రాష్ట్రంలో రహదారుల అభివృద్ది, పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం .శంకర నారాయణ తెలిపారు. బుధవారం ఆయన, శాఖ ముఖ్య కార్యదర్శి ఎం .టి . కృష్ణబాబు తో కలిసి నగరంలో నిర్వహించిన ప్రాంతీయ సమీక్షా సమావేశంలో శాఖ పని తీరు, పనుల పురోగతిపై సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియతో మాట్లాడుతూ రాష్ట్రంలోని రహదారుల పరిస్దితిపై నాలుగు ప్రాంతాలలో సమీక్షా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా తూర్పు గోదావరి , విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల స్దితిగతులపై విశాఖపట్నంలో సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. యుద్ద ప్రాతిపదికన రోడ్ల మరమత్తులు చేపట్టడానికి రూ 1000 కోట్లు మంజూరు చేసామని, మార్చి నెలాఖరులోగా ఈ నిధులను ఖర్చు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. “నివర్” తుఫాను వల్ల నష్టపోయిన ప్రాంతాలలో రోడ్లరిపేరుకు రూ .200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్ర రహదారుల అభివృద్ది సంస్థ ద్వారా రాబోయే 3 సంవత్సరాల కాలంలో రోడ్ల అభివృద్దికి రూ. 2200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. పెట్రోలు, డీజిల్ అమ్మకాలపై లీటరుకు రూ. 1 చొప్పున రోడ్ సెస్ విధించి, ఆ నిధులను రహదారుల అభివృద్దికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
న్యూ డెవలప్ మెంట్ బ్యాంకు (ఎన్ డి బి) సహకారంతో రూ. 6000 కోట్లు నిధులతో రాష్ట్రంలో జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లు వేస్తున్నామని, 450 బ్రిడ్జిలు పున నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. ఇందులో మొదటి దశలో రూ. 2500 కోట్ల పనులకు టెండర్లు పిలిచామని, రివర్స్ టెండరింగ్ విధానాన్ని అనుసరించడం వలన రూ. 85 కోట్లు ఆదా అయిందని తెలిపారు. ఇంకా నాబార్డు సంస్థ నుంచి నీడా పథకం కింద రూ. 1150 కోట్లతో రహదారులను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి , కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సంప్రదించి రాష్ట్రానికి రూ. 12500 కోట్ల జాతీయ రహదారుల పనులను మంజూరు చేయించారని తెలిపారు. ఈ రహదారుల నిర్మాణం నిమిత్తం అవసరమైన భూమి సేకరణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. భూ సేకరణ జరిగిన రెండున్నర ఏళ్లలో ఈ పనులు పూర్తి అవుతాయని తెలిపారు.
రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు మాట్లాడుతూ రహదారుల పనుల పురోగతిలో భూ సేకరణ కీలకమని, అందుకే జిల్లా యంత్రాంగంతో సమన్వయంతో భూ సేకరణ పై ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాలుగు జిల్లాల ఈ ఎన్ సి లు , ఎస్ ఇ లు, ఇ ఇ లు, డి ఇ లు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం త్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న తోడు, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ బీమా పథకాల అమలులో రాష్ట్రం లోనే జిల్లా ప్రధమంగా నిలిచింది. లక్ష్యాలను సాధించడానికి ప్రత్యేక అధికారులను నియమించి, బ్యాంకర్లతో నిరంతరం చర్చిస్తూ ముందుకు వెళ్లేందుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ రూపొందించిన ప్రత్యేక వ్యూహం ఇందుకు తోడ్పడింది. ఈ మూడు పథకాల అమల్లో జిల్లా గణనీయమైన పురోభివృద్దిని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ మూడు పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించి అమలు చేశారు. జిల్లా అధికారులను పరుగులు పెట్టించడమే కాకుండా, తాను సైతం స్వయంగా పలు బ్యాంకులకు వెళ్లి తనిఖీ చేశారు. జాయింట్ కలెక్టర్లు కూడా వివిధ బ్యాంకులను తనిఖీ చేశారు. పథకాల పర్యవేక్షణకు డిఆర్‌డిఏ కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా ఒక కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో మండలాలకు ఐటిడిఏ పివో, జాయింట్ కలెక్టర్(ఆసరా), సబ్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్‌డిఓ, డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారులను ప్రత్యేక పర్యవేక్షణాధికారులను నియమించారు. వీరు నేరుగా ఆయా బ్యాంకు అధికారులతో మాట్లాడి, యూనిట్ల గ్రౌండింగ్‌కు కృషి చేశారు. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యలు ఎదురైతే, వాటిని విశ్లేషించి, పర్యవేక్షించేందుకు జిల్లా కేంద్రం నుంచి ఒక కోర్‌టీమ్ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటలు వరకూ సిద్దంగా ఉండి పనిచేసింది. వివిధ శాఖల పరంగా ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి, సాంకేతిక సహకారాన్ని అందించేందుకు క్రైసిస్ మేనేజ్‌మెంట్ టీమ్ ఆధ్వర్యంలో, ఆయా శాఖల సిబ్బంది సైతం కంట్రోల్ రూములో 24 గంటలూ అందుబాటులో ఉండి పనిచేస్తున్నారు. పర్యవేక్షిస్తున్నారు.
