1 ENS Live Breaking News

పిఠాపురంలో జిల్లాస్థాయి స్పందన

జిల్లా స్ధాయి స్పందన ప్రజా విజ్ఞాపనల స్వీకరణ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న  పిఠాపురం లోని రెడ్డి రాజా కళ్యాణ మండపంలో  ఉదయం 10 గంటల నుండి నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డా.కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలియజేసారు. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  విజ్ఞాపనలను పిఠాపురంలో   స్వీకరిస్తామని కాకినాడ జిల్లాకు చెందిన  అర్జీదారులు అందరూ ఈ అంశాన్ని  గమనించి సెప్టెంబర్ 5వ తేదీన తమ అర్జీలను పిఠాపురంలో నిర్వహించే  స్పందన కార్యక్రమంలో సమర్పించాలని ఆమె కోరారు. అలాగే వివిధ శాఖల జిల్లా అధికారులు అందరూ  సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం 9-30 గంటలకే పిఠాపురంలో నిర్వహించే స్పందన గ్రివెన్స్ సెల్ కార్యక్రమానికి  విధిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.



Kakinada

2022-09-01 16:58:07

స్కిల్ హబ్ లలో ఉచిత ఉపాధి శిక్షణలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పాడేరు  ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, రంపచోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలొ స్కిల్ హబ్ లు ఏర్పాటు చేసినట్లు ఆ సంస్థ జిల్లా అధికారి డా.పి .రోహిణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కిల్ హబ్ ల ఏర్పాటులో భాగంగా పాడేరు స్కిల్ హబ్ లో 30 మంది నిరుద్యోగ యువతకు డాటా ఎంట్రీ ఆపరేటర్ (కంప్యూటర్) కోర్సులో, రంపచోడవరం  స్కిల్ హబ్ లో 30 మంది యువతకు జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో  ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు.  కంప్యూటర్ కోర్సులో  శిక్షణకు డిగ్రీ పాసై, 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణకు పది, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణులైన యువతీ,యువకులు అర్హులని తెలిపారు. 

ఈ నెల ఆ 12 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ శిక్షణకు ఆసక్తి, అర్హతలు గల యువతీ యువకులు ఈ నెల ఐదవ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు.  జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు  ఈ నెల ఐదవ తేదీ లోగా 81796-13081, 83318-90681 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, కంప్యూటర్ కోర్సులో శిక్షణ పొందగోరు వారు  ఈ నెల ఐదవ తేదీ లోగా 90147-67230, 63026-36174 నంబర్లలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డా. రోహిణి వివవరించారు. ఈ శిక్షణ హబ్ లలో శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఆమె స్పష్టం చేశారు. 

Paderu

2022-09-01 13:49:25

5నెలల్లోగా నాడు-నేడు పనులు పూర్తికావాలి

శ్రీకాకుళం జిల్లాల్లో రెండవ విడత క్రింద జూనియర్ కళాశాలలు, పాఠశాలల్లో చేపడుతున్న నాడు-నేడు పనులన్నీ రానున్న ఐదు మాసాల్లోగా పూర్తిచేసి, వచ్చే ఏడాదికి విద్యార్థులకు అందించాలని పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం నాడు-నేడు, టి.ఎం.ఎఫ్, ఎస్.ఎం.ఎఫ్, ఆర్.ఓ ప్లాంట్స్, బ్యాంక్ ఖాతాల ప్రారంభం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, జిల్లా విద్యా శాఖాధికారులు, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు-నేడు, టి.ఎం.ఎఫ్ ( టాయిలెట్ మెయింట్ నెన్స్ ఫండ్ ) ఎస్.ఎం.ఎఫ్ ( స్కూల్ మెయింట్ నెన్స్ ఫండ్ ),ఆర్ఓ ప్లాంట్స్ నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికపుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. కావున నాడు-నేడులో చేపట్టిన పాఠశాలలన్ని పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా ఉండేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

