విజయనగరం జిల్లాలో ఉపాధి హామీ మెటీరియల్ నిధులతో చేపట్టిన కన్వర్జెన్స్ పనుల నిర్వహణలో వున్న సమస్యల పరిష్కారానికి తాను ప్రయత్నిస్తానని, క్షేత్రస్థాయిలో ఆయా పనులు ముమ్మరంగా జరిపించి పూర్తిచేయించేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాలో ఉపాధి నిధులతో కన్వర్జెన్స్ పనులను పెద్ద ఎత్తున చేపట్టినందున వాటిని నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాల్సి వుందన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్, జాయింట్ కలెక్టర్లు డా.కిషోర్ కుమార్, జె.వెంకటరావు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, గనులశాఖ అధికారులతో శనివారం సమావేశమై ఈ పనుల నిర్వహణలో వున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఇటీవల నిర్వహించిన స్పందన వీడియో కాన్ఫరెన్సులో జిల్లాలో ఉపాధి కన్వర్జెన్సు పనులు మరింత వేగవంతం కావలసిన అవసరాన్ని తెలియజేసిన దృష్ట్యా ఈ మేరకు అధికారులతో సమావేశమై పనులను త్వరగా పూర్తిచేయడంపై దృష్టిసారించారు. జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ ఉపాధి పనులపై అధికారులు దృష్టి సారించి రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించుకొని పురోగతిని సమీక్షించుకుంటేనే ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో పనులు నిర్వహించగలమని చెప్పారు.
జిల్లాలో ఇప్పటివరకు చేపట్టిన కన్వర్జెన్సు పనులకు గాను రూ.65 కోట్ల మేరకు బిల్లులు చెల్లించాల్సి వుందని ఈ మేరకు నిధులు విడుదలైతే పనులు మరింత వేగవంతం అయ్యే అవకాశం వుందని కలెక్టర్ చెప్పారు. ఈ సందర్భంగా సచివాలయాల భవన నిర్మాణాలు, ఇతర భవనాలు ఏ స్థాయిలో ఉన్నదీ జాయింట్ కలెక్టర్(ఆసరా) వెంకటరావు వివరించారు. భవన నిర్మాణ గుత్తేదారు నిర్ణయం కాక 15 పనులు వరకు ప్రారంభం కాకుండా వున్నాయని జె.సి. వివరించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా వివిధ నియోజకవర్గాల పరిధిలో ఈ సమస్యతో పనులు మొదలుకాని జాబితాను మంత్రికి సమర్పించారు. దీనిపై మంత్రి వెంటనే బొబ్బిలి, నెల్లిమర్ల శాసనసభ్యులకు ఫోన్ చేసి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని లేని పక్షంలో వాటిని రద్దుచేసే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈనెల 20వ తేదీలోగా ఆయా పనులను అప్పగించేందుకు చర్యలు చేపడతామని సంబంధిత ఎమ్మెల్యేలు మంత్రికి తెలిపారు. ఉపాధి కన్వర్జెన్సు పనులకు బిల్లు బకాయిలపై ప్రభుత్వంలో మాట్లాడి వెంటనే విడుదల చేయించేందుకు చర్యలు చేపడతామని మంత్రి తెలిపారు. ఇసుక సరఫరా సమస్యలకు సంబంధించి జిల్లాలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు గుర్తించిన మంత్రి ఏ.పి.ఖనిజాభివృద్ధి సంస్థ ఎం.డి. హరినారాయణ్‌తో ఫోనులో మాట్లాడి సోమవారం కల్లా జిల్లాకు శాండ్ ఆఫీసర్, సహాయ శాండ్ ఆఫీసర్లను నియమించాలని కోరారు. తెర్లాం మండలం కుసుమూరులో ఇసుక లభ్యత వున్నందున అక్కడ ఇసుక రీచ్‌కు వెళ్లడంలో ఏమైనా ఇబ్బందులు వున్నదీ లేనిదీ సబ్ కలెక్టర్ ద్వారా తనిఖీ చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. ఏజెన్సీ ప్రాంతంలోని కొండపై వున్న గ్రామాల్లో భవనాల నిర్మాణంకోసం అదనపు నిధులు మంజూరు చేసేలా గిరిజన సంక్షేమశాఖ అధికారులతో మాట్లాడతానన్నారు. ఆరోగ్య కేంద్రాలకు రూ.17.50 లక్షలు మాత్రమే అంచనా వ్యయంగా పేర్కొన్నారని, వాస్తవానికి రూ.22 లక్షల వరకు ఖర్చవుతోందని పంచాయతీరాజ్ ఎస్.ఇ. గుప్తా వివరించారు. వీటిపై కూడా అంచనాలు పెంచాల్సి వుందన్నారు.
