1 ENS Live Breaking News

నానో యూరియాను మరింత ప్రోత్స‌హించండి

విజయనగరం జిల్లా గుర్ల మండ‌లం కెల్ల రైతు భ‌రోసా కేంద్రాన్ని, గ్రామ స‌చివాల‌యాన్ని జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగళవాం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. రికార్డుల‌ను త‌నిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, గ్రామంలోని పంట‌ల ప‌రిస్థితిని తెలుసుకున్నారు. ఎరువుల స‌ర‌ఫ‌రా, ల‌భ్య‌త‌పై ఆరా తీశారు. రైతుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా, స‌రిప‌డిన ఎరువుల‌ను సిద్దంగా ఉంచాల‌ని ఆదేశించారు. నానో యూరియాపై రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి, దాని వాడ‌కాన్ని ప్రోత్స‌హించాల‌ని సూచించారు.  గ్రామంలో ఇ-క్రాప్ న‌మోదు, పిఎం కిసాన్ రిజిస్ట్రేష‌న్‌, ఇకెవైసి, భూముల రీస‌ర్వే, ప్ర‌కృతి సేద్యంపై ఆరా తీశారు. ప‌శువ్యాధుల‌పై ప్ర‌శ్నించారు. వ్యాధులు ప్ర‌భ‌ల‌కుండా త‌గిన ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌ల‌ను తీసుకోవాల‌ని ఆదేశించారు. న‌వంబ‌రు నాటికి రైతుభ‌రోసా కేంద్రం భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో గుర్ల తాశీల్దార్ ప‌ద్మావ‌తి, ఎంపిడిఓ బి.క‌ల్యాణి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Kella

2022-09-06 09:00:01

ఉపాది హామీ పథకం ద్వారా పనులు

తోట‌ప‌ల్లి ప్రాజెక్టు పైన త‌గినంత వ‌ర్ష‌పాతం లేద‌ని, అందువ‌ల్ల సాగునీటికి ఇబ్బంది ఏర్ప‌డింద‌ని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి చెప్పారు. మంగళవారం ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను కలెక్టర్ స్వయంగా సందర్శించి అక్కడి పరిస్థితి సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఈ స‌మ‌స్య‌ను ప్ర‌భుత్వానికి నివేదించ‌డంతోపాటు, ఉపాధిహామీ ప‌థ‌కం ద్వారా కాలువ‌ల నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌య‌త్నం చేస్తామ‌ని, వ‌చ్చే ఏడాది నాటికి ఈ స‌మ‌స్య లేకుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు. వ‌ర్షాల కోసం ఎదురు చూడ‌కుండా, వ‌రికి బ‌దులు అప‌రాలు లాంటి త‌క్కువ నీటి అవ‌స‌రం గ‌ల‌, ప్ర‌త్యామ్న‌య పంట‌ల సాగును చేప‌ట్టాల‌ని సూచించారు. రైతుల విజ్ఞ‌ప్తి మేర‌కు మిన‌ప‌, న‌ల్ల పెస‌ర విత్త‌నాల‌ను స‌బ్సిడీపై స‌ర‌ఫ‌రా చేయాల‌ని, జిల్లా వ్య‌వ‌సాయాధికారి తార‌క‌రామారావును, ఏఓ సంగీత‌ను ఆదేశించారు. నీటి ఎద్ద‌డి నెల‌కొన్ని ప్రాంతాల‌ను త‌క్ష‌ణ‌మే స‌ర్వే చేసి, అవ‌స‌ర‌మైన విత్త‌నాల‌ను రైతుల‌కు అందించాల‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.  ఈ ప‌ర్య‌ట‌న‌లో గుర్ల తాశీల్దార్ ప‌ద్మావ‌తి, ఎంపిడిఓ బి.క‌ల్యాణి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Gurla

