శ్రీకాకుళం జిల్లాలోని దేవాలయాలపై జరుగుతున్న దాడుల నేపధ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న దుష్ప్రచారాలను త్రిప్పికొట్టి, మత విధ్వేషాలను రెచ్చగొట్టే పనులకు పూర్తిగా అడ్డుకట్టవేయాలని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ గ్రామ సంరక్షణ దళాలు (వి.డి.యస్), గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం స్థానిక వైశ్యరాజు కన్వెన్షన్ హాలులో గ్రామ దేవాలయాల భద్రతలో భాగంగా గ్రామ సంరక్షణ దళాలు మరియు గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి సంఘాలతో అవగాహన కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా యస్.పి ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు చేసి మతవిధ్వేశాలను రెచ్చగొట్టేందుకు కొందరు చూస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి మన సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాలని గ్రామ సంరక్షణ దళాలు, గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులకు యస్.పి పిలుపునిచ్చారు. దాడులను ఎదుర్కోవడమే కాకుండా అందులో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ, సామాజిక మాధ్యమాల్లో వచ్చే దుష్ర్రచారాలను త్రిప్పికొట్టాల్సిన బాధ్యత గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులపై ఉందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు గ్రామ ప్రజలు, వి.డి.యస్ లు, పోలీసులు భాద్యతగా వ్యవహరించినపుడే దేవాలయాలపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్టవేయగలమని, ఇందుకు పోలీసు శాఖకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని యస్.పి కోరారు.
ప్రతీ దేవాలయం, చర్చి, మశీదులలో సి.సి.కెమెరాలతో పాటు పుస్తకాన్ని ఏర్పాటుచేసామని చెప్పారు. అలాగే గ్రామస్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటుచేసిన సంగతిని యస్.పి గుర్తుచేసారు. ప్రతీ కమిటీలో సర్పంచ్ తో పాటు వి.డి.యస్, మహిళా సంరక్షణ కార్యదర్శి, వివిధ మత పెద్దలతో పాటు మహిళా పోలీసు కూడా ఉంటారని పేర్కొన్నారు. గ్రామ మహిళా సంరక్షణ దళాలు వారి గ్రామంలోని మశీదు, చర్చి , దేవాలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ఎప్పటికపుడు సమావేశాలను ఏర్పాటుచేసుకొని నిత్యం సంరక్షించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలేనని గాంధీజీ పిలుపునిచ్చారని, అటువంటి పట్టుకొమ్మల సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని యస్.పి వివరించారు. ఇది ఒక మంచి కార్యక్రమంగా భావించి, సామాజిక బాధ్యతగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. దేవాలయాలపై దాడులు జరిగినపుడు మతవిధ్వేషాలకు తావులేకుండా పోలీసులకు సమాచారం ఇచ్చేలా గ్రామస్తులను చైతన్యపరచాలన్నారు, అనంతరం గ్రామ సంరక్షణ దళాలకు టీ-షర్ట్ లను పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు వావిలపల్లి జగన్నాథం నాయుడు, వి.భార్గవ ప్రసాద్ మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్నదాడులను కొందరు ఆకతాయిలు చేసే పనిగా అభివర్ణించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే అసత్య ప్రచారాల వలన సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని, కావున దాడులు జరిగిన ప్రదేశంలోని వాస్తవాలను మాత్రమే ప్రజలకు చేరవేయాలని తెలిపారు. గ్రామ సంరక్షణ దళాలు (వి.డి.యస్), గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు నిత్యం తమ పరిధిలోని దేవాలయాలను సంరక్షించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పి.సోమశేఖర్, క్రైమ్ అడిషనల్ యస్.పి. టి.పి.విఠలేశ్వర్, టౌన్ డి.యస్.పి యం.మహేంద్ర , పోలీస్ అధికారులు, గ్రామ సంరక్షణ దళాలు (వి.డి.యస్), గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుభాషకు వెలుగునిచ్చిన మహోన్నతమైన వ్యక్తి గిడుగు రామ్మూర్తిపంతులు అని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కె. వేణుగోపాల్, మీడియా జేఏసీ కన్వీనర్ శాసపు జోగినాయుడు అన్నారు. శుక్రవారం వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తిపంతులు 81వ వర్థంతి సందర్భంగా వాకర్స్ క్లబ్ మాజీ గవర్నర్ గేదెల ఇందిరాఫప్రసాద్ అధ్యక్షతన స్థానిక కిమ్స్ రోడ్డులో ఉన్న గిడుగు విగ్రహానికి జర్నలిస్టు నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొంక్యాన మాట్లాడుతూ సరళమైన తెలుగుభాష కోసం ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి గిడుగు రామ్మూర్తిపంతులని, సవర భాష కోసం విశేషమైన కృషి చేశారన్నారు. సిక్కోలు జిల్లాలో పుట్టి ప్రపంచ స్థాయిలో తెలుగువాడు గర్వించేలా చేసిన రామ్మూర్తిపంతులు పేరిట కొత్తగా వచ్చే ఏదో ఒక యూనివర్శిటీ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో స్మారక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మీడియా జేఏసీ కన్వీనర్ మాట్లాడుతూ గిడుగు పేరిట యూనివర్శిటీ, స్మారక