1 ENS Live Breaking News

యుపీఎస్సీ పరీక్షలకు ప్రత్యేక రైళ్లు..

అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల కోసం అనంతపురం వచ్చే అభ్యర్థుల కోసం కడప, కర్నూలు జిల్లాల నుంచి ప్రత్యేక ట్రైన్ లను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.  ఈనెల 4వ తేదీన అనంతపురం సెంటర్ లో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో  ఈ నెల 3వ తేదీన 07245 అనే నెంబర్ గల ట్రైన్  కడప రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 3:30 గంటలకు బయల్దేరి ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, కల్లూరు స్టేషన్ల మీదుగా అదేరోజు రాత్రి 7:30 గంటలకు అనంతపురం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు.  అలాగే కర్నూలు   రైల్వే స్టేషన్ నుంచి ఈ నెల 3వ తేదీన 07243 అనే నెంబర్ గల ట్రైన్ సాయంత్రం 4:00 గంటలకు బయలుదేరి  డోన్, పెండేకల్లు, గుంతకల్లు, గుత్తి, కల్లూరు మీదుగా అదే రోజు రాత్రి 8:00 గంటలకు అనంతపురం రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు.    అలాగే ఈనెల 4వ తేదీన అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి 07246 అనే నెంబర్ గల ప్రత్యేక ట్రైను  సాయంత్రం 6:30 గంటలకు బయల్దేరి కల్లూరు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా 10:30 గంటలకు కడప రైల్వే స్టేషన్ కు చేరుకుంటుందన్నారు. అలాగే ఈ నెల 4వ తేదీన రాత్రి 7:30 గంటలకు 07244 అనే నెంబర్ గల ట్రైన్ అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరి, కల్లూరు, గుత్తి, గుంతకల్లు, పెండేకల్లు, డోన్ మీదుగా కర్నూలు పట్టణానికి అదేరోజు రాత్రి 11:30 గంటలకు చేరుకుంటుందన్నారు.   యూపీఎస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా ట్రైన్ లను ఏర్పాటు చేశామని, ఈ ట్రైన్ లకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉందని,  ట్రైన్స్ బయలుదేరే ముందు 4 గంటల  ముందు వరకు రిజర్వేషన్ చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రత్యేక బస్సులు కూడా.. అలాగే ఈ నెల 4 వ తేదీన అనంతపురం రీజియన్ లో 13 డిపోల నుండి 46 ప్రత్యేక  బస్సులు  ఆనంతపురానికి  ఉదయం 8 గంటలకు చేరుకునేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.. అదే రోజు  సాయంత్రం నగరం నుంచి తిరిగి గమ్య స్థానాలకు వెళ్లేలా  కూడా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా  కర్నూల్ నుండి  అనంతపురానికి ప్రతి అర గంటకు ఒక బస్సు, కడప నుండి  ఆనంతపురానికి గంటకొక బస్సు, కడప నుండి తాడిపత్రికి ప్రతి అర గంటకు ఒక బస్సు ఉందన్నారు.  అదే విధంగా  అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్కేయూ, జేఎన్టీయూ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలకు కూడ  ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. 4 వ తేదీన  ఉదయం 6:30 గంటలకు అనంతపురం ఆర్ టి సి బస్టాండ్ నుంచి జెఎన్టియుకి 3 బస్సులు, ఎస్కే యూనివర్సిటీకి మూడు బస్సులు వెళ్లేందుకు బస్సులు సిద్ధంగా ఉంటాయన్నారు. ఉదయం 7 గంటలకు బస్సులు బయల్దేరి పరీక్ష కేంద్రాలకు 8: 30 గంటల లోపు చేరుకుంటాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష కేంద్రాల వద్ద బస్సులు సిద్ధంగా ఉంటాయని, 5 గంటలకు బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ కి చేరుకుంటారు. యూపీఎస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.

Anantapur

2020-10-02 16:32:47

స్మార్ట్ సిటీ పనులు సత్వరమే పూర్తిచేయాలి..