2022-09-06 08:58:25

ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సూచించండి

రైతుల‌కు ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను సూచించాల‌ని, వ్య‌వ‌సాయాధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.సూర్య‌కుమారి ఆదేశించారు. సాగునీటి ఎద్ద‌డి నెల‌కొన్ని ప్రాంతాల్లో ఆమె ప‌ర్య‌టించారు. సాగునీటి కాలువ‌ల‌ను, చెరువుల‌ను ప‌రిశీలించారు. రైతుల‌తో మాట్లాడి, వారి స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. వ‌రిపంట‌కు బ‌దులు అప‌రాల‌ను సాగుచేయాల‌ని సూచించారు.  గుర్ల‌, గ‌రివిడి మండ‌లాల్లో క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారి మంగ‌ళ‌వారం విస్తృతంగా ప‌ర్య‌టించారు. గుర్ల మండ‌లం గూడెం వ‌ద్ద‌నున్న తోట‌ప‌ల్లి డిస్ట్రిబ్యూష‌న్ కెనాల్‌ను క‌లెక్ట‌ర్ ముందుగా ప‌రిశీలించారు. ఈ కెనాల్ ద్వారా సుమారు 6వేల ఎక‌రాల‌కు నీరు అందుతుంద‌ని, కెనాల్‌లో పూడిక‌లు, పిచ్చిమొక్క‌లు, గ‌డ్డి పెరిగిపోయిన‌ కార‌ణంగా నీరు వెళ్లే ప‌రిస్థితి లేద‌ని, తోట‌ప‌ల్లి ఇఇ రామ‌చంద్ర‌రావు వివ‌రించారు. అనంత‌రం పెనుబ‌ర్తి వ‌ద్ద తోట‌ప‌ల్లి ప్ర‌దాన కుడి కాలువ‌ను క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. 

ఈ కాలువ‌లో 96.5 కిలోమీట‌ర్లు వ‌ర‌కు మాత్ర‌మే నీరు వ‌చ్చింద‌ని, పూడిక‌లు, పిచ్చిమొక్క‌ల‌ కార‌ణంగా దిగువ‌కు నీరు రావ‌డం లేద‌ని ఇఇ తెలిపారు. కాలువ‌ల నిర్వ‌హ‌ణ‌కు దాదాపు 8 ఏళ్లుగా నిధులు రావ‌డం లేద‌ని, ల‌ష్క‌ర్లు కూడా మంజూరు కాలేద‌ని తెలిపారు. ఫ‌లితంగా గుర్ల‌, గ‌రివిడి, నెల్లిమ‌ర్ల‌, పూస‌పాటిరేగ మండ‌లాల‌కు పూర్తిగా, చీపురుప‌ల్లి మండ‌లానికి పాక్షికంగా సాగునీటి కొర‌త ఏర్ప‌డింద‌ని ఇఇ వివ‌రించారు.  గ‌రివిడి మండ‌లం శేరిపేట గ్రామాన్ని క‌లెక్ట‌ర్ సంద‌ర్శించారు. ముందుగా గ్రామంవ‌ద్ద‌ తోట‌ప‌ల్లి కాలువపై నిర్మించిన సైపూన్‌ను ప‌రిశీలించారు. అనంత‌రం పంట‌పొలాల‌ను వీక్షించారు. రైతుల‌తో మాట్లాడి, వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. తోట‌ప‌ల్లి కాలువ నుంచి నీరు రాక‌పోవ‌డంతో, గ్రామంలో ఉబాలు జ‌ర‌గ‌లేద‌ని, నారు ఎండిపోతోంద‌ని రైతులు చెప్పారు. కాలువ‌ల‌ను బాగుచేయించి, వ‌చ్చే ఏడాదికైనా కాలువ‌ల ద్వారా సాగునీరు వ‌చ్చేలా చూడాల‌ని రైతులు కోరారు. త‌మ‌కు స‌బ్సిడీపై పెస‌లు, మిన‌ప విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో గుర్ల తాశీల్దార్ ప‌ద్మావ‌తి, ఎంపిడిఓ బి.క‌ల్యాణి, ఇత‌ర సిబ్బంది పాల్గొన్నారు.

Gurla

2022-09-06 08:56:59

నైతిక విలువలతో నేరాల అదుపు..

