గర్భిణీ వసతి గృహంలో గర్భిణీలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని డిప్యూటీ డి. ఎం అండ్ హెచ్ ఓ రవికుమార్ పేర్కొన్నారు. డిప్యూటీ డి. ఎం అండ్ హెచ్ ఓ రవికుమార్ శుక్రవారం సాలూరు వై టి సి లో నిర్వహిస్తున్న గర్భిణీ వసతి గృహన్ని పర్యటించారు, ముందుగా గర్భిణీలతో మాట్లాడుతూ వైద్యం, మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి రోజు వారి అందిస్తున్న ఆహార వివరాలు, వైద్య పరీక్షలపై ఆరా తీశారు. అనంతరం డిప్యూటీ డి. ఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ గారి ఆదేశాలననుసరించి పర్యటించడం జరిగిందన్నారు, అలాగే పూర్తి స్థాయి లో వైద్యం పరీక్షలు నిర్వహించాలని అలాగే వారికి కావలసిన మందులు అందజేయాలని సంబంధిత వైద్య సిబ్బందికి సూచించారు. ఎ ఎన్ ఎం, ఆశా వర్కర్లు 7 నెలలు నిండిన గర్భిణిలకు వారికి దగ్గరలో.ఉన్న గర్భిణీ వసతి గృహంలో చేర్పించి విధంగా చర్యలు చేపట్టాలన్నారు అందులో భాగంగా వారికి గర్భిణీ వసతి గృహాలపై అవగాహన కల్పించాలన్నారు. వైద్య సిబ్బంది అందరూ ప్రాజెక్ట్ అధికారి వారి ఆదేసాలనానుసరించి విధులు నిర్వహించాలని తద్వారా గిరిజన మహిళలకు సుఖ ప్రసవం జరిగేలా ప్రతి ఒక్కరూ ఆదర్శంగా విధులు నిర్వహించాలని కొరారు.
"కరచాలనం వద్దు.. నమస్కారమే ముద్దు" అ ని వైద్య సిబ్బంది నినదించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కరోనా పై అవగాహన కల్పిస్తూ శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుంచి మహారాజ ఆసుపత్రి వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తరువాత అధికంగా జనసంచారం పెరిగిన నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీనీ సంయుక్త కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ స్థానిక కలెక్టరేట్ వద్ద ప్రారంభించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ర్యాలీ స్థానిక మహారాజ ఆసుపత్రికి వరకు సాగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.రమణా కుమారి, ఎం.ఆర్.హాస్పిటల్ సూపరింటెండెంట్ సీతారామరాజు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సచివాలయాలకు వచ్చే సర్వీసులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలని, సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శుక్రవారం పామిడి నగర పంచాయతీ పరిధిలోని గాయత్రి కాలనీ లో ఉన్న పామిడి -3 సచివాలయాన్ని, పామిడి మండలంలోని గజరాంపల్లి గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు తగిన సమాచారాన్ని బాధ్యతగా అందించాలని సచివాలయ ఉద్యోగులకు సూచించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగులంతా ఎక్కడికి వెళ్ళినా విధిగా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. సచివాలయానికి వచ్చే సర్వీసులను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపించాలన్నారు. సచివాలయాలపై నమ్మకం వచ్చే విధంగా ప్రతి ఒక్క ఉద్యోగి పనిచేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయా సచివాలయాలలో ఉద్యోగుల హాజరు పట్టికలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఆయా సచివాలయాల్లో ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారు అనే వివరాలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పామిడి మున్సిపల్ కమిషనర్, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
కరోనా నివారణకు మాస్కే కవచం అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి కోవిడ్ 19 నివారణపై ముమ్మర ప్రచార కార్యక్రమంలో భాగంగా నగరంలోని టవర్ క్లాక్ నుంచి వైయస్సార్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్యలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా వైరస్ అన్నది ఇంకా ముగియలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం కోవిడ్ 19 నివారణపై ముమ్మర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకూ కరోనా వైరస్ నివారణ పై వివిధ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టామన్నారు. అందులో భాగంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 62,500 మందికి పైగా కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లారన్నారు. భవిష్యత్తులో కరోనా కేసులు ఇంకా తగ్గించడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం తోపాటు కరోనా నివారణకు ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఎవరికి వారు వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, కరోనాను అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. కరోనాను జిల్లాలో సాధ్యమైనంతవరకూ కట్టడి