గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలకు జిల్లాలో పూర్తి స్ధాయిలో ఏర్పాట్లు పూర్తి చేసామని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మౌళికసదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు. అభ్యర్ధులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్.టి.సి బస్సులు ఏర్పాట్లు చేసామని అన్నారు. దూర ప్రాంత కేంద్రాలకు వెళ్ళే అభ్యర్ధులకు కూడా రవాణా సౌకర్యంగా ఉండే విధంగా వాహనాలను అధిక ట్రిప్పులు ఏర్పాట్లు చేసామని కలెక్టర్ పేర్కొన్నారు. సచివాలయ పరీక్షార్ధులను ఉద్దేశించి గురు వారం ఒక వీడియో మెసేజ్ ను కలెక్టర్ నివాస్ విడుదల చేస్తూ ప్రతి ఒక్కరూ చక్కగా పరీక్షలు రాసి ఉద్యోగం సంపాదించాలని ఆకాంక్షించారు. సూచనలు ఈ విధంగా ఉన్నాయి.
· పరీక్షల కోసం అభ్యర్ధులకు ఇచ్చిన సూచనలు పక్కాగా పాటించాలి
· రైటింగ్ పాడ్ తీసుకు రావాలి
· అభ్యర్ధులు విధిగా పాస్ పోర్టు, పాన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు, డ్రైవింగు లైసెన్సు వంటి ఏదో ఒక ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి.
·ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్ పై ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, బాగా చిన్నదిగా ఉన్నా, ఫోటోపై సంతకం లేకపోయినా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన మూడు (3) పాస్ పోర్టు సైజు ఫోటోలను తీసుకు రావాలి. ఫోటోలు తీసుకు రాని వారికి పరీక్షలకు అనుమతించరు.
·అభ్యర్ధులకు థర్మల్ స్క్రీనింగు చేయుటకు ఉదయం 8 గంటల నుండి, మధ్యాహ్నం పరీక్షలకు ఒంటి గంట నుండే అభ్యర్ధులకు పరీక్షా కేంద్రాలలోకి అనుమతి.
· మోబైల్, సెల్ ఫోన్, క్యాలిక్యులేటర్లు, టాబ్లెట్స్, ఐ పాడ్, బ్లూ టూత్, పేజర్స తదితర ఏ ఎలక్ట్రానిక్ పరికరం అనుమతించడం జరగదు. నిబంధనలు అతిక్రమించిన వారిని పరీక్షలకు అనర్హులుగా చేయడం జరుగుతుంది.
·అభ్యర్ధులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పెన్ తో మాత్రమే ప్రశ్నాపత్రం, ఓఎంఆర్ షీట్ పై రాయాలి. ఇతర పెన్నులు వినియోగం చెల్లదు. అటువంటి జవాబు పత్రాలు అనర్హమైనవిగా గుర్తిస్తారు. ప్రశ్నాపత్రం బుక్ లెట్ సిరీస్ (ఏ,బి,సి,డి)ను ఓఎంఆర్ షీట్ లో నిర్ధేశిత ప్రదేశంలో విధిగా నింపాలి.
·అభ్యర్ధులు నిర్ధేశిత ప్రదేశంలో హాల్ టికెట్ నంబరు రాయాలి. కేటాయించిన ప్రదేశంలో సంతకం చేయాలి. ఇన్విజిలేటర్ తో సంతకం చేయించుకోవాలి.
· ఓఎంఆర్ షీట్ ఒరిజినల్, డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులకు అందించడం జరుగుతుంది. డూప్లికేట్ కాపీలను అభ్యర్ధులు తీసుకొని వెళ్ళవచ్చును.
·ప్రశ్నాపత్రంపై ఎటువంటి రాతలు ఉండరాదు. జవాబులను సైతం మార్కు చేయరాదు.
·ఓఎంఆర్ షీట్ పై వైట్ నర్ (కరెక్షన్ ఇంక్) లేదా ఇతర మార్కర్లు వినియోగించితే అటువంటి ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కావు
·పరీక్షా రూమ్ లో ఇతర అభ్యర్ధులతో మాట్లాడటం, ఇతర అభ్యర్ధులను డిస్టర్బ్ చేసే వారిని పరీక్షల నుండి అనర్హులుగా పరిగణిస్తారు.
