ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి దూరదృష్టి, ప్రత్యేక ప్రభుత్వశాఖ కల్పన అందరూ కేవలం ఉద్యోగాలు వస్తాయనే చూశారు. కానీ దానిఫలితం రాష్ట్రవ్యాప్తం గా పెను సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్రంలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖ సిబ్బంది చేయని సేవలు ఒక్క గ్రామ,వార్డు సచివాలయశాఖకు చెందిన లక్షా 35వేల మంది ఉద్యోగులు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ప్రభుత్వశాఖలోనైనా సదరుశాఖ సిబ్బంది వారి పనులు మాత్రమే చేస్తారు. కానీ అత్యంత తక్కువజీతం, అన్నిశాఖల పనులూ ఒక్క సచివాలయశాఖ సిబ్బందితో చేయించేవిధంగా ఈ ప్రత్యేక ప్రభుత్వ శాఖ ఏర్పాటు అయిందనే విషయం ఇపుడు ఇతర ప్రభుత్వశాఖల సిబ్బందికి ప్రత్యేకంగా అర్థమవుతోంది. ఒక్కో సచివాలయశాఖ ఉద్యోగి గ్రామస్థాయిలో 12నుంచి 20శాఖల విధులు, నగరపరిధిలో 19శాఖల సిబ్బంది 30శాఖల విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ప్రభుత్వంలోని ఏ శాఖ ఉద్యోగులు, సిబ్బంది సమ్మెచేసినా దాని ప్రభావం నేరుగా సచివాలయశాఖపైనే పడుతుండటం విశేషం. అంతేకాదు, ఆశాఖ సిబ్బంది పనులు కూడా గ్రామ, వార్డుసచివాలయశాఖ సిబ్బంది మాత్రమే చేయాల్సి వస్తుంది. అదనంగా చేసే పనులకు, విధులకు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి గానీ ప్రత్యేక గుర్తింపు ఏమీ రాకపోయినా, సమ్మెచేస్తున్న ఉద్యోగుల నుంచి మాత్రం తిట్లు, శాపనార్ధాలు, వేధింపులు అదనపు ప్రయోజనాలుగా వీరు స్వీకరించరించాల్సి వస్తోంది. గత 12రోజులుగా ఐసిడిఎస్ అంగన్ వాడీలు సమ్మె చేస్తుండటంతో, సదరు అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో తెరిపించి ప్రభుత్వం పనిచేయిస్తుంది. చంటి పిల్లల ఆకలి తీర్చడానికి వీరిని ప్రభుత్వం అదనపు సేవల కోసం వినియోగిస్తుంటే..సమ్మెచేస్తున్నవారు మాత్రం, ప్రభుత్వంపై తాము చూపించాలనుకున్న ఒత్తిడికి సచివాలయ ఉద్యోగులు అడ్డుగా ఉన్నారంటూ, తమ ఉసురుపోసుకొని నాశనం అయిపోతారంటూ వారి నుంచి వేధింపులు, తిట్లు, శాపనార్ధాలు పెడుతున్నారు.
అంతేకాదు ప్రభుత్వం అప్పగించిన బిఎల్వో విధులకు సైతం సచివాలయ ఉద్యోగులనే వినియోగిస్తూ, వారికి కల్పించాల్సిన సదుపాయాలు, స్టేషనరీ కూడా ఇవ్వకుండా పనులు చేయిస్తుండటంతో సచివాలయ ఉద్యోగులే వాటి ఖర్చు భరించాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా చేస్తున్న బిఎల్వో విధులకు సచివాలయ ఉద్యోగులకు బిల్లులు కూడా పెట్టడం లేదు రెవిన్యూశాఖ. అదనపు బత్యం మాట దేవుడెరుగు, రానూ పోనూ ఛార్జీలు, మాట్లాడితే మండల కార్యాలయంలో ప్రత్యేక సమావేశాలు, సొంత ఖర్చులతో స్టేషనరీ కొనుగోళ్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల వినియోగం, స్టేషనరీ ప్రింటింగ్ ఖర్చులు ఇలా అన్ని రకాలుగా సచివాలయ సిబ్బందికి ఒకరకంగా వాచిపోతున్నది. గతంలో సచివాలయశాఖ లేనపుడు బిఎల్వో విధులు ఐసిడిఎస్ సిబ్బంది చేపట్టేవారు. ఆ పనులు కాస్తా వీరికి అప్పగించారు. వాటితోపాటు, సచివాలయంలో ఏశాఖ సిబ్బంది లేకపోయినా ఉన్న సిబ్బందితోనే పనులన్నీ చేయిస్తోంది ప్రభుత్వం. అన్నీ భరించి అదనపు పనులు చేస్తున్నా.. కొందరు పంచాయతీ కార్యదర్శిల నుంచి చీత్కారాలు, చీదరింపులు, వేధింపులు తప్పడంలేదు ఉద్యోగులకు. అసలే గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటుతో చాలా ప్రభుత్వశాఖల అధికారులు, సిబ్బందికి గొంతులో పచ్చివెలక్కాయ్ పడటంతో వారి కసిని ఉద్యోగుల విధులపై మరో రకంగా తీర్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. ఉద్యోగులు శ్రమించి పనిచేస్తున్నా..