1 ENS Live Breaking News

మన్యం జిల్లాలో పర్యాటకం శోభిల్లాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యాటకం శోభిల్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో పర్యాటకం అభివృద్ధికి సమష్టి కృషి అవసరమని ఆయన చెప్పారు. పార్వతీపురం, సీతంపేట ఐటిడిఎల పరిధిలో ఎకో టూరిజం క్రింద గిరిజన ఒకటి, రెండు గ్రామాలను అభివృద్ధి చేయాలని సూచించారు. పర్యాటకులు ఒక రోజు గ్రామంలో గడిపి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ వద్ద కన్వెన్షన్ సెంటర్, వ్యూ పాయింట్, ఫుడ్ కోర్టు ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని ఇందుకు పార్వతీపుం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, జలవనరుల శాఖ అధికారులతో సహా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. 

 భవిష్యత్తులో వాటర్ స్పోర్ట్స్, రివర్ ఫ్రంట్ కాటేజీలు, ఫ్లోటింగ్ రెస్టారెంట్, బ్యాటరీ ట్రైన్ సౌకర్యం కల్పించి అధిక సంఖ్యలో పర్యాటకులను ఆకర్షించుటకు అవకాశాలు పరిశీలించాలని ఆయన ఆదేశించారు. జిల్లాలో పర్యాటక, జాతీయ రహదారి కలుపుతూ తూర్పు కనుమల కారిడార్ (ఈస్టర్న్ ఘాట్స్ కారిడార్) ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన సూచించారు. తద్వారా ఆర్థిక అభివృద్ధికి అవకాశాలు ఏర్పడతాయని, సామాన్య ప్రజల ఆదాయం వృద్ది చెందగలదని ఆయన చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో రెండు నుండి ఐదు ఎకరాల స్థలంలో శిల్పారామం, బడ్జెట్ హోటల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లా కేంద్రంలో టూరిజం కార్పొరేషన్ డివిజన్ (ఎకో టూరిజం) కార్యాలయం, డెప్యూటీడిఇ , ఏఇలతో కూడిన టూరిజం కార్పొరేషన్ ఇంజినీరింగ్ కార్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. 

పర్యాటక సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా పర్యాటక విశేషాలు తెలియజేస్తూ వెబ్ సైట్ రూపొందించాలని, ఇతర ప్రధాన వెబ్ సైట్లుతో అనుసంధానం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:58:06

మన్యం జిల్లాలో 306 ధాన్యం సేకరణ కేంద్రాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏర్పాటుచేస్తున్న  ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా     రైతులనుండి ధాన్యం సేకరణకు కావలసిన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.  బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేసమందిరం లో సివిల్ సప్లైస్ కార్పొరేషన్, సివిల్ సప్లైస్, వ్యవసాయ, కోపరేటివ్, బ్యాంకు అధికారులు, మిల్లర్ లతో  సమావేశం  నిర్వహించారు.   ఈ సందర్భంగా జాల్లా కలెక్టర్ మాట్లాడుతూ,  గత సంవత్సరం ధాన్యం సేకరణ లో జరిగిన లోపాలను సరిదిద్దుకొని  సేకరణ పనులు సక్రమంగా జరిగేటట్లు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు .  రైతు భరోసా కేంద్రాలలో ధాన్యం తేమ, నాణ్యత చూసే సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని,  రైతులకు కుడా అవగాహన కల్పించాలన్నారు.  ధాన్యం మిల్లుకు వెళ్ళిన తరువాత తేమ,నాణ్యత విషయం లో తేడాలు రాకుండా సేకరణ కార్యక్రమం జరగాలని తెలిపారు.  టె

క్నికల్ సహాయకులకు తగిన శిక్షణ ఇవ్వాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా కూలీలు, రవాణా ఎర్పాట్లు చేయాలని తెలిపారు.  మిల్లర్ లకు బ్యాంకులలో పెండింగ్ బిల్ల్స్ సంబందించిన పనులు వారం రోజులలో పూర్తి చేయాలన్నారు. వీరఘట్టం మండలం లో మిల్లులు తక్కువగా ఉన్నాయని, పంట ఎక్కువని కావున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని తెలిపారు.    మిల్లర్లు  బ్యాంకు గ్యారంటీ సకాలంలో అందజేయాలని తెలిపారు. జెసి ఒ.ఆనంద్ మాట్లాడుతూ, ధాన్యం సేకరణకు అవసరమైన సంచులు సిద్దం చేయాలని తెలిపారు.  పాత సంచులు కూడా సిద్దం చేసుకోవాలని, మిగిలినవి సేకరించాలని తెలిపారు.  సివిల్ సప్లైస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ దేవులనాయక్  ధాన్యం సేకరణకు రూపొందించిన నివేదికను వివరించారు.  కేంద్ర ప్రభుత్యం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్యం వరి పంటకు  కనీస మద్దతు ధర కల్పించుటకు  ఏ గ్రేడ్ రకానికి  క్వింటాకు రెండు వేల అరవై రూపాయలు , సాదారణ రకానికి రెండు వేల నలబై రూపాయలు ప్రకారం చెల్లించ నున్నట్లు తెలిపారు.  

