1 ENS Live Breaking News

వైఎస్సార్ జలకళతో 2లక్షల బోర్లు..

రాష్ట్రంలో ఉచితంగా 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. వై యస్ ఆర్ జలకళ కార్యక్రమంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయడం వలన 3 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని, 5 లక్షల ఎకరాలకు అందుబాటులోకి సాగు నీరు వస్తుందని ఆయన పేర్కొన్నారు. చిన్న, సన్నకారు రైతులకు మోటార్లు కూడా కల్పిస్తామని ఆయన తెలిపారు. ఇందుకు రూ.16 వందల కోట్లు అదనంగా ఖర్చు కాగలదని ఆయన అన్నారు. రైతులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేయలేని రైతులకు గ్రామ వాలంటీర్లు సహకారంతో దరఖాస్తు చేసుకునే సదుపాయం కల్పించడం జరిగిందని చెప్పారు. బోర్లు వేయుటకు హైడ్రోజియాలజీ, జియో ఫిజికల్ సర్వే ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. బోరు మొదటి సారి పడకపోతే రెండవ సారి కూడా ప్రభుత్వమే తవ్విస్తుందని ఆయన అన్నారు. ఉచిత విద్యుత్ కు ఒక అడుగు ముందుకు వేస్తూ ఉచితంగా బోర్లు వేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రైతన్న జీవితంలో మార్పు రావాలనే ఆశయంతో పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు గతంలో ప్రభుత్వం బకాయి పడిన మొత్తాన్ని చిరునవ్వుతోనే చెల్లించామని ఆయన అన్నారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించడం వలన మోటార్లు కాలిపోవని అన్నారు. మీటర్లు వలన ఎక్కడ లోడ్ ఎక్కువగా ఉందో తెలుస్తుందని ఆయన వివరించారు. 30 సంవత్సరాల పాటు నాణ్యమైన విద్యుత్ రైతులకు అందించడం జరుగుతుందని అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. వై యస్ ఆర్ జలకళ కార్యక్రమం వలన రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని భైరి గ్రామానికి చెందిన యండి అసిరి నాయుడు అనే లబ్దిదారుడు చెప్పారు. అనేక సంవత్సరాలుగా పొలంలో బోరు వేయుటకు ప్రయత్నం చేస్తున్నామని, ఆర్థిక పరిస్థితి సహకరించక ఇప్పటికీ కలగానే ఉందని అన్నారు. వై యస్ ఆర్ జలకళ కార్యక్రమంతో కలలు సాకారమయ్యే రోజు వచ్చిందని ఆయన తెలిపారు. భావాజీపేటకు చెందిన పల్ల సూర్యనారాయణ అనే రైతు మాట్లాడుతూ వై యస్ ఆర్ జలకళ కార్యక్రమం రైతుల పట్ల వరం అన్నారు. వేల మంది రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమం అన్నారు. ముఖ్యమంత్రి రైతు బాంధవుడు అని ఆయన చెప్పారు. రైతులకు ఏది ప్రయోజనకరమో పూర్తిగా తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు. జగన్ మోహన్ రెడ్డి కలకాలం సియంగా ఉండాలని తద్వారా రైతుకు, రాష్ట్రానికి మేలు కలుగుతుందని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా  శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న   రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం జలకళ కు  సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు.

Srikakulam

2020-09-28 14:54:58

గుర్రం జాషువా సేవలు మరువరానివి..

