు. కార్య‌క్ర‌మంలో జిల్లా వ్య‌వ‌సాయ శాఖ జేడీ ఎన్‌.విజ‌య్‌కుమార్‌, ఏపీ వ్య‌వ‌సాయ అధికారుల అసోసియేష‌న్ జిల్లా యూనిట్ ప్రెసిడెంట్ డీవీ కృష్ణ‌, కార్య‌ద‌ర్శి డి.అరుణ్‌, వైస్ ప్రెసిడెంట్ దుర్గ‌, వ్య‌వ‌సాయ శాఖ డీడీలు మాధ‌వ‌రావు, నాగాచారి, ఇత‌ర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Kakinada

2021-06-07 10:42:09

మూడోద‌శ ముప్పుని కలికట్టుగా త‌ప్పిద్దాం..

విజయనగరం జిల్లాలో మూడోద‌శ ముప్పు త‌ప్పించేందుకు సిద్దంగా ఉండాల‌ని  జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం. హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ మేర‌కు త‌గిన కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను త‌యారుచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. థ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు గానూ ముంద‌స్తుగా టాస్క్‌ఫోర్స్ క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో సోమ‌వారం జ‌రిగింది.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్ మాట్లాడుతూ, థ‌ర్డ్‌వేవ్ వ‌స్తుంద‌న్న వైద్య‌నిపుణుల హెచ్చిక‌ల నేప‌థ్యంలో, దానిని ఎదుర్కొన‌డానికి త‌గిన ప్ర‌ణాళిక‌ను రూపొందించాల‌ని ఆదేశించారు. జిల్లాలో థ‌ర్డ్‌వేవ్ ఖ‌చ్చితంగా వ‌స్తుంద‌ని చెప్ప‌లేమని, అయిన‌ప్ప‌టికీ మ‌నమంతా ఎంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ మూడోద‌శ మొద‌లైన ప‌క్షంలో, దానివ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌ను వీలైనంతగా త‌గ్గించాల‌ని సూచించారు. ముఖ్యంగా థ‌ర్డ్ వేవ్ వ‌స్తే, పిల్ల‌లు ఎక్కువ‌గా ప్ర‌భావితుల‌య్యే అవ‌కాశం ఉంద‌ని, దీనిని దృష్టిలో పెట్టుకొని సిద్దం కావాలని సూచించారు. పిల్ల‌ల వ‌య‌సు, ఆరోగ్యం, వారి మాన‌సిక స్థితిని బ‌ట్టి మ‌న కార్యాచ‌ర‌ణ ఉండాల‌ని అన్నారు. దీనికి అవ‌స‌ర‌మైన అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాలు, నివార‌ణా చ‌ర్య‌లు, వ్యాధి నిర్ధార‌ణ‌, వ్యాధికి చికిత్స‌, అందుకు అవ‌స‌ర‌మైన నిపుణుల‌కు శిక్ష‌ణ, రిపోర్టింగ్‌ త‌దిత‌ర అంశాల‌వారీగా, పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకొని ప్ర‌ణాళిక‌లు రూపొందించాల‌న్నారు. అదేవిధంగా ప్ర‌భుత్వ నియ‌మ‌నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా, వేక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగ‌వంతం చేయాల‌న్నారు. కోవిడ్ పిల్ల‌ల‌కు రాకుండా ఉండాలంటే, వారి తల్లితండ్రుల‌కు వేగంగా వేక్సినేష‌న్ పూర్తి చేయాల‌న్నారు. కోవిడ్ మొద‌టి ద‌శ‌లో పెద్ద‌లు ఎక్కువ‌గా ప్ర‌భావితుల‌య్యార‌ని, రెండో ద‌శ‌లో వ‌య‌సుతో సంబంధం లేకుండా యుక్త‌వ‌య‌సు వారు కూడా వ్యాధి బారిన ప‌డ్డార‌ని చెప్పారు. ఆయా ద‌శ‌లను అదుపు చేసేందుకు వేర్వేరు ప్ర‌ణాళిక‌లు, చికిత్సా ప‌ద్ద‌తులు, నివార‌ణా చ‌ర్య‌ల‌ను తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని చెప్పారు.  అందువ‌ల్ల‌, మూడోద‌శను ఎదుర్కొనేందుకు అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లూ, వైద్య నిపుణులు చ‌ర్చించి, స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను సిద్దం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జాయింట్ క‌లెక్ట‌ర్‌(అభివృద్ది) డాక్ట‌ర్  ఆర్‌.మ‌హేష్ కుమార్ మాట్లాడుతూ, ప్ర‌స్తుతం జిల్లాలో రెండోద‌శలో కేసుల సంఖ్య రోజురోజుకూ త‌గ్గుతోంద‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ మూడోద‌శ‌ను దృష్టిలో పెట్టుకొని, అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, వారంలో క‌నీసం రెండుసార్లు జ్వ‌రాల స‌ర్వేను నిర్వ‌హించాల‌ని సూచించారు. ఈ స‌ర్వేలో ప్ర‌ధానంగా పిల్ల‌ల ఆరోగ్య ప‌రిస్థితిపై దృష్టి పెట్టాల్సి ఉంద‌న్నారు. స‌చివాల‌యాల వారీగా జాబితాల‌ను త‌యారు చేయాల‌ని, ఎక్కువ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసి, వేక్సినేష‌న్‌, కంటైన్‌మెంట్ కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ముఖ్యంగా విద్యాశాఖ‌, స్త్రీశిశు సంక్షేమ‌శాఖ‌లు క్రియాశీల పాత్ర పోషించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, పిల్ల‌ల‌కు, త‌ల్లితండ్రుల‌కు త‌గిన అవ‌గాహ‌నా కార్య‌క్ర‌మాల‌ను రూపొందించాల‌ని ఆదేశించారు.  

