శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగు తున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ఆది వారం లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందించారని చెప్పారు. మందుల దుకాణాలు లభ్యంగా ఉంటాయని, వాటితోపాటు వాటికి ఆనుకుని పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియోగించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేసారు. అంబులైన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని పేర్కొంటూ అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు. అయితే అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పేదలకు అండగా ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ఉంటారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు అన్నారు. పలా స కాశీబుగ్గ మున్సిపాలిటి పరిధిలో గల చిన్నబాడం గ్రామనికి చెందిన డిక్కల వేదవతి ఇటీవల అనారోగ్యం భారీన పడ్డారు. అనారోగ్యం నుండి కోలుకోవడానికి అవస రమగు ఖర్చు పెట్టే స్ధోమత లేక దయనీయ స్ధితిలో ఉన్న వేదవతికి ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి సహాయం లభిస్తుందని తెలియడంతో దరఖాస్తు చేసుకు న్నారు. ముఖ్యమంత్రి సహాయనిదికి వేగవతి దరఖాస్తు చేయగా శాసన సభ్యులుగా ఉన్న అప్పల రాజు చొరవ తీసుకుని ఆమెకు రూ.25 వేలు మంజూరు కావడానికి కృషి చేసారు. ముఖ్య మంత్రి సహాయ నిధి నుండి విడుదల అయిన రూ.25 వేల చెక్కును మంత్రి శనివారం వేదవతికి పలాసలో అందించారు. పేదలకు అండగా ముఖ్య మంత్రి ఉంటూ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని హైలెవల్ కెనాల్ పనులు వేగవంతం చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. కెనాల్ పనుల ప్రగతిపై శని వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రాధాన్యతా ప్రాజెక్టులలో వంశధార – నాగావళి అనుసంధాన హై లెవెల్ కెనాల్ పనులు ఉన్నాయని సభాపతి అన్నారు. పెండింగు బిల్లులు త్వరగా విడుదల చేయుటకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. భూ సేకరణలో రైతులతో సమస్యలు ఉన్న చోట రైతులతో మాట్లాడతామని సీతారాం తెలిపారు. ఇతర ప్రాంతాల్లో భూసేకరణ పెండింగు లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు. వంశధార – నాగావళి అనుసంధానం వలన అదనంగా కొంత ఆయకట్టుకు నీరు అందుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజినీర్ సి.హెచ్.శివరాం ప్రసాద్, వంశధార పర్యవేక్షక ఇంజనీరు పి.రంగారావు, కార్యనిర్వాహక ఇంజనీరు జి.సుశీల్ కుమార్, ప్రత్యేక డిప్యూటి కలెక్టర్ కాశీవిశ్వనాథ్, ఉప కార్యనిర్వాహక ఇంజనీరు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సూపర్ 60 బ్యాచ్ గిరిజన విద్యార్ధి అఖిల భారత స్ధాయిలో ఎస్.టి కేటగిరిలో 346 వ ర్యాంకు సాధిం చారని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ తెలిపారు. శనివారం శ్రీకాకుళం యూత్ ట్రైనింగ్ సెంటర్ (వై.టిసి)లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావే శంలో జెఇఇ మెయిన్స్ లో సూపర్ 60 బ్యాచ్ సాధించిన విజయాలను ప్రాజెక్టు అధికారి ప్రకటించారు. జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచనల మేరకు అప్పటి ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి సి.