అద్భుతమైన రచనలతో సమాజాన్ని చైతన్య పరిచిన మహాకవి గుర్రం జాషువా అని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు.  గుఱ్ఱంజాషువా 125వ జయంతిని పురస్కరించుకొని సోమవారం ఉదయం స్థానిక టవర్ క్లాక్ వద్ద గల గుర్రం జాషువా విగ్రహానికి జిల్లా కలెక్టర్  పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సమాజంలో ప్రతి మనిషి గౌరవించబడాలని  మహాకవి గుఱ్ఱం జాషువా భావించేవారన్నారు. మహా కవులు రవీంద్రనాథ్ ఠాగూర్, షేక్స్పియర్ లాంటి ఎందరో గొప్ప కవుల సరసన గుర్రం జాషువా చేర్చ తగిన వ్యక్తిగా కొనియాడారు. మహాకవి కాళిదాసు రాసిన మేఘసందేశం  జాషువా సాహిత్య ఆలోచనలకు అద్దం పట్టిందన్నారు. గబ్బిలం, ముంతాజ్ మహల్ ,ఫిరదౌసి ,బాటసారి, కాందిశీకుడు, తెలుగు తల్లి, బాపూజీ, క్రీస్తు చరిత్ర లాంటి ఎన్నో అద్భుతమైన రచనలు ఆయన వ్రాశారన్నారు.  జాషువా కవిత్వం లో సృజనాత్మకత, అపురూపమైన భావాలు ప్రజలతో మమేకమై ఉంటాయన్నారు. యావత్ తెలుగు జాతి గర్వించదగ్గ ఒక గొప్ప కవి గుఱ్ఱం జాషువా అన్నారు. జాషువా గొప్ప దేశభక్తుడని, స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన మహనీయుల పై కావ్యాలు వ్రాసినట్లు తెలిపారు. ప్రభుత్వం కూడా ఇలాంటి మహనీయుల త్యాగాలను గుర్తించి అనేక కార్యక్రమాలను చేపట్టడం జరుగుతున్నదన్నారు. తన రచనల ద్వారా సమాజానికి జాషువా చేసిన సేవలను స్మరించుకోవడం, వారి యొక్క ఆలోచనా విధానాన్ని, సంకల్పాన్ని జిల్లా ప్రజలతో పాటు, యావత్ ఆంధ్ర జాతి స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు నడవాలని ఆయన అభిలషించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఆర్డీవో గుణ భూషణ్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ పి వి ఎస్ ఎస్ మూర్తి ,  జాషువా సాహిత్య పీఠం అధ్యక్షులు ఆచార్య బాలసుబ్రమణ్యం, ప్రధాన కార్యదర్శి నాగ లింగయ్య ఉపాధ్యక్షులు నాగేంద్ర , పూజారి ఈరన్న, ప్రొఫెసర్ సుధాకర్ ప్రముఖ కవి ఏలూరి వెంగన్న, వివిధ సంఘాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Anantapur

2020-09-28 14:48:32

3రోజుల నిరసనలు విజయవంతంచేయండి..

కేంద్ర బిజేపి ప్రభుత్వం రైతు, వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. సెప్టెంబర్‌ 29, 30, అక్టోబర్‌ 1 ‌తేదీలలో  విశాఖనగరం, నియోజకవర్గ కేంద్రాల్లో 3 రోజులూ దీక్షలు జరపాలని వామపక్ష పార్టీల ఐక్యవేది నిర్ణయించింది. ఈ మేరకు నిరసనలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చేయాలని సోమవారం సిపిఐ(ఎం) కార్యలయంలో జరిగిన వామపక్షా ల సమవేశం నిర్ణయం తీసుకుంది. కేంద్రం లో ఉన్న బిజేపి ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేకంగా, పార్లమెంటు నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెచ్చిన రైతాంగ, వ్యవసాయ వ్యతిరేక బిల్లులను నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. బిజెపి అధికారంలోకి వచ్చాక కార్పొరేట్‌ అనుకూల పరిపాలన వేగంగా అమలు చేస్తోందన్నారు. రైతుల పొట్టకొట్టి, కార్పొరేట్లకు లాభాలు చేకూర్చేందుకు బిజెపి ప్రభుత్వం సంస్కరణల పేరుతో రాష్ట్ర అధికారాలను హరించివేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిలో భాగంగానే విద్యుత్‌ ‌సంస్కరణలు, డిస్కంలను ప్రైవేటీకరించడం, వ్యవసాయ మోటార్లకు నీటి మీటర్లు బిగించడం, రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తీసుకురావడం వంటి చర్యలకు కేంద్రం పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలతో పాటు రాజకీయాలకు అతీతంగా రైతాంగమంతా దీక్షల్లో పాల్గొని ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(యుం) డా. బి గంగారావు, సిపిఐ ఎం.పైడిరాజు సిపిఐఎంఎల్‌(‌న్యూడెమొక్రాసి)వై.కొండయ్య, ఎంసిపిఐ(యు) శంకర్‌ ‌రావులు పాల్గొన్నారు. 