శిక్ష అనేది సంఘటన తర్వాత జరిగే ప్రక్రియని, కానీ నేరాలు జరగకుండా ఉండాలంటే అందరూ నైతిక ప్రవర్తనతో, క్రమశిక్షణతో మెలగాలని న్యాయవాది  యనముల  రామం పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన న్యాయవిద్యాన సదస్సు ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సెల్ఫోన్లో లభిస్తున్న అశ్లీల సాహిత్యం, పెరుగుతున్న పాశ్చాత్య సంస్కృతి, వేష భాషలలో    గణనీయమైన మార్పు, పబ్  కల్చర్, క్షీణిస్తున్న కుటుంబ విలువలు మహిళలపై అత్యాచారాలు పెరగడానికి ముఖ్య కారణాలన్నారు. లైంగిక వేధింపులను నిరోధించడానికి గాను న్యాయస్థానాలు పాస్ట ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి కేసులపై త్వరితంగా విచారణ చేసి దోషులను కఠినంగా శిక్షించనుందని యనమల తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు.

Kakinada

2022-09-06 08:37:49

అన్ని రకాల పోషకాహారం అవసరం..

చక్కని ఆరోగ్య శైలి కోసం అన్ని రకాల పోషకాలతో కూడిన మంచి ఆహారం తీసుకోవాలని ఫార్మసిస్ట్ లిఖిత రాజమహేంతి పేర్కొన్నారు.  మంగళవారం కాకినాడలోని  సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. నేడు మనకు లభించే అన్ని ఆహార  పదార్థాలు ఎరువులు, క్రిమి సంహారిక మందులు, కల్తీలతో లభించడంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, కొన్ని రకాల క్యాన్సర్లకు దారితీస్తున్నాయన్నారు. అదేవిధంగా చిన్న చిన్న రోగాలకు మందులు వాడకుండా ఆహార పదార్థాలలో మార్పుల ద్వారా కూడా వాటిని నివారించవచ్చని అన్నారు. అధికంగా ఆకుకూరలు, పండ్లను తీసుకోవాలన్నారు  కాఫీ, టీ, మైదా, వేపుడు పదార్థాలు, తీపి  పదార్థాలు, కేకు వంటివి పరిమితంగా తీసుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం పూట ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలని రాజ మహంతి తెలిపారు . ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రవిశంకర్ పట్నాయక్, రాజా తదితరులు పాల్గొన్నారు.




Kakinada

2022-09-06 08:36:03

మాతృత్వానికి ప్రతిరూపం మదర్ తెరిస్సా

దీన జనుల కోసం నిస్వార్ధమైన సేవలు అందజేసిన మదర్ తెరిస్సా మాతృత్వానికి ప్రతిరూపమని, ప్రతి ఒక్కరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని విశ్రాంత ఉపాధ్యాయులు పరస సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం కాకినాడలోని సర్పవరం జంక్షన్ బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరిసా వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 612 మిషన్లతో వంద దేశాలలో సేవలు అందించి విశిష్ట నోబుల్ శాంతి బహుమతిని ఆమె పొందారన్నారు. రోగులకు సేవ చేస్తున్న సమయంలో నేను సాక్షాత్తు భగవంతునికి సేవ చేస్తున్నట్లు భావిస్తానని ఆమె తెలిపారని అన్నారు. 1977 సెప్టెంబర్ 5న ఆమె మరణించి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డారని సత్యనారాయణ తెలిపారు.  ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, డాక్టర్ కుమార్ యాదవ్, రాజా, రాఘవరావు, రేలంగి బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.


