విధి నిర్వహణలో సమర్ధవంతంగా పనిచేసిన అధికారిగా కృష్ణారావు మంచి గుర్తింపును తెచ్చుకున్నారని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థలో జిల్లా మేనేజర్ గా పనిచేస్తున్న ఎ.కృష్ణారావు ఉద్యోగ విరమణ అభినందన సభ స్థానిక ఆనందమయి ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ పౌర సరఫరాలలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు. వాటిన్నింటిని సమర్ధవంతంగా పనిచేసి జిల్లాకు మంచి సేవలు అందించారని చెప్పారు. పౌర సరఫరాల శాఖలో ఇ-పాస్ విధానం అమలయ్యే సమయంలో జిల్లాలో సమర్ధవంతంగా అమలయ్యేలా కృషిచేసిన వ్యక్తి కృష్ణారావు అని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో పైలెట్ ప్రోజెక్టుగా ప్రవేశపెట్టిన నాణ్యమైన బియ్యం అమలు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారని చెప్పారు. అలాగే ఎన్నికల సమయంలో పరిశీలకులతో సమన్వయ బాధ్యతలను చక్కగా నిర్వహించారని, ఒక్కరి వద్ద నుండి కూడా తమకు ఫిర్యాదు అందలేదని, ఇది చాలా గొప్ప విషయమని కితాబిచ్చారు. జిల్లాలో అమలైన ఇంటింటికి బియ్యం సరఫరా కార్యక్రమంలో కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించారని, సార్టెక్స్ బియ్యం పంపిణీ లోను మన జిల్లా మంచి స్థానంలో నిలిచిన సంగతిని కలెక్టర్ గుర్తుచేసారు. ధాన్యం సేకరణ తదితర సందర్భాల్లో కూడా మంచి సమన్వయం చేసి రైతులకు మంచి గిట్టుబాటు ధరను అందించడంలో కూడా కృష్ణారావు విశేష కృషిచేసారని అన్నారు. కరోనా సమయంలో నెలలో రెండు సార్లు ప్రజలకు ఉచిత బియ్యం పంపిణీ చేయాల్సి వచ్చిందని, అటువంటి సమయంలో కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పంపిణీ చేసిన ఘనత కృష్ణారావుకి దక్కిందని చెప్పారు. కృష్ణారావు శాంతి స్వభావం గలవారని, అదే శాంతి స్వభావంతో విధులను సక్రమంగా నిర్వర్తించారని కలెక్టర్ వివరించారు. అనంతరం సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులతో కలిసి పుష్పమాలను వేసి జ్ఞాపిక, దుశ్శాలువతో సత్కరించారు.
సంయుక్త కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు మాట్లాడుతూ మిగిలిన శాఖల కంటే పౌర సరఫరాల శాఖ విధులు విభిన్నమైనవని, అటువంటి విధులను సైతం సక్రమంగా నిర్వహించిన ఘనత కృష్ణారావుదేనని తెలిపారు. జిల్లాలో పైలెట్ ప్రోజెక్టుగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ విషయంలో ఏ ఒక్కరి నుండి ఫిర్యాదు లేకుండా సక్రమంగా పంపిణీ చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని చెప్పారు. రేషన్ విషయంలో డీలర్ల దగ్గర నుండి మరలా ప్రజలకు రేషన్ చేరేవరకు పక్కా ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని అమలుచేసారని కొనియాడారు. కొన్ని సందర్భాలలో తమకు తెలియకుండానే పనులు సక్రమంగా జరిగిపోయేవని, ఇలాంటి అధికారులు జిల్లాలో ఉండటం వలనే ఏ కార్యక్రమమైన విజయవంతంగా అమలవుతాయని చెప్పారు. ఈ అభినందన సభలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సంఘాలు, పౌర సరఫరాల శాఖ, పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో పౌర రక్షణ వాలంటీర్ల పాసింగ్ పరేడ్ మార్చి 1వ తేదీన జరగనున్నట్లు డిప్యూటీ సివిల్ డిఫెన్స్, ప్రత్యేక ఉప కలెక్టర్ కె. భవాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌర రక్షణలో కనీస శిక్షణలో ఇంత వరకు 220వ బ్యాచ్ కు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఈ బ్యాచ్ 221వ దని, ఈ బ్యాచ్ లో 39 మంది వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఈ శిక్షణ ఫిబ్రవరి 15వ తేది నుండి మార్చి 1వ తేదీ వరకు పూర్తి చేసుకోనున్నట్లు తెలిపారు. శాంతిపురం కమ్యూనిటీ హాల్, గురుద్వార జంక్షన్ దగ్గర పౌర రక్షణ వాలంటీర్ల పాసింగ్ పరేడ్ మార్చి 1వ తేదీన నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖలో సుధీర్ఘకాలం పాటు పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీకాకుళం డివిజనల్ పౌర సంబంధాల అధికారి పి.లక్ష్మీకాంతం సేవలు స్పూర్తిదాయకమని ప్రాంతీయ సంయుక్త సంచాలకులు వి.మణిరాం కొనియాడారు. జిల్లా అధికారులు, మీడియా ప్రతినిధులు, సిబ్బందితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆమె అందరి మన్ననలను చూరగొన్నారని పేర్కొన్నారు. పి.లక్ష్మీకాంతం పదవీ విరమణ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఆదివారం పదవీ విరమణ వీడ్కోలు సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్.జె.డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 34 ఏళ్ల పాటు విధులు నిర్వహించడమే కాకుండా శాఖకు మంచి పేరును తీసుకువచ్చారని చెప్పారు. ఎక్కువ కాలం శ్రీకాకుళం జిల్లాలో పనిచేసారని, విధి నిర్వహణలో మంచి సేవలు అందించడమే కాకుండా సమర్ధవంతంగా పనిచేసిన ఘనత ఆమెకు దక్కుతుందని అన్నారు. ఆమెకు అప్పగించిన ఏ పనినైనా సకాలంలో పూర్తిచేసేవారని, ముఖ్యంగా ఫైలిన్, తితిలీ తుఫాను, కరోనా సమయంలో సమయపాలనతో సంబంధం లేకుండా విధులు నిర్వహించిన సంగతిని ఆయన గుర్తుచేసారు. అంతేకాకుండా ఇటీవల నాలుగు విడతలలో జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఎప్పటికపుడు సమాచారాన్ని సేకరిస్తూ, మీడియాకు సకాలంలో సమాచారాన్ని అందించడంలో విశేష కృషిచేసారని కొనియాడారు. ఆమె ఒక అధికారి మాత్రమే కాదని, ఒక రచయిత కూడా అని, కవితలు రాయడంలో ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉందని వివరించారు. మూడు జిల్లాల అధికారులు పదవీ విరమణ వీడ్కోలు సభకు హాజరుకావడం ఆమెపై గల గౌరవానికి ప్రతీక అని అభివర్ణించారు. సమాచార శాఖలో పనిచేసే ప్రతీ ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకొని శాఖకు మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. తొలుత షష్టి పూర్తి మరియు పదవీ విరమణ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ఆయన అనంతరం శ్రీమతి లక్ష్మీకాంతం దంపతులకు పూలమాలను వేసి దుశ్శాలువ, పుష్పగుచ్ఛం, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు.
విజయనగరం సహాయ సంచాలకులు డి.రమేష్ మాట్లాడుతూ పి.లక్ష్మీకాంతం మంచి అధికారిగా అందరి మన్ననలను చూరగొన్నారని, ఇది ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా భావించాలని చెప్పారు. సమయపాలనతో సంబంధం లేకుండా పనిచేయడం, అధికారుల పట్ల గౌరవం ఉండటం వంటివి సమాచార శాఖలో పనిచేసే ప్రతీ ఒక్కరికి ఉండాలని, ఆ లక్షణాలు అమెకు మెండుగా ఉన్నాయని అన్నారు. ఆమె శాఖకు అందించిన సేవలు సమాచార శాఖలో పనిచేసే ప్రతీ ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. ఆమె అధికారిగా విధులు నిర్వహిస్తూనే కవితలు బాగా రాసేవారని, ప్రతీ తెలుగు సంవత్సర ఉగాది పర్వదినాన ఆమె కవిత తప్పనిసరిగా ఉండేదని గుర్తుచేసారు. విధి నిర్వహణలో ఎటువంటి సమస్యలు లేకుండా 34 ఏళ్ల పాటు సేవలు అందించడం గర్వకారణమని కొనియాడారు.
శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్ మాట్లాడుతూ శాఖకు లక్ష్మీకాంతం అందించిన సేవలు అందరికీ ఆదర్శనీయమని కొనియాడారు. ముఖ్యంగా తితిలీ, ఫైలిన్, కరోనా, పంచాయతీ ఎన్నికల సమయంలో ఆమె అద్భుతమైన సేవలు అందించారని చెప్పారు. సమాచార శాఖలో ఉద్యోగులు సమయపాలనతో నిమిత్తం లేకుండా విధులు నిర్వహించాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితిల్లో కూడా ఆమె అద్భుతంగా పనిచేసారని తెలిపారు. సుమారు 35 ఏళ్ల పాటు ఎటువంటి రిమార్కులు లేకుండా ఈ శాఖలో పనిచేసి, అందరి అధికారులు మన్ననలను పొందిన ఘనత ఆమెకు దక్కుతుందని చెప్పారు. ఆమె జిల్లాలో అందించిన సేవలకు గుర్తుగా జిల్లాలోని మహిళా అధికారులు ప్రశంసలు కురిపించడమే కాకుండా, సత్కార కార్యక్రమాన్ని నిర్వహించడం ఆమె పట్ల గౌరవంగా భావించాలని అన్నారు.
పదవీ విరమణ పొందిన లక్ష్మీకాంతం ఆమె స్పందనను తెలియజేస్తూ నేను శాఖలో ఇంత గొప్పగా చేసిన విషయం తనకు తెలియదని, అధికారుల అభిమానం చూస్తే ఆనందంగా ఉందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా మాత్రమే తనకు అప్పగించిన పనిని బాధ్యతగా చేయడం జరిగిందని, ఇందుకు అందరు అధికారులు తనకు పూర్తి సహాయ సహకారాలు అందించారని చెప్పారు. వారందరికీ ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విజయనగరం , విశాఖపట్నం, పార్వతీపురం డివిజనల్ పౌర సంబంధాల అధికారులు యస్.జానకమ్మ, డి.సాయిబాబా, కె.బాలమాన్ సింగ్, ఆడియో విజువల్ సూపర్ వైజర్లు ఐ.శ్రీనివాసరావు, డి.సత్యనారాయణ, బి.కృష్ణారావు, సీనియర్ సహాయకులు పి.మురళీ, ఆర్.కేశ్వరమ్మ, విశ్రాంత డివిజనల్ పౌర సంబంధాల అధికారి జి.అప్పారావు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, పలాస - కాశీబుగ్గ మున్సిపాలిటీలకు, పాలకొండ నగర పంచాయతీకి ఈ నెల 10వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. 14వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన జారీ చేస్తూ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అధికారులకు శిక్షణా కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. వివిధ విభాగాలకు నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. స్టాటిక్ సర్వేలియన్స్ టీమ్ లను, ప్రవర్తనా నియమావళి అమలు బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రజాస్వామ్యములో ఓటు వేయడం కీలకమని ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని కలెక్టర్ కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు వేయడం మన బాధ్యత అని ప్రతి ఓటరు గుర్తించాలని పిలుపునిచ్చారు. మన ఓటు... మన హక్కు... అని, ఓటు అత్యంత శక్తివంతమైనదని తెలుసుకోవాలని ఆయన అన్నారు. మార్చి10వ తేదీన మునిసిపాలిటీలలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని పేర్కొంటూ మునిసిపల్ ఎన్నికల్లో సైతం సంబంధించిన ఓటర్లు భారీగా పాల్గొని ఆదర్శంగా నిలవాలని కోరారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల సంఘం వ్యయ పరిమితిని విధించిందని కలెక్టర్ చెప్పారు. ఎన్నికల్లో నామినేషన్ వేసినప్పటి నుండి ప్రతి ఖర్చు లెక్కింపు జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు మూడు రోజులకు ఒకసారి ఖర్చుల వివరాలు పరిశీలకులకు సమర్పించాలని అన్నారు. అభ్యర్థులు దినపత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చే ప్రకటనలు కూడా జమ చేయడం జరుగుతుందని స్పష్టం చేసారు. కాగా శ్రీకాకుళం జిల్లాలో మునిసిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులుగా కె.ఆర్.బి.హెచ్.ఎన్. చక్రవర్తి ని నియమించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల పరిశీలకునిగా నియమించింది. మార్చి 2వ తేదీ నుండి జిల్లాలో అందుబాటులో ఉంటారు. ఎన్నికలకు సంభందించిన ఫిర్యాదులను 9618138487 ఫోన్ ద్వారా గాను లేదా నేరుగా సమర్పించ వచ్చని పేర్కొన్నారు.
