విశాఖలో ఈనెల 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవ ఉత్సవాలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంయుక్త కలెక్టరు యం. వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విషయమై శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీస్ పెరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై జిల్లా కలెక్టరు, జిల్లా మేజిస్ట్రేట్ అయిన వి.వినయ్ చంద్ పతాకావిష్కరణ చేస్తారని, అనంతరం పోలీసు వందనం స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు పారిశుద్ధ్యం జీవీఎంసీ వారు చూసుకోవాలని, విశాఖపట్నం రెవెన్యూ డివిజన్ అధికారి మొత్తం కార్యక్రమ ఏర్పాట్లును పర్యవేక్షించాలన్నారు. పాఠశాల పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని డీఈఓ ను ఆదేశించారు. వేదికను అలంకరించాలని ఉద్యానవన శాఖ, వి.ఎం. ఆర్. డి. ఎ. అధికారులను ఆదేశించారు. కార్యక్రమం జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ ఈఈని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణకు అవసరమైన విషయాలను ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, ఎస్.డి.సి. రంగయ్య, డిఆర్ఓ ప్రసాద్, ఏ.వో. రామ్మోహన్ రావు, పౌరసరఫరాల అధికారులు నిర్మలాబాయి, శివ ప్రసాద్, సి.పి.ఓ. ప్రకాష్ రావు, జీవీఎంసీ, వుడా తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
సచివాలయాల ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించడంలో సిబ్బంది ముందుకు రావాలని కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో గల చంపాగల్లివీధి, మంగువారితోటలోని వార్డు సచివాలయాలను జిల్లా కలెక్టర్ శనివారం ఆకస్మిక తనిఖీ చేసారు. వార్డు సచివాలయంలో నిర్వహిస్తున్న రిజిష్టర్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేసారు. అనంతరం కలెక్టర్ సిబ్బందితో మాట్లాడుతూ వార్డు సచివాలయాలకు వచ్చే ఆర్జీదారుల సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించి వార్డు ప్రజల మన్ననలను పొందాలని సూచించారు.వార్డు సచివాలయంలోని రిజిష్టర్లను ఎప్పటికపుడు నమోదుచేస్తూ ఉండాలని, అధికారులు తనిఖీలకు వచ్చినపుడు రిజిష్టర్లను అందజేయాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీ కార్యక్రమంలో సహాయ కమీషనర్ కె.శివప్రసాద్ , టి.పి.ఆర్.ఓ జగన్ మోహన్ , నగరపాలక ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అన్నిదానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని రాజమండ్రిలోని ప్రముఖ ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాకిరవిబాబు అన్నారు. శనివారం ఆయన కుమారుడు గుణసాయితేజ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని సేవ తపన సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులతో కలిసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, తమకుటుంలో ఎవరి జన్మదినోత్సం జరిగినా, ఆరోజు ఖర్చేచేయాలనుకున్న డబ్బులతో తమవంతుగా నిరుపేదలకు ఒక్కపూట భోజనం పెట్టడానికి ఖర్చు చేస్తామన్నారు. తామే స్వయంగా వంటచేసుకొని అనాధలకు ఆరోజు భోజనం పెడతామని చెప్పారు. తమ తల్లిదండ్రులు నేర్పిన ఈ అలవాటును తమ జీవితాంతం కొనసాగిస్తామని రవిబాబు చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముందు సాయిబాబావారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సువార్తకులు, దైవదూత ఏసుదాసు, జ్యోతి, ప్రియాంక, గుణసాయితేజ తదితరులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం క్రుషిచేయాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బ్రుందం