రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న వై.యస్.ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం రైతులకు ప్రయోజనకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. వై.యస్.ఆర్.ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం - లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీపై అవగాహన సదస్సు బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది.అనంతరం మీడియా ప్రతినిధులకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప ముఖ్య మంత్రి ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం గూర్చి వివరించారు. ఈ పథకం రైతులకు ప్రయోజనకరమన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు. వై.యస్.రాజశేఖర రెడ్డి ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మొట్ట మొదటి సంతకం ఉచిత వ్యవసాయ విద్యుత్ దస్త్రంపై పెట్టారన్నారు. ఈ పథకాన్ని బరింత బలోపేతం చేయుటకు ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారని చెప్పారు. రానున్న 30 ఏళ్ల పాటు వై.యస్.ఆర్.ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమల్లో ఉండేవిధంగా విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అన్నారు. రైతులపై ఎటువంటి భారం లేకుండా పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అందే విద్యుత్ ఎప్పటికీ ఉచితమేనని, ఇందులో ఎటువంటి సందేహాలకు తావులేదని ఆయన స్పష్టం చేసారు. పథకం క్రింద రైతులకు నాణ్యమైన విద్యుత్ అందుతుందని, నాణ్యమైన విద్యుత్ కోసం ప్రశ్నించే హక్కు రైతుకు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం రైతులకు ఉన్న ఒక్క కనెక్షన్ కూడా తొలగించబోమని,అనధికారికంగా ఉండే కనెక్షన్లను రెగ్యులరైజ్ చేస్తామని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం సమస్యల పరిష్కారానికి, అవగాహనకు గ్రామ, మండల, డివిజన్, జిల్లా, కంపెనీ స్ధాయిలో కమిటీలు నియమిస్తారని ఆయన చెప్పారు. గ్రామ స్ధాయి కమిటి రైతుల కెవైసి, ఆధార్, సర్వే నంబరు తదితర వివరాలను నమోదు చేసుకుంటాయని తెలిపారు. ఈ పథకం క్రింద రైతులు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలను ప్రారంభించాలని ఆయన చెప్పారు. ఈ ఖాతాలు విద్యుత్ సబ్సిడీ నగదు బదిలీ పథకం కోసం వినియోగించడం జరుగుతుందని అన్నారు. ఈ పథకం క్రింద ఐఆర్డిఏ మీటర్లు (స్మార్ట్ మీటర్లు) ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఈ మీటర్ల ఏర్పాటు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగం సమాచారం ఎస్.ఎం.ఎస్ రూపంలో రైతుల ఫోన్ లకు చేరుతుందని ఆయన చెప్పారు.
రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ మాట్లాడుతూ జిల్లాలో ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఉచిత వ్యవసాయ విద్యుత్ నగదు బదిలీ పథకం ద్వారా ఎక్కడా అక్రమంగా విద్యుత్ వినియోగం లేకుండా అడ్డుకట్ట వేస్తుందని పేర్కొన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహనకు విస్తృత స్ధాయిలో ప్రచారం జరగాలని సూచించారు. ఈ పథకం అమలులో జగన మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేసారు. విద్యుత్ కు మన జీవనంతో విడదీయరాని సంబంధం ఏర్పడిందని పేర్కొంటూ విద్యుత్ సంస్కరణలలో భాగంగా మెరుగైన విద్యుత్ సరఫరాకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అన్నారు. అనధికారికంగా ఉన్న కనెక్షన్లు సైతం ఈ కార్యక్రమం ద్వారా రెగ్యులరైజ్ అవుతాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 17.55 లక్షల ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా, 12,232 మిలియన్ యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగిందని తెలిపారు. ఇందుకు రూ.8,353.60 కోట్ల మొత్తాన్ని ఏడాదికి రాయితీగా ప్రభుత్వం అందిస్తుందని, ఒక్కో రైతుపై రూ.47,601 కనీస రాయితీ ఉందని చెప్పారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్, శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వసరాయి కళావతి, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్ధ (ఇపిడిసిఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ ఎస్. నాగలక్ష్మీ, ట్రాన్సు కో పర్యవేక్షక ఇంజనీరు ఎన్.రమేష్, డివిజనల్ ఇంజనీర్లు జి.టి.ప్రసాద్, చలపతి రావు., దువ్వాడ శ్రీనివాస్, తమ్మినేని చిరంజీవి నాగ్., ఇపిడిసిఎల్ అధికారులు తదితర అధికార అనధికారులు పాల్గొన్నారు.
