విక్రమ సింహపురి యూనివర్శిటీ అధర్యం లో జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన ర్యాలీ జాతీయ సేవా పధకం, రాజనీతి శాస్త్ర విభాగం సంయుక్తముగా సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు ముఖ్య అతిధిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఓటు విలువైనదని ప్రతిఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు ఒక వజ్రాయుధం లాంటిదని దాన్ని ప్రతి ఒక్కరు సద్వినియాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.. యువతకు ఓటు హక్కుపై అవగాహన పెంచేందుకు, దేశ భవిష్యత్తులో వారిని భాగం చేయాలనే ఉద్దేశంతో నేషనల్ ఓటర్స్ డేకు రూపకల్పన చేశారని అన్నారు ఈ సంవత్సరం "ఓటర్లకు సాధికారత, జాగరూకత, భద్రత కల్పిస్తూ, సమాచారాన్ని అందించటం" (Making our voters empowered, vigilant, safe and informed) అనే అంశముతో ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలు చేపట్టమని సూచించిందని తెలిపారు ఈ కార్యక్రమ క్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్ నాయర్, యన్ ఎస్ ఎస్ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, రాజనీతి శాస్త్ర విభాగం అధిపతి డా. కె. సునీత, అసిస్టెంట్ రిజిస్ట్రార్ డా. జి సుజయ్ , డా. ఆర్ మధుమతి ప్రోగ్రాం అధికారులు డా. విజయ, విష్ణువర్ధన్ రెడ్డి, మధుకిశోర్ , డా. సునీల్, డా. గోవింద్ కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల, జగన్స్ కాలేజీ, చంద్రా రెడ్డి డిగ్రీ కళాశాల మరియు జెన్ ఎక్స్ డిగ్రీ కళాశాల నుంచి సుమారు 350 మంది విద్యార్థిని విద్యార్థులు కోవిడ్ ప్రోటోకాల్ ను పాటిస్తూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొని ఓటరు నమోదు పై అవగాహన కల్పించారు.
పర్యాటక రంగంలో మౌళిక సదుపాయాలు కీలకపాత్ర వహిస్తాయని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విసి ఆచార్య ఆర్. మధుసూధనరావు పేర్కొన్నారు. సోమవారం యూనివర్శిటీలో జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా “పర్యాటక రంగంలో స్థితిస్థాపకత వ్యూహాలు” పై ఒక రోజు ఆన్‌లైన్ వర్క్‌షాప్ నిర్వహించారు. వర్క్‌షాప్ ముఖ్య అతిథిగా వీసీ పాల్గొని మాట్లాడుతూ, రాష్ట్ర, జాతీయ స్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిపై పర్యాటక రంగం ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుందని అన్నారు. పర్యాటక రంగం ఉపాధి మార్కెట్‌కు 40 మిలియన్ల ఉద్యోగాలను అందిస్తుందని అన్నారు. ఆనందం కోసం వివిధ ప్రదేశాలను సందర్శించడానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. ఈ కరోనా మహమ్మారి వలన పర్యాటక రంగం ఇతర రంగాలతో పోల్చితే చాలా దెబ్బతిన్నదన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కొన్ని వ్యూహాలను చర్చించడానికి ఈ వర్క్‌షాప్ అవసరమవుతుందన్నారు. ప్రభుత్వం ,ఇతర వాటాదారులు ఆదాయాన్ని సంపాదించే కుటుంబాలకు వివిధ పర్యాటక ప్రాతాలపైనా అవగాహన కల్పించాలన్నారు. దేశీయ , విదేశీ పర్యాటకుల రాకపోకలను ఆకర్షించడానికి మౌలిక సదుపాయాలు ,ఇతర సౌకర్యాలను అభివృద్ధి చేయడంపై విధాన నిర్ణేతలు దృష్టి పెట్టాలని సూచించారు. సుదీర్ఘ మైన సముద్ర తీరం, ఆధ్యాత్మిక ప్రదేశాలు, బయో డైవర్సిటీ పార్కులు , పర్వతాలు మరియు ప్రకృతి దృశ్యాలతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి భౌగోళిక ప్రయోజనం కలిగి ఉంటుందన్నారు. వర్క్‌షాప్ కన్వీనర్ డాక్టర్ ఎం. త్యాగరాజు, పర్యాటక నిర్వహణ విభాగం విభాగాధిపతి కృషిని వైస్ ఛాన్సలర్ ప్రశంసించారు. వర్క్ షాప్ యొక్క రిసోర్స్ పర్సన్లుగాతమిళనాడు సెంట్రల్ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వినోదన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం మరియు ట్రావెల్ మేనేజ్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సౌమేంద్ర నాథ్ బిశ్వర్లను ఆహ్వానించారు. ఆన్‌లైన్‌లో వంద మంది పైగా వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎం.చంద్రయ్య, రెక్టర్; ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ సుజా ఎస్.నాయర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో అధిక సంఖ్య లో వోటర్లను నమోదు గావించడములో విశేష కృషి చేసినందుకు జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నరు విశ్వ భూషన్ హరిచందన్ చేతుల మీదుగా సోమవారం రాజభవన్ దర్బార్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డును అందుకున్నారు. తన నాయకత్వ ప్రతిభతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా అమలుచేసి ఓటర్ల జాబితాలో సవరణలకు సంబంధించిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించడం, జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించినందుకు ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాకలెక్టర్ అవార్డు అందుకోవడం పట్ల జిల్లా అధికారులు హర్షం వ్యక్తం చేశారు.
ధనిక, పేద, కులం, మతం, ప్రాంతం, లింగ వివక్షకు తావులేకుండా సమానత్వానికి ప్రతీక గా అందరికీ ఓటు హక్కు కల్పించిన దేశం మనదని అని ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సోమవారం నాడు స్థానిక విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనా లో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓటు హక్కు వినియోగించుకోవడం మనందరి పవిత్రమైన బాధ్యత అని, ముఖ్యంగా కొత్త గా ఓటర్లు గా నమోదైన యువతీయువకులు ఈ విషయాన్ని విస్మరించరాదని అన్నారు. సమాజంలో ని సమస్యలను పరిష్కరించగలిగే సమర్ధత కలిగిన నాయకులను ఆలోచించి ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు 11 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఇచ్చిన సందేశాన్ని ప్రదర్శించారు. అనంతరం విశాఖపట్నం ఆర్డీవో పి. కిషోర్ కార్యక్రమానికి హాజరైన వారందరిచే, ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
తరువాత జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తున్న వ్యవస్థ గా ప్రఖ్యాతి గాంచిందని అన్నారు. ప్రజల భాగస్వామ్యం తోనే ప్రజాస్వామ్యం బలపడుతుందని, 18 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు గా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి సంవత్సరం, ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్ల ను నమోదు చేసుకోవడంతో పాటు, వలసలు, మరణాలు, ఇంకా వివరాలలో మార్పులు చేర్పులు చేస్తారని తెలిపారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, ఓటర్ల నమోదు నుంచి చివరకు పోలింగ్ అనంతరం ఫలితాలు ప్రకటించే వరకు వేగంగా, ఖచ్చితంగా పనిచేస్తున్నారని తెలిపారు. అందులో భాగంగానే ఈరోజు ఈ- ఎపిక్ ( E-epic) కార్డులను ఆవిష్కరించారని అన్నారు. తరువాత జీవీఎంసీ కమీషనర్ డా. జి.సృజన మాట్లాడుతూ, ఓటు అనేది హక్కు, బాధ్యత ల మేలు కలయిక అని వివరించారు. ఓటు మన జీవన గమనాన్ని మార్చే శక్తిని కలిగి ఉందని తెలిపారు.
