విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఆశయాలే ఆదర్శంగా తమ ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. రాష్ట్రంలో గడచిన రెండేళ్ల కాలంలో గిరిజన సంక్షేమానికి రూ.14,658 కోట్ల రుపాయలను వెచ్చించడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకంలోనూ గిరిజనులకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. నిలువనీడ లేని ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని సమకూర్చే జగనన్న కాలనీల నిర్మాణం దేశానికే ఆదర్శప్రాయమని అభిప్రాయపడ్డారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా కొమరాడ మండలంలోని రాజ్యలక్ష్మీపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగానే ఐటీడీఏ ఆద్వర్యంలో రైతులకు పవర్ వీడర్స్ ను పంపిణీ చేయడంతో పాటుగా మెగా హౌసింగ్ గ్రౌండింగ్ లో భాగంగా జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసారు. ఈ నేపథ్యంలోనే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు గిరిజనుల మేలు కోసం పాటుపడ్డారని, తన ఆశయ సాధనలో భాగంగా బ్రిటీష్ ప్రభుత్వంపై సాయుధపోరాటం చేసి తన ప్రాణాలను సైతం అర్పించారని గుర్తు చేసారు. మైదాన ప్రాంతాల వారితో సమానంగా మన్యంలోని గిరిజనులు అభివృద్ధి చెందాలని, వారి హక్కులు వారికి దక్కాలని అల్లూరి సీతారామరాజు కోరుకున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా అల్లూరి తరహాలోనే గిరిజన సంక్షేమానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తున్నారని చెప్పారు. గడచిన రెండేళ్లకాలంలో గిరిజన సంక్షేమం కోసం రూ.14,658 కోట్ల రుపాయలను వెచ్చించడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ నుంచి 2021 మే మాసాంతం వరకూ వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రత్యక్షంగా 29.71 లక్షల మంది గిరిజనుల ఖాతాల్లోకి రూ.4915 కోట్లను నేరుగా జమ చేసారని, పరోక్షంగా 17.11 లక్షల మంది గిరిజనులకు రూ.1731 కోట్ల లబ్దిని చేకూర్చారని తెలిపారు. ఇదికాకుండా వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ట్రైబల్ సబ్ ప్లాన్ కింద రూ.8012 కోట్ల తో అభివృద్ధి పనులను చేపట్టారని పుష్ప శ్రీవాణి వివరించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు అటవీ హక్కుల చట్టం ఆర్ఎఫ్ఆర్ లో భాగంగా పట్టాలను ఇవ్వడంలోనూ ముఖ్యమంత్రి కొత్త చరిత్రను సృష్టించారని చెప్పారు. గత అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ 1.24 లక్షల మంది గిరిజనులకు 2.28 లక్షల ఎకరాల భూములను పట్టాలుగా ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. గత టీడీపీ ప్రభుత్వం గిరిజనుల అభీష్టానికి వ్యతిరేకంగా బాక్సైట్ తవ్వకాలకు అనుమతులిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అనుమతులన్నింటినీ అధికారికంగా రద్దు చేసారని ప్రస్తావించారు. అలాగే గిరిజనులు ఎంతోకాలంగా కోరుకుంటున్న ఎస్టీ కమిషన్ ను కూడా ఏర్పాటు చేసారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, పనుల కేటాయింపుల్లోనూ ఇతర వర్గాల వారితో పాటుగా గిరిజనులకు కూడా రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. తాను తీసుకొనే ప్రతి నిర్ణయంలోనూ గిరిజనుల మేలును గురించి ఆలోచిస్తున్నందుకే ఈ రోజున అల్లూరి సీతారామరాజు తరహాలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా గిరిజనులు తమ గుండె గుడిలో దేవుడిలా ఆరాధిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఐటీడీఏ పిఓ కుర్మనాధ్, ఆర్డీఓ వెంకటేశ్వర్లు,గృహ నిర్మాణ శాఖ ఇఇ శ్రీనివాస్ రావు, డిఇఇ చెన్న రాయడు, మండలం ప్రత్యేక అధికారి శాంతిశ్వర్ రావు ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఎస్ఎల్వి ప్రసాద్, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ద్వారపురెడ్డి జనార్ధన నాయుడు, వైస్సార్సీపీ సీపీ నాయకులు నంగిరెడ్డి శరత్ బాబు, సర్పంచ్ అంబటి వెంకటిలక్ష్మి,మండలం వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చింతల సంఘం నాయుడు, శివిని సింగిల్ విండో అధ్యక్షులు దాసరి శ్రీధర్, అంబటి తిరుపతి నాయుడు, నాలి గుంపస్వామి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.