1 ENS Live Breaking News

రైతుల శ్రేయస్సే ప్రధాన ధ్యేయం..

రైతు శ్రేయస్సే ధ్యేయమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.ఎం. కిసాన్ పథకం రెండవ విడత పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వై.యస్.ఆర్ రైతు భరోసా - పి. ఎం. కిసాన్ పథకం కింద రైతులకు, అర్హులైన కౌలు రైతులకు, సాగుదార్లకు ఏటా రూ. 13,500 చొప్పున, అయిదేళ్లలో రూ.67,500 అందించడం జరుగుతోందన్నారు. రాష్ట్రములో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా అంతే మొత్తం సహాయాన్ని రైతు భరోసాగా అందించడం జరుగుతోందని పేర్కొన్నారు. వై.యస్.ఆర్ రైతు భరోసా - పి. ఎం. కిసాన్ పథకం క్రింద మొదట విడతగా - ఖరీఫ్ పంట వేసే ముందు మే నెలలో రూ.7,500; రెండో విడతగా అక్టోబరులో ఖరీఫ్ పంట కోతకైనా/రబీ అవసరాలకైనా రూ. 4000; మూడో విడతగా - ధాన్యం ఇంటికి చేరేవేళ, సంక్రాంతి పండగ సందర్భముగా రూ. 2,000 ఇస్తున్నామని చెప్పారు. 2019-20 సంవత్సరములో రాష్ట్రములో 46.69 లక్షల రైతు కుటుంబాలకు రూ.6,534 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగిందని, 2020-21 సంవత్సరంలో మొదటి విడతగా రాష్ట్రములో 49.44 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,675 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో రెండవ విడతగా రాష్ట్రములో 50.47 లక్షల రైతు కుటుంబాలకు రూ.1,991 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇటీవల వరదలకు నష్టపోయిన పంటలకు గాను 1.66 లక్షల మంది రైతులకు  రూ.135.73 కోట్లను రైతు భరోసా రెండవ విడతతోనే పంపిణీ చేస్తున్నామని, నష్టపోయిన సీజన్ లోనే నష్టపరిహారం అందించడం దేశ చరిత్రలోనే మొదటిసారి అన్నారు.   జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ 2019-20 సంవత్సరములో  శ్రీకాకుళం జిల్లాలో 3.34 లక్షల రైతు కుటుంబాలకు రూ.450.98 కోట్లు ఆర్థిక సహాయంగా అందిచడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో మొదట విడతలో  శ్రీకాకుళం జిల్లాలో 3.64 లక్షల రైతు కుటుంబాలకు రూ. 273 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో రెండవ విడతలో జిల్లాలో 3.68 లక్షల రైతు కుటుంబాలకు రూ.150 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందన్నారు. ఈ 150 కోట్లలో, 71 కోట్లు పీ.యమ్.కిసాన్ కింద జమ చేయడం జరిగిందని, మంగళవారం వై.యస్.ఆర్ రైతు భరోసా కింద రూ. 79 కోట్లు రైతులకు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. 2020-21 సంవత్సరంలో రెండు విడతలలో రాష్ట్రములో 49.78 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,666 కోట్ల మొత్తాన్ని జమ చేయగా, శ్రీకాకుళం జిల్లాలో 3.68 లక్షల రైతు కుటుంబాలకు రూ.423 కోట్ల మొత్తాన్ని జమ చేయడం జరిగిందని వివరించారు. కరోనా సమయంలో రైతు భరోసా మొత్తాలు జమ కావడంతో రైతులు సంతోషం గా ఉన్నారని చెప్పారు. ఈ ఏడాది అదనంగా 34 వేల మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.       ఎచ్చెర్ల మండలం ధర్మవరం పంచాయతీకి చెందిన  రైతు అల్లు సూర్యనారాయణ మాట్లాడుతూ రైతు భరోసా మొత్తాన్ని సకాలంలో అందించి ఆదుకుంటున్నారని ప్రశంసించారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు ముదావహం అన్నారు. పరీక్షించిన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారని పేర్కొన్నారు. దళారీ వ్యవస్థ లేకుండా ఇ క్రాప్ బుకింగ్ పెట్టడం రైతులకు వరం అన్నారు. ఆర్.బి.కే పరిధిలో కస్టమర్ హాయరింగ్ కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ యంత్ర పరికరాలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయం అన్నారు.  వై. యస్.ఆర్ జలకళ కార్యక్రమం ఏర్పాటు చేసి సాగునీరు కూడా అందిస్తున్నారని దీనితో రైతుల పరిస్థితి మారుతుందని చెప్పారు. వ్యవసాయ సహాయకులు మంచి సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు.  శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, కాపు, కళింగ కోమటి కార్పొరేషన్ల ఛైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, వ్యవసాయ మిషన్ సభ్యులు గొండు రఘురాం, జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, ఉప సంచాలకులు రాబర్ట్ పాల్, ఏపిఎం.ఐ.పి పిడి ఏ.వి.ఎస్.వి.జమదగ్ని, సహాయ పిడి టివివి ప్రసాద్, వ్యవసాయ ఏడిలు ఆర్.రవి ప్రకాష్, శ్రీనివాస్, వై.సురేష్., జిల్లా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు దువ్వాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-27 14:38:21