చేశామని, జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా జరగకుండా తగిన చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నేపథ్యంలో మౌలిక వసతులు అభివృద్ధి చెందేందుకు అనేక నిధులు మంజూరు చేశారని, జిల్లా యంత్రాంగం తరఫున సమర్థవంతంగా మౌలిక వసతులను ఉపయోగించుకుని కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామని తెలిపారు. కరోనా వైరస్ మరింత వ్యాపించకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కొవ్వొత్తుల ర్యాలీ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ( గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ. సిరి, ఇంచార్జ్ డిఎంఅండ్హెచ్ఓ పద్మావతి, నగరపాలక సంస్థ కమిషనర్ పివివిఎస్ మూర్తి, ఆర్డీవో భూషణ్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 84,401 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,886 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,20,565కి చేరింది. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,88,375గా ఉంది. 24 గంటల్లో కరోనాతో 17 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 6,676కు చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 25,514 యాక్టివ్ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. ఏపీలో కరోనా పాజిటివ్ రేటు 10.33 శాతం ఉండగా.. ప్రతీ మిలియన్ జనాభాకు 1,48,818 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్ఫటివరకు రాష్ట్రంలో 79,46,860 సాంపిల్స్‌ను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌బులెటిన్‌లో పేర్కొంది. అంతేకాకుండా కరోనా వైరస్ నియంత్రణకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కూడా ప్రభుత్వం కోరుతోంది. మాస్కు, సామాజిక దూరం తప్పని సరి అని కూడా ప్రభుత్వం ప్రజలకు సూచిస్తుంది.
తిరుపతిలోని కోమలమ్మ సత్రాన్ని జెఈవో(ఆరోగ్యం మరియు విద్య) సదా భార్గవి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈఓ మాట్లాడుతూ, తిరుపతి నగరం నడిబొడ్డున 95 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న కోమలమ్మ సత్రం నిరుపయోగం కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సత్రాన్ని తగిన కార్యాలయానికి కేటాయించాలని జెఈఓ సూచించారు. తద్వారా ఈ సత్రానికి ఒక గుర్తింపు వస్తుందన్నారు. లేదంటో ఎంతో విలువైన ప్రదేశం నిరుపయోగంగా మారిపోవడంతో పాటు, భవనాలు శిధిల స్థితికి చేరుకుంటాయన్నారు. టిటిడికి చెందిన ఏదో విభాగాన్ని ఇక్కడ ఏదోఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ సత్రం పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందన్నారు. అదేవిధంగా పురాణ ఇతిహాస ప్రాజెక్టును పరిశీలించారు. టిటిడి ఈఓ ఆదేశాల మేరకు రథసప్తమి లోపు పురాణాల ముద్రణను పూర్తిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జెఈఓ వెంట ఆయా విభాగాల అధికారులు ఉన్నారు.
అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైజాగ్ స్టీల్‌ప్లాంట్`పోస్కో జాయింట్ వెంచర్‌పై చర్చించారు. పోస్కో యాజమాన్యంతో జరిపిన చర్యను సిపిఐ(ఎం) పార్టీ గ్రేటర్ విశాఖ నగర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని కార్యదర్శి డా॥ బి.గంగారావు చెప్పారు. శుక్రవారం ఈ విషయమై జీవిఎంసీ ఎదురుగా వున్న గాంధీ విగ్రహ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తక్షణమే పోస్కో యాజమాన్యంతో జరిగిన చర్చ వివరాలు బహిర్గతం చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రిని సిపిఐ(ఎం) పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. పోస్కోకి వ్యతిరేకంగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని కార్మికులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల తో పాటు వివిధ రాజకీయ పార్టీలు తీవ్ర పోరాటం చేస్తున్నామని.. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పోస్కో యాజమాన్యంతో చర్చించటం దుర్మార్గమన్నారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను జాయింట్ వెంచర్ పేర పోస్కోకి కట్టబెట్టే చర్యలు ముఖ్యమంత్రి విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను పోస్కోకి కట్టబెట్టుటమంటే ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసినట్లవుతుందని అన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పనిసరిగా వైజాగ్ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు అండగా ఉండాలన్నారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) నాయకు ఆర్‌కెఎస్వీ కుమార్, బి.జగన్, ఎం.సుబ్బారావు, ఎం.కృష్ణారావు తదితయి పాల్గొన్నారు.