ఈ ప్రత్యేక కార్యాచరణ కారణంగా ఈ పథకాల అమలు వేగవంతం అయ్యింది. వైఎస్ఆర్ చేయూత పథకం క్రింద 2106 దరఖాస్తులు అందగా శతశాతం లక్ష్యాలను సాధించడం ద్వారా, రాష్ట్రంలోనే మన జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. జగనన్న తోడు పథకం క్రింద ఇప్పటివరకు 19,004 దరఖాస్తులను బ్యాంకులు ఆమోదించి 98.69 శాతం రుణాలను అందించాయి. వై.ఎస్.ఆర్ బీమా క్రింద 3,91,377 బ్యాంకు ఖాతాలను నమోదు చేసి 69.40 శాతాన్ని సాధించడం జరిగింది. ఇంకను 21,535 దరఖాస్తులు నమోదు చేయవలసి ఉండగా వీటిని కూడా వేగంగా పరిశీలించి నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతిష్టాత్మక మైన మూడు పథకాల అమలులో జిల్లా అగ్రస్థానంలో నిలిపినందుకు కలెక్టర్ అధికారులను అభినందిస్తూ ఈ స్థానాన్ని కొనసాగించేలా చూడాలన్నారు.
ప్రతి మొక్క అన్ని రకాల నేలల్లోనూ వృద్ధి చెందే అవకాశం వుండదని..ఆయా నేల స్వభావాలకు తగిన మొక్కలనే గుర్తించి నాటేందుకు చర్యలు చేపట్టాలని తద్వారా జిల్లాలో పచ్చదనం పెంచేందుకు దోహదపడాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలకు సూచించారు. దీర్ఘకాలంలో పెరిగే మొక్కలు కాకుండా తక్కువ వ్యవధిలోనే వృద్ధి చెందే మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా సామాజిక అటవీ అభివృద్ధి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అధ్యక్షతను కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశువులు సంచరించే ప్రాంతాల్లో పశువులు తినే అవకాశం లేని మొక్కలను నాటాలన్నారు. మొక్కలకు తగిన సంరక్షణ, రక్షణ వున్నచోట పూలు, పళ్లజాతుల మొక్కలను నాటవచ్చని సూచించారు. మొక్కలు నాటడంతోపాటు ఇప్పటికే వున్న మొక్కలు, చెట్లు, వృక్ష సంపదను పరిరక్షించుకోవడానికి కూడా చర్యలు చేపట్టాల్సి వుందని కలెక్టర్ చెప్పారు. మొక్కలు చెట్లను నరికివేతకు పాల్పడటం వంటి చర్యలు నిరోధించడానికి కూడా అధికారులు తమ పరిధిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో మొక్కలు చెట్లకు ప్రకటన బోర్డులను మేకులు వేసి ఏర్పాటు చేసే వారిపై అందుబాటులో వున్న చట్ట నిబంధనలను అనుసరించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
మొక్కలు, చెట్లకు ఎక్కడ బోర్డులు తగిలించి వున్నా వ్యక్తిగతంగా స్పందించి వాటిని ఏర్పాటు చేసిన వ్యక్తులు లేదా సంస్ధలపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. ఎక్కడైనా ఖాళీ స్థలాల్లో లేదా ఇళ్లలో వున్న చెట్లు నరికినా వాటి స్థానంలో అంతకు రెట్టింపు స్థాయిలో మొక్కలు నాటితేనే చెట్లు నరికేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. ప్రభుత్వ సంస్థలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందన్నారు. రోడ్ల వెడల్పు కార్యక్రమం కోసం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖలు చెట్లు తొలగించాల్సి వస్తే ముందుగా తొలగించే చెట్ల స్థానంలో వేరేచోట మొక్కలు నాటిన తర్వాతే చెట్లను తొలగించాలన్నారు. మొక్కలు, చెట్ల నుండి రాలే ఆకులను తగులబెట్టడం వల్ల వాటికి సమీపంలోని మొక్కలు, చెట్లు నశిస్తున్నాయని, దీనికి ప్రత్యామ్నాయంగా రాలిపోయిన ఆకులను ఎరువుగా వినియోగించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
వ్యక్తులు, జంతువుల పరిరక్షణకు క్లబ్‌లు ఏర్పాటు చేసిన తరహాలోనే మొక్కలు, చెట్ల పరిరక్షణకు కూడా క్లబ్‌లు ఏర్పాటుచేసే దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మొక్కల పరిరక్షణ, సంరక్షణకు పాటుపడేందుకు సంస్థలు, వ్యక్తులు అండగా నిలవాల్సి వుందని, ఇందుకు ఈ క్లబ్‌లు దోహదం చేస్తాయన్నారు. జిల్లా అధికారులంతా తమ ఇళ్లలో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. తమ ఇళ్లలో మొక్కలు నాటేందుకు తగిన స్థలం అందుబాటులో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లో నాటిన మొక్కల సంరక్షణకు బాధ్యత తీసుకోవాలని సూచించారు. మనం పేర్కొంటున్నట్టు నిత్యావసర వస్తువులంటే బియ్యం, పప్పులు తదితర సరుకులు కాదని స్వచ్ఛమైన గాలి, నీరు, నేలనే నిత్యావసరాలుగా భావించాలన్నారు. పర్యావరణాన్నిప్రకృతిని పరిరక్షించుకోవడం, పెంపొందించడం అనే అంశాలపై పిల్లల్లో సానుకూల భావాలను ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా యంత్రాంగం చేపట్టిన మొక్కలు పెంచే కార్యక్రమాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పారిశ్రామిక విధానంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటుకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. పర్యావరణహిత పరిశ్రమలనే ఇక్కడ ఏర్పాటు చేసేందుకు విధాన నిర్ణయం తీసుకుందన్నారు.