జిల్లాలో 71,371 హెక్టార్లలో వరిపంట వేసారని, సుమారు నాలుగు లక్షల మూడువేల మెట్రిక్  టన్నులు దిగుబడి అంచనా వేయగా అందులో మూడులక్షల పదమూడు వేల మెట్రిక్  టన్నులు మార్కెట్ కు రావచ్చని తెలిపారు.  86.5 శాతం ఇ-క్రాప్ బుకింగ్ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సవరం మొత్తం సేకరణ ప్రక్రియ మొబైల్ యాప్ ద్వారానే జరుగుతుందని, మిల్స్ సెలక్షన్  ఆటోమేటిక్ గా రాండమ్ సెలక్షన్ ద్వారా జరుగుతుందని తెలిపారు.  ప్రతి ధాన్యం సేకరణ కేంద్రం, రైతు భరోసా కేంద్రం వద్ద ప్రోక్రూర్మెంట్ అసిస్టెంట్ మరియు రూట్ అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. జిల్లాలో  తొంబదిఒక్క మిల్లులు ఉన్నాయని, డబ్బదిఎనిమిది  లక్షల ముప్పైఒక్కవేల గోనె సంచులు అవసరంకాగా  మూడు లక్షల ముప్పదిరెండు వేల సంచులు నిల్వఉన్నట్లు తెలిపారు. జిల్లాలో గల ఏజెన్సీల వద్ద పది ప్రదేశాలలో లక్షా పదివేల నాలుగువందల డబ్బదిమూడు మెట్రిక్ టన్నుల నిల్వసామర్ద్యంగల గొడౌన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 

రెవిన్యూ, వ్యవసాయ అధికారులు, ధాన్యం సేకరణ ఏజెన్సీల అధికారులు, సివిల్ సప్లయి అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు ధాన్యం సేకరణ ప్రక్రియలో వారు నిర్వర్తించవలసిన విధులు గూర్చి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు యిచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ జాయింటు డైరెక్టరు రాబర్ట్ పాల్, జిల్లా సివిల్ సప్లయి అధికారి కె.వి.ఎల్.ఎన్.మూర్తి, జిల్లా పరిషత్ సి.ఇ.ఒ. ఎం .అశోక్ కుమార్, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ బి.కాశీరామ్, జిల్లా కోపరేటివ్ అధికారి బి. సన్యాశినాయుడు, ఎపిఎస్ఐసి రీజనల్ మేనేజర్ ఎస్.రవికుమార్, జి.సి.సి. డివిజినల్ మేనేజర్ జి.సంద్యారాణి ఇతర అధికారులు, మిల్లర్లు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:56:17

గిరిజన ఉత్పత్తులకు బ్రాండ్ మార్కెట్ కల్పించాలి

గిరిజనులు వన్ ధన్  వికాస్ కేంద్రాలు ద్వారా ఉత్పత్తిచేస్తున్న వస్తువులకు బ్రాండింగు కల్పించుట ద్వారా మార్కెటింగు అవకాశాలు మెరుగుపరచవచ్చునని జిల్లాకలెక్టరు నిశాంత్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన చాంబరులో ఐ.టి.డి.ఎ. అధికారులతో గిరిజన ఉత్పత్తులు, మార్కెటింగు సదుపాయాలుపై  సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వెదురు, జీడిమామిడి, చింతపండు, ఫైనాపిల్, పసుపు, తృణధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి అమ్ముట ద్వారా గిరిజనులకు లాభం చేకూర్చవచ్చునని తెలిపారు. ఉత్పత్తులకు పార్వతీపురం జిల్లాకు చెందినట్లుగా బ్యాండింగు ఇచ్చుట ద్వారా అమ్మకాలు పెంచవచ్చునని సూచించారు.

 పేకింగు,   బ్రాండింగుతో డిజైన్ తయారుచేయాలన్నారు. ఆర్గానికి ఉత్పత్తులైన  జీడిపప్పు, తృణదాన్యాలతో బిస్కెట్స్, తీపిపదార్దాలు  తయారుచేసి మార్కెటింగు చేయాలన్నారు. గిరిజన ఉత్పత్తుల అమ్మకాలకు సీతంపేట, పార్వతీపురం, జి.ఎల్.పురంలలో రిటైల్ షాపులను ఏర్పాటు చేయాలన్నారు.  క్వాలిటీ, పేకింగు బాగుండాలని తెలిపారు. జీడిపప్పు, బిస్కెట్ మార్కెటింగుకు బహుళజాతి సంస్థలు, విమానయాన సంస్థలతో మాట్లాడాలన్నారు. జాయింటు కలెక్టరు, పార్వతీపురం ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి ఒ.ఆనంద్ మాట్లాడుతూ చింతపండు లాభదాయకంగా ఉందని, జీడి పండ్లు వృదాగా పోతున్నాయని, వాటితో కూడా ఉత్పత్తులకు గల అవకాశాలను  పరిశీలిస్తున్నట్లు తెలిపారు. 

