శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోగుల కోసం ప్లాస్మాదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు పిలుపునిచ్చారు. జిల్లాలో రోజురో జుకు కరోనా రోగుల సంఖ్య పెరుగుతుందని, దీంతో కరోనా మరణాలను నియంత్రించేందుకు ప్లాస్మాథెరపీ బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్లాస్మాలో అభివృద్ధి చెందే యాంటీబాడీస్ కేవలం కొన్ని రోజులే యాక్టివ్ గా ఉంటాయని, కాబట్టి ప్లాస్మాను దానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ పిలుపునిచ్చిన సంగ తి ఎవరూ మరిచిపోకూడదన్నారు. మంగళవారం రాజాంలో జిల్లా రెడ్ క్రాస్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్లాస్మాదానం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఛైర్మన్ పి.జగన్మోహనరావు హాజరై జిల్లా రెడ్ క్రాస్ సంస్థలో ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్న పెంకి చైతన్య ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేసారు. ఇదేస్పూర్తితో కరోనా బారిన పడి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు ముందుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు. తద్వారా కరోనా బారిన పడి తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్న వారిని రక్షించేందుకు వీలుకలుగుతుందని ఆయన స్పష్టం చేసారు. రాజాంలో ప్లాస్మాదానం చేయాలనేవారు 9441708120, 9440131160 మొబైల్ నెంబర్లకు తెలియజేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సెట్ శ్రీ మేనేజర్ బి.వి.ప్రసాదరావు, రాజాం సబ్ బ్రాంచ్ చైర్మన్ కొత్తసాయి ప్రశాంత్ కుమార్ , కె.శంకర్రావు, కె సత్యనారాయణ, బి శ్రీధర్, విజయ్ బాబు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ దృష్ట్యా రానున్న నెలన్నర రోజులు అతి కీలకమని భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె నివాస్ చెప్పారు. మంగళవారం నగరంలో కంటెంట్మెంట్ జోన్లలో పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ తో కలిసి జిల్లా కలెక్టర్ నివాస్ పర్యటించారు. హాయతినగర్, ఫోజుల్ బేగ్ పేట, హడ్కో కాలనీ, చల్లవీధి తదితర ప్రాంతాల్లో పర్యటించి ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లు చేపడుతున్న సర్వే లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ, ప్రతి రోజు శ్రీకాకుళం నగరంలో రెండు వందల నుండి 250 కేసులు పాజిటివ్ వస్తున్నాయని అన్నారు. జిల్లాలో గత రెండు రోజులు రోజుకు వెయ్యి కేసులు నమోదు అయ్యా యన్నారు. 25 రోజుల్లో కేసుల సంఖ్య రెట్టింపు కాగలదని భావిస్తున్నామని, ఈ తరుణంలో రానున్న ఒకటిన్నర నెలలు అతి కీలకంగా భావిస్తూ అందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అన్నారు. కాంటైన్మెంట్ జోన్లలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు తిరగవద్దని కోరారు. మొబైల్ వాన్ల ద్వారా కూరగాయలు, తాగునీరు వంటి సౌకర్యాలు అందించే చర్యలు చేపడుతున్నామని ఆయన అన్నారు. లాక్ డౌన్ సడలింపు తరువాత జిల్లాలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందని అన్నారు.
ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య దృష్ట్యా హోమ్ ఐసోలేషన్ కు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వైరస్ నివారణ లో భాగంగా స్లమ్ ప్రాంతాల్లో 20 వేల మందికి ఫేస్ షీల్డ్ లను పంపిణీ చేయుటకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. వాలంటీర్లు అందరికీ ఫేస్ షీల్డ్ లు పంపిణీ చేశామని ఆయన అన్నారు. రోజుకు 9 వందల వరకు రాపిడ్ టెస్టులు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. 24 గంటల్లో ఫలితాలు వెల్లడికి ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ప్రజలు అనవసరంగా బయటకు తిరగవద్దని కోరారు. కరోనా లక్షణాలు కనిపించగానే తెలియజేయాలని, త్వరగా రావడం వలన ప్రాణాపాయ స్థితి ఉండదని గ్రహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించామని నలుగురు కంటే ఎక్కువ మంది ఎక్కడా ఉండరాదని చెప్పారు. శ్రీకాకుళం, పలాస, సోంపేట, మెలియాపుట్టి, పొందూరు, రాజాం ప్రాంతాల్లో కేసులు అధికంగా నమోదవుతున్నట్లు చెప్పారు. ఇంట్లో పెద్ద వయసు వారికి ప్రమాదమని యువత గ్రహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లో నగర పాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య, రెవిన్యూ డివిజనల్ అధికారి ఈట్ల కిషోర్, పట్టణ పర్యవేక్షణ అధికారి టి.వేణుగోపాల్, ప్రత్యేక అధికారులు టి వివి ప్రసాద్, ప్రసాద్, తాహసిల్దార్ వై వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలోని శ్రీనిధి అపార్ట్మెంట్ కు దక్షిణం వైపు పు ప్రహరీ గోడ మీదుగా శివ జ్యోతి నగర్ లో ప్రవహించుచున్న కపిల్ తీర్థం కాలువ కలిపేందుకు ప్రణాళికలను తయారు చేయమని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ గిరీష ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని శివ జ్యోతి నగర్, కొత్తపల్లి, దేవేంద్ర థియేటర్ రోడ్డు, హరిశ్చంద్ర స్మశాన వాటిక మొదలగు ప్రదేశాలలో ఇంజనీరింగు, పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి మంగళవారం ఉదయం కమిషనర్ గిరీష పర్యటించారు. ఆ ప్రాంతాల్లో గుంతలు, మురుగునీరు పోయే దానికి పైప్ లైన్లు, యుడిఎస్ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనిధి అపార్ట్మెంట్ యజమానులతో మాట్లాడారు. ప్రధాన రోడ్డులో, ఇసుక, కమ్మి, ఇటుక మొదలగు వ్యర్ధాలు రోడ్ లో ఉండకూడదని, ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా చేసే వారిపై ఫైన్ లు విధిస్తామని హెచ్చరించారు. కొత్తపల్లి లో పర్యటించి, ఎక్కడ ఎంతమేరకు రోడ్డు అవసరమో అధికారులు అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ఎంత వరకు అవసరమో ప్లాన్ ద్వారా రెండు రోజుల లోపల తెలియజేయాలని ఆదేశించారు. అనంతరం దేవేంద్ర థియేటర్ రోడ్డు హరిశ్చంద్ర స్మశాన వాటిక లో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న పనులను పరిశీలించి, పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్, కాంట్రాక్టర్లు ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ షణ్ముగం,ఎయికామ్ ప్రతినిధులు బాలాజీ, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో 2021 సంవత్సరానికి “బాల శక్తి పురస్కార్, బాల కళ్యాణ్ పురస్కార్” అవార్డులు పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పీడి ఎన్.సీతా మహాలక్ష్మి తలెలియజేశారు. వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన బాలలకు “బాల శక్తి పురస్కార్” అవార్డు , బాలలపై పనిచేసే స్వచ్చంధ సంస్థలు మరియు వ్యక్తులకు “బాల కళ్యాణ్ పురస్కార్” అవార్డు ఇస్తారన్నారు. జాతీయ స్థాయిలో ఎంపికైన బాలలకు, స్వచ్చంధ సంస్థలకు జనవరి 26, 2021 సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలలో రాష్ట్రపతి , ప్రధానమంత్రి ఈ అవార్డు అంతజేస్తారన్నారు. దీనితోపాటు పాటు నగదు ప్రోత్సాహకం అందజేస్తారని చెప్పారు. ఆశక్తి వున్నవారు సెప్టెంబరు 15వ తేదిలోగా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాల కోసం www.nca-wcd.nic.in వెబ్ సైట్ లో సంప్రదించాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వం నిబంధన అన్ లాక్ 4.0 మార్గదర్శకాలు పాటిస్తూ, తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని నేటి నుంచి యదావిధి గా అన్నిషాపులు తెరుచుకోవడా నికి అనుమతిస్తున్నట్టు కమిషనర్ గిరీష చెప్పారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఆదేశాల మేరకు తిరుపతి నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న మున్సిపల్ పార్కులన్నింటికీ ఉదయం 5 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పని సరిగా ధరించాలని, భౌతిక దూరం పాటిస్తేనే పార్క్ లోకి అనుమ తించేలా ఆదేశాలు జారీచేశామన్నారు. సంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు, శుభకార్యాలకు 100 మందికి లోపల, తిరుపతి అర్బన్ పోలీస్ విభాగం నుంచి అనుమ తులు తీసుకోవచ్చని తెలియజేశారు. అలాగే 60 సంవత్సరాలు పైబడిన పెద్ద వారు, గర్భిణీలు, 10 సంవత్సరాల లోపు పిల్లలు మరియు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఇంటి వద్దే ఉండాలని కమిషనర్ కోరారు. ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణమే వార్డు ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. లేదంటే దగ్గర్లోని పీహెచ్సీకి వెళ్లి కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కమిషనర్ సూచించారు.
భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ పాత్రికేయుడు భారత రత్న ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల అల్ ఇండియా న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (AINEF) ప్రగాఢ సంతాపం తెలయజేసింది. ఫెడరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సీహెచ్.పూర్ణచంద్ర రావు నేడిక్కడ ఒక ప్రకటన లో.. ప్రణబ్ ముఖర్జీ గొప్ప రాజకీయ విలువులున్న నేత అని,అధికారంలో ఉన్న కాంగ్రెస్ కి ఎదురైన సమస్యల ను పరిష్కరించి ట్రబుల్ షూటర్ గా ప్రసిద్ధి గాంచారన్నారు. ప్రణబ్ దాదాగా జర్నలిస్ట్ కూడా అయి నందున జర్నలిస్టుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేవారన్నారు. జర్నలిస్టులను గౌరవించడం బాగా తెలిసిన గొప్ప నీతిజ్ఞుడని పూర్ణచంద్ర రావు ప్రస్తుతించారు. ఒక ఆర్థిక వేత్త,రాజనీతిజ్ఞుడు,జర్నలిస్టుని బారతదేశం కోల్పోయిందన్న ఆయన దాదా ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులు దేవుడు మనో దైర్యాన్ని ప్రశాదించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
క్రీడాకారులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాద పూర్వకంగా కలసిన అంతర్జాతీయ క్రీడాకారిణి (బాక్సింగ్, మహిళా విభాగం) ఎన్. ఉషానుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. మహిళా విభాగం నుండి బాక్సింగ్ లో గత నెల 29వ తేదీన భారత రాష్ట్రపతి చే ఆన్ లైన్ లో ద్యాన్ చంద్ అవార్డు ను ఎన్. ఉషా ఆన్ లైన్ లో స్వీకరించిన సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగు సార్లు బంగారు పథకం, నాలుగు సార్లు సిల్వర్, మూడు సార్లు బ్రాంజ్ పథకాలను సాధించినట్లు ఆయన వివరించారు. జాతీయ స్థాయిలో బంగారు, సిల్వర్, బ్రాంజ్ పథకాలను సాధించినట్లు ఆయన చెప్పారు. ఐ. వెంకటేశ్వరరావు కోచ్ గా విశాఖలోని స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా లోనే కోచింగ్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె రైల్వే లో బాక్సింగ్ కోచ్ గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో సెట్విస్ సిఇఓ బి. శ్రీనివాసరావు, జిల్లా క్రీడా అధికారి ఎన్. సూర్యారావు, రాష్ట్ర బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. లక్ష్మణ్ దేవ్, జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శి బి. అప్పన్ రెడ్డి, ద్రోణాచార్య అవార్డు గ్రహీత, బాక్సింగ్ కోచ్ ఐ. వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా "వైఎస్సార్ సంపూర్ణ పోషణ" కార్యక్రమాన్ని ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసినట్టు మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు సీతామహాలక్ష్మీ తెలియజేశారు. మంగళవారం ఆమె విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం కార్యక్రమాన్ని వాయిదా వేశామన్నారు. అయితే ఇప్పటికే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అంగన్ వాడీలకు తెలియజేయడం జరిగిందన్న ఆమె సెప్టెంబరు 7వ తేదీ లోపు అన్ని కేంద్రాల్లో కార్యక్రమం చేపట్టడానికి ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా ఆదేశించామన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధాంగా గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు పోషణ కు సంబంధించిన పౌష్టికాహారం ఇవ్వడం జరుగుతుందన్నారు. గతంలో ఒక్కోచోట ఒక్కో విధంగా ఈ కార్యక్రమం జరిగేదని ఇపుడు పథకం అందరికీ పూర్తిస్థాయిలో అందేలా ప్రభుత్వం తీర్చిదిద్దినట్టు ఆమె వివరించారు.
రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్య, అష్టైశ్వర్యాలతో విరాజిల్లాలని కరోనా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయేలా చూడాలని ఆ దుర్గమ్మను మొక్కుకున్నట్టు ఆర్ అండ్ బి శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ చెప్పారు. మంగళవారం ఆయన విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వున్న దుర్గమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. ఉదయం ఇంద్రకీలాద్రికి కుటుంబ సమేతంగా చేరుకున్న మంత్రి శంకరనారాయణ, కనక దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు పూర్తిస్థాయిలో సంక్షేమ పథకాలు అందాలని ఏ ఒక్కరూ నష్టపోకుండా ఉండాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేయడానికి ఉంటుంది తప్పా, టిడిపి చేస్తున్నట్టు రాజయకీయం చేయ దన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా హామీలన్ని 90శాతం ఏడాదిన్నర పాలనలోనే అమలు చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ విషయంలో సీఎం ఎంతో నిబద్దతో ఉన్నారని చెప్పిన మంత్రి టిడిపి ఎన్ని కుటిల ప్రయత్నాలు చేసినా, ఎల్లో మీడియా ద్వారా ఎలాంటి విష ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 114 మంది ఫోన్ కాలర్స్ ఫోన్ చేసి తమ వినతులు వచ్చినట్టు జిల్లా రెవిన్యూ అధికారి బి.దయా నిధి తెలియజేశారు. ఇందులో రెవిన్యూ శాఖవి 24 కాగా, పౌర సరఫరాల సంస్థవి 11, ఇతర శాఖలకు సంబంధించి 79 వినతులు ఉన్నాయన్నారు. సోమవారం ఉద యం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో స్పందన కార్యక్రమం జరిగింది. కరోనా నేపధ్యంలో ఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా ప్రజల నుండి వినతులు ( డయల్ యువర్ కలెక్టర్, స్పందనకు బదులుగా ) స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 114 మంది తమ ఫిర్యాదులను జిల్లా రెవిన్యూ అధికారికి తెలిపి నట్లు ఆయన చెప్పారు. వచ్చిన ఫిర్యాదులన్నింటినీ ఎప్పటికపుడు సంబంధిత అధికారులకు పంపి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయం హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ అప్పారావు, స్పందన విభాగం భాస్కరరావు , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల గీతం డీమ్డ్ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె.శివరామకృష్ణ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయ న ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నట్టు ప్రకటించారు. గత ఏడాది ఆగష్టు నెలలో జరిగిన గీతం 39వ వ్యవస్ధాపక దినోత్సవంలో ప్రణభ్ ముఖర్జీకి గీతం ఫౌండే షన్ అవార్డును అందజేసిన స్మృుతులు ఇంకా మరచిపోలేదన్న ఆయన గీతం వేదికగా ఉన్నత విద్యారంగానికి పలు సూచనలు చేశారని వైస్ ఛాన్సలర్ గుర్తు చేసు కున్నారు. గీతం అవార్డును స్వీకరించడం ద్వారా ప్రణభ్ ముఖర్జీ ని గీతం కుటుంబంలో