సమావేశంలో గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు మజ్జి శ్రీనివాసరావు, గృహనిర్మాణ శాఖ పి.డి. ఎస్.వి.రమణమూర్తి, గ్రామీణ నీటిసరఫరా ఎస్.ఇ. పి.రవి, ఆర్.డి.ఓ. భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మొదటి విడత కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం శనివారం ప్రారంభం అయింది. జిల్లాలో ఏర్పాటు చేసిన 18 వాక్సినేషన్ కేంద్రాల్లో కార్యక్రమం ప్రారంభం అయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన క్రిష్ణ దాస్, రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వాక్సినేషన్ కార్యక్రమంను లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది బి.ఉషారాణి మొదటి వాక్సిన్ డోస్ ను తీసుకున్నారు. వాక్సినేషన్ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్రమోడి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాన్ని ఆన్ లైన్ ద్వారా ప్రదర్శించారు. ప్రధాని నరేంద్రమోడి మాట్లాడుతూ దేశంలో పెద్ద వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం అవుతోందన్నారు. వాక్సినేషన్ తయారీ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలకు, వారి వైజ్ఞానిక దక్షతకు అభినందించారు. వాక్సినేషన్ కార్యక్రమం జరిగిన 30 రోజుల తరువాత కరోనా వైరస్ ను ఎదుర్కొనే సామర్ధ్యం శరీరానికి కలుగుతుందని పేర్కొన్నారు. అప్పటి వరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచు కోవాలని పిలుపునిచ్చారు. దేశంలో మొదటి విడతలో 3 కోట్ల మందికి, రెండవ విడతలో 30 కోట్ల మందికి వాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. వాక్సిన్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఖర్చుతో తయారు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అనే మాటలను గుర్తుచేశారు.
జిల్లాకు పూణే సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్ 2,650 కోవిడ్ వ్యాక్సిన్లు రాగా వాటిని 26,500 మందికి వేసేందుకు అవకాశం ఉంది. అయితే మొదట విడతలో ఆరోగ్య సిబ్బందికి మాత్రమే నిర్ధేశించిన సంగతి అందరికి విదితమే. ఇప్పటి వరకు 21,943 మంది ఆరోగ్య సిబ్బంది నమోదు అయ్యారు. మొదటి విడత వాక్సినేషన్ కార్యక్రమంలో గర్భిణీలు, బాలింతలను మినహాయించారు. ప్రతి కోవిడ్ వాక్సినేషన్ కేంద్రం వద్ద వ్యాక్సినేషన్ చేయు బృందంలో మహిళ పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, వాక్సినేషన్ అధికారి, అంగన్వాడికార్యకర్త, ఆషా కార్యకర్త సభ్యులుగా బృందాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి వ్యాక్సినేషన్ కేంద్రానికి ఒక వైద్యాధికారిని నిర్వహణాదికారిగా నియమించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ కోవిడ్ నివారణకు వాక్సినేషన్ రావడం ముదావహమన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడి, రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి మంచి చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. మొదటి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు. మొదటి డోస్ అనంతరం 28 రోజులకు రెండవ డోస్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాక్సినేషన్ మంచి కార్యక్రమం అని కరోనా మహమ్మారి నుండి రక్షణ కవచమని చెప్పారు.
రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం మాట్లాడుతూ దేశం గర్వించదగిన రోజు అన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందంజలో ఉందని చెప్పడానికి వాక్సిన్ తయారీ కార్యక్రమం గొప్ప ఉదాహరణ అన్నారు. కరోనా కట్టడికి దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందని, అనేక చర్యలు చేపట్టిందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావు, జిల్లా కలెక్టర్ జె నివాస్, వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, అదనపు ఎస్.పి పి.సోమశేఖర్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవి కుమార్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.ఏ.కృష్ణ మూర్తి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.ఏ.కృష్ణ వేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్, అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్. భారతీ కుమారి దేవి, డిటిటి పి.ఓ డా.జె.కృష్ణమోహన్., మునిసిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి, రిమ్స్ హెచ్.డి.ఎస్ సభ్యులు వరుదు విజయ కుమార్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు నటుకుల మోహన్, దేవ భూషణ్ రావు., ప్రకాష్, రమేష్., వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లాలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. శనివారం ఉదయం అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి) డా.ఏ. సిరి, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తదితరులు ప్రారంభించారు. ముందుగా ఉదయం 10:30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సందేశం అందించిన అనంతరం కోవిడ్ వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో మొట్టమొదటి కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ను డిఎంహెచ్ఓ ఆఫీస్ లో ఫీల్డ్ వర్కర్ గా పనిచేస్తున్న శ్రీవల్లి వేయించుకోగా, ఆమెకు హెల్త్ సూపర్ వైజర్ విజయకుమారి వ్యాక్సిన్ వేశారు. జిల్లాలో 26 సెషన్ సైట్లలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్ (గ్రా,వా,స మరియు అభివృద్ధి) డా.ఏ. సిరి పేర్కొన్నారు. ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న కోవిడ్ వ్యాక్సినేషన్ జిల్లాలో ప్రారంభమైందని, సీరం ఇన్స్టిట్యూట్ వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ జిల్లాకు 35,500 డోసులు వచ్చాయన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ కు సంబంధించి కోల్డ్ చైన్ సిస్టం పాటించడం, భద్రత ఏర్పాటు చేయడం, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని రకాల కట్టుదిట్టమైన భద్రత లతో వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 26 సెషన్ సైట్లలో ఒక్కో సైట్ లో 100 మంది కి ప్రతిరోజు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తయారుచేసిన కోవిన్ సాఫ్ట్వేర్ లో మొత్తం సెషన్ సైట్ లను క్రియేట్ చేయడం, వ్యాక్సినేషన్ ఆఫీసర్ ల వివరాలు నమోదు చేయడం చేశామన్నారు. వ్యాక్సినేషన్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందన్నారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక్కో సెషన్ సైట్ కి మూడు రూములు ఉంటాయన్నారు. మొదటిది వెయిటింగ్ రూమ్ అని, రెండవది వ్యాక్సినేషన్ రూమ్, తర్వాత అబ్జర్వేషన్ రూములు ఉంటాయన్నారు. జిల్లాలో ఒక్కో సెషన్ సైట్ కి ఐదుగురు అధికారులు పని చేస్తున్నారన్నారు. మొదటి వ్యాక్సినేషన్ ఆఫీసర్ మహిళా పోలీస్ అని ( ఐడీ కార్డు చూసి లోపలికి పంపించడం), తర్వాత డిజిటల్ అసిస్టెంట్ ఐడి కార్డు ఉందా లేదా అని చెక్ చేసి డేటా కరెక్ట్ గా ఉందా లేదా అని చూస్తారన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ రూమ్ కి వెళ్లిన వారికి వ్యాక్సినేషన్ ఇస్తారని, తర్వాత వారిని అబ్జర్వేషన్లో ఏదైనా రియాక్షన్ లు ఉన్నాయా అని పరిశీలన చేస్తారన్నారు. అనంతరం వ్యాక్సింగ్ తీసుకున్న వారిని బయటకు పంపిస్తారన్నారు. కోవిషీల్డ్ వారు తయారుచేసిన వ్యాక్సిన్ వేసుకున్నవారు మళ్ళీ 28వ రోజు రెండవసారి వ్యాక్సిన్ వేసుకోవాలని, మొదటి డోస్ వేసుకున్న వారు 2వ డోస్ కూడా అదే కంపెనీకి చెందిన వ్యాక్సిన్ ను ఖచ్చితంగా వేసుకోవాలన్నారు. రెండవ డోస్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి 15 రోజుల అనంతరం ( మొదటి డోస్ వేసుకున్న 42 రోజుల అనంతరం) యాంటీబాడీస్ వస్తాయన్నారు. అప్పటి వరకూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా సూచించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఎస్ఎంఎస్ ల ద్వారా ఏ రోజు, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ ను వేసుకున్నారు అనే వివరాలను పంపుతామన్నారు.