సిఐటియు కార్యాలయం

2020-09-28 14:14:00

స్పందనకు 136 వినతులు..

శ్రీకాకుళంజిల్లాలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 136 వినతులు వచ్చినట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన ఆయన పాల్గొని ప్రజల సమస్యలను స్వీకరించారు. ఫిర్యాదుల్లో రెవిన్యూ శాఖకు చెందినవి 36  కాగా, పౌర సరఫరాల శాఖకు సంబంధించినవి 16 మరియు  ఇతర శాఖలకు సంబంధించిన వినతులు  84  వచ్చినట్లు డి.ఆర్.ఓ. తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రజలు జిల్లా ప్రధాన కేంద్రానికి రాకుండా ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా వినతులు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి  ఫోన్ చేసి 136 మంది తమ ఫిర్యాదులను తెలియజేసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్.సెక్షన్ సూపరింటెండెంట్ డి.అప్పారావు, గ్రీవియన్స్ సెల్   సూపరెంటెండెంట్ భాస్కర రావు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్

2020-09-28 14:06:00

ఆధునిక మురగునీటి శుద్ధి ప్లాంటుకి శంఖుస్థాపన..

ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో ఐదు ఎం ఎల్ డి  మురుగునీటి శుద్ధి కర్మాగారం చాలా ప్రతిష్టముగా , ఆధునిక పద్ధతిలో నిర్మిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమణ కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో కరకంబాడి మార్గంలోని వినాయక సాగర్ వద్ద 14 కోట్ల 97 లక్షల రూపాయలతో స్మార్ట్ సిటీ నిధులతో పై 5 ఎమ్ ఎల్ డి మురుగునీటి శుద్ధి కర్మాగారం శాసనమండలి సభ్యులు యండ్లపల్లి శ్రీనివాసులురెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తిరుపతి నగరం జీవకోన, కొర్లగుంట, సుబ్బారెడ్డి నగర్ మీదగా వచ్చే మురుగునీటి శుద్ధిచేసి, వినాయక సాగర్ లోకి పంపడం జరుగుతుందని, తిరుపతి చూపులకు వినాయక సాగర్ ఆకర్షణ గా ఉంటుందని తెలియజేశారు.  కమిషనర్ గిరీష మాట్లాడుతూ, మురుగునీటి శుద్ధి కర్మాగారం కొత్త సాంకేత పద్ధతిలో దేశంలో ఎక్కడా లేని విధంగా, మురికినీటి శుద్ధి కర్మాగారం నిర్మిస్తున్నామని, దీని ప్రత్యేకత కరెంటు బిల్లు లేకుండా ఒక సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామన్నారు. ఇది పూర్తయిన వెంటనే వినాయక సాగర్ తిరుపతి పర్యటక, యాత్రికులకు ఆహ్లాదంగా ఉండేవిధంగా సాగర్ మధ్యలో ఆకర్షణీయమైన హైలాండ్, చుట్టుపక్కల సందర్శకులు కూర్చునేలా బల్లలు, చుట్టూ చెట్లు, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్, జిమ్ము, యోగ చేసేదానికి స్థలము మొదలగు వాటిని నిర్మిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సూపర్డెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్, డి.ఈ. విజయ్ కుమార్ రెడ్డి, స్మార్ట్ సిటీ ఏయికాం బాలాజీ, కాంట్రాక్టర్లు భానోదయ రెడ్డి, ఈశ్వర్, అమర్నాథ్, వైఎస్ఆర్ సిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tirupati

2020-09-28 14:00:48

ప్రభుత్వ నిధులు కాజేయడంలో మార్గదర్శిలు..

