విశాఖజిల్లా భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండలం చందక పంచాయితీ జగన్నాధ పురం రోడ్డు పనులకు మంగళవారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ శంఖుస్థాపన చేశారు. కేంద్ర నిధులు రూ.3.15 కోట్లతో PMGSY (ప్రధాన మంత్రి గ్రామీణ సాధక యోజన) నిధులతో నిర్మించనున్న సుమారు 7 కి.మీ తారు రోడ్డు పనులు ఈ పథకం ద్వారా పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ, చందక పంచాయితీ లో ఏడాదిల కాలంలో కేంద్ర, రాష్ట్ర నిధులు కలిపి రూ.5.16 కోట్లతో అభివృద్ధి చేసినట్టు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివ్రుద్ధికి కట్టుబడి వుందని అన్నారు. ఈ ప్రాంతంలోని రైతులు వైఎస్సార్ జలకళ పథకాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎం.పి ఎం.వి.వి సత్యనారాయణ మాట్లాడుతూ, నియోజకవర్గంపా ఒక్కొక్క మండలానికి 100 సోలార్ ఎల్.ఈ.డి బల్బు లు కేటాయించామని చెప్పారు. అలాగే భీమిలి నియోజవర్గం ఎం.పి నిధులతో కేటాయించిన అభివృద్ధి పనులకు తమవంతు సహకారాన్ని ఎప్పుడు అందిస్తామని చెప్పారు.
శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారుల సమస్యలను పరిష్కరించుటకు అక్టోబర్ 12న తపాలా అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పర్యవేక్షకులు వై.యస్.నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. తపాలా వినియోగదారులు యొక్క వ్యక్తిగత ఫిర్యాదులు మరియు సమస్యల పరిష్కారానికై అక్టోబర్ 12న ఉదయం 11.00గం.లకు సూపరింటెండెంట్ వారి కార్యాలయం, ఓల్డ్ నవత బిల్డింగ్ పైన, న్యూకాలనీ, శ్రీకాకుళం - 532001 నందు తపాలా అదాలత్ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా వినియోగదారులు తమ సమస్యలు మరియు ఫిర్యాదులను అక్టోబర్ 5లోగా ‘’ తపాలా అదాలత్ ’’ అను శీర్షికతో ‘’ వై.ఎస్.నరసింగరావు, సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ , శ్రీకాకుళం – 532001” చిరునామాకు పంపవలసినదిగా కోరారు. గడువుతేదీ ముగిసిన పిదప వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఫిర్యాదుదారులు వ్యక్తిగతముగా కూడా అదాలత్ నకు హాజరుకావచ్చనని ఆయన ఆ ప్రకటనలో స్పష్టం చేసారు.
శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పరిధిలోని తపాలా పింఛనుదారులు యొక్క సమస్యల పరిష్కరానికై అక్టోబర్ 13న పెన్షన్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ పర్యవేక్షకులు వై.యస్.నర్సింగరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అక్టోబర్ 13న ఉదయం 11.00 గం.లకు సూపరింటెండెంట్ వారి కార్యాలయం, ఓల్డ్ నవత బిల్డింగ్ పైన న్యూకాలనీ, శ్రీకాకుళం – 532001 నందు సూపరింటెండెంట్ వారిచే పెన్షన్ అదాలత్ నిర్వహించబడునని ఆ ప్రకటనలో తెలిపారు. తపాలా పింఛను సర్వీసులకు సంబంధించిన ఫిర్యాదులు ఈ అదాలత్ నందు చర్చించబడునని, కావున తపాల పింఛనుదారులు తమ సమస్యలను, ఫిర్యాదులను అక్టోబర్ 5లోగా ‘’ పెన్షన్ అదాలత్ ‘’ అను శీర్షికతో “ వై.ఎస్. నరసింగరావు సూపరింటెండెంట్, శ్రీకాకుళం పోస్టల్ డివిజన్ , శ్రీకాకుళం – 532001 “ అను చిరునామాకు పంపవలసినదిగా కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవని, ఫిర్యాదుదారులు వ్యక్తిగతముగా కూడా అదాలత్ నకు హాజరుకావచ్చునని తెలియజేశారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వంచే గుర్తింపు పొందిన జనరల్ నర్సింగ్ , మిడ్ వైఫరి సంస్థల్లో ప్రవేశాల కొరకు (3 ½ సంవత్సరాల జి.ఎన్.యం కోర్స్) ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.యం.