పలు గ్రామ, గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేసే పంచాయతీకార్యదర్శిలు పెట్టేవేధింపులకు మహిళా ఉద్యోగులు కన్నీళ్లు పెట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉంటున్నాయంటే అతిశయోక్తి కాదు. వారు ప్రభుత్వం అప్పగించిన పనిచేయకపోగా, చేస్తున్నవారిని వారి నోటికొచ్చినట్టు తిడుతుండటం, అధికారులు, ప్రజాప్రతినిధుల ముందు చులకన చేసి మాట్లాడుతుండటం ఇపుడు చర్చనీయాంశం అవుతోంది. కొన్నిచోట్ల ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జోక్యం చేసుకొని పంచాయతీ కార్యదర్శిలకు వార్నింగ్ లు కూడా ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
రాష్ట్రంలోని 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అన్ని శాఖల్లోనూ సిబ్బందిని పూర్తిస్థాయిలో భర్తీచేయలేదు. దీనితో చాలా చోట్ల
కార్యదర్శి పోస్టులు, డిజిటల్ అసిస్టెంట్లు ఇలా సుమారు 19శాఖల్లో వివిధ శాఖల సిబ్బంది ఖాళీలు ఉండిపోయాయి. అయినప్పటికీ ఉద్యోగుల సామర్ధ్యాన్ని బట్టి
ప్రభుత్వం వీరితో అదనంగా పనుల చేయిస్తోంది. ఇప్పటికీ చాలా గ్రామ పంచాయతీలకు కార్యదర్శిలు లేకపోవడంతో ఒకే కార్యదర్శి రెండు మూడు పంచాయ తీలకు ఇన్చార్జిగా వ్యవహరిస్తూ అదనపు పనులు చేస్తున్నారు. ఆ సమయంలో సదరు పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా మహిళా సిబ్బందికి అత్యవసర
సమయంలో కూడా సెలవులు ఇవ్వడానికి వీరు ససేమిరా అంటున్నారు. ఉద్యోగుల సెలవులు సర్వీసు నిబంధనల ప్రకారం మంజూరుచేసినా, వీరి సెలవులేదో ఖర్చు అయిపోతున్నట్టు, వీరి జీతంలో డబ్బులు సిబ్బందికి జీతబత్యాలుగా ఇస్తున్నట్టుగా కొందరు పంచాయతీ కార్యదర్శిలు తెగఫీలైపోతూ సిబ్బందిపై తమ ప్రతాపాన్ని, పైత్యాన్ని చూపిస్తున్నారు. వాస్తవానికి ఈ సమస్య చాలా చోట్ల ఉన్నప్పటికీ ఉద్యోగులు బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. కొన్నిచోట్ల ఉద్యోగులు తెగించి ఏ ఎంపీడీఓకో, పర్యటనలకు వచ్చి ఏ డిఎల్డీఓనో, జిల్లా పంచాయతీ అధికారికో ఫిర్యాదు చేస్తే మరింతగా రెచ్చిపోతున్న పంచాయతీ కార్యదర్శిలు మరింతగా వేధించడం మొదలు పెడుతున్నారు. ఎంత పనిచేసినా, సమావేశాలు పెట్టి ప్రత్యేకంగా తిట్టి మానసికంగా కృంగదీస్తున్నారు. ఇలాంటి విధానాలతో చాలాచోట్ల ఉద్యోగులు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు. విశేషం ఏంటంటే ఇలాంటి వేధింపులు కేసు కాకినాడజిల్లాలోని ఎదురైతే అక్కడి పంచాయతీ సర్పంచ్ విషయాన్ని సదరు నియోజకవర్గ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనితో అప్పటికే సమావేశంలో ఉన్న ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఎంపీడీఓకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. ఆ అంశం జిల్లాలో చర్చనీయాంశం అయ్యింది కూడా. ఇలా సిబ్బందిని వేదిస్తే దానిప్రభావం ప్రభుత్వంపై పడుతుందని కూడా ఘాటుగానే సదరు ఎమ్మెల్యే అధికారులకు వార్నిగ్ ఇవ్వడం విశేషం.