యువత వివేకంతో, సరియైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఇంకా ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ,,జాయింట్ కలెక్టర్ ఆర్. గోవింద రావు లు కార్యక్రమంలో ప్రసంగించారు. తరువాత కొత్త గా ఓటు హక్కు పొందిన యువతీయువకులకు ఓటరు గుర్తింపు కార్డులను అందజేశారు. సీనియర్ సిటిజన్ వడ్లమూడి దుర్గ ను సన్మానించారు. ఓటరు నమోదు కార్యక్రమం లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బంది కి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పటిష్టమైన సుస్థిర నిర్మాణాలను జరపాల్సిన అవసరం ఉందని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, ఏఐసిటిఇ సంయుక్తంగా ‘షాలో అండ్ డీప్ ఫౌండేషన్’ అంశంపై నిర్వహిస్తున్న రెండు వారాల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ పోగ్రామ్‌ను ఆయన ఆన్‌లైన్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో బహుళ అంస్థుల భవనాల నిర్మిణం, బ్రిడ్జీలు, ఫ్లైఓవర్‌లు నిర్మాణాలు పెరిగాయన్నారు. వీటి నిర్మాణంలో నేల స్వభావాన్ని పరిక్షీంచే సాంకేతిక విధానాలు కలిగి ఉండటం, తదునుగుణంగా అవసరమైన ఫౌండేషన్ (పునాది)ని వేసుకోవడం ఎంతో అవసరమన్నారు. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఎంతో ఖ్యాతి గాంచిందని, షాలో, డీప్ ఫౌండేషన్‌ల నిర్మాణంలో వీరి నిపుణతను ఉపయోగించుకోవాలని సూచించారు. విభాగాధిపతి ఆచార్య టి.వి ప్రవీణ్ మాట్లాడుతూ అధ్యాపకులు, ఆచార్యుల బోధన పటిమను, జ్ఞానాన్ని వృద్ది చేసుకోవడానికి ఎఫ్‌డిపి ఉపకరిస్తుందన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఐఐటి గాంధీనగర్ ఎమిరిటస్ ప్రొఫిసర్ ఆచార్య జి.వి రావు, ఆచార్య కె.ఎస్ బీన తదితరులు ప్రసంగించారు. రెండు వారాల ఎఫ్‌డిపిలో భాగంగా విశిష్ట ఆచార్యుల ప్రసంగాలను ఏర్పాటు చేస్తున్నట్లు సదస్సు సమన్వయకర్త ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఎఫ్‌డిపిలో 120 మంది అధ్యాపకులు, ఇంజనీర్లు, పరిశోధకులు దేశం నలుమూలల నుంచి పాల్గొంటున్నారన్నారు.
అనంతపురం జిల్లాలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక అనంతపురం పోలీస్ పరేడ్ మైదానం వేదికగా జరగనున్నాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకం ఆవిష్కరణతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం పరేడ్ సమీక్ష, జిల్లాలో ప్రగతి నివేదికపై తన ప్రసంగం, సాంస్కృతిక కార్యక్రమాలు, విశిష్ట సేవలు అందించిన వారికి ప్రశంసా పాత్రలు జారీ చేయడం వంటి కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు స్టాల్స్ సందర్శనతో పరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగించి, కొనసాగింపుగా సాయంత్రం ఆరు గంటల నుంచీ లలిత కళా పరిషత్తులో జాతీయ సమైక్యతపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
మంచి నేతల ఎంపిక ద్వారా సామాజిక అభివృధ్ధి సాధ్యపడుతుందని సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం బాపూజీ కళామందిరంలో 11వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విచ్చేసిన సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది ఎన్నికల ప్రక్రియగా అభివర్ణించారు. సమాజంలో సమస్యలను పరిష్కరించుకుని మంచి పాలనను పొందే అవకాశం కేవలం ఓటింగ్ ద్వారా మాత్రమే సాధ్యపడుతుందన్నారు. గ్రామాలలోను, పట్టణాలలోను నెలకొన్న సమస్యలను పరిష్కరించే వారెవరు అనేది ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించే సరైన వారినే నాయకులుగా ఎన్నుకోవాలన్నారు. 2019 సం.లో జరిగిన ఎన్నికలలో 80 శాతం ఓటింగ్ జరిగిందని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తదుపరి ఎన్నికలను ప్రతీ 5 సం.లకు ఒక సారి విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతీ ఓటుకు ఎంతో విలువ వున్నదన్నారు. కావున సామాజిక అభివృధ్ధికి తోడ్పడే వారినే నాయకులుగా ఎన్నుకోవాలన్నారు. కావున ఎలక్షన్ అనేది మంచి పాలనను అందించే నాయకులను ఎన్నుకునే ఒక పండుగ అని అన్నారు. పౌరులు సమస్యలపైన, సమాజంపైన బాధ్యతతో వుండాలన్నారు. ప్రస్తుతం సాంకేతికతను వుపయోగించుకుని ఎన్నికలను నిర్వహించుకోవడం జరుగుతున్నదన్నారు. మన ఊరు, మన గ్రామాన్ని అభివృధ్ధి చేసుకోవడానికి యువత పాత్ర కీలకమన్నారు. ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఓటును సద్వినియోగపరచుకుని, మంచి నాయకులను ఎన్నుకోవాలని అన్నారు. దేశాన్ని పటిష్టవంతంగా రూపొందించాలని పిలుపునిచ్చారు. 