వైఎస్సార్సీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ ను కలిసి శనివారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విశాఖలోని వంశీ కార్యాలయంలో కలిసిన జర్నలిస్టులు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంతోపాటు జర్నలిస్టులందరికీ సంక్షేమ పథకాలు అందించి సొంతింటి కల నెరవేరే విధంగా చేయాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయించే ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన వంశీ క్రిష్ణ శ్రీనివాస్ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమర్పించిన సమస్యలను, డిమాండ్ లను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకు వెళతానని హామీ ఇచ్చారు. అదేసమయంలో జర్నలిస్టులు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు ప్రజలకు ప్రత్యేక కధనాల ద్వారా చేరువ చేయాలన్నారు. కనీస అర్హతలతో జర్నలిజంలోకి రావడం ద్వారా మంచి జర్నలిజం చేయడానికి ఆస్కారం వుంటుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ జర్నలిస్టుల పక్షపాతిగా వుంటుందని అన్నారు. వాస్తవాలను మాత్రమే జర్నలిస్టులు ప్రజలు, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా యూనియన్ డైరీని వంశీక్రిష్ణ శ్రీనివాస్ కు స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ అందజేశారు. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం అభివృద్దికి తాము సహకారం అందిస్తామని కాన్‌స్టెల్ గ్రూప్ హెడ్ ఆఫ్ గ్లోబల్ కాంప్లియెన్స్ వీణ జన అన్నారు. శనివారం ఉదయం ఆమె ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో మహిళలకు ఉపయుక్తంగా అభివృద్ది కార్యక్రమాలను చేపడతామన్నారు. తమ సంస్థ సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. త్వరలో దీనిపై నిర్ధిష్ట ప్రణాళికతో వస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ విద్యార్థులకు నైపుణ్యాలను మెరుగు పరచే చర్యల్లో భాగంగా వివిధ పరిశ్రమలతో కలసి పనిచేస్తున్నామన్నారు. వర్సిటీలో జరుగుతున్న పరిశోధనల ప్రగతిని వివరించారు. వర్సిటీకి సహకారం అందించడానికి సుముఖత వ్యక్తం చేయడం పట్ల సంస్థ ప్రతినిధి వీణ జనను అభినందించారు. కార్యక్రమంలో ఏయూ పాలక మండలి సభ్యులు వి.ఎస్ ఆంజనేయ వర్మ, ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్, కాకినాడ కస్టమ్స్ సూపరిండెంట్ జి.వి.వి.ఎస్.వి.ఎల్ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హయాంలో అనూహ్యంగా అభివ్రుద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని నగరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా పేర్కొన్నారు. శనివారం పుత్తూరులో తుడా పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ నిధులు కోటి రూపాయల నిధులతో పుత్తూరు ఎంపిడిఓ కార్యాలయం ప్రక్కన నర్సరీ స్థలంలో పార్క్ ను ఏర్పాటు చేయనున్నారని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు ఆనందంగా వుందన్నారు. ప్రజోపయోగ పథకాలు, కార్యక్రమాలకు తమ ప్రభుత్వం నిలువుటద్దమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర, మాహిన్, జయప్రకాష్, అంకయ్య, సంపత్ కుమార్, గణేష్, మునికృష్ణ, లారీ మోహన్, మోహన్ రెడ్డి, కరుణ, ఏకాంబరం, శ్రీనివాసులు, అన్న లోకనాదం, దేవేంద్ర, దిలీప్, శంకర్, కార్తీక్, సునిల్, చీరాల, లక్ష్మీ పతి, నారాయణ స్వామి, పుష్ప, బాలాజి, మునిసిపల్ కమీషనర్ వెంకట్రామిరెడ్డి, తుడా కార్యదర్శి శ్రీలక్ష్మి , ఉద్యానవన శాఖ అధికారి మాలతి, ఎమ్మార్వో జయరాములు, ఎండిఓ ఇందిరమ్మ, తదితరులు పాల్గొన్నారు.
