ఆంధ్రవిశ్వవిద్యాలయంలో పనిచేయడం పెద్ద వరమని ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య పి.బాబి వర్థన్ అన్నారు. బుధవారం ఉదయం ఏయూ జర్నలిజం విభాగంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ ఆత్మీయ సత్కార సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుటుంబం చాలా పెద్దదని, నా వద్ద చదువుకున్న ప్రతీ విద్యార్థి తన కుటుంబంలో భాగమేనన్నారు. అక్షరాన్ని నమ్ముకుని తాను జీవించారన్నారు. అక్షరాన్ని గౌరవిస్తానన్నారు. ఏయూ జర్నలిజం విభాగంలో ఆరంభ అధ్యాపకునిగా తాను చేరడం తన అద్రుష్టమన్నారు. తనకు స్నేహితులే ఆత్మబంధువులన్నారు. కష్టించడానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. శ్రీశ్రీ, ఆత్రేయ, జాలాది వంటి వారితో పరిచయాలు గుర్తుచేసుకున్నారు. ధైర్యంగా, స్థిరంగా తన భావాలను చెప్పడం చిన్నతనం నుంచి తనకు అలవాటన్నారు. కవితలు, సినీ గీతాలు, రచనలు చేసిన సందర్భాలను వివరించారు. క్రమశిక్షణతో పెరిగిన జీవనం, చదవుకునే సమయంలో ఎదురైన సందర్భాలు గుర్తుచేసుకున్నారు. విభాగాచార్యులు డి.వి.ఆర్ మూర్తి మాట్లాడుతూ పదవీ విరమణ జీవితం ప్రశాంతంగా, ఆనందంగా సాగాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆచార్య బాబి వర్ధన్‌తో తనకు 36 సంవత్సరాల అనుబంధం ఉందన్నారు. విద్యార్థులుగా, సహోద్యోగులుగా ఈ అనుబంధం కొనసాగిందన్నారు. పుస్తకాలే తమకు నిజమైన సంపదగా నిలచాయన్నారు. కార్యక్రమంలో ఆచార్య చల్లా రామక్రిష్ణ ప్రసంగించారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా డాక్టర్ జి.కె.డి ప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో డాక్టర్ కె.రామచందర్, డాక్టర్ నిర్మల తదితరులు పాల్గొన్నారు. విభాగ విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులు హాజరై ఆచార్య బాబి వర్ధన్ దంపతులను సత్కరించారు.
విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను నియంత్రించే దిశగా నిపుణులు పనిచేయాలని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్(ఎన్‌ఐడిఎం) సంయుక్తంగా నిర్వహించిన ‘ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇన్ రెసిలియంట్ ఇన్‌ఫాస్ట్రక్చర్’ ఆన్‌లైన్ వెబినార్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ హుద్‌హుద్ అనంతరం విశాఖ నగరంలో జరిగిన నిర్మాణాలలో తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను వివరించారు. ఐఐటి మద్రాసు ఆచార్యులు సి.వి.ఆర్ మూర్తి ఎర్త్‌క్వేక్ రిసెస్టెంట్ ఇన్‌ఫాస్ట్రక్చర్, ఐఐఎస్‌సి బెంగళూరు ఆచార్యలు ప్రదీప్ ముజుబ్‌దార్ అర్బన్ ఫ్లడ్స్- ఏన్ ఇవాల్వింగ్ చాలెంజెస్’ అంశంపై ప్రసంగించారు. కార్యక్రమంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, సదస్సు కన్వీనర్ ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ అమీర్ ఆలీ ఖాన్, విభాగాధిపతి ఆచార్య టి.వి ప్రవీణ్, ఆచార్య డి.ఎస్.ఆర్ మూర్తి తదితరులు ప్రసంగించారు. సదస్సుకు 300 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో చేపడుతున్న కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రంకు సంబంధించిన ఉద్యాన పంటలు, ఇతర మొక్కలకు సంబంధించిన లెక్కింపును త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కొవ్వాడ ప్రోజెక్టుకు సంబంధించిన భూసేకరణ మరియు ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం భూసేకరణకు సంబంధించిన భూములలోని ఉద్యాన పంటలకు సంబంధించి ఉద్యాన శాఖ మరియు ఇతర పంటలకు సంబంధించిన విలువలను అటవీశాఖ అధికారులు త్వరితగతిన లెక్కింపు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గ్రామాల వారీగా ఎంత విస్తీర్ణంలో ఉద్యాన పంటలు ఉన్నాయో సవివరంగా ఉండాలని ఆయన స్పష్టం చేసారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం అదనపు సి.