తిరుపతి స్మార్ట్ సిటీ  ప్రాజెక్టు పనులు సకాలంలో పూర్తి చేయాలని కమిషనర్ గిరీషా ప్రాజెక్టు ప్రతినిధులను ఆదేశించారు. శుక్రవారం నాడు-నేడు, స్మార్ట్ సిటీ నిధులతో  స్థానిక నెహ్రు మున్సిపల్ స్కూల్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ పరిశీలించారు. పనులు ఆలస్యంగా జరుగుతుండటంతో సంబం దించిన కాంట్రాక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు ఆడుకునేందుకు ఖో ఖో, కబుడ్డీ, వాలీబాల్ , బ్యాడ్మింటన్ క్రీడా మైదానాలు బాగా వచ్చాయన్నారు. స్కూల్ లోపల , బయట చుట్టు పక్కల పూల చెట్లు నాటి , పచ్చటి గడ్డితో లాన్ లు ఏర్పాటు చేయాలన్నారు.  ఎస్పీజె ఎన్ ఎం స్కూల్ లో జరుగుతున్న పనులు రాష్ట్రానికే ఆదర్శం కావాలన్నారు. అనంతరం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు చేస్తున్న సంస్థ ప్రతినిధులతో సమావేశ మందిరంలో సమావేశమై ఏ ఏ ప్రాజెక్టు పనులు ఏ మేరకు పూర్తి అయ్యాయని పవర్ పాయింట్ ద్వారా తెలుసుకున్నారు. బాలాజీ కాలనీలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో గల ఈత కొలను, కాంటీన్, మరుగుదొడ్లు నిర్మాణం తదితర వాటి పురోగతిపై సమీక్షించారు. అలాగే వినాయక సాగర్ అభివృద్ధి పనులు, ప్రకాశం పార్క్ పనులు, రామాపురం వద్ద గల బయో మైనింగ్ ప్లాంట్, ట్రాన్స్ పర్ స్టేషన్ నిర్మాణ పనులు, 6 మెగా వాట్స్ సోలార్ ప్లాంట్ నిర్మాణ పనులు, 5 ఎం ఎల్ డి వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనుల పురోగతిపై  సమీక్షించారు. ఇచ్చిన గడువు లోపు పనులు పూర్తి చేయాలన్నారు. మీ పనులను అప్పుడప్పుడు తనిఖీ చేస్తానని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మీ బిల్లులు ఎప్పటికప్పుడు మంజూరు చేస్తున్నామని, మీరు కూడా అదే ఉత్సాహం తో పనులు పూర్తి చేయాలన్నారు. మీరు సకాలంలో పనులు పూర్తి చేయకుంటే బిల్లులు మంజూరు చేయబోమని, కాంట్రాక్ట్ క్యాన్సల్ చేస్తామని కాంట్రాక్టర్లు ను హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఈ చంద్రశేఖర్, డి.ఈ లు విజయకుమార్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, దేవిక, ఏయీకామ్ ప్రతినిధులు బాలాజీ, రాజేంద్ర, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Tirupati

2020-10-02 16:29:32

నిలకడగా ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం

విఎంఆర్ డిఏ చైర్మన్ విశాఖ దక్షిణ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ద్రోణంరాజు శ్రీనివాస్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.గత 15 రోజులుగా ప్రముఖులు వైద్యుల పర్యవేక్ష ణలో శ్రీనివాస్ గారికి ప్రత్యేక చికిత్స జరుగుతోంది. తొలుత కరోనా పాజిటివ్  వచ్చింది. దీంతో ఆయన ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ కరోనా పరీక్షలు చేయడంతో నెగిటివ్ వచ్చింది. ఇప్పుడు ఆరోగ్యం నిలకడగా ఉందని శ్రీనివాసరావు సమీప బంధువు  కావూరూ చరణ్ కుమార్  తెలియజేశారు.  శ్రీనివాస్ ఆరోగ్యంపై వస్తున్న రూమర్లు... వదంతులు ఎవరూ నమ్మవద్దని ఆయన తెలిపారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఆయన హోమ్ ఐసోలేషన్ లోనే ఉండి వైద్యం పొందుతున్నారని అన్నారు. మరికొద్ది రోజుల చికిత్స అనంతరం ఎప్పటిలాగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇంటి దగ్గర కూడా ఎవరినీ కలవడం లేదని, 28 రోజులు పూర్తి అయిన దగ్గర నుంచి యధావిధిగా అందరినీ కలుస్తారని ఆయన వివరించారు.

Visakhapatnam

2020-10-02 15:53:50

విశాఖలో గాంధీజీకి ఘన నివాళి..