సీతంపేట ఐ.టి.డి.ఎ. ప్రోజెక్టు అధికారి బి.నవ్య మాట్లాడుతూ జీడిపప్పు వ్యాపారం అభివృద్ది చేయుటకు, దిగుబడి పెంచుటకు జీడి పిక్కలు ప్రాసెంసింగు యూనిట్లకు ఆర్డరు పెట్టినట్లు తెలిపారు. వన్ ధన్  వికాస్ కేంద్రాలు ద్వారా ఉత్పత్తి చేస్తున్న పసుపు, అగరబత్తి మొదలైన ఉత్పత్తులను గూర్చి వివరించారు. ఈ సమావేశంలో డి.ఆర్.డి.ఎ.  ప్రోజెక్టు అధికారి వై.సత్యంనాయుడు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:51:11

మన్యంలో 3వ తేదీన దసరా ఉత్సవాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో దసరా ఉత్సవాలు అక్టోబర్ 3వ తేదీన నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. జిల్లా పర్యాటక కౌన్సిల్ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా యంత్రాంగం తరపున ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించుటకు ఏర్పాట్లు చేయాలని సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి  చేనేత వస్త్ర ప్రదర్శన - విక్రయం, గిరిజన సాంప్రదాయ వస్తువుల ప్రదర్శన, వన్ ధన్ కేంద్రాల ఉత్పత్తులు, సవర కళాకృతుల ప్రదర్శన, జీసిసి ఉత్పత్తులు, ఆప్కో, అటవీశాఖ, వెదురు ఉత్పత్తుల ప్రదర్శన, ఆహార పదార్థాల విక్రయ ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఆటవస్తువులు ఏర్పాటు,  బాణసంచా తదితర కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆయన సూచించారు. 3వ తేదీ మధ్యాహ్నం నుండి కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. అన్ని శాఖల అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొని ఉత్సవాలను దిగ్విజయం చేయాలని ఆయన అన్నారు. 

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సీతంపేట ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి డా.బి.నవ్య, జిల్లా గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ అధికారులు జె. శాంతీశ్వర రావు, జి.మురళి, మునిసిపల్ కమీషనర్ జె.రామ అప్పల నాయుడు, పర్యాటక అధికారి ఎన్. నారాయణ రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.ఎస్.ఎన్.రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి లోచర్ల రమేష్, జట్టు సంస్థ వ్యవస్థాపకులు డా.పారినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Parvathipuram

2022-09-28 11:48:19

అలక్ష్యం వహించే సిబ్బందిని ఇంటికి పంపిస్తా

విజయనగరంలోని వార్డు స‌చివాల‌య సిబ్బందిపై క‌లెక్ట‌ర్ ఎ.సూర్యకుమారి తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. స‌చివాల‌యాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ పెంచాల‌ని, సిబ్బంది ప‌నితీరును మెరుగు ప‌ర్చాల‌ని ఆదేశించారు. విజ‌య‌న‌గ‌రం కార్పొరేష‌న్ ప‌రిధిలోని ప‌ద్మావ‌తి న‌గ‌ర్‌లో ఉన్న 37 వ స‌చివాల‌యాన్ని, జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ముందుగా రికార్డుల‌ను, హాజ‌రు ప‌ట్టీని ప‌రిశీలించారు. వివిధ ప‌థ‌కాల అమ‌లు తీరును, స్పంద‌న గ్రీవెన్స్‌ను ప‌రిశీలించారు. మ‌హిళా పోలీసు, ఎఎన్ఎం ల‌ను ప్ర‌శ్నించారు. వారి ప‌నితీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. సచివాల‌య సిబ్బంది ప‌నితీరు మెరుగుప‌డాల‌ని, ఇదే తీరు చూపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఇకపై సచివాలయాలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతానని, తేడాగా వ్యవహరించే సిబ్బందిని ఇంటికి పంపిస్తానని తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.వి.రమణ కుమారి, మున్సిప‌ల్ హెల్తాఫీస‌ర్ డాక్ట‌ర్ కెవి స‌త్య‌నారాయ‌ణ‌, స‌చివాల‌యాల క‌న్వీన‌ర్ హ‌రీష్ పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-27 17:22:18

వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం

డా.వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారానికి దరఖాస్తులను ఈ నెల 30వ తేదీ లోగా  సమర్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి అర్హులైన యువత నుంచి “వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలు, వైఎస్ఆర్ అఛీవ్ మెంట్” అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు  తెలిపారు. కళలు, సాంఘిక కార్యక్రమాలు, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, ఔషధములు, సాహిత్యం, విద్య, పౌరసేవ, క్రీడలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వ్యక్తులు తగు ఆధారాలతో (వార్తాపత్రికల క్లిప్పింగ్లు, ఫొటోలు జతపరిచి) దరఖాస్తు చేయాలని సూచించారు. గ్రామ, మురికివాడల అభివృద్ధిలో చేసిన కృషి, స్వచ్చంద సేవాసంస్థలు, లాభాపేక్ష లేని సంస్థ లకు సంబంధించిన వ్యక్తులు వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

సంఘాలు,  సంస్థలకు సంబంధించిన అభ్యర్థులు ప్రకృతి, చారిత్రక విషయాల్లో చేసిన సేవలకు సంబంధించి ఉండాలన్నారు. అభ్యర్థులు దరఖాస్తును ఒక పేజీకి మించకుండా తమ వివరాలు, చిరునామా, ఫోన్ నంబర్, ఇ-మెయిల్ వివరాలు, ఎంచుకున్న విభాగంనకు సంబంధించిన వివరాలు జతచేసి secy-political@ap.gov.in మెయిల్ కు 30వ తేదీ లోగా సమర్పించాలని ఆయన వివరించారు. అర్హులైన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తులు సమర్పించాలని కోరారు.

Parvathipuram

2022-09-26 15:56:19

స్పందన అర్జీలను వెంటనే పరిష్కరించాలి..

రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మం స్పంద‌న‌కు వ‌చ్చే ప్ర‌తి అర్జీని నిర్ణీత స‌మ‌యంలో, నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించాల‌ని కాకినాడ జిల్లా క‌లెక్ట‌రు డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. సోమవారం జిల్లాస్థాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా క‌లెక్ట‌రు కృతికా శుక్లా..జాయింట్ క‌లెక్ట‌రు ఎస్‌.ఇల‌క్కియ‌, డీఆర్వో కె.శ్రీధర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, బీసీ కార్పొరేషన్ ఈడీ ఎస్‌వీఎస్ సుబ్బ‌ల‌క్ష్మిల‌తో క‌లిసి  ప్రజల నుంచి విజ్ఞాపనలను స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులో పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో 298 అర్జీలు స్వీకరించారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, పేదలందరికీ ఇళ్లు కింద ఇళ్ల మంజూరు, రెవెన్యూ సేవలు, సర్వే, పెన్షన్ తదితరాలపై అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో అందిన అర్జీల ప‌రిష్కారానికి సంబంధించి ఫొటోల‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. అర్జీల ప‌రిష్కారంలో అధికారులు, సిబ్బంది క్షేత్ర‌స్థాయి సంద‌ర్శ‌న ఫొటోల‌ను ప‌రిష్కార నివేదిక‌కు జ‌త‌చేయాల‌ని ఆదేశించారు. స్పంద‌న అర్జీల ప‌రిష్కార నాణ్య‌తా ప్ర‌మాణాల త‌నిఖీలో భాగంగా క‌లెక్ట‌రేట్‌లో ఏర్పాటుచేసే ప్ర‌త్యేక కాల్ సెంట‌ర్ ద్వారా అర్జీదారుల‌కు ఫోన్ చేసి, ప‌రిష్కారంపై అభిప్రాయాలు తీసుకోనున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ ప్ర‌త్యేక స్పంద‌న‌కు 66 అర్జీలు:
మధ్యాహ్నం కలెక్టరేట్ స్పందన హలులో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక స్పందన కార్యక్రమంలో డీఆర్‌వో కె.శ్రీధ‌ర్‌రెడ్డి, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ, కెఎస్సీఈజెడ్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టరు కె.మనోరమ అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించి ఆయా శాఖల ద్వారా నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 66 అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు, కలెక్టరేట్ సెక్షన్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-26 14:08:30

మనబడి-నాడు,నేడు పనులు వేగం పెంచాలి

కాకినాడ జిల్లాలో  పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చేపట్టిన రెండో దశ మనబడి-నాడు నేడు పనులను త్వరితగతిన పూర్తిచేసేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మన బడి-నాడు నేడు రెండో దశ పనులకు సంబంధించి అదనపు తరగతిగదుల నిర్మాణ పనులు, జగనన్న విద్యా కానుక, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు-విద్యా సూచికలు, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన  తదితర అంశాలపై గురువారం మధ్యాహ్నం అమరావతి నుంచి రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రత్యేక కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్, మౌలిక సదుపాయాల కల్పన ప్రత్యేక కమిషనర్ కాటమనేని భాస్కర్..అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానం ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి కలెక్టరు డా. కృతికా శుక్లా.. విద్యా, సమగ్ర శిక్ష, ఏపీడబ్ల్యూఐడిసి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి హాజరయ్యారు. 