విఎంఆర్డీఎకు రాబోయే రోజుల్లో పూర్వ వైభవం తీసుకురానున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం విఎంఆర్డీఎలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ లో విఎంఆర్డీఎకు మూడు, నాలుగు దశాబ్దాల నుండి ఒక మంచి పేరు ఉందన్నారు. మూడు జిల్లాల్లో మంచి లేఅవుట్లు వేసి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో విఎంఆర్డీఎ తరఫున చేపట్టిన కార్యక్రమాలను పారదర్శకంగా, ఎలాంటి బందుప్రీతి లేకుండా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. విఎంఆర్డీఎ, పర్యాటక శాఖలలో పెండింగ్ లో ఉన్న ఎన్ఎడి పై వంతెన, వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రేవు పోలవరం, యారాడ, తంతడి, పూడిమడక, తదితర బీచ్ ల్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి పిపిపి మోడ్ లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఆర్కియాలజీకి సంబందించి తొట్లకొండ, బావికొండ, పావురాలకొండలకు బద్దిస్టులు వచ్చి ద్యానించుకొనే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదాయం పెంచే దిశలో చర్యలు తీసుకుంటామన్నారు. టూరు ఆపరేటర్లు, ట్రావెల్స్ అండ్ టూరు ఆపరేటర్లు టూరిజంనకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే తప్పనిసరిగా పర్యాటక శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్సు పొందాలని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రపంచ పటంలో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 12 స్థలాల్లో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సమావేశంలో విఎంఆర్డీఎ కమీషనర్ కోటీశ్వరరావు, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు ల్యాప్ టాప్ లను రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, జిల్లా కలెక్టర్ జె నివాస్ పంపిణీ చేశారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ సరఫరా చేసిన ల్యాప్ టాప్ లను ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. లాప్ టాప్ లు పొందిన వారి వివరాలు ఈవిధంగా ఉన్నాయి. శారద డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం బిఎస్సి చదువుతున్న తాటిపూడి పూజ, శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మూడవ సంవత్సరం బిఎ విద్యనభ్యసిస్తున్న కర్రీ పవన్ కళ్యాణ్, అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఎంఎల్ఐఎస్సి చదువుతున్న సింగుపురం దుర్గాప్రసాద్, పైడి తేజ, ఎం.ఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కాగితపు వినోద్ నాయుడు, ఎం.కాం చదువుతున్న పట్టా శంకర్రావు, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ ఇంగ్లీష్ చదువుతున్న కొడంగి మజ్జయ్య, ఎం.ఏ తెలుగు అభ్యసిస్తున్న రెడ్డి దేవేంద్రుడు, పి.హెచ్.డి చేస్తున్న గిరడ సుజాత, ఎమ్.ఏ చదువుతున్న బిల్లుకొల హిమగిరి., పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లో పీహెచ్డీ చేస్తున్న మునకాల ధనలక్ష్మి., సీతంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ చదువుతున్న డిల్లేశ్వరరావు, బిడ్డిక గంగారావు., శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఏ చదువుతున్న తమ్మినేని రాజ్యలక్ష్మి, ఎల్లా జయరాజు, రెల్లా శారద, ఎం.కామ్ చదువుతున్న కొంచాడ నారాయణ రావు., రాజాం స్ఫూర్తి డిగ్రీ కళాశాలలో బిఎ చదువుతున్న కొవ్వాడ స్వప్న, శివాని డిగ్రీ కాలేజీ లో బీ కాం చదువుతున్న నజన రామారావు, విశాఖపట్నం క్రిష్ణ కాలేజ్ లో బీఎస్సి చదువుతున్న గాలి నూక రెడ్డి, పాలకొండ డా.డి.ఎల్.నాయుడు డిగ్రీ కళాశాలలో బి.కాం చదువుతున్న ఆకెన్న ఢిల్లీశ్వరి, విశాఖపట్నం బాబా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎం.బి.