యం సాయికాంత్ వర్మ గిరిజన విద్యార్ధులకు సూపర్ 60 బ్యాచ్ ప్రారంభించి జెఇఇ, ఐఐటి, నీట్ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్ ప్రారంభిం చారని చెప్పారు. జిల్లా కలెక్టర్, ప్రాజెక్టు అధికారి కృషికి ఫలితాలు దక్కాయని ఆయన పేర్కొంటూ కలెక్టర్, పి.ఓలకు కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ 60 బ్యాచ్ లో 55 మంది విద్యార్ధులను ఎంపిక చేసి తీసుకోవడం జరిగిందని వారికి అత్యుత్తమ కోచింగు ఏర్పాటు చేసామన్నారు. కోవిడ్ 19 కారణంగా తరగతి గదిలో కోచింగును నిలిపివేయడం జరిగిందని, ఆన్ లైన్ ద్వారా బోధించామని పేర్కొన్నారు. విద్యార్ధులకు లాప్ టాప్ లు, రౌటర్ లు పంపిణీ చేసామని శ్రీధర్ చెప్పారు. 55 మందిలో 33 మంది జెఇఇలో అర్హత సాధించారని, అందులో 21 మంది విద్యార్ధులకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్.ఐ.టి)లలో సీట్లు లభిస్తాయని చెప్పారు. 33 మందిలో 26 మంది ఆదివాసీ తెగ (ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్)కు చెందిన సవర తెగకు చెందిన వారని వివరించారు. అఖిల భారత స్ధాయిలో 95.77 పెర్సంటైల్ సాధించి ఎస్.టి కేటగిరిలో 346 ర్యాంకును ఎం.ఎర్తా సింగ్ సాధించారని చెప్పారు. సూపర్ 60 బ్యాచ్ కు చెందిన ఎన్.సునిల్ 88.74 పెర్సంటైల్ సాధించి అఖిల భారత స్ధాయి ఎస్.టి కేటగిరిలో 1368 ర్యాంకు సాధించారని చెప్పారు. ఈ నెల 27వ తేదీన జెఇఇ అడ్వాన్సుడు పరీక్ష ఉందని, అందుకు విద్యార్ధులను సిద్ధం చేయడం జరుగుతోందని ప్రాజెక్టు అధికారి చెప్పారు. కనీసం 8మంది విద్యార్ధులకు ఐఐటిలలో సీట్లు లభిస్తాయని ఆశిస్తున్నట్లు శ్రీధర్ చెప్పారు. జెఇఇ మెయిన్స్ లో 90 పర్సంటైల్ దాటిన విద్యార్ధి ఒకరు కాగా, 80 పర్సంటైల్ దాటిన విద్యార్ధులు ముగ్గురు, 70 పర్సంటైల్ దాటిన విద్యార్ధులు 11 మంది ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని ఐటిడిఏల పరిధిలో పరిశీలిస్తే సీతంపేట ఐటిడిఏ పరిధి విద్యార్ధులు మంచి ర్యాంకులు సాధించి విజయదుందుభి మోగించారని పి.ఓ అన్నారు.
తిరుమల కల్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న పురుష, మహిళా క్షురకులకు రూ.10 లక్షలు విలువ గల రెండు జతల పంచలు, షర్టులు, చీరలను శనివారం ఉద యం టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విరాళంగా అందించారు. తిరుమల ప్రధాన కల్యాణకట్టలో 1050 మంది పురుష క్షురకు లకు రెండు జతల పంచలు, షర్టులు (2,100 పంచలు, షర్టులు), 275 మంది మహిళా క్షురకులకు రెండు జతల చీరలను (550 చీరలు ) టిటిడి అదనపు ఈవో ఏ.వి. ధర్మారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్యాణకట్ట క్షురకులు ధర్మకర్తల మండలి సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్ర మంలో డెప్యూటీ ఈవో సెల్వం, ఏఈవో జగన్మోహనాచారి, ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం విశ్రాంత అధర్వణ వేద పండితులు, వేద రత్నాకర బ్రహ్మశ్రీ వడ్లమాని వెంకటేశ్వరశర్మ అవధాని పరమపదించారు. ఇటీవల ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇంటి వద్దనే తుదిశ్వాస విడిచారు. కాశీ పంతులుగా సుపరిచితులైన వడ్లమాని 1976లో సింహాచ లం దేవాలయం అధర్వణ వేద పండితునిగా ఉద్యోగంలో చేరారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తన వేద పారాయణతో సింహాచలేశునికి సేవలందించారు. ఈయన వద్ద వేద విద్యను నేర్చుకున్న సుమారు 250 విద్యార్థులు పండితులుగా భారతదేశంలోనే కాక ప్రపంచంలోని వివిధ దేశాలలో మహా పండితుల హోదాల్లో తమ కర్తవ్యాలను నిర్వహిస్తున్నారు. విశిష్టాద్వైత సిద్దాంత ప్రకాశకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి చేత కూడా గురువుగారూ అని పిలిపించుకుని గురువులకే గురువుగా కీర్తించబడ్డ పండితోత్తముడయన.దత్తపీఠం ఆస్థాన విద్వాంసుడిగా,అధర్వవేద రత్నాకరుడిగా, వేదోద్ధార, అధర్వవేదనిధి వంటి అనేక పురస్కారాలను సొంతం చేసుకున్నా నిరాడంబరతే ఆభరణంగా సాధారణ జీవితాన్ని గడిపిన మహోన్నతమైన వ్యక్తిత్వం వడ్లమాని సోతం. వెంకటేశ్వరశర్మ అవధాని మరణం పండిత లోకానికి తీరని లోటని పలువురు నివాళులర్పించారు. వడ్లమాని మరణ వార్త విని శిష్య బృందం కన్నీటి పర్యంతయ్యింది. దేశవ్యాప్తంగా ఉన్న శిష్యులు శనివారం ఆయన అంతిమయాత్రలో పాల్గొనేందుకు తరలివస్తున్నట్లు సమాచారం. వడ్లమానికి భార్య వున్నారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేకమంది పండితులు, శిష్యులు, దేవస్థానం అధికారులు, వైదికులు..జాతీయ జర్నలిస్ట్ ల సంఘం కార్యదర్శి ..వైజాగ్ జర్నలిస్ట్ ల ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు తదితరులు వడ్లమాని పార్ధీవ దేహాన్ని దర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
అధికారపార్టీ వైఎస్సార్సీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే గొల్లబాబురావు అంటే తెలియని వారుండరు రాష్ట్ర వ్యాప్తంగా... అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ వెల్పేర్ కమిటీ సభ్యునిగా మంచివ్యక్తిగా, దళిత వర్గానికి చెందిన ఉన్నత చదువరిగా, పార్టీ విధేయునిగా, మంచి నాయకుడిగా పార్టీలోనే ఎంతోపేరు..అలాంటి వ్యక్తిని పట్టుకొని ఎస్.రాయ వారా నికి చెందిన ఒక మాజీ ఎంపీటిసి బొలిశెట్టిగోవిందరావు అనే వ్యక్తి పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ పేరు చెబుతూనే, ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా పెట్టిన సమావేశంలో ఎమ్మెల్యే గొల్లబాబూరావుని వాడు, వీడు అనడంతోపాటు...తాను లేకపోతే నియోజకవర్గంలో ఏ జిరిగేదో అంటూ తారాస్థాయిలో మాట్లాడిన మాటల ఆడియో టేప్ రికార్డింగ్ వాయిస్ విశాఖ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. బొలిశెట్టి గోవిందరావుని కాదని పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్(ఉన్నత చదువులు కలిగిన మామిడి మంగతాయారుకి) పదవిని కట్టబెట్టి.. మరో వర్గానికి(మామిడి చంటి)కి పార్టీ వ్యవహరాలు దగ్గరుండి చూసుకునే అవకాశం ఇచ్చారనే అక్కసుతో ఆ వర్గారినికి చెందిన వ్యక్తితో ఎమ్మెల్యే గొల్లబాబూరావు ముందే సోమవారం రాత్రి అడ్డురోడ్డులో జరిగిన సమావేశంలో తన్నుకున్నారు. ఈ విషయాన్ని బయటకు రాకుండా గోవిందరావు స్థానిక మీడియాని బెదిరించి మరీ అడ్డుకట్టవేశారని సమాచారం.. కానీ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ యాప్ ఈఎన్ఎస్ లైవ్ వెలుగులోకి తీసుకు వచ్చింది. ఆ గొడవ జరిగిన తరువాత అక్కడ ఎమ్మెల్యేతో ఛాలెంజ్ చేసి వచ్చి మరీ తన ఇలాకాలోని తోటలో పలువురు కార్యకర్తలు, నాయకులతో సమావేశం పెట్టి...