Kakinada

2022-09-05 08:49:02

జ్ఞాన మహర్షి భారతమాజీ రాష్ట్రపతి సర్వేపల్లి

విశ్వవిఖ్యాతగా  జ్ఞాన మహర్షిగా భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రసిద్ధి గాంచారని  ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలో గల సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ  ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికులుగా ఉపాధ్యాయ సమాజం నిలిచిందన్నారు. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడుగా   విద్యా బుద్ధులు నేర్పే గురువుకి ఏ ఒక్కరూ సాటిరారని కొనియాడారు.భారతీయ  సమాజంలో అమ్మా నాన్నల తర్వాత స్థానం గురువుదేనన్నారు.అందుకే పెద్దలు మాతృదేవో భవ.. పితృదేవో భవ.. ఆచార్య దేవోభవ అన్నారనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పిన భారతదేశ రెండో రాష్ట్రపతి,మేధావి,విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించిందన్నారు. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు.ఈ నేపథ్యంలో గురువు గొప్పదనం, ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టత తెలుసుకోవాల్సిన గురుతర  బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.అజ్ఞాన పొరలు తొలగించి, జ్ఞానదీప్తిని వెలిగించే గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనదన్నారు.సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారన్నారు. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలిగా, తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్‌ సేవలు చరిత్రలో నిలిచాయన్నారు.

 ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో,గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారన్నారు. రాధాకృష్ణన్ ను  స్ఫూర్తిగా తీసుకొని,, నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయ సమాజంపై ఉందన్నారు..విధ్యా బోధనలో కొనసాగుతున్న ఉపాధ్యాయ, అధ్యాపక,ఆచార్యులకు..విద్యా సంస్థల నిర్వహణలో ముఖ్య భూమిక వహిస్తున్న ప్రధానోపాధ్యాయులకు,ప్రిన్సిపాల్స్ కు స్పీకర్ తమ్మినేని సీతారాం ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్, బొడ్డేపల్లి రమేష్ కుమార్, దుంపల శ్యామలరావు పొడుగు శ్రీను, బోడ్డేపల్లి రమణమూర్తి, మామిడి రమేష్, కుసుమంచి శ్యాంప్రసాద్, బొర చిన్నం నాయుడు,చిన్నారావు, మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Amadalavalasa

2022-09-05 06:44:36

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన

రాష్ట్ర బీసీ సంక్షేమం; స‌మాచార‌, పౌర సంబంధాలు; సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల‌కృష్ణ ఆదివారం రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గం, కాజులూరు మండ‌లం, గొల్లపాలెం గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విజ‌య‌వంతంగా అమ‌లుచేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల వివరాలను గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వెళ్లి చెబుతూ.. వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, వైఎస్సార్ పెన్ష‌న్ కానుక‌, జ‌గ‌న‌న్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత‌, వైఎస్సార్ ఆస‌రా త‌దిత‌ర ప‌థ‌కాల ద్వారా ఒక్కో కుటుంబానికి ఎంత మేలు జ‌రిగింద‌నే విష‌యాన్ని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ మాట్లాడుతూ ఎక్క‌డా రూపాయి అవినీతి లేకుండా అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, జ‌వాబుదారీత‌నంతో ప‌థ‌కాల అమ‌లు జ‌రుగుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. 

గ్రామ‌, వార్డు స‌చివాలయాలు; వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ల ద్వారా ఇంటి వ‌ద్ద‌కే ప‌థ‌కాల ఫ‌లాలు అందుతున్నాయ‌న్నారు. ప‌థ‌కాల ప్ర‌యోజ‌నం పొందేందుకు ఏ కార్యాల‌యం చుట్టూ తిర‌గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక‌గా ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా ప్ర‌జ‌లు ల‌బ్ధి పొందుతున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు పేద‌రిక‌మ‌నే శాపం నుంచి విముక్తి పొందేందుకు, జీవన ప్రమాణాలను మెరుగుపరచుకునేందుకు ఈ ప‌థ‌కాలు దోహ‌దం చేస్తున్నాయ‌ని పేర్కొన్నారు. వైఎస్సార్ చేయూత, ఆసరా తదితర పథకాలను ఉపయోగించుకుంటూ మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని సద్వినియోగం చేసుకుని నేతన్నలు తమ కుటుంబాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల ద్వారా గౌర‌వ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పేద‌ల అభ్యున్న‌తికి కృషిచేస్తున్న‌ట్లు తెలిపారు.