జిల్లాలోప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా వచ్చే ఆరు నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా సఫల్ పేరుతో ఒక ప్రాజెక్టు మంజూరు కానుందని కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని దాదాపు వంద గ్రామాల్లో పూర్తిస్థాయిలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించిన అనంతరం కేంద్రం జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మంజూరు చేస్తోందన్నారు.
మొక్కలు నాటడంతోపాటు జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలకు, పరిశుభ్రత కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని దీనిలో భాగంగానే 14వ ఆర్ధిక సంఘం నిధులను పెద్ద ఎత్తున స్వచ్ఛత కార్యక్రమాలకే ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు.
జిల్లా సామాజిక అటవీ అధికారి బి.జానకిరావు మాట్లాడుతూ గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 1.24 కోట్ల మొక్కలు నాటే లక్ష్యాన్ని జిల్లాకు కేటాయించగా లక్ష్యానికి మించి 1.25 కోట్ల మొక్కలు నాటడంద్వారా మన జిల్లా రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.సమావేశంలో జిల్లా అటవీ అధికారి సచిన్‌గుప్తా, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి. సునీల్ రాజ్ కుమార్, గిరిజన సంక్షేమశాఖ డి.డి. కిరణ్ కుమార్, డిఆర్‌డిఏ ఏపిడి సావిత్రి, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డి.పి.ఎం. పద్మావతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం సమాచారశాఖ డిడి మణిరామ్ ను కలిసి బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖలోని జిల్లా పరిషత్ జంక్షన్ లోని సమాచారాశాఖ కార్యాలయంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను డిడి మణిరామ్ కు వివరించారు. ముఖ్యంగా జర్నలిస్టుల ప్రధానహక్కు అయిన అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జిఓనెంబరు 142 అమలుతో చాలా మంది అక్రిడిటేషన్లు కోల్పోయే అవకాశం వుందని యూనియన్ అధ్యక్షుడు డిడికి వివరించారు. అంతేకాకుండా జీఎస్టీ పరిధిలోకి రాని న్యూస్ ఏజెన్సీలు, చిన్న పత్రికలకు జీఎస్టీ నిబంధన రద్దుచేయాలని, ఆన్ లైన్ విధానంలో ప్రెస్ క్లిప్పింగులు అధిక సంఖ్యలో సమర్పించడానికి వీలు పడనందున, నేరుగా పత్రికలుగానీ, క్లిప్పింగుల ఫైల్స్, స్వీకరించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన డిడి స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమర్పించిన సమస్యలను, డిమాండ్ లను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళతానని జర్నలిస్టులకు తెలియజేశారు. అదేసమయంలో జర్నలిస్టులు వ్రుత్తిలోకి వచ్చేవారంతా కనీస డిగ్రీ అర్హత కలిగివుండేటట్డు చూసుకోవడం, ఉన్నత విలువలతో జర్నలిస్టుగా మసలు కోవడం ద్వారా ప్రభుత్వ గుర్తింపు కూడా వెంటనే వచ్చే అవకాశం వుంటుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిస్టులంతా టెక్నాలజీకి చేరువక కావాలని డిడి సూచించారు. ఎప్పటికప్పుడు జర్నలిస్టులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం ద్వారా మరింత అవగాహన పెరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యాక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కూడా అవకాశం వుంటుందని పేర్కొన్నారు. డిడిని కలిసిన వారిలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల భద్రతకు ప్రజలు సహకరించాలని ఆళ్లగడ్డ డిఎస్పీ రాజేంద్ర స్పష్టం చేశారు. బుధవారం కర్నూలు జిల్లాలోని సంజామల మండలంలోని నొస్సం గ్రామంలోని బుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తేనే ఆలయాలపై దాడులు జరగకుండా