సమాజాన్ని సన్మార్గం వైపు నడిపించడంలో మీడియా పాత్ర కీలకమని భీమిలి పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మణమూర్తి అన్నారు. శనివారం భీమిలోని గంటా శ్రీనివాసరావు ఫంక్షన్ హాల్లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ భీమిలి యూనిట్ సభ్యులకు డైరీలు, స్వీట్స్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు సమతూకంగా తమ కథనాలతో సమాజాన్ని మేల్కొలపడంలో బాధ్యత వహించాల్సి ఉందన్నారు. నిరంతరం వార్తా సేకరణలో ఉంటూ సమాజానికి దిక్సూచిగా ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకొంటూ తమ కుటుంబ సంక్షేమం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తమ సంక్షేమంతో పాటుగా హక్కులను సాదించుకోవడం అభినందనీయమని అన్నారు. అనంతరం రాష్ట్ర టీడీపీ కార్యదర్శి,బీమిలి డివిజన్ టీడీపీ అధ్యక్షులు గంటా నూకరాజు మాట్లాడుతూ, ప్రజలకూ ప్రభుత్వానికి వారధిగా సమాజంలో జర్నలిస్టులు అత్యంత కీలకమైన భూమికను పోషిస్తున్నారని అన్నారు. బంగారు అశోక్ కుమార్ అధ్యక్షులుగా ఉన్న స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వంటి సంఘాలు జర్నలిస్టులకు అండదండగా నిలవడం అభినందనీయమన్నారు.
ఎస్సిఆర్డబ్ల్యూఏ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐక్యతతో ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అన్నారు..జర్నలిస్టులకు అండగా అసోసియేషన్ ఉంటుందన్నారు. సంస్థ ఆవిర్భావం, సభ్యుల సంక్షేమం కోసం సంస్థ తరపున చేస్తున్న కార్యకలాపాలను వివరించారు. ప్రతి జర్నలిస్ట్ ఆర్థికంగా, ఆరోగ్యంగా ఉండాలనేది అసోసియేషన్ ముఖ్య ఉద్దేశమన్నారు. సభ్యుల సహాయ సహకారాలతో అసోసియేషన్ ను మరింత బలోపేతం చేయడానికి అలాగే అసోసియేషన్ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.అనంతరం సీనియర్ పాత్రికేయులు రంగదాం జర్నలిస్టుల సమస్యలపై ప్రసంగించారు.
భీమిలి యూనిట్ సభ్యులకు సిఐ లక్ష్మణమూర్తి, టీడీపీ నాయకులు గంటా నూకరాజు డైరీలు, మిఠాయిలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి కాళ్ళ సూర్య ప్రకాష్(కిరణ్),జాయింట్ సెక్రెటరీ ఎంపిఏ రాజు ఇతర సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.