ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనలో చీలికలు వస్తున్నాయా.. సివిల్ సర్వీస్ అధికారులు రెండు వర్గాలు చీలిపోతున్నారా.. అసలు వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానాలు ఎంత మంది సివిల్ సర్వీస్ అధికారులకు నచ్చుతున్నాయి.. మరెంత మందికి నచ్చడం లేదు.. ఈ కారణంతోనే కొంతమంది సివిల్ సర్వీస్ అధికారులు టిటిపీ అధినేత చంద్రబాబు నాయుడుని కలుస్తున్నారా..? ఇదే ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్..! ఏపీలో మునుపెన్నడూ లేని ఆర్ధిక సంక్షోభం రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో అటెండర్ల జీతాల నుంచి ఐఏఎస్ ల సౌకర్యాల వరకూ ప్రతీదీ తడుముకునే పరిస్థితి వస్తోందని..ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ భారం ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులపైనా పడుతుందని సివిల్ సర్వీస్ అధికారులు భావిస్తున్నారట. ఇప్పటికే ప్రభుత్వ సంక్షేమ పథకాల పేరిట నగదు బదిలీకి వేలాది కోట్ల రూపాయలు వెచ్చించడం.. ఆ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం కావడం వారంత ప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల అధికారులకు ఉద్యోగులు వచ్చి మొరపెట్టుకోవడం గత కొద్ది రోజులుగా జరుగుతూ వస్తోంది. అయితే ఈ విధానం నచ్చని కొందరు సివిల్ సర్వీస్ అధికారులు, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారు, వారిని అనుసరించే మరికొందరు చంద్రబాబుతో రహస్యంగ భేటి అయినట్టు చెబుతున్నారు.ప్రభుత్వంలోని ఆర్ధిక పరిస్థితి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు నుంచి పెరుగుతున్న నిరసన..త్వరలో జరగబోయే ఉద్యోగ విరమణలు, వారందరికీ చెల్లించాల్సిన సదుపాయాల ఆర్ధిక భారం ప్రభుత్వంపై చాలా గట్టిగా పడుతుందని..ఇలా అయితే ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోవడం చాలా కష్టం అవుతుందనే విషయాన్ని చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారట. అయితే అధికార ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్షపార్టీగా వున్న మాజీ ముఖ్యమంత్రి వద్దకు బ్యూరోక్రాట్లు ఎందుకు వెళుతున్నారనే విషయం, ప్రచారం ఇపుడు ఎవరికీ అంతు చిక్కకుండా ఉంది. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన సివిల్ సర్వీస్ అధికారులు చాలా మంది ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. అయితే అధికారపార్టీ సామాజిక వర్గానికి చెందిన వారంతా మంచి శాఖల్లో ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లుగా ఉండగా ప్రాధాన్యత లేని, ప్రజలతో అంతగా సంబంధంలేని శాఖలకు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన బ్యూరోక్రాట్లను బదిలీచేశారనే ఆవేదనను చంద్రబాబు ముందు
ఉంచినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా వారికి కాస్త సన్నిహితంగా వున్న మరికొందరు సివిల్ సర్వీస్ అధికారులు కూడా ప్రభుత్వంలోని తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్టుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రభుత్వంలో ఆర్ధిక సంక్షోభం, ఉద్యోగులు, అధికారులను కాదని కేవలం ప్రజల సంక్షేమం పేరిట నగదు బదిలీల చేస్తున్న విధానాలను కొందరు బ్యూరోక్రాట్లు వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది.