విశాఖలోని సింహాచలంలో శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ది, క్రీడాశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుటుంబం శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న మంత్రి కుటుంబ సభ్యులకు అధికారులు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం కప్పస్తంభం ఆలింగనం చేసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి జ్ఞానేశ్వరి ,కుమారుడు శివ నందీశ్, కుమార్తె లక్ష్మీ ప్రియాంక, అల్లుడు శ్రావణ్ కుమార్, ఆలయ ఈవో వెంకటేశ్వరరావు , సింహాచలం బోర్డ్ సభ్యులు, స్థానిక నాయకులు , ఆలయ అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్ వేక్సినేషన్ వేసే సమయంలో వైద్యసిబ్బంది, అధికారులు, పర్యవేక్షులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావు ఆదేశించారు. శనివారం జివిఎంసి పరిధిలోని 17వ వార్డులో గల ఇ.ఎన్.టి. ఆసుపత్రిలోగల కోవిడ్ వేక్సినేషన్ సెంటర్ ను జివిఎంసి అదనపు కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ వేక్సినేషన్ అందించే ప్రక్రియలో భాగంగా ఇ.ఎన్.టి. ఆసుపత్రిలో ఫ్రంట్ లైన్ వారియర్సుకు, ముఖ్యంగా ఆరోగ్య అధికారులు, సిబ్బందికి అందిస్తున్న వేక్సినేషన్ ఏ విధంగా జరుగుతుందో వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేక్సిన్ తీసుకున్న సిబ్బందితో ముచ్చటించారు. వేక్సినేషన్ అనంతరం కూడా నియమిత కాలం వరకు కోవిడ్ నిబంధనలు పాటించాలని సిబ్బందికి హితవు పలికారు. ఆసుపత్రిలో వేక్సిన్ నిల్వఉంచిన ప్రదేశంలో విద్యుత్ కి ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. జనరేటర్ దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
జర్నలిస్టులు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్, గ్రేటర్ కమిషనర్ సృజన అన్నారు. శుక్రవారం ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్-2021 రాష్ట్ర డైరీని జీవీ ఎంసి కమిషనర్ ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేసే విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మహా విశాఖ నగర అధ్యక్షుడు పి. నారాయణ్ మాట్లాడుతూ, వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వర్కింగ్ జర్నలిస్తులందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ చేయాలన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న జర్నలిస్టులకు గృహ వసతి కల్పించాలని, అదేవిధంగా భీమా సౌకర్యం ఏర్పరచాలని కోరారు. వృత్తి పరంగా అనేక ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోవిడ్ బాధిత జర్నలిస్టులకు ఆర్ధిక సాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, ఏపీడబ్ల్యూజెఎఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డి.రవికుమార్, ఉపాధ్యక్షుడు కె.మురళీకృష్ణ శివప్రసాద్, సంయుక్త కార్యదర్శి జి.రాంబాబు, ఫోటో జర్నలిస్ట్ పిళ్లా నగేష్‌బాబు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