·పరీక్షా కేంద్రంలో ఎటువంటి అసభ్యకర ప్రవర్తనను అనుమతించేది లేదు. అటువంటి అభ్యర్ధులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరుగుతుంది.
·తరచూ మరుగుదొడ్లకు వెళ్ళడానికి అనుమతించడం జరగదు. అత్యవసరమైతే మినహా వెళ్ళరాదు. చూచిరాతలు, ఇతరత్రా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఎడల అనర్హులుగా చేయడం జరుగుతుంది.
·పరీక్షా సమయం 150 నిమిషాలుగా మాత్రమే. ప్రశ్నాపత్రం ఇంగ్లీషు, తెలుగు మాద్యమాల్లో ఉంటుంది.
·నెగిటివ్ మార్కులు : తప్పుగా రాసిన జవాబులకు నెగిటివ్ మార్కులు ఉంటాయని అభ్యర్ధులు గమనించాలి. తప్పుగా నాలుగు జవాబులు రాస్తే ఒక మార్కు పోతుంది.
·పరీక్ష పూర్తి అయ్యే వరకు ఏ అభ్యర్ధిని బయటకు విడిచిపెట్టడం జరగదు.
·సహాయకలులు (స్కైబ్) అవసరమని ముందుగా కోరిన విభిన్న ప్రతిభావంతులకు సహాయకులను ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికప్పుడు సహాయకులు అవసరమని కోరితే సమకూర్చడం జరగదు.
· పరీక్షా కేంద్రం వివరాలను https://vsws.ap.gov.in లేదా http://gramasachivalayam.ap.gov.in వెబ్ సైట్ ను సంప్రదించి అభ్యర్ధులు పొందవచ్చును.
·కోవిడ్ దృష్ట్యా సురక్షిత చర్యలు తీసుకోవాలి
· ప్రతి అభ్యర్ధి ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి
·మాస్కు విధిగా ధరించాలి. మాస్కు లేకపోతే పరీక్షా హాల్ లోకి ప్రవేశం లేదు. సొంతంగా శానిటైజర్ తెచ్చుకోవాలి
·ఎవరి తాగు నీరు వారు తీసుకు రావడం ఉత్తమం. ఇతర వ్యక్తులు ఉపయోగించిన వస్తువులు వినియోగించకుండా ఉండవచ్చు. పారదర్శకంగా ఉన్న నీళ్ళ బాటిల్స్ తెచ్చుకోవచ్చు.
· కోవిడ్ లక్షణాలు ఉన్న అభ్యర్ధులు తమ పరిస్ధితిని తెలియజేయాలి. అటువంటి వారికి ఐసోలేషన్ రూమ్ లు ఏర్పాటు
·పరీక్ష రాసే సమయంలో ఎటువంటి అస్వస్తత కనిపించిన పరీక్షల నిర్వాహకులకు తెలియజేయాలి.
దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా ఆప్కో చేనేత వస్ర్తాలపై ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్లు ఆప్కో డివిజనల్ మార్కెటింగ్ ఆఫీసర్ బి.ఉమాశంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, దసరా, దీపావళి సందర్భంగా ఎంపిక చేసిన చేనేత వస్త్రాలకు ఒకటి కొంటే రెండు లేదా ఒకటి ఉచితంగా , అలాగే అన్నిరకాల చేనేత వస్త్రాలపై 30శాతం ప్రత్యేక తగ్గింపును ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ సదవకాశాన్ని చేనేత వస్త్రప్రియులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధర్మవరం, వెంకటగిరి, మాధవరం, ఉప్పాడ, గుంటూరు, బందరు, రాజమండ్రి, మంగళగిరి పట్టు మరియు కాటన్ చీరలు , దుప్పట్లు, బెడ్ షీట్స్, లుంగీలు, టవల్స్, షర్టింగ్ క్లాత్ మొదలైన వస్త్రాలు లభించనున్నాయని, విరివిగా వస్త్రాలను కొనుగోలు చేసి చేనేత పరిశ్రమను ప్రోత్సహించాలని ఈ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ప్రకటించినట్టు ఆయన తెలియజేశారు.