మొదటి విడతలో భాగంగా హెల్త్ వర్కర్లకు, అంగన్వాడీ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని, రెండవ విడతలో శానిటేషన్ వర్కర్లు, పంచాయతీ, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండవ విడతలో వ్యాక్సిన్ తీసుకొనే వారి వివరాలు, సెషన్ సైట్ ల వివరాలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు సంబంధించి అధికారులకు ఇవ్వాల్సిన శిక్షణ కూడా పూర్తయిందన్నారు. మొదటి విడతలో వ్యాక్సిన్ రియాక్షన్ పెద్దగా ఏమీ లేదని, చాలా చిన్న స్థాయి రియాక్షన్ వచ్చినా కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. గర్భవతులు, పిల్లలకు పాలిస్తున్న తల్లులూ, 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ తర్వాత 50 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు, అనంతరం ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా తక్కువ సమయంలో కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తీసుకువచ్చిన శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, కరోనా కట్టడి కోసం సిద్ధం చేసిన వ్యాక్సిన్ చాలా నమ్మకమైనదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 42 రోజుల అనంతరం వారి శరీరంలో యాంటీబాడీలు అభివృద్ధి చెందుతాయని, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావాలన్నారు. వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నదీమ్, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కోవిడ్ 19 వ్యాక్సినేషన్ తో ప్రపంచ మానవాళికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైందని, మొదటగా శ్రీ వల్లి అనే ఫీల్డ్ వర్కర్ కి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయడం అనేది చాలా పెద్ద ప్రక్రియ అని, ఇది దేశవ్యాప్తంగా జరుగుతోందన్నారు. కరోనా వల్ల మంది మృత్యువాత పడ్డారని, కరానా లాంటి కష్ట సమయంలో వైద్య సిబ్బంది తమ ప్రాణాలను, ఆరోగ్యాన్ని పణంగా పెట్టి సేవలు అందించారన్నారు. అందుకోసం మొదటిగా హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయడం జరుగుతోందని, రెండో విడతలో పోలీసు, రెవెన్యూ సిబ్బందికి, మూడవ విడతలో ప్రజలకు వ్యాక్సిన్ వేయడం జరుగుతుందన్నారు. వ్యాక్సినేషన్ రావడం అనేది కరోనాపై మానవాళి విజయం అన్నారు. ప్రపంచంలోనే మానవాళికి వ్యాక్సిన్ అనేది ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి దోహదం చేస్తుందన్నారు. మొదటిసారి వ్యాక్సిన్ వేసుకున్న వారు 25 రోజుల తర్వాత రెండవ డోసు కూడా ప్రతి ఒక్కరు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న 42 రోజుల వరకు ప్రతి ఒక్కరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వారు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఇది ఎంతో సురక్షితమైన వ్యాక్సిన్ అన్నారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ అభివృద్ధికి కృషి చేసిన శాస్త్రవేత్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.నదీమ్, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విశాఖ జిల్లాకు 46 వేల 500 డోసులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలో చినవాల్తేరులోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్-19 నివారణకు కోవిషీల్డ్ టీకాను ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ ఈ టీకాను ఈ నెల 16వ తేది నుండి మొదటి దశ ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. జిల్లాకు 46 వేల 500 డోసులు వచ్చినట్లు తెలిపారు. ఈ డోసులను జిల్లాలో 32 సైట్స్ (సెషన్స్) ద్వారా మొదటి దశలో ఆశా కార్యకర్తలు, కమ్యూనిటీ హెల్త్ కేర్ వర్కర్లు, తదితరులు ఉన్నట్లు ఆయన వివరించారు. రెండవ దశలో రెవెన్యూ, పోలీసు, మున్సిపల్, పంచాయితీ ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఉంటుందన్నారు. మొదటి దశలో 5 రోజులు వరకు పరిమితంగా వ్యాక్సినేషన్ జరుగుతుందని చెప్పారు. రెండవ డోసు 28 రోజులకు ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ వేసుకున్నా జాగ్రత్తలు (మాస్క్ ధరించడం, దూరం పాటించడం, శానిటైజర్ వినియోగం వంటివి) తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లాలో మరో 221 కేంద్రాలు (సైట్స్)ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఇందులో పి.హెచ్.సి.లు, సి.హెచ్.సి.లు, టీచింగ్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, తదితరమైనవి గుర్తించినట్లు చెప్పారు. ఈ నెల 20వ తేదీ తర్వాత మిగతా సైట్స్ లో టీకాలు వేయడం జరుగుతుందన్నారు. అన్ని కేంద్రాల వద్ద రిఫ్రిజిరేటర్లు, లబ్దిదారులు వేచియుండు గది, టీకా వేయుగది, పరిశీలన గది ఉంటాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి రోజు గరిష్టంగా వంద మంది వరకు టీకాలు వేయడం జరుగుతుందని, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఎలర్జీవంటివి ఏవైనా ఉన్నాయని ముందుగానే అడిగి తెలుసుకుంటారని, కాంట్రా ఏడ్వర్స్ ఉన్నవారికి టీకా ఇవ్వడం జరగదన్నారు. జిల్లాలో 15 శాసన సభ నియోజక వర్గాలు ఉండగా ఇందులో పట్టణ పరిధిలో 5, గ్రామీణ ప్రాంతంలో 10 ఉన్నాయని, ఆయా నియోజక వర్గాలలో ప్రత్యేక అధికారులుగా ప్రస్తుతం ఉన్నవారినే కొనసాగిస్తున్నట్లు ఆయన వివరించారు. పట్టణ పరిధిలో జివియంసి కమీషనర్, ఏజెన్సీ పరిధిలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, గ్రామీణ పరిధిలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తారని చెప్పారు. కమ్యూనిటీ హెల్త్ కేంద్రాలలో ఎ.ఇ.ఎఫ్. కమిటీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. తూర్పు నావికా దళాలకు 1170 డోసులు పంపడమైనదని పేర్కొన్నారు. కోవిన్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు. నగర పోలీసు కమీషనర్, ఎస్.పి.లతో గత మూడు రోజులుగా కోవిషీల్డ్ టీకా సెక్యూరిటీ గూర్చి చర్చించడమైనదని తెలిపారు. జిల్లా స్థాయిలో కంట్రోల్ రూం నంబర్ 104 ఉంటుందని, సమస్యలు ఉంటే 104 కు ఫోన్ చేసి తెలియజేయాలని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మోస్ట్ ఎఫెక్టెడ్ వారికి వ్యాక్సిన్ అందించడం జరుగుతుందన్నారు. మూడవ దశలో 50 సంవత్సరాలు దాటిన వారికి, దీర్ఝకాలిక సమస్యలతో బాధపడుతున్న50 సంవత్సరాలు లోపల వారికి వ్యాక్సినేషన్ ఉంటుందని చెప్పారు.
ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ మాట్లాడుతూ టీకా తీసుకున్నానని, జ్వరం, నొప్పి, తదితరమైనవి వచ్చినా గాభరా పడాల్సిన పనిలేదని చెప్పారు. టీకా వేసిన తర్వాత 30 నిమిషాలు గదిలో పరిశీలనలో ఉండాలన్నారు. రెండవ డోసు తీసుకున్న తర్వాత వ్యాధి నిరోధక శక్తి శరీరంలో పెరగడం మొదలవుతుందని, గతంలో ఎలర్జీ ఉందా లేదా అని ముందుగానే అడిగి వ్యాక్సిన్ ఇస్తారని తెలిపారు.
జిల్లాలో మొదటి టీకాను చిన వాల్తేరులోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన ఆశా కార్యకర్త ఎస్. సాయిలక్ష్మికి వేశారు. రెండవ టీకాను ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్ కు వేశారు.
అంతకు ముందు కోవిడ్-19 నివారణకు కోవిషీల్డ్ టీకా వేయడమనేది ప్రపంచంలోనే అతి పెద్ద కార్యక్రమని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడి తెలిపారు. శనివారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కోవిషీల్డ్ టీకా ప్రారంభ ప్రక్రియను వర్చువల్ విధానంలో ఆయన ప్రారంభించారు. ప్రపంచమంతా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తోందని, చాలా తక్కువ సమయంలో కరోనా వ్యాక్సిన్ వచ్చిందన్నారు. శాస్త్రవేత్తల కృషిఫలితంగా రెండు దేశీయ టీకాలు వచ్చాయని, శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడి వ్యాక్సిన్లు తయారు చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఎన్నో సవాళ్ల మధ్య వ్యాక్సిన్ వచ్చిందని చెప్పారు. మొదటగా వ్యాక్సిన్ పొందడానికి ఆరోగ్య సిబ్బంది అర్హులని, ఆ తర్వాత పారిశుధ్ద్య సిబ్బందికి ఇస్తామన్నారు. ఆ తర్వాత సైనికులు, మిగిలిన వారికి ఇస్తామని తెలిపారు. చినవాల్తేరులోని పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి నిర్వహించిన వీడియో కాన్ప్ రెన్స్ లో జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్, జిల్లా జాయింట్ కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఆంధ్రా మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా. పి.వి. సుధాకర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. సూర్యనారాయణ, సియంఓ డా. శాస్త్రి, జివియంసి జోనల్ కమీషనర్ సన్యాసినాయుడు, యుసిడి పిడి శ్రీనివాసరావు, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ ధవళ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియకు మున్సిపల్ కమీషనర్లు, సబ్ కలెక్టర్ , ఆర్డిఓలు సిద్దంగా ఉండాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్దంచేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వాక్సినేషన్ పై ఐటిడిఎ పిఓ, నర్సీపట్నం సబ్ కలెక్టర్, జిల్లాలోని రెవెన్యూ డివిజనల్ అధికారులతోను, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్-19 వాక్సినేషన్ కు అత్యంత సమర్థవంతంగా ఏర్పాట్లను గావించాలన్నారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లైన ఆశాలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు, ఎఎన్ఎంలు, వైద్యాధికారులు, పారామెడికల్ సిబ్బంది, కమ్యూనిటీ హెల్త్ ఎక్స్ టెన్షన్ అధికారులు, ఫార్మాసిస్టులు, నర్సులు, హెల్త్ అసిస్టెంటులు, పరిపాలనా సిబ్బంది, పారిశుద్య కార్మికులు, ఆంబులెన్స్ డ్రైవర్లు, మొదలగు ఆసుపత్రులలో పనిచేయు ప్రతి ఉద్యోగికి మొదటి దశలోనే వ్యాక్సినేషన్ గావించడం జరగాలన్నారు.