వర్కింగ్ జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు న్యూఢిల్లీ లోని పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అనుసరిస్తున్న నిబంధనలను అనుసరించి అక్రిడిటేషన్ కార్డులు జారీచేయాలని కోరుతూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం శుక్రవారం జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా విశాఖ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టరును కలిసి జర్నలిస్టుల సమస్యలు, అక్రిడిటేషన్ కార్డుల జారీలో తలెత్తుతున్న ఇబ్బందులు, హెల్త్ కార్డులు, ఇన్స్యూరెన్స్, ఉద్యోగ భద్రత, జర్నలిస్టుల పై జరుగుతున్న దాడుల విషయమై కలెక్టర్ కు వివరించారు. ప్రతీఏడాది అక్రిడిటేషన్ విషయంలో కొత్త నిబంధనలు పెట్టడం కాకుండా న్యూఢిల్లీలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) అవలంభిస్తున్న నిబంధనలతో జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. మీడియా సంస్థలు వేజ్ బోర్డును అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల ప్రధానహక్కు అయిన అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం జిఓనెంబరు 142 అమలుతో చాలా మంది అక్రిడిటేషన్లు కోల్పోయే అవకాశం వుందని, కేంద్ర ప్రభుత్వమే రూ.40 లక్షలు దాటితేనే జీఎస్టీ నెంబరు, రిటర్న్స్ ధాఖలు చేయాలని స్పష్టం చేసిన విషయాన్ని కలెక్టర్ కు యూనియన్ అధ్యక్షుడు వివరించారు. అంతే కాకుండా జీఎస్టీ పరిధిలోకి రాని న్యూస్ ఏజెన్సీలు, చిన్న పత్రికలకు జీఎస్టీ నిబంధన రద్దుచేయాలని, ఆన్ లైన్ విధానంలో ప్రెస్ క్లిప్పింగులు అధిక సంఖ్యలో సమర్పించడానికి వీలు పడనందున, నేరుగా పత్రికలుగానీ, క్లిప్పింగుల ఫైల్స్ స్వీకరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని కోరారు. దీనిపై కలెక్టర్ వి.వినయ్ చంద్ స్పందిస్తూ తాను ఈ విషయాన్ని నేరుగా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతానని, మీడియాకు తనవంతు సహకారం అందిస్తానని కలెక్టర్ భరోసా ఇచ్చారు. అదే సమయంలో ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తెలుసుకునేలా జర్నలిస్టులు ప్రభుత్వ సంక్షేమ కార్యాక్రమాలు, అర్హతలపై ప్రత్యేక కథనాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ఎక్కడైనా ప్రధాన సమస్యలను ఆధారాలతో మంచి కధనాలు రాయడం ద్వారా సంబంధిత సమస్యలపై చర్యలు తీసుకోవడానికి వీలుపడుతందని సూచించారు. అనంతరం స్మార్ట్ సిటీ వేల్ఫేర్ అసోసియేషన్ ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల కోసం యూనియన్ అధ్యక్ష, కార్యదర్శిలు కలెక్టర్ కు వివరించి యూనియన్ 2021 డైరీనికి కలెక్టర్ కు అందజేశారు. అంతే కాకుండా ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించిన సందర్భంగా ఎన్నికల కమిషన్ అవార్డుకి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ఎంపిక కావడాన్ని పురష్కరించుకొని యూనియన్ సభ్యులంతా కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి నక్కాన అజయ్ కుమార్,ఉపాధ్యక్షులు రామకృష్ణ,సహకార్యదర్శి పద్మజ,కార్యవర్గ సభ్యులు సాగర్, సభ్యులు నాగు, ఈశ్వర్, సురేష్, వెంకటలక్ష్మి, సూర్య తదితరులు పాల్గొన్నారు.
మాతృభాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి శుక్ర వారం జిల్లాలో పర్యటించింది. ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖలతో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తెలుగు భాషా, సంస్కృతి పరిరక్షించుకోవాలన్నారు. తెలుగు భాష గొప్పదని పేర్కొన్నారు. మాతృభాషలో తీపిదనాన్ని, ఔన్నత్యాన్ని, మధురత్వాన్ని మరచిపోరాదని పేర్కొన్నారు. పూర్వ కాలం నుండి తెలుగు భాషకు వైభవం ఉందని, తాళపత్ర గ్రంధాలలో సైతం ఎంతో అమూల్యమైన భాషా సాంస్కృతిక సంపద నిక్షిప్తమై ఉందని పేర్కొన్నారు. తంజావూరులో 2,300 తెలుగు తాళపత్ర గ్రంధాలు ఉన్నాయని చెప్పారు. తాళపత్ర గ్రంధాలను ప్రస్తుత అక్షర రూపంలోకి మార్చుతూ డిజిటలైజేషన్ జరుగుతోందని అన్నారు. మాతృభాషపై పట్టు సాధించాలని తద్వారా అందులో మధురానుభూతిని ఆస్వాదించగలమని అన్నారు. చిన్నప్పటి నుండి మాతృభాషను నేర్చుకోవాలని, కేరళ, తమిళనాడు, కన్నడంలో మాతృభాషకు గొప్ప ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. చిన్నతనం నుంచి ఉన్నత స్థాయి వరకు మాతృభాషపై మమకారం ఉండాలని అన్నారు. శ్రీకాకుళంలో కథానిలయం గొప్ప స్ఫూర్తి అన్నారు. విద్య ద్వారా భాషను నేర్చుకోకపోతే భాష అంతరించిపోయే అవకాశం ఉంటుందని సూచించారు. ఇంగ్లీషు వంటి ఇతర భాషలు నేర్చుకున్నప్పటికి మాతృభాషపై మమకారం విడవరాదని హితవు పలికారు. తెలుగులో ఉన్న గొప్ప గ్రంథాలను డిజిటలైజేషన్ చేయడం ద్వారా రాబోయే తరాలకు గొప్ప వారసత్వ సంపద అందించగలమన్నారు. భాషతో అన్యోన్యత పెరగాలని, తెలుగు సంస్కృతి పరిరక్షణకు కృషి జరగాలని అన్నారు. తెలుగు నేల సంస్కృతి, కళలకు పుట్టినిల్లని పేర్కొంటూ వాటి పరిరక్షణకు కృషి చేయాలన్నారు. పూర్వీకుల నుండి వస్తున్న సంపద అని భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. తెలుగు వ్యక్తిగా ప్రతి ఒక్కరూ భాషా, సంస్కృతుల ఔన్నత్యానికి పాటుపడాలని కోరారు. చిన్నప్పటి నుండి భాషపై ఔపోసన పట్టాలని అన్నారు.
ప్రత్యేక ఆహ్వానితులు వి. బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ కమిటీ శ్రీకాకుళం రావడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో గొప్ప సాహితీ, సాంస్కృతిక సంపద ఉందని, ఆధునిక సాంస్కృతిక కేంద్రం ఉత్తరాంధ్ర అని అన్నారు. సాహిత్య ఉద్యమాలు నడిచిన నేల అన్నారు. గిడుగు రామమూర్తి పంతులు నడిపిన వ్యావహారిక ఉద్యమం మరుపురానిదని పేర్కొంటూ కథానిలయం స్పూర్తితో రాజమండ్రిలో నాటక నిలయం ఆవిర్భావం జరిగిందని చెప్పారు. డా.బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో తెలుగు భాష అభివృద్ధికి కృషి జరగాలని సూచించారు. స్థానిక యాస, జానపద, పొడుపు కథలు, జీవన శైలి తదితర అంశాలపై పరిశోధనలకు ప్రోత్సహించాలని కోరారు. శ్రీకాకుళం వాసి కాళీపట్నం రామారావు రచించిన యజ్ఞం పుస్తకంపై దాదాపు 16 మంది పి.హెచ్.డి కోసం పరిశోధనలు చేయడం గర్వకారణమన్నారు. అండమాన్ నికోబర్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో శ్రీకాకుళం వాసులు ఉన్నారని, శ్రీకాకుళం వాసులు సాహితీ, సాంస్కృతిక సంపద పరిరక్షణలో అద్వితీయమని అన్నారు. అండమాన్ నికోబర్ లో సీబీఎస్ ఇ పరీక్షలలో సైతం సాంఘిక శాస్త్రం పరీక్షను తెలుగులో రాయుటకు అనుమతి పొందిన ఘనత అచ్చటి తెలుగు వారు సాధించిన విజయమన్నారు. ఉపాధ్యాయులలో సాహితీ కృషీ వలురను గుర్తించి ప్రోత్సహించాలని డిఇఓ కు సూచించారు. పుస్తకాలు చదవడం అనేది అలవాటుగా మారాలని, నిత్య కృత్యం కావాలని అన్నారు. 10వ తరగతి లోపు విద్యార్థులను వారి ఆసక్తి మేరకు గ్రూపులుగా విభజించి అనువైన పుస్తకాలను గూర్చి తెలియజేయాలని, వాటిని చదివే విధంగా ప్రోత్సహించాలని చెప్పారు. కస్తూర్బా విద్యాలయంలో మంచి పుస్తకాలు ఏర్పాటు చేయాలని ఏపిసికి సూచించారు. ఏ విద్యార్థి ఎన్ని పుస్తకాలు చదివారో తెలుసుకోవాలని పేర్కొన్నారు. స్థానిక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కువగా లభ్యంగా ఉంచాలని తద్వారా ఆసక్తి పెరుగుతుందని అన్నారు.