ఓజోన్ పొరను కాపాడేందుకు ప్రతీ ఒక్కరూ విధిగా మొక్కలు పెంచాలని గాయత్రీ విద్యాపరిషత్ ఉపాధ్యక్షులు డి.దక్షిణామూర్తి పిలుపునిచ్చారు. ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్నిపురష్కరించుకొని గాయత్రీ విద్యాపరిషత్ డిగ్రీ, పీజీ కళాశాలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతీ ఏటా ఓజోన్ దినోత్సవా న్ని క్రమం తప్పకుండా నిర్వహించి ప్రాంగణంలో మొక్కలు నాటతమాన్నారు. అంతేకుండా వాటిని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పెంచుతామని కూడా వివరించారు. . పర్యావరణ హితమైన కార్యక్రమాలు తాము నిత్యం నిర్వహిస్తామని ఈ సందర్భంగా చెప్పారు. కార్యక్రమంలో జీవీపీ , ఇతర యాజమాన్య సభ్యులు డీవీఎస్ కామేశ్వర రావు, ఆచార్య ఎ.నాగేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్.రజని, యూజీ డైరక్టర్ ఆచార్య ఐ.ఎస్.పల్లవి, పర్యావరణ విభాగాధిపతి డాక్టర్ జి.లక్ష్మీ నారాయణ పర్యవేక్షణలో వాలంటీర్లు వ్యక్తుల మధ్య దూరం పాటిస్తూ పాల్గొన్నారు.
ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 3(పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4) పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన జిల్లాలోని పలువురు అభ్యర్థులు పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్నారు. విశాఖలో బుధవారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, 2018 డిసెంబర్‌లో గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడడం, 2019 ఏప్రిల్ లో ప్రాథమిక పరీక్షను ప్రభుత్వం నిర్వహించిందన్నారు. ఆగస్టు 2019లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించి, ఫలితాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేశారన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆగస్టు 10న నగరంలోని డీపీఓ కార్యాలయంలో నిర్వహించారని చెప్పారు. ఇతర జిల్లాల్లో అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వడం, వారు మూడు నెలలకు పైగా జీతాలు కూడా తీసుకున్నారని, విశాఖజిల్లాలో మాత్రం పోస్టింగ్ కోసం ఎదురు చూస్తునే ఉన్నామన్నారు. తాము ఇప్పటికే ఏడు నెలలుగా పైగా సర్వీసును కోల్పోయామని, ఈ విషయమై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశామని, ఇప్పటికైనా తమకు పోస్టింగు ఇప్పించాలని కోరారు.
విఎంఆర్డిఏ చేపట్టిన ఎన్ఏడి ఫ్లై-ఓవర్ ( ఫై వoతేన) నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని మెట్రోపాలిటన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. బుధవారం ఈమేరకు అదనపు కమిషనర్ మనజిర్ జీలని సామూన్ తో కలిసి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడు తూ, ప్రణాళిక ప్రకారం ఈ నెల సెప్టెంబర్ 15 లోపు గోపాలపట్నం వైపు నుంచి వచ్చే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యవలసి ఉండగా నిర్ణీత సమయానికే పనులు పూర్తయ్యాయన్నారు. అదేవిధంగా అక్టోబర్ 15 లోపు మర్రిపాలెం వైపు వెళ్లే ఫ్లైఓవర్ పనులను పూర్తి చెయ్యాలని అధికారులకు ఆదేశించారు. నవంబర్ 15 లోపు ఎన్ఎస్టీఎల్ నుంచి ఎయిర్పోర్ట్ వైపు వెళ్లే రహదారి పనులు పూర్తి చేసి, అప్పర్ రోటరీ మొత్తాన్ని వినియోగంలోకి తీసుకొని రావాలని చీఫ్ ఇంజనీర్ కె.రామ్మోహ నరావుని ఆదేశించారు. వంతెన కాంట్రాక్టర్ తో సంప్రదింపులు జరిపి అనుకున్న తేదీల్లోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉమా శంకర్ , జనరల్ మేనేజర్ క్రిహ్ష్ణమోహన్, ఈపిసి కాంట్రాక్టర్ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటూ సంపత్ వినాయగర్ కు ప్రత్యేక పూజలు చేసినట్టు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పా రు. బుధవారం ఆశీల్ మెట్టలోని శ్రీశ్రీశ్రీ సంపత్ వినాయగర్ ని దర్శించుకున్న ఎమ్మెల్యే స్వామికి పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ వలన రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది ప్రజలు మ్రుత్యువాత పడటం తనను ఎంతో బాధకలిగించిందని చెప్పారు. విశాఖలోని ప్రముఖ దేవాలయాలన్నీ తిరిగి కరోనా మహమ్మారి నిర్మూలన జరిగేలా పూజలు చేస్తున్నామన్నారు. నగర ప్రజలు కూడా ఈ వైరస్ నుంచి రక్షణ పొందడానికి సామాజిక దూరం పాటిస్తూ, తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 4.0 అన్ లాక్ నిబందనలు పాటించాలని కోరారు. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే దగ్గర్లోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలన్నారు. పాజిటివ్ వస్తే హోమ్ ఐసోలేషన్ లో ఖచ్చితంగా 14 రోజులు జాగ్రత్తగా ఉండి మందులు వాడాలన్నారు. ప్రాణాలకంటే ఏదీ ముఖ్యం కాదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలని ఎమ్మెల్యే వాసుపల్లి సూచించారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు జిల్లా కలెక్టర్ జె.నివాస్ బుధ వారం మీడియాకి వివరించారు. సెప్టెంబరు 17,18 తేదీలతో సహా 21 నుండి 25 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాల, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాల, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాల, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు జరుగుతాయని ఆయన వివరించారు. రాజాం జి.ఎం.ఆర్ ఇంజనీరింగు కళాశాలలో 2,725 మంది, టెక్కలి ఆదిత్య ఇంజనీరింగు కళాశాలలో 3,473 మంది, ఎచ్చెర్ల శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగు కళాశాలలో 2,213 మంది, శ్రీ శివాని ఇంజనీరింగు కళాశాలలో 2,042 మంది 25వ తేదీ వరకు జరిగే పరీక్షలకు హాజరు కానున్నారని ఆయన తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేసామని చెప్పారు. పూర్తి స్ధాయి బందోబస్తు ఉందని, 144వ సెక్షన్ పరీక్షా కేంద్రాల వద్ద ఉందని ఆయన పేర్కొన్నారు. సంబంధిత తహశీల్దార్లకు సైతం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు కనీసం గంట ముందుగా హాజరు కావాలని, ఒక్క నిమిషం ఆలస్యం జరిగినా కూడా అనుమతించేది లేదని గమనించాలని ఆయన సూచించారు. కోవిడ్ వ్యాప్తి ఉన్నందున తగిన ఏర్పాట్లు, సురక్షిత చర్యలతో పరీక్షలకు హాజరు కావాలని ఆయన కోరారు.
గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్థి మరియు పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేది వరకు నిర్వహించనున్న గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలపై విజయవాడ నుండి బుధవారం జిల్లా కలెక్టర్లు, ఎస్.పి.లు, మున్సిపల్ కమీషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించినట్లుగానే ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రశ్నా పత్రాలు జిల్లా కేంద్రాలకు చేరాయన్నారు. సరిపడిన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు పరీక్షా కేంద్రాల వద్ద తగు ఏర్పాట్లు చేస్తారని తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు రవాణాకు అంతరాయం లేకుండా రవాణా శాఖ, ఎపిఎస్.ఆర్టి.సి తగు చర్యలు తీసుకుంటారని, విద్యుత్, గ్రామీణ ప్రాంతంలో డిపిఓ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమీషనర్లు పరీక్ష కేంద్రాల వద్ద శానిటేషన్, తాగునీరు చూడాలని ఆయన సూచించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ ఉంటే వారికి పరీక్ష కేంద్రం వద్ద ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలని, ఇన్విజిలేటర్ కు పిపిఇ కిట్ ఇవ్వాలన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ లు, పిపిఇ కిట్లు ఉండాలని పేర్కొన్నారు. ఎక్కడా పొరపాటు జరగకుండా పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలన్నారు.
రాష్ట్ర పట్టణాభివృద్థి మరియు పరిపాలన శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలలో మంచి పేరు వచ్చిందని, కోవిడ్ -19 ఉన్న దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలన్నారు. మున్సిపల్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాలను శానిటైజేషన్ చేయాలని సూచించారు. అభ్యర్థులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పంచాయితీరాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ కోవిడ్-19 పాజిటివ్ అభ్యర్థులు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేసి అందులో పరీక్ష పెట్టాలన్నారు. ప్రతీ పరీక్షకేంద్రం వద్ద ఒక ఐసోలేషన్ రూం ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ అభ్యర్థులకు మందులు కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సరఫరా చేస్తారని తెలిపారు. పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద అవసరం అయితే ఐసిడిఎస్ సిబ్బందిని వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ముందుగానే చేరుకోవాలని, అక్కడ ధర్మల్ స్కాన్ ఉంటుందని, అక్కడ ఆలస్యం జరుగుతుందని చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు, మాస్క్ లు ఉండాలన్నారు. గ్రామ/వార్డు సచివాలయాల సిబ్బంది సర్వీసులు వినియోగించుకోవాలని ఆయన చెప్పారు.