    ప్ర‌తి ఇంటికీ వెళ్లి సంక్షేమ ప‌థ‌కాల వివ‌రాలు తెలియ‌జేయ‌డంతో పాటు స‌మ‌స్య‌లు ఏవైనా ఉంటే తెలుసుకొని త‌క్ష‌ణ‌మే ప‌రిష్క‌రించేందుకు వీలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు తెలిపారు. ఒక్కో స‌చివాల‌యం ప‌రిధిలో త‌క్ష‌ణం చేప‌ట్టాల్సిన ప‌నుల‌కు రూ. 20 ల‌క్ష‌లు చొప్పున ప్ర‌భుత్వం కేటాయించిన‌ట్లు తెలిపారు.  ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల ఆస‌రాతో గొల్లపాలెం గ్రామం  మ‌రింతగా అభివృద్ధి సాధించాల‌ని మంత్రి వేణుగోపాల‌కృష్ణ ఆకాంక్షించారు. కార్య‌క్ర‌మంలో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు,  గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. 

Kajuluru

2022-09-04 09:46:29

నిర్మాణాలకు అవసరమైన భూములు గుర్తించాలి

ప్రాధాన్యత భవనాలు నిర్మాణానికి అవసరమైన భూములు గుర్తించి నివేదిక ఇవ్వాలని, అదే రోజు ఆయా భవనాల పనులు ప్రారంభం కావాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆదేశించారు. శనివారం ఉదయం కడియం, వేమగిరి లలో స్కూల్స్ నాడు నేడు పనులను, మధ్యాహ్న భోజన పథకం అమలును తనిఖీ చేసి, ప్రాధాన్యత భవనాలు కోసం స్థలం గుర్తింపు విషయమై క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ,  ప్రతి సచివాలయం పరిధిలో ఒక సచివాలయ భవనం , ఆర్భికే, హెల్త్ సెంటర్ భవనాలు ఏర్పాటు చేయ్యాల్సి ఉందన్నారు. ఇందు కోసం అనువైన స్థలాన్ని గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వం ప్రతి రెండువేలు జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చెయ్యడం జరిగిందన్నారు. 

ప్రతి వారం ముఖ్యమంత్రి కార్యాలయం, రాష్ట్ర ఉన్నతాధికారులు ప్రాధాన్యత భవనాలు పనులపై మూడు పర్యాయాలు సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.  క్షేత్ర స్థాయి లో అధికారులు, సిబ్బంది జవాబుదారీ తనం తో కూడి పనితీరు చూపాల్సి ఉందని స్పష్టం చేశారు.  సోమవారం నాటికి స్థలం గుర్తించి,  పనులు ప్రారంభం అయ్యేలా చూడాలని ఆదేశించారు. బుధవారం నాటికి పనులు ప్రారంభించినట్లు నివేదిక ఇవ్వవలసి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాతం చేసేందుకు కాదు ఇక్కడ మీరు విధుల్లో ఉన్నది, ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలకు అవసరమైన భూముల గుర్తింపు భాధ్యత మీదే అని పంచాయతీ సిబ్బందికి కలెక్టర్ స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట పంచాయతీ రాజ్ ఎస్ ఈ .. ఎబివి ప్రసాద్, డి ఈ వో . ఎస్. అబ్రహం, ఎంపీడీఓ కె. రత్నకుమారి, సంబందించిన శాఖల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వం సచివాలయం సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. త్వరలోనే ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ విధానం తీసుకుని రానున్న దృష్ట్యా ప్రాధాన్యత భవనాలు మరింత వేగంగా పూర్తి చేయాలనే కార్యాచరణ రూపుదిద్దామన్నారు. జిల్లాలో 1101 భవనాలను నవంబర్ చివరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యం నిర్దేశించుకోవడం జరిగిందన్నారు.  అందులో భాగంగా కడియం లో ఆర్భికే పనులను పరిశీలించడానికి రావడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. 