ప్రభుత్వ నిధులు ప్రభుత్వానికి అనుమానం రాకుండా కొట్టేయడంలో గ్రామసచివాలయ వ్యవస్థలో ఈఓపీఆర్డీలు నూతన అధ్యాయానికి తెరతీశారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూనే పారిశుధ్య నిర్వహణ, ఇంటిపన్నుల పేరుతో మరికొందరు కార్యదర్శిలు కూడా ప్రభుత్వ ఖజానికి కన్నవేసి...మరికొందరు అవినీతి సిబ్బందికి మార్గదర్శకులవుతున్నారు. విశాఖజిల్లా ఎస్.రాయవరం మండలంలో మూడు సచివాలయాల పరిధిలో ఒక ఈఓపీఆర్డీ ఏవిఎస్ఎస్ ప్రసాద్ తో సహా మరో ఇద్దరు కార్యదర్శిలు నర్సీపట్నం డివిజనల్ పంచాయతీ అధికారికి అడ్డంగా చిక్కారు. భారీస్థాయిలో ప్రభుత్వ నిధులు గల్లంతు అయిన తరువాత కూడా జిల్లా అధికారులు గ్రామసచివాలయాల్లోని చేతివాటం ప్రదర్శించే కార్యదర్శిలపై నిఘా పెట్టకపోవడం, ఇంకా ఇలాంటి తేడా కార్యదర్శిలున్న గ్రామసచివాలయాల్లో తనిఖీలు చేపట్టకపోవడంతో మా దగ్గరకి అధికారులు రారు...వచ్చినా లక్షలకి లక్షలు పెట్టిన తేడా బిల్లులు తనిఖీచేయకుండా మేమిచ్చేది మేము ప్రతీనెలా పంపేస్తున్నామనే ధిమాతో వ్యవహరించడం అధికారులపై బురదజల్లే  కార్యక్రమాలకు తెరతీస్తున్నారు. కరోనా వలన ప్రభుత్వంపై శానిటేషన్ భారం పడినా, రాష్ట్రవ్యాప్తంగా మాత్రం గ్రామసచివాలయాల్లోని తేడా కార్యదర్శిలకు మాత్రం కాసుల వర్షం కురిపించింది. బ్లీచింగ్, ఫినాయిల్, శానిటైజర్, ఇతర శానిటేషన్ పద్దుల పేరుజెప్పి గట్టిగానే సంపాదించారనే విషయం ఎస్.రాయవరంలోని మండల కేంద్రంలోని గ్రామసచివాలయంలో జరిగిన అవినీతి చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. అంతేకాదండోయ్...ఈఓపీఆర్డీ స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలంటే జిల్లా పంచాయతీ అధికారులకు అధికారాలు లేవు...దీనితో వాళ్లు చేసే అవినీతిపై రాష్ట్రస్థాయిలో కమిషనర్ కి నివేదికలు పంపిస్తారు. ఈలోగానే అవినీతి ఈఓపీఆర్డీలు ఆ తప్పులను ఒప్పులుగా మార్చేసుకోవడంతో హస్తలాఘవం చూపిస్తున్నారు. ఈ తరహా తేడా గ్రామకర్యదర్శిల వ్యవహారం గుర్తించాలంటే పూర్తిస్థాయిలో విచారణ పత్రాలు కలెక్టర్ ద్వారానే కమిషనర్ కి చేరితే ఫలితం వుంటుంది లేదంటే...అవినీవి వ్యవహారం కాస్తా ఈ ఈఓపీఆర్డీ, కార్యదర్శి చాలా మంచివాడికి కిందికి తేల్చేసుకునే ఉద్దండులున్నారు. అవినీతి వెలుగు చూసిన తరువాత కూడా చర్యలు తీసుకోకపోతే...ప్రజలకు ప్రభుత్వంపై ఎలాంటి అపనమ్మకం పెరుగుతుందో వేరేగా చెప్పాల్సిన పనిలేదు...

s.rayavaram

2020-09-28 09:49:14

శభాష్ విజయనగరం..