18 సం.లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని, నిష్పక్షపాతంగా ఓటు వేయాలని దేశాభివృధ్ధికి పాటు పడాలని చెప్పారు. ట్రైనీ కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఒక్కరి జీవితంలోను సుమారు 10 నుండి 12 సార్లు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం వస్తుందని అన్నారు. కావున ఓటింగ్ ప్రక్రియలో ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని తెలిపారు. ేముందుగా డా.బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైనది. ఓటింగ్ పై ప్రతిజ్ఞ, గోడపత్రిక ఆవిష్కరణ చేసారు. వ్యాస రచనపోటీలు, రంగవల్లుల పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. స్వాతీ సోమనాధ్, శివకుమార్ల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఓటింగ్ నమోదుపై లఘునాటికలు జరిగాయి. ఎక్కువ సార్లు ఓటు హక్కును వినియోగించుకున్న సీనియర్ సిటిజెన్స్ జి.నాగేశ్వరరావు, ఎం.చంద్రమౌళీశ్వరరావు, యు.శ్రీరామ్, మల్లేశ్వరరావు, సత్యన్నారాయణ లకు సన్మానం చేసారు. నూతన ఓటర్లకు ఓటరు కార్డులను అందించారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ ఎం. నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి, డా.అంబేద్కర్ విశ్వవిద్యాలయం డి.ఓ.ఎ. ప్రొ. జి.తులసీరావు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిశోర్, రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన్ రావు, శివానీ కాలేజి డైరక్టర్ డి.వెంకటరావు, సన్ డిగ్రీ కలేజీ డైరక్టర్ జయరావు, తదితరులు పాల్గొన్నారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం ఉదయం స్వయంగా పరిశీలించారు. జాతీయ పతాక ఆవిష్కరణ, పేరేడ్ , శకఠాల ప్రదర్శన, సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రశంసా పత్రాల పంపిణీకి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ స్వాతంత్ర్య సమరయోధులకు, అధికారులకు, చిన్నారులు, కళాకారుల కొరకు వేర్వేరు గ్యాలరీలను ఏర్పాటుచేయాలని సూచించారు. స్టేడియంకు వచ్చే ఆహుతుల కొరకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను ఏర్పాటుచేయాలని నగరపాలక సంస్థ కమీషనర్ ను ఆదేశించారు. పాఠశాల విద్యార్ధినీ విద్యార్ధులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నందున వారికి ప్రత్యేకంగా వేదికను ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ సూచించారు. భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలని, అధికారులందరూ ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆర్.శ్రీరాములునాయుడు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఉపాధికల్పన అధికారి జి.శ్రీనివాసరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శతశాతం ఓటింగ్ ద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. సోమవారం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నగరపాలక సంస్థ కార్యాలయం నుండి బాపూజీ కళామందిర్ వరకు భారీ రాలీ జరిగింది. జిల్లా కలెక్టర్ జె.నివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మన దేశం ప్రజాస్వామ్య దేశమని, ఓటింగ్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి పునాది అని, రాజ్యాంగం ప్రసాదించిన ఒక వరమని అన్నారు. 18 సం.లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలన్నారు. మంచి నాయకుల ఎంపిక ఓటింగు ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. ఓటు హక్కు కలిగిన వారంతా బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మంచి నాయకులను ఎన్నుకుని ఒక మంచి సమాజ నిర్మాణానికి పునాదులు వేయాలన్నారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా 1952 వ సం.లో ఏర్పాటు అయ్యిందని తెలిపారు. ఒక్కప్పుడు 17 శాతం ఓటింగ్ జరిగిందని, ఇప్పుడు ప్రజలలో మంచి చైతన్యం వచ్చిందన్నారు. 2019 ఎలక్షన్ లో 80 శాతం ఓటింగ్ జరిగిందన్నారు. ఇది ఒక మంచి పరిణామమని అన్నారు. ఇక ముందు శతశాతం ఓటింగ్ జరగాలన్నారు. 2019 లో నోటా ఓటింగ్ ను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఎన్నికలలో పాల్గొన్న అభ్యర్ధులపై విశ్వాసం లేనట్లయితే నోటా ఓటు ద్వారా తిరస్కరించవచ్చునని తెలిపారు. సుమార్ వెయ్యి నుండి 15 వేల మంది నోటా ఓటును 2019 ఎన్నికలలో వినియోగించుకోవడం జరిగిందన్నారు. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా, ఎపిక్ (EPIC) ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో ఆన్ లైన్ ద్వారా ఓటును నమోదు చేసుకునే సౌలభ్యాన్ని కలిగించారని కావున యువత ఈ ప్రక్రియ ద్వారా తక్షణమే ఓటును నమోదు చేసుకుని, ఓటు హక్కును శతశాతం సద్వినియోగపరచుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమీత్ కుమార్, ట్రైనీ కలెక్టర్ నవీన్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి బి.దయానిధి రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ.కిషోర్, నగర పాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య, సచివాలయ సిబ్బంది, ఎన్.సి.సి. విద్యార్ధినీ విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.
ఓటరుకు ఓటే వజ్రాయుధమని.. 18 సంవత్సరాలు నిండిన వారు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఓటు హక్కును ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా కాకినాడలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ఓటు హక్కుపై ప్రజల్లో స్ఫూర్తి కలిగించే ఉద్దేశంతో నిర్వహించిన ర్యాలీలో జిల్లా ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి హాజరై, జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమానికి హాజరైన వారితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం భారత ఎన్నికల సంఘం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానిక్ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఈ-ఎపిక్ కార్డు)పై ఓటర్లకు అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం తొలిసారిగా 2011, జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అప్పటి నుంచి ఏటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగానికి సంబంధించి వివిధ దేశాలతో పోల్చితే దురదృష్టవశాత్తు మన దేశంలో కొంత వ్యత్యాసం కనిపిస్తోందన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారత ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తోందని.. ఈవీఎంలు, వెబ్ క్యాస్టింగ్ వంటి ప్రక్రియలను జోడించిందన్నారు. గతంలో పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే కొంత ఇబ్బంది పడాల్సి వచ్చేదని, ఇకపై అలాంటి పరిస్థితి లేకుండా పోలింగ్ కేంద్రాలను గూగుల్ మ్యాప్స్ తో అనుసంధానించినట్లు వివరించారు. వచ్చే ఎన్నికల నుంచి ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఓ మనిషి తన జీవిత కాలంలో వివిధ ఎన్నికల్లో దాదాపు 20సార్లు ఓటు వేసే అవకాశం వస్తుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమని స్పష్టం చేశారు. ఓటు హక్కు కోసం రిజిస్ట్రేషన్ చేయించుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని.. ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండానే ఆన్‌లైన్లో ఫామ్-6 ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. అదే విధంగా 2021, జనవరి 25 నుంచి సురక్షితమైన ఎలక్ట్రానిక్ ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఈ-ఎపిక్ కార్డు)ను మొబైల్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. ఈ డిజిటల్ కార్డును గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కొత్తగా ఓటు హక్కు పొందినవారికి కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఓటు హక్కు అనేది దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముక అని.. ఈ హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని వినియోగించుకోవాలని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ పేర్కొన్నారు. కొత్తగా ఓటు హక్కు వినియోగించుకునే వారి రూపంలో ప్రజాస్వామ్యానికి కొత్త శక్తి చేకూరుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కును పొందడం, వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం సరళీకృత విధానాలను అమలుచేస్తోందని వివరించారు. తొలిసారిగా ఓటు హక్కు ఉపయోగించుకోనున్న యువతకు ఎస్‌పీ శుభాకాంక్షలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా ఎలాంటి ఒత్తిడికి గురవకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయనున్నట్లు కొత్తగా ఓటు హక్కు పొందిన డిగ్రీ విద్యార్థిని గంటుబోయిన సాయిలత పేర్కొన్నారు.
