శ్రీకాకుళం జిల్లా పౌర సరఫరాల సంస్ధలో టెక్నికల్ అసిస్టెంట్స్ ( గ్రేడ్-౩ ), ఛార్టర్డు అకౌంటెంట్ పోస్టులకు అర్హత గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతున్న ట్లు సంయుక్త కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసారు. పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ కార్యాలయంలో కాంట్రా క్ట్ పద్ధతిలో 9 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు, ఒక అకౌంటెంట్ పోస్టును భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ పోస్టులకు అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టునకు బియస్సీ అగ్రీకల్చర్/హార్టీకల్చర్/డ్రైలాండ్ అగ్రికల్చర్ లలో ఉత్తీర్ణులై ఉండాలని లేదా బయో టెక్నాలజీ/బోటనీ స్పెషల్ సబ్జెక్టు కలిగిన సైన్స్ గ్రాడ్యుయేట్ గాని లేదా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ / ఆర్గానిక్ పాలిటెక్నిక్ / లాండ్ ప్రొటెక్షన్ నందు డిప్లమో ఉత్తీర్ణులైన వారుగానీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు. సి.ఏ ఫైనల్ పూర్తి అయినవారు అకౌంటెంట్ పోస్టునకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ అసిస్టెంటు పోస్టునకు నెలకు రూ.22 వేలు, అకౌంటెంట్ పోస్టునకు నెలకు రూ.45 వేలు జీతం ఉంటుందని, ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేసారు. అభ్యర్ధులను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ప్రతిభ, రోస్టర్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేయబడుతుందని, జనరల్ కేటగిరీకి 35 సంవత్సరాలు, రిజర్వడ్ కేటగిరీ అభ్యర్ధులు 40 సంవత్సరాలు లోపు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అభ్యర్ధులు తమ దరఖాస్తుతో పాటు విద్యార్హతల ప్రతులు, ఇతర వివరాలతో ఈ నెల 23వ తేదీ సాయంత్రం 05.00గం.లలోగా dmskk.apscsc@gov.in మెయిల్ కు పంపాలని అన్నారు. ఇతర వివరాల కొరకు సంస్థ కంట్రోల్ రూమ్ ఫోన్ నెం. 7702003579, 9963479139, 9963479141 సంప్రదించాలని ఆయన ఆ ప్రకటనలో వివరించారు. నిర్ధేశిత దరఖాస్తును www.apscscl.in వెబ్ సైట్ నందు డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో నెలకొల్పిన సెంటర్ ఫర్ ఇన్విరాన్‌మెంట్, సస్టైనబుల్ డెవలప్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ (సిఇఎస్‌సిసి) కేంద్రం సంచాలకునిగా ఏయూ సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యులు ఎస్.బాల ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి నుంచి ఉత్తర్వులను స్వీకరించారు. ఈ సందర్భంగా వీసీ ప్రసాద రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ పరంగా పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలపై విస్తృత పరిశోధ నలు జరిపే దిశగా ఈ కేంద్రం పనిచేయాలని సూచించారు. వర్తమాన సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, ప్రపంచ వ్యాప్తగా జరుగుతున్న పర్యావరణ మార్పులు, సమస్యలపై పరిశోధనలు జరిపి తగిన పరిష్కారాలు చూపే దిశగా కేంద్రం పనిచేయాలన్నారు. తద్వారా ఏయూకి దేశంలోనే మరింత గుర్తింపు ఏర్పాడుతుందన్నారు. పరిశోధన అంటనే ఆంధ్రాయూనివర్శిటీ అనే స్థాయికి తీసుకురావాలని విసి సూచించారు.