జాతిపిత మహాత్మాగాంధీ భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధంచడానికి చేసిన సేవలు అజరామరమని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు కొనియాడారు. గాంధీ జయంతి సందర్బంగా శుక్రవారం విశాఖలోని జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీజి, లాల్ బహుదూర్ విగ్రహాలుకి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గంట్ల మాట్లాడుతూ, భారత దేశం నుంచి బ్రిటీషు సేనలను తరిమికొట్టడానికి గాంధీజి చేసిన ఉప్పు సత్యాగ్రహం భారతీయులందరికీ ఆదర్శమన్నారు. విదేశీ వస్త్రాలను విడనాడి, ఖాదీ వస్త్రాలనే ధరించాలన్న నినాదం స్వాతంత్య్రం పూర్వం నుంచి నేటి వరకూ గాంధేయవాదులు పాటిస్తున్న అంశమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో ఇంటక్ నాయకులు మంత్రి రాజశేఖర్ మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ, గాంధీజి  ఆశయాలు నేటి తరాలు కు ఆదర్శనీయం అన్నారు. నేడు భారతదేశంలో జరుగుతున్న స్వచ్ఛ భారత్ గాంధీ ఆశయంతోనే ప్రారంభమైందని పేర్కొన్నారు.

జివిఎంసీ గాంధీ విగ్రహం

2020-10-02 14:12:37

గాంధీజి ఆశ‌య సాధ‌న‌కు కృషి చేయాలి..

జాతిపిత, మ‌హాత్మాగాంధీ ఆశ‌యాల సాధ‌న‌కు కృషి చేయాల‌ని డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ కె.సుబ్బారావు కోరారు. డాక్ట‌ర్ మ‌ర్రిచెన్నారెడ్డి భ‌వనంలోని డిఆర్‌డిఏ కార్యాల‌యంలో, శుక్ర‌వారం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా  మ‌హాత్మాగాంధీ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా పిడి సుబ్బారావు మాట్లాడుతూ మ‌హాత్ముని గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. గ్రామీణ ప్ర‌జ‌ల సౌభాగ్య‌మే గాంధీజి ధ్యేయ‌మ‌ని పేర్కొన్నారు.  సంక్షేమ ఫ‌లాలను క్షేత్ర‌స్థాయికి తీసుకు వెళ్ల‌డ‌మే మ‌నంద‌రి ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. అంకిత‌భావంతో ప‌నిచేసి,  ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అర్హులంద‌రికీ అందించేందుకు సిబ్బంది అంతా కృషి చేయాల‌ని పిడి కోరారు. కార్య‌క్ర‌మంలో ఏపిడి ముర‌ళి, మేనేజ‌ర్ రోజా, డిపిఎంలు, ఎపిఎంలు, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Vizianagaram