కమిటి సభ్యులు పి వి ఎన్ మాధవ్, కత్తి నరసింహ రెడ్డి పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ జె నివాస్ మర్యాద పూర్వకంగా కమిటీ ఛైర్మన్ ను కలసి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. జిల్లాలో రూపొందించిన కళింగాంధ్ర దేశ చరిత్ర, శ్రీకాకుళం - ఏ స్టోరీ ఆన్ స్టోన్ పుస్తకాలను ఛైర్మన్ కు, సభ్యులకు అందించారు.
జిల్లా విద్యా శాఖ అధికారి కె.చంద్ర కళ, సాంఘిక సంక్షేమ గురుకులం సమన్వయ అధికారి వై. యశోద లక్ష్మీ, గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు కమల, సమగ్ర శిక్షా అభియాన్ ఏపిసి పివి రమణ, జిల్లా వృత్తి విద్య అధికారి ప్రకాశరావు, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.కె.శ్రీరాములు పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు భాష అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆర్.శ్రీరాములు నాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, కమిటీ డిప్యూటీ కార్యదర్శి జి.విజయ రాజు, డిప్యూటీ విద్యా శాఖ అధికారి జి.పగడాలమ్మ, ఇంటాక్ కన్వీనర్ కెవిజే రాధా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పచ్చదనం కార్యక్రమం కింద 70 లక్షల మొక్కలు నాటమని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. శుక్రవారం గుంటూరులో ఏర్పాటు చేసిన డ్వామా పీడిల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మనం నాటిన ప్రతి మొక్కకు ట్రీ గార్డ్ ఏర్పాటు చేయాలని, చాలా చోట్ల ట్రీ గార్డులు కనపడటం లేదని అసహనం వ్యక్తం చేశారు. ట్రీగార్డ్ ల ఏర్పాట్లకు పిడిలు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది మాట్లాడుతూ రానున్న 60 రోజులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాకి రెండు కోట్ల పనిదినాలు కల్పించాలని, ఉపాధి హామీ, వైఎస్ఆర్ జలకళ పనులను వేగవంతం చేయాలని అన్నారు. మెటీరియల్ కు సంబంధించి ఇంకా రూ.1500 కోట్లు వినియోగించుకోవాల్సి వుంది కనుక భవన నిర్మాణాలపై పిడి డ్వామాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. అనుసంధాన శాఖ అధికారులను సమన్వయ పరచుకుంటూ ముందుకు వెళ్ళాలని అన్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిజం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటూ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ కేంద్రాలు, సిసి డ్రైన్లు, పాఠశాల ప్రహరీ గోడలు తదితర మెటీరియల్ కాంపోనెంట్ పనులను మార్చి 31 లోపు పూర్తి చేయాలని, వైఎస్ఆర్ జలకళ బోర్ల పనులను ఒక సవాల్ గా తీసుకుని ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని తమను తాము నిరూపించుకోవాలని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 30 కోట్ల పనిదినాలను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల డ్వామా పిడిలు తమ తమ భవిష్యత్ ప్రణాళికలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, ఇజిఎస్ సంచాలకులు పి. చిన్నతాతయ్య, వాటర్ షెడ్ సంచాలకులు పి. వెంకటరెడ్డి, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, ఎ. కళ్యాణ చక్రవర్తి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వివిధ సంస్ధలు గ్రంథాలయాలకు చెల్లించాల్సిన సెస్సులను చెల్లించి భాషాభివృద్ధికి