సమాచార పౌర సంబంధాల శాఖలో డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా జిల్లా అధికారుల మన్ననలను పొందడమే కాకుండా మహిళా అధికారిగా మంచి గుర్తింపును పొందిన వ్యక్తి పి.లక్ష్మీకాంతం అని జిల్లా విద్యాశాఖాధికారి కె.చంద్రకళ కొనియాడారు. డివిజనల్ పి.ఆర్.ఓగా పనిచేస్తూ పదవీ విరమణ పొందిన లక్ష్మీకాంతం అభినందన సభ కార్యక్రమం డి.పి.ఆర్.ఓ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలకు చెందిన వార్తలను సకాలంలో మీడియా ప్రతినిధులకు అందించడంలో లక్ష్మీకాంతం కీలక పాత్ర పోషించారని చెప్పారు. అలాగే తమకు ఎన్నో సందర్భాలలోనూ, కార్యక్రమాల నిర్వహణ సమయాల్లో తగు సూచనలు చేసేవారని అన్నారు. ఆమెకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ జిల్లా అధికారులందరితో మంచి గుర్తింపును తెచ్చుకొన్నారని తెలిపారు. మిగిలిన శాఖలతో పోల్చిచూస్తే సమాచార పౌర సంబంధాల శాఖలో సమయపాలన ఉండదని, కాని అటువంటి విధులను కూడా ఆమె సమర్ధవంతంగా నిర్వహించారని తెలిపారు. ముఖ్యంగా మహిళా అధికారి అయినప్పటికీ కోవిడ్ సమయంలో కూడా తన విధులను సమర్ధంగా నిర్వహించిన సంగతి ఆమె గుర్తుచేసారు. అనంతరం జిల్లా అధికారులతో కలిసి లక్ష్మీకాంతంకు పుష్పమాలను వేసి, దుశ్శాలువ, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ అభినందన కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి యల్.రమేష్, విశాఖపట్నం వి.ఎం.ఆర్.డి.ఏ సి.ఏ.ఓ జి.నిర్మలమ్మ, ఐ.సి.డి.ఎస్ ప్రోజెక్టు డైరక్టర్ డా.జి.జయదేవి, సాంఘిక సంక్షేమ గురుకులం సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.పద్మ, ఎస్.టి.ఓ సి.హెచ్.సమతారాణా, అంబేద్కర్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పి.సుజాత, ప్రముఖ న్యాయవాది టి.సుధారాణి, విశ్రాంత యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు సిహెచ్.మహాలక్ష్మీ, రిమ్స్ స్టాఫ్ నర్స్ వి.చిలకమ్మ, అలికాన రాజేశ్వరి , వి.రఘుబాబు, ఐ.నారాయణ రావు, కె.వెంకట సత్యనారాయణ, ఏటిఓలు తవిటయ్య, సావిత్రి, రిమ్స్ స్టాఫ్ నర్స్ టి.పద్మజ తదితరులు పాల్గొని ఆమెకు ఘనంగా సత్కరించారు.
భూ సంబంధిత అంశాలపై హైకోర్టు,ఇతర కోర్టులలో నమోదైన కేసుల పై తహసీల్దార్లు అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా.జి.లక్ష్మీ శ అధికారులను ఆదేశించారు. శనివారం జేసీ నుంచి భూసంబంధిత అంశాలపై వివిధ కోర్టులలో నమోదవుతున్న కేసులపై సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ ప్రభుత్వ ప్లీడర్లు(ఏజీపి),ప్రభుత్వ ప్లీడర్లు(జీపి),డివిజన్, మండల స్థాయి రెవెన్యూ అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మండల స్థాయి రెవెన్యూ అధికారులకు భూసంబంధిత కేసులపై సరైన అవగాహన లేకపోవడంతో కోర్టులలో కేసులు నమోదు అవుతున్నాయన్నారు.ఈ నేపధ్యంలో తహసీల్దార్లు భూ సంబంధిత కేసుల పై పూర్తి అవగాహన పెంపొందించుకోవాలని ఆయన తెలిపారు.ఆర్ఓఆర్ యాక్ట్ (రికార్డ్ ఆఫ్ రైట్స్), పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ, రెవెన్యూ రికార్డులలో రైతుల పేర్లు మార్పు, తదితర అంశాలపై కొంత మంది తహసీల్దార్లు నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వల్లనే కోర్టులో కేసులు ఎక్కువగా నమోదవుతు అవుతున్నాయన్నారు.