ప్రస్తుతం టిడిపి అధికారంలో లేదు..చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా కూడా లేదు.. అయినా బ్యూరోక్రాట్లు ఎందుకు వెళ్లి కలుస్తున్నారనే విషయంలో విశ్లేషకులు సైతం తలలు పట్టుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ కూడా బయటకు వచ్చింది ఒకే సమాజిక వర్గానికి చెందిన వారు, బంధుగణంలో ఉన్న బ్యూరోక్రాట్లు కలిసినపుడు ఈ విషయం బయటకు వచ్చిందా..లేదంటే నిజంగానే ప్రభుత్వ పరిపాలన గాడితప్పుతున్నదనే విషయాన్ని నేరుగా వాస్తవ పరిస్థితిని తెలియజేయడానికి చంద్రబాబు వద్దకు వెళుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ప్రాధాన్యత లేని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న బ్యూరోక్రాట్లు కొందరు కేంద్ర సర్వీసులకు వెళ్లిపోతున్నామనే విషయాన్ని చెప్పడానికి కూడా వెళుతున్నట్టుగా సమాచారం అందుతున్నది. ఇప్పటికే కొందరు బ్యూరోక్రాట్లు కేంద్ర సర్వీసులకు దరఖాస్తులు చేసుకోగా మరికొందరు అదేబాటలో ఉన్నారనే సంకేతాలు బయటకు వస్తున్నాయి. ఎక్కడైనా ప్రభుత్వాన్ని మంచి సూచనలు, సలహాలతో నడిపించేది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి సివిల్ సర్వీసు అధికారులే. అయితే వారి అంచనాలకు సైతం అందకుండా ఆర్ధిక భారాన్ని అప్పుల రూపంలోనూ, సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం మీదకు తీసుకువచ్చే క్రమంలో వాటిని ముందుండి నడిపించాల్సిన బ్యూరోక్రాట్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పనిచేస్తున్నందుకు మరికొందరు ఐఏఎస్ లు కోర్టు మెట్లు ఎక్కి శిక్షలు కూడా అనుభవించాల్సి వస్తున్నది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు. దీనితో ఈ తరహా విషయాలన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం ద్వారా బ్యూరోక్రాట్లు ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతున్నారనే సంకేతాలను ఇస్తున్నారా అనే అనుమానాన్ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి దారుణంగా పడిపోయి సమయానికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఆలస్యం కావడం, ప్రభుత్వ పథకాలకే అత్యధిక మొత్తం అప్పులు చేసి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టడం, వాటి విషయంలో పలు ప్రభుత్వశాఖలకు చెందిన ఐఏఎస్ లు మధ్యలో ఉండటం,ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు ఇవ్వకపోవడం, 2023లో పీఆర్సీ ఇస్తారో ఇవ్వని పరిస్థితి నెలకొనడం, సీపీఎస్ రద్దు చేయకపోవడం, వాటి స్థానంలో జీపిఎస్ ప్రవేశపెట్టడం, తాజాగా ఉద్యోగుల విరమణ వయస్సు మరో ఏడాది అంటే 63ఏళ్లకు పెంచాలని యోచించడం, ఉద్యోగుల హెచ్ఆర్ఏ, డిఏ లు కుదించడం, ఎన్నికల హామీల ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవ డం, వాటిపై ప్రభుత్వశాఖలకు భారీస్థాయిలో వినతులు రావడం, సోషల్ మీడియాలో బ్యూరోక్రాట్లపై తేడాగా ప్రచారం జరగడం, ఆదాయం వచ్చే మార్గాలను వదిలిపెట్టి.. ఆ భారాన్ని ప్రజలపై అధిక పన్నుల రూపంలో వసూలు చేయడం..కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను రెగ్యులర్ చేయకపోవడం, పదోన్నతులు కల్పించకపోవడం, బదిలీ లు చేపట్టకపోవడం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి నిత్యం బ్యూరోక్రాట్లకు వస్తున్న ఒత్తిడి, వారి మనసులో ఉద్యోగుల కోసం పట్టించుకోని ప్రభుత్వం, ఉన్నతాధి కారులుగా అమ్మనా బూతులు తిడుతున్న విషయాన్ని నేరుగా అధికాలు విని తీవ్రంగా మదన పడటం తదితర అంశాలను చంద్రబాబు ద్రష్టికి తీసుకెళితే రాజకీయంగా ఎదుర్కోవడానికి అవకాశం వుంటుందనే కోణంలో కూడా బ్యూరోక్రాట్లు కలుస్తున్నట్టు సమాచారం అందుతున్నది. నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వున్న సివిల్ సర్వీస్ అధికారులు ఒక వర్గంగా విడిపోతున్నారా అనే ప్రచారం మాత్రం రోజు రోజుకూ తీవ్రమైన చర్చకు దారితీస్తున్నది. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ, నిఘా వర్గాల సమాచారం పక్కాగా అందుతున్న సమయంలో ఈ తరహా ప్రచారాలను ప్రజలు కూడా ఆశక్తిగానే స్వీకరిస్తున్నారనేది తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి...!