                 జాయింట్ క‌లెక్ట‌ర్‌(ఆస‌రా) జె.వెంక‌ట‌రావు మాట్లాడుతూ, థ‌ర్డ్ వేవ్ వ‌ల్ల పిల్ల‌ల‌కు వ్యాధి సోకితే, త‌ల్లితండ్రులు ఎక్కువ‌ ఆందోళ‌న చెందే అవ‌కాశం ఉంద‌న్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, పిల్ల‌ల‌కు, త‌ల్లితండ్రుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. పిల్ల‌ల వ‌య‌సుకు త‌గ్గ‌ట్టుగా చికిత్సా విధానాన్ని కూడా రూపొందించాల్సి ఉంటుంద‌ని సూచించారు.

                  ఈ స‌మావేశంలో ఐటిడిఏ పిఓ ఆర్‌.కూర్మ‌నాధ్‌, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, డిఎంఅండ్‌హెచ్ఓ డాక్ట‌ర్ ఎస్‌వి ర‌మ‌ణ‌కుమారి, డిసిహెచ్ఎస్ డాక్ట‌ర్ జి.నాగ‌భూష‌ణ‌రావు, ప‌లువురు వైద్య నిపుణులు, వివిధ శాఖ‌ల అధికారులు పాల్గొని, కోవిడ్‌ మూడోద‌శ‌ను ఎదుర్కొనేందుకు ప‌లు సూచ‌న‌లు చేశారు. 

Vizianagaram

2021-06-07 09:13:11

శ్రీవివేకానంద సంస్థకు గంట్ల విరాళం రూ.75వేలు..

మహా విశాఖ నగరంలోన పలువురు అనాథ, వృద్ధులకు శ్రీ వివేకానంద స్వచ్చంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు,జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ ల  ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. సోమవారం ఈ మేరకు శ్రీనుబాబు వివేకానంద స్వచ్ఛంద సంస్థకు తన సొంత నిధులు రూ.75 వేల విరాళాన్ని అందజేశారు. ఆ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, ఈ నిధులను అన్నప్రసాదానికి వినియోగించాలని సంస్థ అధ్యక్షుడు సూరాడ అప్పారావును కోరారు. అనంతరం  నిరుపేదలకు అన్నదానం, వస్త్రదానం నిర్వహించారు. అంతేకాకుండా  అనాధలు, వృద్ధులు సేవలో కొనసాగుతున్న సంస్థ మహిళా సభ్యులుకు పలు నిత్యావసరాలను కూడా అందజేశారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో తన పరిధిలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. గత ఏడాది కరోనా ప్రారంభం నుంచి నేటి వరకూ కూడా దశలవారీగా తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. పలువురు జర్నలిస్టు మిత్రులతో పాటు, స్వచ్ఛంద సంస్థలు,
నిరుపేదలకు తన వంతు, సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.. ప్రతియేటా వివేకానంద స్వచ్ఛంద సంస్థకు లక్షకు మించి విరాళం అందజేస్తున్నట్టు చెప్పారు. వీటితో పాటు పాపా హోమ్, ప్రేమ సమాజం మనసు, స్వచ్ఛంద సంస్థలకు కూడా దశల వారీగా తన వంతు సహాయం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు అప్పారావు సంస్థ సభ్యులు సోంబాబు,ఇతర మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.

Visakhapatnam

2021-06-07 08:45:48

15నుంచి డెల్టాభూములకు సాగునీరు..

గోదావరి తూర్పు, పశ్చిమ డెల్టాల ఆయకట్టులకు జూన్ 15వ తేదీ నుంచి సాగునీరు విడుదల చేస్తామని, ఈ లోగా సాధ్యమైనన్ని క్లోజర్ వర్క్స్  పూర్తి చేసేందుకు పనులు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. మంత్రి కన్నబాబు తమ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత నెల 27వ తేదీన  ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ రాష్ట్ర, జిల్లా అధికారులతో  తాను, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి సంయుక్తంగా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి గోదావరి కాల్వలకు నీటి విడుదల, త్రాగునీటి ఎద్దడి నివారణ అంశాలపై సమీక్షించామన్నారు.  సమావేశంలో గోదావరి డెల్టాలకు జూన్ 15 నుండి ఖరీఫ్ పంటలకు నీరు విడుదలకు నిర్ణయించామని తెలిపారు. గత నవంబరు నెలలో వచ్చిన నివర్ తుఫాను కారణంగా రెండు జిల్లాల్లో రైతులు పంటలు వేసుకోవడం ఆలస్యమైందని, అందువల్ల దాదాపు ఏప్రియల్ నెలాఖరు దాకా కాల్వలకు నీరు ఇవ్వవలసి వచ్చిందన్నారు. రైతుల పంటలకు నీటి ఎద్దడి రాకుండా కాపాడేందుకు ముఖ్యమంత్రి సీలేరు జలాలను పంటల అవసరాల కొరకు విడుదలకు ఆదేశించారన్నారు.  అలాగే వేగంగా జరుగుతున్న  పోలవరం కాపర్ డామ్ పనుల దృష్ట్టా  అనుకున్న దాని కంటే అదనంగా  కొద్ది రోజులు  కాలువలకు నీటి విడుదల ఆలస్యమైందన్నారు.  కాల్వల మూసివేత కాలం తక్కవ కావడం, ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ రెండవ వేవ్ పరిస్థితుల కారణంగా మంజూరు చేసిన క్లోజర్ నిర్వహణ, అభివృద్ది పనులు ఆశించిన స్థాయిలో సాధ్యం కాలేదని, ముఖ్యమైన, అత్యవసరమైన పనులను ఈ నెల 15న కాలువలు తెరిచే లోపు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఇరిగేషన్ అధికారులను ఆదేశించామన్నారు.  మిగిలి పోయిన పనులన్నిటినీ వచ్చే ఏడాది ప్రాధాన్యతగా చేపట్టి నూరు శాతం పూర్తి చేస్తామని తెలిపారు.  కాలువలు తెరిచే లోపు రెండు జిల్లాల త్రాగునీటి అవసరాలపై సమీక్షలో తూర్పు గోదావరి జిల్లాలో క్లోజర్ కు ముందు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి స్థాయిలో నింపినందున త్రాగునీటికి ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ తెలిపారని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే ఆ ఆవాసాల ప్రజలకు రవాణా ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలని సూచించామన్నారు. కాలువలు తెరిచిన వెంటనే ఖరీఫ్ పంటలు చేపట్టేలా వ్యవసాయ శాఖ ద్వారా రైతులను సమాయత్తం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. 