2020-10-02 13:56:22

గాంధీజీ క‌ల‌లకు ప్ర‌తిరూప‌మే స‌చివాల‌య వ్య‌వ‌స్థ

జాతిపిత మ‌హాత్మాగాంధీ క‌ల‌లుగ‌న్న గ్రామ స్వ‌రాజ్యాన్ని స్థాపించ‌డ‌మే ల‌క్ష్యంగా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్ అన్నారు. దీనిలో భాగంగానే రాష్ట్రంలో ఏడాది క్రితం గ్రామ‌, వార్డు సచివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్ర‌వేశ‌పెట్టింద‌ని చెప్పారు. ఈ వ్య‌వ‌స్థ ద్వారా ఇప్ప‌టికే అద్భుత‌మైన ఫ‌లితాల‌ను సాధిస్తున్నామ‌ని తెలిపారు.  క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ‌లో శుక్ర‌వారం జ‌రిగిన మ‌హాత్మాగాంధీ జ‌యంతి వేడుక‌ల‌ను ఆయ‌న ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. గాంధీ విగ్ర‌హానికి పూల‌మాల వేసి, నివాళుల‌ర్పించారు. అనంత‌రం క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ గాంధీజి క‌ల‌ల సాకారానికే స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించ‌డం జ‌రిగింద‌న్నారు. గ్రామ స‌చివాల‌య వ్య‌వ‌స్థ ద్వారా ప్ర‌జ‌ల ముంగిట‌కే ప్ర‌భుత్వ సేవ‌ల‌ను తీసుకువెళ్ల‌డంతోపాటు, వేలాది మందికి ఉద్యోగాల‌నిచ్చి, ప్ర‌భుత్వం వారి కుటుంబాల్లో వెలుగును నింపింద‌ని అన్నారు. ఈ వ్య‌వ‌స్థ ద్వారా అస‌లైన గ్రామ స్వ‌రాజ్య వ్య‌వ‌స్థ అందుబాటులోకి వ‌చ్చింద‌ని తెలిపారు.    గ్రామాల్లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు ప్ర‌భుత్వం పెద్ద‌పీట వేస్తోంద‌ని క‌లెక్ట‌ర్ అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ క‌న్వ‌ర్జెన్సీ నిధుల‌తో గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. గ్రామ స‌చివాల‌యాలు, రైతు భ‌రోసా కేంద్రాలు, వెల్ నెస్ సెంట‌ర్లు త‌దిత‌ర భ‌వ‌నాల నిర్మాణం భారీ ఎత్తున చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌స్తుతం జిల్లా వ్యాప్తంగా సుమారు 2వేల భ‌వ‌నాలు నిర్మాణంలో ఉన్నాయ‌ని, ఇవ‌న్నీ మ‌రో ఆరునెల‌లో పూర్తి చేసి, గ్రామ స్వ‌రూపాన్ని మారుస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ అభివృద్ది, సంక్షేమ కార్య‌క్ర‌మాల అమ‌ల్లో జిల్లా మొద‌టి స్థానంలో ఉంద‌ని, దీనికి అంద‌రి స‌మిష్టి కృషే కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో కూడా మ‌రిన్ని విజ‌యాల‌ను సాధించేందుకు అంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.                  ఈ కార్య‌క్ర‌మంలో జాయింట్ క‌లెక్ట‌ర్ (రెవెన్యూ) డాక్ట‌ర్ జి.సి.కిశోర్ కుమార్‌, అసిస్టెంట్ క‌లెక్ట‌ర్ కె.సింహాచ‌లం, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, ప‌శుసంవ‌ర్థ‌క‌శాఖ జాయింట్ డైరెక్ట‌ర్ ఎంవిఏ న‌ర్సింహులు, డ్వామా పిడి ఏ.నాగేశ్వ‌ర్రావు, జిల్లా విప‌త్తుల నివార‌ణాధికారి బి.ప‌ద్మావ‌తి, డిబిసిడ‌బ్ల్యూఓ కీర్తి, ఐసిడిఎస్ పిడి ఎం.రాజేశ్వ‌రి, మ‌త్స్య‌శాఖ డిడి జి.నిర్మ‌ల‌, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి ఎస్‌.జ‌గ‌న్నాధం, డిఎస్ఓ పాపారావు, చేనేత జౌళిశాఖ ఎడి పెద్దిరాజు, స‌హ‌కార అధికారి ఎస్‌.అప్ప‌ల‌నాయుడు, క‌లెక్ట‌రేట్ ఏఓ దేవ్‌ప్ర‌సాద్‌, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Vizianagaram

2020-10-02 13:54:22

2020-10-02 13:06:02

సత్యం, అహింస ప్రగతికి సోపానాలు..

మహాత్మ గాంధీ ప్రబోధించిన సత్యం, అహింసలు ప్రగతికి సోపానాలుగా నిలుస్తాయని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం ఏయూ పరిపాలనా భవనం వద్దనున్న మహాత్మ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మ గాంధీ దేశ ప్రజలకు ఏకతాటిపై నిలపి, జరిపిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. సమిష్టిగా పనిచేస్తే సాధించగలమని ఆయన రుజువుచేసారన్నారు. అహింసా మూర్తికి నివాళి అర్పించారు. కార్యక్రమంలో రెక్టార్‌ ఆచార్య ఎస్‌.‌సమత, ఇంచార్జి రిజిస్ట్రార్‌ ఆచార్య జి.వి రవీంద్రనాథ్‌ ‌బాబు, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, ఆచార్య కె.శ్రీనివాస రావు, ఆచార్య రాజేంద్ర కర్మార్కర్‌, ఆచార్య వై.రాజేంద్ర ప్రసాద్‌, ఆచార్య ఎస్‌.‌సుమిత్ర, ఆచార్య పి.హరి ప్రకాష్‌, ‌పాలక మండలి సభ్యులు ఆచార్య టి.శోభశ్రీ, ఏయూఇయూ అద్యక్షులు డాక్టర్‌  ‌జి.రవికుమార్‌ ‌తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు, ఆచార్యులు పెద్దసంఖ్యలో పాల్గొని నివాళి అర్పించారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-10-02 13:05:04

జస్టిస్ ఫర్ మనీషా..