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నం నగరం లో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపధ్యంలో భర్తపై, భార్య పెట్రోల్ పోసి తగల బెట్టింది. ఇనకుదురు పేట పోలీసు స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ దారుణం జరిగింది. మచిలీపట్నం మార్కెట్ యార్డు కమిటి చైర్మన్ షేక్ అచ్చాబా కుమారుడు ఎస్.కే. ఖాదర్ బాషాపై పెద్ద భార్య గురువారం రాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించింది. 50 శాతం కాలిన గాయాలతో ఉన్న ఖాదర్ భాషా గత అర్థరాత్రి తరువాత 1-30 గం. సమయంలో జిల్లా ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను విజయవాడ తరలించగా... ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలిసింది. వివరాలు తెలుసుకుంటే ఖాదర్ భాషాకు ఇద్దరు భార్యలు. భార్యలిద్దరూ అక్క చెల్లెళ్లు. మొదట అక్కను పెళ్లి చేసుకోగా, రెండు నెలల క్రితం ఆమె చెల్లెల్ని బాషా రెండో పెళ్లి చేసుకున్నాడు. తన దగ్గరకంటే తన చెల్లెలి వద్దే ఎక్కువ కాలం బాషా గడుపుతూ ఉండటంతో మొదటి భార్య, భర్తతో తరచూ గొడవ పడుతూ ఉండేది. ఈ నేపధ్యంలో గురువారం రాత్రి భార్యా భర్తల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవల్లో మొదటి భార్య బాషాపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. వెంటనే ఆయన జిల్లా ఆస్పత్రిలో చేరారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కొసం అతడ్ని రాత్రే విజయవాడలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న బాషా ఆరోగ్యం విషమించినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న ఇనకుదురుపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా దళితులందరూ ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం వెలంపేటలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద డా. బి.ఆర్. అంభేథ్కర్ విగ్రహాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు ఆవిష్కరించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం అల్ ఇండియా ఎస్సి, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్.అంభేథ్కర్ వారసులమని గర్వముగా చెప్పుకుంటామని తెలిపారు. ఈ రోజు దళితులు ఉద్యోగ, రాజకీయ రంగాలలో రానిస్తున్నారంటే అది ఆయన కృషి ఫలితమేనన్నారు. భారత దేశంలో దళితులు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఉన్నారంటే అది ఆయన పెట్టిన భిక్ష మాత్రమేనన్నారు. ఆ మహానుభావుడి ఆలోచన స్పూర్తితో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం రిజర్వేషన్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించినట్లు పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా ఒక దళిత మహిళకు హోంమంత్రి, గిరిజన మహిళకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి ముఖ్యమంత్రి గౌరవించినట్లు చెప్పారు. రాష్ట్రంలో దళితులందరూ ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. నామినేటెడ్ పోస్ట్ లలో ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ 50 శాతం కల్పించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల ద్వారా దాదాపు 65 వేల కోట్ల రూపాయలను నేరుగా మహిళ ఖాతాల్లో వేయడం జరిగిందని, దళితులు పారిశ్రామికంగా ఎదగాలని నూతన పాలసీని కూడా తీసుకొచినట్లు పేర్కొన్నారు. అంభేథ్కర్ ఆశయాలను నెరవేర్చడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళిఅని చెప్పారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్. అంబేథ్కర్ ఆశయాలను అందరం తప్పక పాటించాలన్నారు. అంబేథ్కర్ ఒక్క దళితులకే కాదు యావత్ దేశ ప్రజలకు పూజనీయులని పేర్కొన్నారు. భారత దేశమే కాదు, ప్రపంచం మొత్తం గర్వించదగ్గ వ్యక్తి డాక్టర్ బి.ఆర్. అంబేథ్కర్ అని కొనియాడారు. భారతదేశంలోని అందరు నాయకుల్లో బిఆర్ అంబేథ్కర్ అత్యుత్తమ మేధావని ఎప్పుడో గుర్తించినట్లు స్పష్టం చేశారు. భారత ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ, హక్కులును పొందుతున్నామని అది ఆయన కృషి ఫలితమేనన్నారు. అలాంటి మహనీయుని విగ్రహాలు ఊరి బయటకాదు, ఊరి నడిబొడ్డున ఉంచాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి దళితుల పక్షపాతి అని ఖచ్చితంగా చెప్పాలన్నారు. అంబేథ్కర్ ఆశయాలను అమలుపరుస్తూ దళితుల అభివృద్థికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దళితులు ఆర్థికంగా, రాజకీయంగా బలపడాలని ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, శాసన మండలి సభ్యులు రవీంద్రబాబు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ మేకతోటి దయాసాగర్, శాసన సభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, గొల్ల బాబురావు, ఎస్.