ఇ బంగారు శెట్టి మాట్లాడుతూ టౌన్ షిప్ కోసం 350 ఎకరాలు, ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణానికి 213 ఎకరాలు అవసరమని జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖాధికారి సందీప్ కృపాకర్ గుండాల, జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, రెవిన్యూ డివిజనల్ అధికారి ఐ. కిషోర్, కొవ్వాడ యూనిట్ ప్రత్యేక ఉపకలెక్టర్ బి.శాంతి, సర్వే మరియు భూరికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకర్, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కార్యనిర్వాహక ఇంజినీర్ దేవర, రణస్థలం తహశీల్దార్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ 33 వేల కోట్లకి తగ్గించటం దారుణమని సామాజిక ఉద్యమ నాయకులు తురగా శ్రీరామ్ విమర్శించారు. పోలవరాన్ని రక్షించాలంటూ విశాఖలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ, పోలవరం నిర్వాసితులకు ఇచ్చే ఆర్ & ఆర్ ప్యాకేజీ లోనే 8 వేల కోట్ల మేరకు కోత విధించటం చాలా అన్యాయ మన్నారు. దీనివల్ల నిర్వాసితులకు తీరని అన్యాయం జరుగుతుందని, పోలవరం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేంద్రం ఉత్తరాంధ్రులకు కోలుకోలేని దెబ్బకొట్టాలనే ఈవిధమైన చర్యలకు పాల్పడుతుందని తీవ్రంగా ఆరోపించారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా.. ఉత్తరాంధ్ర కి తీరని అన్యాయం చేస్తూనే వస్తున్నారని... గతంలో రెండు సంవత్సరాలు అధ్యయనం చేసి పోలవరం అధారిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్ లు 55,548 కోట్లకు పోలవరం రివైజ్డ్ అంచనా వ్యయాన్ని ఆమోదించాయనే విషయాన్ని గుర్తుచేశారు. అలాంటిది ఇప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఈ మొత్తంలో కోత విధించటంతో అసలు పోలవరం పూర్తి చేసే ఉద్దేశ్యం కేంద్రానికి ఉందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక గత చంద్రబాబు ప్రభుత్వంలో పోలవరం పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపించటం,రివర్స్ టెండర్లు అంటూ హడావుడి చేయడం కూడా కేంద్ర నిర్ణయానికి కారణం అయ్యాయని ఆయన ఆరోపించారు. కానీ పోలవరం పనుల్లో అవినీతిని జగన్ ప్రభుత్వం నిరూపించలేకపోయిందని,కేంద్రం కూడా ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పిందన్నారు. పోలవరం నిధుల కోతలకి వ్యతిరేకంగా కేంద్రం మీద పోరాడాల్సింది పోయి, వాళ్ళ కాళ్ళ దగ్గర జగన్ ప్రభుత్వం మోకరిల్లిందని ఆయన విమర్శించారు. జగన్ అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితులకు ఎకరాకి 11,52,000 నష్ట పరిహారం ఇస్తామని, ఇల్లు కోల్పోయిన వారికి 3 లక్షలు, కొత్తగా ఇల్లు కట్టుకునేవారికి 3లక్షల15వేలు, ఒక్కో కుటుంబానికి 7 లక్షలు నష్ట పరిహారం ఇచ్చి, పునరావాస కాలనీల్లో 24 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారని తగ్గించిన వ్యయంతో ఇపుడేం చేస్తారని ప్రశ్నించారు. ఈ ఆగస్టు 15 నాటికి 16000 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తామని జగన్ చెప్పారని,అది జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం కారణంగా 200 గ్రామాల్లో 50 వేల కుటుంబాలు,2లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అయ్యారన్న ఆయన ఇందులో సగం మంది గిరిజనులే ఉన్నారని, వీరికి న్యాయం జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు గట్టి పోరాటాలకు సిద్ధం కావాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.
శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం సేకరణలో తేడాలు రాకూడదని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం మిల్లర్ల తో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. ధాన్యం సేకరణకు ముఖ్యమంత్రి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని కలెక్టర్ అన్నారు. ధాన్యం సేకరణలో తేడాలు వచ్చినా, రైతులకు ఇబ్బందులు కలిగినా కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లాలో 27 శాతం మేర వర్షపాతం తక్కువగా ఉందని, దాదాపు 20 మండలాలలో కరువు ఛాయలు ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమయంలో ఎటువంటి సమస్యలు ఉండరాదని పేర్కొన్నారు. మిల్లులు సార్టెక్స్ కు పెట్టుకోవాలని సూచించారు. బియ్యంలో నూకలు ఎక్కువగా ఉంటున్నాయని ఫిర్యాదులు రావడంతో 1075 రకం విత్తనాలు వేయలేదని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలు ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం సూచించిన విధంగా నిబంధనలు పాటించాలని ఆయన స్పష్టం చేసారు. సేకరణకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన ఆదేశించారు. సార్టెక్స్ లో ఎటువంటి సమస్య ఉండరాదని ఆయన స్పష్టం చేసారు. జిల్లాలో పండిన పంటకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. మిల్లర్లకు సమస్యలు రాకుండా సహకారం అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లాలో తగినంత నిల్వ సామర్థ్యం ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా మిల్లర్ల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు(వాసు) మాట్లాడుతూ గత ఏడాది 60 మిల్లులు సార్టెక్స్ మిల్లులుగా పెట్టుకున్నాయని, ఈ ఏడాది మొత్తం 125 మిల్లులు సార్టెక్స్ కు రానున్నాయని చెప్పారు. జిల్లాలో గిడ్డంగి సమస్య గత ఏడాది తలెత్తిందని, తద్వారా ఉత్పత్తికి తగిన విధంగా నిల్వ సామర్థ్యం ఉండాలని కోరారు. రుణ సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. నాలుగు నెలలలో 3 లక్షల టన్నుల మేర సార్టెక్స్ బియ్యం అందించగలమన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఏ.కృష్ణా రావు, డి.ఎస్.ఓ వెంకట రమణ, వ్యవసాయ శాఖ డిడి రాబర్ట్ పాల్, మార్కెటింగ్ ఎడి బి.శ్రీనివాసరావు, మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.
అన్నీఉన్నా అల్లుడి నోట్లో శని అన్నచందంగా మారింది రాష్ట్రంలోని గ్రామసచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల పరిస్థితి... పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నారు.. అన్నిశా ఖల అధికారులు ఉన్నారు..ప్రభుత్వం పూర్తిస్థాయిలో అధికారాలు ఇస్తూ 149 జీఓ జారీచేసింది...కానీ ఆ జీఓని జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీ ఓలు, సచివాయాల స్థాయిలో ఈఓపీఆర్డీలు అమలు చేయకపోవడం వలన కొత్త కార్యదర్శిలంతా అధికారాలు బదాలయింపులు జరగక సచివాలయాల్లో ఉత్సవ విగ్రహాల్లా ఉన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వం ద్రుష్టికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు పేరిట ఈఎన్ఎస్ లైవ్ దారావాహికం మొదలు పెట్టి...