ఇక నుంచి క్రమం తప్పకుండా తహసిల్దారులు వారి పరిధిలో నమోదు అయిన హైకోర్టు, జిల్లా ,తాలూకా కోర్టుల కేసుల వివరాలను ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని జేసీ తెలిపారు. సంబంధిత కేసులపై ఏజీపి,జీపిల సమన్వయంతో అఫిడవిట్లు, కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. గౌరవ కోర్టులు వివిధ కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వులపై గడువులోపు చర్య తీసుకోవాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకం జారీ,ఆర్ వోఆర్ యాక్ట్ ప్రకారం ఫార్మ్-8 నోటీసులు జారీ చేయడం,చట్ట ప్రకారం గడువు లోపు వచ్చిన అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఫార్మ్-8 నోటీసులను సంబంధిత గ్రామ సచివాలయంలో ప్రదర్శించాలని జేసీ.. అధికారులకు సూచించారు. ఈ వీసీ లో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, అమలాపురం, రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్లు హిమాన్సు కౌశిక్, అనుపమ అంజలి, ఏజీపిలు, జీపిలు,కలెక్టరేట్ ఏవో జీఎస్ శ్రీనివాస్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చెత్తను ఇంటి వద్దనే విభజించి పారిశుధ్య కార్మికులకు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. బాపూజీ కళామందిర్ లో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం, క్లీన్ ఆంధ్రా ప్రదేశ్ ప్రోగ్రామ్ కార్యక్రమంను పకడ్బందీగా నిర్వహించడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిబ్బందితో ముఖాముఖిగా తడి చెత్త, పొడి చెత్త నిర్వాహణ గురించి దృశ్య శ్రవణం ద్వారా సిబ్బందికి వివరించారు. ప్రతీ వీధిలో డస్ట్ బిన్ లో చెత్తను వేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. రహదారులు, వీధుల్లో చెత్త లేకుండా చెయ్యాలని పేర్కొన్నారు. ప్రతీ ఇంటి దగ్గర శానిటేషన్ సిబ్బంది వెళ్ళి చెత్త కలెక్షన్ తప్పనిసరిగా చెయ్యాలని చెప్పారు. పారిశుధ్య సిబ్బంది రావడంలో జాప్యం జరిగినా చెత్త ఎక్కడా వేయకుండా ఇంటి దగ్గర ఉంచాలని సూచించారు. ఎక్కడైతే చేత్త ఉండదో అక్కడ దోమలు, ఈగలు, కుక్కలు, పందులు, ఆవులు, గేదెలు లాంటివి రాకుండా ఉంటాయిని అన్నారు. సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పారిశుద్య సిబ్బంది సమన్వయంతో మన వూరు, మన వాడ, మన వీధి పారిశుధ్య రహితంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. పారిశుధ్య సిబ్బంది నుద్దేశించి కమిషనర్ పల్లి.నల్లనయ్య రచించిన పాటను అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, విశాఖపట్నం రీజినల్ డైరెక్టర్ కె.రమేష్, నగరపాలక సంస్ధ కమీషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపిజిఇఏ) జిల్లా శాఖ కార్యవర్గం శనివారం ఎన్నికైంది. సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏపిజిఇఏలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ సందర్భంగా భర్తీ చేసారు. ఇందులో రిమ్స్ స్టాఫ్ నర్స్ టి.పద్మజను స్టేట్ ఆఫీస్ బేరర్ గా ఎన్నుకోగా, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు వి.పద్మను జిల్లా శాఖ మహిళా కన్వీనర్ గాను, ఎస్.టి.ఓ సి.హెచ్.సమతా రాణాను ఆర్గనైజింగ్ సెక్రటరీగాను, అంబేద్కర్ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.పి.సుజాతను వైస్ ప్రెసిడెంట్ గాను, న్యాయవాది టి.సుధారాణిని న్యాయ సలహాదారుగాను, రిమ్స్ స్టాఫ్ నర్స్ వి.చిలకమ్మను మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగాను ఎన్నుకున్నారు. ఈ ఎంపిక ఏపిజిఇఏ జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి ఆధ్వర్యంలో భర్తీ చేసారు. కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ వి.రఘుబాబు, సహ ప్రెసిడెంట్ ఐ.నారాయణ రావు, గ్రామ సచివాలయాల విభాగం జిల్లా ప్రెసిడెంట్ కె.వెంకట సత్యనారాయణ, విశాఖపట్నం వి.ఎం.ఆర్.డి.ఏ సి.ఏఓ జి.నిర్మలమ్మ, జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరక్టర్ జి.జయదేవి, సాంఘిక సంక్షేమ గురుకులం సమన్వయ అధికారి వై.యశోద లక్ష్మి, ఏటిఓలు తవిటయ్య, సావిత్రి, డివిజనల్ పి.ఆర్.