Kadiam

2022-09-03 10:44:25

కళాశాల సమస్యల పరిష్కారానికి చర్యలు

అరకు వ్యాలీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ విద్యార్థులకు స్పష్టం చేశారు.  శుక్రవారం ఎస్ఎఫ్ఐ, ఆదివాసి జెఎసి ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి విచ్చేసిన విద్యార్థులతో కలెక్టర్  మాట్లాడుతూ, కళాశాలలో విద్యార్థుల సౌకర్యాలను త్రాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయం తదితర మౌలిక సదుపాయాల కల్పనకు వెంటనే రూ.17 లక్షలు మంజూరు చేస్తున్నామని తెలిపారు.  అదేవిధంగా విద్యార్థినుల రక్షణ కొరకు కాలేజీ ఆవరణ చుట్టూ నాడు నేడు క్రింద 25 లక్షల రూపాయలతో రక్షిత గోడను నిర్మిస్తామన్నారు.  ఉపాధ్యాయుల నియామకం గురించి  మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని, అంతటితో ఆగకుండా ఫాలోఅప్ చేస్తామని స్పష్టం చేశారు.

  అంతేకాకుండా విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు తో మాట్లాడి రాజమండ్రి, ఇతర ప్రాంతాల నుండి  ఉపాధ్యాయులను డెప్యుటేషన్ పై  నియమిస్తామన్నారు.  నియామక విషయమై సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి శాస్వత నియామకానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు అడిగిన పలు ప్రశ్నలకు కలెక్టర్ ఓపికగా సమాధానాలు చెప్పారు.  విద్య పట్ల, విద్యార్థుల పట్ల, సదభిప్రాయం ఉన్నందునే ఎన్నో ప్రాధాన్యతలను వదిలి, జిల్లా నలుమూలల నుండి ఈరోజు జరిగే స్పందనకు వచ్చే ఫిర్యాదుదారులను వదిలి కేవలం విద్యార్థినిలు, వారి సమస్యలు  పరిష్కరించాలని వారికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలను స్థానిక శాసనసభ్యులు శెట్టి  ఫాల్గుణ సందర్శించడం జరిగింది అని వారికి స్పష్టం చేశారు.  


సమస్యల పరిష్కారానికి కొంత సమయం పడుతుందని, తదుపరి నెలలో మళ్లీ కళాశాలను సందర్శిస్తానని, విద్యార్థినులు కూడా అయిదారుగురు  తదుపరి వారం లోగా కలిసి జరిగిన ప్రగతిని వివరించాలని కలెక్టర్ సూచించారు.  అరకు ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల నుంచి కూడా 10 లక్షల రూపాయల వరకూ కళాశాల అభివృద్ధికి ఖర్చు చేయటానికి ఎంపీ, ఎమ్మెల్యే ముందుకు వచ్చారని కలెక్టర్ తెలిపారు.  దీంతో విద్యార్థులు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు, రాష్ట్ర ఆదివాసి జేఏసీ ప్రతినిధులు రామారావు దొర, ఎం. రాంబాబు, ఎస్. గంగరాజు, బి మాధవరావు, మహేశ్వర రావు, ఎస్ ఎఫ్ ఐ ప్రతినిధులు ప్రభుదాస్, ధనలక్ష్మి, కిన్నేరి, జ్యోతి, జెడ్ పి టి సి డి గంగరాజు  తదితరులు పాల్గొన్నారు. 

Paderu

2022-09-02 16:30:54

శంఖవరం క్రిష్ణాలయంలో భారీ అన్నదానం

కాకినాడ జిల్లా శంఖవరం మండల కేంద్రంలోని గొల్లవీధి శ్రీ క్రిష్ణాలయంలో ఆగస్టు3 శనివారం భారీ అన్నసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వాహకులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. క్రిష్ణాష్టమి పర్వదినాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు పేర్కొన్నారు. భక్తులంతా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి అన్నప్రసాదాలను స్వీకరించాలని ఆలయ నిర్వాహకులు కోరుతున్నారు. పురుషులు, మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి అన్నదానం ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు. క్రిష్ణాష్టమి పండుగను పురస్కరించుకొని నాటి నుంచి నేటి వరకూ స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం భజనా కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చామని తెలియజేశారు. మధ్యాహ్నాం 12 గంటల నుంచే అన్నదానం ప్రారంభం అవుతుందని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.