చేసిన వ్యాఖ్యల ఆడియోను కూడా ఈఎన్ఎస్ నెట్వర్క్ అత్యంత కీలక వ్యక్తుల ద్వారా సంపాదించింది. ఆ సమావేశంలో తనకు ఉపయోగ పడకపోతే ఎవ్వరైనా ఒక్కటే అంటూ తన ఆవేశాన్ని వెల్లగక్కుతూనే కార్యకర్తలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా పదేళ్లుగా పనిచేసిన వారిని కాదని నిన్నగాక మొన్న వచ్చిన వారికి పనులు చేసిపెడితే..మీ పరిస్థితి కూడా రాబోయే రోజుల్లో నాలానే వుంటుంది అన్నారు. అంతేకాదు, పార్టీలో పదేళ్ల నుంచి ఉన్నాను వైఎస్ జగన్ నాకు ఏమిచ్చాడు అని ఆవేశంగా ఊగిపోయాడు. పైగా తాను ఖర్చుపెట్టకపోతే ఎమ్మెల్యేగా బాబూరావు గెలిచేవాడు కాదని, ఎమ్మెల్యేని వాడు అనడానికి తాను వెనుకాడటం లేదని కూడా సంబోధించాడు. అంతేకాదు మనల్నికాదని, మనకు పనిచేయని ఎమ్మెల్యే ఈ నియెజవర్గంలోకి రావడానికే భయపడాలంటూ కార్యకర్తలను తప్పుదోవ పట్టించాడు. గతంలో బొలిశెట్టి గోవిందరావు చేస్తున్న వ్యవహారాలకు విసిగి పోయిన ఎమ్మెల్యే గొల్లబాబూరావు, తన నియోజవర్గంలోని నాలుగు మండలాల్లో ఎక్కడికి వెళ్లినా తన పనిని తాను చేసుకోనివ్వకుండా, కొందరు అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మూడునెలలుగా సాగుతున్న ఈ చాపకింద నీటి రబస సెప్టెంబరు నెలలో గానీ బయట పడలేదు. బొలిశెట్టి తనకు వ్యతిరేకంగా వ్యవహారాలు చేస్తూ, దళిన సామాజిక వర్గ ఎమ్మెల్యేకి ప్రజలకు సేవచేసుకునే బాగ్యం ఇవ్వకుండా చేస్తున్నని, కొందరు ప్రభుత్వ అధికారులతో కలిసి తన ఇష్టం వచ్చినట్టు కార్యకలాపాలు చేస్తున్నారనే ఈయననె ఎమ్మెల్యే పక్కన పెట్టినట్టు నియోజవర్గ కేడర్ బహిరంగంగానే చెబుతోంది. ఇదే సమయంలో గోవిందరావుని కాదని మామిడి చంటిని వెనుకేసుకు వస్తూ అన్ని పనులు ఆయనతోనే చేయిస్తే...ఇన్నేళ్లు పనిచేసిన మనం ఏమవ్వాలో అర్ధం చేసుకోవాలని కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశాడు. కొందరినైతే ఏకంగా నాలుగు మండలాల్లో ఎమ్మెల్యే పాల్గొనే కార్యక్రమాల్లో పాల్గొన నీయకుండా కూడా చేశారని వారని కూడా అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. ఇదంతా వెనుక విధేయుడిగా వుంటూనే గోవిందరావు చేశారని చెబుతున్నారు. ఈ విషయాలన్నీ కేవలం...బొలిశెట్టిగోవిందరావు కార్యకర్తలతో సమావేశం పెట్టి, ఆగ్రహంతో, తనకు అనుకూలంగా ఎమ్మెల్యే లేరనే విషయాన్ని కార్యకర్తలకు, నాయకులకు అర్ధమయ్యేలా చేసిన వ్యాఖ్యలు. పూర్తివివరాలు ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ లో పూర్తి సంభాషణ వినవచ్చు...ఒక ఎమ్మెల్యే దళిత సీనియర్ ఎమ్మెల్యేని కనీసం ఎలాంటి పదవి లేని ఒక మాజీ ఎంటిసి ఈ విధంగా బెదిరిస్తున్నారంటే ఈయన వెనుక ఏ స్థాయి వ్యక్తులున్నారోననే అదనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నియోజవర్గ నాయకులను శాసించే స్థాయిలో వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికైనా పార్టీ అధిష్టానం ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా వుంది..!