 పాఠశాలల్లో ఉండే అన్ని మౌలిక వసతులకు అవసరమైన అన్ని సరుకుల కొనుగోలుకు, వాచ్ మెన్ ఏర్పాటుకు ఎస్.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని సూచించారు. అలాగే మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టి.ఎం.ఎఫ్ నిధులను వినియోగించుకోవచ్చని చెప్పారు. రెండవ విడతలో నిర్మిస్తున్న పాఠశాలలకు, కళాశాలలకు అవసరమైన సిమెంట్, ఇసుక, ఐరన్ తదితర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని, పనులు జాప్యం కాకుండా కలెక్టర్లు పర్యవేక్షించాలన్నారు. నిర్మాణం అనంతరం వాటికి అవసరమైన గ్రీన్ బోర్డ్స్,ఫ్యాన్స్, ఎలక్ట్రిఫికేషన్, తాగునీరు, తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అన్నారు.

నాడు నేడు క్రింద చేపడుతున్న జూనియర్ కళాశాలల్లో పనులు శరవేగంగా పూర్తికావాలని, 10వ తరగతి విద్యార్ధులందరూ రానున్న ఏడాదికి కళాశాలల్లో చేరనున్నందున, వారిని దృష్టిలో ఉంచుకొని పనులు పూర్తిచేయాలని చెప్పారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైన ఆహారాన్ని అందించేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్మాణాల కోసం మంజూరుచేసే నిధుల విషయమై రాష్ట్ర వ్యాప్తంగా 70 కళాశాలల ప్రిన్సిపాల్స్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు ఇచ్చారని, ఇది బాధ్యత రాహిత్యంగా గుర్తిస్తామన్నారు. అటువంటి వారందరూ తక్షణమే కరంట్ అకౌంట్ తెరచి శుక్రవారం నాటికి అందజేయాలన్నారు. పరిపాలన పరమైన ఉత్తర్వులు ఇవ్వనివాటికి తక్షణమే ఉత్తర్వులు మంజూరుచేసి పనులు ప్రారంభించాలని అన్నారు. పాఠశాలలకు అవసరమైన ఎలెక్ట్రిఫికేషన్ పనులు పూర్తిచేయాలన్నారు.

5న జరగనున్న గురు పూజోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగలా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. అందులో భాగంగా జిల్లాస్థాయిలో ఈ వేడుకలను ప్రతి పాఠశాలలో నిర్వహించాలన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం ఉంటుందని, ఉత్తమ ఉపాధ్యాయుల వివరాలను జిల్లా కలెక్టర్ ప్రతిపాదనలతో సమర్పించాలన్నారు. క్లీన్ ఇండియా కాంపెయిన్ లో భాగంగా సెప్టెంబర్ 1నుండి 15వరకు స్వచ్ఛతా బట్వాడా కార్యక్రమాన్ని ప్రతి పాఠశాలలో నిర్వహించాలని, చివరి రోజున ధ్రువీకరణ పత్రాలు పంపిణీ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయంతో రోజుకు ఒక కార్యక్రమంతో 15 రకాల కార్యక్రమాలు నిర్వహించాలని వివరించారు.

ఉపాధ్యాయులకు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలన్నారు.జెబికె యాప్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చని, యాప్ లో ఉండే సాంకేతిక లోపాలను ఇప్పటికే సరిదిద్దామని చెప్పారు. కావున విధిగా ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. రానున్న ఐదు రోజుల్లో ఆయా పాఠశాలలో ఉండే సమస్యలను పరిష్కరించుకొని బయోమెట్రిక్ అటెండెన్స్ ఏర్పాటుచేసుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు ఉంటేనే అమ్మఒడి పథకం వర్తిస్తుందని, ఈ విషయాన్ని అసోసియేషన్లు, తల్లితండ్రులతో సమావేశం ఏర్పాటుచేసి వివరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రయివేటు పాఠశాలలకు ఇది వర్తిస్తుందని, విద్యార్థులు ఎక్కడ ఉన్నప్పటికీ హాజరు వేసుకునే వెసులుబాటు ఉందని, అయితే హాజరు తప్పనిసరి అని ఆయన స్పష్టం చేశారు.

