కేంద్రం ప్రభుత్వం వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని సీపీఐ విశాఖ జిల్లా సమితి ఖండించింది. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఐ బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ దరి గురజాడ అప్పారావు విగ్రహాం వద్ద గ్యాస్ బండ్లకు ఉరి వేసుకొని వినూత్నమైన నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు మాట్లాడుతూ, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో మరో మారు వంటగ్యాస్ ధరలను పెంచి వినియోగదారులపై మరోసారి ఆర్థికభారం మోపడం సమంజసం కాదన్నారు. ప్రజలు నిత్యం వాడుకోనే వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.50 వరకు పెంచారని, అదే వాణిజ్య సిలిండర్ ధర రూ.350.50 పెంచారని ఈ పెంపు కూడా పరోక్షంగా ప్రజలపైనే పడుతుందన్నారు. నిన్నటిదాకా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.1,105 ఉండగా తాజా పెంపుదలతో రూ.1,155 అయ్యిందని ఇంటికీ వచ్చే సరికి రూ.1200 అవుతోందన్నారు. వాణిజ్య సిలిండర్ ధర రూ.2119.50కు ఎగబాకిందని, పెరిగిన గ్యాస్ ధరలు వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే నిత్యావసర సరకుల ధరలు, ట్రూ అప్ పేరుతో విద్యుత్తు ఛార్జీలు పెంపుతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు అల్లాడుతున్నాయని తాజాగా పెరిగిన ధరలతో ఆ భారం మరింత పడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ శాసనసభ ఎన్నికలు ముగిసిన వెంటనే వంట గ్యాస్ ధరలు పెంచడం సామాన్యులను దగా చేయ్యడమేనని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి ఎన్ క్షేత్రపాల్, ఎం మన్మధరావు, జి కాసులరెడ్డి, వై రాంబాబు, ఎ ఆదినారాయణ, ఎన్ అప్పన్న, యు నాగరాజు, ఎం శ్రీనివాసరావు, సీహెచ్ కాసుబాబు, సీహెచ్ బుజ్జి, తెడ్డు వెంకటేశ్వరరావు తదితరులతో పాటు సిపిఐ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.