ఓ పి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి జిల్లాలో మైబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) ద్వారా పట్టణ ప్రాంతాల్లో 88 శాతం మేర ఇంటింటికీ రేషన్ పంపిణీ జరిగినట్లు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో సంచార వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ కార్యక్రమంపై జాయింట్ కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నెలలో 20 రోజుల పాటు పంపిణీ జరుగుతుందని.. మొదటగా పట్టణ ప్రాంతాల్లో పంపిణీ మొదలైందని తెలిపారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమం ప్రారంభం కాగా.. శనివారం మధ్యాహ్నానికి 58 శాతం మేర పంపిణీ పూర్తయిందన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రక్రియలో ఎదురైన సమస్యలను విశ్లేషించి, కట్టుదిట్టమైన ప్రణాళికతో పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. మార్చి 1 నుంచి ప్రతి కార్డుదారునికి ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం పంపిణీ కూపన్‌ను అందించనున్నట్లు వివరించారు. ఈ కూపన్‌లో ఇంటివద్దకు వాహనం వచ్చే తేదీ, వాహనం ఆపరేటర్ పేరు, మొబైల్ నంబరు తదితర వివరాలు ఉంటాయన్నారు. వాహనం ఇంటివద్దకు వచ్చేటప్పుడు అందుబాటులో లేనివారి కోసం సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య సరుకులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రారంభంలో చిన్నచిన్న సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని సరిదిద్ది 1076 వాహనాల ద్వారా కార్యక్రమాన్ని విజయవంతం చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి కార్డుదారునికీ ఇంటివద్దకే నాణ్యమైన బియ్యం అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వాహనం కార్డుదారుని ఇంటివద్దకే వస్తుందని, ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో లబ్ధిదారులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాహనాల ఆపరేటర్లు కూడా సంతోషంగా ఉన్నారని.. శుక్రవారం పట్టణ ప్రాంతాల్లోని ఆపరేటర్ల ఖాతాల్లో రూ.21 వేలు జమయినట్లు పేర్కొన్నారు. రిజైన్ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించినట్లు తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయ్స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకెఎస్-యువత కార్యక్రమాలు) రాష్ట్ర సలహా కమిటీ సభ్యునిగా కాండ్రేగుల వెంకటరమణ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి ఛైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వివిధ రంగాలకు చెందిన 48 మంది ప్రతినిధులు ఉంటారు. గడచిన 30 ఏళ్లుగా వినియోగదారుల రక్షణ చట్టం, 15 ఏళ్లుగా సమాచార హక్కు చట్టం అమలు, చట్టాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రజలు వినియోగించుకునేందుకు వీలుగా అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమ వ్యాప్తికి వెంకటరమణ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్ధల నుంచి ఇంత వరకు 35 పర్యాయాలు అవార్డులు, ప్రశంసాపత్రాలు ఆయన పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతను దేశ నిర్మాణ కార్యకలాపాల్లో భాగస్వామ్యం చేయడం, ఇతర మంత్రిత్వ శాఖల సమన్వయం, సహకారంలో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలతో యువత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. విలువలను అభివృద్ధి చేయడం, లౌకిక మార్గాల్లో ఆలోచింపజేయడం, నైపుణ్యం, అభివృద్ధి, ఉత్పాదక, వ్యవస్థీకృత ప్రవర్తనను అవలంభించడానికి యువతకు సహాయపడటం, యువ నాయకత్వం కోసం దీర్ఘకాలిక వ్యూహాలను అభివృద్ధి చేయడంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు. వెంకటరమణ నియామకం పట్ల వినియోగదారుల చట్టం, సమాచార హక్కు చట్టం ఉద్యమకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
