శ్రీకాకుళం జిల్లాలో పలు మండలాలకు కొత్త తహశీల్దార్లను నియమిస్తూ జిల్లా కలెక్టర్ జె నివాస్ గురు వారం ఉత్తర్వులు జారీ చేసారు. జిల్లాకు చెందిన ఏడు గురు ఉప తహశీల్దార్లను అడ్ హాక్ పదోన్నతి కల్పిస్తూ భూపరిపాలన ప్రధాన కమీషనర్ ఉత్తర్వులు జారీ చేసారు. అడ్ హాక్ పదోన్నతులు పొందిన ఉప తహశీల్దార్లు ఆర్.రమేష్ కమార్ ను సీతంపేట తహశీల్దారుగా, జి.రమేష్ ను కొవ్వాడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భూ సేకరణ యూనిట్ లో ప్రత్యేక తహశీల్దారుగా, ఎన్.అప్పారావును వీరఘట్టాం తహశీల్దారుగా, బి.అప్పలస్వామిని వజ్రపుకొత్తూరు తహశీల్దారుగా, ఎస్.నరసింహ మూర్తిని భామిని తహశీల్దారుగా, టి.సత్యనారాయణను హిరమండలం తహశీల్దారుగా, బి.పాపారావును మందస తహశీల్దారుగా నియమించారు. సీతంపేట తహశీల్దారుగా పనిచేస్తున్న పి.సోమేశ్వర రావును పాలకొండకు, శ్రీకాకుళం ఆర్.డి.ఓ కార్యాలయ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న ఎం.సావిత్రిని పాలకొండ ఆర్.డి.ఓ కార్యాలయంలో కె.ఆర్.ఆర్.సి తహశీల్దారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. వజ్రపు కొత్తూరు తహశీల్దారు వి.నారాయణ మూర్తిని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసారు.
శ్రీకాకుళం జిల్లాలో వర్చువల్ లోక్ అదాలత్ ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామకృష్ణ తెలిపారు. వర్చువల్ లోక్ ఆదాలత్ పై బ్యాంకు అధికారులతో జిల్లా కోర్టులో గురు వారం సమావేశం నిర్వరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్చువల్ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్సు కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, మోటారు ఏక్సిడెంటు కేసులు (వాహన ప్రమాద కేసులు), విడాకులు మినహా ఫ్యామిలి డిస్యూట్స్ (విడాకులు మినహా మిగిలిన కుటుంబ కలహాల కేసులు), లేబర్ అండ్ ఎంప్లాయిమెంటు కేసులు (కార్మిక, యాజమాన్య కేసులు), కాంపౌండబుల్ క్రిమినల్ కేసుల (రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు) పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని కోర్టులలో వర్చువల్ లోక్ అదాలత్ జరుగుతుందని ఆయన తెలిపారు. వర్చువల్ లోక్ అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో రోడ్డు పనులు సత్వరమే పూర్తిచేయాలని కమిషనర్ గిరీష ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం డి.బి.ఆర్ రోడ్డు నుంచి రవీంద్ర నగర్ వరకూ గల 60 అడుగుల రోడ్డు, అక్కరంపల్లె మాస్టర్ ప్లాన్ రోడ్డు ను మరియు రేణిగుంట హీరో హోండా షోరూం వద్ద కలిపే రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో జరుగుతున్న మాస్టర్ ప్లాన్ రోడ్లు, అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా కొంత మంది అభ్యంతరం చేస్తున్న వారితోనూ, భూములిచ్చిన రైతులకు చర్చించారు. రోడ్డు నిర్మాణానికి 60 అడుగులు మాత్రమే కావాలన్నారు. అందులో భాగంగానే ఎవరికి ఇబ్బంది లేకుండా సర్వే చేస్తున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి టి.డి.ఆర్. బాండ్లు ఇస్తున్నామన్న కమిషనర్ ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తామన్నారు. ఈ రోడ్డు వేయడం వలన నగరంలో ట్రాఫిక్ పూర్తిగా తగ్గుతుందన్నారు. అలాగే ఈ రోడ్డు వెంబడి భూములకు అధిక ధరలు వస్తాయన్నారు. అనంతరం తూకి వాకం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు 6 మెగావాట్ల సోలార్ ప్లాంట్ పనులను పరిశీలించారు. ఇంజనీర్ అధికారులను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ ఆదేశించారు. ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ చంద్రశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రఘు కుమార్, విజయ్ కుమార్ రెడ్డి, పట్టణ ప్రణాళిక అధికారులు, నగరపాలక సర్వేయర్లు ప్రసాద్, దేవానంద్, రైతులు తదితరులు ఉన్నారు.
విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ధాన్యం కొనుగోళ్లకు తగిన ఏర్పాట్లు సత్వరమే చేపట్టాలని సంయుక్త కలెక్టర్ జీ సీ కిషోర్ కుమార్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్షించేందుకు పౌరసఫరాల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ తదితర శాఖల జిల్లాస్థాయి అధికారులతో ఆయన ఛాంబర్లో గురువారం సమావేశం నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై ఆయా విభాగాల అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో తలెత్తిన పొరపాట్లు ఈ ఏడాది తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని.. తగిన సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. ఈ ఏడాది కొనుగోలు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికా లేకుండా వచ్చిన అధికారులపై జేసీ ఒకింత అసహనం వ్యక్తం చేశారు. గడువు సమీపించినా ధీమాగా ఉండటం సరికాదని.. కావాల్సిన సామగ్రి ఇంకా కొనుగోలు చేసుకోక పోవటం ఏంటని ప్రశ్నించారు. మరొక్క వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మొదలవుతుందని దానికి తగిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రతీ రైతు భరోసా కేంద్రం వద్దా విధిగా "ధాన్యం కొనుగోలు సహాయ కేంద్రం" పేరుతో బ్యానర్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. రబీ సీజన్లో వివిధ విభాగాల వద్ద ఉండిపోయిన గోనె సంచులను వెంటనే తిరిగి తీసుకోవాలని ఆదేశించారు. పౌరసరఫరాలు, వెలుగు, పీఏసీఎస్, వ్యవసాయ శాఖలు సమన్వయంతో ప్రణాళికా యుతంగా వ్యవహరించి ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ. పీడీ సుబ్బారావు, వ్యవసాయ శాఖ జేడీ ఎం. ఆశాదేవి, జిల్లా పౌరసరఫరాల అధికారి పాపారావు తదితరులు పాల్గొన్నారు.
వరదలలో పంట నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందిస్తామని రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. గురువారం కలక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో వర్షాలు, వరదలు, ఆస్థి, పంటనష్టాలపై జిల్లా కలక్టరు మరియు వివిధశాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ అధికారయంత్రాంగల ముందస్తు అప్రమత్తతతో ఆస్థి, ప్రాణ నష్టాన్ని నివారించగలిగామన్నారు. వరదలలో చనిపోయిన వారికి 48 గంటలలో పరిహారం అందిస్తున్నామని, ములగాడ లో చనిపోయిన ఇద్దరికి 4 లక్షల వంతున పరిహారం అందించడం జరిగిందని, మిగిలిన వారికి కూడా పరిహారం అందించుటకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో శారదానది,యలమంచిలి నియోజకవర్గంలో వరహానది , పాయకరావుపేట నియోజకవర్గంలో తాండవ నది పొంగుట వలన పంటనష్టం జరిగిందన్నారు. జిల్లాలో 30 మండలాలకు చెందిన 285 గ్రామాలలో 13135 మంది రైతులకు చెందిన 5075 హెక్టార్లలో వరి, 666 హెక్టార్లలో చెరకు, 54 హెక్టార్లలో ఇతర పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అంచనా వేసిందన్నారు. ఉద్యానవనశాఖకు సంబంధించి 84 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. 9 ఇళ్లు పూర్తి గాను, 96 ఇళ్లు పాక్షికంగాను దెబ్బతిన్నాయని, 157.76 కిలోమీటర్లరోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఎలక్ట్రికల్ డిపార్టుమెంటుకు సంబంధించి 372 ఫోల్స్ దెబ్బతిన్నాయని వాటిని వెంటనే బాగుచేయడం జరిగిందని తెలిపారు. జి.వి. యం .సి.,యలమంచిలి మున్సిపాలిటీ, మత్సశాఖ కు సంబంధించి నష్టాలపై ప్రాధమిక నివేదికలు అందాయని జిల్లా వ్యాప్తంగా అన్నిశాఖలకు సంబంధించి రూ. 8545.53 లక్షలు నష్టం జరిగినట్లుగా ప్రాధమిక అంచనా వేసినట్లు ఆయన తెలిపారు. పంటనష్టం వివరాలను గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తారని, ఎవరైనా రైతులు వారి పంటనష్టం వివరాలు నమోదు కాకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని తెలిపారు. పంటనష్టం వివరాలు నమోదు, పరిహారం పంపిణీ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా ఉంటుందని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.