విజయనగరం జిల్లా రైస్ కార్డుల పంపిణీలో రాష్ట్రంలోని మొదటి స్థానంలో నిలిచింది. ఆదివారం సాయంత్రం వరకు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అందిన రైస్ కార్డుల దరఖాస్తుల లో 98.34 శాతం పరిష్కరించి జారీ చేయడం ద్వారా రాష్ట్రం లోనే మొదటి స్థానంలో నిలిచిందనీ జిల్లా కలెక్టర్ డా ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. కొత్త రైస్ కార్డుల కోసం 8749 దరఖాస్తులు రాగా వాటిలో 8631 పరిష్కరించి జారీ చేయడం జరిగిందన్నారు. కార్డుల విభజన కోసం 7491 దరఖాస్తులు రాగా వాటిలో 7348 కార్డుల్లో సభ్యులను వేరు చేసి కొత్త కార్డులు జారీ చేయడం జరిగిందన్నారు. కార్డులో కొత్తగా కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం కోసం 49,441 దరఖాస్తులు వస్తె అందులో 48,598 దరఖాస్తులు పరిష్కరించి కొత్త సభ్యులను కార్డులో చేర్చడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ కార్డులకు సంబంధించి మొత్తం 65,681 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 64,577 పరిష్కరించడం ద్వారా రైస్ కార్డుల దరఖాస్తుల పరిష్కారంలో 98.32 శాతం సమస్యలు పరిష్కరించి అన్ని జిల్లాల కంటే ముందు నిలిచినట్లు తెలిపారు. జిల్లాలోని పౌరసరఫరాల శాఖ సిబ్బంది, తహశీల్దార్ లు, ఎం.పి.డి.ఓ.లు, డి.ఆర్.డి.ఏ. సిబ్బంది, మునిసిపల్ కమీషనర్ లు, సచివాలయ సిబ్బంది అందరినీ అభినందించారు. ఇదే స్ఫూర్తిని ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిస్తూ జిల్లాను అన్ని ప్రభుత్వ పథకాల అమలులో ముందు వరుసలో నిలబెట్టాలని సూచించారు.

Visakhapatnam

2020-09-27 19:59:49

క్రీడలతో మానసిక ఉత్తేజం..వంశీ

క్రీడలు యువతకు మానసిక ఉత్తేజాన్ని, శారీరక శక్తిని ఇస్తాయని వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఇసుకపల్లి రమాదేవి ఫుట్ బాల్ ట్రోఫీ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు ట్రోఫీ ని అందజేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, చిన్న తనంనుంచి క్రీడలు పట్ల మక్కువ కలిగే విధంగా పిల్లలు కు అవకాశాలు కల్పించాలని అన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి క్రీడలను, క్రీడాకారులు ను ప్రోత్సహిస్తూ వస్తుందన్నారు. విజేతగా అప్పారావు మెమోరియల్ ఫుట్ బాల్ క్లబ్ నిలవగా, ద్వితీయ, తృతీయ బహుమలు బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్, స్వామి క్లబ్ నిలిచాయి. బెస్ట్ ప్లేయర్స్, ఉత్తమ క్రీడా కనబరిచిన వారికి కూడా ప్రత్యేక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, శ్రీధర్, వెంకట్రావు, ధర్మరాజు, సంగీతరావు, ధర్మ, మూర్తి, హిట్లర్  తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2020-09-27 19:53:01

అనంతలో రేపు కోవిడ్ పరీక్షలు జరిగేదిక్కడే..

