1 ENS Live Breaking News

పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

రాష్ట్రంలో ప్రభుత్వ నియమ నిబంధనలు విధిగా పాటిస్తూ పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గురువారం జిల్లా కలెక్టర్లు, యస్.పిలతో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్, ఏఐజి ఆర్.ఎన్.అమ్మిరెడ్డిలతో కలసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు 6 లక్షల మంది, ఇంటర్మీడియట్ పరీక్షలు 10 లక్షలు మంది హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో వరుసగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్న నేపధ్యంలో అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. గతేడాది రాష్ట్రంలో ఎటువంటి సంఘటనలు తావులేకుండా పదవ తరగతి పరీక్షలు పకడ్భందీగా నిర్వహించారనే రాష్ట్రానికి మంచి పేరు ఉందని, దాన్ని అలాగే కొనసాగేలా అధికారులు చొరవచూపాలని కోరారు. ప్రస్తుతం వేసవి కాలం అయినందున విద్యార్ధులు ఎటువంటి అసౌకర్యం లోనుకాకుండా ఉండేందుకు ప్రతీ తరగతి గదిలో విద్యుత్ దీపాలు మరియు ఫ్యాన్లు ఉండాలని ఆదేశించారు. అలాగే ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీటి సదుపాయం, వైద్య శిబిరాలను ఖచ్చితంగా ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 27 నుండి మే నెల 9 వరకు జరగనున్న పరీక్షలకు నిర్ణీత సమయానికి ముందే విద్యార్ధులు హాజరుకావలసి ఉందని, అయితే సుదూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్ధులు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నందున అటువంటి వారికి సమయపాలనలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. విద్యార్ధులు తమ హాల్ టికెట్లు చూపి ఆర్.టి.సి బస్సులలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని పేర్కొన్నారు. కోవిడ్ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ విధిగా మాస్కును ధరించాలని, కోవిడ్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పరీక్షల నిర్వహణలో ఆయా శాఖలు తమ పాత్రలను సక్రమంగా నిర్వహించాలని, పరీక్షల నిర్వహణ సమయంలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఇప్పటికే ప్రతీ కేంద్రానికి ప్రశ్నపత్రాలు వచ్చాయని, వాటిని సరిచూసుకోవాలని సూచించారు. జవాబు పత్రాలను ఈసారి బుక్ లెట్ రూపంలో పొందుపరచడం జరిగిందని, దీనివలన విద్యార్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షలయినప్పటికీ గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  ఈ వీడియో సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ, అదనపు పథక సమన్వయకర్త ఆర్.సూర్యప్రకాశ్, ప్రభుత్వ పరీక్షల నిర్వహణ సహాయ కమీషనర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 14:28:06

వంశీక్రిష్ణ శ్రీనివాస్ కు ఘనంగా వీడ్కోలు

విశాఖలో  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  పునాది  నుంచి  నేటివరకు దాదాపు గా 7 సంవత్సారాలు వైసీపీ  నగర అధ్యక్షులుగా అనేక పార్టీ కార్యక్రమాలలో నాకు వెన్నుదన్నుగా నిలిచిన వైసీపీ నాయకులకు, వైసీపీ అభిమానులకు, కార్యకర్తలకు, విశాఖ ప్రజలకు, మీడియా మిత్రులకు ఎమ్మెల్సీ వంశీక్రిష్ణ శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  ఈమేరకు గురువారం విశాఖలోని నగర పార్టీ కార్యాలయంలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కంపా హనోక్ అధ్యక్షతన వంశీ వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, పార్టీలో అందరికీ పదవులు ఇవ్వాలనే సీఎం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తపించి తనకు మంచి స్థానాన్ని కట్టబెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లుగా తనను ఎంతగానో ఆదరించారని..ఇకపై నగర అధ్యక్షునిగా వచ్చే వారినిక కూడా అదే రీతితో ఆదరించాలని కోరారు. అనంతరం వంశీని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గజమాలలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్  గోలగాని హరి వెంకట కుమారి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి  దాడి విర భద్ర రావు , ఎమ్మెల్సీ వరుద కల్యాణి మాజీ మంత్రి  పి బాల రాజు ,  రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు, జాన్ వెస్లీ ,  సుజాత సత్యనారయణ, మాజీ శాసన సభ్యులు   తైనాల విజయకుమార్,  ఎస్.ఎ రెహ్మాన్ , చెంగల వెంకట రావు , పార్టీ రాష్ట్ర అదనపు కార్యదర్శి  రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మలు  జాన్ వెస్లీ ,  సుజాత సత్యనారాయణ, సుజాత నూక రాజు,  డిప్యూటీ మేయర్లు  కట్టమురి సతీష్ ,  జియాన్ని శ్రీధర్ ,  అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధి , జి.వి.ఎం.సి కార్పొరేటర్లు  అప్పరావు , బిపిన్ కుమార్,  రెయ్యి వెంకట రమణ , స్వాతి దాస్ ,  అల్లా లీలావతి ,  కామేశ్వరి ,  విల్లూరి భాస్కర్ రావు ,  కందుల నాగరాజు , రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు  మొల్లి అప్పారావు ,  పేర్ల విజయ చంద్ర ,నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటి సభ్యులు, రాష్ట్ర , జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వార్డు అభ్యర్దులు, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయుకులు తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-21 14:08:47