చిత్తూరు జిల్లాలో వ్యవసాయం తరువాత ఎక్కవ మంది పశు పోషణ పై ఆధారపడి వారి జీవనాన్ని సాగిస్తున్నారని, కావున పశు సంపద వృద్ధికి సంబంధిత అధికారులు అందరూ సమన్వయం తో పని చేసి జిల్లాలో పాల ఉత్పత్తి పెరిగేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి ఆర్ డి ఓ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఏ పి డెయిరీ మరియు అమూల్ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు మొదటి విడత లో మదనపల్లె, రామసముద్రం మండలాలలో వంద గ్రామాలలో ప్రారంభించిన కార్యక్రమం మరియు రెండవ విడత లో 170 గ్రామాల్లో పాల సేకరణ కు చర్యలు చేపట్టి, త్వరలో ప్రారంభించేందుకు సంసిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధి ద్వారా మహిళలకు ఉపాధి ఏర్పడుతుందని, వ్యవసాయ రంగం తరువాత పశు పోషణ పై ఎక్కువ మంది ఈ జిల్లాలో ఆధారపడి జీవిస్తున్నారని, అందుకు తగిన విధంగా ప్రభుత్వం సహకార సంఘాలను ఏర్పాటు చేసి పాల సేకరణ ను చేసేందుకు చర్యలు చేపడితున్నాదని సూచించారు. ప్రపంచంలో నే అతి పెద్ద పాల ఉత్పత్తులకు సంబంధించిన సంస్థ అమూల్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మదనపల్లి, రామసముద్రం మండలాలలో మొదటి విడత వంద గ్రామాలలో పాల సేకరణ ప్రారంభించడం జరిగిందని, రెండవ విడత లో నిమ్మనపల్లి-37, కురబలకోట- 42, వాల్మీకిపురం- 21, రామకుప్పం- 11, వి.కోట -59 మొత్తం 170 గ్రామాలలో త్వరలో ప్రారంభించనున్నట్లు, ఇందుకు అధికారులు సన్నద్ధం కావాలని ఆదేశించారు. ప్రధానంగా పాలల్లో ఎస్ ఎన్ ఎఫ్, ఫ్యాట్ పెంచేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల పై పశు సంవర్థక శాఖ అధికారులు మహిళా రైతులకు అవగాహన కల్పించాలని, పాల పరిశ్రమను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక లీటర్ పాలకు రూ.4 ను ప్రోత్సాహకం గా ఇవ్వడం జరుగుతున్నదని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి మహిళా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో పాల సేకరణ కు సంబంధించి జిల్లా స్థాయి కోర్ కమిటీ జిల్లా కలెక్టర్ చైర్మన్ గా, మదనపల్లె సబ్ కలెక్టర్, జేసీ లు (రెవిన్యూ, అభివృద్ధి, సంక్షేమం), ఆర్డీఓ లు నోడల్ ఆఫీసర్ లు గా, డి ఆర్ డి ఏ, డ్వామా పిడి లు, పశు సంవర్థక శాఖ జె డి, డి సి ఓ, పంచాయతీ రాజ్ ఎస్ ఈ, ఫుడ్ ప్రాసెసింగ్ ఈ డి లు మెంబర్లుగా వ్యవహరిస్తారని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ తో పాటు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, డి ఆర్ డి ఏ, డ్వామా పి డి లు తులసి, చంద్ర శేఖర్ లు, పశు సంవర్థక శాఖ జె డి వెంకట్రావు, డి సి ఓ చంద్ర శేఖర్ రెడ్డి, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
చెరువులను కాపాడుకోవటం ద్వారా భూ గర్భ జలాలను పెంపొందించవచ్చని కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ పేర్కొన్నారు. కావున భూ గర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. భోగాపురం మండల పరిధిలోని రాజపులోవ కూడలి వద్ద శనివారం చేపట్టిన ఒలవరాజు చెరువు శుద్ధి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా చెరువు గట్టుపై ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఇబ్బందికరంగా ఉన్న దుక్కలను, చెత్తను, ప్లాస్టిక్ వ్యర్ధాలను తొలగించారు. అంతరం వివిధ రకాల మొక్కలు నాటారు. వాటి చుట్టూ రక్షణ కవచాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఈ మహాత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వామ్యం అవ్వాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు. చెరువులను కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సునీల్ రాజ్ కుమార్, డి.ఎఫ్. వో. జానకి రావు, జిల్లా అగ్నిమాపక అధికారి మోహనరావు, ఎ.డి.ఎఫ్.