1 ENS Live Breaking News

ఇంటినిర్మాణంలో అదనంగా రుణసదుపాయం..

తూర్పుగోదావరి జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ "నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ" నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ₹.35 వేలు వరకు అదనపు రుణ సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ డా కె.. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డిఆర్డిఏ, మెప్మా అధికారులు, సిబ్బందితో అదనపు బ్యాంకు లింకేజి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, జిల్లాలో 51919 మంది లబ్ధిదారులకు నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా ఇంటి స్థలాలు ఇవ్వటం జరిగిందన్నారు. ఇంటి నిర్మాణాలు పూర్తి చేసే విధానం లో అదనపు ఆర్థిక చేయూత కావలసిన లబ్ధిదారులకు క్షేత్ర స్థాయి సిబ్బంది రూ.35 వేలు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు కు కృషి చేయవలసి ఉంటుందన్నారు. 

స్వయం సహాయక సంఘాలలో ఉండే మహిళా సభ్యులతో పాటు, సంఘం లో లేని వారికి కూడా అదనపు బ్యాంకు రుణాలు మంజూరు కై కృషి చేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలలోని 15,173 మందికి రూ.53.11 కోట్లు, పట్టణ ప్రాంతాల్లోని 4,062 మందికి రూ. 22.58 కోట్ల మేర అదనపు బ్యాంకు రుణాలు గా అందించడం జరిగిందన్నారు. ఇంకా ఎస్ హెచ్ జి లో ఉన్న వారితో పాటుగా ఎస్.హెచ్. జి ల్లో లేని 14,119 మందికి రుణ సౌకర్యం కల్పించే బాధ్యత మండలం లో పనిచేసే సిబ్బంది తీసుకోవాలన్నారు. ఇందుకోసం బ్యాంకర్ల తో మాట్లాడి ఇళ్ళ నిర్మాణం కోసం చేపట్టే పనులు పూర్తి చేయాలన్నారు. కొవ్వూరు, నిడదవోలు పురపాలక పరిధిలో చక్కని ఇండ్ల స్థలాలు ఉన్నాయని, వాటిలో ఎందుకు ఇంటి నిర్మాణాలు వేగవంతం చెయ్యలేక పోతున్నారని ప్రశ్నించారు. 

గోకవరం, పెరవలి మండలాల్లో పురోగతి కనిపిస్తోందని, కోరుకొండ, అనపర్తి, రాజమహేంద్రవరం రూరల్ జిల్లా స్థాయి సగటు కంటే తక్కువగా ప్రగతి ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. నాన్ ఎస్ హెచ్ జి లను గ్రూప్ గా ఏర్పాటు చెయ్యాలన్నారు. అదనపు రుణం మంజూరు చేసినా ప్రతి లబ్దిదారుడు తప్పనిసరిగా ఇంటి నిర్మాణం కోసమే ఆ మొత్తాలు ఖర్చు చేసి, ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్నారు.  ఈ సమావేశంలో డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్. డేగలయ్య, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం వి ఎస్ ప్రియంవద, డిపిఎం, ఏ పి ఎం లు  ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

2022-10-12 12:34:15

భవిష్యత్ విశాఖ కోసం కలికట్టుగా గర్జిద్దాం

 ''ఇప్పటి వరకు మనం అనేక ఉద్యమాలు చేశాం.. వీటన్నిటికన్నా మించింది విశాఖ గర్జన అని..  ఇది మనం పుట్టిన ప్రాంతం కోసం చేస్తున్నాం'' అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 15న జరిగే విశాఖ గర్జన సభకు విశాఖ తూర్పు నియోజకవర్గ ప్రాంత ప్రజలను సమాయత్తం చేసేందుకు వుడా చిల్డ్రన్ థియేటర్ లో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమం భావితరాల కోసం చేస్తున్నదిగా అన్ని వర్గాలవారు గుర్తించాలని, మనప్రాంతానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో చేస్తున్న ఈ పోరాటానికి అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వాలు ఉత్తరాంధ్రను వెనుకబాటుతనంలోకి నెట్టేశాయని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గురించి శ్రీకృష్ణ కమిటీ స్పష్టం చేసినా, చంద్రబాబు నాయుడు  అమరావతిని రాజధానిగా ప్రకటించారని ఆయన అన్నారు. 

తెలంగాణ పోరాటం రాష్ట్రం కోసం కాదని, హైదరాబాద్ కోసమని, ఇప్పటికీ తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదని అమర్ నాథ్ అన్నారు. విభజన సమయంలో మనం చాలా నష్టపోయామని, మరోసారి నష్టపోవడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని మూడేళ్ల అయిందని, దీనికి ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు కల్పిస్తున్నాయని అన్నారు. విశాఖను రాజధాని కానిచ్చేదిలేదని దండయాత్ర చేస్తున్న వారిపై విశాఖ ప్రజలు గర్జించాలని అమర్నాథ్ పిలుపునిచ్చారు. విశాఖను రాజధానిగా చేయడం వెనుక ఉన్న ఆవశ్యకతను ప్రజలకు వివరించి ఉద్యమంలో భాగస్వాములను చేయాల్సిన అవసరం మనపై ఉందని ప్రజాప్రతినిధులకు మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు. భిన్న సంస్కృతులకు ఆలవాలమైన విశాఖ నగరం రాజధానిగా ఎందుకు కాకూడదు? అని అమర్నాథ్ ప్రశ్నించారు.

మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్ర యూనివర్సిటీ, స్టీల్ ప్లాంట్ ను పోరాడి సాధించుకున్నామని, ఇప్పుడు విశాఖ రాజధాని  కాకుండా చేస్తున్న వారితో పోరాడి రాజధానిని తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేసే మంచి పనులను చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసి అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. అందరూ బాగుండాలని కోరుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అడక్కుండానే విశాఖను పరిపాలన రాజధానిగా చేసే అపూర్వ అవకాశం మనకు ఇచ్చారని అన్నారు. విశాఖలో వైసిపి నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆయన అన్నారు. 

ఇలా విమర్శిస్తున్న వారు భూములు ఎవరు కబ్జా చేశారో తన వద్దకు వచ్చి చెప్పాలని అవంతి కోరారు. బాబు నీచ రాజకీయాలకు బలి కావద్దని పవన్ కళ్యాణ్ కు అవంతి హితవు చెప్పారు. తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జనం గర్జనకు  తరలిరావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో మేయర్ హరి వెంకట కుమారి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, పలువురు కార్పొరేటర్లు, పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం వీరు చిల్డ్రన్ థియేటర్ నుంచి సిరిపురం జంక్షన్ వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడ మానవహారం నిర్వహించారు.

2022-10-12 11:39:14

వికేంద్రీకరణకు మద్దతు ఇవ్వకుంటే చరిత్రహీనులవుతారు

రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన వికేంద్రీకరణకు ఉత్తరాం ధ్ర ప్రాంతం నాయకులు జండా, అజెండాలను పక్కనపెట్టి మద్దతివ్వాలని, ఇందుకు భిన్నంగా వ్యవహరించేవారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు.  నాన్ పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15వ తేదీన చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని 2019 డిసెంబర్ లోనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళనీయకుండా ప్రతిపక్ష పార్టీలు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

విశాఖ రాజధానిగా వద్దంటూ అమరావతి రైతులు దండయాత్రగా మనమీదికి రావడాన్ని  తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. భావితరాల భవిష్యత్తు కోసం కలిసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమం ద్వారా ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలు అన్ని ప్రాంతాలకు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే యువకులు విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, రైతులు ఈ ఉద్యమానికి మద్దతుగా వస్తున్నారని అమర్నాథ్ తెలియజేశారు. ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని, ఆఉచ్చులో  చిక్కుకోబోమని అమర్నాథ్ చెప్పారు.

మాజీ మంత్రి, పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ, 15న జరిగే విశాఖ గర్జన ఏ వ్యక్తికో, ఏ కులానికో సంబంధించినది కాదని, ఇది ఉత్తరాంధ్ర ప్రజల ఆత్మగౌరవ పోరాటమని అన్నారు. రాజకీయ లబ్ది కోసం తాము ఈ పోరాటం చేస్తున్నామని వివిధ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారని,  వారే వచ్చి ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని, లబ్ధి అంతా వారే పొందినా మాకు అభ్యంతరం లేదని అవంతి అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగా విశాఖ పరిపాలన రాజధాని చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారని టిడిపి నేతలు చంద్రబాబు నాయుడిని నిలదీయాల్సిన తీయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్ముతున్నారని ఆయన ప్రతిపక్ష పార్టీలను విమర్శించారు.

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ విశాఖ గర్జన ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, దీనికి మద్దతుగా గ్రామ, మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో, అన్ని పార్టీలు ఆత్మ ప్రబోధం చేసుకొని పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. జేఏసీ వైస్ చైర్మన్ దేవుడు మాస్టార్ మాట్లాడుతూ అన్ని పార్టీలు జెండాలు, అజెండాలు పక్కనబెట్టి వెనకబాటు తనం నుంచి ఉత్తరాంధ్ర బయటపడే విధంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి మీడియా రంగం వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే న్యాయపరంగా, రాజకీయంగా అడ్డుకుంటున్నారని దాన్ని తిప్పికొట్టే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

2022-10-12 11:35:34

స్కిల్ హాబ్స్ లో యువతకు ఉపాది శిక్షణ

తిరుపతి స్కిల్ హాబ్స్ నందు యువతకు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ కమిటీ తగిన ప్రణాళికల ను రూపొందించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సమీక్ష నిర్వహించారు. డీఆర్ఓ  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంకల్ప్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.  జిల్లాలో ప్రతి నెల రెండవ, నాల్గవ  శుక్రవారం జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలోని యువతకు పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యం పై వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ హాబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

  జిల్లాలోని  యువతకు నైపుణ్యాలను మెరుగుపరచడానికి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమన్వయం చేసుకోవాలని  తెలియజేశారు. పిడి డి ఆర్ డి ఎ  జ్యోతి గారు మాట్లాడుతూ జిల్లాలోని యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ మేళా క్యాలెండర్ ను ప్రణాళికబద్ధంగా జరగాలని అదేవిధంగా  స్కిల్ హాబ్స్ ద్వారా యువతకు శిక్షణ పొందడానికి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ  అధికారి శ్యాం మోహన్, జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ పద్మజ, సెట్విన్ సీఈవో మురళీకృష్ణ, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి ,  జె డి ఎమ్ హైమావతి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య,  శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్స్ డీన్ నాగరాజు, ఎస్వీ పాలిటెక్నిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ గౌరీ శంకర్, ఎస్వీ ఇంజనీరింగ్  కళాశాల  ప్రిన్సిపాల్ ఆర్ వి ఎస్ సత్యనారాయణ, కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