గ్రంథాలయం ఏర్పాటు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్నారు. తెలుగుభాష వికాసానికి కృషి చేసిన మహనీయుడు శ్రీకాకుళం జిల్లాలో జన్మించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ అధ్యాపక వృత్తి నుంచి అంతర్జాతీయ స్థాయిలో తెలుగుభాష అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి సిక్కోలువాసి కావడం గర్వకారణమన్నారు. తొలుత ప్రముఖ గజిల్స్ గాయకులు డాక్టర్ మంతిన వాసుదేవాచారి గిడుగు రామ్మూర్తి పేరిట పలు గజిల్స్‌ను ఆలపించి ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్‌ఎం బెండి శివప్రసాద్, వాకర్స్ క్లబ్ ప్రతినిధి రాధాకృష్ణ, మీడియా జేఏసీ ప్రతినిధులు సూరు చంద్రశేఖర్, డోల అప్పన్న, నేతల అప్పారావు, కొర్లాన కొండబాబు, ఎం.ఏ.వి.సత్యనారాయణ, పేడాడ పృథ్వీ, కొంక్యాన శివశంకర్, పక్కి వేణు, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టుల ప్రధాన సమస్యలు పరిష్కరించరించడంతోపాటు ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం గురువారం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ను కలిసి వినతిపత్రం సమర్పింది. ఈ సందర్భంగా విశాఖలోని ఆశీలుమెట్టలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లి జర్నలిస్టుల సమస్యలు, హెల్త్ కార్డు విషయంలో తలెత్తుతున్న అంశాలను ఎమ్మెల్యేకి వివరించారు. వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ కార్డు ఉన్నా లేబర్ రూమ్ ట్రీట్ మెంట్ మాత్రమే కార్పోరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు అందిస్తున్నారని ఎమ్మెల్యేకి వివరించారు. అదీ కాకుండా దంత సంరక్షణ, సర్జీల విషయంలో సాధారణ ఆరోగ్యశ్రీ కార్డు వైద్యమే ఐదువేల రూపాయల లోపు వైద్యసేవలు మాత్రమే అందిస్తున్నారన్నారు. డెంటల్ రీప్లేస్ మెంట్, జర్కోనియం డెంటల్ కేప్ వంటి సేవలు జర్నలిస్టు హెల్త్ కార్డులో అమలు కావడం లేదని చెప్పారు. విధినిర్వహణలో జర్నలిస్టులు అధికంగా వాహనాలపై ప్రయాణించేది అధికంగా ఉండటం వలన జర్నలిస్టులకు యాక్సిడెంటల్ ఇన్స్యూరెన్స్ సదుపాయం జర్నలిస్టులందరికీ వర్తింపచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టుల ప్రధానహక్కు అయిన అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జిఓనెంబరు 142 అమలుతో చాలా మంది అక్రిడిటేషన్లు కోల్పోయే అవకాశం వుందని యూనియన్ అధ్యక్షుడు ఎమ్మెల్యేకి వివరించారు. అంతేకాకుండా జీఎస్టీ పరిధిలోకి రాని న్యూస్ ఏజెన్సీలు, చిన్న పత్రికలకు జీఎస్టీ నిబంధన రద్దుచేయాలని, ఆన్ లైన్ విధానంలో ప్రెస్ క్లిప్పింగులు అధిక సంఖ్యలో సమర్పించడానికి వీలు పడనందున, నేరుగా పత్రికలుగానీ, క్లిప్పింగుల ఫైల్స్, స్వీకరించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తాను ఈ విషయాన్ని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనానిల ద్రుష్టికి తీసుకెళ్లి జర్నలిస్టుల ఆరోగ్య సమస్యల పరిష్కారాని తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ కార్యాక్రమాలను ప్రత్యేక కథనాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కునే కష్టాలను తాను స్వయంగా చూసి తెలుసుకున్నానని, తన రాజకీయ ప్రస్తానంలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో వుందని ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. అనంతరం స్మార్ట్ సిటీ వేల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం యూనియన్ అధ్యక్ష, కార్యదర్శిలు ఎమ్మెల్యేకి వివరించారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి పరిధిలోని వసూలు కావలసిన ఆస్తి పన్నులను వేగవంతం చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన సంబందిత అధికారులను ఆదేశించారు. బుధవారం, వి.ఎం.ఆర్.డి.ఎ చిల్డ్రన్ ఎరీనా థియేటర్ లో అదనపు కమిషనర్ ఆషా జ్యోతి, డి.సి(ఆర్), జోనల్ స్థాయి అధికారుల నుండి వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శుల స్థాయి వరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆస్తి పన్ను, ఖాళీ జాగా పన్ను, నీటి చార్జీలు, డి.&ఓ. లైసెన్స్ ఫీజులు. కళ్యాణ మండపాలు, దుకాణాలు, మార్కెట్లు నుండి రావాల్సిన ఫిజులు, అద్దెలు నూరు శాతం వసూలు చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ. 350కోట్లు టార్గెట్ పట్టామని, ప్రస్తుతం రూ. 227.40కోట్లు వసూలైనదని మిగిలినవి ఫిబ్రవరి చివరి నాటికి 95శాతం వసూలు చేయాలని ప్రతీ రెవెన్యూ అధికారికి లక్ష్యాన్ని నిర్దేశించారు. అందుకు ముందుగానే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని కలక్షన్ ను మెరుగు పరచాలని ఆదేశించారు. 