అనంతపురం జిల్లాలో రేపు (28.09.2020)  కోవిడ్ నమూనాలు సేకరించే ప్రాంతాల వివరాలను జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. వరుసగా..హిందూపురం మున్సిపాలిటీ, మడకశిర మున్సిపాలిటీ,  పుట్టపర్తి మున్సిపాలిటీ, ధర్మవరం మున్సిపాలిటీ, తాడిపత్రి మున్సిపాలిటీ, గుంతకల్లు మున్సిపాలిటీ, గుత్తి మున్సిపాలిటీ  పామిడి మున్సిపాలిటీ, రాయదుర్గం మున్సిపాలిటీ, కళ్యాణదుర్గం మున్సిపాలిటీ, కదిరి మునిసిపాలిటీ, ఓడీ చెరువు పి.హెచ్.సి, అమడగూరు పి.హెచ్.సి, గాండ్లపెంట  పి.హెచ్.సి, ఎన్ పి కుంట  పి.హెచ్.సి, తలపుల పి.హెచ్.సి  కురుగుంట పి.హెచ్.సి, బుక్కరాయసముద్రం  పి.హెచ్.సి, రాప్తాడు  పి.హెచ్.సి, కొర్రపాడు పి.హెచ్.సి  కూడేరు పి.హెచ్.సి, ఆత్మకూరు పి.హెచ్.సి, ధర్మవరం ఏరియా ఆసుపత్రి, సీకే పల్లి  పి.హెచ్.సి, ఎన్ ఎస్ గేట్  పి.హెచ్.సి బత్తలపల్లి పి.హెచ్.సి, కనగానపల్లి పి.హెచ్.సి,లేపాక్షి పి.హెచ్.సి, చిలమత్తూరు పి.హెచ్.సి, పరిగి  పి.హెచ్.సి  సోమందేపల్లి పి.హెచ్.సి, కళ్యాణదుర్గం సి.హెచ్.సి, శెట్టూరు  పి.హెచ్.సి, వజ్రకరూరు పి.హెచ్.సి, బ్రహ్మసముద్రం  పి.హెచ్.సి  హిందూపురం మండలం (పిపి యూనిట్స్/పిహెచ్ సి), ఫిక్స్డ్ లొకేషన్స్ వివరాలకొస్తే... మునిసిపల్ గెస్ట్ హౌస్,  జూనియర్ కాలేజ్ ఫర్ బాయ్స్, సి.డి.హాస్పిటల్, ఓల్డ్ టౌన్ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. కరోనా లక్షణాలున్నవారు తక్షణమే ఆయా కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులు కోరారు. 

Anantapur

2020-09-27 18:24:24

స్విమ్స్ కి రూ.25 విరాళం..

తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎస్విమ్స్) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కోవిడ్ ల్యాబ్ అభివృద్ధికి శ్రీ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవి సన్నారెడ్డి రూ. 25 లక్షలు విరాళమిచ్చారు. ఆదివారం ఈ మేరకు ఆ చెక్కును తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టుబోర్డు చైర్మన్ వైవి.సుబ్బారెడ్డికి అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో శ్రీవారి ఆసుపత్రి ద్వారా ఎందరో నిరుపేదలకు వైద్య సహాయాం అందించారని, మరింత ఎక్కువ మందికి కోవిడ్ వైద్య సహాయం చేసే కార్యక్రమంలో భాగంగా వైరస్ పరీక్షలు చేసే ల్యాబ్ ను ఆధునీకరించాలని ఆయన కోరారు. స్వామివారి ఆసుపత్రికి ఎందరికో ప్రాణదానం చేయాలని ఆకాంక్షించారు. దాత సూచనలు తప్పక స్వీకరిస్తామన్నారు చైర్మన్ వైవీ. ఈ కార్యక్రమంలో టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు  శేఖర్ రెడ్డి కూడా దాతతోపాటు పాల్గొన్నారు.  

Tirumala

2020-09-27 17:46:52

అధికారులూ మీకు అభినందనలు..