Sankhavaram

2022-09-02 14:11:56

భోజనం నాణ్యతపై జిల్లాకలెక్టర్ ఆగ్రహం

విజయనగరం జిల్లాలోని సతివాడ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేదని, పిల్లల సంఖ్య కు తగ్గట్టుగా వంట చేయలేదని జిల్లా పరిషత్ పాఠశాల యాజమాన్యం పై  జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఆగ్రహం వ్యక్తం చేసారు. వంట గదిలో వండి ఉన్న ఆహారాన్ని తనిఖీ చేసారు.  విద్యార్ధుల సంఖ్య కన్నా గుడ్లు తక్కువగా ఉండడం గమనించి వెల్ఫేర్ అసిస్టెంట్ ను పిలిపించి ఎందుకు తనిఖీలు చేయడం లేదని ప్రశ్నించారు.  ఇదే పరిస్థితి ఉంటె చర్యలు తప్పవని  హెచ్చరించారు.   నెల్లిమర్ల మండలం లో నెల్లిమర్ల  ఉన్నత ప్రాధమిక ఆరోగ్య కేంద్రం,  సతివాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర, జిల్లా పరిషత్ పాఠశాలలను  శుక్రవారం కలెక్టర్ ఆకష్మిక తనిఖీ చేసారు.  జిల్లా పరిషత్ పాఠశాల లో 10 వ తరగతి పిల్లలతో ముఖా ముఖి మాట్లాడారు.  తెలుగు, ఇంగ్లీష్ మీడియం విద్యార్ధుల తో టెక్స్ట్ పుస్తకాలలోని పాఠాలను చదివించారు.



 సోషల్ స్టడీస్ తో కూడా మంచి భవిస్యత్తు ఉంటుందని, బాగా చదువుకోవాలని పిల్లలకు హితవు చెప్పారు. అనంతరం కొంత మంది  పిల్లలతో  రహస్యంగా మాట్లాడి మధ్యాహ్న భోజనం ఎలా ఉంది అని ఆరా తీసారు. చిక్కీ గుడ్డు పెడుతున్నారా అని అడిగారు. బాగోలేదని కొందరు పిల్లలు చెప్పగా హెచ్ ఎం పై ఆగ్రహం వ్యక్తం చేసారు.  స్టోర్ కి వెళ్లి స్టాక్ ను తనిఖీ చేసారు.  ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులో ఉన్నందున వెంటనే రిపేర్ చేయించాలని ఇంచార్జ్ హెచ్ ఎం కు సూచించారు. సతివాడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని,  నెల్లిమర్ల ఉన్నత ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసారు. హాజరు పట్టీ ని పరిశీలించారు. ఓ.పి లో ఉన్న రోగులతో మాట్లాడారు. మందులు సక్రమంగా అందుతున్నాయా అని ప్రశ్నించారు. ఇండెంట్ రిజిస్టర్ ను, డ్రగ్ స్టోర్ ను తనిఖీ చేసారు. రోగులకు అందుతున్న ప్రాధమిక వసతుల పై ఆరా తీసారు.  


రోజుకు ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని, ఎంత మందికి కుటుంభ నియంత్రణ ఆపరేషన్ లు జరుగుతున్నాయని అడిగారు. కుటుంభ నియంత్రణ పై అవగాహన కల్పించాలని ఎ.ఎన్ .ఎం  లకు సూచించారు.  కోవిడ్ వాక్సినేషన్ శత శాతం జరగాలన్నారు. నెల్లిమర్ల లో  ప్రసవానంతరం  బెడ్ పై నున్న  మహిళా తో మాట్లాడి ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయి, వైద్యుల సేవలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించారు.  ఆరోగ్య శ్రీ కేసు లు ఎన్ని వస్తున్నాయి, ఎన్నెన్ని రెఫెర్ చేస్తున్నారు అని ఆరోగ్య మిత్ర ను అడిగారు.  ఆసుపత్రి ఆవరణ పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట  నెల్లిమర్ల తహసిల్దార్ రమణ రాజు, ఎం.పి.డి.ఓ గిరిబాల, మున్సిపల్ కమీషనర్ బాలాజీ, వైద్యాధికారులు,  డా.హరి కిషన్, పుల్మనాలజిస్ట్ తదితరులు ఉన్నారు. 