జిల్లా జాయింట్ కలెక్టర్-1 వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు చెప్పారు. ఎలాంటి సమస్యలు లేవని తెలిపారు. జివియంసి కమీషనర్ జి. సృజన మాట్లాడుతూ ఈ మధ్యన ఒక పరీక్షకు అభ్యర్థులకు మాత్రమే ఆర్.టి.సి. బస్సులను నడిపినట్లు చెప్పారు. ఆలాగే గ్రామ/వార్డు సచివాలయాల పరీక్షలకు ఆర్.టి.సి. బస్సులను అభ్యర్థులకు కోసం మాత్రమే నడిపేందుకు తగు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. కృష్ణారావు, జిల్లా పరిషత్ సిఇఓ నాగార్జున సాగర్, డిపిఒ కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లా లో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టరు ఆర్. గోవిందరావు అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాహనదారులకే కాకుండా ప్రజలందరికీ రహదా రి భద్రతపై పూర్తి అవగాహన కలిగించాలన్నారు. ప్రమాదాలకు కారణమౌతున్న అతివేగం, అవగాహనా రాహిత్యం, అలసత్వాల మూలంగా జరిగే ప్రమాదాలు, వాటి వలన కుటుంబాలకు జరిగే నష్టాలపైన తెలియజేయాలన్నారు. ప్రమాదాలు జరిగేందుకు అవకాశం వున్న ప్రదేశాలను రవాణా, పోలీసు, ఇంజనీరింగ్ శాఖల అధికా రులు జాయింట్ ఇనస్పెక్షన్ చేయాలన్నారు. అటువంటి ప్రదేశాలలో తక్షణ చర్యలు, నిర్మాణాలు చేపట్టాలన్నారు. రవాణాశాఖ ఉప కమీషనరు రాజరత్నం మాట్లా డుతూ గత సంవత్సర కాలంలో రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయన్నారు. కోవిడ్ లాక్ డౌన్ పరిస్థితులు ఏర్పడక ముందే జిల్లాలో ప్రమాదాల రేటు 20.95 శాతం తగ్గందని, రాష్ట్ర తగ్గుదల సగటు కంటే ఎక్కువగా వుందన్నారు. కోవిడ్19 మూలంగా వాయిదా పడిన నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని వివిధ శాఖల అధికారులకు ఆయన విజ్ఖప్తి చేశారు. నగరంలో జాతీయరహదారి పై నున్న డివైడర్ల పై పెంచే మొక్కలు ఎత్తుగా పెరిగి నందున క్రాసింగ్స్ వద్ద పాదచారులకు వాహనాలు కనబడక ప్రమాదాలకు కారణమౌతున్నాయని పోలీసు శాఖ వారు తెలియజేశారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జివియంసి వారిని కోరారు. ఈ సమావేశం లో అడిషనల్ ఎస్.పి. బి.అచ్యుతరావు, ఎసిపిలు ఎమ్.ఆర్.కె రాజు, సిహెచ్.పాపారావు, జివియంసి ఎసి.ఈ. కె.శాంసన్ రాజు, ఆర్.అండ్ బి ఎస్.ఈ. వి.కేశవరావు, ఎపిఎస్ ఆర్టిసి డివియం బి.ఎ.నాయుడు, పంచాయితీరాజ్ ఎస్.ఈ. జి.సుధాకరరెడ్డి, కెజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.వి.సుధాకర్ , డిఎంఅండ్.హెచ్.వో డాక్టర్ కె.విజయలక్ష్మి , డి.సి.హెచ్. వి.లక్ష్మణరావు ఆర్టీవోలు జి.ఆర్.రవీంద్రనాధ్, ఐ.శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో రెండు రోజులు పాటు జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపక (లెక్చరర్) పోస్టుల నియామక పరీక్షలకు 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజ రైనట్లు జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి పేర్కొన్నారు. సెప్టెంబర్ 15 మరియు 16వ తేదీల్లో నిర్వహించిన డిగ్రీ అధ్యాపక పరీక్షలు ప్రశాంతంగా ముగిసా యని, ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని స్పష్టం చేసారు. ఉదయం 9.30గం.ల నుండి మధ్యాహ్నం 12.00గం.ల వరకు, మధ్యా హ్నం 3.00గం.ల నుండి సాయంత్రం 5.30గం.