అనంతపురము జిల్లాలో మనబడి నాడు - నేడు కింద చేపడుతున్న పనులను నాణ్యతతో చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. గురువారం సాయంత్రం నగరంలోని కక్కలపల్లి కాలనీలో ఉన్న ఎంపిపియుపి పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నాడు- నేడు కింద ఎంపిపియుపి మోడల్ పాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. పాఠశాలలో నిర్మించిన తాగునీటి కుళాయిలను పరిశీలించి, ఒకటో తరగతి విద్యార్థులకు కుళాయిలు అందే విధంగా నిర్మించలేదని, వెంటనే వారికి కూడా నీరు అందేలా తగిన ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాఠశాలకు అందిన ఆటవస్తువులను త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు. అక్కడ ఫ్లోరింగ్ లో హెచ్చుతగ్గులు ఉండటాన్ని గమనించి వెంటనే వాటిని సరిదిద్దవలసిందిగా సైట్ ఇంజనీర్ రాజశేఖర్ రెడ్డిని ఆదేశించారు. పనులు సక్రమంగా చేపట్టక పోతే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని సైట్ ఇంజినీర్ పై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు -నేడు పనులను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని, అందుకు తగ్గట్లుగా నాణ్యతతో పనులు చేపట్టాలన్నారు. పనులు ఆలస్యంగా జరగడంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వేగవంతంగా పనులను పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈవో శామ్యూల్, ఏపీ సి తిలక్ విద్యా సాగర్, సమగ్ర శిక్ష ఈ ఈ శివ కుమార్, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల కోసం జిల్లా కేంద్రంలో ఒక ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. యూపీ ఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థుల సౌకర్యార్థం యూపీఎస్సీ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ను ప్రారంభించామని, కంట్రోల్ రూమ్ ను 08554-275598 అనే నెంబర్ తో ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ ఇన్చార్జిగా ఒక తహసీల్ధార్, ముగ్గురు సిబ్బందిని నియమించామన్నారు. గురువారం నుంచి 4 వతేది వరకు ఈ కంట్రోల్ రూం పనిచేస్తుందన్నారు. అభ్యర్థులకు ఏవైనా ఇబ్బందులు వస్తే జిల్లా కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. అభ్యర్థులు తెలియజేసిన సమస్యలను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సమస్యలను యూపీఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించేలా చూస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్షలు రాసే అభ్యర్థులు కంట్రోల్ రూమ్ సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
అనంతపురం నగరంలోని పాత ఆర్డీవో కార్యాలయం ఆవరణంలో ఏర్పాటుచేసిన ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎంలు, వివి ప్యాట్ లను తనిఖీ చేయాల్సి ఉండగా, అందులో భాగంగా గురువారం మధ్యాహ్నం ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాము గదులను తెరిపించి అందులో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, వి వి ప్యాట్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తిరిగి గోదాముకు సీలు వేయించారు. అలాగే ఈవీఎంలు, వీవీ ప్యాట్ ల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉంటూ ప్రత్యేక నిఘా ఉంచాలని విధులు నిర్వర్తిస్తున్న పోలీసు మరియు సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. గోడౌన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున గోదాములలోకి నీరు ప్రవేశించకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కర్ కు జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతపురం జిల్లాలో యూపీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబం ధిత అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో వంద శాతం యూపీఎస్సీ నిబంధనలను పాటించాలని, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగ కూడదని కలెక్టర్ స్పష్టం చేశారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సివిల్ సర్వీసెస్(ప్రిలిమినరీ) పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో యూపీఎస్సీ తరఫున అండర్ సెక్రటరీ సాబిల్ కిండో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న యూపీఎస్సీ పరీక్షలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాలలో యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుండగా, అనంతపురం జిల్లా కేంద్రం కూడా అందులో ఒకటన్నారు. జిల్లా కేంద్రంలో 8 వెన్యూలలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, అందులో 7 సెంటర్ లు సాధారణమైనవని, అందులో ఒకటి స్పెషల్ సెంటర్ అన్నారు. 8 వెన్యూలలో 189 ఎక్జామినేషన్ హాల్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పరీక్షల నిర్వహణలో యూపీఎస్సీ నిబంధనలను ఖచ్చితంగా పాటించి వాటిని అమలు చేయాలన్నారు. ఈ నెల 4వ తేదీన ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 10.58 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారన్నారు. అనంతపురం సెంటర్లో 3312 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్నారు. యూపీఎస్సీ పరీక్షలలో క్యాండిడేట్ ఫ్రెండ్లీ నెస్ అనేది చాలా ముఖ్యమన్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను 100 శాతం పూర్తిగా కల్పించాలన్నారు.
ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒక ఇన్విజిలేటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షల కోసం ఎనిమిది మంది లోకల్ ఇన్స్ పెక్టింగ్ ఆఫీసర్లను, సిట్టింగ్ స్క్వాడ్ లను, అసిస్టెంట్ సూపర్వైజర్ లను, లైజన్ ఆఫీసర్లను నియమించామన్నారు. వెన్యూ సూపర్వైజర్లు సంబంధిత కేంద్రానికి సంబంధించి పూర్తి ఇంచార్జి గా ఉంటారన్నారు. లోకల్ ఇన్స్ పెక్టింగ్ ఆఫీసర్లు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారన్నారు. పరీక్షలు సజావుగా, సక్రమంగా జరిగేందుకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పించాలని, పరీక్ష హాల్లో లైట్లు, ఫ్యాన్లు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలని, వెలుతురు ఉందా లేదా, బెంచీలు సరిపడినవి ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలని, అభ్యర్థుల కోసం తాగునీటి సరఫరా చేయాలని, సెక్యూరిటీని ఏర్పాటు చేయాలన్నారు. వసతుల కల్పనలో ఎటువంటి రాజీ పడకూడదని, అభ్యర్థులు సజావుగా పరీక్షలు రాసేలా అన్ని రకాల ఏర్పాట్లు ఖచ్చితంగా చేయాలన్నారు. పరీక్ష హాల్లో ఒక అభ్యర్థి నుంచి మరొకరికి రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకుని బెంచీలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష హాల్లో బ్లాక్ బోర్డులు, బెంచీలపై, కిటికీలపై ఎటువంటి రాతలు ఉండరాదని, పేపర్లు అతికించకుండా చూసుకోవాలన్నారు. అన్ని రకాల వసతులు కల్పించారాలేదా అనేది ముందుగానే పరిశీలించాలని, అన్నిచోట్లా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వచ్చేటప్పుడు వారిని మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేయాలన్నారు. అభ్యర్థులెవరూ పరీక్షహాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని కలెక్టర్ స్పష్టం చేశారు.. చెకింగ్ అన్నది బాగా జరగాలని, మొబైల్ ఫోన్లు, వాచ్ లు, కెమెరాలు, క్యాలిక్యులేటర్ లు లాంటివి పరీక్ష హాల్లోకి నిషేధం అన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ల ద్వారా ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. నిర్వహించాలన్నారు. కడపజిల్లా నుంచి 609 మంది, కర్నూలు జిల్లా నుంచి 900 మంది అభ్యర్థులు హాజరవుతున్నందున వారికి రవాణా సౌకర్యం లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా వారి కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అలాగే అనంతపురం నగరంలో ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ల నుంచి జేఎన్టీయూ, ఎస్కేయు సెంటర్ లకు వెళ్లేందుకు ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఆర్ ఎం సుమంత్ ను ఆదేశించారు. కడప, కర్నూల్ నుంచి స్పెషల్ ట్రైన్లను ఏర్పాటు చేయాల్సిందిగా డిఆర్ఎం తో మాట్లాడామన్నారు. జేఎన్టీయూ, ఎస్కేయు సెంటర్ లలో అభ్యర్థుల భోజన వసతికి వీలుగా క్యాంటీన్లు తెరచాలని ఆదేశించారు. అదే విధంగా ఇతర పరీక్షా కేంద్రాల్లో కూడా బిస్కట్లు, త్రాగునీరు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు భౌతిక దూరం పాటించాలని, శాని టైజర్లు తీసుకురాకూడదన్నారు. ప్రతి వెన్యూ పరీక్ష కేంద్రం లోనూ పల్స్ ఆక్సీ మీటర్లను సిద్ధంగా ఉంచాలన్నారు. పరీక్షలకు సంబంధించి శుక్రవారం ఇన్విజిలేటర్ల కు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 12 మంది అభ్యర్థులకు స్క్రైబ్స్ అవసరం ఉందని, అందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు.