నిర్లక్ష్యం వలనే కరోనా రెట్టింపు..

శ్రీకాకుళం జిల్లాలో కరోనా తగ్గుముఖం పట్టినప్పటికీ, ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించకపోతే కరోనా కేసులు రెట్టింపు అయ్యే అవకాశముందని వైద్య నిపుణలు తెలియజేస్తున్నారని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు హెచ్చరించారు. జిల్లాలోని దేవాలయాలు, చర్చ్, మశీదుల మత పెద్దలతో కరోనా నియంత్రణపై అవగాహన కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం కరోనా కేసులు బాగా తగ్గాయని, అయినప్పటికీ ఇది సంతోషించదగ్గ విషయం కాదని అన్నారు. స్వీయ జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని స్పష్టం చేసారు. రానున్నది చలికాలం కావడంతో ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరిస్తూ, శానిటైజేషన్ తో చేతులను తరచూ శుభ్రపరచుకోవడం వలన కరోనాను నియంత్రించవచ్చని తెలిపారు. జిల్లాలో కరోనా పేషెంట్ల కొరకు ప్రభుత్వ ఆసుపత్రులలో 2000 బెడ్లు ఉండగా ప్రస్తుతం 100 మంది మాత్రమే ఉన్నారని, ప్రైవేట్ ఆసుపత్రులలో 3000 బెడ్లు ఉండగా ప్రస్తుతం 150 మంది పేషెంట్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పేషెంట్ల సంఖ్యను మరింత తగ్గే విధంగా జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు. జిల్లాలో బెడ్లకు గాని, టెస్టులకు గాని కొరతలేదని, రాష్ట్రంలో ఎక్కువగా టెస్టులు చేసే అవకాశం మన జిల్లాలో ఉందని అన్నారు. జిల్లాలో 15500 మంది వార్డు, గ్రామ వాలంటీర్లు పనిచేస్తున్నారని, ఈ వాలంటీర్ల ద్వారా ప్రతీ 50 గృహాలకు వెళ్లి కరోనా కేసుల వివరాలను సేకరించడం జరుగుతుందని జె.సి వివరించారు. వీటితో పాటు ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాలయిన దేవాలయాలు, చర్చ్, మశీదులకు విచ్చేసే భక్తులు తప్పనిసరిగా మాస్కులను వినియోగిస్తూ, భౌతికదూరం పాటిస్తూ శానిటైజేషన్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జె.సి మత పెద్దలను కోరారు. ఇప్పటివరకు జిల్లా ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించడం వలనే కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, భవిష్యత్తులో కూడా ప్రజలు సహకారాలు అందించి పూర్తిగా కరోనా నియంత్రణకు తోడ్పాటును అందించాలని జె.సి ఈ సందర్భంగా కోరారు. అనంతరం మత పెద్దలు జిల్లా యంత్రాంగం పిలుపునిచ్చిన మాస్కే కవచం  ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ కరోనా నివారణకు తమ వంతు పూర్తి సహాయ సహకారాలను అందిస్తామని హామీ ఇచ్చారు.    ఈ సమావేశంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి యం.అన్నపూర్ణమ్మ, శ్రీసూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్యప్రకాష్, ఇతర మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు. 