2022-10-12 11:02:15

దేశం కోసం యువత పనిచేయాలి

దేశం కోసం యువత పనిచేయాలని యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు జిల్లాలోని యువతకు పిలుపునిచ్చారు. దేశం మనకు ఏమిచ్చిందని కాకుండా దేశానికి మనం ఏమిచ్చామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని కోరారు. బుధవారం మునసాబుపేటలోని గురజాడ విద్యా సంస్థలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ సౌజన్యంతో నెహ్రు యువ కేంద్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ యువతకు సామాజిక స్పృహ, బాధ్యతతో పనిచేయాలని కోరారు.

స్వామి వివేకానంద ఆశయాలు, స్ఫూర్తికి అనుగుణంగా పనిచేసిననాడే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని పేర్కొన్నారు. మానవ జీవితంలో తల్లిదండ్రులను ఎవరైతే గౌరవిస్తారో వారికే ఉన్నత భవిష్యత్ ఉంటుందని వివరించారు. తొలుత విద్యార్థుల అభిప్రాయాలను ముఖ్యఅతిథి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం తిలకించారు. ముఖ్యఅతిధికి నెహ్రు యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్ ఉజ్వల్ ఇతర అధికారులతో కలిసి దుశ్శాలువ, జ్ఞాపికను ఇచ్చి ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి కె.వెంకట్ ఉజ్వల్, జాతీయ యువ కార్యకర్తలు ఎంపిక కమిటీ సభ్యులు పూడి బాలఆదిత్య, సెట్ శ్రీ ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.వి.ప్రసాదరావు, జిల్లా ఉపాధి అధికారి జి.శ్రీనివాసరావు, ఎస్.సి. కార్పొరేషన్ పథక సంచాలకులు కె.రామారావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణ రావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మరియు జిల్లా చీఫ్ కోచ్  స్పోర్ట్స్ ఎం.మాధురిలత, గురజాడ విద్యాసంస్థలు సంచాలకులు, ప్రిన్సిపాల్ అంబటి రంగారావు, డా.పులఖండం శ్రీనివాసరావు, ఐతం కళాశాల డీన్ ఆచార్య డి.విష్ణుమూర్తి,ఎన్.వై.కె గణాంకాధికారి డి. శ్రీనివాసరావు,ఇతర అధికారులు, పెద్దఎత్తున యువతీయువకులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-12 10:04:11

ఆహార పంపిణీలో ప్రమాణాలు పాటించాలి

జాతీయ ఆహార భద్రత చట్టాన్ని మరింత పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథ న్ తో కలిసి విశాఖపట్నం, అనకాపల్లి జిల్లా శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార కమిషన్ చైర్మన్ సిహెచ్.విజయప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యమని, దానికి అనుగుణంగా పోషక విలువలు కలిగిన ఆహారం అందించడం జరుగుతుందన్నారు. పేదలు, విద్యార్థులు, గర్భిణులకు ఆహార భద్రత కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రభుత్వం నిర్ధేశించిన ప్రమాణాల మేరకు అందాలని అన్నారు. 

ఈ విషయమై రెండు రోజులుగా విశాఖపట్నం , అనకాపల్లి జిల్లాల్లో పర్యటించి అంగన్‌వాడీ కేంద్రాలు, వసతి గృహాలు, రేషన్‌ దుకాణాలు,యం.ఎల్.ఎస్  గోదాములు తనిఖీ చేశామన్నారు. అంగన్‌వాడీ వ్యవస్ధ మరింత మెరుగుపడాలన్నారు. కేంద్రాల్లో విద్యార్థుల హాజరు సక్రమంగా నమోదు చేయాలన్నారు. పిల్లల జ్ఞాపకశక్తి ,ఆరోగ్యాన్ని మరింత పెంపొందించేందుకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఫోర్టిఫైడ్‌ రైస్‌ అందించడం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ బియ్యాన్ని అందిస్తున్నామని,  త్వరలోనే రాష్ట్రమంతా సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం కల్పిస్తున్న హక్కును అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. మొబైల్ రేషన్ వాహనాల ద్వారా అందిస్తున్న బియ్యం కు బదులుగా డబ్బు పంపిణీ వంటి అవకతవకలకు పాల్పడినట్లయితే సంబంధిత రేషన్ డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐసిడిఎస్ అధికారులు అంగన్వాడీ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలన్నారు.