లోపాలను తెలియజేస్తూ వార్తలతో చైతన్యం తీసుకు వస్తోంది.. విశేషం ఏంటేంటే సాక్షాత్తూ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కలెక్టర్లు, జెసీలు, డిపిఓలు గ్రామసచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలని ఆదేశించిన తరువాత, సచివాలయాలకు వెళ్లే జిల్లా కలెక్టర్లు, జెసిలు విధులు బాగా నిర్వర్తించాలని, ప్రజలకు తెగ సేవలు చేసేయాలని సచివాలయాల్లో సిబ్బందిని హెచ్చరించి వస్తున్నారు తప్పితే... ప్రభుత్వం కార్యదర్శిలకు విధులు, డిడిఓ అధికారాలు అప్పిగించాలని ఇచ్చిన 149 జీఓని ఎందుకు అమలు పరచలేదని ఇటు డిపీఓలనుగానీ, అటు ఎంపీడీఓలను గానీ, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లిన తరువాత అక్కడి ఈఓపీఆర్డీలు, సీనియర్ కార్యదర్శిలను గానీ ప్రశ్నించడం లేదు. అధికారాల బదాలయింపులు గ్రేడ్-5 కార్యదర్శిలకు జరగగకపోతే, వాళ్లు ప్రజలకు ఏం సేవలు చేస్తారనే ప్రధాన సమస్యపు పరిష్కరించకుండా జిల్లాస్థాయి అధికారులు సైతం వ్యవహరించడంతో జీఓఎంఎస్ నెంబరు 149 రాష్ట్రంలోని గ్రామసచివాలయాల్లో అమలు కాలేదు. రాష్ట్రంలో కొన్నిజిల్లాల్లో జీఓనెంబరు 149ని తక్షణమే అమలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకు, ఈఓపీఆర్డీలకు, సీనియర్ కార్యదర్శిలకు మెమోలు జారీచేసినా నేటికీ వాటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. విచిత్రం ఏంటంటే ప్రభుత్వం గ్రామసచివాలయాలకు ఒక ప్రభుత్వశాఖను రూపొందించి, వారికోసం జిల్లాల్లో ప్రత్యేక జాయింట్ కలెక్టర్లను నియమించిన తరువాత సైతం వారు కూడా ఈ జీఓ అమలుపై చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తమ అధికారారాలు తమకు ప్రభుత్వ ఆదేశాల మేరకు బదలాయిస్తే...ప్రజలకు తాము సేవలు చేయడానికి సిద్ధంగా వున్నమంటూ, గ్రేడ్-5 కార్యదర్శిలు జిల్లా పంచాయతీ అధికారులకు మొరపెట్టిన తరువాత ఇచ్చిన మెమోలు సచివాలయాల్లో నేటికీ అమలు కాకపోవడానికి ప్రధాన కారణం ఎంపీడీఓలనే తెలుస్తుంది. ఎందుకంటే జిల్లా పంచాయతీ అధికారి మెమో జారీ చేసిన తరువాత మండల స్థాయిలోనూ, సచివాలయ స్థాయిలోనూ సదరు జీఓను, మెమోను అమలు చేసే బాధ్యత ఎంపీడీఓలదే. కానీ సీనియర్ పంచాయతీ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీల ఒత్తిళ్లకు తలొగ్గిన ఎంపీడీఓలు ఆ మెమోను బుట్టదాఖలు చేయడంతో సచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు లేకుండా పోయాయి. ఈ జీఓ అమలు కావాలంటే ఇపుడు ప్రధానంగా గ్రామసచివాలయ జాయింటు కలెక్టర్లు గానీ, జిల్లా కలెక్టర్లు గానీ రంగంలోకి దిగితే తప్పా ఈ జీఓ నెంబరు 149 గ్రామసచివాలయాల్లో అమలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే డిపీఓని కలిసి తమ అధికారాల కోసం అర్జీ చేసిన కార్యదర్శిలు జిల్లా కలెక్టర్ ను కలిసిన తరువాతైనా వారి అధికారాలు బదాలయింపు జరుగుతుందో లేదంటే...సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీల ఒత్తిళ్లకు తలొగ్గి..జీఓనెంబరు 149 ను కాలగర్భంలోకి కలిపేస్తారో, ఇంతకాలం ప్రభుత్వ జీఓని అమలు చేయకుండా తొక్కిపెట్టి వారిపై చర్యలు తీసుకొని గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాల బదలాయింపులు చేస్తారా అనేది వేచిచూడాలి.. అధికారాల కోసం సీనియర్, జూనియర్ కార్యదర్శిల మధ్య గొడవలు..ఆ విషయాలు గ్రామసచివాలయాల్లోని ఉత్తుత్తి కార్యదర్శిలు-5లో తెలుసుకోవచ్చు..!
మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలోని అభివ్రుద్ధికి నోచుకోని ప్రాంతాలను గుర్తించి అక్కడ మౌళిక సదుపాయాలు కల్పించాలని జివిఎంసి కమిషనర్ డా.స్రిజన అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని వెలంపేట ప్రాంతాన్ని ఆమె అధికారులతో కలిసి సందర్శించి స్థానికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అక్కడ ప్రజలు పలు సమస్యలను కమిషనర్ ద్రుష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారులతో మాట్లాడుతూ, మాష్టర్ ప్లాన్ కు అనుగుణంగా రహదారులు, డ్రైనేజి, మంచినీటి సౌకర్యం వసతి సౌర్యాలపై వెనుకబడిన ప్రాంతాలను అధ్యయనం చేసి అభివ్రుద్ధి పనులకు కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ మేరకు ఆ అంశాన్ని సిసిపి విద్యుల్లతకు అప్పగించారు. అంతేకాకుండా జివిఎంసీలో అన్ని జోన్ల పరిధిలోని ప్రాంతాలను జెడ్సీలు స్వయంగా పరిశీలించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని కూడా కమిషనర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆయా జోన్ల ఏసీపిలు పాల్గొన్నారు.
మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్ అంటూ రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరిస్తూ, కోవిడ్ 19 నేపథ్యంలో వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, డాక్టర్లు, సిబ్బంది, కార్మికులు నిస్వార్థ సేవలు అందించారని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ ఐ సి భవనం లో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన "మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్" అనే పోస్టర్ లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ 19 సమయంలో రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, గ్రామ/ వార్డు సచివాలయాల అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు చూపిస్తున్న నిబద్ధత కు ధన్యవాదాలు తెలిపారు. కష్టకాలంలో మీ నిస్వార్ధమైన సేవ ప్రజలను కోవిడ్ నుంచి సురక్షితంగా ఉంచుతోందన్నారు. కోవిడ్ నియంత్రణ చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా గౌరవాన్ని, మద్దతు తెలియజేస్తున్నామన్నారు. కోవిడ్ నేపథ్యంలో డాక్టర్లు చూపించిన నిబద్ధతకు ధన్యవాదాలని, డాక్టర్లు అందించిన వైద్య సేవలు, శ్రమ ఎన్నో ప్రాణాలను రక్షించినట్లు తెలిపారు. అలాగే ఆశ, అంగన్వాడీ వర్కర్లు, ఎఎన్ఎంలు, స్టాఫ్ నర్సు లు కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కూడా ప్రతి గర్భిణికి మరియు పిల్లలకు సేవలు అందించి వారి బాగోగులు చూసుకున్నారన్నారు. గర్భిణీలకు అవసరమైన సేవలు అందించడం చాలా కఠిన మని, వారికి అవసరమైన అన్ని ఏఎంసి పరీక్షలు, సేవలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలోని వీధులను, పట్టణాలను శుభ్రంగా ఉంచినందుకు, ప్రతి ఇంటిలోనూ చెత్తను సేకరించి రీసైక్లింగ్ కేంద్రాలకు తరలించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