Srikakulam

2020-10-27 14:13:17

కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే..

మహానగరపాలక సంస్థ పరిధిలోని ప్రార్ధనా మందిరాల మత పెద్దలు కోవిడ్-19 నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు అన్నారు. సోమవారం జివిఎంసి సమావేశ మందిరంలో వివిధ ప్రార్ధనా మందిరముల మతపెద్దలు, ఆలయ ధర్మకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మీ ప్రార్ధనా మందిరాలకు వచ్చే భక్తులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకొని లోనికి అనుమతి ఇవ్వాలన్నారు. ఆలయాలలో “క్యూ” లైనులో ఉన్న భక్తులు భౌతికదూరం పాటించేవిధంగా ఆలయ ధర్మకర్తలను ఆదేశించారు.  మాస్క్ ఉంటేనే లోనికి అనుమతించాలని లేదంటే బయటకు పంపివేయాలన్నారు. ధర్మల్ స్క్రీనింగ్ లేకుండా భక్తులను అనుమతించకూడదన్నారు. ప్రధాన గేటు వద్ద కోవిడ్ నివారణకి సంబందించిన బోర్డ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రార్ధనా మందిరంలో వాటర్ ట్యాప్ వద్ద సబ్బులు ఉంచాలని, ప్రతీ గంటకు ఒక్కసారి సోడియం హైపో క్లోరేట్ తో పిచికారీ చేయాలని, దగ్గు, జ్వరం, ఆయాసం ఉన్న భక్తులు వస్తే వారిని గుర్తించి లోనికి అనుమతించరాదన్నారు. ఇతర దేశాల నుండి వచ్చే భక్తులను 14 రోజుల పాటు ఆలయాలలోకి అనుమతి నిషేదించాలన్నారు. మీ మాట తూ.చ. తప్పకుండా భక్తులు వింటారు కాబట్టి మీరు కూడా మీ మందిరాలకు వచ్చే వారికి కోవిడ్ పై అవగాహన కల్పించాలన్నారు. ప్రార్ధనా మందిరాలలోని క్యూ లైనులో ఉమ్మడం వేయకుండా చూడాలన్నారు. అనంతరం జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కే.ఎస్.ఎల్.జి.శాస్త్రి మాట్లాడుతూ కరోనా  చాలావరకు తగ్గిందని, అయినా పూర్తిగా తొలగిపోలేదని రెండవసారి మొదలైతే చాలా తీవ్రంగా ఉంటుందని అందుకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పై ఈ నెల 21వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ రోజు మీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మన విశాఖలో చాలా మందిరాలలో  కోడి నిబంధనలు సంతృప్తినిస్తున్నాయన్నారు. దేవాలయాల్లోనూ  కళ్యాణకట్ట భక్తులకు కేటాయించే గదులు, బాత్రూములు మొదలైన చోట్ల సోడియం హైపో క్లోరైడ్ తో శుభ్రపరచాలన్నారు. 

జివిఎంసి కార్యాలయం

2020-10-26 21:00:27

తమాషాలు చేస్తే ఇంటికి పంపిస్తా..

ప్రజలకు వార్డు సచివాలయాల ద్వారా పూర్తిస్థాయిలో సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన సిబ్బందిని హెచ్చరించారు.  సోమవారం మూడవ జోన్ పరిధిలోని ఆర్. కే. బీచ్ 19 వార్డులో గల నాలుగు సచివాలయాలను కమిషనర్ అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీల కార్యదర్శులు వారి జాబ్ చార్ట్ పరంగా విధులను గురించి సిబ్బందిని ప్రశ్నించారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలను తెలుపు పోస్టులను లబ్ధిదారుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కొన్ని పథకాల లబ్ధిదారులు జాబితాలలో లేకపోవడం గమనించి వారికి ప్రత్యేక అధికారిని, సంబంధిత కార్యదర్శిని హెచ్చరించారు. వెంటనే లబ్ది దారుల జాబితాను నోటీసుబోర్డుల్లో పెట్టాలని ఆదేశించారు. సచివాలయ భవనం వద్ద చెత్త ఉండడం గమనించి వెంటనే తొలగించాలని శానిటరీ సిబ్బందిని ఆదేశించారు. సంబందిత శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డు అడ్మిన్, శానిటరీ కార్యదర్శులకు మెమోను జారీ చేసారు. ఇకముందు ఇటువంటివి పునరావృతం అయితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జోనల్ కమిషనర్ బి. సన్యాసి నాయుడు, వార్డు ప్రత్యేక అధికారి, ఏ.పి.డి నాగమణి, వివిధ విభాగాల వార్డు కార్యదర్శులు, యు.సి.డి. సిబ్బంది పాల్గొన్నారు.  