శ్రీకాకుళంజిల్లాలో ఏడాదిలోగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తికావాలని, ఇందుకు అన్ని క్రీడాసంఘాలు కలిసిరావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖామాత్యులు మరియు రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణ కార్యక్రమంపై ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య ప్రతినిధుల సమావేశం శుక్రవారం స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ జిల్లాలో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కొదవలేదని, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, అథ్లెటిక్స్ లలో రాణించిన జాతీయ క్రీడాకారులు ఎందరో ఉన్నారని అన్నారు. అయితే క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అవకాశాలు ఇక్కడ తక్కువగా ఉన్నాయని, అందుకే జిల్ల్లాలో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులతో పాటు జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ భవనం ఒకటి నిర్మించాలనేది తన తపన అని అన్నారు. భవన నిర్మాణానికి సుమారు కోటి రూపాయలు ఖర్చుకాగలదని అంచనా వేయడం జరిగిందని, దాతలు, ప్రభుత్వ సహకారంతో వీలైనంత తొందరగా భవన నిర్మాణ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇందుకు రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 13 లక్షల రూపాయలను తన వంతుగా ఆర్ధిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడారంగానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తున్నారని, వీలైనంత త్వరలో శంకుస్థాపన పనులు చేపట్టాలని సూచించారు. శంకుస్థాపన మొదలు భవనం ప్రారంభమయ్యేంత వరకు పనులు నిరంతరంగా కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. భవన నిర్మాణం పూర్తయితే అన్ని క్రీడాసంఘాలు ఒకే గొడుగు కిందకు వస్తాయని చెప్పారు. భవన నిర్మాణానికి అవసరమైన కమిటీలు ఏర్పాటుచేసుకొని ముందుకువెళ్లాలని అసోసియేషన్ సభ్యులను కోరారు. ఈ భవన నిర్మాణానికి ఛైర్మన్ గా మాజీమంత్రి , శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు వ్యవహరిస్తారని ఉపముఖ్యమంత్రి తెలిపారు. దేశంలో ఒలింపిక్ అసోసియేషన్ భవనాలు తక్కువగా ఉన్నాయని, ఇటువంటి తరుణంలో జిల్లాలో ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం వలన రాష్ట్రానికి, జిల్లాకు గౌరవం వచ్చేవిధంగా తీర్చిదిద్దాలని, ఇందుకు అందరి సహాయ సహకారాలు అందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. మీరిచ్చిన గౌరవంతోనే రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నానని, ఇదేస్పూర్తితో మీ అందరి అండదండలతో ఒలింపిక్ అసోసియేషన్ భవన నిర్మాణం పూర్తికావాలని ఆకాంక్షించారు. అనంతరం తన వంతుగా లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని నగదు రూపంలో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి.సుందరరావుకు ఉపముఖ్యమంత్రి అందజేసారు. అనంతరం ఈ సందర్భంగా భవన నిర్మాణానికి కమిటీలను ఏర్పాటుచేస్తూ, సావనీర్ ను కూడా రూపొందించాలని, దానికి నల్లి ధర్మారావు కన్వీనర్ గా వ్యవహరించాలని ఉప ముఖ్యమంత్రి ప్రతినిధులకు సూచించారు.
రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య శాఖామాత్యులు డా. సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ జిల్లా నుండి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారులు ఉన్నారని, తన నియోజక వర్గంలోనే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుపొందిన క్రీడాకారులున్నారని గుర్తుచేసారు. జాతీయ, అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చిన క్రీడాకారులను అన్నిరకాలుగా ఆదుకోవాలని కోరారు. క్రీడాకారులను ప్రోత్సహించడం ద్వారా మరింత మంది క్రీడాకారులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని, ఆ దిశగా ఆలోచన చేయాలని సూచించారు. కరోనా నేపధ్యంలో జిల్లాలో ఎటువంటి క్రీడలను నిర్వహించడం లేదని, రాబోయే రోజుల్లో ప్రతీ మాసం ఒక క్రీడ చొప్పున 12 మాసాలకు 12 రకాల క్రీడలను ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్ కు సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, శాసనసభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, డి.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, దువ్వాడ శ్రీనివాస్, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా పర్యాటక అధికారి యన్.నారాయణరావు, అసోసియేషన్ ఉపాధ్యక్షుడు శిమ్మ రాజశేఖర్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సుంకరి కృష్ణ, జూడో అసోసియేషన్ అధ్యక్షులు మెంటాడ స్వరూప్, ఖోఖో అసోసియేషన్ అధ్యక్షులు చిట్టి నాగభూషణరావు, హాకీ అసోసియేషన్ అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి సురిబాబు, టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు డా. చక్క నారాయణరావు, ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కొమర భాస్కరరావు, సాంబమూర్తి, సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.వి.రమణ, సాధు శ్రీను, కలగ శ్రీనివాస్ యాదవ్,ఎం.ఎస్.శేఖర్, కె.రాజారావు తదితరులు పాల్గొన్నారు