    జాయింట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్ మాట్లాడుతూ ఆహార భద్రత చట్టం 2013 అమలుకు అధికారులు కృషి చేయాలని, కమిషన్ చైర్మన్ క్షేత్రస్థాయి తనిఖీలలో గుర్తించిన లోటుపాట్లును సంబంధిత శాఖల అధికారులు తక్షణమే సరిచేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  ఆహార కమిషన్ మెంబర్ కాంతారావు, స్టేట్ ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి.సురేష్ ,విశాఖపట్నం డీఎస్ఓ సూర్య ప్రకాష్ రావు, అనకాపల్లి జిల్లా డీఎస్ఓ కె.వి.ఎల్.ఎన్ ప్రసాద్, విశాఖ డీఈవో చంద్రకళ , అనకాపల్లి డీఈవో రామలింగేశ్వరరావు , ఐసిడిఎస్ పిడి  వెంకటేశ్వరి, పౌరసరఫరాల శాఖ  డిఎం, విశాఖపట్నం ఐ. రాజేశ్వరి , డిఎం అనకాపల్లి శ్రీలత , ఈడీ బీసీ కార్పొరేషన్ శ్రీదేవి, ఎంఈఓ లు సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.

2022-10-12 08:59:28

నవంబర్ 12న జాతీయ లోక్ అదాలత్

క్రిమినల్ కేసులు రాజీ చేయుట కొరకు అందరూ కృషి చేస్తే.. లోక్ అదాలత్లో కేసు రాజీ చేసుకొంటే శాశ్వత పరిష్కారం లభిస్తుందని..  జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు, లేబర్ అధికారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలు అనుసరించి నవంబర్ 12 వ తేదీ న శ్రీకాకుళం లో అన్ని కోర్టు  సముదాయములలో జరిపే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులకు చేరువ చేయాలన్నారు. ఆ విధంగా చేయడం ద్వారా అప్పీలు చేసుకునేందుకు అవకాశం ఉండదని పేర్కొన్నారు. ఎక్కువ కేసులు పరిష్కారం చేయటం కోసం కృషి చేయాలని ప్రతీ ఒక్కరూ క్రుషి చేయాలని పిలపునిచ్చారు.  

  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి వారు అందరు అధికారులను జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారం చేయటం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.  ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలో అదనపు జిల్లా న్యాయ మూర్తులు శ్రీ టీ . వెంకటేశ్వర్లు, జి.చక్రపాణి   కె.శ్రీదేవి , సీనియర్ సివిల్ జడ్జి లు  కే. నాగమణి ,  ఎం.అనురాధ, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసి నాయుడు ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఎక్సైజ్ కమిషనర్ గోపాల్   , శ్రీకాకుళం టౌన్ డి.ఎస్.పి మహేంద్రమతే  డెప్యూ టీ కమీషనర్  ఆఫ్ లేబర్ ప్రసాదరావు అధికారులు పాల్గొన్నారు.

2022-10-11 13:37:04

రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు

రాష్ట్రంలో కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు అందించడం జరుగుతుందని, ఇటువంటి ప్రక్రియ గతంలో ఎన్నడూ లేదని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ట్రేషన్లు మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ప్రజాజీవితంలో ప్రభుత్వ సేవలను అందుకొని ప్రజలు సంతృప్తి చెందిననాడే ఆ ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ విధానాలకు ప్రాతినిధ్యం వహిస్తూ సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తున్న ప్రతినిధులను మంత్రి ధర్మాన ఈ సందర్భంగా అభినందించారు. మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం స్థానిక గుడి వీధి సచివాలయ పరిధిలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన పాల్గొని లబ్ధిదారులతో ముచ్చటించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినప్పటికీ చాలామందికి కనీస సదుపాయాలు కూడా అందడం లేదన్నారు. అటువంటివారికి మనస్పూర్తిగా ఈ ఐదేళ్లు అందించేలా పథకాలను రూపకల్పన చేయడం జరిగిందని గుర్తుచేసారు. ఈ విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పామని, దీనిపై ప్రజలకు ఆమోదయోగ్యం అయితేనే ఓటు వేయమని కోరామని, ప్రజలు విశ్వసించి ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగిందని గుర్తుచేసారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ ప్రభుత్వం వచ్చిన మరుసటి రోజు నుండే సంక్షేమ పథకాలను అమలుచేయడం జరిగిందని తెలిపారు. ఈ పథకాలన్నీ కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా కన్నీరు, ఆకలి, బీదరికం, అవసరాలను గుర్తించి వారికే అమలుచేయాలని నిర్ణయం తీసుకొని అమలుచేస్తున్నామని తెలిపారు. 

గతంలో సంక్షేమ పథకాలు పొందాలంటే రాజకీయ నాయకులకు సలామ్ చేస్తూ, వారి ఆంక్షలు మేరకు పథకాలను లబ్ధిపొందేవారని, వారికి కోపం వస్తే పథకాలను తీసేస్తామని బెదిరింపులు కూడా గతంలో ఉండేవని అన్నారు.  ప్రస్తుతం ఆ పద్ధతికి స్వస్తిపలికి, వాటన్నింటికి భిన్నంగా  సంక్షేమ పథకాల కేలండరును విడుదల చేసి, ప్రతి పథకం అక్కచెల్లెమ్మల, అన్నదమ్ముల ఖాతాల్లోకే నేరుగా జమచేస్తున్న సంగతిని గుర్తుచేసారు. లబ్ధిదారులు పొందిన నగదును తమ అవసరాలకు తగిన విధంగా ఖర్చు చేసుకునేలా వెసులుబాటును కల్పించడం జరిగిందన్నారు. ప్రజల చెంతకే ప్రభుత్వాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వ సంక్షేమ ఫలాల అమలు వివరాలను తెలుసుకుంటూ, అదనంగా ప్రజల అవసరాలను తెలుసుకొని వాటిని అమలుచేసేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని అమలుచేస్తున్నట్లు చెప్పారు. 

ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, నగరపాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేషు, చల్లా శ్రీనివాసరావు, భవానీ, శంకరరావు, నీలాద్రి, చిన్నబాబు, సునీలు, హైమా, నగరపాలక సంస్థ అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

2022-10-11 09:01:35

మత్స్యకారులు చేప‌ల వేటకు వెళ్లొద్దు..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో భారీవ‌ర్షాలు త‌గ్గిన‌ప్ప‌టికీ జిల్లా వ్యాప్తంగా గ‌త వారం రోజులుగా కురిసిన వ‌ర్షాల కార‌ణంగా న‌దులు, వాగులు పొంగే అవ‌కాశం వున్నందున మ‌త్స్య‌కారులు గానీ ఇత‌రులు గానీ చేప‌లు ప‌ట్టేందుకు వాగుల్లోకి వెళ్ల‌కుండా అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్  ఏ.సూర్య‌కుమారి ఆదేశించారు. ఆయా గ్రామాల్లోని వాలంటీర్లు అప్ర‌మ‌త్తంగా వుంటూ ఎవ‌రూ న‌దుల్లోకి, వాగుల్లోకి ప్ర‌వేశించ‌కుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు. భారీవ‌ర్షాల నేప‌థ్యంలో జిల్లాలోని త‌హ‌శీల్దార్‌లు, ప్ర‌త్యేక అధికారులతో జిల్లా క‌లెక్ట‌ర్ సోమ‌వారం ఉద‌యం టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి ప‌రిస్థితిని స‌మీక్షించారు. వ‌ర్షాల కార‌ణంగా పంట పొలాలు ముంపున‌కు గురైతే అటువంటి స‌మాచారాన్ని జిల్లా అధికారుల‌కు వెంట‌నే తెలియ‌జేయాల‌ని ఆదేశించారు. వ‌ర్షాలు త‌గ్గాయ‌ని ఆద‌మ‌ర‌చి వుండొద్ద‌ని, ఆయా మండ‌లాల్లో నిరంత‌రం ప‌రిస్థితిని గ‌మ‌నిస్తూ ఎక్క‌డైనా అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రిగితే  వెంట‌నే త‌గిన స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాల‌న్నారు.  పంట న‌ష్టం వివ‌రాల‌పై రైతులు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, పంట న‌ష్టం వివ‌రాల‌ను ఆయా గ్రామ వ్య‌వ‌సాయ స‌హాయ‌కుల నుంచి సేక‌రిస్తున్న‌ట్టు తెలిపారు. వాతావ‌ర‌ణం సాధార‌ణ స్థితికి వ‌చ్చేవ‌ర‌కూ మండ‌లాల్లోని క్షేత్ర‌స్థాయి అధికారులంతా అప్ర‌మ‌త్తంగా వుండాల‌ని సూచించారు.

2022-10-10 16:44:53

త్వరలోనే 3మూడు రాజధానుల బిల్లు..

మూడు రాజధానుల బిల్లు త్వరలోనే ప్రవేశపెడతామని, ఇందులో ఎవరికీ అనుమానం అక్కర్లేదని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సర్క్యూట్ హౌస్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికేంద్రీకరణకు అన్ని వర్గాల నుంచి మద్దతు పుష్కలంగా లభిస్తోందని, విశాఖ పరిపాలన రాజధాని కావడాన్ని ఉత్తరాంధ్ర ప్రాంత వాసులు గొప్ప అవకాశంగా భావిస్తున్నారని అన్నారు. ఎవరైనా తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే వద్దు అనరని, టిడిపి నాయకుడు అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదని కోరుకుంటున్నారని, ఆయన నైజాన్ని ఈ ప్రాంత ప్రజలు గమనిస్తున్నారని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు అజెండాను అచ్చెన్నాయుడు ఉత్తరాంధ్ర ప్రజలపై రుద్దడం సమంజసం కాదని ఆయన హితవు పలికారు.

 25 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారని ఉత్తరాంధ్రకు మేలు జరిగే కార్యక్రమం ఒకటైన చేశారా? అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన అచ్చెన్నాయుడు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను, మనోభావాలను గౌరవించటం లేదని ఆయన అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవని ఆత్మహత్యలే ఉంటాయని..  వికేంద్రీకరణ, విశాఖ పరిపాలన రాజధాని వద్దంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పడం ఆత్మహత్యా సదృశ్యమేనని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణకు వ్యతిరేకం అయితే మీరు మాట్లాడకండి.. చంద్రబాబు నాయుడు బంట్రోతు లుగా మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతానికి నష్టం చేయొద్దని ఆయన అచ్చెన్నాయుడుకు హితవు చెప్పారు. వికేంద్రీకరణను వ్యతిరేకించే వ్యక్తుల నోర్లు మూయించేoదుకే విశాఖ గర్జనను నిర్వహిస్తున్నామని తెలియజేశారు.పాదయాత్ర పేరుతో చేసిన దండయాత్రలు నిలువరించేందుకే ఈ గర్జన అని  ఆయన చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వస్తున్న పాదయాత్రికులు భయపడే విధంగా గర్జన ఉంటుందని అమర్నాథ్ వివరించారు.

చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కొత్తగా వికేంద్రీకరణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అమర్నాద్ అన్నారు. గర్జనపై ఆయన చేసిన ట్వీట్లు చంద్రబాబు విధానాలకు అద్దం పడుతున్నాయని ఎద్దేవా చేశారు. 'ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి కానీ.. ఇక్కడి ప్రజల కష్టాల గురించి  గానీ మీకు తెలియవు.. గర్జన గురించి మీకేం తెలుసు? మీకు గర్జించడం రాదు..' అని పవన్ కళ్యాణ్ పై మంత్రి అమర్నాథ్ విమర్శనాస్త్రాలు సంధించారు. గత  ఎన్నికల్లో విశాఖ ప్రజలు మిమ్మల్ని ఓడించినందువల్లే ఈ ప్రాంతం అభివృద్ధి చెందకూడదన్న ఉద్దేశంతోనే మీరు వ్యాఖ్యలు చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ని తీవ్రంగా దుయ్యబట్టారు.

 ఎవరి రాజధాని అమరావతి అన్న పుస్తక ఆవిష్కరణ సభలో మీరు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని అమర్నాథ్ పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం పవన్ కళ్యాణ్ కి నటన నేర్పింది. ఆయన నట జీవితానికి వన్నెతెచ్చిన విశాఖకు వెన్నుపోటు పొడవాలని పవన్ భావించటం బాధాకరమని అన్నారు.  వికేంద్రీకరణ కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని,  ఈ విధానం సరైనది కాదని భావిస్తున్న టిడిపి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అమర్నాథ్ చెప్పారు. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించి మూడు రాజధానుల బిల్లు తో ముందుకు వస్తానని అమర్నాథ్ పునరుద్ఘాటించారు.

2022-10-10 16:29:51

జాప్యం లేకుండా అర్జీలను పరిష్కరించాలి

అర్జీల పరిష్కారంలో జాప్యం  లేకుండా త్యరితగతిన పరిష్కరించాలని అధికార్లను జిల్లా జాయింటు కలెక్టరు జె వి మురళి ఆదేశించారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ లో సమస్యలు పరిష్కారానికి  వచ్చిన ప్రజల నుంచి  జాయింట్ కలెక్టర్  వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా జెసీ మాట్లాడుతూ, ప్రజల నుండి వచ్చిన అర్జీలను గడువులోగా  పరిష్కరించే విధంగా జిల్లా, మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.స్పందనలో అందిన అర్జీలను రీఓపెన్ కాకుండా స్పష్టతతో పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. స్పందన పరిష్కారం చేసేటప్పుడు ఫిర్యాదు దారునితో మాట్లాడుతున్న ఫోటో అప్ లోడ్ చేయాలని,సమస్య పరిష్కారం కాకముందు ఉన్న ఫోటో , పరిష్కారం అయిన తర్వాత ఫోటో లు  అప్ లోడ్ చేయని ధరఖాస్తు పరిష్కరించబడినదిగా పరిగణనలోకి తీసుకోవడం జరగదని జాయింట్ కలెక్టరు జె వి మురళి అన్నారు. 

స్పందన కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి దాసి రాజు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ కుమారి డి.అఖిల, జిఎస్ డబ్ల్యూఓ కె.సి.హెచ్. అప్పారావు, డి.ఎస్.పి ఎస్.బి.వి. సుభాకర్, డిపిఓ ఎం.నాగలతలు పాల్గొని ప్రజల నుంచి  అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో అందిన అర్జీలలో దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్లు, పింఛన్లు, హౌసింగ్, భూమి తగాదాలు, భూమి రికార్డు ఆన్లైన్, తదితర సమస్యల పై 190  వినతులు అందాయి.  ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.  

2022-10-10 10:35:10

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు వలన నదులు, చెరువులు, వాగులు, వంకలు పూర్తిస్తాయిలో నిండియున్న  ప్రాంతాలకు ప్రజలు వెళ్లరాదని సంయుక్త కలెక్టర్ ఎం విజయ సునీత జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె ఛాంబరులో జిల్లాలోని వర్షాభావ పరిస్థితులపై బులెటిన్ విడుదల చేసారు. వర్షాభావం వలన ఎదురయ్యే పరిస్థితులకు అనుగుణంగా జిల్లా యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. గ్రామస్థాయి ప్రజలకు వాలంటీర్లతో సహా సిబ్బందితో వరద ప్రభావ పరిస్థితులపై ఎప్పటికపుడు హెచ్చరికలు జారీచేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. పలాస మండలం కేదారిపురంలో ఇద్దరు వ్యక్తులు మరణించడం జరిగిందని, ఇటువంటివి జరకుండా జిల్లా యంత్రాంగాన్ని మరింత అప్రమత్తం చేసినట్లు ఆమె వివరించారు. 

జిల్లాలోని అన్ని నదులు, చెరువులు, వాగులు, వంకలు అత్యధికంగా ప్రవహిస్తున్న కారణంగా వాటిని దాటడం, దిగడం చేయరాదని, అలాగే స్నానాలకు వెళ్లడం, బట్టలు ఉతకడం వంటివి చేయరాదని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ విషయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆమె కోరారు. గత రాత్రి జిల్లాలో 948 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదయిందని,  సగటున 31 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయినట్లు ఆమె వివరించారు. దాదాపు అన్ని మండలాల్లో వర్షపాతం నమోదైందని, సారవకోట, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని అని స్పష్టం చేశారు. జిల్లాలో అత్యధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటుచేసి సిబ్బందిని ఏర్పాటుచేసినట్లు ఆమె చెప్పారు. 