అనంతపురం జిల్లాకి యూపీఎస్సీ పరీక్షల నిర్వహణకు సెంటర్ అబ్జర్వర్ గా ఐఏఎస్ అధికారి కోన శశిధర్ నియమితులైనట్టు కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. గురువారం ఈ మేరకు అబ్జర్వర్ విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలను అందజేశారని ఆయన మీడియాకి వివరించారు. అనంతపురం చాలా పెద్ద జిల్లా అని, జిల్లాలోని పరీక్ష కేంద్రానికి కడప, కర్నూలు నుంచి అభ్యర్థులు హాజరవుతున్నారు. అభ్యర్థులు సరైన సమయంలో వెన్యూ కి చేరుకునేలా చూడడం చాలా ముఖ్యమని, ఇందుకోసం స్పెషల్ బస్సులు, ట్రైన్లను అవసరమైన సమయానికి అందుబాటులో ఉంచేలా చూసుకోవాలన్నారు. అభ్యర్థుల సందేహాలు నివృత్తి చేసేందుకు కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుని పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ యూపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేయాలన్నారు. వెన్యూ సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు ఎవరు ఏం చేయాలి అనేదానిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా గుంతకల్లు ఏడిఆర్ఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కడప, కర్నూలు నుంచి అందుబాటులో ఉన్న ట్రైన్ ల వివరాలను తెలియజేశారు. 3వ తేదీ మధ్యాహ్నం అనంతరం కడప, కర్నూలు నుంచి బయలుదేరి రాత్రి 7:30 గంటల లోపల అనంతపురం చేరుకునేలా ప్రత్యేక ట్రైన్లను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సమావేశంలో , జాయింట్ కలెక్టర్( ఆసరా మరియు సంక్షేమం) గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ జి. సూర్య, డి ఆర్ ఓ గాయత్రి దేవి, వెన్యూ సూపర్వైజర్లు, అసిస్టెంట్ వెన్యూ సూపర్వైజర్లు, రూట్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు, లోకల్ ఇన్స్ పెక్టింగ్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో గ్రామసచివాలయ కార్యదర్శి ఆడిన దొంగతనం నాటకంతో ఉన్న వాలంటీర్ గిరీ శాస్వతంగా పోగొట్టుకున్నాడు. ఈ విషయం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతుంది. ప్రతి నెల ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసే పెన్షన్ డబ్బులను స్వాహా చేసేందుకు ప్రయత్నించిన మడకశిర మున్సిపాలిటీ లోని శివపురం వార్డు సచివాలయం వాలంటీర్ ఈరప్ప ను ఉద్యోగం నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు. గురువారం ఉదయం ప్రతి నెలా మాదిరిగానే మడకశిర మున్సిపాలిటీలోని శివపురం వార్డు సచివాలయం పరిధిలో పెన్షన్ డబ్బులు పంపిణీ చేసేందుకు 43,500 రూపాయలను వార్డు వాలంటీర్ ఈరప్ప కు అందజేయగా, అతను మార్గమధ్యంలో ఎవరో కళ్లలోకి కారంకొట్టి డబ్బులు తీసుకెళ్లారని ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ చేయగా వాలంటీర్ కావాలని అసత్యాలు చెప్పినట్లు, కట్టుకథ అల్లినట్లు తేలడంతో అతన్ని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున కు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
తిరుపతి కేంద్రంగా అక్టోబరు 4న జరగనున్న యుపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు కేంద్రాల ఐడీలను అధికారులు ప్రకటించారు...ఈ విధంగా 50001 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- ఎ) - 576 మంది అభ్యర్థులు, 50002 – శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50003 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల (వింగ్- ఎ) – 576 మంది అభ్యర్థులు, 50004 – శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల (వింగ్- బి) – 576 మంది అభ్యర్థులు, 50005 – శ్రీ పద్మావతి ఉన్నత పాఠశాల, బాలాజీ కాలనీ – 480 మంది అభ్యర్థులు, 50006 – ఎస్వీ యునివర్సిటి క్యాంపస్ హైస్కూల్ – 480 మంది అభ్యర్థులు, 50008 – ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ – 576 మంది అభ్యర్థులు, 50015 – శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం – 576 మంది అభ్యర్థులు, 50007- ఎస్వీ యునివర్సిటి కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ – 576 మంది అభ్యర్థులు, 50009 –శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్ -576 మంది అభ్యర్థులు, 50025- కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ అండ్ కంప్యూటర్ సైన్స్ – 384 మంది అభ్యర్థులు, 50011- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ -ఎ) – 480 మంది అభ్యర్థులు, 50012- శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కాలేజీ (వింగ్- బి ) – 343 మంది అభ్యర్థులు , 50013- ఎస్వీ హైస్కూల్ – 27 మంది (స్క్రైబ్స్) అభ్యర్థులు పరీక్షలు వ్రాయనున్నారు.