జిల్లా కలక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుత కాలంలో పడవలసిన వర్షపాతం కంటే 500 శాతం ఎక్కువ వర్షపాతం నమోదయిందని తెలిపారు. ఈ నెల 12,13,14 తేదీలలో భీమిలి, ఎస్. రాయవరం,యలమంచిలి, సబ్బవరం, విశాఖ అర్బన్, గాజువాక,రాంబిల్లిలలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని అన్నారు. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ, పంచాయతీరాజ్,రోడ్లు, భవనాలు, ఇరిగేషన్, మత్సశాఖ అధికారులు జిల్లా లో సంభవించిన నష్టాలను అంచనా వేసి ప్రాదమిక నివేదికలు సమర్పించారని, రాగల రెండురోజులలో పూర్తి వివరాలు సేకరించి నష్ట పరిహారం చెల్లింపు నిమిత్తం ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు.
జీవిఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో ఈ నెల చివరినాటికి 65శాతం పన్నులు వసూలు చేయాలని జీవీఎంసీ అదనపు కమిషనర్ ఆశాజ్యోతి అధికారులను ఆదేశించారు. బుధవారం జీవీఎంసీ లో జోనల్ కమిషనర్లు, రెవిన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 2020 – 21 ఆర్ధిక సంవత్సరంలోని ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, వాణిజ్య సముదాయాలు, ట్రేడ్ లైసెన్సులు మొదలైన వాటి నుండి సెప్టెంబర్ చివరి నాటికి 65శాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఈ మధ్య నూతనంగా ఏర్పడిన వాణిజ్య సముదాయాలను, ఇళ్లను గుర్తించి వాటికి పన్నులు వేయాలని ఆదేశించారు. చాలా కాలంగా తక్కువ పన్నుగల గృహ సముదాయాలు, వాణిజ్య సముదాయాలు గుర్తించి వెంటనే పన్ను రివైజ్ చేయాలని ఆదేశించారు. వార్డు పరిపాలన(అడ్మిన్) కార్యదర్శులను భాగస్వాములను చేసి పన్నులు వసూల్లును వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రజలు పెట్టుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించి, వాటిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రజా అభ్యర్ధనలను కాలాతీతం కాకుండా, ముందుగానే పరిష్కరించాలన్నారు. ఏవైనా దరఖాస్తులు ఎస్.ఎల్.ఏ. దాటి వెళ్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని జోనల్ కమిషనర్లుతో పాటు రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఎపిఎస్పీడిసిఎల్ కార్యాలయంలో ఉన్న పాత రికార్డులను డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం నగరంలోని జెఎన్టీయూ రోడ్డులో ఉన్న ఎపిఎస్పీడిసిఎల్ ఎస్ ఈ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులను డిజిటలైజేషన్ చేశారని, ఎపిఎస్పీడిసిఎల్ కార్యాలయంలో ఉన్న పాత రికార్డులను కూడా డిజిటలైజేషన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాత రికార్డుల డిజిటలైజేషన్ వల్ల రికార్డులన్నీ జాగ్రత్తగా ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయన్నారు. కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం ఫైల్స్ అన్నీ ఈ ఆఫీస్ లో నడుస్తున్నాయని, పాత రికార్డులను కూడా డిజిటలైజేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఎపిఎస్పీడిసిఎల్ కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. అనంతరం గ్రిడ్ మ్యాప్ ను పరిశీలించి విద్యుత్ సరఫరాపై జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్పీడిసిఎల్ ఎస్ ఈ వరకుమార్, ఎడి కల్యాణ చక్రవర్తి, జె ఏఓ అరుణిమ, ఎపిఎస్పీడిసిఎల్ సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖపట్నం జిల్లా కళ్యాణపులోవ సాగునీటి రిజర్వాయర్ సమీపంలో, అటవీ సురక్షిత ప్రాంతంలో జరుగుతున్న గ్రానైట్ మైనింగ్ అనుమతులను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఓ సుదీర్ఘ పోరాటం తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సాధ్యమైంది. నిరుపేద గిరిజన కుటుంబాలు, సామాజిక కార్యకర్తలు అజయ్ కుమార్, చక్రధర్ వంటి వారి నాయకత్వంలో జరుగుతున్న వ్యవసాయ కూలీల సంఘం లాంటి సంస్థల, వ్యక్తుల కృషి ఫలితంగా ఇది సాధ్యపడింది.. ఈ విషయమై విశాఖపట్నంలో ప్రజాకోర్టు నిర్వహించిన సమయంలో ఆ ప్రాంత గిరిజన రైతులు, కూలీలు, వారి పిల్లలు పెద్దసంఖ్యలో ఆ విచారణకు వచ్చి గోడు వెళ్లబోసుకున్నారు. మైనింగ్ తమ ఉసురెలా తీస్తోందో కన్నీటి పర్యంతమై వివరించి విముక్తి కావాలని ప్రభుత్వాన్ని అడిగారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, సామాజిక కార్యకర్త సజయ , ప్రొఫెసర్ రంగారావు, దిలీప్ రెడ్డి జ్యూరీగా వ్యవహరించి ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. వెంటనే మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని, శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని 'నో మైనింగ్ జోన్' గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం అక్కడి మైనింగ్ లీజును రద్దు చేసింది. ఈ విజయాన్ని పోరాట యోధులంతా ప్రజా విజయగంగా ప్రకటించారు.
మెగా సుప్రీమ్ స్టార్ ,సినీ నటుడు సాయిధరమ్ తేజ్ జన్మదినోత్సవం సందర్భంగా అభిమానులు గురువారం శ్రీకాకుళంలో రక్తదానం చేసారు. సాయిధరమ్ తేజ్ యువత ఆద్వర్యంలో న్యూ బ్లడ్ బ్యాంక్ లో ప్రత్యేకంగా రక్తదానం శిబిరం ఏర్పాటు చేసారు. తలసేమియాతో బాధపడుతున్న బాధితులకి డోనర్ కార్డులను అందజేసారు. అనంతరం కేక్ కట్ చేసి నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. ముఖ్యఅతిధులుగా రాష్ట్ర చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ,శ్రీకాకుళం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు విశ్వక్ సేన్ ,ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్, జిల్లా సాయిధరమ్ తేజ్ యువత అధ్యక్షులు జోగిపాటి వంశీ,కిరణ్ , మౌళి,కార్తీక్ ,ఖాదర్ ,రాజు,రామ్ చరణ్ యువత అధ్యక్షులు తైక్వాండో గౌతమ్ ,చరణ్ ,వర్ధన్ సూరి,అంబేద్కర్ ,రమేష్ ,చంటి ,సంతోష్ ,టీం అల్లు అర్జున్ ప్రతినిధులు పుక్కళ్ళ నవీన్ , తాళాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలుచేస్తున్న జల జీవన్ మిషన్ కింద అన్ని ప్రభుత్వ సంస్ధలకు తాగునీటి సరఫరా కల్పించనున్నట్లు సంయుక్త కలక్టరు (అభివృద్ది) డా. ఆర్. మహేష్ కుమార్ తెలిపారు. అక్టోబరు 2 నుండి వంద రోజులలోపల ఈ పధకం కింద పైపు కనెక్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. గురువారం కలక్టరేట్ ఆడిటోరియంలో పలు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్ధాయి నుండి జిల్లాస్ధాయి వరకు తాగునీరు అవసరమున్న ప్రతి ప్రభుత్వ కార్యాలయం వారి అవసరతను నిర్ధేశిత ప్రొఫార్మాలో తెలియ జేయాలన్నారు. ముఖ్యంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్నేస్ సెంటర్లు, అంగన్ వాడి కేంద్రాలతో పాటు, పాఠశాలలు, వసతి గృహాల వివరాలు కూడా సమర్పించాలని ఆదేశించారు. అద్దె భవనాలలో నిర్వహిస్తున్న ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వాటి వివరాలను సమర్పించాలన్నారు. శనివారం సాయంత్రంలోగా ప్రతిశాఖ ఉన్నతాధికారి నుండి వారి పరిధిలో నున్న కార్యాలయాల సమాచారం అందజేయాలన్నారు. ప్రస్తుతం పైపుద్వారా తాగునీరు సదుపాయం ఉన్నది, పైపు లేకుండా ఉన్నవి, ఇతర మార్గాల ద్వారా నీటి సరఫరా ఉన్నవి, రక్షిత మంచినీటి పధకాలు ఉన్నవాటి వివరాలను నిర్ధేశిత ప్రొఫార్మాలో సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఇ. పి.రవి, ఐసిడియస్ పిడి యం .రాజేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి డి. కీర్తి, ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