రెండవ దశలో రెవెన్యూ, పంచాయితీరాజ్, పోలీసు శాఖ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు వాక్సినేషన్ గావించడం జరుగుతుందని పేర్కొన్నారు. మొదటి దశ మరియు 2వ దశలలో వాక్సినేషన్ గావించు సిబ్బంది పేర్లు, వివరాలకు సంబంధించిన డాటా ఎంట్రీ ప్రక్రియను ఎటువంటి పొరపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. వాక్సినేషన్ ప్రక్రియకు సిబ్బంది అందరిని మరియు సచివాలయాల సిబ్బంది సేవలను వినియోగించుకోవాలన్నారు. వాక్సినేషన్ ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేసుసుకోవాని చెప్పారు. ప్రతి వాక్సినేషన్ సెట్ కు, దగ్గరలోని పిహెచ్ సి, ఎమర్జెన్సీ కేర్ హాస్పిటల్ గా గుర్తించాలన్నారు. ఆంబులెన్స్ ను సిద్దంగా ఉంచాలని చెప్పారు.
ఈ సమావేశంలో జివియంసి కమీషనర్ జి. సృజన, జిల్లా జాయింట్ కలెక్టర్లు వేణుగోపాల్ రెడ్డి, పి. అరుణ్ బాబు, డిఆర్ఒ ఎ. ప్రసాద్, ఆర్డిఓ పెంచల కిషోర్, డిఎంహెచ్ఓ సూర్యనారాయణ, జడ్పి సిఇఓ నాగార్జున సాగర్, జిల్లా పంచాయితీ అధికారి కృష్ణకుమారి, ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ దవళ భాస్కరరావు మరియు వీడియో కాన్ఫరెన్స ద్వారా ఐటిడిఎ పిఓ ఎస్. వెంకటేశ్వర్, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య, అనకాపల్లి, పాడేరు ఆర్డిఓలు సీతారామారావు, శివజ్యోతి, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
పాత్రికేయలు విలువలు కోల్పోకుండా నిజాయితీతో వార్తలు రాయాలని,సమాజంలో ఉన్నతంగా చూసేది జర్నలిస్టులనేనని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. విశాఖలో ఆదివారం జర్నలిస్ట్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్(జాప్) 14 వ ద్వైవార్షిక సమావేశం రాష్ట్ర స్థాయి విశాఖ యూనిట్ ఉపాధ్యక్షుడు కే.ఎమ్.కీర్తన్ ఆధ్వర్యంలో వెబినార్ ద్వారా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా గవర్నర్ దత్తాత్రేయ పాల్గొని జాప్ సభ్యులందరికీ పలు సూచనలు చేశారు. ఎన్నికల అధికారి,ఎన్ యూ జె ఉపాధ్యక్షుడు ఎన్.నాగేశ్వర రావు జాప్ నూతన రాష్ట్ర వర్గ కార్యవర్గాన్ని ప్రకటించి,సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఎన్ యూ జె అధ్యక్షుడు,ప్రధాన కార్యదర్శి కూడా వెబినార్ ద్వారా సమావేశంలో పాల్గొని కొత్తగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గానికి అభినందనలు తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ లో జాప్ కు అన్నివిధాలా అందదండ లందిస్తాయని హామీ ఇచ్చారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ మాట్లాడుతూ, యూనియన్ సభ్యులకు అన్నివిధాలా న్యాయంజరిగేలా పోరాడతామన్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన రవీంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా జాప్ పటిష్ఠతకు కృషిచేస్తానన్నారు. జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగకుండా నిరంతరం పోరాటం చేస్తానన్నారు. నూతన కార్యదర్శి బి.ఎస్.ఎస్.శశి మాట్లాడుతూ, జాప్ సబ్యులకు న్యాయంజరిగేలా అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతామన్నారు. ముఖ్యంగా అక్రిడిటేషన్లపై అధికారులతో చర్చించి అర్హులైన వారందరికీ అక్రిడిటేషన్లు మంజూరు జరిగేలా కృషిచేస్తామన్నారు. ఎంతోకాలంగా ప్రభుత్వాలు హామీ ఇచ్చిన ఇళ్ల స్థలాలపైకూడా పోరాడతామన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన జాప్ తెలంగాణ శాఖ ఉపాధ్యక్షుడు రమణ రావు మాట్లాడుతూ, జరలిస్టులపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నతీరు సరికాదన్నారు. శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు. విశాఖ యూనిట్ ఉపాధ్యక్షుడు కీర్తన్ మాట్లాడుతూ, ఉప్పల లక్ష్మణ్ మార్గదర్శ కత్వంలో,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శశి, కార్యనిర్వహాక కార్యదర్శి పాత్రుడు సలహాలు,సూచనల మేరకు విశాఖ యూనిట్ తరపున పలు కార్యక్రమాలు చేపట్టేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. రాష్ట్ర నూతన కార్యవర్గానికి అభినందనలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ్యులందరూ ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో విశాఖ యూనిట్ కార్యదర్శి కాశీ,ఉపాధ్యక్షుడు రవికుమార్,కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మోహన్,కోశాధికారి ప్రసాద్, నాయకులు రఘు,రవి కుమార్, మదన్,రాజు,కృష్ణ,మోహన్,శ్యాం, రాము,రామకృష్ణ,రామారావు తదితరు పాల్గొన్నారు.