రేపు వై.యస్.ఆర్.సున్నావడ్డీ ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలో నేడు వై.యస్.ఆర్.సున్నావడ్డీ 3వ సంవత్సరం ప్రారంభోత్సవ కార్య క్రమం జరగనున్నట్లు   జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన జారీచేసారు. ఏప్రిల్ 22న ఉదయం 11.00గం.లకు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి తొలుత    ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లాలో స్థానిక బాపూజీ కళామందిర్ నందు ఉదయం 11.00గం.లకు ప్రారంభం కానుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్, రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డా. సీదిరి అప్పలరాజు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు , ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు  హాజరుకానున్నట్లు ఆమె ఆ ప్రకటనలో వివరించారు. 

Srikakulam

2022-04-21 13:47:19

ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యం

రాష్ట్రంలోని ప్రతి పేదవానికి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదని యువ నాయకుడు ధర్మాన రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఏడు రోడ్ల కూడలి వద్ద జిల్లా పరిషత్ అతిథి గృహం వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ధర్మాన రామ్మోహన్ నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వ్యాధులకు పేద, ధనిక వర్గాలు ఉండబోవని అందరూ సమానమేనని, అయితే కార్పొరేట్ ఆసుపత్రులలో లక్షల ఖర్చుతో కూడిన వైద్యాన్నిపొందేందుకు శ్రీకారం చుట్టిన వ్యక్తి దివంగత వై.యస్.ఆర్  అయితే మరో పది అడుగులు ముందుకు వేసి మరిన్ని సేవలతో డా. వై.యస్.ఆర్. ఆరోగ్యశ్రీ పేరుతో అన్నిరకాల వైద్య సదుపాయాలను కార్పొరేట్ ఆసుపత్రులలో పేదలు పొందేలా  చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదని కొనియాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమానికి నాంధి పలికిందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తూ పేదలకు అవసరమైన అన్నిరకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఈ శిబిరం ద్వారా సుమారు రూ.30వేల విలువైన వైద్య పరీక్షలను ఉచితంగా చేస్తున్నారని, ప్రతీ ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ  కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు, చిన్న పిల్లల వ్యాధుల చికిత్స్, గర్భిణీ మరియు స్త్రీల వ్యాధుల చికిత్స, క్షయవ్యాధి నిర్ధారణ, దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నిర్ధారణ, చికిత్స్, చర్మవ్యాధులు, కుష్టువ్యాధుల తనిఖీ చికిత్స, కేన్సర్, బి.పి, ఘగర్ మొదలగు వ్యాధుల చికిత్స, ఎముకుల వ్యాధుల చికిత్స, కంటి మరియు ఇఎన్.టి వ్యాధుల చికిత్స. సాదారణ వ్యాధుల చికిత్స, రక్త పరీక్షలు మరియు దంత వైద్య చికిత్స వంటి పలు విభాగాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారని, వారంతా మీకు సేవలు అందిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎన్.అనురాధ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా.ఆర్.వి.ఎస్.కుమార్, పి.ఓ, డి.టి.టి డా. జంపా కృష్ణమోహన్, మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, వివిధ విభాగాలకు చెందిన వైద్యులు, నర్సులు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 13:45:14

భూ సర్వే సత్వరమే పూర్తి చేయాలి..

