రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 8, 9నజిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయం లో జిల్లాలోని డి.ఎస్.పి లు, సి.ఐ లతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ, కడప, ఇడుపులపాయ, పులివెందుల, బద్వేలు లలో సి.ఎం పర్యటన ఉంటుందన్నారు. బద్వేలు కు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. హెలిపాడ్, రూట్ బందోబస్త్, పబ్లిక్ మీటింగ్ వద్ద అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్ ను ఆదేశించారు. కడప నగరానికి సంబంధించి ఆర్ట్స్ కళాశాల మైదానం, మహావీర్ సర్కిల్, సి.పి బ్రౌన్ లైబ్రరీ, వై.ఎస్.రాజా రెడ్డి క్రికెట్ స్టేడియం వద్ద, రిమ్స్ హెలిప్యాడ్, కడప విమానాశ్రయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే పులివెందులలోని సి.ఎం పర్యటించే ప్రాంతాలు, ఇడుపులపాయ వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద, సి.ఎం నివాసం వద్ద చెక్ పోస్టు లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇడుపులపాయ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించి అణువణువూ క్షుణ్ణంగా జల్లెడ పట్టాలని ఆదేశించారు. పులివెందుల టౌన్ లో హెలిప్యాడ్, హెలిప్యాడ్ నుండి సి.ఎం వెళ్లే రూట్ మొత్తం బ్యారికేడ్లతో పాటు బస్ స్టాండ్ సర్కిల్, పూలంగళ్ల సర్కిల్ వద్ద, బహిరంగ సభాస్థలి వద్ద తగినంత బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సందులు, గల్లీల్లో పోలీసులను మొహరించాలని ఆదేశించారు. బాంబు డిస్పోజల్ టీం లు సి.ఎం పర్యటించే ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. డి.ఎఫ్.ఎం.డి (డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ ), హెచ్.హెచ్. ఎం.డి (హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ) లతో అందరినీ తనిఖీ చేసిన తర్వాతే అనుమతించాలన్నారు. సమావేశంలో ఎస్.బి డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పి రమణయ్య, మైదుకూరు డి.ఎస్.పి విజయ్ కుమార్, పులివెందుల డి.ఎస్.పి శ్రీనివాసులు, రాయచోటి డి.ఎస్.పి శ్రీధర్, జమ్మలమడుగు డి.ఎస్.పి నాగరాజు, రాజంపేట డి.ఎస్.పి శివభాస్కర్ రెడ్డి, ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్.పి చెంచుబాబు, ఎస్సి, ఎస్టీ సెల్ డి.ఎస్.పిలు సుధాకర్, రవికుమార్, సి.ఐ లు పాల్గొన్నారు.