8 జిల్లాల్లోని ఏ.పి.మోడల్ స్కూల్స్ లో అవసరమైన టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకున్నామని చెప్పారు. జె.సిల సహకారంతో అర్హతే ప్రామాణికంగా ఈ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు పెండింగులో ఉన్న 12 పాఠశాలలకు గాను ఐదుగురు పాఠశాలల ప్రధానోపాధ్యాయుల  ఖాతాల్లో నగదు జమ అయినందున పనులు ప్రారంభించినట్లు చెప్పారు. మరో 7గురు ప్రధానోపాధ్యాయులు ఖాతాల్లో  నగదు జమకాబడలేదని వివరించారు. ఈ సమావేశంలో సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త డా.జయప్రకాష్, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:42:48

భవన నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి

భవన నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమీషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.   రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, డిజిటల్ లైబ్రరీలు, వై.యస్.ఆర్. హెల్త్ క్లినిక్స్, జగనన్న స్వచ్ఛ సంకల్పం, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు ప్రాధాన్యత భవన నిర్మాణాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. సిమెంటు ఎంత అవసరమో చెప్పాలని, అదనపు సిమెంట్ ఎంత అవసరమో తెలియాలన్నారు.  జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ భవనాలకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు ఉన్నందు వలన ఆలస్యం జరుగుతుందని కలెక్టర్ వివరించగా

 వేరే స్థలంలో నిర్మాణాలు చేపట్టాలని కమీషనర్ కోన శశిధర్ చెప్పగా ఇప్పటికే కొంత వరకు నిర్మాణాలు చేపట్టినట్లు కలెక్టర్ వివరించారు.   జిల్లా నుండి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా పరిషత్ సీఈవో వెంకటరామన్, డిపిఓ రవి కుమార్, పంచాయతీ రాజ్ ఎస్ఈ సత్యనారాయణ మూర్తి, డ్వామా పీడీ చిట్టిరాజు, ఆర్డబ్ల్యుఎస్ ఎస్ఈ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:37:45

అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు

అక్టోబర్ 2 నాటికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు సిద్ధం చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  జగనన్న శాశ్వత భూ హక్కు కు సంబంధించిన భూ రీ సర్వే, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రీ సర్వేకు సంబంధించి పనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాకు 350 గ్రామాల్లో రీ సర్వే లక్ష్యం కాగా ఇంత వరకు 236 గ్రామంల్లో 80 వేల 617 ఎకరాలు రీ సర్వే పూర్తి అయిందని వివరించారు.  జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. రాజేశ్వరి, సర్వే శాఖ ఎడి ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-09-01 13:32:25

తిరుమలో ఉప విచారణ కేంద్రం పరిశీలన

తిరుమ‌ల‌లో ఆధునీకరించి ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్ధిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రాన్నిగురువారం  టీటీడీ ఈవో  ఎవి.ధ‌ర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ, ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు సందర్శించే తిరుమలలోని మరో 19  వ‌స‌తి ఉప విచారణ కార్యాలయాలను కూడా ఇదే విధంగా త్వ‌రిత గ‌తిన ఆధునీక‌రించాల‌ని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  ప్రారంభోత్సవం త‌రువాత‌ కొత్త కౌంటర్ల ద్వారా భక్తులకు గదులు కేటాయించారు. నూత‌నంగా ఆధునీక‌రించిన ఎస్ఎంసి ఉప విచార‌ణ కేంద్రంలో మూడు గ‌దులు కేటాయింపు కౌంటర్లు, 25 మంది యాత్రికులు కుర్చునే విధంగా  ఏర్పాటు చేశారు. భక్తులకు మ‌రింత  ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే దేవతా చిత్రాలు, "శ్రీనివాస కళ్యాణం" యొక్క భారీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న‌ది.  