విజ‌య‌న‌గ‌రం ‌జిల్లాలో గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల్లో ఖాళీగా వున్న 1134 స‌హాయ‌కుల పోస్టుల భ‌ర్తీకి ఈనెల 20 నుండి 26వ తేదీ వ‌ర‌కు వారం రోజులపాటు నిర్వ‌హిం చిన రాత‌ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా పూర్త‌య్యాయ‌ని జిల్లా స్థాయి సెల‌క్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా.ఎం.హ‌రిజ‌వ‌హ‌ర్ లాల్ తెలిపారు. కోవిడ్ ప్ర‌బ‌లిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప‌రీక్షకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్ధుల ఆరోగ్య భ‌ద్ర‌త‌కు అవ‌స‌ర‌మైన ‌అన్ని ఆరోగ్య‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌ల‌కు జిల్లాలోని యువ‌తీయువ‌కుల నుండి మంచి స్పంద‌న వ‌చ్చింద‌న్నారు.  జిల్లాలోని 88 కేంద్రాల్లో నిర్వ‌హించిన ఈ ప‌రీక్ష‌ల‌కు 45,575 మంది అభ్య‌ర్ధులు ద‌ర‌ఖాస్తు చేయ‌గా వారిలో 33,568 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన‌ట్లు పేర్కొన్నారు. ద‌ర‌ఖాస్తు చేసిన వారిలో 73.81 శాతం మంది అభ్య‌ర్ధులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని వెల్ల‌డించారు. 11,907 మంది అభ్య‌ర్ధులు ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాలేద‌న్నారు. ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు వివిధ స్థాయిల‌కు చెందిన‌ 4,600 మంది ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది, దాదాపు వెయ్యి మంది వ‌ర‌కు పోలీసు సిబ్బందితో ప‌క‌డ్బందీ ఏర్పాట్లు చేసిన కార‌ణంగా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌ల‌కు తావు లేకుండా ప‌రీక్ష‌ల‌న్నీ సజావుగా, స‌మ‌ర్ధ‌వంతంగా, ప్ర‌శాంతంగా నిర్వ‌హించ‌గ‌లిగామ‌ని పేర్కొన్నారు. ఈ ప‌రీక్ష‌లు రాసేందుకు కోవిల్ ల‌క్ష‌ణాలు ఉన్న అభ్య‌ర్ధులను కూడా అనుమ‌తించ‌డం జ‌రిగింద‌ని, ఎనిమిది మంది కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న అభ్య‌ర్ధులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని తెలిపారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ఐసోలేష‌న్‌ గ‌దుల్లో వీరిని ప‌రీక్ష‌లు రాసేందుకు అనుమ‌తించామ‌ని, ఈ ప‌రీక్ష‌ల‌కు ఇన్విజిలేట‌ర్లుగా పి.పి.ఇ. కిట్లు ధ‌రించిన కోవిడ్ వారియ‌ర్ల‌ను నియ‌మించామ‌న్నారు. దివ్యాంగులు ప‌రీక్ష‌లు రాసేందుకు వీలుగా 66 మంది దివ్యాంగ అభ్య‌ర్ధులు ప‌రీక్ష‌లు రాసేందుకు స‌హాయ‌కుల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ప‌రీక్ష కేంద్రాల‌కు వెళ్లే అభ్య‌ర్ధుల‌కు వారి సొంత మండ‌లం నుండి ప‌రీక్ష రాసే మండ‌లానికి ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగంలోని అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది, పోలీసు సిబ్బంది స‌హ‌కారం, స‌మ‌న్వ‌యంతో కూడిన‌ స‌మిష్టి కృషి వ‌ల్లే ఈ ప‌రీక్ష‌లు విజ‌య‌వంతంగా పూర్తిచేశామ‌ని పేర్కొంటూ వారంద‌రికీ అభినంద‌న‌లు తెలిపారు.

Vizianagaram

2020-09-27 14:32:40

ఎంపీ ఎంవీవీని కలిసిన ఎమ్మెల్యే వాసుపల్లి..

విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవీవీ సత్యన్నారాయణను విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో  మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయనకి సాలువకప్పి, పుష్పగుచ్చం అందించి ఎంపీతో ముచ్చటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, పార్లమెంటు విశాఖ వాణి వినిపించడంలో ఎంపీ ఎంవీవీ ముందున్నారని అన్నారు. ఇదే ఉత్సాహంతో కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి, ప్రత్యేక్ రైల్వేజోన్, సెంట్రల్ యూనివర్శిటీ, పోలవరం పూర్తికి నిధులు తదితర అంశాలపై డిమాండ్ పెంచాలని ఎంపీపీ కోరారు. విశాఖ వాసుల ఆశలకు అనుగుణంగా పార్లమెంటులో ఎంపీ వ్యవహరించడం శుభపరిణామం అన్నారు. ఎందరో ఎంపీలు విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించినా విశాఖకు ఒరింగింది ఏమీ లేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ద్వారా ఇటు పార్లమెంటులోనూ, అటు రాజ్య సభలోనూ ఎంపీల వాణి బలంగా వినిపించి చాలా అంశాలకు ఒక క్లారిటీ తెచ్చేలా క్రుషి చేశారని వాసుపల్లి కొనియాడారు.

Visakhapatnam

2020-09-27 14:25:52

రేపు డయల్ యువర్ కమిషనర్..