ల వరకు రెండు విడతలుగా రాజాంలోని జి.యం.ఆర్.ఐ.టి, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీ వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాలలతో పాటు టెక్కలి ఐతం ఇంజినీరింగ్ కళాశాలల్లో పరీక్షలు జరిగిన సంగతి విదితమే. ఇందుకు జిల్లావ్యాప్తంగా 487 మంది అభ్యర్ధులు హాజరుకావాల్సి ఉండగా 296 అభ్యర్ధులు హాజరయ్యారని, 191 మంది అభ్యర్ధులు హాజరుకాలేదని ఆయన వివరించారు. దీంతో 60.78 శాతం మంది అభ్యర్ధులు హాజరు అయినట్లు డి.ఆర్.ఓ స్పష్టం చేసారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించిన కళాశాలల యాజమాన్యాలు, ఏ.పి.పి.యస్.సి కార్యాలయ సెక్షన్ ఆఫీసర్ ఢిల్లీశ్వరరావు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పద్మప్రియ, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ ఆఫీసర్లు, ఉప తహశీల్ధారులు, ఇతర సిబ్బంది తదితరులకు డి.ఆర్.ఓ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం పరిధిలో పీజీ, ప్రొఫిషనల్ కోర్సుల పరీక్షల తేదీలను ఖరారు చేసినట్లు పీజీ పరీక్షల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.ఆదిలక్ష్మి తెలియజే శారు. బుధవారం ఆమె ఏయూలో మీడియాతో మాట్లాడుతూ, సైన్సు కోర్సులకు సెప్టెంబరు 28 నుంచి పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఆర్టస్ విభాగంలో తొలిదశలో సెప్టెంబరు 28 నుంచి ఆర్టస్ విభాగంలో ఆంత్రపాలజీ, ఎకనామిక్స్, ఇంగ్లీషు, ఫైన్ ఆర్టస్, హిందీ, సంస్కృతం, యోగా కోర్సులకు, రెండో దశలో అక్టోబరు 7వ తేదీ నుంచి కామర్స్-మేనేజ్‌మెంట్, ఎడ్యుకేషన్, చరిత్ర, ఆర్కియాలజీ, హెచ్‌ఆర్‌ఎం, జర్నలిజం, లైబ్రరీ సైన్స్, సంగీతం, ఫిలాసఫీ, ఫిజికల్ ఎడ్యుకేషన్, పొలిటికల్ సైన్స్-పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, తెలుగు, థియేటర్ ఆర్టస్, వుమెన్ స్టడీస్, సోషియాలజీ, హెచ్‌ఆర్‌డి కోర్సులకు పరీక్షలు జరుగుతాయన్నారు. లా పరీక్షలు అక్టోబరు 7 నుంచి, బిఫార్మరీ పరీక్షలు 21 సెప్టెంబరు నుంచి , బిఇడి పరీక్షలు అక్టోబరు 8 నుంచి నిర్వహిస్తారు. పూర్తి వివరాలను ఏయూ వెబ్‌సైట్ నుంచి పొందాలని సూచించారు.
దక్షిణ భారత హిందీ ప్రచారసభ చెన్నై నిర్వహించే వివిధ హిందీ పరీక్షలకు సమయం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని కేంద్రాలకు వర్తమానం పంపిం ది. ఆశక్తిగల అభ్యర్ధులు పది రూపాయలు అపరాధ రుసుతో ఈనెల 25వ తేదీ వరకు దరఖాస్తు చేసుకొవచ్చని భీముని పట్నంలోని స్థానిక ఆదర్శ హిందీ ప్రేమీ మండలి అధ్యక్షుడు కేఎస్‌ఆర్ కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హిందీ ప్రచారసభ పరీక్షలకు గడుపు పూర్తికాగా, అభ్యర్ధుల నుంచి వస్తున్నఅభ్యర్ధన మేరకు 25వ తేదీవరకూ గడువు పొడిగింపు ప్రకటన చేసిందన్నారు. పరీక్షలు కట్టిన విద్యార్ధులకు ఈనెల 31, నవబర్ 1వ తేదీల్లో స్థానిక పండిత్‌నెహ్రూ నగరపాలక ఉన్నత పాఠశాల కేద్రంగా పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆశక్తివున్న అభ్యర్ధులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. పరీక్షఫీజులు, ధరఖాస్తులు ఇతర వివరాలకు 8985647419లోగానీ స్వయంగా గానీ సప్రదించాలని నిర్వాహకులు కోరారు.