వో సోమేశ్వర్రావు, ఎంపిడిఓ బంగారయ్య, డా. వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచ్ కె.వి. రమణ, వై. కృష్ణ, రామ్మోహన్, ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. ఎపివో ఆదిబాబు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇరువర్గాల రాజీమార్గం ద్వారా కేసులు సత్కర పరిష్కారమవుతాయని రాజీమార్గమే రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ పేర్కొన్నారు. శనివారం ఉదయం జిల్లా కోర్టుల ప్రాంగణంలో వర్చువల్ లోక్ అదాలత్ కార్యక్రమం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సాదారణంగా కేసుల కొరకు లక్షలలో లాయర్ ఫీజులతో పాటు కోర్టులకు రావడం వలన దినసరి కూలీని కూడా కోల్పోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా పొలాలు, ఆస్తి తగాదాలు విషయంలో లక్షల రూపాయలు కోర్టు ఖర్చులు క్రింద ఖర్చుచేయవలసి వస్తుందని అన్నారు. మరికొన్ని చిన్నకేసులు అయినప్పటికీ తీర్పు వచ్చేందుకు చాలా సమయం పడుతుందని, కాని ఇరువర్గాల రాజీమార్గంతో తక్షణమే కేసులకు పరిష్కారమవుతాయని స్పష్టం చేసారు. దీనివలన ఇరువర్గాల వారికి సమన్యాయంతో పాటు సమయం, ధనం వృధా కాబోదని, ఈ విషయాన్ని కక్షిదారులు గుర్తెరగాలని ఆయన చెప్పారు. ఇటువంటి కేసులలో అసలు లబ్ధిదారులు మానసిక వేదనకు గురి అవుతుంటారని చెప్పారు. కాబట్టి న్యాయం కోసం కోర్టులకు వచ్చేవారికి సత్వర న్యాయం చేయడంలో కోర్టులు త్వరితగతిన మూలాలు కనుక్కుని న్యాయం చేసే దిశగా ప్రయత్నించాలని చెప్పారు. ప్రతీ కేసు విషయంలో ఇరుపార్టీలు తమలోని ఇగోలను విడిచి స్నేహాభావంతో, సత్సంబంధాలు పెంపొందించుకోవడానికి ఒక మంచి ఆలోచన చేసుకోవాలని, ఆ ఆలోచనే రాజీ మార్గమని స్పష్టం చేసారు. కాబట్టి ప్రతీ కక్షిదారుడు సత్వర కేసుల రాజీ కొరకు లోక్ అదాలత్ ను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కక్షిదారులను కోరారు.
జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు శిష్టు రమేష్ మాట్లాడుతూ చిన్న చిన్న తగాదాలతో కేసులు పెట్టుకుని కోర్టుల వెంట తిరుగుతూ సమయాన్ని, ధనాన్ని వృధాచేసుకోకుండా కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్ వినియోగించు కోవాలని చెప్పారు. అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఠలేశ్వరరావు మాట్లాడుతూ చిన్న,చిన్న సివిల్ కేసుల కోసం నెలల కొలది పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి కంటే సత్వరన్యాయం కొరకు లోక్ అదాలత్ ను ఆశ్రయించడం మేలని ఆయన చెప్పారు. కక్షిదారుల సౌకర్యార్ధం భారత, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు తెచ్చిన సులువైన మార్గం లోక్ అదాలత్ అని, కాబట్టి ప్రతీ కక్షిదారుడు ఈ అవకాశాన్ని సద్వినినియోగం చేసుకొని కేసుల నుండి విముక్తి పొంది సుఖమయ జీవితాలు గడపాలని ఆయన అభిప్రాయపడ్డారు.
జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి మాట్లాడుతూ ఎటువంటి వివాదాలు, వివాహ, భూతగాదా, దొమ్మి లాంటి కేసుల్లో అధిక ధనంతో పాటు సమయం కూడా వృధా అవుతుందని అన్నారు. కాని ఇరువర్గాల రాజీమార్గం వలన కేసులకు సత్కర పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. కావున ఇరుపక్షాల వారు సమన్వయం చేసుకొని రాజీపడేందుకు రాజీమార్గం ఒక మంచి మార్గం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో రెండవ అదనపు జిల్లా జడ్జ్ టి. వెంకటేశ్వర్లు, ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ పి.అన్నపూర్ణ , ప్రిన్సిపాల్ సెక్రటరీ సివిల్ జడ్జ్ కె.నాగమణి, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్.శ్రీలక్ష్మి, ఫస్ట్ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ కె. రాణి, ఎక్సైజ్ జడ్జ్ జె.కిషోర్ కుమార్, మొబైల్ కోర్ట్ జడ్జ్ జి.ఎల్.బాబు తదితరులు పాల్గొన్నారు.