75 శాతం కన్నా తక్కువ పన్నులు వసూలు చేసిన రెవెన్యూ అఫీసర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు మరియు వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శుల యొక్క జీతాలు ఆపాలన్నారు. మార్కెట్ విలువ ప్రకారం దుకాణాలు, కళ్యాణ మండపాలు అద్దెలు ఏ విధంగా ఉన్నాయి, వారు జివిఎంసి కి ఏ విధంగా చెల్లిస్తున్నారు, వారం రోజులలోగా నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు సేవలు, మౌళిక వసతులు కల్పనే లక్ష్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ వ్యవస్థను స్థాపించిందని, అందుకు వార్డు కార్యదర్శులుగా మీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని, ప్రజలు మనపై ఎంతో నమ్మకంతో వస్తారని, వారు పెట్టుకున్న ఆర్జీలను సిటిజన్ చార్టు ప్రకారం నిర్ణీత గడువులో పూర్తీ చేయాలని లేని యెడల క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వార్డు పరిపాలనా కార్యదర్శులను హెచ్చరించారు. కొంతమంది కార్యదర్శులు డైరీలు రాయకపోవడం గమనించి, వారి యొక్క జీతాలు నిలిపి వేయాలని అధికారులను ఆదేశించారు. `
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆషా జ్యోతి, డి.సి.(రెవెన్యూ) ఏ. రమేష్ కుమార్, అందరు జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్ స్పెక్టర్లు, వార్డు సచివాలయ పరిపాలనా కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నం కేంద్రంగా ఉన్న ఉత్తరాంధ్ర అబివృద్ధి కి 4 వేల కోట్ల తో పలు జాతీయ రహదారులను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు తెలిపారు. భూ సేకరణ సమీక్ష అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. విశాఖపట్నం నుండి రాయిపూర్, బౌడర నుండి రాజమండ్రి వరకు , పలు బై పాస్ రహదారులను 388 కిలో మీటర్ల మేరకు నిర్మించనున్నట్లు తెలిపారు. 200 కిలో మీటర్ల కు ప్రపంచ బ్యాంకు సహాయం చేస్తుందని, 188 కిలో మీటర్ల కోసం రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి గారిని కోరగా మంజూరు చేసారని అన్నారు. ఇప్పటికే చాల వరకు టెండర్ ప్రక్రియ పూర్తయిందని, భూ సేకరణ 90 శాతం పూర్తయితే మిగిలిన పనులకు కూడా టెండర్ లనుపిలవడం జరుగుతుందని తెలిపారు. కాంట్రాక్టర్ లు సిద్ధంగా ఉన్నారని, గ్రౌన్దింగ్స్ వేగవంతం చెయ్యాలని అధికారులకు సూచించామని అన్నారు. విశాఖ పట్నం నుంచి భోగాపురం వరకు కోస్టల్ కారిడార్ 50 కిలో మీటర్ల మేర చేపడుతున్నట్లు తెలిపారు. దీనికి డి.పి.ఆర్ కూడా సిద్ధం అయ్యిందన్నారు. రహదారుల పనులన్నీ పూర్తి చేసి, ఎయిర్ పోర్ట్ తో కనెక్టివిటీ ని పెంచుతామని, దాని వలన ప్రజలకు అత్యుతమ కమ్యూనికేషన్ తో పాటు ట్రాన్స్ పోర్ట్టేషన్ అందించడం జరుగుతుందని అన్నారు. అతి త్వరలో నిధులను సమకూర్చుకొని ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని తెలిపారు.
రాయిపూర్ నుండి విశాఖపట్నం వరకు మంజూరైన ఆరు వరసల జాతీయ రహదారికి సంబంధించిన భూ సేకరణ వేగంగా జరగాలని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణ బాబు అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా మీదుగా పలు జాతీయ రహదారులు మంజురైనాయని, జిల్లా అభివృద్ధికి ఈ రహదారులు ఎంతగానో ఉపకరిస్తాయని, వీటికి ప్రత్యెక ప్రాధాన్యత నివ్వాలని అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ముఖ్య కార్యదర్శి జాతీయ రహదారులకు, భోగాపురం ఎయిర్ పోర్ట్ , ఇతర ప్రాజెక్టులకు సంబం ధించిన భూ సేకరణ పై సమీక్షించారు. విశాఖపట్నం నుండి రాయిపూర్ వరకు మంజురైన ఆరు వరసల జాతీయ రహదారి 2200 కోట్ల రూపాయల అంచనా ఖర్చు తో చేపట్టనున్నట్లు తెలిపారు. విజయనగరం జిల్లాలో 95 కిలో మీటర్ల పొడవు గలిగిన ఈ రహదారి 9 మండలాలకు చెందిన 49 గ్రామాల్లో 516 హెక్టార్ల లో భూ సేకరణ చేయవలసి ఉందని అన్నారు. ఈ 95 కిలో మీటర్ల పరిధి లో ఉన్న అటవీ భూమి క్లియరెన్స్ చేయాలనీ, అదే విధంగా విద్యుత్ స్తంభాల తొలగింపు, జల వనరుల గుర్తింపు, వ్యవసాయ, ఉద్యాన తోటల లెక్కింపు తదితర పనులు వేగంగా జరగాలన్నారు. సంబంధిత శాఖల అధికారులతో బృందాలుగా ఏర్పాటు చేయాలనీ, క్షేత్ర స్థాయి లో సమన్వయం తో పనిచేసి త్వరగా గ్రౌన్దింగ్ జరిగేలా చూడాలని అన్నారు. ప్రతి రోజు లక్ష్యాలను కేటాయించి గడువును విధించి, ఆ గడువు లోగా పూర్తి చేయని వారి పై చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికక్కడే క్లియరెన్స్ చేసుకొని, క్లియర్ అయిన వాటికీ వెంట వెంటనే అవార్డు పాస్ చెయ్యాలన్నారు. రైల్వే అధికారులతో మాట్లాడి పై వంతెన పనుల కోసం చర్యలు చేపట్టాలన్నారు. విజయనగరం జిల్లాలో చేపడుతున్న బై పాస్ రహదారుల పురోగతిపై సమీక్షించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు కూడా వేగవంతం కావాలన్నారు.
ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్, సంయుక్త కలెక్టర్ డా. జి.సి.కిషోర్ కుమార్, సహాయ కలెక్టర్ సింహాచలం, పార్వతి పురం సబ్ కలెక్టర్ విధేకర్, జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు, ఆర్.డి.ఓ భావనిశంకర్, భూ సేకరణ అధికారి జయరాం, నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివ ప్రసాద్, ఆర్ అండ్ బి ఎస్.ఈ జయ శ్రీ , విద్యుత్ సఖ, జలవనరులు, ఉద్యాన, అటవీ, పంచాయతిరాజ్, ఇతర శాఖల అధికారులు, హాజరైనారు.
మతసామరస్య సంఘటనలకు తావులేకుండా తక్షణమే స్పందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కమిటీ సభ్యులను కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న మతసామరస్య సంఘటనలపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై పోలీసు శాఖ తక్షణమే స్పందించడంపై హర్షాన్ని వ్యక్తం చేసారు. సంతబొమ్మాళిలో జరిగిన సంఘటనపై 24 గంటల్లోగా నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. ఈ సంఘటనతో ముగిసిపోయే అంశం ఇదికాదని, ఇటువంటివి మరలా పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కమిటీ సభ్యులపై ఉందని కలెక్టర్ తెలిపారు. ఇందుకు అవసరమైన సహాయ సహకారాలు కమిటీ సభ్యులకు అందిస్తామని, ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటుచేసి వివరాలను తెలుసుకోవాలని సూచించారు. ఇందుకు జిల్లా, మండల, గ్రామస్థాయిలో కూడా కమిటీలను వేయడం జరుగుతుందని అన్నారు.
జిల్లాలోని దేవాలయాలు, చర్చిలు, మశీదులు, బుద్ధిష్ఠ్, జైనుల దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను గ్రామస్తుల సహకారంతో ఏర్పాటుచేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే సి.సి కెమెరాలను ఏర్పాటుచేసి ప్రతీ అంశం రికార్డు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. రికార్డ్ అయ్యే హెచ్.డి.ఆర్ భద్రంగా ఉండే ప్రదేశంలో ఉంచేలా చూడాలని అన్నారు. జిల్లాలో శిధిలావస్థలో ఉండే దేవాలయాలు, విగ్రహాల ఫొటోలను ముందుగా తీసుకోవాలని, అటువంటి విగ్రహాలు సాదారణంగా విరిగిపోయినప్పటికీ విగ్రహాల ధ్వంసం క్రింద వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అటువంటి వాటిని గ్రామస్తులకు ముందుగా తెలియజేసి వాటిని రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పటిష్టమైన చర్యలు తీసుకునేందుకు సభ్యుల సలహాలు కోరిన కలెక్టర్ సభ్యుల సూచనలను తప్పక పరిశీలిస్తామని పేర్కొన్నారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ బర్ధార్ మాట్లాడుతూ జిల్లాలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై కమిటీ సభ్యులు స్పందించి, మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలని సూచించారు. ఎక్కడా ఏ సంఘటన జరిగినా తక్షణమే సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని, కావున దానికంటే ముందుగా సభ్యులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు జరిగిన ప్రదేశాల్లో మత విధ్యంసాలకు తావులేకుండా, సభ్యులు చూడాలని సూచించారు. సంఘటన జరిగినపుడు ఎటువంటి దాడులు జరగకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులపై ఉందని, అటువంటి సంఘటనలు ఎదురైనపుడు ప్రశాంతంగా ఉంటూ, పోలీసులకు సమాచారం ఇచ్చేవిధంగా గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. సంఘటన జరిగిన తరువాత తీసుకునే చర్యలు కంటే ఆ సంఘటనను ఆపే ప్రయత్నం చేయాలని చెప్పారు. ఇందుకు పోలీసులతో పాటు గ్రామస్తులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. గ్రామస్తులకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే 291 గ్రామాల్లో సమావేశాలను ఏర్పాటుచేయడం జరిగిందని, 29 గ్రామాల్లో కమిటీలను ఏర్పాటుచేసామని చెప్పారు.
తదుపరి గ్రామ, మండల, డివిజన్, జిల్లాస్థాయిలో కమిటీలను ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ప్రతీ దేవాలయం, మశీదు, చర్చిలలో ఒక పుస్తకాన్ని ఉంచుతున్నామని, సాదారణంగా వచ్చే భక్తులు కాకుండా రాత్రివేళల్లో వచ్చే భక్తులు ఎవరైన ఉంటే వారి వివరాలు ఈ పుస్తకంలో నమోదుచేయాలని చెప్పారు. అలాగే ప్రత్యేక సందర్భాలలో నిర్వహించే పూజలు, యాత్రలు తదితర వివరాలు కూడా ఈ పుస్తకంలో నమోదుచేయడం వలన తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. సంతబొమ్మాళి విషయమై మాట్లాడిన ఆయన సి.సి కెమెరాల సహాయంతో సంఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితులను అరెస్టు చేయడం జరిగిందని, కాబట్టి ప్రతీ దేవాలయం, చర్చి , మశీదులలో సి.సి.కెమెరాలను ఏర్పాటుచేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో సహాయ కలెక్టర్ యం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ వి.హరిసూర్యప్రకాష్, హిందూ మత ప్రతినిధి బుర్రా ఆదినారాయణ శాస్త్రి, ముస్లిం మత ప్రతినిధి మహ్మద్ అబ్ధుల్ రఫీ, క్రిస్టియన్ మత ప్రతినిధి రెవరెండ్ డా. జాన్ జీవన్, బుద్ధిష్ట్ మత ప్రతినిధి పేకేటి రామారావు , జైన్ మత ప్రతినిధి బాబూలాల్ హీరావత్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు నాణ్యమైన పోషకాహారాన్ని ఖచ్చితంగా అందించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఐ.సి.డి.ఎస్. అధికారులకు తెలపారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వై ఎస్ ఆర్ పోషణ, సంపూర్ణ పోషణ కార్యక్రమంపై ఐ.సి.డి.ఎస్. అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి నెల నుండి అంగన్వాడీ కేంద్రాలు యధాతథంగా పనిచేయాలని చెప్పారు. పిల్లలకు, గర్భిణీలకు, పాలుచ్చే తల్లులకు, మెనూ ప్రకాకం పోషకాహారాన్ని అందించాలన్నారు. అదే విధంగా పిల్లల ఆరోగ్యంపై దృష్టి సారించాలని, అన్ని కేంద్రాలలోను పిల్లల బరువు తూచే వెయింగ్ మెషీన్లు పని చేయాలన్నారు. పిల్లల పొడుగు కొలిచే స్కేల్స్ సరిగా ఉండాలన్నారు. కేంద్రాలను పర్యవేక్షించు సమయంలో సరిగా పని చేయనివి కనిపిస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. మెనూ ననుసరించి ఖచ్చితంగా నాణ్యమైన, పోషకాహారాన్ని ఆహారాన్ని అందించాలన్నారు. కేంద్రాలలో రెగ్యులర్ గా వేసే టీకాలు, వేక్సిన్ లను తప్పకుండా వేయాలన్నారు. తక్కువ బరువు వున్న పిల్లలపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. అనంతరం అంగన్వాడీ భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాలపై సమీక్షించారు. జిల్లాలో వున్న 4192 అంగన్వాడీ కేంద్రాలలో 1205 కేంద్రాలకు స్వంత భవనాలున్నాయని, 1768 కేంద్రాలు అద్దె భవనాలలో నిర్వహిస్తున్నారని, అద్దె లేకుండా 1219 కేంద్రాలు పని చేస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు స్వంత భవనాలను నిర్మించడం జరుగుతున్నదని, నిర్మాణాలను త్వరితగతిన చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు, ఐ సి డి ఎస్ పి డి జయదేవి., డి.