RK Beach

2020-10-26 20:46:11

ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు కండి..

విశాఖను ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు జివిఎంసీ కమిషనర్ డా.స్రిజన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఏఒక్క చిన్న అవకావం వచ్చినా దానిని సద్వినియోగం చేసుకొని విశాఖను స్వచ్ఛ సర్వేక్షణ్ లో నెంబవర్ స్థానంలో నిలబెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండగలు, శెలవు దినాలు అని చూడకుండా ప్లాస్టిక్ రహితంగా ఏ కార్యక్రమం చేపట్టినా అందులో ఆమె ముందుంటున్నారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధమ ఆసుపత్రి వినూత్నంగా నిర్వహించ తలపెట్టి ప్లాస్టిక్ హౌస్ ను ఆమె ప్రారంభించారు. ఈ సంర్బంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగ నియంత్రణలో భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఎవరి ఇంట్లోనూ ప్లాస్టిక్ వ్యర్ధాలు ఉంచకూడదు దానికోసం..దానికోసం ప్రత్యేకంగా ప్లాస్టిక్ పార్లను ఏర్పాటు చేశారు. దాని యొక్క విశిష్టతను ఆసుపత్రి అధినేత స్వచ్ఛ భారత్ అంబాసిడర్ డా. విశ్వేశ్వర రావు వివరించారు.  ఒక కిలో ప్లాస్టిక్ ఇస్తే టిఫిన్, రెండు కిలోల ప్లాస్టిక్ ను ఇస్తే ఫుల్ మీల్స్, మూడు కేజీల పైబడి ప్లాస్టిక్ ను ఇస్తే కొన్ని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేస్తామని, ఈ ప్రక్రియ ద్వారా ప్రజలను ఆకర్షించి ప్లాస్టక్ ను నిర్మూలించడానికి తమ వంతు కృషి చేస్తున్నామని ప్రధమ హాస్పిటల్ యజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ అంబాసిడర్ ప్రధమ హాస్పిటల్ యజమాన్యం డా. విశ్వేశ్వర రావుతో పాటూ జివిఎం సి అదనపు కమిషనరు డా. వి. సన్యాసి రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్  డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.    

ప్రధమ ప్లాస్టిక్ హౌస్

2020-10-26 20:41:30

27 నుంచి కళాశాలలు ప్రారంభం..

శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఈ నెల  27 నుండి పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీరాములు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసారు. 2020-21 విద్యా సం.రంలో డిగ్రీలో చేరుటకు అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఈ నెల 28లోగా తమ కార్యాలయానికి అందజేయాలని అన్నారు. బి.యస్సీ విద్యార్ధులు ఈ నెల 29న, బి.ఏ మరియు బి.కామ్ విద్యార్ధులు ఈ నెల31న ఉదయం 10.00గం.లకు తమ ఒరిజనల్ సర్టిఫికేట్లు, అడ్మిషన్ ఫీజుతో హాజరుకావాలని ఆయన ఆ ప్రకటనలో కోరారు. డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు నవంబర్ 2 నుండి, ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు 3 నుండి, ఫైనల్ ఇయర్ విద్యార్ధులకు 4 నుండి తరగతులు నిర్వహించబడతాయని ఆయన స్పష్టం చేసారు. కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్కును ధరించాలని, మాస్కులు లేని విద్యార్ధులను అనుమతించబోమని తెలిపారు. ఈ ఏడాదిలో కొత్తగా యం.ఎస్సీ పి.జి., బి.యస్సీ (ఎం.పి.డబ్ల్యు ), బి.యస్సీ(బి.సి.ఎ).,బి.ఏ(హెచ్.పి.ఇ) కోర్సులను ప్రవేశపెట్టడం జరిగిందని, అర్హులైన అభ్యర్ధులు వచ్చేనెల 7లోగా దరఖాస్తు చేసుకోవాలని, నవంబర్ 9 నుండి తరగతులు నిర్వహించబడతాయని  ఆ ప్రకటనలో వివరించారు. యు.జి.సి వారి స్కిల్ బేస్డ్ ప్రోగ్రామ్స్ :  డిజాస్టర్ మేనేజ్ మెంట్ , ఐ.టి/ఐటిఇయస్/వెబ్ డిజైనింగ్ టూల్స్ సర్టిఫికేట్ కోర్సులు మరియు  హెల్త్ కేర్, బ్లడ్ బ్యాంక్ టెక్నిషీయన్ వంటి డిప్లోమా కోర్సులకు ఈ విద్యా సంవత్సరం నుండి నిర్వహించబడుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ యు.జి.కోర్సులలో చేరుటకు కళాశాల రెగ్యులర్ విద్యార్ధులు మరియు పూర్వ విద్యార్ధులు కూడా అర్హలేనని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.  వివిధ యూనివర్సిటీలో నిర్వహించిన పి.జి.సెట్ నందు 1,3,6,9,10 ర్యాంకులతో పాటు 50 లోపు ర్యాంకులు  సాధించిన 22 మంది ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్ధినులను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. 

Srikakulam

2020-10-26 17:41:02

రైతులు భూములివ్వడం అభినందనీయం..

వంశధార హై లెవెల్ కెనాల్ నిర్మాణానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం ఆనందదాయకమని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఛాంబరులో బూర్జ మండలానికి సంబంధించిన అహోబలచార్యుల పేట, ఉప్పినివలస గ్రామాల రైతులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి మాట్లాడుతూ జిల్లాలో వంశధార హై లెవెల్ కెనాల్ నిర్మాణానికి 18 గ్రామాలకు చెందిన భూమిని సేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. రైతుల భూమికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక ధరను నిర్ణయించిందని, ఇందుకు రైతులు స్వచ్చంధంగా ముందుకు రావడం సంతోషకరమని చెప్పారు. వంశధార హై లెవెల్ కెనాల్ భూసేకరణలో రైతులకు ఎటువంటి నష్టం ఉండదని, రైతులకు ప్రభుత్వం సంతృప్తికర ధర ఇచ్చే అవకాశముందని  ఆయన చెప్పారు. మరికొన్ని గ్రామాల రైతులతో చర్చలు జరపాల్సి ఉందని, అన్ని గ్రామాల రైతులతో మాట్లాడి భూసేకరణ చేస్తామని ఆయన స్పష్టం చేసారు. ఈ సమావేశంలో యూనిట్ – భూ సేకరణ విభాగం 3 ప్రత్యేక ఉపకలెక్టర్ బి.కాశీవిశ్వనాథం, ఉప తహశీల్ధారులు యన్.హనుమంతరావు, టి.వెంకటేశ్వర పాణిగ్రహి, మంత్రి రవికుమార్, ఇతర అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాకుళం కలెక్టరేట్

2020-10-26 17:13:12

27 ‌నుంచి ఆసెట్‌, ఆఈట్‌ ‌కౌన్సెలింగ్‌ ‌..

ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆసెట్‌, ‌సమీకృత ఇంజనీరింగ్‌ ‌కోర్సుల్లో ఆఈట్‌ ‌ప్రవేశ పరీక్షల ఆన్‌లైన్‌ ‌కౌన్సెలింగ్‌ ‌పక్రియ ఈ నెల 27వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రవేశాల సంచాలకులు ఆచార్య డి.ఏ నాయుడు  తెలిపారు. ఈ నెల 27 నుంచి ఆన్‌లైన్‌ ‌సర్టిఫీకేట్‌ ‌కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్‌ ‌చేసుకోవాలని సూచించారు. 28వ తేదీన సిఏపి విభాగాలకు నేరుగా ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుపుతామన్నారు. 29వ తేదీన దివ్యాంగుల విభాగాలకు ప్రవేశాల సంచాలకుల కార్యాలయంలో సర్టిఫీకేట్ల పరిశీలన జరుగుతందన్నారు. ఈ నెల 28, 29 తేదీలలో ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌, ‌క్రీడా విభాగాల విద్యార్థులు తమ సర్టిఫీకేట్లను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఈనెల 30 నుంచి నవంబరు 7వ తేదీ వరకు ఆసెట్‌, ఆఈట్‌ ‌విభాగాలలో  అభ్యర్ధులందరూ తమ సర్టిఫీకేట్లను అప్‌లోడ్‌ ‌చేయాలన్నారు. నవంబరు 5 నుంచి 9వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లలో మార్పు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. నవంబరు 12వ తేదీన సీట్లు కేటాయింపు జరుగుతుందన్నారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులు నవంబరు 13 నుంచి 15వ తేదీలోగా నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. నవంబరు 16, 17 తేదీలలో సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌కు ప్రవేశ పత్రాలను అందించాలన్నారు. ఆన్‌లైన్‌ ‌తరగతులు సెప్టెంబరు 1వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయన్నారు. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ ‌చేయవలసిన సర్టిఫీకేట్లు, కోర్సుల వారీగా కౌన్సెలింగ్‌ ‌తేదీలు వంటి పూర్తి సమాచారం ప్రవేశాల సంచాలకుల http://audoa.in/ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పూర్తి సమాచారం కోసం ను సంప్రదించాలని సూచించారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-10-26 16:55:24

ఉత్సాహంగా పోలీసుల ’రన్ ఫర్ యూనిటీ‘..

విధి నిర్వహణలో అసువులు బాసిన అమరవీరుల సేవలు, వారి వీరోచిత పోరాట ప్రతిమకు గుర్తింపుగా వారందరికీ ఘనమైన నివాళులు అర్పించడం కోసం రన్ ఫర్ యూనిటీ పేరిట కార్యక్రమం నిర్వహించినట్టు తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి శ్రీ ఏ.రమేష్ రెడ్డి తెలియజేశారు. సోమవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని యస్.వి యూనివర్సిటీ మెయిన్  గేట్  వద్ద జెండా ఊపి ప్రారంబించారు.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల వారోత్సవాల భాగంగా అమరులైన వీరులను స్మరించుకుంటూ అక్టోబర్ 21 నుండి 31 వరకు ప్రతి రోజు ఒక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  అంతే కాకుండా సంవత్సరంలో ఒక వారం రోజులపాటు ఇలా గుర్తించుకుంటు వస్తున్నామన్నారు. కానీ ఇకపై తిరుపతి అర్బన్ జిల్లాలో అమరులైన కుటుంబ సభ్యులను ప్రతి నెల అవకాశం దొరికనపుడల్లా జిల్లా అధికారులతో పాటు వారి నివాస ప్రాంత పోలీస్ అధికారులు వెళ్లి పరార్శించి, ఆరోగ్య పరమైన విషయాలను తెలుసుకొని అవసరమైన సహాయం చేయాలని నిర్ణయించామన్నారు. డి.జి.పి సూచనలు, సలహాల మేరకు జిల్లాలోని సిబ్బందికి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ సిబ్బంది యొక్క ఆరోగ్య విషయాలను కూడా గమనిస్తూ ఎప్పటికప్పుడు తెలుసుకొని అవసరంమేర వారికి సహకారం అందిస్తున్నామని ఎలాంటి అవసరమైనా చేయడానికి సిద్దంగా ఉన్నానని జిల్లా యస్.పి గారు తెలియజేసారు.  అనంతరం “రన్ ఫర్ యూనిటీ” లో ఉత్తమ ప్రతిభ కనుబరిచిన సిబ్బందికి యస్.పి  రివార్డ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ అడిషనల్ యస్.పి  సుప్రజ, యస్.బి డి.యస్.పి గంగయ్య, అర్బన్ జిల్లాలోని డి.యస్.పి లు, సి.ఐ లు, ఆర్.ఐ లు, యస్.ఐ లు, ఆర్.యస్.ఐ లు మరియు సిబ్బంది  పాల్గొన్నారు.          