భూ రీ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని సిసిఎల్ఎ కమీషనర్ సాయి ప్రసాద్ పేర్కొన్నారు. జగనన్న భూ సర్వే, మ్యుటేషన్లు 22ఎల పై జిల్లా కలెక్టర్లు, జిల్లా జాయింట్ కలెక్టర్లు తో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ధేశించిన జగనన్న భూ సర్వే పై నిర్ణయించిన లక్ష్యాలను త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. మ్యుటేషన్లుకు సంబంధించి అర్జీలు తిరస్కరించకుండా ప్రభుత్వం జారీ చేసిన సూచనలు ప్రకారం చేయాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జిల్లాలో భూ సర్వే జరుగుతోందని 29 పూర్తి అయ్యాయని మిగిలినవి త్వరిత గతిన పూర్తిచేయడం జరుగుతుందన్నారు. గతంలో డ్రోన్ల ద్వారా 10 నుండి 12 కి.మీ వరకు సర్వే జరిగేదని, అయితే సాంకేతిక లోపాలు కారణంగా ప్రస్తుతం 6 కి.మీ వరకే సర్వే నిర్వహించడం జరుగుతుందని, దీనివలన సర్వేలో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున ఆ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. విజయ సునీత, డిఆర్ఓ ఎం.రాజేశ్వరి , సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ ఎడి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-21 08:54:30

మన్యానికి సున్నావడ్డీ రూ.13.68 కోట్లు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు సున్నా వడ్డీ పథకం కింద శుక్రవారం సంఘాల సభ్యుల ఖాతాలకు నిధులు జమ చేయనుంది. పార్వతిపురం మన్యం జిల్లాలో 20,055 స్వయం సహాయక సంఘాలలోని 2,30,675 మంది సభ్యులకు రూ.13.68 కోట్లు నిధులు జమ కానుంది. జిల్లాలో మొదటి విడతలో 2019 - 20 సంవత్సరానికి16,695 సంఘాల్లోని 1,92,694 మంది సభ్యులకు రూ.11.05 కోట్లు,  2020 - 21 ఆర్థిక సంవత్సరంలో 18,868 సంఘాలలోని 2,15,165 మంది సభ్యులకు రూ.10.66 కోట్లు చెల్లించడం జరిగింది. మూడు సంవత్సరాల్లో 20,055 మహిళా సంఘాలలోని 2,30,675 సభ్యులకు మొత్తం రూ.35.39 కోట్లు విడుదల చేయడం జరిగింది. ఈ మేరకు వైఎస్సార్ క్రాంతి పథం ఏపీడి సత్యం నాయుడు గురు వారం ఒక ప్రకటనలో వివరాలు తెలిపారు.

మన్యం జిల్లా

2022-04-21 08:52:09

భూ పునః సర్వే పై దృష్టి సారించాలి

భూ పునః సర్వే వలన భూ సమస్యలు నివారించ వచ్చని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ అన్నారు. భూ పునః సర్వే కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో గురువారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయి ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ స్థాయి రెవిన్యూ అధికారులను మ్యాపింగ్ చేయాలని ఆయన సూచించారు. సర్వే, రెవిన్యూ అంశాలపై దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కార్యదర్శి ఎం.బాబు మాట్లాడుతూ గ్రామ సచివాలయం పరిధిలో నీటి తీరువా వసూలు చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా రెవిన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, సర్వే సహాయ సంచాలకులు  పాల్గొన్నారు.

మన్యం

2022-04-21 08:45:07

నిర్దేశిత పనులు సకాలంలో పూర్తిచేయాలి

పనులు సకాలంలో పూర్తి చేయండి అని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ లో గల వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తో మున్సిపల్ కమిషనర్ బుధ వారం మున్సిపల్ కార్యాలయంలో  సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో నేటికీ నిర్వహించిన పనులపై ఆరా తీసారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ కాంట్రాక్టర్లు, టెండర్ల నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలన్నారు. కేటాయించిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశానికి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Srikakulam