భావనపాడు పోర్టు వలన జిల్లాకు ఎంతో ప్రయోజనకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు.భావనపాడు పోర్టు నిర్మాణంపై తయారు చేసిన డిపిఆర్ పై కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రైట్స్ సంస్థ రూ.3669.95 కోట్లతో రూపొందించిన డిపిఆర్ ను ఆమోదించారని తెలిపారు. పోర్టు వలన జిల్లాకు ప్రత్యేకంగా, పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయన్నారు. మొదటి దశలో 3 సాధారణ బెర్తులతో పాటు ఒక బల్క్ బెర్తు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో 9.18 మిలియన్ టన్నుల కార్గో సామర్ధ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తుందని అన్నారు. పోర్టు నిర్వాసితులతో సామరస్యధోరణిలో సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు. జిల్లా అభివృద్ధికి, ఆ ప్రాంత అభివృద్ధికి అందరూ సహకరించాలని ఆయన కోరారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు మాట్లాడుతూ బ్రేక్ వాటర్స్ ఉత్తరం వైపున ఫింగర్ జెట్టి ఒక దానిని ప్రతిపాదించాలన్నారు. తద్వారా దేవునళ్తాడ, భావనపాడు గ్రామస్తులు వినియోగించుకోగలరని చెప్పారు. పోర్టుకు రైల్వే కనెక్టివిటీ రానుందని అన్నారు. నిర్వాసితులకు, భూ సేకరణకు రూ.12 వందల కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దేవునళ్తాడ, భావనపాడు మధ్య గల తీర ప్రాంతం పోర్టు నిర్మాణానికి అత్యంత అనువైనదని చెప్పారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ జెట్టి నిర్మాణానికి కూడా సానుకూలంగా ఉందని అన్నారు. సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలియజేయడం జరిగిందని పేర్కొన్నారు. డిపిఆర్ తయారీ సంస్థ రైట్స్ ఏజిఎం శర్వానంద్ మాట్లాడుతూ డిపిఆర్ ను గూర్చి వివరించారు. మొదటి దశలో 150 ఎకరాల్లో స్టోరేజి, మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు చత్తీస్ ఘడ్, జార్ఖండ్,దక్షిణ ఒడిషా తదితర రాష్ట్రాలు పోర్టు సేవలను ప్రధానంగా వినియోగించుకోగలవని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, జేసీ సుమిత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, డిప్యూటీ కలెక్టర్ పి.అప్పారావు, సర్వే ఎడి ప్రభాకర్, మత్స్య శాఖ జెడి పివి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ వైద్య ఆరోగ్యశాఖ, ఐసిడి ఎస్ సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కోవిడ్ పై వైద్య ఆరోగ్య శాఖ, ఐసిడిఎస్ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా కోవిడ్ ప్రాథమిక లక్షణాలు ఉన్నవారికి హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పాజిటివ్ కేసుల ప్రాథమిక కాంటాక్టులు హోమ్ క్వారంటీన్ లోనే ఉండాలని, హోమ్ ఐసోలేషన్, హోమ్ క్వారంటీన్ లో ఉన్నవారు విధిగా ఇంట్లోనే ఉండాలని, ఎట్టి పరిస్థితిల్లోనూ వారు బయటకు తిరగరాదని కలెక్టర్ చెప్పారు. జిల్లావ్యాప్తంగా హోం ఐసోలేషన్ లో 3,920 మంది ఉన్నారని, రోజుకు 8 వందలు వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయన్నారు. కేసులు పెరుగుతున్న దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇచ్చి తగు పర్యవేక్షణ చేయాలని, మందుల కిట్లు అందించాలని ఆదేశించారు. అవసరమైన వారికి సరైన సూచనలు, సలహాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు దాటిన వారిని తప్పనిసరిగా కోవిడ్ కేర్ కేంద్రాలకు తరలించాలని, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల్లో సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కేసులు పెరగకుండా పర్యవేక్షణ చేయాలని, ఇంటింటి సర్వే చేస్తూ జ్వరం ఉన్న ప్రతి ఒక్కరికి పరీక్షలు చేయాలని, పరీక్షల కిట్లకు జిల్లాలో కొరత లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎన్. అనురాధ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.బి.జగన్నాధరావు, ఐసిడిఎస్ పథక సంచాలకులు డా. జి.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
మహా విశాఖ నగర పరిధిలో కరోనా నియంత్రణలో భాగస్వాములుగా ఎంతో సేవలందిస్తున్నారని విశాఖ డెయిరీ సీఈఓ ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఈమేరకు శుక్రవారం పారిశుధ్య కార్మికుల రక్షరార్ధం 6వేల మాస్కులు జీవిఎంసికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జివిఎంసీ పరిధిలో పారిశుధ్య కార్మికులు వీటిని తప్పకుండా ధరించి విధులు నిర్వహించాలన్నారు. ఏ ఒక్కరూ కరోనా వైరస్ భారిన పడకుండా ఉండేందుకు విశాఖ డెయిరీ వంతుగా వీటిని అందజేస్తు న్నామని చెప్పారు. ఈ మాస్కులను అదనపు కమిషనర్ డా.వి.సన్యాసిరావుకి అందజేశారు. అనంతరం అదనపు కమిషనర్ మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులను గుర్తించి మాస్కులు వితరణ చేయడం అభినందనీయమన్నారు. స్వచ్చందంగా ఈరకమైన సహకారం అందించే దాతలను జీవిఎంసి గుర్తిస్తుందన్నారు. వారి సహాయంతో అందించిన మాస్కులను పారిశుధ్య కార్మికుల కోసం వినియోగిస్తామని విశాఖ డెయిరీ సీఈఓకి తెలియజేశారు.