ఏ చదువుతున్న పిల్లా దుర్గాప్రసాద్ ఉన్నారు. ప్రభుత్వం అన్ని విధాల సహకరించుటకు సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన సూచించారు. విభిన్న ప్రతిభావంతులు ఎంతో ప్రతిభ కలవారిని ఆయన అన్నారు. తమ ప్రతిభను వివిధ రంగాల్లో చూపించి జిల్లాకు గర్వకారణం గా నిలబడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు జీవన్ బాబు కార్యక్రమం గూర్చి వివరిస్తూ ప్రభుత్వం దాదాపు రూ.7.50 లక్షల ఖర్చుతో లాప్ టాప్ లు సమకూర్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ ఒక్కరూ పేస్ షీల్డ్ వాడి కరోనాను నియంత్రించడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చారు. పివీఎస్ రామ్ మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫేషి షీల్డ్ ల పంపిణీ కార్యక్రమం ఆదివారం పేటలో బుధవారం జరిగింది. జిల్లా కలెక్టర్ జె నివాస్ ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాస్కులతో పాటు ఫేషి షీల్డ్ ల వినియోగం తో 80 శాతం మేర కరోనా భారీన పడే అవకాశం లేదని అన్నారు. స్వచ్ఛంద సంస్థల సౌజన్యంతో స్లమ్ ప్రాంతాల్లో 25 వేల ఫేషి షీల్డ్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. కరోనా నివారణకు జిల్లాలో అనేక చర్యలు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాజాగా ఫేషి షీల్డ్ ల పంపిణీ చేపట్టామన్నారు. పివీఎస్ రామ్ మోహన్ ఫౌండేషన్ అధ్యక్షుడు డా. పివీఎస్ రామ్ మోహన్ మాట్లాడుతూ జిల్లాలో 8 వేల ఫేస్ షీల్డ్ లు పంపిణీ కి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకారాన్ని అందించి కరోనాకు పారద్రోలాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ పి.నల్లనయ్య, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్.కూర్మారావు, రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు, తహసీల్దార్ వై.యస్.ప్రసాద్, వైద్యులు డా.రవి, రెడ్ క్రాస్ సభ్యులు పి.శ్రీకాంత్, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.
విశాఖ నగర పరిధిలోని ప్రకృతి వనరులను ఉపయోగించు కుంటూ ప్రణాళికాయుతంగా పర్యాటకాభివృద్ది చేపట్టాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివా సరావు అధికారులను ఆదేశించారు. బుధవారం విఎమ్ఆర్ డిఎ సమావేశ మందిరంలో పర్యాటకాభివృద్ధిపై విఎమ్ ఆర్ డిఎ, పర్యాటకశాఖ, పురావస్తుశాఖ లతో ఆయన సమీక్షించారు. ముఖ్యంగా ఆదాయ వనరులు పెంపొందించుకునే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) పద్దతి ద్వారా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలన్నారు. పర్యాటక రంగ అభివృద్ధితో పాటు ఆదాయం సమకూరుతుందన్నారు. విఎమ్ఆర్ డిఏ పరిధిలోని స్లాట్ లను వేలం ద్వారా విక్రయించడం, ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో వాణిజ్య సముదాయాలను నిర్మించడం చేయాలన్నారు. విఎమ్ఆర్ డిఎ, అటవీశాఖ, పురావస్తుశాఖ, జివియంసి, పర్యాటక శాఖల సమన్వయంతో సింగిల్ విండో పద్దతిని ప్రవేశపెట్టే దిశగా ఆలోచన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వుడా పరిధిలో చెపడుతున్న పథకాలు, వాటి పురోగతిని, భవిష్యత్ ప్రణాలికను గూర్చి కమిషనర్ పి.కోటేశ్వరరావు వివరించారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం, ఎన్ఎడి ఫ్లై వోవర్, కైలాసగిరి అభివృద్ధి పనులు, బహుళ అంతస్తుల కార్ పార్కింగ్, కైలాసగిరిపై మ్యూజియం కాంప్లెక్స్, కాపులుప్పాడలో నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం కమ్ రిసెర్చి సెంటర్, రామకృష్ణా బీచ్ లో అండర్ గ్రౌండ్ పాత్ వే, ఫుట్ కోర్టు మొదలైన వాటిని గూర్చి వివరించారు. డిశంబరు నెలాఖరుకు ఎన్.ఎ.డి ఫై వోవర్ పూర్తవుతుందని ప్రస్తుతం ఎయిర్ పోర్టు- ఎన్.ఎస్.టిఎల్ రోడ్డు పూర్తియిందని, త్వరలోనే గోపాలపట్నం-ఎన్.ఎస్.టిఎల్ రోడ్లు పూర్తవుతుందని, తరువాత మర్రిపాలెం-గోపాలపట్నం, ఎన్.ఎస్.టి.ఎల్.- ఎయిర్ పోర్టు రోడ్లు పూర్తవుతాయని వెల్లడించారు.