ఈ సమీక్షలో మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ , డిఆర్ఓ మురళి, అడిషనల్ ఎస్.పి.సుప్రజ , ఎ సి కార్పొరేషన్ ఐడి రాజశేఖర్ నాయుడు, సిపిఓ ఆనంద నాయక్, నగరపాలక ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, పిడి మెప్మా జ్యోతి, డి.ఎస్.పి.నరసప్ప, ఏపీఎస్సి ఆర్టీసి మధుసూదన్, విద్యుత్ శాఖ లోకనాధ్ రావు, వెన్యూ సూపర్వైజర్లు ప్రకాష్ బాబు, సులోచనారాణి, మహాదేవమ్మ, బద్రమణి,పద్మావతమ్మ, వెంకటేశ్వర రాజు, కూల్లాయమ్మ , సావిత్రి , కృష్ణమూర్తి , శ్రీనివాసుల రెడ్డి, మధుసూధన రావు, ముణిరత్నం నాయుడు, సి. సూపర్ నెంట్ వాసుదేవ , డిటి రమేష్ బాబు, అధికారులు హాజరయ్యారు.
తిరుపతిలో ఈ నెల 4న ఆదివారం యూనియన్ పబ్లిక్ సెర్వీస్ కమీషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు తిరుపతి కేంద్రంగా 14 కేంద్రాలలో 6802 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పగఢ్భందిగా నిర్వహణ జరగాలని జిల్లా కలెక్టర్ డా.ఎన్. భరత్ గుప్త ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో యు.పి.ఎస్. సి పరీక్షల నిర్వహణపై యూపీ ఎస్సీ ఇంస్పెక్టింగ్ అధికారి న్యూఢిల్లీ ఉమేష్ పాల్ సింగ్, సంబంధిత అధికారులతో పరీక్షా కేంద్రాల సూపర్వైజర్లతో జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. సమావేశం ప్రారంభంలో పవర్ పాయింట్ ప్రజెంట్టేషన్ ద్వారా పరీక్షల నిర్వహణ ,చేపట్టవలసిన విధులపై అధికారులకు వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ, తిరుపతి కేంద్రంగా 14 సెంటర్లలో అక్టోబర్ 4న 6802 మంది అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్ కు హాజరు కానున్నారని 7 కేంద్రాలకు మదనపల్లె సబ్ కలెక్టర్ జాహ్నవి, మరో 7 కేంద్రాలకు అసిస్టెంట్ కలెక్టర్ విష్ణు చరణ్ ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందని అన్నారు. కస్టోడియన్ గా తిరుపతి ఆర్డీవో కనక నరసారెడ్డి వున్నారని, తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు 0877-2250201 చేశామని అభ్యర్థులు సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. డిఆర్వో సమన్వయ అధికారిగా వుంటారని తెలిపారు. కోవిడ్ కారణంగా పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక సానిటేషన్, మాస్కూలు అందుబాటులో ఉంచడం, వైద్య శిబిరాల ఏర్పాటు వంటివి సంబందిత వైద్య అధికారులు చేపట్టాలని సూచించారు. ప్రతి సెంటర్ వద్ద 5 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహణ ఉండేలా చూడాలని అన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలి ,పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని , ముందురోజు నుండే ఆర్ టి సి యాజమాన్యం అభ్యర్థులకు రవాణా సౌకర్యం పై దృష్టి పెట్టాలని, ఆటోల ఏర్పాటు కూడా కొవిడ్ నిబంధనల మేరకు చేపట్టాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో అనుభవం ఉన్న ఆఫీసర్లు ఇప్పటికే ఎన్నో పరీక్షలు నిర్వహించిన పేరు వుంది అప్రమత్తంగా వుండాలి అన్నారు. పాజిటివ్ వ్యక్తులు, సింటమ్స్ వ్యక్తులకు ప్రత్యేక గది, పిపి ఇ కిట్లు అందుబాటులో ఉండాలి, మునిసిపల్ అధికారులు అన్ని పరీక్ష కేంద్రాలు శానిటేషన్ చేపట్టాలి అన్నారు. తిరుపతి లో లాడ్జి లు, హోటల్స్ అభ్యర్థులకు ఆకామిడేషన్, ఫుడ్ అందుబాటులో ఉండేలా సూచనలు ఇవ్వాలని సూచించారు.