అనంతరం అధికారులను ఉద్దేశించి కలెక్టరు మాట్లాడుతూ  జిల్లాలో మనబడి నాడు నేడు రెండో దశ కార్యక్రమములో భాగంగా సుమారుగా 904  అంగన్వాడీ, పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో  నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు.  విద్యా శాఖ, ఇంజనీరింగ్ అధికారులు క్షేత్ర స్థాయి సిబ్బందిని సమన్వయం చేసుకొని నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. ఇసుక, సిమెంట్ తదితరాలకు అవసరమైన ఇండెంట్ ను ఎప్పటికప్పుడు పంపించాలన్నారు. నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాల పాటించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని  కలెక్టరు తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి.సుభద్ర, సమగ్రశిక్ష, పంచాయతీరాజ్, ఏపీడబ్ల్యూఐడీసీ, ఆర్డబ్ల్యూఎస్ సుపరింటెండెంట్ ఇంజనీర్లు నటరాజన్, ఎం.శ్రీనివాసు, కె.లక్ష్మణరెడ్డి, ఎం.శ్రీనివాసు, ఐసీడీఎస్ పీడీ కె.ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. 

Kakinada

2022-09-22 16:13:22

ఈ-కేవైసీ నూరుశాతం పూర్తిచేయాలి..

రాజమహేంద్రవరం జిల్లాలో రైతుల డేటా వివరాలు , ఈ కే వై సీ నూరు శాతం పూర్తి చెయ్యాలని,  ఇంకా నమోదు కాలేని వారికి మూడు రోజుల సమయం మాత్రమే ఉందని జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ అన్నారు. గురువారం సాయంత్రం డివిజన్, మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ శ్రీధర్ మాట్లాడుతూ,  జిల్లాలో 318000 మేర డాక్యుమెంట్స్ పూర్తి చేయాల్సి ఉందన్నారు.  వాటిని గ్రామ స్థాయి లో నిర్ధారణ చేసి ధృవీకరణ చెయ్యడం లో గ్రామ రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. గ్రామ వ్యవసాయ అధికారులు 87 శాతం, గ్రామ రెవెన్యూ అధికారులు 40శాతం మేర మాత్రమే డేటా ఎంట్రీ చేసిన వాటిపై ధృవీకరణ విషయంలో కూడా ప్రత్యేక దృష్టి పెట్టక పోవడం పై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం నాటికి పూర్తి చెయ్యాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, ఇతర డివిజన్, మండల అధికారులు ఆయా మండలాలు నుంచి పాల్గొన్నారు. 

రాజమండ్రి

2022-09-22 15:09:14

దరఖాస్తుల స్వీకరణకు 30వరకు గడువు

శ్రీకాకుళం జిల్లాలోని వృద్ధ కళాకారుల కొత్త పింఛన్ల కొరకు సమర్పించవలసిన దరఖాస్తుల  గడువును ఈ నెల 30వరకు పెంచినట్లు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి.రమణ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. పించన్ల కొరకు దరఖాస్తుల స్వీకరణ విషయమై గతంలో ప్రకటన జారీచేసినప్పటికీ తక్కువ స్థాయిలో దరఖాస్తులు రావడంతో ఆ గడువును ఈ నెల 30 వరకు పెంపుదల చేసినట్లు ఆయన ఆ ప్రకటనలో వివరించారు. ఈ కార్యాలయానికి అందిన దరఖాస్తులు ఆధారంగా జిల్లా స్థాయి కమిటీలో చర్చించి అర్హత పొందిన కళాకారుల తుది జాబితాను రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి, విజయవాడ వారికి సమర్పించడం జరుగుతుందని తెలిపారు. 

కావున అర్హత గల కళాకారులు తమ పూర్తి చిరునామాతో పాటు కుల, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్, అనుభవ పత్రాల ప్రతులతో నిర్ణీత దరఖాస్తు ఫారంలో నింపి సెప్టెంబర్ 30లోగా  జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, సమాచార పౌర సంబంధాల శాఖ, అఫీషియల్ కాలనీ, జె.సి గారి బంగ్లా దరి, శ్రీకాకుళం - 532 001 చిరునామాకు స్వయంగా లేదా పోస్టు ద్వారా సమర్పించాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు, గడువు దాటిన తదుపరి వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవని ఆయన స్పష్టం చేశారు. నిర్ణీత దరఖాస్తు ఫారంను కార్యాలయ పనివేళల్లో ఉచితంగా పొందవచ్చని అన్నారు.

Srikakulam

2022-09-22 14:53:09

శ్రీ‌నివాస సేతు ప‌నుల‌ను ప‌రిశీలన..