"మీరే కోవిడ్ 19 సూపర్ స్టార్స్" అనే పోస్టర్ లను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని గ్రామ /వార్డు సచివాలయాలు, అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీ లు, మండల స్థాయి కార్యాలయాలకు తరలించి ఈ పోస్టర్లను ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి)ఏ.సిరి, జాయింట్ కలెక్టర్(ఆసరా మరియు సంక్షేమం)గంగాధర్ గౌడ్, అసిస్టెంట్ కలెక్టర్ జి.సూర్య, అడిషనల్ డిఎంఅండ్హెచ్ఓ పద్మావతి, ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ నీరజ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రామస్వామి నాయక్, డెమో లక్ష్మీ నరసమ్మ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షన్ కు ఇప్పటి నుంచే ఒక పద్ధతి ప్రకారం ప్రణాళిక సిద్ధం చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. మంగళవారం తూకివాకం లో జరుగుతున్న పనులు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుడూ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ లో కొత్తగా రెండు ప్లాట్ ఫారం లు, రోడ్డులు జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం పెంచాలన్నారు. ఇక్కడ త్వరగా పనులు పూర్తి చేస్తే ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. డిబిఆర్ ఆసుపత్రి నుండి రేణిగుంట హీరో హోండా షోరూం వరకు రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలియజేశారు. కరకంబాడి రోడ్డు లోని హోటల్ గెస్ట్ లైన్ డేస్ నుండి కొత్తపల్లి మీదుగా రేణిగుంట రోడ్డు వేయనున్న రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి 15 రోజుల్లో మట్టి పనులు పూర్తి పూర్తిచేయాలని అదికారులను ఆదేశించారు. కొంతమంది రైతులు వ్యతిరేకించిన పని జరిగే జరుగుతుందని వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రజల సౌకర్యార్థం కరకంబాడి మార్గం నుండి రేణిగుంట మార్గం కు అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన 60 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్డు వల్ల టిడిఆర్ బాండ్లు తోపాటు మీ భూములు విలువ పెరుగుతుందని ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డిప్యూటీ అసిస్టెంట్ సిటీ ప్లానర్ దేవి కుమారి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,డిఈ విజయ్ కుమార్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు గోవర్ధన్, చెంచయ్య, సర్వేయర్లు దేవానంద్, ప్రసాద్, స్మార్ట్ సిటి ఎయికాం బాలాజీ, రైతులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుని ఎన్నిక చెల్లుబాటుకాదని జిల్లా ట్రెజరీ అధ్యక్షులు, కార్యదర్శులు యం.భాగ్యలక్ష్మీ, యస్.సురేష్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27న విజయవాడలో జరిగిన ఏ.పి.టి.యస్.ఏ, అమరావతి రాష్ట్ర అధ్యక్షునిగా పేర్కొనబడిన జి.రవికుమార్ ఎన్నిక చెల్లదని అన్నారు. జి.రవికుమార్ ఏ.ఏ.ఓగా నెల రోజులు ఉద్యోగ బాధ్యతలను నిర్వహించి తదుపరి రివెర్సన్ తీసుకున్నారని, ఏ.ఏ.ఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఏ.పి.టి.యస్.ఏ లో ప్రాథమిక సభ్యత్వం కోల్పోవడం జరుగుతుందని అన్నారు. పదవీ వ్యామోహంతో అధ్యక్షునిగా ప్రకటించుకోవడం సమంజసం కాదని, ఇది ట్రెజరీ ఉద్యోగులను అయోమయానికి గురిచేయడం తగదని చెప్పారు. ఈ నెల 20న విజయవాడ యన్.జి.ఓ హోమ్ లో జరిగిన సంఘ సమావేశంలో ఏ.పి.టి.యస్.ఎ బైలా ప్రకారం పి.శోభన్ బాబు గారిని ఏ.పి.టి.యస్.ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగిందని, దీనికి 9 జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల మద్దతు ఉందని స్పష్టం చేసారు. అపరిష్కృతంగా ఉన్న ట్రెజరీ ఉద్యోగుల సమస్యలు, అసంపూర్తిగా ఉన్న భవనాలు పూర్తిచేయుటకు అవసరమైన చోట నూతన భవనాలు మంజూరు విషయమై నూతన అధ్యక్షుడిగా పి.శోభన్ బాబుతో కలిసి పనిచేస్తామని జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి ఆ ప్రకటనలో వివరించారు.