Kakinada

2021-06-07 01:46:37

నరకం చూపిస్తున్న మొబైల్ నెట్వర్కులు..

కరోనా వైరస్ కంటే దారుణంగా మొబైల్ సెల్ నెట్వర్క్ లు వినియోగదారులను దారుణంగా పీడించేస్తున్నాయి. సమయానికి రీచార్జ్ చేయకపోతే ఇన్కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్ కట్ కట్ చేసే మొబైల్ నెట్వర్క్ కంపెనీలు తీసుకున్న మొత్తానికి నాణ్యమైన వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ ఇవ్వడం లేదు. పోనీ కస్టమర్ కేర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దామన్నా కరోనా వైరస్ కారణంగా కష్టమర్ సర్వీసులన్నీ ఆన్ లైన్ లోనేనని చెప్పి తప్పించుకుంటున్నాయి సెల్ నెట్వర్క కంపెనీలు. అతి తక్కువ నెట్వర్క్ సిగ్నల్ వున్న కంపెనీల్లో ముందు వరుసలో జియో ఉండగా, రెండో స్థానంలో ఎయిర్ టెల్, మూడో స్థానంలో బీఎస్ఎన్ఎల్, నాలుగో స్థానంలో వీఐ(వొడాఫోన్,ఐడియా)లు ఉన్నాయి. ఇందులో కాస్త బీఎస్ఎన్ఎల్ మొబైల్ నెట్వర్క్ వాయిస్ కాల్ విషయంలో ఇబ్బందులుు పెట్టినా ఇంటర్నెట్ స్పీడ్ 3జి పూర్తిస్థాయిలో అందిస్తుంది. మిగిలిన సెల్ నెట్వర్క్ కంపెనీలన్నీ 4జి పేరుతో వినియోగదారులను మోసం చేస్తూ..కనీసం 2జి నెట్ స్పీడ్ కూడా ఇవ్వడం లేదు. ఎంతదారుణమంటే జియో నెట్వర్క్ ఇంటర్నెట్ స్పీడ్ కి కనీసం వాట్సప్ కూడా ఓపెన్ కావడంలేదు.  వాయిస్ కాల్స్ లో క్లారిటీని దారుణంగా తగ్గించేశారు.., ఇంటర్నెట్ స్పీడ్ ని దారుణంగా తగ్గించేసింది.. ఇక ఎయిర్ టెల్ అయితే గ్రామీణ ప్రాంతాలో రోజుకి కేవలం రెండు గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఉదయం ఒక గంట, సాయింత్రం ఒక గంట మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలోనే వినియోగదారులు కాల్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఐడియా నెట్వర్క్ కూడా ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వకపోయినా వాయిస్ క్లారిటీ బాగానే ఇస్తుంది.

 అన్నింటి బిఎస్ఎన్ఎల్ వాయిస్ కాల్స్ క్లారిటీ లేకపోయినా ఇంటర్నెట్ స్పీడ్ ఖచ్చితంగా అందిస్తోంది. రీచార్జ్ గడువు అయిపోతుందని వారం రోజులు ముందునుంచే మెసేజ్ లో అలెర్ట్ చేసే మొబైల్ నెట్వర్క్ లు సేవల విషయంలో అత్యంత దారుణంగా మోసం చేస్తున్నాయి. ఈ మొబైల్ నెట్వర్క్ ల నియంత్రించే ట్రాయ్ గానీ, డాట్ కానీ కనీసం కలుగజేసుకోవడం లేదు. అంతేకాదు సమాచార మంత్రిత్వశాఖ పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. దీనితో సెల్ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు వినియోగదారులను నిట్టనిలువునా దోపీడికి గురిచేస్తున్నాయి. అదేమంటే తమ నియమ నిబంధనలన్నీ ఒప్పుకునే వినియోగదారులు మా మొబైల్ నెట్వర్క్ లను ఎంచుకుంటున్నారని తిరిగి బుకాయిస్తున్నాయి. వాస్తవం ఏంటంటే ఏదైనా ఒక సెల్ నెట్వర్క్ కంపెనీలో మొబైల్ నెంబరు తీసుకునే సమయంలో మనం పెట్టే సంతకాలే వారికి రక్షణగా నిలుస్తున్నాయి. అతిచిన్న అక్షరాల్లో వారికి తగ్గట్టుగా రాసుకున్న నిబంధనలకు వినియోగదారులు అంగీకరిస్తూ సంతకాలు చేయడంతో వారికి నచ్చినట్టు వినియోగదారులను మోసం చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అందరికీ మొబైల్ ఫోన్లు అలవాటైపోవడంతో వినియోగదారుల వీక్ నెస్ ను మొబైల్ నెట్వర్క్ కంపెనీలు సొమ్ముచేసుకుంటున్నాయి..

Kakinada

2021-06-07 01:38:34

విశాఖనగరంలో వేక్సిన్ వేసే ప్రాంతాలివే..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని సోమవారం (07.06.2021) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గుర్తించిన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయనున్నట్టు జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. "కోవేక్సిన్" మొదటి డోసు 45 సంవత్సరాలు పైబడిన వారికి, రెండవ డోసు 28 రోజులు పైబడిన వారికి ఈకేంద్రాలలో వ్యాక్సినేషన్ వేస్తున్నామన్నారు. అల్లిపురం, భీమునిపట్టణం, బుచ్చిరాజుపాలెం, చెంగల్రావు పేట, చిన్న వాల్తేర్, జ్ఞానాపురం, మద్దిలపాలెం, నరవ, వన్ టౌన్, ఆర్.పి.పేట, సాగర్ నగర్, స్వర్ణభారతి స్టేడియం, అనకాపల్లి, మల్కాపురం, విద్యుత్ నగర్, ఫిషర్మెన్ కోలనీ, కప్పరాడ, లక్ష్మీ నగర్, ప్రసాద్ గార్డెన్స్, తగరపువలస, బర్మా క్యాంపు, పాత గాజువాక, పెదగంట్యాడ, శ్రీహరిపురం, ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు), "కోవీషీల్డ్" వ్యాక్సినేషన్ మొదటి డోసు 45సంవత్సరాలు పైబడిన వారికి మరియు రెండవ డోసు 84రోజులు పైబడిన వారికి ఆరిలోవ(ఎఫ్.ఆర్.యు), మధురవాడ, శ్రీహరిపురం(ఎఫ్.ఆర్.యు.), గాజువాక, కణితి, పెదగంట్యాడ, ఆర్.హెచ్.సి. సింహాచలం,  ఆర్.టి.సి. ఎం, దువ్వాడ, గోపాలపట్నం ప్రాంతాలలో వ్యాక్సినేషన్ వేస్తున్నారని కమిషనర్ తెలిపారు.  ప్రజలు ఈవిషయాన్ని గమనించి ఆయా కేంద్రాలలో భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కమిషనర్ ఆ ప్రకటనలో కోరారు.