సచివాలయ పరీక్షా కేంద్రాల్లో తప్పని సరిగా అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తరువాత మాత్రమే లోపలికి అనుమతించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష అధికారులను ఆదేశించారు. ఈ నెల 20 నుంచి జరగనున్న సచివాలయ పరీక్షల నిర్వహణపై గురువారం వై.ఎస్.ఆర్. భవన్ నోడల్ ఆఫీసర్స్ తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, అభ్యర్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గట్టి బందోబస్తు మధ్య పకడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షకు వచ్చే విద్యార్థులు వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలు వెలుపలే ఉండేలా చూడాలన్నారు. ప్రతి సెంటర్ లో సెల్ ఫోన్ నిషేధించి ప్రతి సెంటర్లో ఒక వీడియో గ్రాఫర్ ని గ్రాఫర్ ఏర్పాటుచేసి పరీక్ష మొత్తం వీడియోలు తీయించాలన్నారు. శానిటరీ సిబ్బంతితో ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. భౌతిక దూరం తోనే పరీక్షలు నిర్వహించాలన్న ఆయన ఈ రెండు రోజులు 37 సెంటర్లును పరిశీలించి సదుపాయాలు కల్పించే విధంగా ప్రణాళిక చూడాలని ఆదేశించారు. ప్రతి సెంటర్లో మరుగుదొడ్లు, లైట్లు, ఫ్యాన్లు, వెలుతురు వుండాలని మరియు మీకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలని, ఎలాంటి లోటుపాట్లు ఉన్నా మీ మీద చర్యలు తీసుకోవలసి వస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వారితో పాటు అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, అర్బన్ తాసిల్దార్ వెంకటరమణ, ఎంఈఓ సత్యనారాయణ, హెల్త్ ఆఫీసర్ సుధారాణి, మేనేజర్ హసీమ్, డీ ఈ లు విజయ్ కుమార్ రెడ్డి, గోమతి, శానిటరీ సూపర్వైజర్ గోవర్ధన్, ఏర్పేడు, కెవిబిపురం, చిన్నగొట్టిగల్లు తాసిల్దార్ లు, స్పెషల్ ఆఫీసర్లు పాల్గొన్నారు.
విశాఖ బిజేపి దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ కొప్పల రామ్ కుమార్ జన్మదిన వేడకలు పూర్తిసేవా కార్యక్రమాలు చేస్తూనే నిర్వహించారు. రెండు రోజులగా నగరంలోని పలు ప్రాంతాల్లో పేదలకు పళ్లు, రొట్టెల, ఆహార పొట్లాలు అందించి తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు రామ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేవుడు తల్లిదండ్రుల ద్వారా జన్మనిచ్చినా, మన జన్మ సాకారం కావాలంటే నిండైన హ్రుదయంలో ఎదుటివారికి నిశ్వార్ధంగా సేవలు చేసినపుడే అది సాకారం అవుతుందని అన్నారు. ప్రతీఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తన సేవా కార్యక్రమాలు నిరుపేదలు, ఆసుపత్రులు, అనాద ఆశ్రమాల్లోనే నిర్వహించామన్నారు. కరోనావైరస్ విజ్రుంభిస్తున్న తరుణంలో ఎందరో అభాగ్యులు పట్టెడు అన్నం కోసం అలమటిస్తున్నారని, అలాంటి వారికి నావంతు సహాయంగా నిరవధికంగా సేవలు చేస్తున్నట్టుచెప్పారు. ఈ కార్యక్రమంలో అలసట ఎరుగకుండా తనపోటు సేవలు అందించిన బిజెపి కార్యకర్తలకుకూడా ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన రామ్ కుమార్ కరోనా వైరస్ నియంత్రణ జరిగి జనజీవనానికి మార్గం సుగమం చేయాలని ప్రార్ధించినట్టు చెప్పారు.