     ఈ కార్య‌క్ర‌మంలో ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, డెప్యూటీ ఈవో(ఆర్‌-2)  భాస్కర్, ఇఇలు  సురేందర్ రెడ్డి,  జగన్మోహన్ రెడ్డి, డిఇ (ఎల‌క్ట్రిక‌ల్‌)  రవిశంకర్ రెడ్డి, విజివోలు  బాలిరెడ్డి,  మనోహర్, రిసెప్ష‌న్  ఏఈవో రాజేంద్ర‌ తదితరులు పాల్గొన్నారు.

Tirumala

2022-09-01 13:10:01

ఇసుక నిల్వల ప్రాంతాల‌ను గుర్తించాలి

కాకినాడ జిల్లాలో ఇసుక త‌వ్వ‌కాల‌కు అనువైన ప్రాంతాల‌ను గుర్తించి, వారంలోగా నివేదిక స‌మ‌ర్పించాల‌ని క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా అధికారుల‌ను ఆదేశించారు. మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్ వివేకానంద‌హాల్‌లో జిల్లా క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న జిల్లాస్థాయి ఇసుక క‌మిటీ (డీఎల్‌ఎస్సీ), జిల్లా ఖ‌నిజ ఫౌండేష‌న్ (డీఎంఎఫ్‌) స‌మావేశాలు జ‌రిగాయి. కాకినాడ ఎంపీ వంగా గీత‌, జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ, వివిధ శాఖ‌ల అధికారులు హాజ‌రైన ఈ స‌మావేశంలో జిల్లాలో ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ఇసుక‌, ప్ర‌భుత్వ ప్రాధాన్య భ‌వ‌న నిర్మాణాలు, న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం అమ‌లుకు అవ‌స‌ర‌మైన ఇసుక‌, ఖ‌నిజ ఫౌండేష‌న్ కింద చేప‌ట్టిన ప‌నుల్లో పురోగ‌తి త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ రీచ్‌ల గుర్తింపున‌కు స‌మ‌న్వ‌య శాఖ‌ల అధికారుల బృందం క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు జ‌ర‌పాల‌ని సూచించారు. ప్ర‌స్తుతం జిల్లాలో ఆరు డిపోల ప‌రిధిలో 2.38 ల‌క్ష‌ల ట‌న్నుల ఇసుక అందుబాటులో ఉంద‌ని.. గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు; ఆర్‌బీకేలు త‌దిత‌ర ప్ర‌భుత్వ శాశ్వ‌త భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన ఇసుక‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని జేపీ ప‌వ‌ర్ వెంచ‌ర్స్ ప్రైవేటు లిమిటెడ్ ప్ర‌తినిధుల‌కు సూచించారు.

 అదే విధంగా జిల్లాలో జిల్లా ఖనిజ ఫౌండేష‌న్ (డీఎంఎఫ్‌) కింద మంజూరైన పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని స‌ర్వ శిక్షా అభియాన్‌; ర‌హ‌దారులు, భ‌వ‌నాలు; ఇరిగేష‌న్‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. జిల్లాలో తొమ్మిది మండ‌లాల ప‌రిధిలో మైనింగ్ కార్య‌క‌లాపాలు జ‌రుగుతున్నాయ‌ని.. ఈ కార్య‌క‌లాపాల‌తో ప్ర‌త్య‌క్షంగా (10 కి.మీ. ప‌రిధి), ప‌రోక్షంగా (10-25 కి.మీ. ప‌రిధి) ప్ర‌భావిత‌మ‌వుతున్న గ్రామాలు/ఆవాసాల్లో డీఎంఎఫ్ నిధుల‌తో ప‌లు అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో రూ. 81 ల‌క్ష‌ల‌తో ప‌లు అంగ‌న్‌వాడీ భ‌వ‌నాల ప‌నుల‌కు, తొండంగి మండ‌లంలో రూ. 19 ల‌క్ష‌ల‌తో అయిదు అభివృద్ధి ప‌నుల‌కు తాజా స‌మావేశం ఆమోదం తెలిపిన‌ట్లు క‌లెక్ట‌ర్ వెల్ల‌డించారు. సమావేశంలో జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ స‌త్య‌నారాయ‌ణ‌, కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, మైన్స్ అండ్ జియాల‌జీ డీడీ ఇ.నరసింహారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, ఆర్ అండ్ బీ ఎస్ఈ కె.హ‌రిప్ర‌సాద్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Kakinada