GVMC office

2021-06-06 17:01:57

నిషేధ వ్యూహం..ఆపై ఆదాయం..

మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపల అమ్మకాలను ఆదివారం నిషేధిస్తున్నట్టు కమిషనర్ డా.జి.స్రిజన రెండు రోజులు ముందునుంచే ఆదేశాలు జారీచేసి ప్రచారం చేసినా పట్టించుకోని వారి నుంచి భారీగా అపరాద రుసుము వసూలు చేశారు. ఆదివారం యధా స్థితిగా కొందరు మాంసం చేపల దుఖాణాలు తెరిచారు. దీనితో ఆకస్మికంగా తనిఖీలు చేసిన జివిఎంసీ సిబ్బంది దుకాణాదారులు నుంచి రూ.96,380/- అపరాధ రుసుం విధించినట్లు జివిఎంసి అదనపు కమిషనర్  డా. వి. సన్యాసిరావు తెలిపారు.  కరోనా  తీవ్రత దృష్ట్యా ఆదివారం  మాంసాహారపు అమ్మకాలు నిషేధించినా..ఆ  నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని అలాంటి వారిపై జివిఎంసి పరిధిలోని ప్రత్యేక స్క్వాడ్ బృందం తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అంతేకాకుండా ఈ అపరాధ రుసుముతో పాటు 86కేజీల మేక మాంసం, 180 కేజీల చికెన్, 60 కేజీల చేపలు, 43కేజీల రొయ్యలు, 20కేజీల పీతలు సీజ్ చేయడమైనదని, వీటిని జివిఎంసి వెటర్నరి డాక్టర్ ఎన్.కిషోర్,  శానిటరి ఇన్స్పెక్టర్ ఎన్.వాసు ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్వాడ్ బృందం మధురవాడ  డంపింగ్ యార్డుకు తరలించి ఫినాయిల్ వేసి పూడ్చి పెట్టినట్టు  అదనపు కమిషనర్ తెలిపారు. 

విశాఖ సిటీ

2021-06-06 14:21:02

పురోగ‌మిస్తున్న వైద్య ఆరోగ్య వ్య‌వ‌స్థ‌..

ప్ర‌జ‌ల సంక్షేమ‌మే రాష్ట్ర ప్ర‌భుత్వ ధ్యేయంగా మారింది. ఒక‌వైపు వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తూనే, విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయ రంగాల్లో పెద్ద ఎత్తున‌ మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఫ‌లితంగా ఆయా రంగాల్లో స‌మూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైద్యారోగ్య రంగం శ‌ర‌వేగంగా అభివృద్ది చెందుతోంది. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లాలోనే సుమారు రూ.760.89 కోట్ల రూపాయ‌ల‌తో ఆసుప‌త్రుల ఆధునీక‌ర‌ణ‌, కొత్త ఆసుప‌త్రుల ఏర్పాటుకు కృషి జ‌రుగుతోంది. వైద్య సేవ‌లు ప్ర‌జ‌ల ముంగిట‌కే వ‌చ్చి చేరుతున్నాయి. వివిధ దీర్ఘ‌కాలిక రోగులు 5,178 మందికి పింఛ‌న్లు అందించి ఆదుకోవ‌డం జ‌రుగుతోంది. ఒక‌ప్పుడు కార్పొరేట్ ఆసుప‌త్రిలో వైద్య‌మంటే, సామాన్యుడికి ఊహ‌ల్లో కూడా లేని విష‌యం. ఈ ఆధునిక వైద్యాన్ని ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా పేద‌ల ద‌రికి చేర్చిన‌వారు దివంగ‌త ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి. దానిని మ‌రింత చేరువచేసి, ప్ర‌జ‌ల ఆరోగ్యానికి భ‌రోసా క‌ల్పించారు ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి. ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అధికారంలోకి రాక‌ముందు ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా సుమారు 1100 వ్యాధుల‌కు మాత్ర‌మే చికిత్స అంద‌గా, ప్ర‌స్తుతం వ్యాధుల సంఖ్య‌ను సుమారు 2,400 కు పెరిగింది. జిల్లాలో ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి  6ల‌క్ష‌లా, 99వేల‌, 852 మంది అర్హులుగా ఉన్నారు. వీరిలో ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు 35,972 మంది ఈ రెండేళ్ల కాలంలో ఆరోగ్య‌శ్రీ ద్వారా జిల్లాలోని 28 నెట్‌వ‌ర్క్ ఆసుప‌త్రుల్లో రూ.84.88 కోట్ల విలువైన వైద్య‌చికిత్సలు పొందారు. అవ‌స‌ర‌మైన వారికి ఆరోగ్య‌శ్రీ ద్వారా, పూర్తిగా ఉచితంగా చికిత్స‌ను అందించ‌డ‌మే కాకుండా, శ‌స్త్ర చికిత్స చేయించుకున్‌సవారు కోలుకొనే వ‌ర‌కూ , ఆరోగ్య ఆస‌రా ప‌థ‌కం ద్వారా వారికి రోజుకు రూ.225 చొప్పున‌,  నెల‌కు రూ.5వేలు వ‌ర‌కూ ఆర్థిక సాయాన్ని అందిస్తోంది ప్ర‌భుత్వం. ఇలా ఈ రెండేళ్ల‌లో సుమారు 24,589 మంది ఆస‌రా ద్వారా 15 కోట్ల రూపాయ‌ల సాయాన్ని పొందారు.