తిరుపతిలో అక్టోబర్ 1 నుండి 14 వరకు జాతీయా కుష్టు నివారణ కార్యక్రమంలో భాగంగా లెప్రసి కేస్ డిడక్షన్ కాంపైన్ ఇంటింటి సర్వే ఆరోగ్య కార్యకర్తలు చేపట్టను న్నారని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ డి.ఎం.హెచ్.ఓ. డా. అరుణ సులోచన దేవి అన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక రుయా ఆసుపత్రి ఆవరణలో తన చాంబర్ నందు ఎ పి ఎం లు, డిపిఎం లు , వైద్య సిబ్బంది తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ ఆలోచనా దేవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుష్టు వ్యాధి లక్షణాలు గల వ్యక్తులను గురించాలని ఇంటింటి సర్వే చేపట్టాలని సూచించారని తెలిపారు. మైక్రో బాకెటీరియం లెప్రే వలన వ్యాధి సోకే ప్రమాదం ఉందని అందుకే ఈ నెల 1 నుండి 14 వరకు చేపట్టే సర్వేలో వైద్య సిబ్బందికి సహకరించాలని అన్నారు. స్పర్శలేని మఛ్చలు, చర్మం మందం, కనుబొమ్మలు రాలిపోవడం , చేతి వేళ్ళు వంకరకావడం, కనురెప్ప లు మూతపడక పోవడం వంటి లక్షణాలు ఉంటే ఇంటింటి సర్వే లో తెలియజేయాలని, వైద్యులు వ్యాధి నిర్దారణ చేసిన పిదప లక్షణాలు ఉంటే వైద్యసిబ్బంది ప్రతి నెల ఇంటివద్దకే వచ్చి మందులు అందిస్తారని, వైద్య సేవలు, మందులు పూర్తిగా ఉచితం అని తెలిపారు. అనంతరం వ్యాది నిర్దారణ పోస్టర్ లను, కరపత్రాలను విడుదల చేసి ప్రతి ఇంటికి అందేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో డా.పెరోల్ యాదవ్, డా.రవికుమార్, లెప్రసి ఎరాడికేషన్ డి.పి.ఎం.లు, ఎ. పి.ఎం.లు పాల్గొన్నారు.
జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం(నేషనల్ లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాం)లో భాగంగా జిల్లాలో కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమాన్ని అక్టోబరు 1 నుండి 14 వరకు చేపట్టనున్నట్టు జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏ.ఎన్.ఎం., ఆశ లేదా వలంటీర్ తదితర ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కుష్టు వ్యాధి లక్షణాలు వున్న వారిని గుర్తిస్తారని చెప్పారు. రెండేళ్ల వయసు కంటే మించిన వారిలో చర్మంపై స్పర్శలేని మచ్చలు ఎవరికైనా వుంటే వాటిని కుష్టువ్యాధి లక్షణాలుగా భావించి తమ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వెళ్లి తనిఖీ చేయించుకొని ప్రాథమిక దశలోనే చికిత్స చేయించుకుంటే వ్యాధి సోకకుండా నిరోధించవచ్చన్నారు. జిల్లాలోని 19 మండలాలను కుష్టువ్యాధి అధికంగా వున్న మండలాలుగా గుర్తించామని, ఈ మండలాల్లో ఒకటిన్నర సంవత్సరాల పాటు ప్రతినెలా 16 నుండి 18వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఏక్టివ్ కేసుల గుర్తింపు కార్యక్రమాన్ని కూడా చేపడతామన్నారు. వ్యాధి ప్రభావం తక్కువగా వున్న మిగిలిన 14 మండలాల్లో ఒక ఏడాదిపాటు ఏక్టివ్ కేసులగుర్తింపు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కుష్టువ్యాధి గ్రస్తుల గుర్తింపు కార్యక్రమం(లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్)పై చర్చించే నిమిత్తం జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది ఈ కార్యక్రమానికి సహకరించాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.ఎస్.వి.రమణకుమారి, జిల్లా లెప్రసీ అధికారి డా.రవికుమార్, జిల్లాపరిషత్ సి.ఇ.ఓ. టి.వెంకటేశ్వరరావు, ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు డైరక్టర్ రాజేశ్వరి, ఆశ జిల్లా సమన్వయ కర్త బి.మహాలక్ష్మి, మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, మెప్మా పి.డి. సుగుణాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి పరిధిలో అన్ని వార్డులలో స్వచ్చ సర్వేక్షణ్ పై ప్రజారోగ్య సిబ్బంది దృష్టి సారించాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు ఆదేశించారు. మంగళవారం జివిఎం సి సమావేశం మందిరంలో సి.