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ప్రతీ సోమవారం నిర్వహించే డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి నగర వాసులు 0877-2227208 కాల్ చేయాలని కమిష నర్ గిరిష సూచిస్తున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు తనతో మాట్లాడి చెప్పవచ్చునని తెలియజేశారు. అదేవిధంగా ఈ-స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు ఆన్ లైన్ ద్వారా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ eస్పందన ద్వారా అర్జీలు ఆన్ లైనులో పెట్టుకోవచ్చున్నారు. అర్జీలు పెట్టేవారు సమస్య ఏ ప్రభుత్వ శాఖకు చెందినదో సదరు దరఖాస్తుపై తెలియజేయాలన్నారు. కరోనా నేపథ్యంలో దరఖాస్తలను ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నామన్న కమిషనర్ ప్రజల సౌకర్యార్ధం ప్రభుత్వ పరధిలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజలు తమ సమస్యలు నగరపాలక సంస్థకు విన్నవించుకోవాలని కమిషనర్ కోరారు.

Tirupati

2020-09-27 13:57:44

మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన వాసుపల్లి..

రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టిశ్రీనివాసరావును విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆదివారం మంత్రి నివాసంలో మర్యాదపూర్వ కంగా కలిశారు. అనంతరం పుష్పగుచ్చం అందించి మంత్రితో ముచ్చటించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటకాభివ్రుద్ధిని ఏ ప్రభుత్వంలో లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అభివ్రుద్ధి చేసేందుకు మంత్రి ముత్తంశెట్టి ఎంతో శ్రమిస్తున్నారని అన్నారు. అదీకాకుండా విశాఖజిల్లాలో కొత్త పర్యాటక ప్రాంతాలను గుర్తించి మరీ అభివ్రుద్ధిచేయడం అనేది ఎంతో కాలం నుంచి నలుగుతున్న అంశమని, అలాంటి మంచి కార్యక్రమం మంత్రి ముత్తంశెట్టి హయాంలో జరగడం నిజంగా శుభపరిణామమన్నారు. కొత్త పర్యాటక ప్రాంతాల గుర్తింపు ద్వారా విశాఖనగరంతోపాటు, జిల్లా కూడా అభివ్రద్ధి చెందడంతోపాటు, చాలా మందికి ఆయా కొత్త పర్యాటక ప్రాంతాల వద్ద ఉపాది కూడా లభిస్తుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో చరిత్రగల విశాఖజిల్లా మరింతగా పర్యాటకంగా ముందుకు సాగితే ప్రపంచ పర్యాటకుల చూపు విశాఖవైపు పడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు..

Seethammadara

2020-09-27 12:51:23

స్వయం సహాయ త్రాగునీటి సంఘాల ఏర్పాటు..

శ్రీకాకుళం జిల్లాలో స్వయం సహాయక తాగునీటి సంఘాలను ఏర్పాటుచేయాలని వ్యవసాయ శాఖ కమీషనర్ హెచ్.అరుణ్ కుమార్ పేర్కొన్నారు. శనివారం సాయం త్రం కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వీలైనన్ని స్వయం సహాయక తాగునీటి సంఘాలను ఏర్పాటుచేయాలని, ప్రతీ రైతు భరోసా కేంద్రం పరిధిలో కనీసం 5 స్వయం సహాయక తాగునీటి సంఘాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందులో చిన్న, సన్నకారు రైతులు ఉండేలా చూసుకోవాలని సూచించారు. స్వయం సహాయక తాగునీటి సంఘాలకు బ్యాంకుల ద్వారా రూ.25 వేల వరకు ఆర్ధిక సహాయాన్ని అందించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు.  ఈ అవకాశాన్ని రైతులు అందుకునేలా చర్యలు తీసుకోవాలని, జిల్లావ్యాప్తంగా స్వయం సహాయక తాగునీటి సంఘాలు ఉండేలా చూడాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు కె.శ్రీధర్, వ్యవసాయ పరిశోధన అధికారి పి.వి.సత్యనారాయణ, డా. యస్.వి.యస్.నేతాజీ, శాస్త్రవేత్తల బృందం, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2020-09-26 20:46:17