ఆప‌ద్భాంధ‌వి 108
                 కుయ్ కుయ్ కుయ్.... అంటూ అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో వాలిపోయే 108 వాహనాలు జిల్లాలో విశేష‌మైన సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఆప‌త్కాలంలో బాధితుల‌కు ఆదుకొని, ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇటీవ‌లే జిల్లాకు 108 వాహ‌నాలు 36 ను ప్ర‌భుత్వం కొత్త‌గా  స‌మ‌కూర్చింది. వీటిలో అడ్వాన్స్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 10, బేసిక్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 24, నియోనాట‌ల్ లైఫ్ స‌పోర్టు వాహ‌నాలు 2 ఉన్నాయి. వీటి ద్వారా సంఘ‌ట‌నా స్థ‌లానికి కేవ‌లం 20 నిమిషాల్లోనే వాహ‌నాలు చేరుకొని, క్ష‌త‌గాత్రుల‌ను ఆసుప‌త్రికి త‌ర‌లించి, వారి విలువైన ప్రాణాల‌ను నిల‌బెడుతున్నాయి.  ఈ వాహ‌నాల ద్వారా నెల‌కు సుమారుగా 3,500 నుంచి 4,500 మంది క్ష‌త‌గాత్రులు లేదా రోగులు లేదా గ‌ర్భిణుల‌ను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు సుమారు 1700 మంది కోవిడ్ రోగుల‌ను  ఆసుప‌త్రుల‌కు చేర్చాయి.

ఈ ఏడాది 108 వాహ‌నాల ద్వారా త‌ర‌లించిన పేషెంట్లు
జ‌న‌వ‌రి    3,285
ఫిబ్ర‌వ‌రి   3,497
మార్చి      4,685
ఏప్రెల్    4,714
మే            4,100

గ్రామీణుల చెంత‌కు 104 వైద్యం
                నాణ్య‌మైన వైద్య సేవ‌ల‌ను సామాన్యుల  ద‌రిచేర్చ‌డానికి ప్ర‌భుత్వం ఎంత‌గానో కృషి చేస్తోంది.  పేద‌ల ముంగిట‌కే వైద్య సేవ‌ల‌ను అందించేందుకు 104 వాహ‌నాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. ఇవి గ్రామీణ వైద్యాల‌యాలుగా మారాయి. జిల్లాలో ప్రస్తుతం 33 వాహ‌నాలు సేవ‌ల‌ను అందిస్తున్నాయి. ఈ వాహ‌నాలు ద్వారా నెల‌కు స‌గ‌టున 30వేల మందికి వైద్యం అందుతోంది. కేవ‌లం వైద్య సేవ‌లే కాకుండా, దాదాపు 1800 ర‌కాల మందుల‌ను కూడా ఈ వాహానాల ద్వారా గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు.

104 వాహ‌నాల ద్వారా అందించిన ఓపి వివ‌రాలు ః
జ‌న‌వ‌రి   22,961
ఫిబ్ర‌వ‌రి  29,770
మార్చి     34,743
ఏప్రెల్    33,158
మే           33,000

వైద్య క‌ళాశాల‌తో భ‌రోసా
               జిల్లాలో సుమారు రూ.500 కోట్ల నాడూ-నేడు నిధుల‌తో, 500 ప‌డ‌క‌ల సామ‌ర్థ్యంతో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మితం కానుంది. విజ‌య‌న‌గ‌రం స‌మీపంలోని గాజుల‌రేగ వ‌ద్ద సుమారు 70 ఎక‌రాల్లో దీని నిర్మాణానికి ఇటీవ‌లే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. 30 నెల‌ల్లో దీని నిర్మాణం పూర్తి చేసుకొని ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానుంది. ఫ‌లితంగా అన్ని ర‌క‌లా అధునాత‌న వైద్య సేవ‌లు జిల్లా ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. మెరుగైన వైద్యం కోసం ఇప్ప‌టిలా, విశాఖ కెజిహెచ్‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.

గిరిజ‌నుల చెంత‌నే ఆధునిక వైద్యం
               ఏజెన్సీకి ముఖ‌ద్వారం, డివిజ‌న్ కేంద్ర‌మైన పార్వ‌తీపురంలో మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణానికి ఇప్ప‌టికే అంకురార్ప‌ణ జ‌రిగింది. సుమారు 5 ఎక‌రాల విస్తీర్ణంలో, రూ.49.26 కోట్ల వ్య‌యంతో దీని నిర్మాణానికి కొద్ది నెల‌ల క్రితం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి శంకుస్థాప‌న చేశారు. టెండ‌ర్లు కూడా ఖ‌రార‌య్యాయి. ఈ ఆసుప‌త్రి నిర్మాణం పూర్త‌యితే, పార్వ‌తీపురం చుట్టుప్ర‌క్క‌ల మండ‌లాల ప్ర‌జ‌ల‌తోబాటు, 8 గిరిజ‌న మండ‌లాల్లోని గిరిపుత్రుల‌కు, ఒడిషా  రాష్ట్ర స‌రిహద్దు ప్ర‌జ‌ల‌కు కూడా ఈ ఆసుప‌త్రి సేవ‌లు అంద‌నున్నాయి.

వైఎస్ఆర్ కంటివెలుగు
               అవ్వాతాత‌ల క‌ళ్ల‌లో వెలుగు నింప‌డానికి, చిన్నారుల కంటి చూపు కాపాడ‌టానికి ప్ర‌భుత్వం వైఎస్ఆర్ కంటివెలుగు కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం చేప‌ట్టింది. దీనిలో భాగంగా వృద్దులు, చిన్న‌పిల్ల‌ల‌ను ముందుగానే కంటి స‌మ‌స్య‌ల‌ను గుర్తించ‌డానికి, కంటి ప‌రీక్ష‌ల‌ను మూడు ద‌శ‌ల్లో నిర్వ‌హించింది. మొద‌టి విడ‌త 2,92,462 మందికి ప్రాధ‌మిక‌ కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. రెండో విడ‌త 12,991 మందికి కంటివ్యాధి నిపుణుల చేత 12,991 మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వారికి క‌ళ్ల‌ద్దాల‌ను పంపిణీ చేయ‌డం జ‌రిగింది. మూడోవిడ‌త 48,130 మంది అవ్వాతాత‌ల‌కు కంటి ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం జ‌రిగింది.