2022-04-20 16:26:00

అల్లూరిజిల్లా డీపీఆర్వోగా గోవిందరాజులు

అల్లూరి సీతారామరాజు పాడేరుజిల్లా పౌర సంబంధాల అధికారి(డీపీఆర్వో)గా పి.గోవిందరా జులు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన విశాఖ జివిఎంసీ, విజయనగరం జిల్లాలో డివిజనల్ పీఆర్వోగా పనిచేశారు. అయన విశాఖపట్నం, విజయనగరం, పాడేరు ప్రాంతాలపై మంచి పట్టువుంది. కొత్తజిల్లాలలకు డీపీఆర్వోలుగా ప్రభుత్వం అనుభవం వున్న అధికారులనే నియమించడంతో కొత్తజిల్లాల్లోని పరిపాలనకు సంబంధించిన సమాచారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాద్యమాల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సత్వరమే తెలియడానికి  అవకాశం ఏర్పడింది. ఆయన డీపీఆర్వోగా విధుల్లోకి చేరిన అనంతరం పాడేరు ఐటీడీఏ పబ్లిసిటీ ఏపీఓ రాములు, డీపీఆర్వో కార్యాలయ సిబ్బంది ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పరిచియాలు చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకు ముందు ఆయన జిల్లా కలెక్టర్, జెసి, డీఆర్వోలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, జిల్లా సమాచారం,  ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయాలు, అధికారిక కార్యక్రమాలు సత్వరమే మీడియాకి చేరవేడయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు.

Paderu

2022-04-20 16:01:12

గిరిజనులకు చేరువగా కార్యక్రమాలు..

గిరిజన సంస్కృతి పరిశోధన, శిక్షణ సంస్థ గిరిజనులకు అత్యంత చేరువగా కార్యక్రమాలు నిర్వహిచాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు  గంధం చంద్రుడు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం విశాఖలోని రుషికొండ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన భాషలు, గిరిజన నృత్యాలు, కళలు, పరిశోధన శిక్షణలు మీద సమీక్షించారు. గిరిజన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు, గిరిజన ప్రాంతములో పనిచేసే ఉద్యోగులకు,  గిరిజన యువతి యువకులకు గిరిజన చట్టాలు, హక్కులు మరియు ప్రభుత్వాలు గిరిజన ప్రజలకు అందిస్తున్న పథకాలు పైన అవగహన తరగతులు నిర్వహించాలన్నారు. వారిని చైత్యనవంతులను చేసి క్షేత్రస్థాయిలో గిరిజన ప్రాంత అభివృధికి దోహదపడే విధంగా అవగహన తరగతులు ఉండాలని చూసించారు.ఇంతే కాకుండ గిరిజన సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ అవసరాలను గుర్తించి సంబందిత ప్రతి పదనలు తయారి చేసి సంవత్సరిక కార్యాచరణ రూపోందించాలని ఆదేశించారు. అంతే కాకుండా ఈ కార్యాలయం భవవ సముదాయాన్ని కూడా పూర్తి స్థాయి లో వినియోగించు కోవాలని సూచించారు. గిరిజన ప్రాతములో ఉపాధ్యాయులకు ఆంగ్లం, మాతృ బాషా ఆధారంగా బహు బాషా విధానం బోదించేటట్టు శిక్షణ తరగతులు నిర్వహించాలని, ఈ శిక్షణ తరగతులు విద్య శాఖ వారితో సమన్వయం చేసుకొని నిర్వహించాలని అన్నారు. గిరిజన ప్రాంతంలో, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు బోధన మేలుకవులు పైన శిక్షణా తరగతులు నిర్వహించాలని తద్వారా గిరిజన విద్యార్థులకు పాఠ్యాంశాలు త్వరితగతిన అర్ధమయ్యే విధముగా ప్రతిపాదనలు రుపాదించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యలయం నిర్మాణం 2వ దశ పనులకు సంబందించి అన్ని ఏర్పాటులను త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రములో గిరిజన సంక్షేమశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజు, డిప్యూటీ ఇంజనీర్ సిమ్మన్న.  గిరిజన సంస్కృతి పరిశోధన,శిక్షణ సంస్థ ఆచార్యులు డా. ఎన్. శ్రీనివాస్, వి. సునీల్,  ఎన్. సీతారామయ్య, కే యస్. వెంకటేశ్వర రావు, కే.జైరాం తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-20 10:28:32

ప్రతీ ఒక్కరికీ ఆరోగ్య సేవలే లక్ష్యం..

ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ప్రతీ జిల్లాలో ఆరోగ్య మేళాలు నిర్వహిస్తున్నట్టు విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి  తెలిపారు. బుధవారం ఆమె నగరంలోని స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియం లో ఏర్పాటుచేసిన ఆరోగ్య మేళాను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున్ విమ్స్ డైరెక్టర్ డాక్టర్ కే. రాంబాబు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మేళాలో వైద్య ఆరోగ్య శాఖ అనుబంధ సంస్థల ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. సాధారణ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కూడా సకాలంలో మెరుగైన వైద్యం అందించాలన్నాదే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగానే ఈ మేళాను నిర్వహిస్తున్నారని తెలిపారు. అర్హులై ఉండి ఆరోగ్యశ్రీ కార్డులు అందని వారికి సకాలంలో కార్డులు అందజేసే విధంగా ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు  అధిక సంఖ్యలో సద్వినియోగం చేసుకుంటున్నారని తెలిపారు.  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జున మాట్లాడుతూ దీర్ఘకాలిక వ్యాధులు పై ప్రజలకు గ్రామస్థాయి నుండి విస్తృత అవగాహన కల్పించడం ద్వారా ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఈ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. నగరంలో నిర్వహించిన ఆరోగ్య మేళాకు ఉదయం 9 గంటల నుండే అధిక సంఖ్యలో జనం తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవడం తో పాటు ఉచితంగా మందులు పొందుతున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఒ డాక్టర్ విజయలక్ష్మి, జివిఎంసి ప్రధాన వైద్యాధికారి కెఎన్ఎల్జి శాస్త్రి , డి ఎల్ వో డాక్టర్  శారద బాయ్, ఆరోగ్యశ్రీ కో- ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్  నెట్ క్యాప్ చెర్మన్ కే కే రాజు ,ఇతర ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Visakhapatnam

2022-04-20 09:28:11

సీపీఎస్ రద్దు చేసేవరకూ ఉద్యమిస్తాం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిపిఎస్‌ను రద్దుచేసే వరకు ఉద్యమిస్తామని టీచర్స్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సిపిఎస్‌ను రద్దుచేస్తామని ఎన్నికల ముందు జగన్మోహన్‌రెడ్డి చేసిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోకపోవడటాన్ని ఆయన తప్పుపట్టారు. నేను విన్నాను, నేను ఉన్నాను. నేను మడమతిప్పను, మాట మార్చను అని పెద్దపెద్ద ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి సిపిఎస్‌ రద్దు ఎందుకు చేయలేకపోయారని ప్రశ్నించారు. బుధవారం ఎపి యుటిఎఫ్‌ బైక్‌యాత్ర మద్దిలపాలెంకు ఉదయం 10 గంటలకు చేరుకుంది. ఈ బైక్‌యాత్రకు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, ఎన్‌.సి.ఇ యూనియన్‌ నాయకులు జి.అరుణ్‌కుమార్‌, సిఐటియు నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం సభ జరిగింది. ఈ సందర్భంగా ఎ.అజశర్మ, ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, జి.అరుణ్‌కుమార్‌ లు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం జనవరి 1న 2004లో పాత పెన్షన్‌ విధానాన్ని రద్దుచేసి నూతన పెన్షన్‌ స్కీంను తీసుకువచ్చిందన్నారు. ఈ ఎన్‌పిఎస్‌ వలన ఉద్యోగులకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆనాడే ఉద్యమించినా ప్రభుత్వాలు వెనక్కుతగ్గలేదన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్కీంలో చేరడం సరైంది కాదని ఆనాడే యుటిఎఫ్‌ వ్యతిరేకించందన్నారు. నేడు ఎన్నికల్లో సిపిఎస్‌ రద్దుచేస్తామన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌ వాటిని రద్దుచేయలేదన్నారు. పైగా ముఖ్యమంత్రికి తెలియక వాగ్ధానం ఇచ్చారని సర్ధిచెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సిపిఎస్‌ రద్దుకోసం పోరు గర్జన పేరుతో ఈ నెల 18 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 4 బైక్‌యాత్రలు జరగటం మంచిపరిణామమన్నారు. ఈ బైక్‌యాత్ర 25కు విజయవాడకు చేరుకుంటాయన్నారు. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంతా యుటిఎఫ్‌కు సహకరించి ఉద్యమంలోకి వస్తే ప్రభుత్వం దిగరాక తప్పదన్నారు. స్వాగతం పలికిన వారిలో సిఐటియు నాయకులు కె.ఎం.కుమార్‌ మంగళం, పి.వెంకటరావు, అప్పారావు, త్రినాధ్‌, ఐద్వా నాయకులు  కె.కుమారి, లలిత, లక్ష్మి, డివైఎఫ్‌ఐ నాయకులు ఎస్‌.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ బైక్‌యాత్ర ఎన్‌ఏడి, గాజువాక మీదుగా మధ్యాహ్నంకి అనకాపల్లికి చేరుకుంటుందన్నారు. తెలుగుతల్లి విగ్రహానికి ఐవి పూలమాల వేసారు. బైక్‌యాత్రలో పాల్గొన్న టీచర్స్‌కు మజ్జిగ, బిస్కట్స్‌ పంపిణీచేసారు. ఈ బైక్‌యాత్రలో యుటిఎఫ్‌ నాయకులు సిహెచ్‌ రవీంద్ర, బి.గోపీమూర్తి, నాగమణి, అప్పారావు, చిన్నబ్బాయి, రామకృష్ణ, అంబేద్కర్‌, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 