ఉంటాయన్నారు. దానికోసం ప్రజలు సహకరించాలని కోరారు. గ్రామస్తు కలిసికట్టుగా ఉంటం ద్వారానే ఆలయాలపై జరుగుతున్న దాడులను పసిగట్టడానికి అవకాశం వుంటుందన్నారు. అదేసమయంలో మతవిధ్వేషాలు రెచ్చగొట్టాలని చూసే దుండగుల చర్యలను నియంత్రించడానికి వీలుపడుతుందని చెప్పారు. అనంతరం గ్రామస్థుల సహకారం ఏర్పాటు చేయబోయే పోలీసు ఔట్ పోస్టుకి ఆయన భూమి పూజ చేసి, స్వామివారి ఆలయాన్ని, చుట్టు ప్రక్కల ప్రదేశాలను స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారాయుడు, ఎస్సై తిమ్మారెడ్డి, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాహనాల ద్వారా ఫిబ్రవరి 1 నుండి పంపిణీ చేయనున్న ఇంటింటికి రేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. గురువారం నుంచి రేషన్ పంపిణీ విధులు నిర్వహించే 534 వాహనదారులకు శిక్షణ కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్ లో బుధవారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఫిబ్రవరి 1 నుండి జిల్లాలో వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. అందులో భాగంగా జిల్లాలో రేషన్ తీసుకునే ప్రతీ ఒక్కరికీ ఈ కార్యక్రమంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాహనదారులకు ఉందని అన్నారు. గురువారం నుండి ప్రతీ వాహనదారుడు తమ పరిధిలో గల గ్రామాలను సందర్శించి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ చేసే విధానంపై ముందుగా కార్డుదారులకు తెలియజేయాలని సూచించారు. ఫిబ్రవరి 1 నుండి జిల్లావ్యాప్తంగా ఈ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుందని, ఈలోగా వాహనాల ద్వారా పంపిణీచేసే కార్యక్రమంపై కార్డుదారులకు పూర్తిస్థాయిలో అవగాహన ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతీ వాహనదారుడు వారికి కేటాయించిన మండలానికి చెందిన తహశీల్ధారు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఉప తహశీల్ధారులు, గ్రామ రెవిన్యూ అధికారి, పంచాయితీ కార్యదర్శులు, గ్రామ సచివాలయ సంక్షేమ సహాయకులు, వాలంటీర్లతో పరిచయాలను పెంచుకొని, ఎళ్లవేలల అందుబాటులో ఉంటూ మీ విధులను జాగ్రత్తగా నిర్వహించుకోవాలని కలెక్టర్ కోరారు. నిన్నటి వరకు మీరంతా ప్రైవేట్ వ్యక్తులని, నేటి నుండి ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్న విషయాన్ని ప్రతీ వాహనదారుడు గమనించాలని అన్నారు. 25 లక్షల మంది జనాభాలో కేవలం 534 మందికి మాత్రమే ఇటువంటి అవకాశం లభించిన విషయాన్ని గుర్తెరగాలని తెలిపారు. మీ వాహనాల ద్వారా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తూ అన్నం పెట్టే అవకాశం మీకు లభించిందని, కావున ప్రతీ వాహనదారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వాహనాలను స్వంత పనులకు వినియోగించరాదని, అలాగే వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయరాదని సూచించారు. పల్లె ప్రాంతాలకు వెళ్లే సమయంలో అత్యంత జాగ్రత్తగా వెళ్లాలని, వాహనాలను అతివేగంగా నడుపరాదని పేర్కొన్నారు. లబ్ధిదారులతో మర్యాదగా నడుచుకోవాలని, ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే సమయంలో కార్డుదారునితో సంబంధం లేకుండా వారి కుటుంబసభ్యులకైనా అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేసారు. ఇటువంటి కార్యక్రమం దేశంలో మరెక్కడా జరగడం లేదని, రాష్ట్రానికి, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే పథకాల్లో ఇది ఒకటని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి జిల్లాకు, ప్రభుత్వానికి మంచి పేరును తీసుకువచ్చే ప్రతినిధులుగా పనిచేయాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం శిక్షణ పొందిన 534 మంది వాహనదారులకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, సహాయ కలెక్టర్ యం.నవీన్, యస్.సి.కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు రామారావు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎ .కృష్ణారావు, పౌర సరఫరాల అధికారి డి.వి.రమణ, సహాయ సరఫరాల అధికారి ఉదయ్ భాస్కర్, ఉప తహశీల్ధారులు, గ్రామ రెవిన్యూ అధికారులు, వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.