ఎం.ఓ.హెచ్., ఏ.ఎం.ఓ.హెచ్. లు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్ తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, 2021 నాటికి స్వచ్చ సర్వేక్షణ్ లక్ష్యంగా ఇప్పటి నుండే పనిచేయాలన్నారు. సచివాలయాలలో పెండింగు ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్లు, వార్డు శానిటరీ సెక్రటరీల సమన్వయంతో ప్రతీ వీధిని శుభ్రంగా ఉండేట్లు పని చేయించాలన్నారు. ప్రతీ ఇంటి నుండి తడి-పొడి చెత్త సేకరణతో పాటు తరలింపు ప్రక్రియపై శ్రద్ద చూపాలన్నారు. డస్ట్ బిన్ లు శుబ్రంగా ఉంచాలని, కొన్ని చోట్లు డస్ట్ బిన్ లు రిపేర్ అయినందున వాటిని వెంటనే గుర్తించి రిపేరు చేయించాలని ప్లాస్టిక్ డస్ట్ బిన్ లు మార్చాలని సంబందిత ఇంజినీరు అధికారులను ఆదేశించారు. కమర్షియల్, అపార్ట్మెంట్లలలో యూజర్ చార్జీలు వసూలు చేయాలన్నారు. కాలువలలో చెత్త పేరుకుపోకుండా చూడాలని పెద్ద కాలువలు ఉన్నచోటు ఇంజినీరింగ్ అధికారులతో కలసి పనిచేయాలని ఆదేశించారు. స్వచ్చ సర్వేక్షణ్ భాగంగా ఆన్ సైట్ కంపోస్టింగ్ 10% లక్ష్యంగా ఉండేలా పనిచేయాలని ఆదేశించారు. నైట్ స్వీపింగ్ సరిగా జరగలేదని ప్రతీ రోజూ ఒక అధికారి పర్యవేక్షణలో నైట్ స్వీపింగ్ జరిగేటట్లు ఉండాలన్నారు. సెంటర్ డివైడర్లో మట్టి ఎక్కువుగా ఉన్నందున, వీటిని రోడ్డు స్వీపింగు మిషన్ తో క్లీనింగ్ చేయించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి. శాస్త్రి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, నగరంలో ఉన్న దుఖాణాల నుండి ట్రేడ్ లైసెన్సు ఫీజులను నూరుకు నూరు శాతం వసూలు చేయాలని కొత్త దుఖాణాలను పరిశీలించి ట్రేడ్ లైసెన్సులు తప్పని సరిగా విధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఎం.ఓ.హెచ్. లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
ఖరీఫ్ లో పండించే ధాన్యం కొనుగోలుకు సిద్దంగా ఉండాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 2020-21కు సంబంధించి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం కొనుగోలుకు సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంట పండించే గ్రామాల జాబితా సిద్దం చేయాలని వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులను ఆదేశించారు. రైతులు తాము పండించే పంటను విక్రయించేందుకు తమ పేర్లను ఆన్ లైన్ లో నమోదు చేసుకుంటే ఏ ఏ తేదీలలో ధాన్యం కొనుగోలుకు వస్తారో తెలియజేస్తారన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి విధి విధానాలపై అధికారులతో చర్చించారు. రైతుల వద్దకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. వెలుగు సిబ్బంది, పిఎసిఎస్ గ్రూపులు వెళ్లి నాణ్యత, రికార్డ్స్, ప్రతీ రోజు రిపోర్టులు అందజేయాలని పేర్కొన్నారు. గ్రామాల్లో టంటం వేయించాలని, గ్రామాలు, రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలుకు సంబంధించి బేనర్లు పెట్టాలని, పాంప్లేట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. నవంబరు 15వ తేదీ నుండి ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని, ధాన్యం కొనుగోలు చేయనున్న సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ తయారు చేయాలని చెప్పారు. రైస్ మిల్లులు సిద్దంగా ఉంచాలని డిఎస్ఓ రూరల్ శివ ప్రసాద్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డి.ఎం. పి. వెంకటరావు, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, గ్రామీణ పౌర సరఫరాల అధికారి శివప్రసాద్, వ్యవసాయ శాఖ ఎడి కాళేశ్వరరావు, రవాణా శాఖ అధికారులు, డిఆర్డిఎ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.