యూపీఎస్సీ ఇంస్పెక్టింగ్ అధికారి ఉమేష్ పాల్ సింగ్ వివరిస్తూ ఇప్పటికే అభ్యర్థులకు హాల్ టికెట్ లు, పరీక్షా సమయం, కేంద్రాలలో పాటించాల్సిన నిబందనలు అభ్యర్థులకు అందాయని సూచించారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు, ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి తమ వెంట పరీక్షా కేంద్రానికి తీసుకురావాలని, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి లేదని తెలిపారు. పరీక్షల నిర్వహణ సమయం ఉదయం 9:30 - 11:30 , మద్యాహ్నం 2:30 నుంచి 4:30 గంటల మధ్య రెండు పేపర్ లు ఉంటాయని, అర్థ గంట ముందుగా పరీక్షా కేంద్రాల మెయిన్ గేట్ మూసివేస్తారని, 10 నిమిషాలు ముందుగానే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలలోకి వెళ్లాలని ఆ పై అనుమతి ఉండదని తెలిపారు. ఇన్విజీలేటర్లకు కూడా పరీక్షా కేంద్రాల్లో సెల్ ఫోన్ అనుమతి వుండదని తెలిపారు.
చిత్తూరు జిల్లాలో అక్టోబర్ 02 గాంధీ జయంతి రోజున రాత్రి 7 గం.లకు సచివాలయ ఉద్యోగులను చప్పట్లతో అభినందించే కార్యక్రమంను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్తా అధికారులు, ప్రజలను కోరారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించి అక్టోబర్ 02 తో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా సచివాలయ ఉద్యోగులను అభినందించేందుకు ప్రజలందరూ రాత్రి 07 గం.లకు ఇంటి బయట చప్పట్లతో అభినందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించిన సచివాలయ పని తీరును భారత ప్రధాని నరేంద్ర మోడి కూడా అభినందించారని తెలిపారు. ఈ కార్యక్రమం కు సంబంధించి జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ప్రజలందరూ భాగస్వాములై చప్పట్లతో వారి పని తీరును అభినందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా గురుకుల పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల నిమిత్తం లాటరీ ద్వారా చేపట్టిన సీట్ల ఎంపిక ప్రక్రియ గురువారంతో ముగిసింది. సెప్టెంబర్ 30న బాలురకు, అక్టోబరు 01న బాలికల ప్రవేశాలకు సీట్ల ఎంపిక ప్రక్రియను విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరయంలో నిర్వహించారు. సంయుక్త కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణిల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రక్రియ సజావుగా సాగినట్లు బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి, బీసీ కార్పొరేషన్ ఈడి నాగరాణిలు పేర్కొన్నారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి డి.కీర్తి వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఉన్న 10 బాలుర పాఠశాలల్లో సీట్లకు మొదటి రోజు ఎంపిక చేపట్టగా గజపతి నగరం, కారాడ, కురుపాం, విజయనగరంలోని పాఠశాలల్లో మొత్తం 280 సీట్లకు గాను 558 దరఖాస్తులు వచ్చాయని 266 మందికి అవకాశం కల్పించామని వివరించారు. రెండో రోజు గురువారం మొత్తం అయిదు పాఠశాలల్లో ఉన్న మొత్తం 320 సీట్లకు గాను 521 దరఖాస్తులు రాగా 305 మంది బాలికలకు చోటు లభించిందని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది ప్రవేశాలకు అధిక మొత్తంలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడం హర్షణీయమని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఆశించిన మేరకు విద్యార్థుల నుంచి స్పందన రావడం సంతోషకరమని అభిప్రాయపడ్డారు. గురుకుల కార్యదర్శి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సెలెక్ట్ కమిటీ కన్వీనర్, నెల్లిమర్ల కస్తూర్బా కళాశాల ప్రిన్సిపాల్ డి.సత్యారావు, కమిటీ సభ్యులు ఎం.పెంటయ్య, జి. పురుషోది, యు.వి. కె. పాత్రో, కె.ఈశ్వరరావు, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భోగాపురం ఎయిర్ ఫోర్టు భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత నిచ్చి పనులు వేగవంతమయ్యేలా చూడాలని జిల్లా కలక్టరు డా. ఎం. హరి జవహర్ లాల్ అధికారులను ఆదేశించారు. గురువారం సంయుక్త కలక్టరు డా. జి.