క‌ర‌కంబాడి మార్గం నుండి లీలామ‌హ‌ల్ స‌ర్కిల్ మీదుగా క‌పిల‌తీర్థం రోడ్డులోని వాస‌వి భ‌వ‌న్ వ‌ర‌కు నిర్మిస్తున్న శ్రీ‌నివాస సేతు ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను టిటిడి ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి, జిల్లా క‌లెక్ట‌ర్  వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, ఎస్పీ  ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డితో క‌లిసి గురువారం ప‌రిశీలించారు. సెప్టెంబ‌రు 27వ తేదీ ముఖ్య‌మంత్రి  వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభిస్తార‌ని, ఇందుకు అవ‌స‌ర‌మైన ప‌నులు 26వ తేదీ నాటికి పూర్తి చేయాల‌ని ఆదేశించారు. మున్సిప‌ల్‌, టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, నిర్మాణ‌ప‌నులు చేస్తున్న ఆఫ్కాన్ సంస్థ ప్ర‌తినిధుల‌కు ఈవో ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో వీర‌బ్ర‌హ్మం, జాయింట్ క‌లెక్ట‌ర్ బాలాజి, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ కుమారి అనుప‌మ అంజ‌లి, టిటిడి చీఫ్ ఇంజినీర్  నాగేశ్వ‌ర‌రావు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎస్ఇ  మోహ‌న్‌, ఆఫ్కాన్ సంస్థ మేనేజ‌ర్  రంగ‌స్వామి ప‌లువురు అద‌న‌పు ఎస్పీలు, డిఎస్పీలు పాల్గొన్నారు.

Tirumala

2022-09-22 14:48:11

షాపుల యజమానులు సహకరించాలి

శ్రీకాకుళంనగరంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపుల గల షాపుల యజమానులు, తోపుడు బండ్లు కాలువలకు లోపలి భాగంలో వ్యాపారాలు కొనసాగించాలని, లేనిచో చర్యలు తప్పవని నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేశు స్పష్టం చేశారు. గురువారం నగరంలోని పలు ప్రాంతాలను సిబ్బందితో కలిసి పర్యటించారు. తొలుత నాగావళి నది వద్ద నిర్మిస్తున్న డైక్  దగ్గర వరద నుండి కాపాడేందుకు రూ.62 లక్షలతో నీటిపారుదల శాఖ నిర్మిస్తున్న రింగ్ బండ్ పనులను స్వయంగా పరిశీలించారు. ఇటీవల నదీ ప్రవాహానికి డైక్ వద్ద అడ్డుపడిన చెత్తను తొలగించే చర్యలు చేపట్టిన ఆయన తదుపరి ఆదివారంపేటలో రహదారికి ఇరువైపులా గల కాలువల్లో పూడికను సిబ్బందితో తీయించారు. కొత్తరోడ్డు అండర్ బ్రిడ్జి వద్ద జరుగుతున్న పెయింటింగ్ పనులను పరిశీలించారు. 

అనంతరం నగరంలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా నున్స షాపుల యజమానులు, తోపుడు బండ్లు వ్యాపారులు చెత్తను కాలువల్లో వేస్తున్నారని, ఇకపై ఇటువంటివి చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే షాపుల యజమానులు, తోపుడు బండ్ల యజమానులు కాలువలకు లోపల భాగంలోనే వ్యాపారాలు కొనసాగించాలని, కాలువలు దాటి రహదారిపై వ్యాపారాలు కొనసాగించడం వలన వాహనాలకు,పాదచారులకు తీవ్ర అంతరాయం కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా కాలువలపై వ్యాపారాలు చేయడం వలన కాలువల్లోని శిల్టును తొలగించేందుకు సిబ్బందికి ఇబ్బందిగా మారుతుందని అన్నారు.

 వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని షాపులు,తోపుడుబండ్ల యజమానులు కాలువలకు లోపలి భాగంలో ఏర్పాటుచేసుకొని తమ వ్యాపారాలు కొనసాగించి నగరపాలక సంస్థకు సహకరించాలని కోరారు. వీటిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ పర్యటనలో సానిటరీ సూపర్ వైజర్ గణేష్, సానిటరీ ఇన్ స్పెక్టర్ ఉగాది, కాంట్రాక్టర్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.



Srikakulam

2022-09-22 07:19:36

గుర‌జాడ స్ఫూర్తిని కొన‌సాగించాలి

మ‌హాక‌వి గుర‌జాడ అప్పారావు ర‌చ‌న‌ల స్ఫూర్తిని కొన‌సాగించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి పిలుపునిచ్చారు. మ‌హాక‌వి ర‌చ‌న‌లు నిత్య నూత‌న‌మ‌ని, తెలుగుజాతి ఉన్నంత‌వ‌ర‌కూ అవి నిలిచిఉంటాయ‌ని జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కొనియాడారు. గుర‌జాడ అప్పారావు 160వ జ‌యంతి వేడుక‌లు బుధ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. ముందుగా గుర‌జాడ స్వ‌గృహంలోని చిత్ర‌ప‌టానికి, విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. గుర‌జాడ వినియోగించిన వ‌స్తువుల‌తో,  స‌త్య క‌ళాశాల జంక్ష‌న్‌ వ‌ర‌కూ దేశ‌భ‌క్తి గేయాల‌ను ఆల‌పిస్తూ, ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు. అక్క‌డి గుర‌జాడ‌ విగ్ర‌హానికి పూల‌మాల‌ల‌తో నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మాట్లాడుతూ, గుర‌జాడ వందేళ్ల క్రితం చెప్పిన ప్ర‌తీమాటా ఆచ‌ర‌ణ సాధ్య‌మ‌ని అన్నారు.