Visakhapatnam

2022-04-20 07:22:44

చీపురుపల్లి ప్రత్యేక అధికారిగా నిర్మలకుమారి

విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలానికి ప్రత్యేక అధికారిణిగా మత్స్యశాఖ ఉప సం చాలకులు ఎన్.నిర్మల కుమారిని నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఏ.సూర్యకుమారి ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. జిల్లాల పున‌ర్విభ‌జ‌న నేప‌థ్యంలో భౌగోళికంగా జిల్లా ప‌లు మార్పుల‌కు లోనుకావ‌డంతో జిల్లాలోని మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల‌ను తాజాగా నియ‌మిస్తూ జిల్లా క‌లెక్టర్ ఈ ఉత్తర్వులు జారీచేశారు. పున‌ర్విభ‌జ‌న‌లో జిల్లా నుంచి కొన్ని మండ‌లాలు పార్వతీపురం మ‌న్యం జిల్లాకు వ‌దులుకోవ‌డం, శ్రీ‌కాకుళం నుంచి కొన్ని మండ‌లాలు జిల్లాలో చేర్చడంతో తాజాగా మండ‌లాల‌కు ప్రత్యేక అధికారుల‌ను నియ‌మిస్తున్నట్టు జిల్లా క‌లెక్టర్ త‌న ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలోని 27 మండ‌లాలు, విజ‌య‌న‌గ‌రం న‌గ‌ర పాల‌క‌సంస్థ‌, రాజాం, నెల్లిమ‌ర్ల న‌గ‌ర పంచాయ‌తీల‌కు వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియ‌మించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమ‌లును ఆయా మండ‌లాల్లో ప‌ర్యవేక్షించడం, మండ‌ల స్థాయి అధికారుల‌ను స‌మ‌న్వయ‌ప‌ర‌చి ప్రభుత్వ కార్యక్రమాలు, ప‌థ‌కాల‌ను స‌మ‌ర్ధంగా అమ‌లు చేయ‌డం వంటి కార్యక‌లాపాల‌ను ప్రత్యేక అధికారులు నిర్వహిస్తార‌ని జిల్లా క‌లెక్టర్ పేర్కొన్నారు. మండ‌లంలో అన్ని శాఖ‌ల అధికారుల‌తో సంయుక్త స‌మావేశాలు నిర్వహించి ఆయా కార్యక్రమాల అమ‌లుపై ప్రతి వారం స‌మీక్షించి జిల్లా ఉన్నతాధికారుల‌కు నివేదించాల్సి వుంటుంద‌ని ఆ ఉత్తర్వుల్లో క‌లెక్టర్ పేర్కొన్నారు.