అనురాధ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసారు. అడ్మిషన్లు పొందే అభ్యర్థులు డిసెంబర్ 31 నాటికి 17 నుండి 35 సం.రంల లోపు వారై ఉండాలని, ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10+2 ( ఇంటర్మీడియట్ ) పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేసారు. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ దరఖాస్తులను అక్టోబర్ 15లోగా పొంది, డి.డి.ఓ కోడ్ - 27000902022 రూ.500/-ల సిటిజన్ చలానా చెల్లించి http://cfms.ap.gov.in వెబ్ సైట్ నందు అభ్యర్థుల వివరములను పూరించాలన్నారు. అప్ లోడ్ చేసిన దరఖాస్తును డౌన్ లోడ్ చేసుకొని అవసరమైన ధ్రువ పత్రములు ( నఖలు) జతపరచి అక్టోబర్ 20 సాయంత్రం 5.00 గం.ల లోగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయము, శ్రీకాకుళం వారికి అందజేయాలని ఆ ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాల కొరకు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి వారి కార్యాలయం శ్రీకాకుళం నందు సంప్రందించవచ్చని, మరిన్ని వివరముల కొరకు http://dme.ap.nic.in వెబ్ సైట్ ను సంప్రదించాలని ఆమె ఆ ప్రకటనలో సూచించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ విభాగం నిర్వహణలో ఈనెల 30 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఆన్‌లైన్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. శిక్షణ తరగతుల పోస్టర్‌ను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి తన కార్యాలయంలో మంగళవారం విడుదల చేశారు. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఇన్ రిసెలియంట్ ఇన్‌ఫాస్ట్రక్చర్’ అంశంపై ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఐఐటి మద్రాసు ఆచార్యులు సి.వి.ఆర్ మూర్తి, ఐఐఎస్‌సి బెంగళూరు ఆచార్యులు ప్రదీప్ మంజుదార్, ఎస్‌ఇఆర్‌సి చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పి.హరి క్రిష్ణ, ఆచార్య కె.శ్రీనివాస రావు, ఐఐటి ఇండోర్ నుంచి డాక్టర్ నీలిమ సత్యం, ఐఐఎస్‌సి నుంచి ఆచార్య జి.ఎల్ శివకుమార్ బాబులు ప్రత్యేక ప్రసంగాలు అందిస్తారు. సదస్సు కన్వీనర్‌గా ఆచార్య సి.ఎన్.వి సత్యనారాయణ వ్యవహరిస్తున్నారు. సదస్సుకు 550 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు ఆచార్య సత్యనారాయణ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా బిఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే ఎడ్‌సెట్ 2020 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కన్వీనర్ ఆచార్య ఆర్.శివ ప్రసాద్ తెలిపారు. ఆక్టోబర్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. మంగళవారం సెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆచార్య ఆర్.శివ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరాలలో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9.00 గంటల నుంచి పరీక్ష కేంద్రాల లోనికి విద్యార్థులను అనుమతిస్తా మన్నారు.విద్యార్థులు తమవెంట హాల్‌టికెట్, గుర్తింపు కార్డును తీసుకురావాల్సి ఉంటుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి, శానిటైజర్ ఉపయోగించాలన్నారు.ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షకు అనుమతించేది లేదని స్పష్టంచేశారు. ఎడ్‌సెట్ ప్రవేశ పరీక్షకు మేథమేటిక్స్ మెథడాలజీలో 4658, ఫిజికల్ సైన్స్‌లో 2035, సోషల్ సైన్స్‌లో 4779, బయలాజికల్ సైన్స్‌లో 3321, ఇంగ్లీషు మెథడాలజీలో 865 మంది దరఖాస్తు చేసారన్నారు. ఉర్దూ మీడియంలో 97 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం, భీమవరం, చిత్తూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నంధ్యాల, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం, విజయనగరం నగరాలలో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కరోనా వైరస్ ను జయించి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి మంగళవారం విదుల్లోకి చేరారు. ఎస్పీతోపాటు అడిషనల్ ఎస్.