యువ ఓటర్లు, ఉత్తమ అధికారులకు సత్కారం:
‘ఓటర్లకు సాధికారత కల్పించడం, అప్రమత్తంగా ఉంచడం, సురక్షితంగా మరియు సమాచారం అందించడం (Making Our Voters Empowered, Vigilant, Safe and Informed) ఇతివృత్తంతో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉన్నతాధికారులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ యువ ఓటర్లు సరగాడ హరిత, గంటుబోయిన సాయిలత, ఓలేటి పవన్, దాసరి భవానీ శంకర్‌లను సత్కరించారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఓటరు నమోదు ప్రక్రియలో ఉత్తమ పనితీరు కనబరచిన 46 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రశాంసా పత్రాలు అందించారు. కార్యక్రమంలో కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ అధికారి హిమబిందు, అదనపు ఎస్‌పీ కరణం కుమార్, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కలెక్టరేట్ ఎన్నికల డీటీ ఎం.జగన్నాథం, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువ ఓటర్లు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆర్ఎంసీ విద్యార్థులు హాజరయ్యారు.
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకెళ్లడంతోపాటు, తాము అండగా ఉంటానని వైఎస్సార్సీపీ విశాఖ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల పేర్కొన్నారు. సోమవారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-2021 రాష్ట్ర డైరీని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్, జర్నలిస్టు ప్రతినిధులతో కలిసి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కరమాని విజయ నిర్మల మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తో మాట్లాడి సమస్య పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తామని అన్నారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన వినతిని, ప్రస్తావించిన సమస్యల స్వయంగా జర్నలిస్టులను పేరు పేరునా అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడంతో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరిస్తున్నారని, అలాంటి వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రజాప్రతినిధులగా తమపై ఉందని అన్నారు. జర్నలిస్టులకు ఎలాంటి సహాయం కావాలన్నా చేయడానికి తాను సిద్ధంగా ఉన్నామని ఆమె భరోసా ఇచ్చారు. ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉన్న సమస్యలను పరిష్కరించే విషయంలో తోడుంటామని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ పెద్దలంతా ఎంతో సముఖుంగా ఉన్నారని అక్కరమానికి వివరించారు. జర్నలిస్టులకు గృహ వసతి, భీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పద్మజ, ప్రభాకర్, సూర్య, మాధవి, జుబేర్, దేవిశ్రీ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని ఆదివారం తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టిటిడి అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, అర్చక బృందం కలిసి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. గవర్నర్ ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటం, డైరీ, క్యాలెండర్ అందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్, రిసెప్షన్ డెప్యూటీ ఈవో బాలాజి, పేష్కార్ జగన్మోహనాచార్యులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టులు వాస్తవాలను ఆధారాలతో సహా బయటకు వెలికితీసినపుడే సమస్యల పరిష్కారానికి, అవినీతిని నియంత్రించడానికి వీలుపడుతుందని హోమంత్రి మోకతోటి సుచురిత అన్నారు. ఆదివారం విజయవాడ లోని హోటల్ ఐలాపురం నగేష్ బూర్తి రచించిన ఒక జర్నలిస్టు ప్రయాణం అనే పుస్తకాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలకు, ప్రభుత్వానికి కేవలం జర్నలిస్టులు మాత్రమే వారధులుగా ఉంటారని, జర్నలిస్టులవలనే