2022-08-30 13:30:41

ప్రజలకు గణనాధుడి ఆశీస్సులుండాలి

నెల్లూరు నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహ ప్రతిష్ట, పూజా కార్యక్రమాల్లో నగర మేయర్ పొట్లూరి స్రవంతి, కమిషనర్ హరిత మంగళవారం సాయంత్రం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, ప్రజలు చేపట్టిన కార్యక్రమాలు విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది తొలిసారిగా కార్పొరేషన్ లో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించడం శుభ పరిణామం అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల నడుమ వినాయక చవితి పండుగను జరుపుకోవాలని కోరుతూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వాసంతి, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Nellore

2022-08-30 13:23:14

మత్స్యకార యువత పథకాలు వినియోగించుకోవాలి..డిడి నిర్మలకుమారి

మత్స్యకారుల్లోని ఔత్సాహిక యువత ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా అభివ్రుద్ధి చెందాలని మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మల కుమారి పిలుపు నిచ్చారు. మంగళవారం ఆంధ్రప్రదేశ్ సమీకృత ఇరిగేషన్, వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్ 2022-23లో భాగంగా  స్థానిక నెహ్రు యువ కేంద్రం ఆవరణలో మత్స్య  శాఖ ఉద్యోగులకు మత్స్య కార్యకలాపాలపై అవగాహనా కార్యక్రమం సపోర్టింగ్ ఆర్గనైజేషన్ IRPWA ద్వారా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్య శాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలా కుమారి మాట్లాడుతూ,  మత్స్య  శాఖ ఉద్యోగులు అందరూ కూడా ప్రభుత్వంచే అందజేయబడుతున్న అన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సంపూర్ణ అవగాహన పెంచుకోవాలన్నారు. అంతేకాకుండా మత్స్యకారులకు, రైతులకు, మత్స్యకార సంఘాల సభ్యులకు, ఔత్సాహికులకు ఆ పథకాలను వివరించాలన్నారు. తద్వారా ఔత్సాహిక యువత ముందుకు రావడానికి ఆస్కారం వుంటుందని పేర్కొన్నారు. 

ముఖ్యంగా ఫిష్  ఆంధ్ర షాపుల నిర్వహణ ద్వారా స్థానికంగా చేపల వినియోగం పెంచి తద్వారా ఆక్వా రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు, మత్స్యకారులు జీవన ప్రమాణాల అభివృద్ధి చెందేలా చూడాలన్నారు. ఈ ఫిష్ ఆంధ్ర షాపుల ఏర్పాటుకి ముందుకొస్తే  మహిళలు, ఎస్.సి, ఎస్.టి లకు  60%, ఇతరులకు 40% రాయితీని ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు.  అలాగే ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పధకం ద్వారా సబ్సిడీతో కూడిన పధకాలు అందజేస్తుందన్నారు. వాటిలో ద్విచక్ర వాహనాలు, త్రి చక్ర వాహనాలు, ఫిష్ వెండింగ్ యూనిట్లు, లైవ్ ఫిష్ వెండింగ్ యూనిట్లు, ఫిష్ కియాస్కులు తదితర పథకాలకు సత్వరమే లబ్దిదారులను గుర్తించి, ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా అప్లై చేయించాల్సిందిగా ఆదేశించారు. 