పర్యాటక శాఖ ద్వారా చేపడుతున్న పథకాలను గూర్చి ప్రాంతీయ సంచాలకులు రాంప్రసాద్ వివరిస్తూ నగరంలో టూరిజం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. యారాడ, తంతడి, ముత్యాలమ్మపాలెం, రేవుపోలవరం, పూడిమడక బీచ్ లతో పాటు కొండకర్ల ఆవను పర్యాటకంగా అభివృద్ధ చేయన్నట్లు తెలిపారు. పురావస్తు శాఖ ద్వారా బావికొండ, తొట్లకొండ, పావురాల కొండల అభివృద్దిని గూర్చి శిల్పారావం అభివృద్ధిని గూర్చి ఆయా శాఖల అధికారులు విశదీకరించారు. ఈ సమావేశంలో విఎమ్ఆర్ డిఎ అడిషనల్ కమిషనర్ మనజీర్ జిలాని, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాధ్, టి.ఐ.ఓ. పూర్ణిమాదేవి, పురావస్తుశాఖ, విఎమ్ ఆర్ డిఎ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చేసే ఏ సహాయమైనా అన్నార్తులకు ఆలంబనగా వుంటుందని బీజేపి సీనియర్ నాయకులు కొప్పల రామ్ కుమార్ అన్నారు. బు ధవారం విశాఖలోని గోషా ఆసుపత్రిలో రోగులు, సెక్యురిటీ సిబ్బందికి ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పల మాట్లాడుతూ, కరోనా వైరస్ సమయం లో తమవంతు బాధ్యతగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని చెప్పారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రోగులకు ఆహార పొట్లాలు పంచిపెట్టినట్టు వివ రించారు. అంతేకాకుండా కరోనా వైరస్ నియంత్రణ జరిగే వరకూ తమ సామాజిక సేవకార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని వివరించారు. ఆసుపత్రి సూపరింటెం డెంట్ డా.విజయ కుమార్ మాట్లాడుతూ, ఇలాంటి సమయంలో చేసే సహాయం రోగులతోపాటు, వారి బంధువులకు ఎంతో స్వాంతన చేకూర్చుతుందన్నారు. కరోనా వలన చాలా మంది బయటకు రావడానికే భయపడుతున్నతరుణంలో మంచి మనసులో ఆసుపత్రి రోగులకు, సెక్యూరిటీ సిబ్బందికి అన్నదాన కార్యక్రమం చేప ట్టడం అభినందనీయమన్నారు. నగదు సహాయం కంటే, అన్నదానం ఎంతో ఉపయుక్తంగా ఉండటంతో పాటు దాతు చేసిన సహాయాన్ని కూడా అంతా గుర్తుంచు కుంటారని అన్నారు. కార్యక్రమంలో స్థానిక బీజేపి నాయకులు పాల్గొన్నారు.
విశాఖ పాలిటెక్నిక్ కళాశాలలో చేరేందుకు నిర్వహించే పాలిసెట్ అర్హత పరీక్షను ఈ నెల 27న నిర్వహించనున్నట్టు కన్వీనర్ శ్రీనివాస్ తెలియజేశారు. ఈ సంద ర్భంగా ఆయన విశాఖలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, ఉదయం 11 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరగనుందని వివరించారు. విశాఖ జిల్లాలో 9,844 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని చెప్పిన ఆయన వీరి కోసం 24 సెంటర్లను కేటాయించినట్టు చెప్పారు. దరఖాస్తు చేసే సమయం లోనే హాల్ టికెట్లను జారీ చేశామని వాటి ఆధారంగా పరీక్షా కేంద్రాల్లో పరీక్ష రాయాల్సి వుంటుందన్నారు. ఈ పరీక్ష కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ప్రతీ ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా బస్సులు నడిపేందుకు సిద్ధమైంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఈసారి పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య తక్కువగా ఉండచ్చునని తెలుస్తుంది అయినప్పటికీ దరఖాస్తు చేసుకున్న విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగానే కేంద్రాలను కేటాయించారు. అంతేకాకుండా అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని చెప్పిన ఆయన ఆలస్యానికి బాధ్యత విద్యార్ధులే వహించాల్సి వుంటుందన్నారు. కోవిడ్19 ని ద్రుష్టిలో వుంచుకొనే అన్ని ఏర్పాట్లు చేసినట్టు కన్వీనర్ తెలిపారు.