మహిళల ఆర్ధిక స్థితిగతులను పెంచి ఆర్ధిక స్వాతంత్య్రం రావాలనే ఉద్దేశ్యంతో వై.యస్.ఆర్.ఆసరా పథకాన్ని ప్రారంభించడం జరిగిందని మాజీ మంత్రి, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం చాపురం పంచాయతీ, గోవింద్ నగర్ కాలనీ లో వై.యస్.ఆర్. ఆసరా వారోత్సవాల కార్యక్ర మం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా ఏర్పాటు చేసిన కిరాణా దుకాణాన్ని శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఆర్ధిక స్వావలంబన దిశగా తీసుకువెళ్లాలనేది ప్రభుత్వ లక్ష్యమని, వారి ఆర్థికస్థితి గతులు పెంచి, ఆర్థిక స్వతంత్రం రావాలని ప్రభుత్వం కోరుకుంటుందని అన్నారు. ఒక కుటుంబంలోని మహిళలు బాధ్యతగా వ్యవహరి స్తారని, అటువంటివారికి అవసరమైన శక్తిని అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. అలాంటి భావజాలానికి అనుకూలంగానే ప్రభుత్వం ఇన్నిరకాల పథకాలకు రూపకల్పన చేసిందని చెప్పారు. 45 ఏళ్ళు పైబడిన మహిళలకు వై.ఎస్.ఆర్ చేదోడు ద్వారా రూ.18,750 డబ్బు ఇచ్చినా, ఇప్పటి వరకు వ్యాపారం చేస్తున్న వారికి రూ.75,000/-లను తక్కువ వడ్డీకే అందించి డీ సెంట్రలైజ్ చేసి దానితో మల్టీ నేషనల్ కంపెనీలతో టైఅప్ అయ్యి వారి దగ్గర కొన్న సరుకులు, తక్కువ ధరకే అందించి ఎక్కువ ప్రయోజనం పొందే విధంగా చేసే ఏర్పాట్లన్నీ దీనిలో భాగమేనని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టారని, ఏ బలమైన సమాజానికి మహిళలే ఆయువుపట్టు అని గుర్తించి, వారికి ఆర్థిక స్వతంత్రం కలిగి ఉండేలా చేయడం, వారి సామాజిక స్థితిగతులు మెరుగుపరచడం, పేదలకు ఆదుకునే ప్రభుత్వం ఉంది అనే ధైర్యాన్ని అందించేందుకు ఇలాంటి పథకాలు అవసరం అని ఆయన అభిప్రాయపడ్డారు. సంపాదన చేసుకోడానికి మహిళలు ముందుకు రావడం ద్వారా కుటుంబంలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున ఇంత ధనాన్ని ప్రభుత్వ పధకాల ద్వారా పేదలకు అందచేసే ప్రక్రియ ఇలానే ఈ ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనసాగుతుందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు కోసం ధనాన్ని కేటాయించిన కార్యక్రమాలు లేవని, ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నాయని కితాబిచ్చారు. దీర్ఘ కాలంలో దీని తాలుకా ప్రయోజనాలు మనకి స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. సమాజాభివృద్ధికి, కుటుంబాల అభివృద్ధికి మరింత ఆర్థిక స్వాతంత్య్రానికి, సామాజిక స్థితిగతులు పెరగడానికి ముఖ్యంగా మహిళకు ప్రయోజనంగా ఈ పథకాలు ఉంటాయని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.నగేష్ , ఏరియా కో ఆర్డినేటర్ కొండలరావు, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు పి కొటేశ్వరమ్మ, కోశాధికారి హేమలత, ఏ.పి.ఎం త్రినాధమ్మ , అల్లు లక్ష్మీనారాయణ ,ముకళ్ల తాతబాబు ,గుడ్ల దాము ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు జిల్లాలో పూర్తి స్ధాయిలో ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌళికసదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అభ్యర్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్.టి.సి బస్సులు ఏర్పాట్లు చేసామని అన్నారు. దూర ప్రాంత కేంద్రాలకు వెళ్ళే అభ్యర్ధులకు కూడా రవాణా సౌకర్యంగా ఉండే విధంగా వాహనాలను అధిక ట్రిప్పులు ఏర్పాట్లు చేసామని కలెక్టర్ పేర్కొన్నారు. సచివాలయ పరీక్షార్ధులను ఉద్దేశించి గురు వారం ఒక వీడియో మెసేజ్ ను కలెక్టర్ నివాస్ విడుదల చేస్తూ ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలని ఆకాంక్షించారు. సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
· పరీక్షల కోసం అభ్యర్ధులకు ఇచ్చిన సూచనలు పక్కాగా పాటించాలి
· రైటింగ్ పాడ్ తీసుకు రావాలి
· అభ్యర్ధులు విధిగా పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగు లైసెన్సు వంటి ఏదో ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి.
·ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, బాగా చిన్నదిగా ఉన్నా, ఫోటోపై సంతకం లేకపోయినా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన మూడు (3) పాస్ పోర్టు సైజు ఫోటోలను తీసుకు రావాలి. ఫోటోలు తీసుకు రాని వారికి పరీక్షలకు అనుమతించరు.
·అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగు చేయుటకు ఉదయం 8 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షలకు ఒంటి గంట నుండే అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి.
· మోబైల్, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్స్, ఐ పాడ్, బ్లూ టూత్, పేజర్స తదితర ఏ ఎలక్ట్రానిక్ పరికరం అనుమతించడం జరగదు. నిబంధనలు అతిక్రమించిన వారిని పరీక్షలకు అనర్హులుగా చేయడం జరుగుతుంది.
·అభ్యర్ధులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తో మాత్రమే ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్ పై రాయాలి. ఇతర పెన్నులు వినియోగం చెల్లదు. అటువంటి జవాబు పత్రాలు అనర్హమైనవిగా గుర్తిస్తారు. ప్రశ్నాపత్రం బుక్ లెట్ సిరీస్ (ఏ,బి,సి,డి)ను ఓఎంఆర్ షీట్ లో నిర్ధేశిత ప్రదేశంలో విధిగా నింపాలి.
·అభ్యర్ధులు నిర్ధేశిత ప్రదేశంలో హాల్ టికెట్ నంబరు రాయాలి. కేటాయించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఇన్విజిలేటర్ తో సంతకం చేయించుకోవాలి.
· ఓఎంఆర్ షీట్ ఒరిజినల్, డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులకు అందించడం జరుగుతుంది. డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులు తీసుకొని వెళ్ళవచ్చును.
·ప్రశ్నాపత్రంపై ఎటువంటి రాతలు ఉండరాదు. జవాబులను సైతం మార్కు చేయరాదు.
·ఓఎంఆర్ షీట్ పై వైట్ నర్ (కరెక్షన్ ఇంక్) లేదా ఇతర మార్కర్లు వినియోగించితే అటువంటి ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కావు
·పరీక్షా రూమ్ లో ఇతర అభ్యర్ధులతో మాట్లాడటం, ఇతర అభ్యర్ధులను డిస్టర్బ్ చేసే వారిని పరీక్షల నుండి అనర్హులుగా పరిగణిస్తారు.
·పరీక్షా కేంద్రంలో ఎటువంటి అసభ్యకర ప్రవర్తనను అనుమతించేది లేదు. అటువంటి అభ్యర్ధులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరుగుతుంది.
·తరచూ మరుగుదొడ్లకు వెళ్ళడానికి అనుమతించడం జరగదు. అత్యవసరమైతే మినహా వెళ్ళరాదు. చూచిరాతలు, ఇతరత్రా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఎడల అనర్హులుగా చేయడం జరుగుతుంది.
·పరీక్షా సమయం 150 నిమిషాలుగా మాత్రమే. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, తెలుగు మాద్యమాల్లో ఉంటుంది.
·నెగిటివ్ మార్కులు : తప్పుగా రాసిన జవాబులకు నెగిటివ్ మార్కులు ఉంటాయని అభ్యర్ధులు గమనించాలి. తప్పుగా నాలుగు జవాబులు రాస్తే ఒక మార్కు పోతుంది.
·పరీక్ష పూర్తి అయ్యే వరకు ఏ అభ్యర్ధిని బయటకు విడిచిపెట్టడం జరగదు.
·సహాయకలులు (స్కైబ్) అవసరమని ముందుగా కోరిన విభిన్న ప్రతిభావంతులకు సహాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికప్పుడు సహాయకులు అవసరమని కోరితే సమకూర్చడం జరగదు.
· పరీక్షా కేంద్రం వివరాలను https://vsws.ap.gov.in లేదా http://gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించి అభ్యర్ధులు పొందవచ్చును.