స‌మ‌ర్థ‌వంతంగా కోవిడ్ క‌ట్ట‌డి
               ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడించిన కోవిడ్ మ‌హ‌మ్మారిని ప్ర‌భుత్వ సూచ‌న‌ల‌కు అనుగుణంగా, జిల్లాలో స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొన‌డం జ‌రిగింది. దీనికోసం జిల్లాలో 27 కోవిడ్ ఆసుప‌త్రుల‌ను గుర్తించి, అవ‌స‌ర‌మైన‌ ఆక్సీజ‌న్‌, మందులును స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రిగింది. వీటిలో మొత్తం ప‌డ‌క‌లు 2608 కాగా, వీటిలో 463 ఆక్సీజ‌న్ ప‌డ‌క‌లు, 209 ఐసియు ప‌డ‌క‌లను ఏర్పాటు చేసి, చికిత్స‌ను అందించ‌డం జ‌రిగింది. జిల్లా కేంద్రాసుప‌త్రిలో హుటాహుటిన 10 కెఎల్ ఆక్సీజ‌న్ ట్యాంకును ఏర్పాటు చేసి, ఆక్సీజ‌న్ స‌ర‌ఫ‌రాకు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకోవ‌డం జ‌రిగింది.  సుమారు 2వేల మందికి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా ఉచితంగా కోవిడ్ చికిత్స అందించ‌బ‌డింది.

మౌలిక వ‌స‌తుల‌కు పెద్ద‌పీట‌
                రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి అధికారంలోకి రాగానే, విద్య‌, వైద్య రంగాల్లో మౌలిక వ‌సతుల‌కు క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేశారు. దీనిలో భాగంగా భారీ ఎత్తున వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర సిబ్బందిని నియ‌మించారు. జిల్లాలో నాడూ-నేడు, నాబార్డు, డిఎంఇ, ఎన్‌హెచ్ఎం త‌దిత‌ర నిధులు సుమారు రూ.760.89 కోట్ల‌తో ఆసుప‌త్రుల నిర్మాణం, అభివృద్ది కార్య‌క్ర‌మాలు జోరందుకున్నాయి. దీనిలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌, పార్వ‌తీపురం ఏరియా ఆసుప‌త్రితోపాబాటుగా, ప్ర‌స్తుతం ఉన్న పిహెచ్‌సిలు, సిహెచ్‌సిలు, అర్బ‌న్ హెల్త్ సెంట‌ర్లు నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు కార్య‌క్రమాలు ఎపి వైద్య‌, ఆరోగ్య మౌలిక వ‌స‌తుల అభివృద్ది సంస్థ ఆధ్వ‌ర్యంలో చురుగ్గా  జ‌రుగుతున్నాయి. నాడూ-నేడు ప‌థ‌కం క్రింద జిల్లా వ్యాప్తంగా ఉన్న 68 ప్రాధ‌మిక వైద్య కేంద్రాలను రూ.48.24 కోట్ల‌తో కొత్త భ‌వ‌నాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టారు. ఈ ప‌నుల‌ను ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా 510 డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్కులు నిర్మాణం జ‌రుగుతోంది. సుమారు రూ.59.57 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మితం అవుతున్న వీటిని పంచాయితీరాజ్ శాఖ ప‌ర్య‌వేక్షిస్తోంది. వీటి నిర్మాణం పూర్తయితే, జిల్లాలోని వైద్యారంగంలో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటుచేసుకుంటాయి. ఇటు గ్రామ స్థాయి నుంచి అటు జిల్లా స్థాయి వ‌ర‌కూ మెరుగైన వైద్య‌ వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌స్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు.  

వైద్యులు, సిబ్బంది నియామ‌కం ః
                         రెండేళ్ల క్రితం        ఈ రెండేళ్ల‌లో నియామ‌కాలు
వైద్యులు               138                              40
న‌ర్సులు               128                             193
ఎఎన్ఎం               382                             598
ఇత‌ర సిబ్బంది     542                               89
ఆశా వ‌ర్క‌ర్లు         2542                              32
               

చేప‌ట్టిన అభివృద్ది కార్య‌క్ర‌మాలు ః
1) గ‌జ‌ప‌తిన‌గ‌రం సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1700 ల‌క్ష‌లు.
2) సాలూరు సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1700 ల‌క్ష‌లు.
3) ఎస్‌కోట‌ సిహెచ్‌సి 50 ప‌డ‌క‌ల నుంచి 100 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ.1260 ల‌క్ష‌లు.
4) కురుపాం సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 300 ల‌క్ష‌లు.
5) బాడంగి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 881 ల‌క్ష‌లు.
6) భ‌ద్ర‌గిరి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 895 ల‌క్ష‌లు.
7) పార్వ‌తీపురం జిల్లా ఆసుప‌త్రి 100 ప‌డ‌క‌ల నుంచి 150 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 2115 ల‌క్ష‌లు.
8) నెల్లిమ‌ర్ల‌ 30 ప‌డ‌క‌ల సిహెచ్‌సి అభివృద్ది రూ. 442 ల‌క్ష‌లు.
9) భోగాపురం 30 ప‌డ‌క‌ల సిహెచ్‌సి అభివృద్ది రూ. 395 ల‌క్‌ాలు.
10) బొబ్బిలి సిహెచ్‌సి 30 ప‌డ‌క‌ల నుంచి 50 ప‌డ‌క‌ల‌కు పెంపు, అభివృద్ది రూ. 332 ల‌క్ష‌లు.
11) జిల్లా ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణం రూ.50000 ల‌క్ష‌లు.
12) పార్వ‌తీపురం మ‌ల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రి నిర్మాణం రూ.4926 ల‌క్ష‌లు
13) డిఇఐసి-పార్వ‌తీపురం రూ.106ల‌క్ష‌లు
14) బ‌ర్త్ వెయిటింగ్ హోమ్‌, పార్వ‌తీపురం రూ.30ల‌క్ష‌లు
15) భ‌ర్త్ వెయిటింగ్ హోమ్‌, భ‌ద్ర‌గిరి, రూ.30ల‌క్ష‌లు
16) జిల్లా కేంద్రంలోని సెంట్ర‌ల్ డ్ర‌గ్ స్టోర్ అభివృద్ది రూ.196ల‌క్ష‌లు.