ఉత్తరప్రదేశ్ లో 19 ఏళ్ల దళిత అమ్మాయి మనీషా వాల్మీకి నీ అతి దారుణంగా అత్యాచారం చేసి హత్యచేయడానికి నిరసిస్తూ ఆంధ్ర యూనివర్సిటీ లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జస్టిస్ ఫర్ మనీషా పేరిట ఎస్సీ ఎస్టీ బిసి బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పరిశోధకులు ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమంలో సేవ్ గర్ల్, సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బిసి అధ్యాపక సంఘం అధ్యక్షుడు ఆచార్య పి.అర్జున్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని వాటిని నిలువరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి  ఉత్తరప్రదేశ్ దళిత బాలిక మనీషా పై అత్యాచారం చేసిన ఘటనే నిదర్శనమన్నారు. ఆమె మరణానికి కారకులైన దుండగులను వెంటనే శిక్షించి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆచార్య కోటి జాన్ మాట్లాడుతూ, దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఉత్తరప్రదేశ్లో మనీషా లాంటి అమాయక దళిత స్త్రీలకు రాష్ట్రంలో తిరిగే స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. ఇది బాబా సాహెబ్ రాసిన రాజ్యాంగానికి, ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరిగిందని వెంటనే యుపి సీఎం యోగి ఆదిత్యనాథ్ ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ అధ్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి ఆచార్య మధు ,ఆచార్య రమేష్, డాక్టర్ ప్రకాష్, శిర్ల శ్యాంసుందర్, బోరుగడ్డ మోహన్ బాబు, ఆరేటిమహేష్, వెంకటేశ్వర్లు, డాక్టర్ కందుల రవికుమార్, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ ప్రసాద్, వెలిచెర్ల రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రాయూనివర్శిటీ

2020-10-01 20:46:41

సమగ్ర పరిశ్రమ సర్వే వేగవంతం చేయాలి..

అనంతపురం జిల్లాలో చేపడుతున్న సమగ్ర పరిశ్రమ సర్వే 2020 ను వేగవంతం చేయాలని జాయింట్ డైరెక్టర్ ఎం.ఉదయభాస్కర్ పరిశ్రమల అభివృద్ధి  అధికారు లను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక  జిల్లా పరిశ్రమల కేంద్రం  కార్యాలయంలో   అనంతపురంజిల్లాలో నిర్వహిస్తున్న సమగ్ర పరిశ్రమ సర్వేపై ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ లోపు సర్వేను పూర్తి చేయాలని ఆదేశించారు. .ఈ సర్వే నందు ప్రతి పరిశ్రమకు ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారని మరియు మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామ ,వార్డు సచివాలయ సిబ్బంది పరిశ్రమల వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. ఆ తర్వాత నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం ఆయా  కంపెనీలకు "పరిశ్రమ ఆధార్ " నంబర్ కేటాయిస్తుందన్నారు .  తద్వారా కంపెనీలు , పరిశ్రమలకు చెందిన వివిధ సెక్టార్ల వివరాలతో కూడిన పూర్తి జాబితా  ప్రభుత్వం వద్ద ఉంటుందన్నారు. ఈ సర్వేలో ప్రమోటర్లు, ఆయా రంగాల పెట్టుబడి ఎగుమతులు, దిగుమతులు , విద్యుత్,  క్రెడిట్ అవసరము ఉద్యోగి మరియు నైపుణ్యాల సమగ్ర సమాచారాలు రీ-స్కిల్లింగ్  అవసరము మరియు మార్కెటింగ్ వివరాలు ఉంటాయని తెలిపారు . పరిశ్రమల యాజమాన్యం సర్వే కొరకు విచ్చేసే అధికారులకు సంబంధిత పరిశ్రమ యాజమాన్యాలు  సహకరించవలసిందిగా ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.   జిల్లాలో జరుగుతున్న సమగ్ర పరిశ్రమ సర్వే సమీక్షలో జిల్లాలోని 44 మండలాల్లో గ్రామ స్థాయిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా, పట్టణాల్లో వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీల ద్వారా సర్వే నిర్వహిస్తున్నట్లు అధికారులు జాయింట్ డైరెక్టర్ కు వివరించారు.  అలాగే మిగతా మండలాల్లో కూడా సర్వే ప్రారంభించాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను జాయింట్ డైరెక్టర్ ఆదేశించారు .  జిల్లా వ్యాప్తంగా 1208 పరిశ్రమలకు సంబంధించి  సర్వే చేపట్టాల్సి ఉండగా, నేడు  635 సర్వేలను పూర్తి చేయడం జరిగిందని, 562 ప్రగతిలో ఉన్నాయని  అధికారులు జాయింట్ డైరెక్టర్ కు వివరించారు.   ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఉపసంచాలకులు నాగరాజారావు,  ఎడి అన్వరుల్లా పరిశ్రమల అభివృద్ధి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-10-01 20:38:12

15 వరకు ఆర్.బి.కెల్లోనే రిజిస్ట్రేషన్లు..