వైజగ్ జర్నలిస్టుల ఫోరం ప్రతి ఏటా ప్రతిష్టాతకంగా నిర్వహించే ప్రతిభకు ప్రోత్సాహం, మీడియా అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కోవిడ్19ని దృష్టిలో పెట్టుకుని నవంబర్ 8కి మార్పు చేసినట్టు విజెఎఫ్ అధ్యక్ష, , కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, సోడిశెట్టి దుర్గారావులు తెలియజేశారు. విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ, ప్రతిఏటా జర్నలిస్టుల పిల్లలను విద్యారంగంలో ప్రోత్సహిస్తూ జాన్ తొలివారంలో స్కాలర్ షిప్ లు కార్యక్రమం నిర్వహిం చేవారమని, కోవిడ్ నేపధ్యంలో దీనిని నవంబర్ ఎనిమిదవ తేదికి వాయిదా వేశామన్నారు. పాఠశాలల్లో మార్కుల జాబితాను (అర్ధిక సంవత్సరం పరీక్ష ఫలితాలు) తీసుకుని రెండు పాస్ పోర్టుపోటోలను జతచేసి ఈనెలాఖరులోగా డాబాగార్డ్స్ ప్రెస్ క్లబ్ లో అందజేయాలన్నారు. ఇతర వివరాలు కోసం స్కాలర్ షిప్స్ కమిటి చైర్మన్, ఫోరమ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబును సంప్రదించాలన్నారు. అవార్డుల కమిటీ చైర్మన్ ఆర్.నాగరాజు పట్నాయక్ మాట్లాడుతూ, సబ్ ఎడిటర్, వీడియో ఫోటో జర్నలిస్టులు క్రీడా, క్రైమ్, చిన్న పత్రికలకు సంబందించిన సంఘాలు వారే ఇద్దరు ప్రతినిధులను ఎంపిక చేసిన పేర్లను లెటర్ హెడ్ పై బయోడేటాలతో విజెఎఫ్ కార్యాలయం లో అంద జేయాలన్నారు ఆకర్షణీయ సాంస్కృతిక ప్రదర్శనలు, లక్కీడిప్ వంటి ప్రత్యేకత లతో ఈ కార్యమాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ప్రతిభకు ప్రోత్సహాం కో - చైర్మన్ లు టి నానాజీ, పి.ఎన్.మూర్తి , దాడి రవికుమార్ కార్యవర్గ ప్రతినిధులు ఇరోతి ఈశ్వరరావు, ఎం ఎస్ ఆర్.ప్రసాద్, పి.వరలక్ష్మీ ,పి.దివాకర్, దొండాగిరిబాబు, కె.ఆర్ శేఖర్ మంత్రి , గయాజ్, డేవిడ్ రాజు, మాధవ్ తదితరులి పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణపు పనులను త్వరలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ హామీ ఇచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులను ఉపముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ,అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఈ స్టేడియంకు ఉందని, జిల్లాలోనే ఎంతో ప్రాముఖ్యత ఉన్న స్టేడియం ఇదని మంత్రి గుర్తుచేసారు. ఒక జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారుడిగా క్రీడాకారుల సమస్యలు తనకు తెలుసునని అన్నారు.ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్ష హోదాలో ఎప్పటికపుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నానని తెలిపారు. రూ.15 కోట్లతో కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణం పనులు జరుగుతున్నాయని, ఊడా నుండి విడుదల కావలసిన నిధుల జాప్యం కారణంగా నిర్మాణ పనులు ఆలస్యం జరుగుతున్నట్లు గుర్తించామని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఊడా కాస్త సుడాగా మారడం వలనే నిధుల జాప్యానికి కారణమయిందని, త్వరలోనే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. స్టేడియం నిర్మాణానికి సంబంధించి నిధుల సమస్య లేదని, అసంపూర్తిగా ఉన్న స్టేడియం పనులన్నింటినీ త్వరలోనే పూర్తిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు యోచిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె. నివాస్, సెట్ శ్రీ సిఇఓ జి. శ్రీనివాసరావు, జిల్లా చీఫ్ కోచ్ బి.శ్రీనివాసకుమార్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పి.సుందరరావు, వాకర్స్ క్లబ్ సభ్యులు జి.ఇందిరాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామని డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణ దాస్ అన్నారు. శ్రీకాకుళంలో రూ.1.98 కోట్లతో నిర్మించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశ ధార ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయ భవనాన్ని ఉప ముఖ్యమంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి క్రిష్ణ దాస్ మాట్లాడుతూ జిల్లాకు ప్రధానమైనది వంశధార ప్రాజెక్టు అన్నారు. రాష్ట్రంలో ప్రాధాన్యత గల జలవనరుల ప్రాజెక్టులలో వంశధార ప్రాజెక్టును చేర్చడం జరిగిందని అన్నారు. జిల్లాకు వంశధార జీవనాడి అని ఆయన పేర్కొన్నారు. వంశధార ప్రాజెక్టును త్వరలో పూర్తి చేయడమే కాకుండా నిర్వాసితులకు అందాల్సిన నష్టపరి హారం కూడా త్వరలో అందిస్తామని ఆయన చెప్పారు. జిల్లాను ప్రగతి పథంలో నడిపించుటకు ప్రభుత్వం కృత నిశ్చయముగా ఉందని తెలిపారు. వై. యస్.