శ్రీకాకుళం జిల్లాలోని వంశధార–నాగావళి అనుసంధాన హైలెవెల్ ప్రాజెక్టును ప్రాధాన్యతా రంగ ప్రాజెక్టుగా ముఖ్య మంత్రి ప్రకటించారని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం తెలిపారు. బూర్జ మండలం లంకం, చిన్న లంకం వద్ద వంశధార నాగావళి అనుసంధానం జరుగుతున్న హై లెవెల్ కెనాల్ ను సభాపతి మంగళ వారం సందర్శించారు. అనంతరం రైతులతో భూసేకరణపై సభాపతి చర్చించారు. హిర మండలం వద్ద వంశధార నుండి నాగవళి లో నారాయణపురం ఆనకట్ట ఎగువన కలుస్తుందని, చీడివలస నుండి చినలంకం వరకు సుమారుగా 5 వేల ఎకరాలకు కొత్తగా సాగు నీరు అందుతుందని చెప్పారు. గజ్జల గెడ్డ, దేశయగెడ్డ,ఓని గెడ్డలకు ప్రతి సంవత్సరం వరద సమయంలో ముంపుకు గురవుతున్నాయని ఈ సమస్యకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని ఆయన చెప్పారు. కాలువ దిగువన కొల్లివలస - నారాయణపురం రోడ్డు నీరు వెళ్లక ముప్పు గురవుతారని రైతులు సభాపతి దృష్టికి తీసుకు వెళ్ళారు. చీడివలస దిగువ నుండి నీరు పోవటానికి 3 అండర్ టర్నల్ ప్రతిపాదన ఉన్నాయని, వాటి సామర్ధ్యం ను పెంచాలని సభాపత్ తమ్మినేని అధికారులకు సూచించారు. దిగువన ఉన్న రోడ్డు ఎత్తు పెంచి కల్వర్టులు నిర్మిస్తామని రైతులకు తెలిపారు. హై లెవెల్ కాలువ నిర్మాణం వలన రైతులకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పెద్ద పెట వద్ద ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రతిపాదించామని ఆయన పేర్కొన్నారు. హై లెవెల్ కెనాల్ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు హైలెవెల్ కాలువ నిర్మాణ వివరాలను వివరించారు. భూ సేకరణకు సంబంధించి కొంత మేర చెల్లింపులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలుర క్రికెట్ సంఘం అధ్యక్షులు తమ్మినేని చిరంజీవి నాగ్, భూ సేకరణ ఉప కలెక్టర్ కాశీవిశ్వనాథ రావు, జలవనరుల శాఖ ఇంజనీర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు
శ్రీకాకుళం జిల్లాలో మంచి పర్యాటక ప్రదేశంగా దాలసరి జలపాతంను తీర్చిదిద్దుతామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. మందస మండలం చీపి పంచాయతీ దాలసరి గ్రామం వద్ద కొత్తగా కనుగొన్నజలపాతాన్ని మంత్రి మంగళ వారం సందర్శించారు. శ్రీకాకుళం జిల్లా ప్రకృతి శోయగాలకు నిలయమని మంత్రి అన్నారు. పలాస నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు కొదవ లేదని ఇందులో భాగంగా మరింత సుందరంగా తీర్చిదిద్దుటకు కృషి చేస్తామని ఆయన అన్నారు. దాలసరి జలపాతం రాబోయే రోజుల్లో ఒక మంచి పర్యాటక స్ధలంగా ఫరిడవిల్లగలదని ఆయన పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలపై వారం రోజుల్లో కార్యాచరణ తయారు చేయుటకు చర్యలు చేపడతామని అన్నారు. అవసరమైతే ఒరిస్సా ప్రభుత్వంతోను, ఐ.టి.డి.ఎ అధికారులతోను మాట్లాడి దాలసరి జలపాతం అభివృద్ధికి కృషి చేస్తామని తెలియజేశారు. పలాస నియోజకవర్గంలో ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన జలపాతాలను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులకు గొప్ప ఆహ్లాదకరమైన పిక్నిక్ స్పాట్ గా తయారు చేయుటకు ప్రయత్నిస్తామని అన్నారు. ఈసందర్భంగా దాలసరి గ్రామస్తులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి పూలమాలలతో సత్కరించారు.