సహకరించాలని శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి చైర్మన్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు. శాసన మండలి తెలుగు భాషా, సంస్కృతి కమిటి శుక్ర వారం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో చైర్మన్ మాట్లాడుతూ మాతృభాష ఔన్నత్యాన్ని పరిరక్షించుకోవాలని అన్నారు. భాష, సంస్కృతి ఔన్నత్యాన్ని మెరుగు పరచుటకు, అభివృద్దికి ప్రభుత్వానికి నివేదికను కమిటి సమర్పిస్తుందని తెలిపారు. భాషాభివృద్ధికి ఏ విధమైన సహకారం అవసరమో తెలుసుకొనుటకు కమిటి పర్యటనలను చేస్తుందని అన్నారు. తాళపత్ర గ్రంధాలను డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని అన్నారు. మునిసిపాలిటిలు, పంచాయతీలు తదితర సంస్ధలు గ్రంధాలయ సెస్సులను వసూలు చేస్తున్నాయని వాటిని ఎప్పటి కప్పుడు చెల్లించడం ద్వారా గ్రంధాలయను అభివృద్ధి చేయవచ్చన్నారు. గ్రంధాలయాలకు పేద పిల్లలు వస్తారని వారికి మంచి సౌకర్యాలతోపాటు మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచుటకు అవకాశం ఉంటుందని చెప్పారు. గ్రంధాలయాలు యువతకు విజ్ఞానం, వికాసం, ఉపాధి కల్పిస్తుందని దానిని మరింతగా యువత వినియోగించుకునే విధంగా తయారు చేయాల్సిన అవసరం ఉదని అన్నారు. జానపద కళలకు పెద్దపీట వేసి పరిరక్షించుకోవాలని, అవి గొప్ప సంపద అన్నారు. వీటన్నింటిపైన సమగ్రమైన నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని ఛైర్మన్ చెప్పారు.
ప్రతి వారం ఫీల్డ్ అసిస్టెంట్లతో ఉపాధి హామీ పథకం అమలు తీరును సమీక్షించుకుంటూ ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు శుక్రవారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్రస్థాయి డ్వామా పిడిల సమీక్షా సమావేశంలో ఆయన రెండో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని వాటిపై విజిలెన్స్ విచారణ జరుగుతోందని అన్నారు. మెటీరియల్ కంపోనెంట్ కు సంబంధించిన పనులు తమకు సంబంధం లేదన్నట్టుగా డ్వామా పిడిలు వ్యవహరించవద్దని హెచ్చరించారు. ఉపాధి పనులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించాలని, నాణ్యత ప్రమాణాలతో పనులు జరిగేలా చూసి, అవినీతి, నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా ఉండాలని మంత్రి అన్నారు.
జాతీయస్థాయిలో ఎక్కువ కుటుంబాలకు 'ఉపాధి' పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో వుందని, కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించి దేశంలోనే ప్రథమ స్థానంలో మన రాష్ట్రం నిల్చిందని అంటూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ ఏడాది జూన్ 8న ఒకే రోజు 54.42 లక్షల మందికి పని కల్పించి కొత్త రికార్డు సృష్టించామని మంత్రి అన్నారు. కోవిడ్ నేపథ్యంలో కొత్తగా 4 లక్షల జాబ్ కార్డులు జారీ చేశామని, తద్వారా 15 లక్షల మంది వలస కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పించి, వారికి అండగా నిలిచామని, ఇతర ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చిన కూలీలకు ఉపాధిని సక్రమంగా అందిస్తే, వారు తిరిగి వలస వెళ్ళకుండా చూడవచ్చని, ముఖ్యమంత్రి కూడా వలసలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని చెప్పారు. డ్వామా పిడిలు దీనిని ప్రధమ ప్రాధాన్యతగా తీసుకోవాలని పెద్దిరెడ్డి చెప్పారు.