 నాటి సామాజిక ప‌రిస్థితుల‌ను బ‌ట్టి ఆయ‌న క‌న్యాశుల్కం రాశార‌ని, మ‌ళ్లీ క‌న్యాశుల్కం ఆచారం తిరిగి మొద‌ల‌య్యే ప‌రిస్థితి నేడు నెల‌కొంద‌ని అన్నారు. సొంత‌లాభం కొంత మానుకోవాల‌ని స‌మాజానికి దిశానిర్ధేశం చేశార‌ని అన్నారు. ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌ గురించి ఆయ‌న ఆనాడే చాలా గొప్ప‌గా చెప్పార‌ని అన్నారు. స్వ‌దేశీ వ‌స్తువుల వినియోగం పెంచాల్సిన‌ అవ‌స‌రాన్ని శ‌తాబ్దం క్రిత‌మే చాటి చెప్పిన గుర‌జాడ గొప్ప దూర‌దృష్టి గ‌ల‌వార‌ని కొనియాడారు. ఆయ‌న ర‌చ‌న‌ల‌ను అర్ధం చేసుకొని, వాటి స్ఫూర్తిని కొన‌సాగించ‌డ‌మే గుర‌జాడ‌కు అస‌లైన నివాళి అని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు.

                  జెడ్‌పి ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ, గుర‌జాడ విశ్వ‌క‌వి అని, ఆయ‌న భావాలు విశ్వ‌వ్యాపిత‌మని కొనియాడారు. ఆయ‌న ర‌చ‌న‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌ని, తెలుగువారికి గుర‌జాడ గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. తెలుగు భాష ఉన్నంత‌వ‌ర‌కూ గుర‌జాడ ర‌చ‌న‌లు నిలిచి ఉంటాయ‌ని అన్నారు. ప్ర‌ధాని మోడి ప‌లికిన దేశ‌మంటే మ‌ట్టికాదోయ్‌... గుర‌జాడ గీతాన్ని ఉద‌హ‌రించారు. గుర‌జాడ వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం నేటిత‌రంపై ఉంద‌న్నారు. విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల్లో మ‌హాక‌వి ర‌చ‌న‌ల‌కు త‌గిన ప్రాధాన్య‌త ఇచ్చే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

                 కార్య‌క్ర‌మంలో విజ‌య‌న‌గ‌రం మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మి, డిప్యుటీ మేయ‌ర్ ఇస‌ర‌పు రేవ‌తీదేవి, డిఆర్ఓ ఎం.గ‌ణ‌ప‌తిరావు, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ ఆర్‌. శ్రీ‌రాముల‌నాయుడు, అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ పివివిడి ప్ర‌సాద‌రావు, జిల్లా ప‌ర్యాట‌క శాఖాధికారి పిఎన్‌వి ల‌క్ష్మీనారాయ‌ణ‌, విద్యాశాఖాధికారి కె.వెంక‌టేశ్వ‌ర్రావు, స‌మాచార పౌర సంబంధాల శాఖాధికారి డి.ర‌మేష్‌, ప‌శు సంవ‌ర్థ‌క శాఖాధికారి డాక్ట‌ర్ వైవి ర‌మ‌ణ‌, మ‌హిళాశిశు సంక్షేమ శాఖాధికారి బి.శాంత‌కుమారి, సంగీత క‌ళాశాల ప్రిన్సిపాల్ ల‌క్ష్మీప్ర‌స‌న్న‌,  స‌మ‌గ్ర‌శిక్ష ఎపిసి డాక్ట‌ర్ విఏ స్వామినాయుడు, గుర‌జాడ కుటుంబీకులు వెంక‌టేశ్వ‌ర‌ప్ర‌సాద్‌, ఇందిర‌, ల‌లిత‌, గుర‌జాడ సాంస్కృతిక స‌మాఖ్య ప్ర‌తినిధులు పివి న‌ర్సింహ‌రాజు, డాక్ట‌ర్ ఎ.గోపాల‌రావు, కాపుగంటి ప్ర‌కాష్‌, జిల్లా గ్రంథాల‌య సంస్థ మాజీ అధ్య‌క్షులు రొంగ‌లి పోత‌న్న‌, వివిధ సంస్థ‌ల ప్ర‌తినిధులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.