బాహ్య ప్రపంచంలో జరిగే అన్ని అంశాలు ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అలాంటి జర్నలిస్టులు ఎంతో నిబద్దతతో పనిచేస్తే మంచి ఫలితాలు సాధించడానికా ఆస్కారం వుంటుందని అన్నారు. సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలమని అన్నారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత జర్నలిస్ట్ సుబ్రమణ్యం, జెఎజె జాయింట్ సెక్రటరీ కొండలరావు, ఏపిజెఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కృష్ణాంజినేయులు, సీనియర్ జర్నలిస్ట్ చెన్ను పెద్దిరాజు, రచయిత జాన్సన్, గోపి, తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ద్రుష్టికి వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన సమస్యలను తీసుకెళ్లడంతోపాటు, తాను అండగా ఉంటానని వైఎస్సార్సీపీ ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కెకెరాజు అన్నారు. ఆదివారం స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్-2021 రాష్ట్ర డైరీని అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్, జర్నలిస్టు ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు వచ్చేలా తమవంతు సహకారం అందిస్తామని చెప్పారు. ఈ మేరకు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేసిన వినతిని, పేర్కొన్న సమస్యలను నిశితంగా పరిశీలించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వున్న జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా వుందని, అయినప్పటికీ కొన్ని దీర్ఘకాలిక సమస్యలు పెండింగ్ లోనే ఉండిపోయాయనే మీ ద్వారా మరోసారి తెలుసుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జర్నలిస్టులంతా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు గృహ వసతి కల్పించాలని, అదేవిధంగా భీమా సౌకర్యం కల్పించి, ఇన్స్యూరెన్సు సౌకర్యాన్ని కూడా కల్పించాలన్నారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పనిచేసిన జర్నలిస్టులకు కరోనా వేక్సిన్ ను వేయాడానికి ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించాలని కోరారు. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వ పరంగా ఆదుకుంటే తప్పా జర్నలిస్టుల సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తొలగే సమస్య లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పద్మజ, ప్రభాకర్, సూర్య, మాధవి, జుబేర్, దేవిశ్రీ, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇన్నివేల మంది పార్టీలోకి చేరడం ఎంతో ఆనందంగా వుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు.శనివారం జిల్లా పరిషత్ అంకోసాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టిడిపి, బీజేపీ, జనసేన తదితర పార్టీల నుంచి సుమారు 2వేల మంది మంది కార్యకర్తలు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లక్ష్యం ఒక్కటే దేశంలోనే బెస్ట్ స్టేట్ టా ఏపీని తీర్చిదిద్దడమేనన్నారు. అందులో భాగంగానే ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా 26 మంది వైద్యులతోపాటు ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నజిగిషా అనే మెడికో పార్టీలో చేరడం మరువలేని విషయమని అన్నారు. అంతేకాకుండా 62 మంది బూత్ లెవల్ ప్రెసిడెంట్టు కూడా పార్టీలో చేరినట్టు ఎమ్మెల్యే చెప్పారు. వీరితోపాటు ఇద్దరు న్యాయవాదులు చేరారని, వీరంతా మంచి పండుగ వాతావరణంలో పార్టీలోకి చేరడంతో అంకోసా మొత్తం కోలాహలంగా తయారైంది. పార్టీలోకి చేరిన వారందరినీ ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. వీరంతా పార్టీని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఎమ్మెల్యే. కార్యక్రమంలో దక్షిణ నియోజవర్గ నాయకులు, కార్పోరేట్ అభ్యర్ధులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.