శ్రీకాకుళం జిల్లాలోని రైతులందరూ రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జె.సి  వ్యవసాయ అధికారులతో  సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ప్రతీ పంటను రైతు భరోసా కేంద్రాల (ఆర్.బి.కె ) ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని, కాబట్టి ప్రతీ రైతు తమ సమీప రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అక్టోబర్ 1 నుండి ప్రారంభమైందని, ఈ నెల 15 వరకు రిజిస్ట్రేషన్లు ప్రక్రియ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేసారు. కావున ప్రతీ మండల వ్యవసాయ అధికారి  గ్రామ వ్యవసాయ అధికారులతో కలిసి రోజుకు రెండు ఆర్.బి.కెల పరిధిలోని రైతులకు రిజిస్ట్రేషన్లపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ మండల వ్యవసాయ అధికారికి ఆర్.బి.కెల వివరాలు, ప్రస్తుతం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల వివరాలను ఇప్పటికే అందించడం జరిగిందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి నుండే పంట కొనుగోళ్లు ఉంటాయనే విషయాన్ని రైతులకు వివరించాలని చెప్పారు. జిల్లాలోని లావేరు, జి.సిగడాం, రణస్థలం మండలాల్లోని 13వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటను రైతులు వేసారని, సుమారు 50వేల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశముందని చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లను కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారానే చేపట్టడం జరుగుతుందని ఆయన వివరించారు.రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయితే షెడ్యూలు ప్రకారం కొనుగోళ్లు చేపట్టడం జరుగుతుందని జె.సి వివరించారు. అనంతరం ఇ-క్రాప్ బుకింగ్ గురించి మాట్లాడుతూ జిల్లాలో ఇ-క్రాప్ బుకింగ్ సాధ్యమైనంత మేర అయిందని, ఇందుకు కృషిచేసిన వ్యవసాయ అధికారులను జె.సి అభినందించారు. సాంకేతికపరమైన అంశాలతో ఇంకా జిల్లాలో  4 వేల ఎకరాల వరకు ఇ-క్రాప్ జరగవలసి ఉందని, వాటిని సాధ్యమైనంత త్వరలో పూర్తిచేయాలన్నారు. ఇ-క్రాప్ తోనే రైతు భరోసా, క్రాప్ ఇన్స్యూరెన్స్ వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని, కావున రైతులు ఇ-క్రాప్ చేసుకునేలా చూడాలని జె.సి వివరించారు. జిల్లాలో 14 మండలాల్లో సాదారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదైందని, గడిచిన మూడు మాసాలుగా ఇదేపరిస్థితి ఉందన్నారు. దీనిపై వ్యవసాయ అధికారులు అధ్యయనం చేసి, ఆ మండలాల్లో పంటలు నష్టపోకుండా ఉండేందుకు అవసరమైన అంశాలపై దృష్టి సారించాలని అన్నారు.   ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, ఉప సంచాలకులు రాబార్ట్ పాల్, సహాయ సంచాలకులు తిరుమలరావు, రాజగోపాల్, వెంకటరావు, రవిప్రకాశ్, మధు, భ్రమరాంబ, రవీంద్రభారతి, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-10-01 20:24:45

ప్రజలకు మెరుగైన సేవలందించాలి..

సచివాలయాల ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు  సచివాలయ సిబ్బందిని దేశించారు. గురువారం నగరంలోని రెండవ రోడ్డులో ఉన్న 64 వ వార్డు సచివాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వార్డు సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని సర్వీసులు వచ్చాయి, వాటిలో ఎన్ని సర్వీసులకు పరిష్కారం చూపించారనే వివరాలను సచివాలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలనుంచి అందిన అర్జీలకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించి బయోమెట్రిక్ విధానాన్ని తనిఖీ చేశారు. ఉద్యోగులంతా సకాలంలో సచివాలయానికి హాజరై ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు తెలియజేసి వారి నుంచి వచ్చిన సర్వీసు లకు సత్వరమే పరిష్కారం చూపించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఇప్పటివరకు 64వ వార్డు సచివాలయం ద్వారా 999 సర్వీసులకు పరిష్కారం చూపించినట్లు ఉద్యోగులు జిల్లా కలెక్టర్ కు వివరించారు.   వార్డు సచివాలయం ద్వారా అందిస్తున్న సేవలపై విరివిగా ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని వార్డు కార్యదర్సులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వార్డు సచివాలయం లో ప్రదర్శించిన ప్రభుత్వ పథకాల పోస్టర్లను, లబ్ధిదారుల జాబితాను పరిశీలించారు. సచివాలయంలో 2020 - 21 సంక్షేమ క్యాలెండర్ ని మరింత పెద్దదిగా ప్రదర్శించాలని సూచించారు. వార్డు సచివాలయం పరిధిలో పారిశుద్ధ్యంపై మరింత శ్రద్ధ చూపాలని , కోవిడ్ 19 నేపథ్యంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను వార్డు సచివాలయ పరిధిలో ఖచ్చితంగా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ పి వి ఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, కార్పొరేషన్ సెక్రెటరీ సంగం శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2020-10-01 19:40:42