మత సామరస్యానికి భంగం కలిగిస్తే కమిటీ తగు చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ వెల్లడించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలోఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రశాంతతకు సంబంధించి ఆత్మగౌరవంతో గత స్మృతుల వైపుగా ఎ్వరైనా చూడవచ్చునని, జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ సమానత్వాన్ని కాపాడుకునేందుకు అపారమైన సామర్థ్యాన్ని ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. అన్ని కులాలు, మతాల ప్రజలు నుండి శాంతియుత సహజీవనంలో ఉన్నట్లు చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు ప్రభుత్వం జిల్లా స్థాయిలో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గాను, నగర పోలీసు కమీషనర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు ఉపాధ్యక్షులుగాను, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్, మైనార్టీ సంక్షేమాధికారులు సభ్యులు గాను, జిల్లా జాయింట్ కలెక్టర్ సభ్యులు/కన్వీనర్ గా ఉంటారని తెలిపారు. ఏడు మతాలకు సంబంధించి పెద్దలు సభ్యులుగా ఉంటారని చెప్పారు. జిల్లాలో ఎక్కడైనా మతాలకు సంబంధించిన గొడవలు ఉంటే, శాంతి భద్రద్రతలకు విఘాతం కలిగితే ఈ కమిటీ తగు చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కమిటీ ద్వారా జిల్లా ప్రజలకు ఒక సందేశం వెలుతుందని చెప్పారు. జిల్లాలోని 15 శాసన సభ నియోజక వర్గాలు ఉండగా ఇందులో 7 పట్టణ పరిధిలోను, 8 గ్రామీణంలో ఉన్నట్లు వెల్లడించారు. నియోజక వర్గాల వారీగ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు. ప్రభుత్వం వ్యక్తులు, కులం, మతం లేదా రాజకీయ సంబంధాలతో పనిలేకుండా ఒక పారదర్శకమైన, లక్ష్యపూరిత రీతిలో ప్రయోజనాత్మక గుర్తింపు చోటుచేసుకునేటట్లు చూస్తోందని, అన్ని కార్యక్రమాలను సంతృప్తి ప్రాతిపదికన అమలు చేయాలన్న ప్రభుత్వ ధృడ నిశ్చయంతో ఉందన్నారు. ప్రభుత్వం వ్యవసాయం, ఆరోగ్యం, విద్య మరియు మహిళా సాధికార రంగాలలో ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను విస్తృతంగా అమలు చేస్తోందని చెప్పారు.
జిల్లా స్థాయిలో మత సామరస్య కమిటీ.. మత సామరస్యానికి భంగం కలిగించడానికి వీలుండే విధంగా జిల్లాలో ఏవేని సంఘటనలు చోటుచేసుకున్న సందర్భంలో కమిటీ సమావేశమై మత, శాంతి సామరస్యాన్ని పునరుద్ధరించే రీతిలో సకాలంలో సముచిత చర్యను చేపట్టేలా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. కమిటీ సభ్యులు జిల్లాలోని అన్ని వర్గాలు కలసికట్టుగా ఉన్నాయని, జిల్లా అభివృద్థికి కృషి చేస్తున్నాయనే గట్టి సందేశాన్ని పంపే విధంగా కార్యకలాపాలను చేపట్టాలని, పై లక్ష్యాన్ని సాధించడానికి శాసన సభ నియోజక వర్గం స్థాయిలో కమిటీ క్రమం తప్పకుండా సమావేశాలను కూడా నిర్వహిస్తుందన్నారు. శాసన సభ నియోజక వర్గం లో సామాజిక, మత సంబంధ ఆధారంగా కమిటీ సభ్యులను ఎంచుకుంటుందని వివరించారు.