కంట్రోల్ రూమ్ ద్వారా పంట నష్టం వివరాలను సేకరిస్తున్నామని, వర్షాలు తగ్గిన వెంటనే దీనిపై దృష్టి సారిస్తామని ఆమె వివరించారు. అధిక వర్షాల వలన వ్యవసాయ పరంగా దెబ్బతిన్న పంటలకు రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఉండేలా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు జెసి స్పష్టం చేశారు. వర్షాలు తగ్గేవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

2022-10-10 09:23:36

30న విజెఎఫ్ ప్రతిభకు ప్రోత్సాహం

వైజాగ్‌ జర్నలిస్టుల ఫోరం(విజెఎఫ్) ఆధ్వర్యంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈఏడాది కూడా అక్టోబర్‌ 30న ప్రతిభకు ప్రోత్సాహం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మీడియా అవార్డుల కమిటీ చైర్మన్‌ ఆర్.నాగరాజు పట్నాయక్‌లు తెలిపారు. సోమవారం విశాఖలోని డాబాగార్డెన్స్‌ విజెఎఫ్‌ ప్రెస్‌క్లబ్‌లో శ్రీనుబాబు అధ్యక్షతన కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై సభ్యులంతా సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం కార్యదర్శి దాడి రవికుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడారు. తమ పాలకవర్గం హయంలో జర్నలిస్టుల, కుటుంబ సభ్యులు  వైద్య ఖర్చులు, మృతుల ఖర్చుల కోసం సుమారు రూ.23లక్షలు వెచ్చించినట్టు పేర్కొన్నారు. 

అలాగే దీపావళి నిర్వహణతో పాటు 30న ఏయూ వైవిఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ప్రతిభావంతులైన జర్నలిస్టులకు మీడియా అవార్డులు అందజేస్తామన్నారు. కపిలగోపాలరావు, మసూనా మాస్టార్‌  అవార్డులతో పాటు పలు కేటగిరిల్లో ప్రిండ్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా, ఫోటో, వీడియో, వెబ్‌ జర్నలిస్టులకు 32 మందికి నగదు, ప్రశంసపత్రాలు, అవార్డులు అందిస్తామని చెప్పారు. జర్నలిస్టుల పిల్లలకు సుమారు 150 మందికి ఉపకార వేతనాలు అందించేందుకు తుది జాబితాను సిద్దం చేశామన్నారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గంట్ల శ్రీనుబాబు వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. సీతమ్మధారలోని  నార్ల భవన్‌ మరమ్మత్తులు త్వరలో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. 

ఇక విజెఎఫ్‌కు సంబంథించి నాలుగు వ్యాజ్యాల్లో అనుకూలంగా తీర్పులు రావడంతో ఇప్పటికే తీసుకున్న నిర్ణయం మేరకు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికలు నిర్వహించడానికి కార్యవర్గం తీర్మానించిన విషయాన్ని ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ డా.మల్లికార్జున్‌కు తెలియజేసి సజావుగా ఎన్నికల నిర్వహణకు తగిన సహయం అందించాలని కోరామన్నారు. న్యాయ పరంగా కేసులు పెండింగ్‌లో ఉండటం వల్లే ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగిందని..కావున సభ్యులంతా తమకు గతంలో మాదిరిగానే సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో  ఉపాధ్య క్షుడు టి.నానాజీ,  కోశాధికారి పిఎన్‌ మూర్తి,  కార్యవర్గ సభ్యులు పి,వరలక్ష్మీ, ఇరోతి ఈశ్వరరావు, ఎంఎస్‌ఆర్‌ ప్రసాద్‌, పి.దివాకర్‌,డి.గిరిబాబు, డేవిడ్‌, గయాజ్‌,శేఖర్‌ మంత్రి, సనపల మాధవరావు తదితరులు పాల్గొన్నారు. 

2022-10-10 09:18:49

ధాన్యం సేకరణలో వాలంటీర్లే కీలకం..

ధాన్యం సేకరణలో వాలంటీర్లే కీలకపాత్ర పోషించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. ధాన్యం సేకరణ పై సంబంధిత అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ చాంబర్ లో శుక్రవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రొక్యూర్ మెంట్ ద్వారా ధాన్యం సేకరణ జరగాలన్నారు. ధాన్యం సేకరణ పై గ్రామ వాలంటీర్లే కీలకపాత్ర పోషించాలని తెలిపారు. ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలన్నారు.  అందరికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.  టెక్నికల్ అసిస్టెంట్లు జాబితా ఇప్పటికే సేకరించినట్లు చెప్పారు. కేటగిరీల వారీగ  రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుందని చెప్పారు. మండల స్థాయిలోను సమావేశాలు నిర్వహించాలన్నా రు.  టెక్నికల్ అసిస్టెంట్లు అర్హత గల వారే ఉండాలన్నారు.  