·కోవిడ్ దృష్ట్యా సురక్షిత చర్యలు తీసుకోవాలి
· ప్రతి అభ్యర్ధి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి
·మాస్కు విధిగా ధరించాలి. మాస్కు లేకపోతే పరీక్షా హాల్ లోకి ప్రవేశం లేదు. సొంతంగా శానిటైజర్ తెచ్చుకోవాలి
·ఎవరి తాగు నీరు వారు తీసుకు రావడం ఉత్తమం. ఇతర వ్యక్తులు ఉపయోగించిన వస్తువులు వినియోగించకుండా ఉండవచ్చు. పారదర్శకంగా ఉన్న నీళ్ళ బాటిల్స్ తెచ్చుకోవచ్చు.
· కోవిడ్ లక్షణాలు ఉన్న అభ్యర్ధులు తమ పరిస్ధితిని తెలియజేయాలి. అటువంటి వారికి ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు
·పరీక్ష రాసే సమయంలో ఎటువంటి అస్వస్తత కనిపించిన పరీక్షల నిర్వాహకులకు తెలియజేయాలి.
దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా ఆప్కో చేనేత వస్ర్తాలపై ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బి.ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దసరా, దీపావళి సందర్భంగా ఎంపిక చేసిన చేనేత వస్త్రాలకు ఒకటి కొంటే రెండు లేదా ఒకటి ఉచితంగా , అలాగే అన్నిరకాల చేనేత వస్త్రాలపై 30శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదవకాశాన్ని చేనేత వస్త్రప్రియులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధర్మవరం, వెంకటగిరి, మాధవరం, ఉప్పాడ, గుంటూరు, బందరు, రాజమండ్రి, మంగళగిరి పట్టు మరియు కాటన్ చీరలు , దుప్పట్లు, బెడ్ షీట్స్, లుంగీలు, టవల్స్, షర్టింగ్ క్లాత్ మొదలైన వస్త్రాలు లభించనున్నాయని, విరివిగా వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఈ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్టు ఆయన తెలియజేశారు.
ఓజోన్ పొరను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు పెంచాలని గాయత్రీ విద్యాపరిషత్ ఉపాధ్యక్షులు డి.దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్నిపురష్కరించుకొని గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీ, పీజీ కళాశాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఏటా ఓజోన్ దినోత్సవా న్ని క్రమం తప్పకుండా నిర్వహించి ప్రాంగణంలో మొక్కలు నాటతమాన్నారు. అంతేకుండా వాటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంచుతామని కూడా వివరించారు. . పర్యావరణ హితమైన కార్యక్రమాలు తాము నిత్యం నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో జీవీపీ , ఇతర యాజమాన్య సభ్యులు డీవీఎస్ కామేశ్వర రావు, ఆచార్య ఎ.నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రజని, యూజీ డైరక్టర్ ఆచార్య ఐ.ఎస్.పల్లవి, పర్యావరణ విభాగాధిపతి డాక్టర్ జి.లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో వాలంటీర్లు వ్యక్తుల మధ్య దూరం పాటిస్తూ పాల్గొన్నారు.
ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జిల్లాలోని పలువురు అభ్యర్థులు పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. విశాఖలో బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, 2018 డిసెంబర్‌లో గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడడం, 2019 ఏప్రిల్ లో ప్రాథమిక పరీక్షను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ఆగస్టు 2019లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి, ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 10న నగరంలోని డీపీఓ కార్యాలయంలో నిర్వహించారని చెప్పారు. ఇతర జిల్లాల్లో అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం, వారు మూడు నెలలకు పైగా జీతాలు కూడా తీసుకున్నారని, విశాఖజిల్లాలో మాత్రం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తునే ఉన్నామన్నారు. తాము ఇప్పటికే ఏడు నెలలుగా పైగా సర్వీసును కోల్పోయామని, ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామని, ఇప్పటికైనా తమకు పోస్టింగు ఇప్పించాలని కోరారు.