సి., ఎస్.టి. పోస్టల్ ఎంప్లాయిస్ అసోషియేషన్ సభ్యులు బి. యేసు, బి. వరప్రసాద రావు, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి సహకార సంఘాల ను పరిపుష్టం చేయాల్సి ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. నరసన్నపేట నియోజకవర్గం సారవకోటలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పి.ఏ.సి.ఎస్) మొదటి అంతస్తు నూతన భవనాన్ని ఉప ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బలమైన సంకల్పంతో ఉన్నారని చెప్పారు. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత రంగాలలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం ఉన్నాయని తెలిపారు. సహకార సంఘాల ద్వారా ఈ ఏడాది కస్టమ్ హైరింగ్ సెంటర్ లు, కస్టమ్ హైరింగ్ హబ్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆర్.బి.కే లో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని, రూ.15 లక్షల వరకు విలువ చేసే వ్యవసాయ యంత్రాలు పనిముట్లు ఇక్కడ అందుబాటులో ఉంటాయని వివరించారు. వీటిని అద్దె ప్రాతిపదికన రైతులకి అందజేస్తామని తెలిపారు. రైతులు కూలీల కొరత సమస్య నుంచి బయటపడవచ్చని సూచించారు. ఈ యంత్రాలు కొనుగోలు చేసేందుకు డిసిసిబి ఆర్ధిక సహాయం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లకు అద్దెకు పరికరాలను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. బ్యాంకు రుణం చెల్లింపు పూర్తి అయిన తర్వాత సహకార సంఘానికి ఆ యంత్రాలు సొంతం అవుతాయని అన్నారు. కస్టమ్ హైరింగ్ హబ్ లో కోటి విలువైన భారీ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నామని, వీటిని అద్దెకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేశామని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గానికి సంబంధించి అల్లాడ సొసైటీకి హబ్ అందుబాటులో ఉందని అన్నారు. ఆత్మ నిర్భర భారత్ పథకంలో భాగంగా రైతులకు గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ లు, భూసార పరీక్షలు చేసే ల్యాబ్ లు నిర్మించేందుకు అనుమతులు లభించాయని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. నాబార్డు ద్వారా వీటిని మంజూరు చేయడమే కాకుండా రుణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారని చెప్పారు. డిసిసిబి ద్వారా జిల్లాలోని పిఎసిఎస్ నుంచి ఈ ఖరీఫ్ సీజన్లో 120 కోట్ల రూపాయల రుణాలను రైతులకు అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయితే ప్రజా ప్రతినిధులు సచివాలయం ద్వారా పాలనను సమన్వయం చేసుకుంటారని వివరించారు. కరోనా కట్టడి అయిన తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉండవచ్చని పేర్కొన్నారు. సారవకోట మండలంలో కెళ్లవలస - జమ చక్రం డబుల్ లైన్ రోడ్డునకు రూ.15 కోట్లు మంజూరు చేసామని, వడ్డేన వలస- కొమనాపల్లి రోడ్డు కూడా 15 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, సీఈఓ దత్తి సత్యనారాయణ, పిఎసిఎస్ చైర్మన్ గెల్లంకి వెంకటరమణ, మాజీ ఎంపీపీ చిన్నాల కూర్మి నాయుడు, వరదు రాఘవ, చిన్నాల వెంకట సత్యనారాయణ, వైస్ చైర్మన్ నక్క తులసీదాస్, బాడన కృష్ణ, డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ తో అన్నార్తులకు ఆకలి తీర్చడంలో ఎంతో ఆనందం సొంతం చేసుకున్నామని ప్రముఖ ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ కాంట్రాక్టర్ కె.రవిబాబు అన్నారు. శుక్రవారం తన జన్మదినం సందర్భంగా రాజమండ్రి ఫుడ్ అండ్ బ్లడ్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ, కరోనా విపత్తు అన్ని వర్గాలకు నష్టాన్ని తెచ్చిందని, ఈ సమయంలో అనాధ ఆశ్రమాలు, నా అనుకునేవారు లేనివారికి మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టిందన్నారు. అలాంటివారందరికీ దాతలు చేస్తున్న మంచిపనులు తనను కూడా కదిలించాయని అన్నారు. ప్రతీనెలా బాబావారి ఆశీస్సులతో బియ్యం దానం చేసే తాము, ఈ సారి నేరుగా భోజనం తయారుచేసి కుటుంబ సమేతంగా అన్నదానం చేసినట్టు వివరించారు. ఒక మంచి కార్యక్రమం చేయడం ద్వారా అది ఎందరికో ఆదర్శం అవుతుందన్నారు. చాలా మంది దాతలను చూసి తనకున్నదానిలో కొంత భాగం సేవకు వెచ్చిస్తున్నట్టు రవి వివరించారు. ఈ కార్యక్రమంలో కాకిరవిబాబు కుటుంబ సభ్యులు జ్యోతి,ప్రియాంక, గుణసాయితేజ, సొసైటీ సిబ్బంది, రవి మిత్రులు పాల్గొన్నారు.
