రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్ధికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరు మండలం విప్పర్ల గ్రామంలో నాబార్డ్ – ఆర్ఐడిఎఫ్ రూ.7.25 కోట్ల నిధులతో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శంఖుస్థాపన చేసి శిలాఫలాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభకు పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకరరావు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేశ్ మాట్లాడుతూ 2009 లో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు అయిన తరువాత 360 మంది విద్యార్థులకు గాను 160 మంది మాత్రమే చదువు కొంటున్నారన్నారని అన్నారు. పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేక అరకొర వసతులతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల గదులలో నడుస్తుండటం బాధాకరామన్నారు. గతంలో పని చేసిన ప్రజా ప్రతినిధులు ఈ సమస్యపై కొంతైనా దృష్టి సారించి వుంటే పాలిటెక్నిక్ కళాశాలకు శాశ్వత భవనం సమకూరి వుండేదన్నారు. రెండు సంవత్సరాల కాలంలోనే విద్యార్డుల కలను నెరవేర్చే దిశగా పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానానికి కృషి చేసిన పెదకూరపాడు శాసన సభ్యులు శంకరరావును మంత్రి అభినందించారు. కేవలం 18 నెలల కాలంలోనే అన్ని సౌకర్యాలతో కూడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యేలా పక్కా ప్రణాళికతో అధికారులు పని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో నూతన భవనంలో వృత్తివిద్యా కోర్సులను కూడా ప్రవేశపెడతామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి సంక్షేమ పధకాలను అమలు చేసి అక్కచెల్లమ్మల కుటుంబాలలో తోబుట్టువుగా మారిపోయారన్నారు. రాష్ట్రంలో నాడు - నేడు ద్వారా జరుగుతున్న పాఠశాలల అభివృద్ధిని పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ కేబినేట్ కమిటీ ఆమోదించి అమలు చేసే ఆలోచనలో ఉందంటే ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల పనితీరును రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. రూ.7.25 కోట్ల రూపాయలతో నిర్మించబోతున్న ఈ పాలిటెక్నిక్ కళాశాల భవనానికి భవిష్యత్ అవసరాల దృష్ట్యా కావలసిన నిధులు మంజూరు చేసి, అక్కడే అదనపు భవనాలను నిర్మించి రాష్ట్రంలోనే ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాలగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు.
నరసారావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ పల్నాడు ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం సమకూరడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకరరావు ల ఫలితం అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకు తగిన ప్రాధాన్యత కల్పిస్తున్నారనడానికి అమ్మ ఒడి, విద్యా వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద, నాడు – నేడు పధకాల ద్వారా చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల అభివృద్దే ఉదాహరణ అన్నారు. కరోనా విపత్కర పరిస్థితులల్లో కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని సరిదిద్ది పౌష్టికాహారం అందించేందుకు అమ్మ ఒడి ఉపయోగపడిందన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 360 మందికి గాను 160 మంది విద్యార్దులు చదువుతున్నారని, తగినంత మంది అధ్యాపకులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. దీంతో పాటు పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్డుల శాతాన్ని పెంచేందుకు ఇక్కడే వసతి గృహాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదిమూలపు సురేశ్ ను కోరారు..
పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకరరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో పెను మార్పులను తీసుకువచ్చి విద్యా పట్ల తమకున్న అంకితభావాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చాటిచెప్పారని అన్నారు. శ్రీ కృష్ణార్జునుల అనుబంధాన్ని గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను విద్యా శాఖ మంత్రి తూ.చా తప్పకుండా అమలు చేస్తున్నారని నంబురు శంకరరావు కొనియాడారు. రూ. 7.25 కోట్లతో క్రోసూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ను నిర్మిస్తున్నామన్నారు. పద్దెనిమిది నెలల్లోనే భవన నిర్మాణాన్ని అన్ని వసతులతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు.
సత్తెనపల్లి శాసన సభ్యులు అంబటి రాంబాబు మాట్లాడుతూ గత పది సంవత్సరాలు గా మరుగున పడిన పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణం కొరకు శాసన సభ్యులు నంబూరు శంకరరావు చేసిన కృషి అభినందనీయమన్నారు. రాష్ట్రంలో 33 శాతంగా ఉన్న నిరక్షరాస్యతను సున్నా శాతానికి తీసుకొచ్చే విధంగా పిల్లల చదువుల కొరకు అమ్మఒడి వంటి పథకం ప్రారంభించిన ఘనత కేవలం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు సొంత ఇంటి కలను నెరవేర్చే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ళు పధకం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలలో వెలుగులు నింపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు.
సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ) ఏ.ఎస్. దినేష్ కుమార్ మాట్లాడుతూ క్రోసూరు పరిధిలోని విప్పర్ల గ్రామం వద్ద పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకర రావు చొరవతోనే 4.50 ఎకరాల స్థలంలో పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనాన్ని నిర్మించేందుకు అవకాశం కల్పించగలిగామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంజనీరింగ్ విద్య కన్నా రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ది చెందేందుకు నైపుణ్యం కలిగిన యువతను తయారు చేసుకోవలసిన ఆవశ్యకతను గుర్తు చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్నత విద్యకు తగిన ప్రాధాన్యత కల్పించేందుకు పాలిటెక్నిక్ కళాశాల భవన నిర్మాణానికి అవసరమైన భూమిని పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకర రావు స్థానిక రైతులతో మాట్లాడి భూమిని సేకరించి విద్య శాఖకు అందించడం జరిగిందన్నారు.
సంయుక్త కలెక్టర్ ( సచివాలయాలు, అభివృద్ది ) పి. ప్రశాంతి మాట్లాడుతూ గత రెండేళ్లుగా పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం లేదన్న విషయాన్ని పెదకూరపాడు శాసన సభ్యులు నంబురు శంకర రావు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యా వ్యవస్థను దారిలో పెట్టేందుకు విద్యా శాఖ మంత్రి కృషి చేస్తున్నారన్నారు. వీరిద్దరి చొరవతో క్రోసూరు పాలిటెక్నిక్ కళాశాలకు సొంత భవనం నిర్మించుకోవడానికి అవకాశం కలిగిందన్నారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పుల వలన విద్యార్డులకు నేరుగా ఇంటికే పాఠ్య పుస్తకాల పంపిణీ, నాడు – నేడు పధకం ద్వారా పాఠశాల అభివృద్ది, పిల్లల ఆరోగ్య పరిరక్షణనకు పౌష్టికాహారం వంటి కార్యక్రమాలను విద్యాశాఖ ద్వారా ప్రభుత్వమే నిర్వహిస్తున్నదన్నారు. ఒక్క జిల్లాలోనే రెండు మెడికల్ కళాశాలలు రావడం ఎంతో కష్టతరమైనప్పటికీ ముఖ్యమంత్రి చొరవతో వాటికి శంఖుస్థాపన చేసి పనులు ప్రారంభించారన్నారు. జిల్లాలో మూడు పాలిటెక్నిక్ కళాశాలలు వుంటే గుంటూరు లో రెండు, క్రోసూరులో ఒకటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కార్యక్రమంలో విద్య శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ పద్మారావు, ఏ.పి.ఎస్.డబ్ల్యూ.ఐ.డి.సి ఈ.ఈ కరుణాకర్ రెడ్డి, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కే.వి. రమణ రావు, క్రోసూరు మండల తహశీల్దారు, యంపీడీఓ, క్రోసూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ వెంపా జ్వాలా లక్ష్మీ నరసింహారావు, విప్పర్ల గ్రామ సర్పంచ్ నర్రా శేషయ్య, క్రోసూరు ఉప సర్పంచ్ షేక్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.