విఎంఆర్డిఏ చేపట్టిన ఎన్ఏడి ఫ్లై-ఓవర్ ( ఫై వoతేన) నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఈమేరకు అదనపు కమిషనర్ మనజిర్ జీలని సామూన్ తో కలిసి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ, ప్రణాళిక ప్రకారం ఈ నెల సెప్టెంబర్ 15 లోపు గోపాలపట్నం వైపు నుంచి వచ్చే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యవలసి ఉండగా నిర్ణీత సమయానికే పనులు పూర్తయ్యాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 15 లోపు మర్రిపాలెం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ 15 లోపు ఎన్ఎస్టీఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే రహదారి పనులు పూర్తి చేసి, అప్పర్ రోటరీ మొత్తాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలని చీఫ్ ఇంజనీర్ కె.రామ్మోహ నరావుని ఆదేశించారు. వంతెన కాంట్రాక్టర్ తో సంప్రదింపులు జరిపి అనుకున్న తేదీల్లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమా శంకర్ , జనరల్ మేనేజర్ క్రిహ్ష్ణమోహన్, ఈపిసి కాంట్రాక్టర్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ సంపత్ వినాయగర్ కు ప్రత్యేక పూజలు చేసినట్టు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పా రు. బుధవారం ఆశీల్ మెట్టలోని శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయగర్ ని దర్శించుకున్న ఎమ్మెల్యే స్వామికి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ వలన రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు మ్రుత్యువాత పడటం తనను ఎంతో బాధకలిగించిందని చెప్పారు. విశాఖలోని ప్రముఖ దేవాలయాలన్నీ తిరిగి కరోనా మహమ్మారి నిర్మూలన జరిగేలా పూజలు చేస్తున్నామన్నారు. నగర ప్రజలు కూడా ఈ వైరస్ నుంచి రక్షణ పొందడానికి సామాజిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4.0 అన్ లాక్ నిబందనలు పాటించాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే దగ్గర్లోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ లో ఖచ్చితంగా 14 రోజులు జాగ్రత్తగా ఉండి మందులు వాడాలన్నారు. ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని ఎమ్మెల్యే వాసుపల్లి సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధ వారం మీడియాకి వివరించారు. సెప్టెంబరు 17,18 తేదీలతో సహా 21 నుండి 25 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాల, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాల, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాల, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు జరుగుతాయని ఆయన వివరించారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాలలో 2,725 మంది, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాలలో 3,473 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో 2,213 మంది, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలలో 2,042 మంది 25వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసామని చెప్పారు. పూర్తి స్ధాయి బందోబస్తు ఉందని, 144వ సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత తహశీల్దార్లకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగా హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా కూడా అనుమతించేది లేదని గమనించాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి ఉన్నందున తగిన ఏర్పాట్లు, సురక్షిత చర్యలతో పరీక్షలకు హాజరు కావాలని ఆయన కోరారు.
గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్థి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేది వరకు నిర్వహించనున్న గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలపై విజయవాడ నుండి బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లుగానే ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రశ్నా పత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయన్నారు. సరిపడిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణాకు అంతరాయం లేకుండా రవాణా శాఖ, ఎపిఎస్.ఆర్టి.సి తగు చర్యలు తీసుకుంటారని, విద్యుత్, గ్రామీణ ప్రాంతంలో డిపిఓ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమీషనర్లు పరీక్ష కేంద్రాల వద్ద శానిటేషన్, తాగునీరు చూడాలని ఆయన సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ ఉంటే వారికి పరీక్ష కేంద్రం వద్ద ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలని, ఇన్విజిలేటర్ కు పిపిఇ కిట్ ఇవ్వాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ లు, పిపిఇ కిట్లు ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడా పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
రాష్ట్ర పట్టణాభివృద్థి మరియు పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో మంచి పేరు వచ్చిందని, కోవిడ్ -19 ఉన్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలని సూచించారు. అభ్యర్థులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కోవిడ్-19 పాజిటివ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేసి అందులో పరీక్ష పెట్టాలన్నారు. ప్రతీ పరీక్షకేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ అభ్యర్థులకు మందులు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరఫరా చేస్తారని తెలిపారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరం అయితే ఐసిడిఎస్ సిబ్బందిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని, అక్కడ ధర్మల్ స్కాన్ ఉంటుందని, అక్కడ ఆలస్యం జరుగుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్క్ లు ఉండాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.
జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. జివియంసి కమీషనర్ జి. సృజన మాట్లాడుతూ ఈ మధ్యన ఒక పరీక్షకు అభ్యర్థులకు మాత్రమే ఆర్.టి.సి. బస్సులను నడిపినట్లు చెప్పారు. ఆలాగే గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలకు ఆర్.టి.సి. బస్సులను అభ్యర్థులకు కోసం మాత్రమే నడిపేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. కృష్ణారావు, జిల్లా పరిషత్ సిఇఓ నాగార్జున సాగర్, డిపిఒ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టరు ఆర్. గోవిందరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహనదారులకే కాకుండా ప్రజలందరికీ రహదా రి భద్రతపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ప్రమాదాలకు కారణమౌతున్న అతివేగం, అవగాహనా రాహిత్యం, అలసత్వాల మూలంగా జరిగే ప్రమాదాలు, వాటి వలన కుటుంబాలకు జరిగే నష్టాలపైన తెలియజేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం వున్న ప్రదేశాలను రవాణా, పోలీసు, ఇంజనీరింగ్ శాఖల అధికా రులు జాయింట్ ఇనస్పెక్షన్ చేయాలన్నారు. అటువంటి ప్రదేశాలలో తక్షణ చర్యలు, నిర్మాణాలు చేపట్టాలన్నారు. రవాణాశాఖ ఉప కమీషనరు రాజరత్నం మాట్లా డుతూ గత సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడక ముందే జిల్లాలో ప్రమాదాల రేటు 20.95 శాతం తగ్గందని, రాష్ట్ర తగ్గుదల సగటు కంటే ఎక్కువగా వుందన్నారు. కోవిడ్19 మూలంగా వాయిదా పడిన నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని వివిధ శాఖల అధికారులకు ఆయన విజ్ఖప్తి చేశారు. నగరంలో జాతీయరహదారి పై నున్న డివైడర్ల పై పెంచే మొక్కలు ఎత్తుగా పెరిగి నందున క్రాసింగ్స్ వద్ద పాదచారులకు వాహనాలు కనబడక ప్రమాదాలకు కారణమౌతున్నాయని పోలీసు శాఖ వారు తెలియజేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జివియంసి వారిని కోరారు. ఈ సమావేశం లో అడిషనల్ ఎస్.పి. బి.అచ్యుతరావు, ఎసిపిలు ఎమ్.ఆర్.కె రాజు, సిహెచ్.పాపారావు, జివియంసి ఎసి.ఈ. కె.శాంసన్ రాజు, ఆర్.అండ్ బి ఎస్.ఈ. వి.కేశవరావు, ఎపిఎస్ ఆర్టిసి డివియం బి.ఎ.నాయుడు, పంచాయితీరాజ్ ఎస్.ఈ. జి.సుధాకరరెడ్డి, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వి.సుధాకర్ , డిఎంఅండ్.హెచ్.వో డాక్టర్ కె.విజయలక్ష్మి , డి.సి.హెచ్. వి.లక్ష్మణరావు ఆర్టీవోలు జి.ఆర్.రవీంద్రనాధ్, ఐ.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులు పాటు జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక (లెక్చరర్) పోస్టుల నియామక పరీక్షలకు 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజ రైనట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 మరియు 16వ తేదీల్లో నిర్వహించిన డిగ్రీ అధ్యాపక పరీక్షలు ప్రశాంతంగా ముగిసా యని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసారు. ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, మధ్యా హ్నం 3.00గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు రెండు విడతలుగా రాజాంలోని జి.యం.ఆర్.ఐ.టి, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరిగిన సంగతి విదితమే. ఇందుకు జిల్లావ్యాప్తంగా 487 మంది అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా 296 అభ్యర్ధులు హాజరయ్యారని, 191 మంది అభ్యర్ధులు హాజరుకాలేదని ఆయన వివరించారు. దీంతో 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజరు అయినట్లు డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన కళాశాలల యాజమాన్యాలు, ఏ.పి.పి.యస్.సి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీశ్వరరావు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పద్మప్రియ, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, ఉప తహశీల్ధారులు, ఇతర సిబ్బంది తదితరులకు డి.ఆర్.ఓ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.