గొట్టం కాజా అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచదేశాల్లో కూడా మంచి డిమాండ్ వుంది..తీపిని ఇష్టపడేవారు లొట్టలేసుకుంటూ ఈ ఖాజాలు మహా బాగా ఆరగిస్తారు. ఆ గొట్టం కాజాపుట్టినిల్లు కాకినాడ. ఇపుడు కాకినాడ గొట్టం కాజాకి 130 గడిచాయి. ఈ సందర్బంగా ఆ తీపిగుర్తు ఈఎన్ఎస్ లైవ్ పాఠకులకు తెలిజేసే ప్రయత్నమిది. చిట్టి కాజా కాకినాడ అంటే చాలా మందికి మొదటగా గుర్తొచ్చేది కాకినాడ కాజానే. అందులోనూ కోటయ్య కాజా అంటే ఇంకాఎక్కువ పేరు. ఈ ఖ్యాతి ఖండాంతరాలు కూడా దాటింది. విదేశాల్లో ఉండే తెలుగువారు కూడా కాకినాడ కాజాను రుచి చూడాలనుకుంటారు. గొట్టం కాజాను కొరకగానే అందులో ఉన్న పాకం నోటిని తియ్యగా చేసేస్తుంది. ఆ థ్రిల్ తినే వారికి మాత్రమే తెలుస్తుందంటారు. తెనాలి నుండి వచ్చిన కోటయ్య అనే వ్యక్తి1891 నుండి వీటిని తయారు చేయగా, బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత ఇతరులు కూడా వీటిని తయారు చేయడం మొదలు పెట్టారు. కాకినాడలోనే కాదు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా చోట్ల ఇలాంటి గొట్టం కాజాలు దొరుకుతున్నాయి. కానీ కాకినాడ కాజాకి వున్న డిమాండ్ మరెక్కడా దొరకదు. స్వీట్ అంటే ఇష్టపడే వారు తప్పకుండా వీటిని రుచి చూస్తారు. అందుకే పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా సుమారు 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కోటయ్య కాజాలకు ఉన్న ప్రత్యేకతకు దృష్టిలో పెట్టుకుని ఆ పేరుతో పోస్టల్ కవర్‌ను రిలీజ్ చేసింది. గొట్టం కాజా ప్రత్యేకత ఏంటంటే , కొబ్బరి బొండం లో నీళ్ళు ఎలా అయితే ఉంటాయో, ఈ గొట్టం కాజా లో జ్యూస్ అల ఉంటుంది.కోటయ్య కాజా దుకాణంతో ప్రసిద్ధి చెందిన ఈ వీధిని కోటయ్య స్ట్రీట్ అనే పిలుస్తారు. ఇక్కడ కోటయ్య తరువాత వారి కుమారుల ద్వారా అతి పెద్ద దుకాణ సముదాయం నడుస్తోంది కాకినాడలో..ఇంతటి చరిత్ర వుంది కాకినాడ ఖాజాకి. ఆతరువాత వాడుకలోకి వచ్చిన మడతకాజా, చిట్టికాజాలు వచ్చినా అవి అంతగా ప్రాచుర్యంలోకి రాలేదు..