Tirupati

2020-10-26 16:27:42

పెండింగ్ ఇ-చలనాలు తక్షణమే చెల్లించండి..

ఇ-చలానా వాహనాలపై నమోదైన తేది నుంచి 15 రోజులు దాటినా జరిమానా చెల్లించని వాహనదారులను స్పెషల్ డ్రైవ్ ద్వారాగుర్తించి వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తిరుపతి ట్రాఫిక్ డిఎస్పీ మల్లిఖార్జునావు స్పష్టం చేశారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుపతి ఆర్బన్ జిల్లా యస్.పి  ఏ.రమేష్ రెడ్డి  ఆదేశాల మేరకు స్పెషల్ టీం ను అర్బన్ జిల్లా పరిధిలో ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఇప్పటివరకూ యం.వి యాక్ట్ నిబంధనలు అతిక్రమించి ఇ-చలాన ద్వారా కట్టవలసిన మొత్తము ప్రస్తుతము 1,93,361 ఇ-చలాన సంబంధించి రూ. 9,98,85,971/- గా ఉన్నదన్నారు. ఇ-చలాన వేయబడిన వాహనదారుడు ఆ డబ్బును తప్పనిసరిగా 15 రోజులలో ఆన్లైన్ ద్వారా చెల్లించాలని హెచ్చరించారు. అలాగే సెకండ్ హాండ్ వాహన కొనుగోలుదారు ఎవరైనా, కొనబోయే వాహనాల ఇ-చలాన పెండింగ్ ఉందా లేదా అని ముందుగానే తనికీ చేసుకోవాలని కూడా డిఎస్పీ సూచించారు. AP eChallan అప్లికేషన్  ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని  మీ యొక్క వెహికల్ నెంబర్ ను నమోదు చేసి  ఇ-చలాన పెండింగ్ ఉందా లేదా అని ముందుగానే తనికీ చేసుకోవాలన్నారు.

Tirupati

2020-10-26 16:24:32

గీతం భూ ఆక్రమాలపై CBIకి ఫిర్యాదు..

విశాఖలో  గీతం టుబీ డీమ్డ్  యూనివర్సిటీ  భూ అక్రమాలపై తక్షణమే సీబీఐ విచారణ చేయాలంటూ,  AP ప్రజా సంఘాల జెఎసి అధ్యకులు జెటి రామారావు సిబిఐకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. విశాఖలోని ఎంవీపీ కాలనీలోని సీబీఐ ఎస్సీకి ఈ మేరకు జెటి ఫిర్యాదు చేశారు.  ఈ సందర్భంగా సీబీఐ కార్యాలయం దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు.. సుమారుగా నాలుగు దశాబ్దాల నుండి విశాఖపట్నంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న గీతం యూనివర్సిటీ పై పూర్తిస్థాయిలో సి.బి.ఐ ,ఈ డి వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించి, ఆక్రమిత భూమిని తక్షణమే స్వాధీనం చేసుకొని నిరుపేదల పంచాలన్నారు. సంస్థకు విదేశాల నుంచి వేల కోట్ల రూపాయల అదాయం  ఫీజులు , విరాళాల రూపంలో అర్దిక నేరాలకు పాల్పడ్డారని, మనీలాండరింగ్ ఇన్కమ్ టాక్స్ చట్టాల ద్వారా తనిఖీలు నిర్వహించాలని లేకుంటే రికార్డులు తారుమారు అవుతాయని అనుమానం వ్యక్తం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గీతం టుబీ డీమ్డ్ యూనివర్సిటీ ని స్వాధీనం చేసుకోకపోతే, అక్కడి ప్రభుత్వ భూములన్నీ ఆక్రమించేసి క్రబద్దీకరణ కూడా అడ్డదారిలో చేయించుకుంటారన్నారు. పేదల భూములను ప్రై వేటు విద్యాసంస్థల ముసుగులో ఆక్రమించడం చట్టరీత్యానేరమని, దానిపై సిబిఐ లోతుగా విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు, అక్రమాలు బయటకొస్తాయన్నారు.  అలాగే వర్సిటీ లోపల ఉన్న అధునాతన భవనాలు క్రికెట్ గ్రౌండ్ ఎంపీ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించారని వాటిని వెంటనే కూల్చి వేయాలని డిమాండ్ చేశారు..ఒక్కరాత్రిలో హైకోర్టు నుంచి ఉత్తర్వులు కూడా ఎలా వచ్చాయనే విషయంపైనా ఆరా తీయాలని డిమాండ్ చేశారు. ఆక్రమిత ఆస్తులను స్వాధీనం చేసుకొని ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఇలాంటి భూ ఆక్రమణలను నియంత్రించకపోతే ప్రభుత్వానికి చెందిన భూములన్నీ ఆక్రమించేస్తార ఆందోళన వ్యక్తం చేశారు. గీతం టూబి డీమ్డ్ వర్శిటీపై  యూజికి కూడా ఫిర్యాదు చేసినట్టు జెటి రామారావు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలు ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సిబిఐ కార్యాలయం వైజాగ్