ఇంతలా పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నేటికీ ప్రభుత్వం ద్వారా రావాల్సిన ప్రయోజనాలను మాత్రం పొందలేకపోతున్నారు. ఇప్పటికీ ఉద్యోగులందరికీ రెండేళ్ల సర్వీసు ప్రొబేషన్ తరువాత ఇవ్వాల్సిన రెండు ఇంక్రిమెంట్ల సంగతిపై ప్రభుత్వం నేటికీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇంకా కొన్ని శాఖల ఉద్యోగులకు సర్వీసు నిబంధనలు, ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. కేవలం ఒకటిరెండు శాఖల ఉద్యోగులకే పదోన్నతులు కల్పించి మిగిలిన శాఖల ఉద్యోగులను గాలికొదిలేశారు. ఇప్పటికీ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామన్న ఈశాఖకు కల్పించాల్సిన చట్టబద్దత కూడా నేటికీ చేయకపోవడం, రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగమని ఎన్నివేధింపులు, అదనపు బాధ్యతలు అప్పగించినా, బిఎల్వోలాంటి విధులు, సమ్మెచేస్తున్న సమయంలో అదనపుశాఖల విధులు చేస్తున్న సమయంలో చేతి చమురు వదిలిపోతున్నా అన్నీ భరించి ఉద్యోగాలు చేస్తున్నారు సచివాలయ ఉద్యోగులు. రాష్ట్రప్రభుత్వంలో ఏ అత్యవసర పనులు చేయాలన్నా అందరికీ కనిపిస్తున్నది ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖ మాత్రమే. దానికి కారణం కూడాలేకపోలేదు.. ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల్లో ఏశాఖలోనూ ఇంతమంది ఉద్యోగులు ఒకేచోట లేకపోవడమే. చాలా వరకూ ప్రభుత్వశాఖల్లో ఖాళీలు ఉండటం, కేడర్ ఉద్యోగులు లేకపోవడం, గ్రామ,వార్డు సచివాలయశాఖకు ఒక నిర్ధిష్ట ఉద్యోగ కేడర్(గ్రూపు-6, గ్రూపు-5, గ్రూపు-4 తదితర)లేకపోవడంతో ఏ పనికైనా మల్టీ టాస్కింగ్ డ్యూటీలకు వీరినే చక్కగా వినియోగించడానికి వీలుపడుతున్నది. పోనీ ఈశాఖలోని ఉద్యోగ సంఘాల నేతలైనా వీరి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతారా అంటే అదేలేదు. దీనితో సచివాలయ ఉద్యోగుల అదనపు విధుల బాధలు, తిట్లు, శాపనార్ధాలు, చీత్కారాలు, వేధింపుల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మండల స్థాయిలో ఎంపీడీఓలు, డివిజన్ స్థాయిలో డిఎల్డీఓలు, జిల్లా స్థాయిలో కలెక్టర్లు గ్రామ, వార్డు సచివాలయశాఖలోని వాస్తవ పరిస్థితిలను సమీక్షించకపోతే దీని ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పడే అవకాశాలున్నాయనే ప్రచారం జోరుగా సాగుతుంది. చూడాలి ఇప్పటికైనా ప్రభుత్వం సచివాయల ఉద్యోగుల అదనపు విధుల సేవలను గుర్తిస్తుందా? వీరికి ఇవ్వాల్సిన ప్రయోజనాలు ఇస్తుందా..? బకాయి పడ్డ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ అరియర్సు, డీఏలు ఇస్తుందా..?.ఉద్యోగులు ఎవరికీ చెప్పుకోలేక భరిస్తున్నవేధింపులు, చీత్కారాలు, చిరాకులు ప్రభుత్వం ప్రత్యేక చర్యల ద్వారా తెరదించుతుందా అనేది..!