సభ్యుడిగా భావించామని పేర్కొన్నారు. గీతం ఆవిధంగా గొప్ప ఆప్తుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయం తరపున ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చిన్నారిపై లైంగిక వేధింపులను టిడిపి నేత లోకేష్ సమర్థిస్తున్నాడా అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన చిత్తూరులో మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుగారు చదువుకున్న రాజకీయ స్కూల్‌లోనే లోకేష్‌కూడా చదువుకోవడం వలన ఈ తరహా ఆలోచనలు వస్తున్నాయా అని ఎద్దేవా చేశారు. అబద్ధాలు, విషప్రచారాలు, ఆధారాల్లేని ఆరోపణలతో రాజకీయంగా ఎదిగిన చంద్రబాబు, తన కొడుకును కూడా అదే దారిలో నడిపిస్తున్నారని దుయ్యబట్టారు. చిత్తూరులో ఒకరి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేసిన ఘటనను నాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, వారికి చెందిన ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారని అన్నారు. వీరిద్దరి వ్యవహార శైలి ఈ రాష్ట్రానికి శాపంగా మారిందన్న మంత్రి ఇలాంటి విష రాజకీయాలు చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబే కాదు.. లోకేష్‌బుర్రకూడా విషంతో నిండిపోయిందని చిన్నారిని లైంగికంగా వేధించిన కేసులో ఒక హెడ్‌మాస్టర్‌పై చట్టప్రకారం చర్య తీసుకున్నా అది వీరికి కనిపించలేదన్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత పత్రికా విలేఖరి వ్యవహారం నడపాలని చూస్తే ఆ చిన్నారి తల్లిదండ్రులు ఆగ్రహించి దాడికి దిగితే, పోలీసులు చర్య తీసుకుని, దాడికి దిగిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. నిర్మాణాత్మక విమర్శలు చేయండి, స్వాగతిస్తాం అంతే తప్పా ఆధారాల్లేని ఆరోపణలు చేస్తే... తండ్రీ కొడుకులిద్దరికీ ప్రజలు బడితె పూజ చేస్తారని మంత్రి హెచ్చరించారు.
కోవిడ్ వైరస్ కేసులు పెరగడానికి సెప్టెంబరు నెల కీలకమని ఈవిషయంలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల నోడల్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కోవిడ్ ఆసుపత్రులలో రోగులకు అందుతున్న సేవల పై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ఆసుపత్రులు గా గుర్తించబడిన ప్రైవేటు ఆసుపత్రుల్లో మానవ వనరుల కొరత అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం తన నిధులతో డాక్టర్లు, నర్సులు, హెల్ప్ డెస్క్ మేనేజర్లు, ఇతర సిబ్బందిని రిక్రూట్ చేసిందని తెలిపారు. వారి అటెండెన్స్ ను నోడల్ అధికారు లు ధృవీకరించాలని, అప్పుడే జీతభత్యాలు చెల్లించగలమని తెలిపారు. ప్రతి ఆసుపత్రి లో హెల్ప్ డెస్క్ ను నిర్దిష్ట ప్రమాణాల మేరకు నిర్వహిణ జరగాలన్నారు. అడ్మిషన్లు, డిస్చార్జిల డేటా, ఖాళీ గా ఉన్న బెడ్ల వివరాలు ఎప్పటికప్పుడు మాతా, శిశు సంరక్షణ పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని, ఆసుపత్రిలో డిస్ ప్లే బోర్డు లపై ప్రదర్శించాలన్నారు.