వైద్యారోగ్య రంగానికి వెచ్చించిన‌  నిధులు ః

నిధులు                                                ప‌నులు       వ్య‌యం(రూ. కోట్ల‌లో)

ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల (నాడూ-నేడు)        1             500.00
నాబార్డు నిధులు                                           10             100.20
డిఎంఇ (పార్వ‌తీపురం మ‌ల్టీ స్పెషాలిటి)     1               49.26
నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్                                     4                 3.62
నాడూ.నేడు (పిహెచ్‌సిలు)                           68               48.24
నాడూ-నేడు (వెల్‌నెస్ సెంట‌ర్లు)               510               59.57
                                                                            మొత్తం 760.89 కోట్లు


మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను కల్పిస్తున్నాం ః క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ హ‌రి జ‌వ‌హ‌ర్ లాల్‌
                   జిల్లా ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పిస్తున్నాం. ప్ర‌స్తుతం సుమారు 760 కోట్ల రూపాయ‌ల‌తో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న జ‌రుగుతోంది. ఎన్న‌డూ లేని విధంగా వైద్య రంగంలో ఖాలీల భ‌ర్తీ చేప‌ట్టాం. డాక్ట‌ర్ వైఎస్ఆర్ విలేజ్ క్లీనిక్కుల‌వ‌ల్ల గ్రామీణ ప్ర‌జ‌ల చెంత‌కే వైద్య సేవ‌లు అందుతాయి. జిల్లాలో ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల నిర్మాణం పూర్త‌యితే, వైద్య సేవ‌ల‌కోసం ఇత‌ర జిల్లాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. వైద్య రంగంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా, వ‌స‌తులు పెరిగి, కోవిడ్‌ను జిల్లాలో స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొన్నాం.

Vizianagaram

2021-06-06 08:12:52

శానిటేషన్ సిబ్బంది సేవలు కీలకం..

కరోనా సమయంలో పారిశుధ్య కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. నగరంలోని  జోన్ 16వ వార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులకు దుస్తులు, రెయిన్ కోట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,  కరోనా కాలంలో ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమన్నారు.  తల్లి తమ పిల్లలకు ప్రేమతో ఏ విధమైన సేవ చేస్తుందో అదేవిధంగా పారిశుద్ధ్య సిబ్బంది  మన చెత్తను గాని కాలువలోని చెత్తను గాని తీస్తారని,  అందుకే ప్రతి పారిశుద్ధ కార్మికులు తల్లిదండ్రులతో సమానమని, వారికి మనం ఎప్పుడూ ఋణపడి ఉంటామని,  పారిశుద్ధ్య కార్మికులు ఎండనకా, వాననకా  కష్ట పడతారని వారికి   ప్రజలు సహకారం అందించాలని మేయర్ తెలిపారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆ వార్డులో మేయర్, వార్డు కార్పొరేటర్ తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్  మొల్లి లక్ష్మి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీనివాస్,  ఎ.ఎం.ఒ.హెచ్ రమణ మూర్తి,  శానిటరి సూపర్వైజర్ జనార్ధన్,  శానిటరి ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.  

విశాఖ సిటీ

2021-06-05 15:52:58

పోర్టు భూసేకరణ వేగవంతం చేయండి..

రామాయపట్నం పోర్టు నిర్మాణానికి అవసరమైన భూసేకరణ వేగంగా చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్.బి. అండ్. ఆర్) జె. వెంకట మురళి అధికారులను ఆదేశించారు.రామాయపట్నం పోర్టు భూసేకరణపై ప్రకాశం భవ నంలోని జె.సి. ఛాంబర్లో సంబ ంధిత అధికారులతో ఆయన శనివారం సమావేశం నిర్వహించారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినందున భూముల
కేటాయింపుల్లో మరింత వేగం పెంచాలని జె.సి. మురళి తెలిపారు. పోర్టు కోసం 323 ఎకరాల ప్రభుత్వ భూమిని, 220 ఎకరాల చుక్కల భూమిని, 43 ఎకరాల అసైన్డ్ భూమిని పోర్టు అధికారులకు అప్పగించాల్సి ఉందన్నారు. ప్రస్తుతం 45.94 ఎకరాల భూమి రామాయ పట్నం పోర్టుకోసం
ఇచ్చేశామని ఆయన స్పష్టం చేశారు. మరో 90 ఎకరాలు వారంరోజుల్లోగా ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 220 ఎకరాల చుక్కల భూమిలో ప్రస్తుతం 180 ఎకరాలను 15 రోజుల్లోగా పోర్టు అధికారులకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నామని ఆయన వివరించారు. చేవూరు
గ్రామంలో 120 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రామాయపట్నం పోర్టు నిర్మాణం జరగనున్నందున ఇళ్లు, భూములు కోల్పోయిన వారికోసం రావులపాలెం, ఆవులవారిపాలెం గ్రామాలలో పునరావాస కాలనీ ఏర్పాటు చేయాలని జె.సి. మురళి చెప్పారు. నిర్వాసితులయ్యే 253 కుటుంబాలకు పునరావాస కాలనీ నిర్మించాల్సి ఉందన్నారు. ఆ
రెండు గ్రామాలలో సుమారుగా 40 నుంచి 50 ఎకరాలు భూసేకరణ చేయాలని సంబంధి త అధికారులను ఆదేశించారు. రామాయపట్నం పోర్టు పరిధిలోకి వచ్చే భూముల సేకరణలో 70 ఎకరాలకు ప్రభుత్వ నిబంధనలు వర్తించనున్నాయని ఆయన తెలిపారు. ఆ భూములలో ఐదేళ్ల క్రితం
నుంచి సాగుచేస్తున్న పెద్ద, చిన్న రైతుల వివరాలను గూగుల్ లోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారం తో గుర్తించాలన్నారు. అలా గుర్తించిన వారి వివరాలపై నివేదిక పంపాలన్నారు. నిర్వాసితులయ్యే బాధితుల గృహాలు, భూముల కొలతలు ఖచ్చితత్వంగా ఉండాలన్నారు. పరిహారం ప్రక్రియలో పారదర్శకత పాటించాలని ఆయన పలు సూచనలు చేశారు. పోర్టు పరిధిలోకి వచ్చే 44.4 ఎకరాలు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నాయని ఆయన తెలిపారు. అక్కడ సాగుచేసుకుంటున్న వారికి ప్రత్యామ్నాయంగా పి.సి.పల్లి మండలం నేరేడుపల్లిలో 60 ఎకరాలు సాగుభూమి ఇవ్వడానికి అటవీ శాఖ సిద్దంగా ఉందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ, డి.ఆర్.ఓ. తిప్పే నాయక్, ఆర్. అండ్. బి. ఎస్.ఇ. విజయరత్నం, ఉలవపాడు తహసిల్దార్ శిల్ప, పోర్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Ongole