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం దిగువ భాగంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివాహం అనంతరం అర్ధరాత్రి 1:30 ప్రాంతంలో పెళ్లి బృందంలో 20 మంది డీసీఎం వ్యాన్ లో తిరుగుప్రయా ణమయ్యారు. కొండ పై నుండి కిందికి దిగుతున్న సమయంలో వ్యాన్ అదుపుతప్పి మెట్లమీదుగా వెళ్లి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో 5 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. కాకినాడ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మిగిలిన వాళ్లు రాజమండ్రిలోని మూడు వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో వధూవరులు వేరే వాహనంలో ఉండటంతో వారు బతికి బట్టగట్టారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విపత్తు సమాచారం అందగానే తక్కువ సమయంలోనే హాజరై ప్రాణాపాయం, ధన నష్టం నుండి కాపాడుటలో అగ్నిమాపక సిబ్బంది ఉత్తమ సేవలు అందిస్తున్నారని రాష్ట్ర హోం , విపత్తుల శాఖామాత్యులు మేకతోటి సుచరిత అన్నారు. సహాయక చర్యల్లో ఆధునిక పనిముట్లను వినియోగించి, సాంకేతికతను జోడించి ఉత్తమ ప్రమాణాలతో పని చేస్తున్నారని కొనియాడారు. ప్రతి 50 వేలమందికి ఒక అగ్నిమాపక కేంద్రం ఉండాలనే డిమాండ్ ఉందని, భవిష్యత్ లో వీలున్నంత ఎక్కువ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కృషిచేస్తామని చెప్పారు. గురువారం హోం శాఖామంత్రి, ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణితో కలిసి శృంగవరపుకోట, కొత్తవలసలలో ఒక్కొక్కటి రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం హోమ్ మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాలనలో అనేక సంస్కరణలు చేపట్టడం ద్వారా గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలతో గ్రామ స్వరాజ్యం సాధ్యం చేసి నిరూపించారు. మహిళలకు, బడుగు, బలహీన వర్గాలకు పాలనలో భాగస్వామ్యం చేయడమే కాక మేనిఫెస్టో లో చెప్పిన అంశాలను 90 శాతం అమలుచేసి జనరంజకంగా అభివృద్దిని చేసి చూపించారని అన్నారు.
సభాద్యక్షత వహించిన శాసనసభ్యులు కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్యదక్షతకు మారుపేరుగా ముఖ్యమంత్రి నిలిచారని, 14 నెలల ఆయన పాలన ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత ప్రభుత్వ బకాయిలను తీర్చడమే కాక రైతులు, మహిళలు, పిల్లల పట్ల పెద్ద దిక్కుగా నిలిచారన్నారు. కరోనా కాలాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొని జయించిన ముఖ్యమంత్రిగా దేశంలో నిలిచిపోయారని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో శాసనసభ్యులు అలజంగి జోగారావు, రాష్ట్ర విపత్తులు, అగ్నిమాపక శాఖ డైరక్టర్ జనరల్ మహమ్మద్ అహసన్ రెజా, జిల్లా ఎస్పి బి.రాజకుమారి, సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్, అగ్నిమాపక శాఖ సంచాలకులు కె. జయరామ్ నాయక్, రీజనల్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, అగ్నిమాపక అధికారులు మోహనరావు, వర ప్రసాద్,రామునాయుడు, ఆర్డిఓ భవానిశంకర్, ఆయా మండలాల తహశీల్ధార్లు, ఎంపిడిఓలు, అగ్నిమాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ప‌్రస్తుతం అమలులో ఉన్న కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబరు 1వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు చెప్పారు. జిల్లా కేంద్రంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించే వేడుకల్లో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణపై జిల్లా అధికారులతో గురువారం కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో గత ఏడాది జరిగిన అభివృద్ధిపై ఫోటో ప్రదర్శన, జిల్లాలో తయారైన చేనేత ఉత్పత్తుల ప్రదర్శన, మహారాజా సంగీత, నృత్య కళాశాల విద్యార్ధులచే పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయన్నారు. ముఖ్యఅతిథిచే జాతీయ పతాకావిష్కరణ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా వక్తల సందేశాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని పరిమిత సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, విపత్తు నిర్వహణ విభాగం ప్రోగ్రాం మేనేజర్ పద్మావతి, మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, పర్యాటక అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.