ఈ ఏడాది మన రాష్ట్రానికి కేంద్రం 25.25 కోట్ల పనిదినాలు ఆమోదించిందని, ఇప్పటి వరకు 22.44 కోట్లు పనిదినాలు వేతనదారులకు కల్పించామన్న మంత్రి మిగిలిన రెండు నెలల్లో మరో 5 కోట్ల పనిదినాలు కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. డ్వామా పిడిలు, ఎంపిడిఓలు సమన్వయంతో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని, మండల స్థాయిలో ఎంపిడిఓ కార్యాలయాలకు కూడా వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది లక్ష్యాన్ని అధిగమిస్తే, వచ్చే ఏడాది దాదాపు 30 కోట్ల పనిదినాలు వస్తాయని, కొన్ని జిల్లాల్లో రైతులు తమ పంట పొలాలకు డొంకరోడ్లు కావాలని కూడా అడుగుతున్నారని, సాధ్యాసాధ్యాలు పరిశీలించి అవసరమైన చోట్ల రోడ్లు వేయాలని, ఉపాధి హామీ పనులు ప్రజల అవసరాలకు ఏ మేరకు వినియోగించగలమో శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వున్న వంద రోజుల పనిదినాలను 150 రోజులకు పెంచాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు.
మెటీరియల్ కాంపోనెంట్ పనుల కింద చేపట్టిన భవనాలు, సిసి రోడ్లు, డ్రైన్ నిర్మాణం మార్చ్ 31లోపు ఖచ్చితంగా పూర్తి చేయాలని, ఈ ఏడాది దాదాపు రూ.4వేల కోట్ల మేర మెటీరియల్ నిధులున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుని సుస్థిర ఆస్తులను ఏర్పాటు చేయాలని అంటూ, వచ్చే ఏడాది దాదాపు రూ.5వేల కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ పనులు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. కనుక దీనిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణంలో వున్న భవనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 4,158.34 కోట్లతో 10,929 గ్రామ సచివాలయ భవనాలను ప్రభుత్వం మంజూరు చేయగా వీటిలో 1418 భవనాలు ఇప్పటికే పూర్తయ్యా యని, మిగిలిన 9511 భవనాలు నిర్మాణంలో వున్నాయని, అలాగే రూ.1502.38 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 8,585 వైయస్ఆర్ ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వం మంజూరు చేయగా, 8547 ప్రగతిలో ఉండగా, 38 భవనాలు పూర్తయ్యా యని, రైతుభరోసా కేంద్రాల కోసం రూ.2268 కోట్లు కేటాయించగా 10,316 ప్రగతిలో ఉన్నాయని, రూ.386.68 కోట్లతో 8859 అంగన్ వాడీ కేంద్రాలను మంజూరు చేయగా ఇప్పటికే 4429 పూర్తయ్యాయని, మిగిలిన భవన నిర్మాణ పనులన్నీ మార్చి 31వ తేదీ లోగా పూర్తి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వీటితోపాటు పాలసేకరణ కేంద్రాలు, సిసి డ్రైన్లు, పాఠశాల ప్రహరీ గోడలు తదితర మెటీరియల్ కాంపోనెంట్ పనులను సకాలంలో పూర్తి చేయాలని, జలకళ కింద బోర్ల డ్రిల్లింగ్ పనులు వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 13 జిల్లాల డ్వామా పిడిలు తమ తమ భవిష్యత్ ప్రణాళికలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వివరించారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి, ఇజిఎస్ సంచాలకులు పి. చిన్నతాతయ్య, వాటర్ షెడ్ సంచాలకులు పి. వెంకటరెడ్డి, ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, ఎ. కళ్యాణ చక్రవర్తి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.