పి. అడ్మిన్ కె.కుమార్ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. నెగిటివ్ రిపోర్టులో విధుల్లోకి చేరిన అధికారులకు కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. పూలవర్షం కురిపించి ఆనందంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా ఆత్మస్తై ర్యంతో హోంక్వారంటైన్ లో ఉండి వైరస్ ను జయించాలన్న ఎస్పీ ఖచ్చితంగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని సూచించారు. ఈ స్వాగత కార్యక్రమంలో స్పెషల్ ఎన్ఫోర్స్ మెంటో బ్యూరో అడిషనల్ ఎస్.పి. గరుడ్ సుమిత్, రంపచోడవరం ఏఎస్సీ జి.బిందు మాధవ్ , ఎస్బీ డిఎస్పీలు ఎం. అంబికా ప్రసాద్, ఎస్.మురళీమోహన్, సిసిఎస్ డిఎస్పి వి. భీమారావు, పెద్దాపురం డి.ఎస్. ఎ. శ్రీనివాస రావు, అమలాపురం డి.ఎస్.పి షేక్ మాసుం భాష, ఏఆర్ డిఎస్పి ఎస్ వి. అప్పారావు, జిల్లా పొలిసు కార్యాలయ సూపరింటెండెంట్ లు, కార్యాలయ సిబ్బంది, పోలీసు అధికారుల సంఘం ప్రెసిడెంట్ పి.సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా పార్వతీపురం ఐటిడిఏ పరిధిలో అక్టోబర్ 02, 2020న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలననుసరించి భూమిలేని గిరిజన రైతులను గుర్తించి లబ్ధిదారులకు పట్టాలు అందించడం జరుగుతుందని ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ పేర్కొన్నారు. పట్టాలు పంపిణీ కార్యక్రమానికి సంబంధించి మంగళవారం ఐ.టి.డి. ఎ ప్రాజెక్ట్ ఆధికారి ఆర్.కూర్మనాథ్ జియ్యమ్మవలస మండలం గవరంపేట, పెద్ద మేరంగి గ్రామాలు పర్యటించి గ్రామాలలో భూమి లేని రైతులతో ముఖాముఖి మాట్లాడి వారికి భూమి ఉందా, లేదా అన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తహశీల్దారుతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములు గుర్తించిన వివరాలు అడిగి తెలుసుకొని, సర్వే నిర్వహించి ప్రభుత్వ భూములు వుంటే గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జియ్యమ్మవలస మండల తహశీల్దార్ కె.గిరిధర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వి.ఆర్.ఓ లు తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా ఆసుపత్రుల జాబితా ప్రతి గ్రామ సచివాలయంలో ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల జాబితా సైతం సచివాలయంలో ప్రదర్శించాలని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామని ఆయన అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరీక్షలకు, ఆసుపత్రిలో చేరుటకు హెల్ప్ లైన్ నంబరుగా 104 ను బాగా ప్రాచుర్యం కల్పించాలని అన్నారు. కరోనా చికిత్స ఆసుపత్రుల్లో ఆహారం, పారిశుద్ధ్యం, వైద్య పరికరాలు, వైద్యులు, సిబ్బంది పనితీరుపై నివేదికలు తరచూ సమర్పించాలని పేర్కొన్నారు. ఇదే విధానం కోవిడ్ కేర్ కేంద్రాల్లో సైతం ఉండాలని ఆయన స్పష్టం చేసారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ఖచ్చితంగా మెడికల్ కిట్లు పంపిణీ చేయాలని ఆయన అన్నారు. పిహెచ్సీకి మాప్ చేయాలని, వైద్యుల పర్యవేక్షణ విధిగా ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రాధమిక దశలో కేసులను గుర్తించడం వలన మరణాలు తగ్గుముఖం పట్టాయని ఆయన అన్నారు. ఖరీఫ్ పంట సేకరణకు సంబంధించి రైతు భరోసా కేంద్రాలను సిద్ధం చేయాలని చెప్పారు. ఇ క్రాపింగ్ విధిగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఇ క్రాపింగు ద్వారానే బీమా, పెట్టుబడి సహాయం తదితర సహాయకాలు అందుతాయని అన్నారు. మాన్యుల్ గా ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతుల నమోదు కార్యక్రమం ముందుగా పూర్తి చేసి జాబితా ప్రదర్శించాలని పేర్కొన్నారు. కనీస గిట్టుబాటు ధరలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గిట్టుబాటు ధరలు విధిగా అందాలని పేర్కొన్నారు. ప్రతీ అంశం రైతులకు లాభదాయకంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. బహుళ సౌకర్యాల కల్పనా కేంద్రం ఏర్పాటుకు రైతు భరోసా కేంద్రం ప్రక్కనే ఒక ఎకరా స్థలాన్ని గుర్తించాలని తద్వారా నాణ్యత పరిశీలన, కోల్డ్ స్టోరేజ్ తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో రూ.6300 కోట్లను మౌలిక సదుపాయాల కల్పనకు వచ్చే సంవత్సర కాలంలో ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. పంటల సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. సమగ్రమైన రైతు ప్రయోజన ప్రణాళికలు తయారు కావాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఉపాధి హామీ క్రింద గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాల భవనాలు వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వై.యస్.ఆర్ హెల్త్ క్లినిక్ లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆయన అన్నారు. అంగన్వాడీ, నాడు నేడు, ప్రహారీ గోడలు, సీసీ రోడ్లు, కాలువలు, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు తదితర పనులపై దృష్టి సారించి పూర్తి చేయాలని ఆయన చెప్పారు. గ్రామ ఇంజినీరింగ్ సహాయకుల సేవలు పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని సూచించారు. నవంబరు 2 నుండి పాఠశాలలు ప్రారంభానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అయితే అక్టోబర్ 5వ తేదీన విద్యా కానుకను పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. సచివాలయాల నుండి బియ్యం కార్డు, పింఛను కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, ఇంటి స్థలం పంపిణీ సేవలు త్వరగా జరగాలని ఆయన చెప్పారు. అక్టోబర్ 2 వ తేదీన ఆర్ఓఎఫ్ఆర్ క్రింద గిరిజనులకు భూములు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జె నివాస్, ఎస్పీ అమిత్ బర్దార్, జేసిలు డా.కె.శ్రీనివాసులు, సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, వ్యవసాయ శాఖ జెడి కె.శ్రీధర్, సిపిఓ ఎం.మోహన్ రావు, సమగ్ర శిక్షా అభియాన్ ఇఇ వెంకట కృష్ణయ్య, జెడ్పి డిప్యూటీ సిఇఓ ప్రభావతి, మార్కెటింగ్ ఎడి బి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
విశాఖజిల్లాలోని అవినీతి పోలీసులను ఇంటికి పంపే పనిలో పడ్డారు ఎస్పీ కృష్ణారావు..ఎలాంటి అవినీతి అరోపణులు ఎదొర్కుంటున్నా తక్షణమే దర్యాప్తు చేయి స్తున్నారు..దర్యాప్తులో వాస్తవాలు బయటపడితే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు..అంతేకాదు ఏ స్థాయి అధికారైనా ఇలాంటి చర్యలే వుంటాయని కూడా సూచన చేశారు. దీంతో చేతివాటం చూపించే ఖాఖీలకు ప్రస్తుతం నానిపోతుంది. ఇందులో భాగంగానే చీడికాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కె. వరాహ సతీశ్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీచేశారు. కానిస్టేబుల్ పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలుండవని.. ఫిర్యాదు వచ్చిన వెంటనే అన్నీ ఆటోమేటిగ్ గా జరిగిపోతాయని చెప్పారు. ప్రజలకు పోలీసు సేవలను మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వంలో అవినీతి పోలీసులకు తావులేదన్నారు. అలా వ్యవహరించేవారు ఇంటికి వెళ్లక తప్పదన్నారు ఎస్పీ..