రాజశేఖర రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జలవనరుల ప్రాజెక్టులను చేపడుతున్నారని ఆయన అన్నారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బొడ్డేపల్లి రాజగోపాల రావు వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ నూతన కార్యాలయ భవనం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా నదులకు నిలయమని, ఆ నదీ జలాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లను ఏర్పాటు చేస్తుందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా పొందూరు మండలం వి.ఆర్.గూడెం వద్ద ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ రానుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్, శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు, జలవనరుల శాఖ నార్త్ కోస్ట్ సిఇ సి హెచ్.శివరామ ప్రసాద్, ఎస్ ఇ లు పి.రంగారావు, డోల తిరుమల రావు., మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, ప్రకాష్, తదితర అధికార అనాధికారులు పాల్గొన్నారు.
విశాఖజిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలో వర్గవిభేదాలు ఎమ్మెల్యే ముందు బగ్గు మన్నాయి. రైతు భరోసా కేంద్రం విషయమై రెండు వర్గాలు సోమవారం రాత్రి జరిగినా మంగళవారం సాయంత్రానికి బయటకు పొక్కింది. అడ్డురోడ్డులోని ఎమ్మెల్యే నివాసంలోనే గొడవడినట్టు, కాదు కాదు తన్నుకున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే వారిస్తున్నా ఆ ప్రాంతంలో యాక్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తి ఎమ్మెల్యే మాటలను లెక్కచేయకుండా మరో వర్గానికి చెందిన వ్యక్తులపై చేయి చేసుకోవడంతో తిరిగి ఆవర్గం వ్యక్తులు కూడా గొడవకి దిగారు. కరోనా ముందు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో తన మాటకు విలువలేకుండా నాయకులు వ్యవహరిస్తున్నారని ప్రకటించడం, తరువాత ఇసుక రవాణాలో ఆ నేత మీడియా ఎదుటక తన ప్రతాపాం చూపడం, రాష్ట్ర, జిల్లా నాయకుల నుంచి వార్నింగ్ తీసుకున్నారు కూడా. సోమవారం రాత్రి జరిగిన సంఘటన కొందను నాయకులు ఫోటోలు వీడియోలు తీయడంతో వారిని బెదిరించి మరీ వాటిని డిలీట్ చేయించారని సమాచారం. అంతేకాకుండా ఈవిషయాన్ని బయటకు రానీయకుండా తన అనుకూల మీడియాని వార్తలు రాకుండా కట్టడి చేసినట్టుగా తెలుస్తుంది. కొందరినైతే ఏకంగా బెదిరించి మరీ వార్నింగ్ ఇచ్చారని చర్చ జరుగుతోంది. కానీ ఈలోగా సమాచారం నిఘా వర్గాలకు తెలిసి ఆరాతీయడంతో ఆ విషయం కాస్త ఆఇద్దరికి(అడిగిన వారికి, అడగని వారికి) మాత్రమే చెప్పారు. అవతలి వర్గం కార్యకర్తల నుంచి ఆ తన్నుకున్న తంతు వీడియోలు, ఫోటోలు కోసం తీవ్రంగా వెతుకులాట జరుగుతోందని సమాచారం. కాగా గతంలో ఇసుక అక్రమ రవాణాలో పార్టీ నుంచి అక్షింతలు వేయించుకున్న ఆ నేతలో మార్పురాకపోగా, తన వెనుక వున్న బలగాన్ని రెచ్చగొట్టి మరీ ఎమ్మెల్యే వెనుక వున్న వారిని తన్నడానికి, కయ్యానికి కాలుదువ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈవిషయం బటయకి పొక్కకుండా అత్యంత జాగ్రత్త పడటంలో అవతలి వర్గం బాగా సఫలీ క్రుతులయ్యారు. ఇదిలా వుండగా ఎమ్మెల్యే స్వయంగా తన మాట ఎవరూ వినడం లేదని, ఎవరికి నచ్చినట్టు వాళ్లు వ్యవహరిస్తున్నారని మీడియా ముందు బహిరంగంగా చెప్పిన మూడు నెలల్లోనే ఈ తన్నులాట జరగడం పార్టీలోనూ, అటు నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు పెద్ద చర్చమొదలైంది. మరి ఈ విషయం పార్టీ జిల్లా నాయకత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి...వాస్తవాలు కూడా రెండు మూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశం వుంది. డిలీట్ చేసిన వీడియోలు బయటకు తీయించే పనిలో కొందరు కార్యకర్తలు నిమగ్నమైనట్టు తెలుస్తుంది...