విశాఖ నగరం మరింత సుందరంగా, స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి 2021వలో జరుగబోయే స్వచ్ఛ సర్వేక్షణ్ కు నివాసిత సంక్షేమ సంఘాల సహకారం చాలా అవసరమని అదనపు కమిషనర్ డా.వి.సన్యాసి రావు అన్నారు. జివిఎంసీ కమిషనర్ డా. జి. సృజన ఆదేశాల మేరకు, నగరంలోని నివాసిత సంక్షేమ సంఘాల ప్రతినిధులతో స్వచ్ఛ్ సర్వేక్షన్ -2021 కార్యక్రమాలపై సోమవారం గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్-2021 సర్వే అంశాలపై స్వచ్ఛ భారత్ మిషన్ విధి విధానాలను రూపొందించినదని చెప్పారు. ముఖ్యంగా నివాసిత సంక్షేమ సంఘాలు చేపట్టవలసిన కార్యక్రమాలపై విశాఖనగరం ఉత్తమ స్థానం సాధించగలదన్న ఆయన దానికి ప్రతీ ఆర్.డబ్ల్యూ.ఏలు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రతీ వార్డులో తప్పనిసరిగా ప్రతీ ఇంటి నుంచి చెత్త విభజన, సేకరణ జరగాలని, తడి చెత్త నుండి ఎరువును తయారు చేయుటకు సహకరించాలన్నారు. ఈ సంవత్సరం, గార్బేజ్ ఫ్రీ సిటీ 3 - స్టార్ రేటింగ్ వచ్చిందని, జరగబోయే స్వచ్చ సర్వేక్షణ్-2021నకు మన నగరానికి తప్పనిసరిగా 5 - స్టార్ రేటింగ్ రావడానికి ఆర్. డబ్ల్యూఏ. ల సహకారంతో జి.వి.ఎం.సి. కృషి చేస్తుందన్నారు. ఆర్. డబ్ల్యూ.ఏ లు, బల్క్ వేస్ట్ జెనెరేటర్లు తడి చెత్తనుండి ఆన్ సైట్ కంపోస్టింగు తప్పనిసరిగా చెయ్యాలని తెలిపారు. ప్రతీ ఇంటి నుండి చెత్తను సేకరించుటకు 50 రూపాయలు యూజర్ చార్జీలు వసూలు చేస్తుందని అందుకు ఆర్. డబ్ల్యూ.ఏ. లు సహకరించాలన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి పలకాలని, తద్వారా పర్యావరణాన్ని పరిరక్షించాలని సూచించారు. జరనున్న స్వచ్ఛ సర్వేక్షణ్-2021 ప్రజల భాగస్వామ్యం ముఖ్య భూమికను, స్వచ్ఛ భారత్ మిషన్ ప్రామాణికాలలో ఈ భాగస్వామ్యానికి 1800 మార్కులు ఉంటాయని, సర్వే జరుగుతున్నందుకు బృందానికి ప్రజలు నగర అభివృద్ధి దృష్ట్యా సిటిజెన్ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని చెప్పారు. 1969 నంబరుకు మిస్డ్ కాల్ ద్వారా, My.Gov. వెబ్ సైట్ ద్వారా, స్వచ్ఛతా యాప్ ద్వారా, అవుట్ బౌండ్ కాల్స్ ద్వారా, సర్వేబృందం అడిగిన ప్రశ్నలకు సానుకూల సమాధానాలు అందించాలన్నారు. ఆర్.డబ్ల్యూ.ఏ. లు స్వచ్ఛ సర్వేక్షణ్-2021లో చేపట్టే ప్రచార కార్య క్రమాలు, అవగాహన కార్య క్రమాలు S.B.M. పోర్టల్ (అప్లోడ్) పొందు పర్చాలన్నారు
ఆంధ్రప్రదేశ్ లో మావోయిస్టు కార్యకలాపాలపై ఏడాదిపాటు నిషేధాన్ని పొగిడిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏపీ భధ్రతా చట్టం 1992 ప్రకరం ఈ ఉత్తర్వులు పొడిగింపు కొనసాగుతుందని పేర్కొంది. కాగా ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి ఏడాది పాటు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో తెలియజేసింది. మావోయిస్టు పార్టీతోపాటు దాని అనుంబంధ సంస్థలు రివల్యూషనరీ డెమొక్రటిక్ ఫ్రంట్ పైనా ఇదే ఉత్తర్వులు అమలు జరుగుతాయని కూడా తెలిపింది. ఇదిలా వుండగా విశాఖ ఏజెన్సీలోని 15 రోజుల్లో రెండు మూడు సార్లు తుపాకుల మొత