విశాఖజిల్లాలో వచ్చే జనవరి 10వ తేదీ లోగా జిల్లా లోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలకు, ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు త్రాగునీటి సదుపాయం కల్పించాలని జాయింట్ కలెక్టర్ అరుణ్ బాబు కోరారు. గురువారం జల జీవన్ మిషన్ కార్యక్రమం పై గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో పంచాయితీరాజ్ , వ్యవసాయం, విద్య, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, డిఆర్ డిఏ, పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, హౌసింగ్, ఇ పి డి సి ఎల్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖ లో త్రాగునీరు, శానిటేషన్ విభాగం 2024 లోగా జాతీయ జల జీవన్ మిషన్ కార్యక్రమం క్రింద గ్రామీణ ప్రాంతంలో కొళాయి కనెక్షన్ ద్వారా ఇంటింటికి త్రాగు నీరు సరఫరాకు సంకల్పించారని తెలిపారు. ప్రధానమంత్రి గాంధీ జయంతి నాడు "వందరోజుల కార్యక్రమం" క్రింద వచ్చే జనవరి 10వ తేది లోగా గ్రామీణ ప్రాంతాలలోని అన్ని పాఠశాలలు , అంగన్ వాడీలు , ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలకు కొళాయి కనెక్షన్ ల ద్వారా త్రాగునీటి సరఫరా లక్ష్యంగా ప్రకటించారని అన్నారు. ఇందులో భాగంగా రక్షిత, పరిశుభ్రమైన త్రాగునీటిని సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ పనులను పూర్తి చేసిన తరువాత గ్రామ పంచాయితీలు నిర్వహణ బాధ్యతలు చేపడతాయని తెలిపారు. కమ్యూనిటీలు పథకం విలువలో 10 శాతం మొత్తాన్ని నిర్వహణ వ్యయం క్రింద సమకూర్చుకోవలసి ఉంటుందని తెలిపారు. 50 శాతం కంటే ఎక్కువ జనాభా ఎస్ సి, ఎస్ టి లు ఉన్న చోట పథకం విలువలో 5 శాతం మొత్తాన్ని నిర్వహణ వ్యయం క్రింద సమకూర్చు కుంటే సరిపోతుందని అన్నారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు నిర్ణీత ప్రోఫార్మాలో సత్వరమే వారి అవసరాలను గురించి వివరాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఎస్ ఈ రవికుమార్, జిల్లా పంచాయితీ అధికారి కృష్ణకుమారి, ఐసిడి ఎస్ పిడి సీతామహాలక్ష్మి, సాంఘీక సంక్షేమ శాఖ సంయుక్త సంచాలకులు రమణమూర్తి, పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు రామకృష్ణ, జిల్లా పరిషత్ డిప్యూటి సి ఇ ఓ నిర్మలాదేవి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
యువజన సర్వీసులశాఖ ఏర్పాటు చేసిన ఉచిత ఆన్‌లైన్ శిక్షణా తరగతులను వినియోగించుకొని, విద్యార్థులూ, యువత తమనుతాము తీర్చిదిద్దుకోవాలని సెట్విజ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి పి.నాగేశ్వర్రావు కోరారు. ఈ శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను తన కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సెట్విజ్ సిఇఓ నాగేశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఈ శిక్షణ విద్యార్థులకు గొప్ప సదవకాశమని పేర్కొన్నారు. కరోనా కాలంలో ప్రస్తుతం ఇంట్లోనే ఉంటున్న 15 నుంచి 35 ఏళ్ల మధ్యవయసున్నవారంతా ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడనుంచి యువజన సర్వీసులశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో యోగ, ధ్యానంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటలు నుంచి 7.15 వరకూ జరిగే ఈ శిక్షణా కార్యక్రమంలో అన్నివయసులవారూ పాల్గొనవచ్చని సూచించారు. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొనాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలని, దానికి యోగ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే యోగా వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు.