Vizianagaram

2022-09-21 10:00:47

సింహగిరిపై భువనవిజయం సత్సంగం

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం , భక్త కోటి ఇలవేల్పు  సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి(సింహాద్రి అప్పన్న) ఆలయంలో బుదవారం  ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖకు చెందిన భువన విజయం సంస్థ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. వరాహ, నారసింహ అవతారాలతో భక్తులకు దర్శనమిస్తున్న ఆ సింహాద్రి నాధుని తమ కీర్తనలతో కీర్తించారు. సుమారు 40 మంది సభ్యుల బృందం అన్నమాచార్య సంకీర్తనలుతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణంలు  కూడా గావించారు. దీంతో సింహగిరి హరినామ సంకీర్తనలతో మారుమ్రోగింది.. ఏకాదశి పర్వదినాన ఆ స్వామి సన్నిధిలో తమ బృందం సత్సంగం నిర్వహించడం ఎంతో సంతోషం కలిగించిందని సంస్థ అధ్యక్షులు నెహ్రూ ,కార్యదర్శి జవ్వాది లక్ష్మి పేర్కొన్నారు. ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన  సింహాచలం ఆలయ వర్గాలకు బృందం సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఆలయ ఏఈవో ఎన్ వి వి ఎస్ ఎస్ ఎ ఎఏన్ రాజు వీరందరికీ స్వామి దర్శన భాగ్యం కల్పించారు. అర్చకులు ఇరగవరపు వెంకట రమణమూర్తి ఆచార్యులు ఆశీర్వాదం అందజేయగా, కార్య క్రమం సమన్వయకర్తగా అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు వ్యవహరించారు..
ఏకాదశి పర్వదినాన సింహగిరిపై విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించడం, అన్నమాచార్య  సంకీర్తనలు తో, ఆ స్వామిని సేవించుకోవడం,స్మరించుకోవడం అదృష్టంగా ప్రతి   ఒక్కరూ  భావిం చాలన్నారు. సింహగిరిపై ఉత్సవాలు సమయంలోనే కాకుండ  నిరం తరం సాంస్కృతిక ప్రదర్శనలు, ఆధ్యా త్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేసే దిశగా ఆలయ వర్గాలు చేస్తున్న కృషి అభినందనీయమని శ్రీనుబాబు కొనియాడారు. అనంతరం సంస్ధ సభ్యులు శ్రీనుబాబు ను ఘనంగా సత్కరించారు.

Simhachalam

2022-09-21 09:53:08

అగ్నివీర్ కు ఎంపికైన ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు

శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో 14వ ఆంధ్ర బెటాలియన్ లో శిక్షణ పొందిన కళాశాల ఎన్.సి.సి విద్యార్థులు 56 మంది అగ్నివీర్ కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. పి.సురేఖ పేర్కొన్నారు. ఇటీవల  విశాఖపట్నంలో జరిగిన ఆర్మీ ర్యాలీలో అగ్నివీర్  దేహదారుఢ్య పరీక్ష విభాగంలో ఎంపికైనట్లు ఆమె వివరించారు. వీరందరికీ ఎన్.సి.సిలో సి-సర్టిఫికెట్ ఉండడం వలన వ్రాత పరీక్ష లేకుండానే ఉద్యోగార్దులుగా మారుతారని, సైన్యంలో చేరే అవకాశాన్ని పొందుతారని ఆమె తెలిపారు. అగ్నివీర్ కు ఎంపికైన ఎన్.సి.సి క్యాడెట్లను ఈ సందర్భంగా అభినందిస్తున్నామని అన్నారు. దేశ సేవకై ఎంపికైన వీరంతా నిరంతరం దేశ రక్షణకై పరితపిస్తూ సైనికులుగా సేవలు చేయాలని విద్యార్థులకు సూచించారు. 

కళాశాలలో ఇటీవల ఎన్.సి.సి- బి మరియు సి-సర్టిఫికెట్ పరీక్షలలో ఎన్.సి.సి విద్యార్థులు శత శాతం ఉత్తీర్ణత సాధించినందుకు  కళాశాల ఎన్. సి.సి అధికారి లెఫ్ట్నెంట్ డా.వై.పోలి నాయుడు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు కొనియాడారు. గత 10 సంవత్సరాలలో బెటాలియన్ లో గల అన్ని ఎన్.సి.సి సీనియర్ డివిజన్ విభాగంలో ఈ సంవత్సరం శత శాతం ఉత్తీర్ణత సాధించడం చాలా హర్షనీయమని ప్రిన్సిపల్ తెలిపారు. అనంతరం బి మరియు సి సర్టిఫికెట్ ఉత్తీర్ణులైన క్యాడేట్లకు సర్టిఫికెట్లను ప్రిన్సిపల్ డాక్టర్ సురేఖ  అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ ఆర్.హరిత జె.కె.సి కో ఆర్డినేటర్ డా. డి పైడితల్లి, పరిపాలనాధికారి ఎన్.సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-21 09:48:35