ధాన్యం సేకరణలో పాల్గొనే వాలంటీర్లకు 1500 రూపాయలు ప్రోత్సాహకం ఉంటుందని వివరించారు. ఈ క్రాప్ లో నమోదు చేసుకున్నవారి వద్ద నుండి మాత్రమే ధాన్యం సేకరణ జరగాలన్నారు.  ఈ క్రాప్ పై రైతుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. పోలీసులు చెక్ పాయింట్ల ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జిల్లా బోర్డర్లు నుండి ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా చూడాలని చెప్పారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని వెళ్లాలని ఆదేశించారు. ధాన్యం సేకరణకు అన్ని వసతులను ముందుగానే చూసుకోవాలన్నారు. జిల్లా పైన ప్రత్యేక దృష్టి ఉంటుందని, జాగ్రత్తగా చేయాలని తెలిపారు. 

  ఈ సమావేశంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జయంతి, డిఎస్ఓ వెంకటరమణ, జిల్లా కోపరేటివ్ జాయింట్ రిజిస్ట్రార్ ఎస్. సుబ్బారావు, రవాణా శాఖ అధికారి గంగాధర్, మార్కెటింగ్ శాఖ ఎడి కాళేశ్వరరావు, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-30 12:19:33

సంపూర్ణ పోషణ పథకంపై అవగాహన కల్పించండి

సంపూర్ణ పోషకాహార పథకం పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని , ఏక్కడా మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఐ సి డి యస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం భీమవరం పురపాలక సంఘం నుండి ఐ సి డి యస్ ఆధ్వర్యంలో  అంగనవాడి కార్యకర్తలు, కిషోర్ బాలబాలికలు తదితరులు  సంపూర్ణ పోషకాహార పథకాలు, ఇతర పథకాల అవగాహన పై  2 కె రన్ ర్యాలీని జిల్లా కలెక్టరు  పి.ప్రశాంతి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ, సుషోషిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుటకు పోషకాహార మాసోత్సవాలు విజయవంతంగా జరిగాయని, ఈరోజు ముగింపు రోజని సుపోషణ గ్రామాలు, వార్డులు దిశగా అడుగులు వేద్దామని ఆమె అన్నారు. జిల్లాలో 1562  అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గర్భిణీలు, బాలింతలు , శిశువులకు  పౌష్టికాహారం పై అవగాహన కల్పించేందుకు ఫోటో ఎగ్జిబిషన్ కార్యక్రమాలు కూడా నిర్వహించటం జరిగిందని ఆమె అన్నారు. 

ప్రతి  అంగనవాడి కేంద్రాలలో ఖాళీ స్థలంలో న్యూట్రీగార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ ఏర్పాటు చెయ్యాలని, అందరికీ పౌష్టికాహారం పై మరింత అవగాహన కలుగుతుందన్నారు. ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి సంపూర్ణ పోషకాహార పథకం ప్రజలలోకి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నామని, భవిషత్ లో కూడా ఈ విధంగా ఫాలో అవ్వాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సి డి పి వోలు, సిబ్బంది ముఖ్యపాత్ర పోషించాలని, అంగన్వాడీ కేంద్రాలలో పండుగ వాతావరణం సృష్టించడం, ఆశా వర్కర్లు వైయస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ యొక్క న్యూట్రిషన్ కిట్ల ను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా ఇవ్వాలని ఆమె అన్నారు. ఇచ్చిన వస్తువులను సరిగ్గా ఉపయోగించేలా సంపూర్ణ పోషకాహారం ఏవిధంగా పొందవచ్చునో వారికి వివరించాలని కలెక్టరు అన్నారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకంలో అందిస్తున్న రాగి, సజ్జ , జొన్న , అటుకులు, ఎండు ఖర్జూరం , బెల్లం వేరుశనగ చిక్కీలు వంటి పౌష్టికాహారంతో పాటు  పాలు, గుడ్లు వినియోగాన్ని వారికి  వివరించాలని ఆమె అన్నారు. 

గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఏ ఆహారం తీసుకోవాలి ఇంటింటికి వెళ్ళి వివరించాలని, జిల్లాలో ఎక్కడ పోషకాహారం లోపంతో  గర్భిణీలు, బాలింతలు ,శిశువులు ఏవరూ ఉండకూడదని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి అన్నారు. ఇంటికి వెలుగు పాపాయి - కంటికి వెలుగు బొప్పాయి , ఆహారం పై సమాచారం ఇంటింటికి చేర వేద్దాం, చిరు ధాన్యాల ఆహారంలో భాగస్వామ్యం చేసుకుందాం అనే నినాదాలతో  పురపాలక సంఘం నుండి ప్రకాశం చౌక్ వరకూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో జిల్లా రెవిన్యూ అధికారి కె. కృష్ణ వేణి, ఐ సి డి యస్ పి డి బి. సుజాతా రాణి, పురపాలక సంఘం కమీషనరు యస్. శివ రామ కృష్ణ, సి డి పి వో లు వి. వాణి విజయ రత్నం, సి హెచ్ ఇందిర,బి. ఊర్మిళ, మేరీ ఎలిజబెత్, పి ఆర్ రత్న కుమారి,శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ. రంగ సాయి, నరహరి శెట్టి. కృష్ణ, తది తరులు పాల్గొన్నారు.

Bhimavaram

2022-09-30 10:16:39