Nellimarla

2022-09-02 12:58:15

ఈవీఎం గోడౌన్‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని నెల్లిమ‌ర్ల‌లోని ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాములను జిల్లా  క‌లెక్ట‌ర్ ఎ. సూర్య కుమారి  శుక్రవారం త‌నిఖీ చేశారు.  కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిబంధ‌న‌ల మేర‌కు  గోదాముల   షట్టర్ల తాళాలను పరిశీలించి రికార్డులలో సంతకాలను చేసారు. కలెక్టర్ వెంట  జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గ‌ణ‌పతిరావు, నెల్లిమర్ల తహసిల్దార్ రమణ రాజు, ఎం.పి.డి.ఓ గిరిబాల. మున్సిపల్ కమీషనర్ ఫై. బాలాజీ ఎన్నికల సూపరింటెండెంట్ , సిబ్బంది తదితరులు  వున్నారు.

Nellimarla

2022-09-02 10:05:48

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహా నేత.. డా.వైఎస్సార్

ప్రజల గుండెల్లో చినస్థాయిగా నిలిచిపోయిన నేత దివంగత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి అని సీనియర్ వైఎస్సార్సీపీ నాయకులు పసగడుగుల గిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం గొలుగొండ మండలం క్రిష్ణదేవీపేట గ్రామంలో వైఎస్సార్ 13వ వర్ధంతి సందర్భంగా ఆ మహానాయకుడి విగ్రహానికి సర్పంచ్ పి.సత్యాన్నారాయణతో కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గిరిబాబు మాట్లాడుతూ, తెలుగు ప్రజలు జీవితాంతం గుర్తుంచుకునే నేత వైఎస్సార్ అని..ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, వైద్య సేవలు, పావలా వడ్డీ రుణాలు వంటి సంక్షేమ పథకాల్లో ప్రజలంతా అనునిత్యం ఆ మహానేతను స్మరిస్తూనే ఉంటారని అన్నారు. భౌతికంగా డా.వైఎస్సార్ మన మధ్య లేకపోయినా..ఆయన రాష్ట్రానికి చేసిన సేవ, అభివ్రుద్ధిలో ఎల్లప్పుడూ చిరంజీవిగానే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీనాయకులు పందిరి వెంకటరమణ, జి. అర్జున, ఎం.వరహాలు, తదితరులు పాల్గొన్నారు.
 

Golugonda

2022-09-02 06:31:19

డివిజనల్ పీఆర్వో గా రాములుకు పదోన్నతి

ఏపీ సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ పౌర సంబంధాల అధికారి పండు రాములుకు పాడేరు డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి కల్పిస్తూ సమాచార శాఖ కమీషనర్ ఆగస్టు 29న ఉతర్వులు జారీచేశారు. ఈమేరకు గురువారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా,జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో డివిజనల్ పౌర సంబంధాల అధికారి గా అయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే సహాయ ప్రాజెక్ట్ అధికారి (పబ్లిసిటీ)గా అదనపు భాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2007 నుండి 2012 శ్రీకాకుళం జిల్లాలో ఎపిఆర్వోగాను 2012 నుండి 2016వరకు ఐటిడిఎలో డి.ఎస్. ఓ గా డిప్యుటేషన్ పై విధులు నిర్వహించారు.2017లో విజయనగరం లో ఎ పి అర్ ఓ పనిచేశారు.2018 నుండి ఇప్పటివరకు  పాడేరులో సహాయ పౌర సంంధాల అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన పదోన్నతి పొందారు. డి పి అర్ ఓ పి.గోవిందరాజులు, ఎఈ పిల్లా శ్రీనివాసరావు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.

Paderu

2022-09-01 13:46:01