మోగింది. పీఎల్జీఏ వారోత్సవాల సందర్భంగా మన్యంలోకి మావోయిస్టు రాష్ట్రపార్టీ నాయకులు వచ్చేరనే సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు, మావోయిస్టులు తారపడటంతో ఈ ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టులు ఫైరింగ్ ఓపెన్ చేయగానే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరిపారని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీ ప్రభుత్వం నిషేధం విధించిన అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏం వంశీ బాగున్నారా...అంటూ విశాఖ నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు సిహెచ్ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ను సీఎం వైఎస్ జగన్ జగన్మోహనరెడ్డి ఎంతో ఆత్మీయంగా పలుక రించారు. శుక్రవారం వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించిన తరువాత అన్ని జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖప ట్నం నుంచి రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతోపాటు వంశీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖజిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తోమా ట్లాడానికి ముందుగానే ఏం వంశీ బాగున్నారా అంటూ పలకరించడం విశేషం. అనంతరం వైఎస్ ఆసర పథకాన్ని మహిళల అభివ్రుద్ధికోసమే చేస్తున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాకముందు ఏవైతే హామీలిచ్చిందో వాటిని తూచా తప్పకుండా అమలు చేస్తుందని చెప్పుకొచ్చారు. అధికారులు ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతీ ఒక్కరికీ అందేలా చేయడంలో విశేషంగా క్రుషిచేయాలని అన్నారు. సీఎం వైఎస్ జగన్ వంశీని పలుకరించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది...
కేంద్రం ప్రకటించిన అన్ లాక్ 4.0 సడలింపుల్లో భాగంగా సెప్టెంబరు 12 నుంచి అదనపు రైలు సేవలను ప్రకటించిందని ఈస్ట్ కోస్టు రైల్వే, వాల్తేరు డివిజనల్ రైల్వే కమర్షియల్ మేనేజర్ ఏకె త్రిపాఠి చెప్పారు. శుక్రవారం ఆయన విశాఖలోని రైల్ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా రిజర్వేషన్ టిక్కెట్లు ఉన్న ప్రయాణీకులకు మాత్రమే అనుమతి కల్పిస్తున్నట్టు చెప్పారు. రైలు ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా మాస్కు, ఫేస్ షీల్డులు ధరించాలన్నారు. వీటితోపాటు సామాజిక దూరం పాటిస్తూనే రావాలని, అదేవిధంగా రైలులో కూర్చోవాలని చెప్పారు. ప్రతీస్టేషన్ లో ఎక్కే ప్రయాణీకులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేసిన తరువాత మాత్రమే లోనికి అనుమతిస్తారన్న ఆయన ప్రయాణీకులే సొంత దుప్పట్లు తెచ్చుకోవాలని సూచించారు. గమ్యస్థానంలో దిగిన తరువాత కూడా ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న కోవిడ్ నిబంధనలు పాటించాల్సి వుంటుందన్నారు. కేంద్రం నిర్ధేశించిన ఈ మార్గదర్శకాలను పాటిస్తూ, రైల్వేకి సహకరించడంతోపాటు, కరోనా వైరస్ నియంత్రణలో బాగస్వాములు కావాలని డిసిఎం త్రిపాఠి సూచించారు.