ఆ జిల్లా కలెక్టర్ కి రియాలిటీ చాలా ఎక్కువ..ఏదైనా స్వయంగా పరిశీలిస్తే తప్పా ఒక అంచనాకు రారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటి వద్దకే తరలించే రేషన్ సరుకుల మినీ ట్రక్కులను పరిశీలించిన తీరు అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. రేపు ముఖ్యమంత్రి ప్రారంభించనున్న ఈ మినీట్రక్కుల పనితీరును క్రిష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో స్వయంగా ట్రక్కు నడిపి మరీ తెలుసుకున్నారు. అనంతరం జిల్లాలో పంపిణీ చేసే ట్రక్కులు, రేటి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 నుంచి ప్రతీఇంటికీ రేషన్ సరుకులు మినీ ట్రక్కుల ద్వారానే పంపిణీ చేయనున్నామన్నారు. దానికోసం ట్రక్కులు వాటిని నిర్వహణ చూసే వారి జాబితాలు మొత్తం సిద్దం అయ్యాయని పేర్కొన్నారు. ట్రక్కులను ముఖ్యమంత్రి ప్రారంభించిన అనంతరం జిల్లాలోనూ పంపిణీ చేపడతామన్నారు. ట్రక్కులోనే త్రాసు కూడా ఏర్పాటు చేశారని, ప్రజలకు ఏమైనా సరుకు బరువుల్లో తేడా వస్తే త్రాసులో బరువు కూడా చెక్ చేసుకోవచ్చునని చెప్పారు.
విశాఖజిల్లా లో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని జాయింట్ కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం నాడు స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ధాన్యం కొనుగోలు పై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్ శాఖ, డిఆర్ డిఏ, డిసిసిబి అధికారులతో, రైసు మిల్లర్ల సంఘ ప్రతినిధుల తో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు లో ఎలాంటి జాప్యం జరగకుండా సంబంధిత శాఖ లు సమన్వయం తో పనిచేయాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఏజెన్సీల వద్ద ఏమైనా సమస్యలు తలెత్తితే కలెక్టరేట్ లోని కంట్రోల్ రూమ్ ( Control room no.7702003580 ) కు తెలియజేయాలని సూచించారు. జిల్లా లో పండించిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేయాలని రైసుమిల్లర్లను కోరారు. 150 ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల సిబ్బంది నాణ్యత ప్రమాణాల నిర్దారణ కు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. బ్యాంకు గ్యారెంటీ లకు సంబంధించి, రైసు మిల్లర్లకు ఇతర జిల్లాల్లో కల్పించిన విధంగా వెసులుబాటు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ వెంకట రమణ, డిఎస్ఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1076 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ల (ఎండీయూ) సహాయంతో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నాణ్యమైన బియ్యంతో పాటు ఇతర సరకులను లబ్ధిదారుల ఇళ్లకే నేరుగా అందించనున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వివేకానందహాల్‌లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి కలెక్టర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 21న విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేషన్ సరుకులను ఇంటింటికీ పంపిణీ చేసే వాహనాలను ప్రారంభిస్తారని, అదే విధంగా జిల్లా స్థాయిలో కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద వాహనాల ప్రారంభం కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 262 వాహనాలు, బీసీ కార్పొరేషన్ ద్వారా 491, ఈబీసీ కార్పొరేషన్ ద్వారా 222, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 25, ఎస్‌టీ కార్పొరేషన్ ద్వారా 76 వాహనాలను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. అత్యధికంగా రంపచోడవరం నియోజకవర్గానికి 77 వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి ఎండీయూకు ఓ నోడల్ వీఆర్‌వోను మెంటర్ లేదా హ్యాండ్ హోల్డింగ్ పర్సన్‌గా నియమించామన్నారు. ప్రతి నెలా ఇంటింటికీ వెళ్లి పెన్షన్‌ను ఎలా అందిస్తున్నారో.. అదే విధంగా రేషన్ సరుకులను కూడా 16 లక్షలకు పైగా కార్డుదారులకు డోర్‌డెలివరీ చేయనున్నట్లు తెలిపారు. తూకాల్లో తేడాలు లేకుండా సరుకుల పంపిణీ జరుగుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులకు ఈ డోర్ డెలివరీ కార్యక్రమం ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరనుందన్నారు. యువతకు సుస్థిర జీవనోపాధిని కల్పించడంతో పాటు రేషన్‌కార్డు దారులకు అత్యంత ప్రయోజనం కల్పించే ఈ కార్యక్రమం విజయవంతమయ్యేందుకు రూ.69 కోట్ల ఖర్చుతో వాహనాలను సమకూర్చడంలో వివిధ కార్పొరేషన్ల అధికారులతో పాటు బ్యాంకర్ల సహాయం ఎంతో ఉందని ప్రశంసించారు. ముగ్గురు జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లయ్‌స్ అధికారులు సమష్టిగా కృషిచేశారన్నారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల వల్ల ఇటు బ్యాంకులు, అటు లబ్ధిదారుల్లో ఆత్మ విశ్వాసం పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వలంటీర్ వ్యవస్థ విజయవంతమైందని, వివిధ సందర్భాల్లో వారు అందించిన సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఇదే విధంగా క్షేత్రస్థాయిలో మొబైల్ వాహన లబ్ధిదారులు సేవలందించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బ్యాంక్ ఆఫ్ బరోడా సహకారం అందించినట్లు వెల్లడించారు. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ సంస్థలు కార్యక్రమంలో భాగస్వాములయ్యాయని, బాగా అధ్యయనం చేసిన తర్వాత వాహనాల రూపకల్పన జరిగిందన్నారు. జిల్లా కేంద్రం నుంచి మండలాలకు వాహనాలు చేరిన తర్వాత, అక్కడ కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి ఒకటో తేదీకి ముందే వాహనాల లబ్ధిదారులు నిర్దేశ మార్గాలను పరిశీలిస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో రేషన్ వాహనాలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే సత్వర సహాయం అందించేందుకు వీలుగా అదనంగా వాహనాలు సిద్ధంగా ఉన్నాయని జాయింట్ కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి పారదర్శకంగా నాణ్యమైన సరుకులను ఇంటివద్దకు అందించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సచివాలయాల వారీగా బియ్యం కార్డుల మ్యాపింగ్ ప్రక్రియ ముగిసిందన్నారు. ప్రతి ఎండీయూలో డిజిటల్ వెయింగ్ మెషీన్, ధరల నోటీస్ బోర్డు, అనౌన్స్మెంట్ మైక్, ఈ-పోస్ మెషీన్, ఛార్జింగ్ పాయింట్ తదితరాలు ఉంటాయని జేసీ తెలిపారు. వాహనాల లబ్ధిదారులకు కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో కోవిడ్-19 టీకా పంపిణీ కార్యక్రమం సజావుగా జరుగుతోందని కలెక్టర్ మురళీధరరెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, తొలిదశలో టీకా వేసేందుకు దాదాపు 36,500 మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లాలో 190 కేంద్రాలు సిద్ధంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 33 కేంద్రాల ద్వారా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతోందన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు చూస్తే మొత్తం 7697 మందికి టీకా అందించినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 21 శాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ విషయంలో రాష్ట్ర స్థాయిలో జిల్లాను ముందు నిలిపినందుకు జేసీ (డీ) కీర్తి చేకూరి, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీస్, ఇతర శాఖల అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోలేదని వివరించారు. మిగిలిన వారికి కూడా దశల వారీగా వ్యాక్సిన్ వేయనున్నామన్నారు. సమావేశంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, సివిల్ సప్లయ్‌స్ డీఎం ఇ.లక్ష్మీరెడ్డి; బీసీ, ఎస్‌సీ, మైనారిటీ శాఖల అధికారులు ఎస్‌వీఎస్ సుబ్బలక్ష్మి, జీఎస్ సునీత, పీఎస్ ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్-19 వ్యాధి, కరోనా వైరస్ లను సమూలంగా తుద ముట్టించే వరకూ అప్రమత్తతను, ఆరోగ్య జాగ్రత్తలను విడనాడ వద్దని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి ప్రజలను కోరారు. కోవిడ్-19 నిరోధం పై ప్రజలను చైతన్య పరచేంచదుకు గడచిన 50 రోజులుగా జిల్లాలో నిర్వహిస్తున్న ఆరోగ్య విద్య, సమాచార, ప్రచార ముగింపు కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సెంటరు వరకూ క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి ముఖ్య అతిధిగా హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోవిడ్-19 కారణంగా గడచిన 9 నెలలుగా ప్రజా జీవనం తీవ్రంగా ప్రభావితమైందని, జిల్లాలో అత్యధిక సంఖ్యలో చేపట్టిన రోగనిర్థారణ పరీక్షలు, క్వారంటైన్మెంట్, చికిత్స కార్యక్రమాల ద్వారా వ్యాధి ఉనికిని గణనీయంగా నియంత్రించ గలిగామన్నారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు జిల్లాలో దశల వారీగా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకూ సుమారు 7 వేల మంది ఫ్రంట్ లైన్ ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ అందిచామన్నారు. వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనదని, దశల వారిగా అందరికీ అందజేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్న 42 రోజులకు కోవిడ్-19 నిరోధక శక్తి చేకూరుతుందని, కావున వ్యాక్సిన్ వేయించుకున్న వారు 42 రోజుల వరకూ ఆరోగ్య జాగ్రత్తలను కొనసాగించాలన్నారు. కోవిడ్-19 వ్యాధిని తుదముట్టించే వరకూ ప్రజలు మాస్కు ధారణ, 6 అడుగుల బౌతిక దూరం పాటించడం, చేతుల శుభ్రత వంటి జాగ్రత్తలను విడనాడ వద్దని జాయింట్ కలెక్టర్ (డి) కీర్తి విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.వి.ఎస్.గౌరీశ్వరరావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.రాఘవేంద్రరావు, జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అబ్రహాం, జిజిహెచ్ హెచ్ డి ఎస్ మెంబరు బొడ్డు వెంకటరమణ మూర్తి, ఆశా వర్కర్లు, ఎఎన్ఎం లు పాల్గొన్నారు.
మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ బియ్యం నేరుగా లబ్దిదారుని ఇంటి వద్దకే ఈ నెల 21వ తేదీన చేపట్టే కార్యక్రామానికి జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు జి.లక్ష్మిశ(రెవెన్యూ), కీర్తీ చేకూరి (అభివృధ్ధి), జి.రాజకుమారి (సంక్షేమం), కాకినాడ మున్సిపల్ కమీషనర్ స్వప్నిక్ దిన్కర్ పుండ్కర్ ఇతర అధికారులతో కలిసి కాకినాడ క్రీడా ప్రాంగణం, జే.ఎన్.టి.యు.ప్రాంతాన్ని సిధ్ధంగా ఉన్న వాహనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన రాష్ట్ర స్ధాయిలో ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన రెడ్డి ఈ వాహనాలను లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు. అదే సమయంలో కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల వద్ద జిల్లాలో ఈ వాహనాలను ప్రారంభించే విధంగా సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 19 నియోజకవర్గాల పరిధిలో అన్ని మండల, మున్సిపాలిటీలకు 1076 వాహనాలు చేరే విధంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. 21వ తేదీ ఉదయం ఈ వాహనాలు జిల్లా క్రీడా ప్రాంగణం నుండి బయలుదేరి నాగమల్లితోట మీదుగా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ సమీపంలోని అయప్ప దేవాలయం వద్ద యు-టర్న్ తీసుకొని రంగరాయ మెడికల్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకొంటాయన్నారు. రంగరాయ మెడికల్ కళాశాల ప్రధాన గేటు వద్ద ఏర్పాటు చేసిన సభా స్ధలి వద్ద మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొంటారన్నారు. అక్కడ జెండా ఊపి వాహనాలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ వాహనాలు అక్కడ నుండి బయలుదేరి సర్పవరం జంక్షన్ కు చేరుకుంటాయన్నారు. సర్పవరం జంక్షన్ వద్ద నియోజకవర్గానికి కేటాయించిన ఆయా వాహనాలను మండలాల వారీగా రెవెన్యు అధికారులు స్వాధీనం చేసుకొని అక్కడ నుండి బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమాన్ని అంతటినీ జిల్లా స్ధాయి సివిల్ సప్లయిస్ అధికారులు , సబ్ కలెక్టర్లు , రెవెన్యూ డివిజనల్ అధికారులు పర్యవేక్షిస్తారని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి. కరణం కుమార్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, డిఎస్ఓ ప్రసాద్, సివిల్ సప్లయిస్ డియం ఇ.లక్ష్మారెడ్డి, వాహన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాను అందుకున్న లబ్ధిదారునితో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి సచివాలయం నుండి ఫోన్ ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం పెద్దాపురం పట్టణం గౌరీకోనేరు 1,2 వార్డు సచివాలయాలను ఆర్డీవో ఎస్.మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్ జె.సురేంద్రలతో కలిసి పరిశీలించారు. ఈ పరిశీలనలో వార్డు వాలంటీర్ ఫోన్ ద్వారా పేదలందరికీ ఇళ్లు లో ఇంటి పట్టాను అందుకున్న లబ్దిదారు లక్ష్మీకి ఫోన్ చేయగా ఆమె భర్తతో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్దిదారు పేరు, సొంతిల్లు ఉన్నదా, ఏం పని చేస్తారు, అద్దె ఇంట్లో వుంటున్నారా, గృహ నిర్మాణానికి ఆప్షన్ ఇచ్చారా అని లక్ష్మి భర్తను అడుగగా సొంతిల్లు లేదని, ఇళ్ల పట్టా అందిందని, సూరంపాలెంలో వాలంటీర్ ప్లాటు చూపించారని, గృహ నిర్మాణానికి ప్రభుత్వమే కట్టించి ఇచ్చేలా ఆప్షన్ ఎంచుకోవడం జరిగిందని కలెక్టర్ కు