అనంతపురం జిల్లా కదిరి మండలం మున్సిపల్ పరిధి జాతీయ రహదారి 205 కుటాగుల సమీపంలోని మలుపు వద్ద టూ వీలర్ కారు ఢీ కొనగా ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు అనంతపురం రూరల్ జిల్లా రచన పల్లి కి చెందిన జయ కృష్ణ, మరొకరు వజ్రకరూరు చెందిన పూజారి రాజుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదకరం తెలిసిన వెంటనే పట్టణ ఎస్ఐ రఫీ తన సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను చౌదరి కోసం కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు సాగిస్తున్నారు. మ్రుతులకు సంబంధించిన వారు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు. అంతేకాకుండా మ్రుతులకు చెందిన ఆధారాలు తీసుకొని వస్తే..పోస్టుమార్టం, శవపంచనామా అనంతరం మ్రుతదేహాలను అప్పగించడం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో గ్రామసచివాలయాల్లో గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా మారడానికి కారణం జిల్లా పంచాయతీ అధికారులు మాత్రమే అనే విషయం తేట తెల్లమవుతుంది. గ్రామసచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏకంగా లక్షా 10 వేల ఉద్యోగాలను భర్తీచేస్తే అందులో అగ్రభాగం నూతనంగా చేరిన గ్రేడ్-5 కార్యదర్శిలే. ఒక రకంగా చెప్పాలంటే గ్రామాలకు ముఖ్య అధికారులు వీరంతా. అలాంటి అధికారులకు ఎలాంటి అధికారాలు లేకపోతే వీరు విధుల్లో చేరి ఏం లేభమో జిల్లా అధికారులే చెప్పాల్సి వుంది. కాదు కాదు డిపీఓ ఆదేశాలను ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు పట్టించుకోలేదనే విషయం చాలా క్లియర్ గా స్పష్టమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామసచివాలయాల్లో నూతన కార్యదర్శిలకు జిఓఎంఎస్ నెంబరు 149 ద్వారా విధులు, అధికారాలు బదలాయించాల్సి వుంది. కానీ వారికి అధికారాలు, బాధ్యతలు అప్పగించడానికి సీనియర్ కార్యదర్శిలు, ఈఓపీఆర్డీలకు చేతులు రావడం లేదు. అంతేకాదండోయ్ జిల్లా పంచాయతీ అధికారులు ఇచ్చిన లిఖిత పూర్వక ఆదేశాలను సైతం వీరు అమలు చేయడంలేదంటే దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జిఓఎంస్ నెంబరు 149 ప్రకారం ప్రభుత్వం నిర్ధేశించిన సచివాలయాల పరిధిని, అధికారాలను వారికి అప్పగించాల్సి వుంది. కాని సచివాలయ వ్యవస్థ ఏర్పాటై 11 నెలలు గడుస్తున్నా.. ఎలాంటి అధికారాలు లేని గ్రామకార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా ప్రభుత్వం వీరికి ఏం అధికారాలు కట్టబెట్టిందో, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయోమయంగా విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు జిఓఎంఎస్ నెంబరు 149 ప్రకారం అధికారాలు బదలాయించాలని మెమోజారీచేసి వారి చేతికి మట్టి అంటకుండా చేతులు దులిపేసుకున్నారు. వాటిని అమలు చేయించాల్సిన ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు అదేదో పనికిరాని మెమో అన్నట్టు, 149 జీఓ అంత అర్జెంటుగా అమలు చేయాల్సిన పనిలేదన్నట్టుగా పక్కన పడేయడంతో ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వున్న కార్యదర్శిలకు అధికారాలేంటో తెలియడం లేదు. దీంతో ఎపుడైనా జిల్లా కలెక్టర్, గ్రామసచివాలయశాఖ జెసిలు పర్యటనకు వచ్చినా కార్యదర్శిలు అధికారులతో చివాట్లు తినాల్సి దుస్తితి ఏర్పడుతుంది. సీనియర్ కార్యదర్శిలంతా ఈ నూతన గ్రేడ్ 5 కార్యదర్శిలను, సహచర కార్యదర్శిలుగా కాకుండా కార్యాలయ సహాయకులగా చూస్తున్న తీరు ఆశ్చర్యానికి గురిచేస్తుందని విధులు నిర్వహిస్తున్న కార్యదర్శిలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా సచివాలయ పరిధిలోని అధికారాలు, రికార్డులు, బ్యాంకు ఖాతాలు, డిడిఓ అధికారాలు మాకు అప్పగించండి మహాప్రభో అని జిల్లా పంచాయతీ అధికారికి మొరపెట్టుకొని మూడు నెలలు గడుస్తున్నా...డిపిఓ జారీచేసిన మోమో వచ్చి రెండు నెలలు గడుస్తున్నా అధికారాలు బదలాయింపు మాత్రం జరగలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామకార్యదర్శిలంతా ఇపుడు జిల్లావారీగా ఏకమై డిపిఓను, జిల్లా కలెక్టర్లను కలిసే యోచన చేస్తున్నారు. అసలు జిఓనెంబరు 149 ఖచ్చితంగా ఎందుకు అమలు చేయమని చెప్పలేకపోతున్నారనే విషయం రేపటి గ్రామసచివాలయాల్లో ఉత్తుత్తి కార్యదర్శిలు-4లో చూడవచ్చు..!