గ్రామ,వార్డు సచివాలయ రిక్రూట్ మెంట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళ వారం నాడు స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రిక్రూట్ మెంట్ పరీక్షలు నిర్వహించే అధికారులు, పరీక్షల ప్రారంభానికి ముందు, జరుగుతున్న సమయంలో , పూర్తయిన తర్వాత చేయవలసిన పనుల మీద పూర్తి అవగాహనతో శ్రధ్ధ తో పని చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ సీరియస్ గా తీసుకోవాలని కమిట్ మెంట్ తో పని చేయాలని అన్నారు. పరీక్షల నిర్వహణ లో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా సక్రమంగా సజావుగా ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు విద్యుత్,గాలి, వెలుతురు సక్రమంగా అందే విధంగా చూడాలని సంబంధిత అధికారులను కోరారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పరీక్షలు సజావుగా నిర్వహించాలని ఆయన అన్నారు. పోలీసు శాఖ పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూములకు భద్రత కల్పించాలని, రూట్ అధికారులు మెటీరియల్ తీసుకు వెళ్ళేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలని తెలిపారు. ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న సచివాలయ ఉద్యోగాల రాతపరీక్షల నిమిత్తం కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాలవద్ద పకడ్బంధీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల్లోకి ప్రవేశించే ప్రతీ అభ్యర్థికీ థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి, శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయాలన్నారు. శానిటైజర్ వేసి, చేతులు శుభ్రం చేసుకున్న తరువాతే లోపలికి పంపించాలని చెప్పారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలని, అవసరమైతే ఉపయోగించడానికి ప్రతీ కేంద్రంలో మాస్కులను కూడా రిజర్వులో ఉంచాలని సూచించారు. కోవిడ్ పాజిటివ్ రోగులు పరీక్షలు రాసేందుకు అనుగుణంగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్దా ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రతీ పరీక్షా కేంద్రంవద్ద 2 ఎఎన్ఎం లను, 2 ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు, మాస్కులు, థర్మల్ స్కానర్ లు, పల్స్ ఆక్సీమీటర్, అవసరమైన మందులను కూడా సిద్దంగా ఉంచాలని డిఎంహెచ్ఓ కు సూచించారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి చేరుకొనేందుకు వీలుగా ఆర్‌టిసి అధికారులు బస్సులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మెటీరియల్ తీసుకు వెళ్ళేందుకు డిజిటి బస్సులు ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చూడాలని తెలిపారు. మొత్తం 1,50,441 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు, ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటలు వరకూ పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతీ అభ్యర్థి కనీసం 45 నిమిషాల ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉందన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థుల మధ్య భౌతిక దూరాన్ని పాటించేందుకు అనువుగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెంటర్ల స్పెషల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లు, ఛీఫ్ సూపరింటిండెంట్లు, అదనపు ఛీప్ సూపరింటిండెంట్లు, హాల్ సూపరింటిండెంట్లను, ఇన్విజిలేటర్లను నియమించినట్లు వారికి సమగ్ర శిక్షణ ను ఇచ్చినట్లు వివరించారు.
ఈ సమావేశంలో రూరల్ పోలీసు సూపరింటెండెంట్ కృష్ణా రావు, జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, జీవియంసి కమీషనర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ గోవింద రావు, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, డి ఆర్ ఓ ఎ.ప్రసాద్, ఆర్డీఓ కిషోర్, జిల్లా పరిషత్ సిఈఓ నాగార్జున సాగర్, డిపిఓ కృష్ణ కుమారి, డిఎంహెచ్ఓ విజయ లక్ష్మి, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, డిటిసి రాజారత్నం, ఈపీసీడీఎల్ ఎస్ ఈ సూర్య ప్రతాప్, ఇతర అధికారులు పాల్గొన్నారు.