ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి మానసపుత్రిక.. దేశంలోని అన్ని రాష్ట్రాలను ఒకేసారి ఏపీవైపు తొంగిచూసేలా చేసిన ఏకైక ప్రభుత్వ శాఖ..గ్రామ, వార్డు సచివాలయశాఖ.. రాష్ట్రంలో ఈ ప్రభుత్వశాఖ వచ్చి మూడేళ్లు దాటిపోతున్నా..ఒక్కో సచివాలయంలో ఎంత మంది ఉద్యోగులుంటారు..ఏ శాఖ సిబ్బంది ఉంటారు..ఏఏ రకాల సేవలు అందింస్తారో ఎవరికీ తెలీదు.. వీరూ ప్రజలకు తెలియజెప్పలేదు.. కాదు కాదు..వారికి కేటాయించిన డ్యూటీ చార్ట్ ఏంటో ఈ శాఖ ఉద్యోగులకే తెలీదు.. అందుకే ఇన్నేళ్లు దాటుతున్నా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేసే సేవలు తెలియకపోవడంతో ఉచితంగా కొన్ని రోజులు సేవలు అందించి ప్రజలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. దానికోసం ప్రత్యేకంగా నెలరోజులు ప్రత్యేక ప్రచారానికి ఈరోజునుంచే తెరలేపింది. రాష్ట్రంలోగ్రామ, వార్డు సచివాలయశాఖలో 26 జిల్లాల్లో 14వేల 5 సచివాలయాల్లో సుమారు 1.35 లక్షల మంది ఉద్యోగులు..వీరంతా ఒకేసారి వారి ప్రభుత్వశాఖలకు సంబంధించిన సేవలపై గ్రామాల్లోని పెద్దలకు, ప్రచారం చేస్తే ఎప్పుడో ఇక్కడి సేవలపై అవగాహన వచ్చేది. కానీ అలాచేయకపోవడంతో ప్రభుత్వమే ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి బాబ్బాబు అంటూ పూనుకోవాల్సి ఇపుడు ప్రచారం చేయాల్సి వస్తోంది.
ప్రజలకు అవగాహన జరుగుతుందిలా..
రాష్ట్రంలో జూన్ 24 నుంచి నెల రోజుల పాటు గ్రామ, వార్డు సచివాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా సుమారు 745 సేవలను ప్రజలకు తెలిసేలా ప్రచారం చేస్తారు. ఈప్రచారం జరుగుతున్న సమయంలో 11 రకాల సేవలు(ఆధార్, కుల, ఆదాయ, నివాసం, జనన, మరణ, ఓబిసి తదితర) ఉచితంగానే ఇస్తారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్ధులకు, డ్వాక్రా సంఘాలకు, తెలిసేలా ప్రచారం చేపడతారు. వాస్తవానికి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలకు సంబంధించిన ద్రువీకరణ పత్రాలు కావాలంటే సచివాలయాల ద్వారా తీసుకోవాల్సి వుంటుంది. అయితే అక్కడ ఏ తరహా సేవలు అందిస్తారనే విషయంలో నేటివరకూ పూర్తిస్థాయి అవగాహన ప్రజలకు లేదు. దీనితో ఇపుడు ఆ సేవలపై సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు, స్థానిక నాయకుల సహకారంతో ప్రజల్లోకి తీసుకెళతారు. అలా చేయడం ద్వారా గ్రామం లేదా వార్డులోని సచివాలయాల దగ్గరకే ఏ అవసరం వచ్చినా వెళ్లాలనే అవగాహన ప్రజలకు కల్పిస్తారు.
రాష్ట్ర, జిల్లా, మండల అధికారుల వైఫల్యమే..
అటు రాష్ట్రంలోనూ, ఇటు జిల్లా, మండల శాఖ అధికారుల వైఫల్యం వలనే గ్రామ, వార్డు సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన, చైతన్యం రాకుండా పోయాయనడాకి 19శాఖల్లో వారిలో వారికి సమాచార లోపమనే చెప్పాలి. సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరిన దగ్గర నుంచి బెదిరించి విధులు చేపట్టేలా చేయడం తప్పితే ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సక్రమంగా ఒక్క ప్రభుత్వశాఖ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాదు సిటిజన్ అవుట్ రీచ్ కార్యక్రమాలు చేపట్టే సమయంలో కూడా సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పలేదు. ఇక్కడ ఉద్యోగులకు సర్వీస్ ప్రొభేషన్ ఖరారు అయ్యేంత వరకూ రాష్ట్ర అధికారి, జిల్లా కలెక్టర్, మండల అధికారులు వరుసుగా వీరందరినీ భయపెట్టే పనులు చేయించడం వలనే సిబ్బంది కావాలనే సచివాలయాల్లో అందే సేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లలేదనే విషయం మీడియా ద్వారా చాలాసార్లు ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. రెవిన్యూశాఖ ఉత్తర్వులు జారీచేస్తే పంచాయతీరాజ్ కి పడేది కాదు..విద్యాశాఖ అమలు చేసే ఆదేశాలు ఇంజనీరింగ్ శాఖకు నచ్చేది కాదు..ఇలా ఏ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినా మండలాల్లో ఎంపీడీఓలు వాటిని అమలు పరిచేవారు కాదు. ఎవరైనా ప్రశ్నిస్తే మీ ఉద్యోగాలు రెగ్యులర్ కావాల్సి వుందనే బెదిరింపులూ వచ్చేవి. వెరసీ మూడేళ్లు దాటిపోతున్నా నేటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లోని సేవలు ప్రజల్లోకి వెళ్లలేదు..