ప్రతీ ఆసుపత్రిలోనూ 2 ల్యాండ్ లైన్ టెలిఫోన్ లు ఏర్పాటు చేసుకోవాలని, ఒక ఫోన్ తో ఆసుపత్రి వార్డుల్లోని సిబ్బందితో సంప్రదించి, రోగి బంధువులకు సరియైన సమాచారాన్ని అందించాలని, ఇంకొక టెలిఫోన్ ద్వారా బయటి నుండి వచ్చే కాల్స్ కు సమాధానమిచ్చి, వివరాలను రిజిస్టర్ లో నమోదు చేయించాలని కోరారు. కోవిడ్ ఆసుపత్రులను జాయింట్ కలెక్టర్ గోవింద రావు ఆసుపత్రులను తనిఖీ చేయాలని, ప్రతిరోజూ టెలికాన్ఫరెన్సు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవింద రావు, డిఆర్ఓ ఎ.ప్రసాద్, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, అడిషనల్ డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, ఆరోగ్య శ్రీ జిల్లా కోఆర్డినేటర్ భాస్కరరావు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ద్రుష్ట్యా విశాఖ జివిఎంసిలో నిర్వహిస్తున్న ఈ-స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన అధికంగానే వస్తుందని కమిషనర్ డా. జి. సృజన అన్నారు. ఈమేరకు ఈ-స్పందన ద్వారా 146 ఫిర్యాదులు స్వీకరించినట్టు ఆమె మీడియాకి వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజలు ఏవిధంగా ఫిర్యాదులు చేసినా వాటి పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలన్నారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులపైనా తక్షణమే స్పందించి పరిష్కా రాలు చూపాలన్నారు. వీటిలో 59 సాధారణ ఫిర్యాదులు కాగా, 87 వివిధ విభాలకు చెందినవిగా వచ్చాయన్నారు. 26 ప్రజారోగ్య విభాగానికి సంబందించినవి, 12 పబ్లిక్ వర్క్స్ విభాగానికి సంబందించినవి, 13 పట్టణ ప్రణాళికా విభాగానికి సంబందించినవి, 08 నీటి సరఫరా విభాగానికి సంబందించినవి, 12వీధి లైట్ల విభాగానికి సంబందించినవి, 02 రెవెన్యూ విభాగానికి సంబందించినవి, 08 యు.సి.డి విభాగానికి సంబందించినవి, 03 యు.జి.డి. విభాగానికి సంబందించినవి, 02 ఐ. టి. విభాగానికి సంబందించినవి ,01 సాధారణ పరిపాలనా విభాగానికి సంబందించినవి ఉన్నాయన్నారు. ఈ స్పందన కార్యక్రమంలో పలుచోట్ల క్రొత్తగా రోడ్ల నిర్మాణం కొరకు, వీధి దీపాలు కొరకు, పందులు నివారణ కొరకు, ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై ఫిర్యాదులు ఉన్నాయన్నారు. వీటిని ఆయా విభాగాలకు పరిష్కారం కోసం బదలాయించడం జరిగిందని కమిషనర్ వివరించారు.
విశాఖలోని జి.వి.ఎం.సి. ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమానికి 24 ఫిర్యాదులు వచ్చాయని జి.వి.ఎం.సి. కమీషనర్ డా. జి. సృజన చెప్పారు. సోమవారం జివిఎంసిలోని టోల్ ఫ్రీ నం. 1800-4250-0009 ద్వారా ప్రజల నుంచి కమిషనర్ వినతులు స్వీకరించారు. వాటిని శాఖల ఆధారంగా అధికారులకు బదలాయించిన ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా పరిష్కరించి నివేదికలు అందజేయాలని అధికారులను/జోనల్ కమిషనర్లను ఆదే శించారు. ఇందులో 1వ జోనుకు సంబందించి 03 ఫిర్యాదులు, 2వ జోనుకు సంబందించి 02, 3వ జోనుకు సంబందించి 05, 4వ జోనుకు సంబందించి 03, 5వ జోనుకు సంబందించి 07, 6వ జోనుకు సంబందించి 02, పి.డి. (యు.సి.డి) సంబందించి 01, సి.ఇ. నకు సంబందించి 01, మొత్తము 24 ఫిర్యాదులు ఫోను ద్వారా స్వీకరించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ, డయల్ యువర్ కమిషనర్ కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03రోజులలో పరిష్కరించాలని అధికారులను కోరారు. ఒక సమస్య పదే పదే ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కూడా కమిషనర్ హెచ్చరించారు. ప్రజా సమస్యలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.