మత్స్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం  అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని డిడి వివరించారు. అంతేకాకుండా  వేట సమయంలో ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ. 10.00 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం అందిస్తుందన్నారు. మత్స్యకారులంతా  ఈ-శ్రమ్ లో నమోదు చేశుకుంటే అదనంగా మరో రూ. 2. 00 లక్షలు లభిస్తాయని తెలియజేశారు. పథకాలకు వ్యాపార పెట్టుబడి నిమిత్తం అత్యంత తక్కువ వడ్డీ రేటుతో కిషాన్ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తున్నవిషయాన్ని మత్స్యకారులకు తెలియజేయాలన్నారు. 50 సంవత్సరాలు దాటినా  అర్హుడైన ప్రతీ మత్స్యకారుని నెలకు రూ. 2,500/- పెన్షన్ ను,  స్వదేశీ మత్స్యకారులకు నామమాత్రపు లీజుతో చెరువులను కేటాయిస్తారని, అలాగే తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ సమయములో సకాలం లోనే రూ. 10,000/- నేరుగా వారి ఖాతాకు జమ చేస్తారని చెప్పారు.  హెచ్ఎస్డీ ఆయిల్ కార్డుల మంజూరు ద్వారా డీజిల్ పోయించుకొనే సమయంలోనే సబ్సిడీ వర్తింపుని కూడా అమలు చేస్తారన్నారు. ఆక్వా రైతులకు విధ్యుత్  రాయితీలు వస్తాయని తెలియజేశారు. 

 APSADA చట్టం ద్వారా రూపొందించిన ఈ-మత్స్యకార వెబ్ పోర్టల్ ద్వారా ఎలాంటి ఆలస్యం, అలసత్వం లేకుండా  సత్వర ఆక్వా కల్చర్ అనుమతులు, నీరు, మట్టి, మైక్రో బయాలజీ పరీక్షల కోసం ఆక్వా ల్యాబ్ లో సేవలు అందిస్తారని.. మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్దతి(RAS, BIOFLOC)  లో చేపల సాగు చేయుట మొదలగు వాటి గూర్చి క్షేత్ర స్థాయిలో పనిచేసే మత్స్య శాఖ అభివృద్ధి అధికారులు,  మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు, గ్రామ మత్స్య సహయ కులు వివరంగా వివరించి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో APIIATP, ఏపీడీ రామారావు, IRPWA ఆర్గనైజింగ్ చీఫ్ ప్రకాష్, ఎఫ్డీఓ యు.చాందిని, మత్స్య శాఖ సహాయ తనిఖీదారులు సంతోష్, వేంకటెష్, ప్రసాద్, గ్రామ మత్స్య సహయ కులు తదితరులు పాల్గొన్నారు. 

Vizianagaram

2022-08-30 12:06:49

తిరుమలలో శాస్త్రోక్తంగా శ్రీ వరాహస్వామి జయంతి

ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం ఉదయం వరాహ జయంతి శాస్త్రోక్తంగా జరిగింది.         ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేప‌ట్టారు. అనంత‌రం వేద‌మంత్రాల న‌డుమ మూల‌వ‌ర్ల‌కు పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, ప‌సుపు, చందనంతో విశేషంగా అభిషేకం నిర్వ‌హించారు. శ్రీ‌వారి ఆల‌య ప్ర‌ధానార్చ‌కుల్లో ఒక‌రైన  వేణుగోపాల దీక్షితులు ఈ అభిషేకం చేశారు.  ఈ కార్యక్రమంలో ఆల‌య డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tirumala

2022-08-30 11:41:15

బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై స‌మీక్ష‌

శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌పై టిటిడి విజిలెన్స్‌, పోలీసు అధికారులు క‌లిసి స‌మీక్ష నిర్వ‌హించారు. తిరుమ‌ల‌లోని పిఏసి-4లో గ‌ల క‌మాండ్ కంట్రోల్ రూమ్ స‌మావేశ మందిరంలో ఈ స‌మీక్ష జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల తొలిరోజైన సెప్టెంబ‌రు 27న ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రివర్యులు గౌ. శ్రీ. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న కోసం బందోబ‌స్తు, వాహ‌న‌సేవ‌ల‌కు విచ్చేసే భ‌క్తులకు పార్కింగ్ ఏర్పాట్లు, దొంగ‌త‌నాలు జ‌రుగ‌కుండా చ‌ర్య‌లు, క్యూలైన్ల‌లో తోపులాట లేకుండా ఏర్పాట్లు, ఘాట్ రోడ్ల‌లో కూంబింగ్‌, రాత్రి గ‌స్తీ విధులు, అవ‌స‌ర‌మైన భ‌ద్ర‌తా ప‌రిక‌రాలు తెప్పించుకోవ‌డం, క్యూలైన్లు, బ్యారీకేడ్ల ఏర్పాటు, వ‌స‌తి స‌ముదాయాల వ‌ద్ద పోగ‌యిన వ్య‌ర్థాల తొల‌గింపు త‌దిత‌ర అంశాల‌పై స‌మీక్షించారు.