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు..
రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసినా ప్రజలందరూ అన్ని రకాల సేవల కోసం మీ సేవా కేంద్రాలనే ఆశ్రయించేవారు. ముఖ్యంగా రెవిన్యూశాఖకు సంబంధించిన అన్ని పనులూ అక్కడే జరిగేవి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం మీసేవా కేంద్రాలకు వెళ్లిపోయేది. రాష్ట్రవ్యాప్తంగా వున్న 14వేల 5 సచివాలయాల ద్వారా అన్ని రకాల సర్వీసులు అందించే ఏర్పాటు ప్రభుత్వశాఖల వారీగా చేసి ఉంటే ఆదాయం కూడా గణనీయంగా పెరిగేది. అంతేకాకుండా అపుడు మీసేవాల్లో ఇచ్చే ద్రువీకరణలు వేరుగా..సచివాలయాల్లో ఇచ్చే ద్రువీకరణలు వేరుగా ఉండటం వనలన కూడా అందరూ మీసేవ కే ఎక్కువ మొగ్గు చూపేవారు. అంతేకాకుండా మీసేవ ద్వారా వచ్చే దరఖాస్తులకు సిబ్బంది కూడా ముందుకెళ్లి పనులు చేసేవారు. దానిని గుర్తించిన ప్రభుత్వం మీసేవాల్లో కూడా గ్రామ, వార్డు సచివాలయశాఖ పత్రాలనే వివిధ రకాల ద్రువీకరణల కోసం వినియోగించడం మొదలు పెట్టిన తరువాత మీసేవ, సచివాలయాలకు మధ్య వ్యత్యాసం అందరికీ తెలిసింది. ప్రస్తుతం చేసే ప్రచారంతో మరింత మందికి తెలిసే అవకాశం వుంటుంది.
ఉద్యోగులు తలచుకుంటే వారం రోజులు చాలు..
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న 1.35 లక్షల మంది ఉద్యోగులు ఒక్కసార తలుచుకుంటే..వారి ప్రభుత్వశాఖల వారీగా అందించే సేవలను ప్రచారం చేయడం మొదలు పెడితే ప్రజలందరికీ ఒకేసారి అవగాహన వస్తుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే వారంరోజులు సరిపోతుంది. తద్వరా ఇంటి ముంగిటే సచివాలయ సేవలు అందుతున్నాయనే విషయం ప్రజలకు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, Ens Live యాప్, న్యూస్ వెబ్ సైట్ www.enslive.net ద్వారా ఈశాఖ ఏర్పాటు అయిన దగ్గర నుంచి ప్రచారం చేస్తోంది. అంతేకాకుండా సిబ్బంది ద్వారా ప్రత్యేకంగా ప్రజాప్రతినిధులను కలుపుకొని ప్రచారం చేస్తే మరింత త్వరగా ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువ అవుతయాని వరుస కథనాల ద్వారా తెలియజేసింది. అయితే శంఖంలో పోస్తేనే తీర్ధం అయినట్టుగా.. ప్రభుత్వానికి సచివాలయాల్లో అందించే సేవలపై ప్రత్యేకంగా ప్రచారం చేయాలనే ఆలోచన రావడానికి మూడేళ్లు దాటిపోవాల్సి వచ్చింది. ఇప్పటికైనా ఒక పక్కా ప్రణాళికతో సేవలపై ప్రజలకు అవగాహన పెంచడంతోపాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సచివాలయాల్లో కంప్యూటర్ల సంఖ్య కూడా పెంచితే మరిన్ని ఫలితాలు వచ్చే అవకాశం వుంటుంది. లేదంటే అన్నిశాఖల భారం ఒక్క డిజిటల్ అసిస్టెంట్ పైనే ప్రస్తుతం పడుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళుతుందనేది తేలాల్సి వుంది..!