సి.పి.ఓ. రమణ, సి డి పి ఓ లు, సూపర్ వైసర్ లు, తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ లో శాస్త్రవేత్తల పరిశోధనలు, సరికొత్త ఆవిష్కరణలకు పెద్దపీట వేసే పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు సంపూర్ణ సహకారం ప్రభుత్వం నుంచి ఉంటుందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గత పొరపాట్లను సరి చేస్తూ మంచి భవిష్యత్ ను నిర్మిస్తోందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో కీలకమైన నైపుణ్య వనరులపట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. విశాఖపట్నంలోని మెడ్ టెక్ జోన్ ను మంత్రి మేకపాటి బుధవారం సందర్శించారు. అక్కడ ఏర్పాటైన 'స్కిల్ విజ్ఞాన్ సెంటర్' ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. బయోటెక్నాలజీ ఆధారిత స్కిల్ సెంటర్ తో భవిష్యత్ లో వైద్య, పరిశోధనారంగంలో రాణించాలనుకునే యువతకు మేలు జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా వైద్యరంగ పరిశోధనలు, టెక్నాలజీ, నైపుణ్యంపై మంత్రి ప్రసంగాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా అభినందించారు. ఇంత వరకూ ఏ మంత్రి ఈ స్థాయి అవగాహనతో, అండగా నిలబడి మాట్లాడలేదని సంతోషం వ్యక్తం చేశారు.
చిన్నతనం నుంచే మంచి విలువలు, సంస్కృతి, క్రమ శిక్షణ, అంకితభావం నిండిన మానవవనరులుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి ధ్యేయమని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. సమాజానికి మంచి చేసే ప్రజలకు వసతులను సులువు చేసే ఆవిష్కరణలు చేపట్టాలని మంత్రి గౌతమ్ రెడ్డి శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు. టెక్నాలజీ, పరిశోధనలు, ఆవిష్కరణలు, వైద్య రంగం పరికరాల తయారీలో మెడ్ టెక్ జోన్ మొక్కలా మొదలై మహావృక్షంలా మారుతుందని మంత్రి కొనియాడారు. అంతకు ముందు మెట్ టెక్ జోన్ ప్రాంగణంలో కొలువై ఉన్న అత్యాధునిక పరికరాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన వస్తువులు, వాటికి ఉపయోగించే వస్తువలను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆసక్తిగా పరిశీలించారు. కరోనా సమయంలో మాస్కులు, వెంటిలేటర్ల తయారీలో లాక్ డౌన్ ని కూడా లెక్కచేయకుండా శ్రమించిన మెడ్ టెక్ జోన్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను మంత్రి ఈ సందర్భంగా అభినందించారు. మెడ్ టెక్ జోన్ లోనే రూ. లక్ష ఇరవై ఐదువేలతో తయారైన ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీ, సెన్సార్లు, కెమెరాలతో రోగి వ్యాధిని గమనించి, చికిత్స చేసే ఓ యంత్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆవిష్కరించారు. ప్రఖ్యాత నగరాల్లోనూ ఇంకా అందుబాటులోకి రాని ఈ ఆవిష్కరణ పనితీరును మెట్ టెక్ జోన్ సీఈవో జితేందర్ శర్మను మంత్రి మేకపాటి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడ్ టెక్ జోన్ సీఈవో జితేందర్ శర్మ, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఏపీఐఐసీ ఎండీ రవీన్ కుమార్ రెడ్డి, విశాఖపట్నం పరిశ్రమల శాఖ అధికారులు, మెడ్ టెక్ జోన్ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏర్పాటవుతున్న వైఎస్సార్-జగనన్న కాలనీల్లో సకల సదుపాయాలు కల్పించనున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో కొమరగిరి లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్-2 నిర్మాణ విధానాన్ని ఎంపిక చేసుకున్న 300 మంది లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులు, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి హాజరయ్యారు. కొమరగిరి లేఅవుట్‌లో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 29 డివిజన్లకు సంబంధించిన లబ్ధిదారులకు 16 వేల ఇళ్ల నిర్మాణం జరగనుందన్నారు. ఈ లేఅవుట్‌లో నీటి సరఫరా, విద్యుత్, రహదారులు తదితర సౌకర్యాలు కల్పించనున్నామని, జనాభా ఆధారంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన లేఅవుట్‌లో స్థలం పొందడం అదృష్టమన్నారు. ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారుడే స్వయంగా ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం దశల వారీగా రూ.1,80,000 అందించే ఆప్షన్-2ను ఎంపిక చేసుకోవడం ద్వారా దగ్గరుండి నాణ్యవంతంగా ఇంటిని కట్టుకోవచ్చని జేసీ వివరించారు. గృహ నిర్మాణ సామగ్రిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం, భవిష్యత్ విస్తరణకు ఏర్పాట్లు చేసుకోవడం, పటిష్ట పర్యవేక్షణ, నిర్దేశ సమయంలో నిర్మాణం పూర్తిచేయడం వంటివాటికి ఆప్షన్-2 వీలుకల్పిస్తుందన్నారు. మార్కెట్ ధరలతో పోల్చితే తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. లేఅవుట్‌లోనే వివిధ సంస్థలు సామగ్రిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. మరో రెండు వారాల్లో గృహ నిర్మాణాలను ప్రారంభించాలని కోరారు. అందరూ ఒకేసారి నిర్మాణం ప్రారంభించడం వల్ల మెటీరియల్ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని, త్వరలోనే ఓ అందమైన ఊరు సాక్షాత్కరిస్తుందని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆప్షన్ 2 ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఫాల్‌జీ ఇటుకలు, మార్బుల్స్, తలుపులు, కిటికీలు, సిమెంట్ తదితర ఇంటి నిర్మాణ సామగ్రి సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ కార్యాలయ ప్రత్యేక అధికారులు సి.జయరామాచారి, కె.రామచంద్రన్; వీఎస్‌డబ్ల్యూఎస్ జేడీ మల్లికార్జున్, హెబిటేట్ ఫర్ హ్యుమానిటీ ఎన్‌జీవో ప్రతినిధి ప్రవీణ్ పాల్, హౌసింగ్ పీడీ జీవీ ప్రసాద్, ఇతర హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు హాజరయ్యారు.
72వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమగ్రంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద హాలులో జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి వివిధ శాఖల జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఈ నెల 26వ తేదీన జిల్లా స్థాయి భారత గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు చేపట్టవలసిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణతంత్ర వేడుకలను ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగా స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో సాంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాలని అధికారులను కోరారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 9 గం.ల నుండి నిర్వహించే ఈ వేడుకలలో జిల్లా కలెక్టర్ చే పతాకావిష్కరణ, జండా వందనం, జిల్లా ప్రజల నుద్దేశించి ప్రసంగం, సాయుధ దళాల సాంప్రదాయ కవాతు, విద్యార్థినీ విద్యార్థులచే దేశ భక్తి పూరిత సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి ప్రసంశా పురస్కాల పంపిణీ కార్యక్రమాలను నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఆయన కోరారు. సమయాభావం, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ సంవత్సర వేడుకలలో శకటాల ప్రదర్శనను, స్టాళ్ల ఏర్పాటులను రద్దు చేసామన్నారు. వేడుకల నిర్వహణకు వేదిక, మైదానాలను సిద్దం చేయాలని సుశిక్షిత దళాలతో సాంప్రదాయ కవాతు నిర్వహించాలని పోలీస్ శాఖను కోరారు. వేడుకల సందర్భంగా అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేయాలని ట్రాన్స్కో అధికారులను, ప్రాంగణంలో పారిశుద్యం, హాజరైన ప్రజలకు త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేయాలని కాకినాడ మున్సిపల్ కమీషనర్ ను కోరారు. అలాగే జిల్లా ప్రగతి అంశాలు పొందుపరిచిన ముఖ్య అతిధి ప్రసంగ ప్రచురణ, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాట్లను సమాచారశాఖకు సూచించారు. ముందు జాగ్రత్తగా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వైద్యసిబ్బంది, మందులతో ప్రధమ చికిత్సా శిభిరం, ఆంబులెన్స్ లను, అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ ఫైటింగ్ పరికరాలు, వాహనాలను సిద్దంగా ఉంచాలని సూచించారు. అతిధులకు, ఆహ్వానితులకు సుముచిత మర్యాదలు, అల్పాహార ఏర్పాట్లను చేపట్టాలని, కాకినాడ ఆర్డిఓ, అర్బన్ తహశిల్దారులను కోరారు. విద్యార్థుల రవాణాకు అవసరమైన వాహనాలను సమకూర్చాలని ఉపరవాణా కమీషనర్ ను కోరారు. గత ఏడాది కాలంలో ఎదురైన సవాళ్లను, వత్తిడులను సమర్ధవంతంగా ఎదుర్కొని జిల్లా అభివృద్దికి, ప్రజా రక్షణ, సంక్షేమానికి అంకిత భావంతో పనిచేసిన అధికారులను అభినందించేందుకు 26వ తేదీ సాయంత్రం బీచ్ రోడ్ లోని శిల్పారామంలో హై-టీ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) కీర్తి చేకూరి, కాకినాడ మున్సిపల్ కమీషనర్ దినకర్ స్వప్నిల్ పుండ్కర్, డిఆర్ఓ సిహెచ్.సత్తిబాబు, ఎన్ సి సి కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ రజత్ సోంథీ, ఎపిఎస్పి 3వ బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ భద్రయ్య్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఊరు చెరువును సమగ్రంగా అభివృధ్ధి చేయడానికే మన ఊరు-మన చెరువు కార్యక్రమమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మన ఊరు -మన చెరువు కార్యక్రమంపై సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ ఊరిలో వున్న చెరువును సమగ్రంగా అభివృధ్ధి పరచు నిమిత్తం మన ఊరు-మన చెరువు కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిహామీ నిధులతో ఇరిగేషన్ తో అనుసంధానం చేస్తూ చెరువు పనులను చేపట్టాలన్నారు. ఇందు నిమిత్తం ఉపాధి హామీ మెటీరియల్ కాంపౌనెంట్ నిధులను వినియోగించుకోవాలన్నారు. మన ఊరు, మన చెరువు పనులతో పాటు ఇరిగేషన్ ఛానల్ పనులు కూడా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. చెరువు అభివృధ్ధికోసం వూరికి దగ్గరలో వున్న చెరువును గుర్తించాలన్నారు. చెరువును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి గాను. లెవెల్లింగ్, స్లోపింగ్, స్టోన్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. చెరువు వద్ద పిల్లలు ఆడుకొనే విధంగాను పరికరాలను అమర్చాలని ఆట స్థలంగా అభివృద్ధి చేయాలని తెలిపారు . చెరువు చుట్టూ మంచి బౌండరీ కనిపించే విధంగా పూల మొక్కలు వేయాలన్నారు. ప్రజలు, టీచర్స్, టెక్నికల్ అసిస్టెంట్ల సహకారంతో అభివృద్ధి కోసం