          అద‌న‌పు ఎస్పీ  మునిరామ‌య్య, విజివో  బాలిరెడ్డి, ఇఇ  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, ట్రాఫిక్ డిఎస్పీ  వేణుగోపాల్‌, సిఐలు  జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి,  చంద్ర‌శేఖ‌ర్‌, ఎవిఎస్వోలు  సురేంద్ర‌,  సాయిగిరిధ‌ర్‌,  మ‌నోహ‌ర్‌,  శివ‌య్య ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

Tirupati

2022-08-30 11:39:51

జిల్లాప్ర‌జ‌ల‌ను గ‌ణ‌నాథుడు చ‌ల్ల‌గాచూడాలి

స‌క‌ల విఘ్నాల‌ను తొల‌గించి,  ప్ర‌జ‌ల‌ను ఆ విఘ్నేశ్వ‌రుడు చ‌ల్ల‌గా చూడాల‌ని విజయ నగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి కోరారు. ఆ గ‌ణ‌నాథుడి ద‌య‌తో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ది చెందాల‌ని ఆకాంక్షించారు. వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌ల‌కు ఆమె ఒక ప్ర‌క‌ట‌న ద్వారా శుభాకాంక్ష‌లు తెలిపారు. బుద్దికి, జ్ఞానానికి ప్ర‌తీక‌గా ఆ గ‌ణ‌నాథుడిని ఆరాధిస్తార‌ని చెప్పారు. జ్ఞానం, ల‌క్ష్య సాధ‌న‌, నైతిక విలువ‌లు, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ వంటి ఎన్నో సుగుణాల‌ను ఈ పండుగ మ‌న‌కు నేర్పుతుంద‌ని పేర్కొన్నారు. హిందువుల తొలి పండుగ అయిన ఈ గ‌ణేష్ చ‌తుర్ధిని ప్ర‌జ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హించుకోవాల‌ని కోరారు. పందిళ్ల‌లో, మంట‌పాల్లో వినాయ‌క ఉత్స‌వాల‌ను నిర్వ‌హించే చోట‌, త‌గిన ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాల‌ని, నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ, ఇత‌రుల‌కు ఇబ్బంది క‌లుగ‌కుండా వేడుక‌ల‌ను నిర్వ‌హించుకోవాల‌ని తెలిపారు. ముఖ్యంగా వినాయ‌క నిమ‌జ్జ‌నాలు చేసేట‌ప్పుడు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

Vizianagaram

2022-08-30 11:25:00

విఘ్నాలు తొల‌గిపోయేలా పండుగ చేసుకోవాలి

తెలుగువారి తొలి పండుగ వినాయ‌క చ‌వితిని జిల్లా ప్ర‌జ‌లంతా భ‌క్తిశ్ర‌ద్ద‌ల‌తో జ‌రుపుకోవాల‌ని, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు కోరారు. గ‌ణేష్ చ‌తుర్ధి సంద‌ర్భంగా జిల్లా ప్ర‌జ‌లంతా మట్టిగణపతిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్నారు. ఆ గ‌ణ‌నాధుని చ‌ల్ల‌ని చూపుతో, ప్ర‌జ‌లంతా సుఖఃసంతోషాల‌తో ఉండాల‌ని, మ‌న‌ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్దిలో దూసుకుపోతూ విఘ్నాలు తొల‌గిపోవాల‌ని కోరారు. వినాయ‌క‌చ‌వితి జ‌రుపుకొనే విష‌యంలో ప్ర‌భుత్వం కొత్త‌గా ఎటువంటి నిబంధ‌న‌లు పెట్ట‌లేద‌ని, ఇదంతా ప్ర‌తిప‌క్షాల దుష్ప్ర‌చార‌మ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ప‌ర్యావ‌ర‌ణ హితంగా పండుగ‌ను జ‌రుపుకోవాల‌ని, మ‌ట్టి విగ్రాహాల‌ను వినియోగించడం ద్వారా మరికొందరికి ఆదర్శంగా నిలవచ్చునన్నారు. 