మళ్లీ విజయనగరమే ఫస్ట్..

రాష్ట్రంలోనే ఫించన్ల పంపిణీలో విజయనగరం జిల్లా త‌న రికార్డును మ‌రోసారి నిల‌బెట్టుకుంది. మొద‌టి తేదీనే 95.10 శాతం పింఛ‌న్ల‌ను పంపిణీ చేసి రాష్ట్రంలోనే నెంబ‌ర్ 1 గా నిలిచింది.  జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాల‌కు అనుగుణంగా, డిఆర్‌డిఏ పిడి ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గురువారం తెల్లవారుజాము నుంచే జిల్లా వ్యాప్తంగా వాలంటీర్లు రంగంలోకి దిగి ఫించన్లు పంపిణీని ప్రారంభించారు. స‌చివాల‌య సిబ్బంది ఆధ్వ‌ర్యంలో ఇంటింటికీ వెల్లి పించ‌న్ల‌ను అంద‌జేశారు. ఉద‌యాన్నే వ్య‌వ‌సాయ ప‌నుల‌కు వెళ్లిపోయిన‌వారికి, పొలంలోకి వెళ్లి మ‌రీ వాలంటీర్లు పింఛ‌న్ అందించారు. ద‌త్తిరాజేరు మండ‌లం వంగ‌ర‌లో ఇలా జ‌రిగింది. అలాగే న‌డ‌వ‌లేని వృద్దులు, విక‌లాంగుల‌కు వారి మంచాల‌వ‌ద్ద‌కు వెళ్లి పింఛ‌న్‌ను ఇచ్చారు.  ఎప్ప‌టిలాగే ఉద‌యం 6 గంట‌ల‌కే పింఛ‌న్ పంపిణీని మొద‌లు పెట్ట‌డంతో, ఉదయం 7 గంటలకు 31.07శాతం, 8:30 కల్లా 38.76 శాతం, 9:00 గంటలకు 41.23 శాతం అలాగే సాయంత్రం 4:00 అయ్యేసరికి 92.19 శాతం పింఛన్లు పంపిణీ జ‌రిగింది. దాదాపు అన్ని వేళ‌ల్లోనూ మ‌న‌ జిల్లా పింఛ‌న్ల పంపిణీలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తూ వ‌చ్చింది. చివ‌ర‌కు సాయంత్రం 6 గంట‌ల‌కు  95.10 శాతం పింఛ‌న్ల‌ను పంపిణీ చేసి త‌న మొద‌టి స్థానాన్ని నిల‌బెట్టుకుంది. .జిల్లాలో మొత్తం 3,36,697 పింఛ‌న్లు విడుద‌ల కాగా, 3,20,197 పింఛ‌న్ల పంపిణీ జ‌రిగింది. ఉద‌యం నుంచి ఎంతో అంకిత‌భావాన్ని ప్ర‌ద‌ర్శించి జిల్లా వ్యాప్తంగా పింఛ‌న్ల పంపిణీని తొలిరోజే దాదాపు పూర్తి చేసిన సిబ్బంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎం.హ‌రి జ‌వ‌హ‌ర్‌లాల్‌, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు అభినందించారు.

Vizianagaram

2020-10-01 19:33:15

కరోనా రోగులు మనోదైర్యంతో ఉండాలి..

కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారు ధైర్యంగా ఉండాలని, ఎటువంటి భయాందోళనలకు గురి కావాల్సిన పనిలేదని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు దైర్యాన్నిచ్చారు. గురు వారం సాయంత్రం స్థానిక శారదా నగర్ లో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మరియు క్యాన్సర్ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వచ్చి నవారిని పరామర్శించి వారికి జిల్లా కలెక్టర్ దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరియు క్యాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారితో జిల్లా కలెక్టర్ నేరుగా సంభాషించారు. ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయి, డాక్టర్లు సమయానికి చికిత్స అందిస్తున్నారా లేదా, ఇక్కడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భోజనం రుచికరంగా ఉందా లేదా తదితర అంశాలపై వారి నుండి సమాధానాన్ని రాబట్టారు. ఇక్కడి డాక్టర్లు, వైద్య సిబ్బంది చాలా బాగా వైద్య సేవలు అందిస్తున్నారని, మాకు ఎలాంటి ఇబ్బంది లేదని, సమయానికి అన్నీ సమకూరుస్తున్నారు పాజిటివ్ వచ్చిన వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. తమపై మరింత శ్రద్ధ చూపిస్తున్న ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ వ్యాధిపట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, సరైన చికిత్స అందించడం ద్వారా ఆ వ్యాధి నుంచి త్వరగా కోలుకుంటున్నారన్నారు. ఇప్పటికే సుమారు 60 వేల మంది కోవిడ్ వ్యాధిని సమర్థవంతంగా ఎదుర్కొని, దాని నుంచి కోలుకుని వారు ఇళ్లకు సంతోషంగా వెళ్లారని తెలిపారు. కోవిడ్ పట్ల ఆందోళన పడకుండా ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు.  అనంతరం అక్కడ వైద్య సేవలు అందిస్తున్న  నర్సులను అభినందిస్తూ, కోవిడ్ వ్యాధిగ్రస్తులకు మీరు అందిస్తున్న సేవలు బాగున్నాయని పాజిటివ్ వచ్చినవారు తెలిపారన్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుపమని సిబ్బందిని కోరగా, వారు తమకు తోడుగా మరింత సిబ్బందిని కేటాయించాలని కోరారు. అలాగే తమలో కొందరు ఇతర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వైద్య సేవలు అందిస్తున్నామని, తమకు అనంతపురం పట్టణంలో వసతి సౌకర్యం కల్పించాల్సిందిగా వారు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై వెంటనే మున్సిపల్ కమిషనర్ కు ఫోన్లో ఆదేశాలిస్తూ, అనంతపురం పట్టణంలో అతి తక్కువ ధరలో సురక్షితమైన ప్రాంతంలో ఇక్కడ పనిచేస్తున్న వైద్య సిబ్బందికి రెండు, మూడు రోజుల్లో అద్దె ప్రాతిపదికన వసతి సౌకర్యాలు కల్పించే చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అలాగే ఆసుపత్రికి వచ్చే మార్గంలో వీధి దీపాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం అదే ప్రాంగణంలోని క్యాన్సర్ హాస్పిటల్ సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న పాజిటివ్ వచ్చిన వారిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి, వారికి అందుతున్న వైద్యసేవలు పట్ల కలెక్టర్ ఆరా తీశారు. అక్కడి వారికి వినోద కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా అనేది వాకబు చేశారు. వెంటనే ఎల్సిడి ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించిన వినోద కార్యక్రమాలను పాజిటివ్ వచ్చిన వారితో పాటు కలిసి కలెక్టర్ తిలకించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, ఇంచార్జ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్. కే ఎస్ ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Anantapur

2020-10-01 19:20:17

యుపీఎస్సీ పరీక్షలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల కోసం అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎస్కేయూ, జేఎన్టీయూ కళాశాలల్లోని పరీక్ష కేంద్రాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్‌ మేనేజర్ సుమంత్ ఆర్. ఆదోని తెలిపారు. ఈనెల 4వ తేదీన యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆరోజు ఉదయం 6:30 గంటలకు అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి జెఎన్టియుకి 3 బస్సులు, ఎస్కే యూనివర్సిటీకి 3 బస్సులు వెళ్లేందుకు  సిద్ధంగా ఉంటాయన్నారు. ఉదయం 7 గంటలకు బస్సులు బయల్దేరి పరీక్ష కేంద్రాలకు 8: 30 గంటల లోపు చేరుకుంటాయని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు పరీక్షలు ముగిసిన వెంటనే పరీక్ష కేంద్రాల వద్ద బస్సులు సిద్ధంగా ఉంటాయని, 5 గంటలకు బయలుదేరి ఆర్టీసీ బస్టాండ్ కి చేరుకుంటారు. యూపీఎస్సీ అభ్యర్థుల సౌకర్యార్థం పరీక్ష కేంద్రాలకు రవాణా సౌకర్యం కల్పించడం కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామని, ఈ అవకాశాన్ని అభ్యర్థులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

Anantapur

2020-10-01 19:17:15