తూర్పుగోదావరి జిల్లా, సఖినేటిపల్లి మండలం, అంతర్వేదిలో వేంచేసియున్న అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రాంగణంలోని కల్యాణోత్సవ రథం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దగ్దమైంది. ఈ సంఘటన శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో చోటు చేసుకుంది. షెడ్డులో ప్రత్యేకంగా భద్రపరిచిన రథం ప్రాంగణ నుంచి తీవ్రమైన మంటలు రావడంతో ప్రమాదవశాత్తు జరిగిందా, లేక విద్రోహుల దుశ్చర్యా అనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రామస్తులు మాత్రం ఇది దుశ్చర్య అని,గత ఆరు నెలలుగా సి సి టి వి కెమెరాలు పనిచేయకపోయినా ఎందుకు మరమ్మత్తు చేయించలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా 40 అడుగులు ఎత్తు ఉన్న ఈ రథాన్ని 62 ఏళ్ల క్రితం పూర్తీగా టేకు కలపతో ఆగమ శాస్త్ర ప్రకారం తయారు చేశారు. స్వామివారి కల్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహిస్తారు.ఈ రధోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ ఘటన పై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ తో మాట్లాడారు. స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సత్వర విచారణ జరుగుతోంది..
ప్రతి నిత్యం యోగా చేయడం వలన మనిషికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా అన్నారు. ఆదివారం నగరపాలక సంస్థ, జిల్లా యోగా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా శిక్షణా తరగతుల్లో నగరప్రజలతో పాటు కమిషనర్ పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తిరుపతి నగరంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా, మనిషిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకునేందుకు యోగా శిక్షణ ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. యోగ వలన కలిగే ప్రయోజనాలను నగరప్రజలకు కూడా తెలియజేసి, వారు ఆరోగ్యకరమైన జీవితం గడిపేందుకు పార్కులో శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇక్కడ యోగా నేర్చుకుని మీ ఇంటిలోనే రోజు గంటపాటు యోగా చేసుకోవచ్చునన్నారు. దైనందిన జీవితంలో యోగా ను ఒక అలవాటుగా మార్చుకోవడం వలన మనం అనారోగ్యం పాలు కాకుండా కాపాడుకోవచ్చునన్నారు. మనలో చాలా మంది ఉద్యోగ రీత్యా ఎనిమిది తొమ్మిది గంటల పాటు కూర్చుని పనిచేయాల్సి ఉంటుందన్నారు. అటువంటి సమయంలో మనము ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే యోగ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. వయసు పెరిగే కొద్దీ మనం ఒక చోట కొంతసేపు నిలకడగా కూర్చోలేని పరిస్థితి వస్తుందని, యోగా వలన ఈ సమస్యను అధిగమించ వచ్చునన్నారు. కరోనా మహమ్మారి ఎక్కువగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందన్నారు. ఈ యోగాలో చేసే ప్రాణాయామం, కాపాలభాతి వంటి కొన్ని ఆసనాలు చేయడం వలన ఊపిరితిత్తుల పై చేడు ప్రభావం పడకుండా మనల్ని కాపాడుతాయన్నారు. నేను కూడా నేల రోజులుగా ప్రతి రోజు యోగా చేస్తున్నానని, నా శరీరం ఎంతో రిలాక్స్ ఉంటోందన్నారు. యోగా పై చాలా మందికి అవగాహన లేదని వారందరికి అవగాహన కల్పించడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. నగరప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఆంఫీ థియేటర్ నందు మనిషికి మనిషికి ఎనిమిది అడుగుల భౌతికదూరం పాటించినా సుమారు 150 మంది యోగా శిక్షణ పొందేందుకు వీలుంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా యోగా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో మెడ, నడుము ఆసనాలు, ప్రాణాయామం, బ్రీతింగ్, హాండ్ స్ట్రిచింగ్, చక్రాసన, పాద హస్తాసన, అర్ధ కటి చక్రాసన, తాడాసన, వజ్రాసన, సమవృతి కాపాలభాతి, బసరిక, నాడీశుద్ది వంటి ఆసనాలు చేయించారు. ఈ యోగ తరగతుల్లో అదనపు కమిషనర్ హరిత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ. చంద్రశేఖర్, నగరప్రజలు పాల్గొన్నారు.