Vizianagaram

2022-08-30 11:03:44

ఖాతాలు తెరిచినవెంటనే గృహనిర్మాణాలు

గృహనిర్మాణ లబ్ధిదారులంతా ఐసీఐసీఐ బ్యాంకులో వేగంగా ఖాతాలు తెరిచి నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా అగ్రిమెంట్లపైసంతకాలు చేస్తే ఇంటి నిర్మాణాలు ప్రారంభమ వుతాయని కార్పొరేషన్‌ కమిషనర్‌ కె.రమేష్‌ చెప్పారు. స్థానిక పేర్రాజుపేటలోని 5వ డివిజన్‌  సచివాలయంలో మంగళవారం బ్యాంకు ఖాతాల తెరిచే ప్రక్రియను కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 13500 మంది గృహనిర్మాణ లబ్ధిదారులకు గాను ఇప్పటికే 10వేల మంది బ్యాంకు ఖాతాలను తెరిచారన్నారు. మిగిలిన 3,500 ఖాతాలను కూడా త్వరగా తెరిపించి వీరంతా వేగంగా అగ్రిమెంట్లపై సంతకాలు చేసి ఇచ్చేలా పనులు వేగవంతం చేయాలని ఆయన సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తిఅయితే డిసెంబర్‌ నాటికల్లా ఇళ్ళ నిర్మాణాలను ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.

 సందర్భంగా బ్యాంకు ఖాతాలు ఓపెన్‌ చేసేందుకు వచ్చిన లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటూ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టీపీఆర్వో కృష్ణమోహన్, ఐదవ డివిజన్‌ కార్పొరేటర్‌నల్లబెల్లి సుజాత, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.

Kakinada

2022-08-30 10:25:38

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారాసీజనల్‌వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు వహించాలని కాకినాడ నగరపాలకసంస్థ కమిషనర్‌ కె.రమేష్‌ ప్రజలకు సూచించారు. గురువారం ఆయన కరణంగారి జంక్షన్, కృష్ణానగర్‌ బ్యాంక్‌ కాలనీ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు పర్యవేక్షించారు. వర్షాకాలం దృష్ట్యా డెంగీ వంటి వ్యాధుల ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ముఖ్యంగా వర్షపునీరు, స్వచ్ఛమైన నీటిలో డెంగీ దోమ వృద్ధి చెంది వాటి ద్వారా ప్రజలు అనారోగ్యాలపాలయ్యే పరిస్థితి ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నగరపాలక సంస్థ చేపట్టే ప్రత్యేక పారిశుద్ధ్యకార్యక్రమాలతోపాటు ప్రజలు కూడా తమతమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నిల్వనీటిని తొలగించుకోవడంపై దృష్టిసారించాలన్నారు.

 ముఖ్యంగా పూలకుండీలు, వాడిపడేసిన కొబ్బరి బొండాలు,టైర్లలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని వ్యాధులు ప్రభలకుండా చూసుకోవాలని కమిషనర్‌ కోరారు. అలాగే పారిశుద్ధ్య పనులను కూడా ఆయన తనిఖీ చేశారు. ప్రజలు తడిపొడి చెత్తను వేర్వేరుగా ఇచ్చి పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కమిషనర్‌ విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కార్పొరేషన్ ఆరోగ్య అధికారి డాక్టర్ పృద్విచరణ్ తదితరులు ఉన్నారు.

Kakinada

2022-08-30 10:23:32