చెరువును గుర్తించాలని చెప్పారు. అదే విధంగా ఇరిగేషన్ ఫీల్డ్ చానెల్స్ మరమ్మత్తులు సైతం ఉపాధిహామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేపట్టాలని అన్నారు. స్లూయీస్ రిపేర్లు, పూడిక తీత పనులు, బ్రీచెస్, లీకేజీ పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది ఇరిగేషన్ చేనెల్స్ ద్వారా 2200 క్యూసెక్స్ నీరు విడుదలకు అవసరమైన పనులను చేపట్టాలన్నారు. ఆయకట్టు అభివృద్ధితో అన్ని మండలాలకు నీరు అందించాలన్నారు. సంయుక్త కలెక్టర్ శ్రీ రాములు నాయుడు మాట్లాడుతూ, మే నెలాఖరు నాటికి పనులు పూర్తి కావాలన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పనులు చేయాలని, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతీ మండలంలో ఒక చెరువును మోడల్ చెరువుగా అభివృద్ధి చేయాలని, ఈ చెరువు స్ఫూర్తితో అన్ని చెరువులను బాగా రూపొందించాలని తెలిపారు. వంశధార ఎస్ ఈ మాట్లాడుతూ, వంశధార ఎడమ కాలువ ఆధునికీకరణ చేయాలన్నారు. ఓపెన్ హెడ్ ఛానెల్, రైట్ మెయిన్ ఛానల్ మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. ఇరిగేషన్, ఉపాధి హామీ ద్వారా మెటీరియల్ కాంపౌనెంట్ తో జూన్ లోగా పనులు పూర్తి చేయాలన్నారు. ముందుగా బాగా పాడయిన చానెల్స్ అభివృధ్ధి పరచి సాగు విస్తరణకు కృషి చేయాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా నీటియాజమాన్య సంస్థ పథక సంచాలకులు హెచ్.కూర్మా రావు, వంశధార ఎస్.ఈ. తిరుమల రావు, ఇరిగేషన్ ఎస్.ఈ ఎస్ వి రమణా రావు, ఇంజనీరింగ్ అధికారులు, ఏ పి ఓ లు, తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి ఒకటి నుంచి ఇంటి వద్దకే రేషన్ సరుకుల పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేశామని, ఇందుకు సంబంధించి గురువారం ఉదయం కార్యక్రమం ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటి దగ్గరికి రేషన్ సరుకులు ఇస్తామని చెప్పారని, అందుకనుగుణంగా ప్రతినెలా ఒకటో తేదీన ఇస్తున్న పెన్షన్ తరహాలో ఇంటివద్దకే బియ్యం, ఇతర రేషన్ సరుకులు ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈనెల 21వ తేదీన గురువారం ఉదయం 9 గంటలకు విజయవాడలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇంటి వద్దకే సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అనంతరం జిల్లాలో రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి శంకర నారాయణచే కార్యక్రమం ప్రారంభం అవుతుందని, జిల్లా కేంద్రంలోని తపోవనం వద్ద జాతీయ రహదారిపై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రేషన్ సరుకుల పంపిణీ కోసం జిల్లాకు 754 మినీ ట్రక్కులు (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ) చేరాయని, జిల్లాలో 3012 రేషన్ షాపుల పరిధిలో 11, 75,522 రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సరుకుల పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. 754 మినీ ట్రక్కులకు 754 మంది డ్రైవర్స్ కం ఓనర్స్ ను ఏర్పాటు చేశామని, జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి శాశ్వత ఉపాధి కల్పించేలా డ్రైవర్స్ కం ఓనర్స్ నియామకం చేసినట్లు తెలిపారు. అందులో ఎస్సీ కార్పొరేషన్ నుంచి 158 మందిని, ఎస్టీ కార్పొరేషన్ నుంచి 39 మందిని, బీసీ కార్పొరేషన్ నుంచి 360 మందిని, ఈ బీసీ కార్పొరేషన్ నుంచి 126 మందిని, మైనార్టీ కార్పొరేషన్ నుంచి 68 మందిని, క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ నుంచి 3ని మొత్తం కలిపి 754 మందిని సామాజిక సమతుల్యం కలిసి ఉండేలా డ్రైవర్స్ కమ్ ఓనర్స్ ని ఎంపిక చేసి నియమించినట్లు తెలిపారు. దీనిద్వారా వారికి, వారి కుటుంబ సభ్యులకు శాశ్వత ఉపాధి దొరికినట్లు అయిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అణగారిన ఆర్థికంగా వెనుకబడిన వారికి సాయం చేసినట్లు అవుతుందని తెలిపారు.
ఒక మినీ ట్రక్ కొనుగోలు కోసం ప్రభుత్వం 5,81,190 రూపాయలను కేటాయింపు చేయడం జరిగిందని, అందులో 10 శాతం అంటే 58,119 రూపాయలు లబ్ధిదారుల వాటా కాగా, 30 శాతం అంటే 1,74,357 రూపాయలను బ్యాంకు రుణంగా, 60 శాతం సబ్సిడీ అంటే 3,48,714 రూపాయలు సబ్సిడీ కింద మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు ద్వారా అందజేసిన లోన్ మొత్తాన్ని 6 సంవత్సరాలలోపు ప్రతినెల ఇన్స్టాల్మెంట్ రూపంలో చెల్లించాలన్నారు. ఒక మినీ ట్రక్కు ఆపరేటర్ కు ప్రతి నెలా 10 వేల రూపాయల పారితోషికం, ప్రతి నెల 3 వేలు హమాలీ చార్జీలు, ప్రతినెల ఇంధనం కోసం 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందన్నారు.
రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులు రేషన్ షాప్ వద్దకి వచ్చి తీసుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దకే సరుకుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అందమైన స్టిక్కరింగ్, లోగోలతో మినీ ట్రక్కులు సిద్ధం చేయడం జరిగిందని, సరుకులు ఏ విధంగా పంపిణీ చేసేందుకు వీలు కలుగుతుందో ఆ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో కార్బో బాడీతో మినీ ట్రక్కులు తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఒక్కో మినీ ట్రక్కులో ఈపాస్ యంత్రం చార్జింగ్ పాయింట్, క్యాష్ బాక్స్, రబ్బర్ మ్యాట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, మైకు, త్రాసు హ్యాంగర్, లైటింగ్, అవసరమైన స్థలం, ఫ్యాను, మిగతా అన్ని రకాల పరికరాలతో మొబైల్ వాహనాన్ని డిజైన్ చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా ప్రతి ఒక ఓనర్ కమ్ ఆపరేటర్ కు ప్రత్యేకంగా ఒక యూనిఫామ్ ఇస్తున్నామని, చాలా దూరం నుంచి కనపడే విధంగా రూపొందించిన ప్రత్యేక టీషర్టు ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని తెలిపారు.
సరుకుల పంపిణీ సజావుగా జరిగేలా ఒక్కో మినీ ట్రక్ ఆపరేటర్ కు ఒక విఆర్వోను అనుసంధానం చేస్తూ కార్యక్రమ నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేసేటప్పుడు ఈపాస్ మిషన్ ద్వారా కొలిచి తూకం వేసి అక్కడే సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈనెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఆపరేటర్లకు, వీఆర్వోలకు ట్రైనింగ్ ఇవ్వడం, ఈనెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ట్రయల్ రన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు 90 కుటుంబాలకు ఇంటివద్దకే రేషన్ సరుకులు ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని, 15 - 20 రోజుల్లోగా ప్రతి ఒక్క రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు సరుకులు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏరోజు ఎవరికీ ఇస్తామనేది తెలియజేయడం జరుగుతుందన్నారు. ఇంతకుముందు గ్రామ సచివాలయాలను ప్రారంభించేటప్పుడు 1207 గాను 1000 సచివాలయాలలో మొదటిరోజు సర్వీసులను అందించడం జరిగిందని, జిల్లాలోని రేషన్ షాపుల పరిధిలో ఫిబ్రవరి ఒకటో తేదీన మొదటిరోజు 90 కుటుంబాలకు ఇంటివద్దకే రేషన్ ఇచ్చేలా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మినీ ట్రక్కు ఆపరేటర్లకు సంబంధించి బ్యాంకు ఎకౌంటు, రుణాలు అందించే కార్యక్రమం, రిజిస్ట్రేషన్ లు, ఇన్సూరెన్స్ లని 90 శాతం పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన వారికి సంబంధించి వెంటనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇంటి వద్ద రేషన్ సరుకులు పంపిణీ లో ప్రతి ఒక్క అంశం పై శ్రద్ధ తీసుకోవడం జరిగిందని, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపును తీసుకురావాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. ఆన్‌లైన్‌లో జరిగిన అంతర్జాతీయ తైక్వాండో పోటీలలో పతకాలు సాధించిన వారికి బుధవారం తన కార్యాలయంలో ఆయన అభినందించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనడం, పతకాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. యువత విద్యతో సమానంగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. యువతను అన్ని రంగాలలో ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ క్రీడల్లో ఉన్నతంగా రాణించాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో 15 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్న టోర్నమెంట్‌లో విశాఖ చిన్నారులు 10 బంగారు, 04 కాంస్య, 02 రజత పతకాలను సాధించడం గర్వకారణమన్నారు.
చిన్నారులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. వీరి సహకారం, తోడ్పాటుతో చిన్నారులు అంతర్జాతీయ వేదికలపై రాణిస్తూ పతకాలు సాధించడం సాధ్యపడుతోందన్నారు. బాలికలు, మహిళలకు ఆత్మరక్షణకు ఇటువంటి విద్యలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఇటువంటి విద్యలపై శిక్షణ అందించాలని సూచించారు. కార్యక్రమంలో అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, విశాఖ తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి పి.గణేష్ కుమార్, తైక్వాండో కోచ్ మిథిలేష్ కుమార్, అసోసియేషన్ ఇసి సభ్యులు ఎస్.మిలింద్ కుమార్, పతకాలు సాధించిన యువత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నూతనంగా తీర్చిదిద్దిన ఆంగ్ల ఆంధ్ర నిఘంటువును ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి బుధవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నగరానికి చెందిన సనపల జీవన్ కుమార్ దీనిని తీర్చిదిద్దారు. తెలుగు భాషలో వినియోగించే అనేక వాడుక పదాలకు దీనిలో స్థానం కల్పించారు. అమెరికా, ఇంగ్లాడులో ఉపయోగించే ఆంగ్ల భాష వ్యావహారిక విధానాలను మిళితం చేస్తూ నూతన నిఘంటువును తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పుస్తక రచయితను వీసీ ప్రసాద రెడ్డి అభినందించారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తెలుగు ప్రజలకు ఉపయుక్తంగా నిత్యం వినియోగించే అనేక వాడుక పదాలకు, మాండలీకాలకు నిఘంటువులో స్థానం కల్పించడం, ఆంగ్ల భాషలో వీటికి సమాన అర్ధాలను చూపుతూ తీర్చిదిద్దడం ఎంతో మంచి పరిణామమన్నారు.