2021-06-05 15:50:01

అభ్యంతరాలు తెలియజేయొచ్చు..

సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ సీనియారిటీ జాబితా పై అభ్యంతరాలుంటే ఈ నెల 21వ తేదీ లోపు  తెలియచేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జేసి ( రెవిన్యూ) గౌతమితో కలసి సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ కల్పన విషయమై  సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ సి. హరికిరణ్ మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు నిర్వాసితుల ఉద్యోగ కల్పనకు సంభందించి గతంలో  9751 మందితో కూడిన ప్రాథమిక జాబితాను రూపొందించడం జరిగింది. అయితే  సోమశిల  ప్రాజెక్టు ముంపు వాసులు చేసిన ఫిర్యాదులను పరిశీలించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు సదరు సీనియారిటీ జాబితాలో సవరణలు, మార్పులు చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు గాను  ప్రస్తుత ఉద్యోగ సీనియారిటీ జాబితాను https://kadapa.ap.gov.in  వెబ్ సైట్ నందు ప్రదర్శించామన్నారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఉన్న సోమశిల ప్రాజెక్టు నిర్వాసితులు తమ పేర్లను  వెబ్ సైట్ లో పరిశీలించి ఏమైనా అభ్యంతరాలు,  సవరణలు ఉంటే ఈ నెల 7వ తేదీ నుండి 21 వ తేదీ లోపు నెల్లూరు సోమశిల ప్రాజెక్టు సర్కిల్  కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ నందు ...కార్యాలయపు పని వేళల్లో  దరఖాస్తు చేసుకుని రసీదును పొందవచ్చునన్నారు. సోమశిల నిర్వాసితుల నుండి స్వీకరించిన అభ్యంతరాలు,  సవరణలను పరిశీలించి తగు మార్పులు చేసి కొత్తగా సీనియారిటీ జాబితాను రొపొందిస్తా మన్నారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు సర్కిల్ ఎస్ఈ ఎన్. కృష్ణారావు, స్పెషల్ కలెక్టర్ రామమోహన్ తదితరులు పాల్గొన్నారు. 

Kadapa

2021-06-05 15:48:34

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత..

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని,  ప్రతీ ఒక్కరూ ఒక మొక్కను నాటాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టుల సముదాయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటుచేసింది. ఈ కార్యక్రమానికి జిల్లా  ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని, ఇతర న్యాయమూర్తులతో కలిసి స్వయంగా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు సముదాయాల్లోని పరిసరాలను అందంగా తీర్చిదిద్దేందుకు మొక్కలను నాటడం పరిపాటి అని, అయితే పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని ప్రస్తుతం ఫల మొక్కలను నాటడం జరిగిందని అన్నారు. ముఖ్యంగా నేరేడు, జామ, ఉసిరి వంటి పలురకాల ఫల మొక్కలను తాము, తమ సిబ్బంది పాల్గొని నాటడం జరిగిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో సమతుల్యత లోపించడం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవించాయని,  తద్వారా ప్రతీ ఏడాది ఉష్ణోగ్రతల్లో రెండు డిగ్రీల పెరుగుతూ వస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనికి మొక్కలను నాటి వాటిని సంరక్షించుకోవడమే ప్రధాన మార్గమని ఆయన సూచించారు. పర్యావరణం లోపించడం వలన ఢిల్లీ వంటి మహానగరాల్లో కాలుష్యం అధికమై చాలా మంది ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారని, అలాగే కరోనా వంటి పాండమిక్ సమయంలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడం గమనించామని, ఇందుకు కాలుష్యమే కారణమని ఆయన వివరించారు. ప్రతీ ఒక్కరూ మొక్కలను పెంచుకోవడం వలన వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుందని, పచ్చదనాన్ని చూస్తే కళ్లకు అందంగా కనిపిస్తుందని చెప్పారు. ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఇండోర్ ప్లాంట్స్ కూడా ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని, వీలైతే వాటినైనా పెంచుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార వదార్ధాలు ప్రకృతి నుండి లభించినవేనని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. అభివృద్ధి పేరుతో పచ్చని చెట్లను నరికివేస్తున్నారని, పంట పొలాలను లే అవుట్లగా మారుస్తున్నారని, అడవులు కనుమరుగైపోతున్నాయని వీటివలన పర్యావరణం లోపిస్తుందని ఆయన గుర్తుచేసారు.  ఇటువంటి తరుణంలో విజ్ఞతతో తమ పుట్టినరోజున, ఇతర సందర్భాలలోనైనా ప్రతీ ఒక్కరూ తమ పెరటిలో గాని లేదా సమీప ప్రాంతంలో  ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.   పర్యావరణాన్ని రక్షించేందుకు తమ వంతు సహకారం అందించాలని జిల్లా ప్రజలను కోరారు.

          ఈ కార్యక్రమంలో సెకెండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ టి.వెంకటేశ్వర్లు,  జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ, జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ( స్పెషల్ మొబైల్ కోర్ట్ ) జి.లెనిన్ బాబు, ఫస్ట్ అడిషినల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కె.రాణి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యస్.రమేష్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2021-06-05 15:35:04

Rajahmundry

2021-06-05 14:53:13