శ్రీకాకుళం పట్టణంలో ఆదివారం పూర్తిస్థాయిలో లాక్ డౌన్ అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్ జె నివాస్ తెలిపారు. కాయగూరల మార్కెట్లు, చికెన్, మటన్, చేపల మార్కెట్లు కూడా తెరవడం జరగదని ఆయన స్పష్టం చేసారు. ఈ మేరకు శని వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ శ్రీకాకుళం పట్టణంలో కేసులు అధికంగా పెరుగుతున్న దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేస్తున్నామని అన్నారు. గత ఆది వారం లాక్ డౌన్ కు ప్రజలు మంచి సహకారం అందించారని చెప్పారు. మందుల దుకాణాలు లభ్యంగా ఉంటాయని, వాటితోపాటు వాటికి ఆనుకుని పాలు, బ్రెడ్ మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర వైద్య సేవలను వినియోగించుకొనుటకు ఎటువంటి ఆటంకం లేదని ఆయన స్పష్టం చేసారు. అంబులైన్సులు, వైద్య వాహనాలకు అనుమతి ఉందని పేర్కొంటూ అత్యవసర పరిస్థితుల్లో సొంత వాహనాల్లో వైద్యం నిమిత్తం వెళ్ళే వాహనాలకు కూడా ఆటంకం ఉండదని ఆయన తెలిపారు. అయితే అత్యవసరం కానప్పటికి వైద్య సేవలు పొందే నెపంతో బయట తిరిగే వాహనాలు, యజమానులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కుతోపాటు ఫేష్ షీల్డ్ ధరించాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించాలని, చేతులను తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన అన్నారు. శ్రీకాకుళంలో లాక్ డౌన్ ఉన్నందు వలన ఇతర ప్రాంతాలలో మార్కెటింగుకు వెళ్ళకుండా స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన పిలుపునిచ్చారు.
అక్రమద్యం తరలింపు వ్యాపారం ఎవరు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూళ్లురుపేట సిఐ ఆర్యూవిఎస్ ప్రసాద్ అన్నారు.ఈ మేరకు తన బ్రుందాలతో అక్రమ తమిళ మద్యంపై దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. శనివారం తడ బస్టాండు నుంచి తమిళ మద్యం ఎస్ కే సాదిక్ భాషా నుండి తమిళ మద్యం బాటిళ్లను 20 స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కారిపాకం గ్రామానికి చెందిన రాసగొల్ల నాగేంద్రబాబు అనే నిందితుని అదుపులోకి తీసుకొని అతని వద్ద 20 అక్రమ తమిళ మద్యం బాటిళ్లను స్వాధీనపర్చుకున్నారు. ఎస్ కె సాదిక్ అనే వ్యక్తి నుండి 41 అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 81 బాటిళ్లు వీరి నుంచి స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశామన్నారు. ఈ దాడుల్లో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూళ్లూరుపేట సి ఐ తో పాటు హెడ్ కానిస్టేబుల్ చెంచయ్య కానిస్టేబుల్స్ వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, హరిబాబు వెంకటేశ్వర్లు వెంకటసుబ్బయ్య లు పాల్గొన్నారు.