సి. కిషోర్ కుమార్ తో కలిసి భోగాపురం ఎయిర్ ఫోర్టు, తోటపల్లి, తారక రామ తీర్ధసాగర్, వెంగళరాయ సాగర్ తదితర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణపై సమీక్షించారు. భోగాపురం ఎయిర్ ఫోర్టుకు సంబంధించి గత వారం రోజుల్లో చేసిన పనులపై ఉప కలక్టరు వారీగా, గ్రామం వారీగా సమీక్షించారు. పనుల్లో ఆశించిన ప్రగతి జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అవాంత రాలను అధిగమించి ఎయిర్ ఫోర్టు భూసేకరణ అత్యంత వేగంగా జరపాలని ఆదేశించారు. ఇకపై ప్రతి రెండు రోజులకు సమీక్షిస్తానని, పురోగతి చూపని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ పూర్తయిన వాటికి అవార్డులు పాస్ చెయ్యాలని, తదుపరి బిల్లులను కూడా అప్ లోడ్ చెయ్యాలని ఆదేశించారు. కోర్టులలో ఉన్న కేసులు పరిష్కార మయ్యేలా వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలన్నారు. సమస్య ఉన్నచోట రైతులతో చర్చించి ప్రత్యామ్నాయాలను, పరిష్కార మార్గాలను చూపాలన్నారు. ఈ సమావేశంలో రెవిన్యూ డివిజనల్ అధికారి సిహెచ్. భవానిశంకర్, భూసేకరణ ఉప కలక్టర్లు జయరాం, వెంకటేశ్వర్లు, బాలా త్రిపుర సుందరి, సాల్మన్ రాజ్, సంబంధిత తహశీల్ధార్లు పాల్గొన్నారు.
అసలుసిసలు గ్రామ స్వరాజ్య వ్యవస్థ ఏర్పాటై ఏడాది పూర్తయ్యింది. జాతిపిత మహాత్మాగాంధీ జన్మదినోత్సవం రోజు అక్టోబరు 02 న గతేడాది రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభమయ్యింది. అంతకు కొద్దిరోజులముందు ఆగస్టు 15న వాలంటీర్ల సేవలు అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల ముంగిటి కే వచ్చి చేరాయి. వినూత్నంగా, ప్రయాగాత్మకంగా అమల్లోకి వచ్చిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. జిల్లాలో గత అక్టోబరు 2వ తేదీన 664 గ్రామ సచివాలయాలు, 114 వార్డు సచివాలయాలు ప్రారంభమయ్యాయి. వీటి ద్వారా సుమారు 500కు పైగా ప్రభుత్వ సేవలన్నీ ప్రజల చెంతకు చేరాయి. మరిన్ని సేవలు త్వరలో అందనున్నాయి. గతంలో ఏ ప్రభుత్వ సేవ కోసమైనా మండల కేంద్రాల్లోని తాశీల్దార్ కార్యాలయాలకు, మీ- సేవా కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పడు గ్రామంలోనే సచివాలయం ఏర్పాటు చేయడంతో, ప్రజలు ఊరు దాటాల్సిన పని లేకుండా పోయింది. ప్రతీ సచివాలయంలో గ్రామ కార్యదర్శి, మహిళా పోలీసు, వెల్ఫేర్ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, హార్టీ కల్చర్ అసిస్టెంట్, ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్, ఎఎన్ఎం తదితర దాదాపు 12 మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవలందిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రం, అడంగల్ కాపీ, పుట్టిన రోజు ధృవీకరణ పత్రం తదితర ఎన్నో రకాల పత్రాలు పొలిమేర దాటకుండానే పొందే అవకాశం కలిగింది. ఇప్పుడు అన్ని సచివాలయాలకూ సొంత భవనాలు శరవేగంగా, ఆధునిక హంగులతో నిర్మితమవుతుండటం, ఈ వ్యవస్థ అమలుపట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్దికి నిదర్శనంగా పేర్కొనవచ్చు. జిల్లాలో సచివాలయ వ్యవస్థ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. సేవలను అందించడంలో రాష్ట్రంలోనే నెంబరు 1గా నిలిచింది. ఇప్పటివరకు 4,74,025 దరఖాస్తులు సచివాలయాలకు అందగా, వీటిలో 3,91,301 పరిష్కరించడం ద్వారా, 86.52శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. జిల్లాకు మొదటి ఫేజ్‌లో 5,432 మంది సచివాలయ సిబ్బందిని నియమించారు. తాజాగా 1,134 ఖాళీలకు ఇటీవల భర్తీ ప్రక్రియ చేపట్టగా, 45,475 మంది దరఖాస్తు చేసుకున్నారు. అలాగే తొలిదశలో 10,973 మంది గ్రామ వాలంటీర్లు, 2,127 మంది వార్డు వాలంటీర్లను నియమించారు. వాలంటీర్ల ఖాళీలను కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేస్తున్నారు.