Vizianagaram

2022-04-20 05:34:41

అప్పన్నకు తొలివిడత చందనం.. గంట్ల

ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల ఆరాధ్య దైవం, భక్తకోటి ఇలవేల్పు సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో మే మూడున అప్పన్న నిజరూప దర్శనం ఉత్సవము జరగనుంది.ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఈ ఉత్సవం ఈ ఏడాది కూడా ఆలయ ఈవో ఎంవీ సూర్య కళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు అప్పన్న ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్ట్ లు సంఘం కార్యదర్శి, వైజాగ్ జర్నలిస్ట్ లు ఫోరమ్ అధ్యక్షుడు గంట్ల శ్రీను బాబు తెలిపారు. బుధవారం సింహాద్రినాధుడు ను దర్శించుకున్న అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇందుకు సంబంధించి ఈ నెల 26న తొలివిడత చందనం అరగతీత కార్యక్రమం వైభవంగా ప్రారంభం కానుందన్నారు.. ఏకాదశి పర్వదినం  రోజున నిర్వహించే ఈఉత్సవాలకు సంబంధించి ఆలయ వర్గాలు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నాయన్నారు. ఆ రోజు తెల్లవారుజామున సింహాద్రి నాథుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లును సుప్రభాతసేవతో మేల్కొలిపి ఆరాధన గావిస్తారన్నారు... అనంతరం గంగ ధార నుంచి  తీసుకొచ్చిన పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి, విశ్వక్షేన , పుణ్యహవచనం ఆరాధన అనంతరం తొలివిడత చందనం అరగతీత కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నారు.... చందనోత్సవం రోజు రాత్రికి తొలివిడత చందనం సమర్పణ  గావించి, ఆ తర్వాత వచ్చే వైశాఖ, జ్యేష్ఠ, ఆషాడ పౌర్ణమిలలో మూడేసి మణుగుల చొప్పున మొత్తం  ఏడాదిలో నాలుగు  విడతల  కింద 12 మణుగుల చందనాన్ని (500కేజీలు) స్వామికి సమర్పించడం సంప్రదాయబద్ధంగా వస్తుందన్నారు.. ఆలయ అధికారులు ,ధర్మకర్తల మండలి సభ్యులు ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీను బాబు మీడియాకి వివరించారు.

Simhachalam

2022-04-20 05:16:33

నీటి ట్యాంకుల పరిశుభ్రతకు స్పెషల్ డ్రైవ్..

కాకినాడ జిల్లాలోని 385 గ్రామ పంచాయ‌తీల్లో ఏప్రిల్ 19, 20 తేదీల్లో రెండు రోజుల పాటు ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళికతో 702 ర‌క్షిత మంచినీటి స‌ర‌ఫ‌రా ప‌థ‌కాల‌ను శుభ్రం చేస్తున్న‌ట్లు జిల్లా పంచాయ‌తీ అధికారి ఎస్‌వీ నాగేశ్వ‌ర్‌నాయ‌క్ తెలిపారు. ఈ మేర‌కు మంగ‌ళ‌వార‌మిక్క‌డ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. మంగ‌ళ‌వారం 202 గ్రామ పంచాయ‌తీల ప‌రిధిలోని 306 మంచినీటి ట్యాంకుల‌ను శుభ్ర‌ప‌రిచామ‌ని.. మిగిలిన వాటిని శుభ్రం చేసే ప్ర‌క్రియ‌ను బుధ‌వారం పూర్తిచేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా ఆదేశాల మేర‌కు జిల్లాలోని ప్ర‌తి 15 రోజుల‌కు ఓసారి త‌ప్ప‌నిస‌రిగా శుభ్రంచేసి, ఆయా తేదీల‌ను ట్యాంకుల‌పై న‌మోదుచేసేలా క్షేత్ర‌స్థాయి సిబ్బందికి ఆదేశాలిచ్చిన‌ట్లు తెలిపారు. ప్ర‌తిరోజూ మంచినీటిని క్లోరినేట్ చేసి స‌ర‌ఫ‌రా చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. స‌చివాల‌యాల ప‌రిధిలోని ఇంజ‌నీరింగ్ స‌హాయ‌కులు ప్ర‌త్యేక ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల‌తో నీటి నాణ్య‌తా ప్ర‌మాణాల‌ను స‌రిచూసి, నివేదిక‌లు అందిస్తార‌ని వెల్ల‌డించారు. వేస‌వి తీవ్ర‌త నేప‌థ్యంలో మంచినీటి స‌ర‌ఫ‌రా పూర్తి సుర‌క్షితంగా జ‌రిగేలా జిల్లా క‌లెక్ట‌ర్ ఆదేశాలు ఇచ్చిన‌ట్లు డీపీవో నాగేశ్వర్ నాయక్ మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

Kakinada

2022-04-19 16:05:53