2020-10-26 15:56:31

నిష్ఫక్షపాతంగా పంటనష్టాల నమోదుచేయాలి..

కర్నూలు జిల్లా వ్యాప్తంగా వరిపంటలు దెబ్బతిన్నాయో సమాచారం అందించాలని  జెసి(సంక్షేమం) సయ్యద్ ఖాజా మొహిద్దీన్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని ఆళ్ళగడ్డ మండలం చింతకొమ్మ దిన్నే, పడకండ్ల గ్రామాల్లో  ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వరి పంట పొలాలను, ఇళ్లను పరిశీలించి, రైతులతో పంట నష్టం గురించి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పెట్టుబడులు, చేసిన కూలీ మొత్తం నష్టం భారీగా వచ్చిందని రైతులు జెసికి వివరించారు. అనంతరం జెసి మాట్లాడుతూ, రైతులకు జరిగిన పంటనష్టాలను, దెబ్బతిన్న ఇళ్లను అధికారులు గుర్తించి న్యాయం చేస్తారని భరోసా ఇచ్చిరు. ఈ విషయాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని, ఖచ్చితంగా నష్టపరిహారం అందుతుందని రైతులకు జెసి వివరించారు. జిల్లాలో మండలాలు, ప్రాంతాల వారీగా నష్టాలను అంచనాలు వేసి పంపాలన్నారు. పంట నష్టపోయిన ఏఒక్క రైతును వదిలిపెట్టకుండా నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. 

Allagadda

2020-10-25 14:11:57

ఉల్లి పంట నష్టాలపై నివేదికలు తయారుచేయండి..

కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని ఎకరాల్లో ఉల్లి పంటకు నష్ట ఏర్పడింతో నివేదికలు తయారు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ రవిపట్టన్ శెట్టి అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని బి.తాండ్రపాడు మండలంలోని ఉల్లిపంటల ను ఆయన స్వయంగా పరిశీలించారు. ఉల్లి పంటలు వేసిన రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, పెట్టుబడులు, చేసిన కూలీ మొత్తం నష్టం భారీగా వచ్చిందని రైతులు కలెక్టర్ కి తెలియజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు జరిగిన పంటనష్టాలను ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళతామని, ఖచ్చితంగా నష్టపరిహారం అందుతుందని చెప్పారు. జిల్లాలో మండలాలు, ప్రాంతాల వారీగా నష్టాలను అంచనాలు వేసి పంపాలన్నారు. పంట నష్టపోయిన ఏఒక్క రైతును వదిలిపెట్టకుండా నివేదికలు తయారు చేసి పంపాలన్నారు. కర్నూలులో ఉల్లి పంట పూర్తిగా పాడైపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉల్లి సరఫరా నిలిచిపోయి ప్రస్తుతం కేజి ఉల్లి రూ.100 పలుకుతుండగా, బయట మార్కెట్ లో రూ.120 వరకూ అమ్ముతున్నారని కూడా రైతులు కలెక్టర్ కివివరించారు.

తాండ్రపాడు

2020-10-25 13:59:47