వాలంటీర్లయితే గ్రామానికి తలలో నాలుకలా మారారు. గ్రామాల్లో ప్రతీ 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతీ వంద ఇళ్లకూ ఒక వాలంటర్‌ను నియమించారు. వీరంతా ప్రజల ఇళ్లవద్దకే వెళ్లి సేవలందిస్తున్నారు. ప్రతీనెలా ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ సేవలన్నీ నిర్ణీత కాలవ్యవధిలో ఇంటివద్దనే అందజేస్తున్నారు. గతంలో రేషన్ కార్డు కోసం ఏళ్లతరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కేవలం ధరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే అర్హులైన వారందరికీ బియ్యం కార్డులు అందుతున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డును ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపించింది. వైఎస్ఆర్ బీమా కార్డు కూడా ఇంటికే వచ్చింది. తరచూ వాలంటీర్లు ఇళ్లవద్దకు వెళ్లి, వారి ఆరోగ్య పరిస్థితిని సైతం వాకబు చేస్తున్నారు. దీంతో గ్రామ సచివాలయ వ్యవస్థ సామాన్యులకు గొప్ప సంతృప్తిని ఇస్తుండగా, ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశాన్ని తమకిచ్చినందుకు సచివాలయ సిబ్బంది నుంచీ, వాలంటీర్ల నుంచి ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి పట్లా కృతజ్ఞతా భావం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బిఈడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ 2020 ప్రవేశ పరీక్ష గురువారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం సెట్ కోడ్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాలలో ఏర్పాటు చేసిన 50 పరీక్ష కేంద్రాలలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఆన్‌లైన్‌లో పరీక్షను నిర్వహించారు. పరీక్షకు 15,658 మంది దరఖాస్తు చేయగా 10,363మంది హాజరవగా 5296 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. పరీక్షకు హాజరైనవారి శాతం 66.18 గా నమోదయింది. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.శివ ప్రసాద్ తెలిపారు. ఉదయం నిర్వహించిన సెట్ కోడ్ ఎంపికలో వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, కన్వీనర్ ఆచార్య ఆర్.శివ ప్రసాద్, ఆచార్య టి.షారోన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం భౌతికంగా మన ముందు లేనప్పటికీ ఆయన ప్రతిరూపం కళాకారుల మదిలో చిరస్మరణీయంగా ఉంటుందని.. మహో న్నత వ్యక్తి యొక్క విగ్రహాన్ని తొలిసారిగా తాను మలిచానని అంతర్జాతీయ తొలి తెలుగు మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్ అన్నారు. గురువారం ఆమె ఈఎన్ఎస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.. ఇప్పటికే పలు జిల్లాల నుండి బాల సుబ్రహ్మణ్యం విగ్రహాలు తయారు చేయమని అడిగారని వారందరికీ త్వరలోనే బాలువిగ్రహాలు అత్యద్భుతంగా మలిచి అందజేస్తానని దేవికారాణి అన్నారు. బాలసుబ్రమణ్యం తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ తన తండ్రి ఉడయార్ తాను తయారు చేసిన ఘంటసాల విగ్రహాలను తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఎస్పీ బాలసుబ్రమణ్యం చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం అభిమానులకు శిష్యులకు కోరుకున్న వారికి బాల సుబ్రహ్మణ్యం యొక్క ఆరంగుళాల ప్రతిమలను తయారుచేసి అందించగలరని దేవికారాణి అన్నారు. ఇటువంటి కళాకారుడు మరల మనకు దొరకక పోవచ్చు అని ఘంటసాల తర్వాత అంతటి వైభవం సంతరించుకున్న బాలసుబ్రమణ్యం మృతికి తన ప్రగాఢ సంతాపాన్ని దేవికారాణి ఉడయార్ తెలియజేశారు.