తెలిపారు. అనంతరం పేదలందరికీ ఇళ్లలో ఎంతమంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు కాబడినవి, ఎంతమందికి పట్టాలు పంపిణీ చేయబడినవి, ఎన్ని పట్టాలు పెండింగ్ లో వున్నవి, పెండింగ్ కు గల కారణాలు, డాష్ బోర్డు వివరాలను వార్డు సచివాలయ సెక్రటరీలను, వాలంటీర్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత కలిగి ,18 సంవత్సరాలు నిండి వివాహం కాబడిన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల పట్టాను మంజూరు చేయాలని తెలిపారు.అదేవిధంగా లబ్దిదారుల ఇళ్ల పట్టాలు ఎట్టి పరిస్థితుల్లోను వాలంటీర్ వద్ద ఉంచుకోవద్దని, లబ్దిదారులకు ఫోన్ చేసి పట్టాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇళ్ల పట్టాలకు సంబంధించి మంజూరు కాబడిన లబ్దిదారుల వివరాలు, తిరస్కరణకు గురైన దరఖాస్తులు, తిరస్కరణకు గల కారణాలు, తదితర వివరాలను నూరు శాతం పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా లబ్దిదారులకు సంబంధించి గృహ నిర్మాణ ఆప్షన్ల వివరాలను, టిడ్కో లబ్దిదారుల సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సచివాలయ నిర్వహణ, పనితీరు పై ఈ సందర్భంగా కలెక్టర్ సంతృప్తి వెలిబుచ్చారు.
ఈ పరిశీలనలో తహశీల్దార్ బి.శ్రీదేవి, శానిటేషన్ ఇన్స్పెక్టర్ దావీదురాజు, ఆర్ ఐ రాఘవ, మున్సిపల్ సిబ్బంది, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలోని పాచిపెంట మండలం కంకణాపల్లిలో చోటు చేసుకున్నవి సాధారణ మరణాలేనని, ఎటువంటి వింత వ్యాధి లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్వీ రమణ కుమారి స్పష్టం చేశారు. ఈ గ్రామంలో గత రెండు రోజుల్లో ఏడుగురు మరణించినట్లు వార్తలు వెలువడిన నేపద్యంలో, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆదేశాల మేరకు, ఆమె మంగళవారం గ్రామంలో పర్యటించారు. మరణించిన ఏడుగురు లో నలుగురు 70 ఏళ్ళు పైబడి, వృద్ధాప్యం కారణంగానే మరణించారని తెలిపారు. మిగిలిన ముగ్గురిలో ఒకరు కేన్సర్, మరొకరు కిడ్బీ సమస్య, ఇంకొకరు అతిగా మధ్య పానం వల్ల చనిపోయారని, ఎటువంటి వింత వ్యాధి లేదని తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా, గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే 114 మంది నుంచి రక్త నమూనాలు, త్రాగు నీటి శాంపిల్లు కూడా తీసుకొని, పరీక్షల కోసం పంపించామన్నారు. ఈ పర్యటనలో పార్వతీపురం అదనపు వైద్యాధికారి డాక్టర్ రవి కుమార్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రేస్ పార్టీ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి జర్నలిస్టులకు అందించిన సంక్రాంతి కానుకలను మంగళవారం సైతం ఏయూ జిమ్నాజియం మైదానంలో పంపిణీ చేశారు. సంక్రాంతి కానుకలు స్వీకరించిన జర్నలిస్టులు సంతోషం వ్యక్తంచేశారు. విజెఎఫ్ అద్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్లస్థలాల మంజూరుకు విజయసాయి రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ఇటీవల నిర్వహించిన జర్నలిస్టుల అవార్డుల కార్యక్రమానికి సైతం విజయసాయి రెడ్డి విచ్చేసి పాత్రికేయులపై తన అభిమానాన్ని చాటారన్నారు. కార్యక్రమంలో విజెఎఫ్ కార్యదర్శి చోడిశెట్టి దుర్గారావు, విజయసాయి రెడ్డి మీడియా సమన్వయ అధికారి జి.రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. విజెఎఫ్ కార్యవర్గ సభ్యులు నాగరాజు పట్నాయకర్, దాడి రవికుమార్, ఈశ్వర రావు, తదితరులు సమన్వయం చేశారు.