ప్రభుత్వ పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరు లక్ష్యాలను వేగవంతంగా సాధించేలా బ్యాంకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని రెవిన్యూ భవనంలో పీఎం స్వానిధి, జగనన్న తోడు, స్టాండప్ ఇండియా, తదితర పథకాలపై బ్యాంకర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎం స్వానిధి, జగనన్న తోడు, స్టాండప్ ఇండియా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ భీమా తదితర పథకాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. పీఎం స్వానిధి పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు రుణాలు పంపిణీని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పీఎం స్వానిధి కింద నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఆలస్యం తగదని, ప్రణాళికను సిద్ధం చేసుకుని వారం రోజుల్లోపు రుణాలను మంజూరు చేసేందుకు బ్యాంకు అధికారులు, మున్సిపల్ కమిషనర్లు సమన్వయం చేసుకొని పని చేయాలన్నారు.
జిల్లాలో జగనన్న తోడు పథకం కింద అర్హత కలిగిన చిరు వ్యాపారులకు రుణాల మంజూరు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ చిరువ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తిదారుల నుంచి 54,317 అప్లికేషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ లు పూర్తి అయ్యాయని, అర్హత కలిగి ఎంపిక చేసిన వారికి సంబంధించి సకాలంలో ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున రుణాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతంలో 29, 060 మంది లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 8 మందికి మాత్రమే రుణాలు మంజూరు అయ్యాయని, వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి అర్హులైన లబ్ధిదారులకు రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే స్టాండప్ ఇండియా కు సంబంధించి నవంబర్ 30 తేదీ లోపు జిల్లా వ్యాప్తంగా మూడువేల మంది పారిశ్రామిక వేత్తలకు 300 కోట్ల రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 482 బ్రాంచ్ లు ఉండగా, ఒక్కో బ్రాంచ్ కు సంబంధించి 6 మందికి రుణాలు అందించేలా యాక్షన్ ప్లాన్ నిర్ణయించి అప్లికేషన్లను సిద్ధం చేయాలన్నారు. నవంబర్ లోపు లబ్ధిదారుల గుర్తింపు, అప్లికేషన్లు సిద్ధం చేయడం, వెరిఫికేషన్ పూర్తిచేయడం, రుణాలు మంజూరు చేయడం తదితర అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని బ్యాంకులు వందశాతం రుణాల మంజూరు లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా వైయస్సార్ బీమా, వైయస్సార్ చేయూత, ఆత్మ నిర్బర్ నిధి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్టక్చర్ ఫండ్ తదితర పథకాలకు సంబంధించి రుణాల మంజూరు లక్ష్యాలను నిర్దేశిత సమయంలోపు సాధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (గ్రామ /వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, అసిస్టెంట్ కలెక్టర్ జి, సూర్య, లీడ్ జిల్లా మేనేజర్ మోహన్ మురళి, డిఆర్డిఎ పిడి నరసింహారెడ్డి, నాబార్డ్ ఏజీఎం ఉషా మధుసూదన్, నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ పివిఎస్ఎన్ మూర్తి, వివిధ శాఖల అధికారులు, బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వార్డు సచివాలయాల్లో ప్రతి ఒక్క సెక్రెటరీలు రెండు మెయిన్ రోడ్డు గుర్తించి వాటిని బ్యూటిఫికేషన్ చేసే విధంగా చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం ఈ మేరకు సంస్థ కార్యాలయంలో లలిత కళా ప్రాంగణంలో వార్డు సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ప్రతి సెక్రెటరీ ఇంటింటి నుండి యూజర్ చార్జీలు కలెక్ట్ చేయాలన్నారు. సెక్రటరీలు స్పాట్ ఫైన్ వేయాలని, రోడ్డుపై, పబ్లిక్ స్థలాల్లో, కాలవలో చెత్త వేసిన వారికి మరియు నగరంలో ఇక్కడైనా మల మూత్ర విసర్జన చేసే వారికి అపరాధం వెయ్యాలని ఆదేశించారు. సి.ఎం.డి వేస్ట్ భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్ లో గాని బయట ప్రాంతాల్లో గాని, నగరంలో వేసిన వాటిని భారీ అపరాధం విధించి మరియు బండ్లు సీజ్ చేయాలని వాటిని కంపోస్ట్ యాడ్లో తరలించి అని, సి.ఎం.డి వేస్ట్ యాప్ ద్వారా సెక్రటరీలు కలెక్షన్ చేయాలన్నారు. నగరంలో ప్లాస్టిక్ వాడకం ఉంటే కఠినంగా వ్యవహరించాలని వారికి అపరాధం విధించి చర్యలు తీసుకోవాలని, ఇంటింటి నుండి తడి, పొడి చెత్తను వేరు చేయాలని అలా చేయని వారికి అపరాధ రుసుము విధించాలని సూచించారు. ప్రతి వ్యాపారస్తులు రెండు బీన్స్ ఉంచి చెత్త అందులో వేరు చేసి ఉంచాలి అలా లేనిచో పెనాల్టీ వేయాలి, హోం కంపోస్ట్ ప్రతి సెక్రెటరీ తన పరిధిలో 150 ఇంట్లో హోం కంపోస్ట్ తయారు చేయించాలి, కాలువల యందు ప్రస్తుతం100 చెత్త తీసే గ్రీన్స్ ఉన్నాయని, పెద్ద కాలువలో ఎక్కడ ఏర్పాటు చేయాలి వాటి ప్రకారం ఎప్పటికప్పుడు క్లీన్ చేయించాలన్నారు. స్లీపింగ్ ప్లానింగ్ ప్రకారం మెయిన్ రోడ్డు, వ్యాపార స్థలాలు, వీధుల్లో పలు ప్రాంతాలలో ప్రతిరోజు రెండు పూటలా శుభ్రం చేయించాలి, కాలువలకు అండర్ డ్రైనేజీ కనెక్షన్లు వాటిని గుర్తించి,వాటిని తొలగించి యు జి డి కలెక్షన్ ఇప్పించాలన్నారు. శానిటరీ సెక్రటరీలు ప్రతిరోజు మస్థర్ లకు వెళ్ళాలి, మైక్రో ప్యాకెట్ వేరుగా వర్కర్లను సరిచూసుకొని వారిలో పనులు చేయించాలి, పది రోజుల లోపల 10 కొత్త ఆటోలు వస్తాయని పని భారం తగ్గుతుందని, బాగా పని చేసే వాళ్ళకి కలెక్టర్ ద్వారా ప్రశంసా పత్రాలు ఇప్పిస్తామని, పని చేయకుండా తిరిగే వాళ్ళకి మొదటగా షోకాజ్ నోటీస్ ఇస్తామని, రెండు, మూడు సార్లు ఇలానే జరిగితే విధుల్లో నుంచి తొలగించి ప్రభుత్వానికి తెలియజేస్తామని, గతంలో ప్రతి ఇంటికి గేట్ స్కానింగ్ చేయడం ద్వారా 90% పని చేస్తా ఉన్నారు నేడు 60% వచ్చిందంటే మీ పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది అని అసహనం వ్యక్తం చేశారు, వర్షాకాలం కాబట్టి ప్రతిరోజు దోమలు మందు కొట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి,శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేస్త్రిలు, హెల్త్ సెక్రటరీలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.