వ్యక్తిత్వ వికాశంపై అక్టోబరు 17 నుంచి ప్రతీ శనివారం ఉదయం 10 గంటలు నుంచి 11.30 వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుందని, జూమ్ లింక్ద్వా, యూట్యూబ్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ద్వారా ఈ శిక్షణ పొందవచ్చని సూచించారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాశ నిపుణులు గొంపా నాగేశ్వర్రావు, యండమూరి వీరేంధ్రనాధ్, పద్మ లాంటి వారిచే తరగతులు ఉంటాయన్నారు. ఇంగ్లీషు లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్‌పై ప్రతీ శనివారం, బుధవారం సాయంత్రం 5 గంటలు నుంచి 6.30 వరకు జరుగుతున్నాయని, దీనిలో 15 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థులు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా, యూట్యూబ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొనవచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకోసం 7396219578 నెంబరుకు సంప్రదించాలని సిఇఓ సూచించారు. ఈ సమావేశంలో సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస చౌదరి తదితరులు పాల్గొన్నారు.
విశాఖలో ఎన్.ఏ.డీ ప్లైఓవర్ వద్ద గురువారం పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన లారీ.. ఆటోపై బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో ఆటోలో ప్రయాణి స్తున్నవారు బయటపడ్డారు.. ఘటనకు సంబందించి కంచరపాలెం ట్రాఫీక్ పోలీసులు మాట్లాడుతూ, అచ్చుతాపురం నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఎన్.ఏ.డీ మీదుగా బిర్లాకుడలికి వెళ్లాల్సి వుంది. కానీ గురువారం వేకువ జామున రెండు గంటల ప్రాంతంలో ఎన్.ఏడీ మీదుగా పోర్టుకు వెళ్తున్న క్రమంలో ఎన్.ఏ.డీ ప్లై ఓవర్ బిర్జ్ కిందకి వచ్చే సరికి ఒక్క సారిగా అదుపుతప్పి పైకి దూసుకుపోయి అటుగా వెళ్తున్న ఆటోపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటో పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న కంచరపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విశాఖ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ కి ఎట్టకేలకు రిజిస్ట్రేష్ గుర్తింపు లభించిందని అసోసియేషన్ అధ్యక్షుడు కాళ్ల అప్పారావు చెప్పారు. ఈ సందర్భంగా విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, 20 సంవత్సరాలుగా కిక్ బాక్సింగ్ అసోసియేషన్ పేరుపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా గుర్తింపుకి నోచుకోలేదన్నారు. ఇటీవల గుర్తింపు రావడంతో దానిని అసోసియేషన్ లో ఉంచి సమావేశం నిర్వహించి జిల్లా సంఘానికి అందజేసినట్టు వివరించారు. అనంతరం విశాఖ జిల్లా కిక్ బాక్సింగ్ సంఘంకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. అధ్యక్షుడుగా నీలాపు శ్రీనివాసరావు, మాస్టర్స్ గా జి.రాజేష్, ప్రసాద్ మాస్టర్, రాంబో కానక రాజు, కార్యదర్శి గా డి. ఏ. రావు, ఉప కార్యదర్శిగా యర్రయ్య, కోశాధికారిగా ఏ. త్రినాధ్, సహాయ కోశాధికారిగా జానకిరామ్, కార్యనిర్వాహక కార్యదర్శిలుగా ఇంటి సామ్ సన్, రాజశేఖర్, రమాదేవీలు, మెంబెర్లుగా మధు, కె.జ్యోతి, ముఖ్య సలహాదారులుగా, కాళ్ళ అప్పారావు, కిలాని సింగ్, టెక్నికల్ డైరెక్టర్స్ గా బి.నరేష్, యన్. సోము తదితరులు ఎన్నికయ్యారు.