గతంలో చోటుచేసుకున్న వివాదాలు/సంఘర్షణలను పరిగణనలోకి తీసుకొంటూ, అదే తరహా కేసులతో వ్యవహరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తుందని చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల జాబితాను తయారు చేసి అట్టి ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షించడం జరుగుతుదన్నారు. భూ వివాదాలు లేదా ఇతర అంశాలను పరిష్కరించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు. జిల్లాలలోని అన్ని మత సంబంధ భవనాలు, కట్టడాలు, స్మారక చిహ్నల కోసం భద్రతా ప్రణాళికను తయారు చేయడం, ఆమోదించడం, అమలు పరచడం జరుగుతుందన్నారు. సామాజిక సభ్యులలో విశ్వాసాన్ని పెంపొందించడానికై జిల్లా స్థాయి కమిటీలు తరచుగా క్షేత్ర స్థాయి సందర్శనలు చేపట్టడం, మత సామరస్యానికి భంగం కలిగించిన నిందితులపై ఐపిసిలోని వివిధ సెక్షన్ల క్రింద నమోదు చేసిన కేసులను సమీక్షించడం జరుగుతుందన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధ్యక్షతన కమిటీ సమావేశమయింది. వివిధ మతాలకు సంబంధించిన పెద్దలు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారన్నారు. జిల్లాలో మతాలు, కులాలు బేధాలు లేకుండా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతోందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఈ కమిటీ చూసుకుంటోందని, ఏ ప్రాంతాలలోను గొడవలు జరగకుండా ముందుగానే ఒక ప్రణాళికను తయారు చేసుకుంటుందని వివరించారు. నగర పోలీసు కమీషనర్ మనీస్ కుమార్ సిన్హా, ఎస్.పి. బి. కృష్ణారావు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, తదితరులు మాట్లాడారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎ. ప్రసాద్, విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిషోర్, కమిటీ సభ్యులు ముస్లీం మత పెద్ద అబిజిత్ మద్రాస్వల, జైన్ల నుండి ప్రియాంక బన్సలి జైన్, బుద్దిస్టు యడ్ల నౌకొ సింహాద్రి, క్రిస్టియన్ ల నుండి జోషఫ్ జయకుమార్, మార్వాడి నుండి సునిల్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచంలో అతిపెద్ద మూడవ భాష అయిన హిందీని ఐక్య రాజ్య సమితి అధికార భాషగా గుర్తించాలని హిందీ మంచ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ ఉపాధ్యాయ సంఘ నేత ఎం. నీలాద్రిరావు డిమాండ్ చేశారు. ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా హిందీ మంచ్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన హిందీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంచ్ జిల్లాశాఖ అధ్యక్షులు ఉప్పులూరి లక్ష్మణరావు మాట్లాడుతూ, 2006 నుంచి జనవరి 10 న అంతర్జాతీయ హిందీ దినోత్సవం జరిపే సంప్రదాయం ప్రారంభమైందన్నారు. 45 సంవత్సరాలుగా వెలువడుతున్న హిందీ ప్రచార సభ హైదరాబాద్ మాస పత్రిక ప్రత్యేక సంచికలను సభ్యులు ఆవిష్కరించారు. అనంతరం హిందీ ప్రచారానికి కృషి చేస్తున్న సీనియర్ ఉపాధ్యాయ సంఘ నేత ఎం. నీలాద్రిరావు ను సభ్యులు సత్కరించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి వాడాడ సన్యాసిరావు, కార్యవర్గ సభ్యులు దేవగుప్తపు సుందరి, పి.శాస్త్రి, కె. నవీన్ కుమార్ , షేక్ మదీనా తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలో కరోనా వైరస్ ను నియంత్రించుటలో ముం దస్తు జాగ్రత్తలలో భాగం గా ప్రజలు గుంపులుగా ఉండ కుండా,సామాజిక దూరాన్ని పాటించాల్సిన ప్రస్తుత పరిస్థితిలో జన వరి 11 న నిర్వహించాల్సి న స్పందన కార్యక్రమాన్ని (గ్రీవెన్స్ డే) తాత్కాలికం గా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.నారాయణ భరత్ గుప్త తెలి పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ సమస్య ల పరిష్కారం కొరకు జిల్లా సచివాలయానికి రావాలనుకున్నవారు ఈ విషయాన్ని గమనించాలన్నారు. ముఖ్యంగా ఏ గ్రామానికి చెందిన సమస్యలు ఆ గ్రామంలోని గ్రామసచివాలయంలోని దరఖాస్తు చేసుకొని సమస్య పరిష్కారం పొందాలని కూడా కలెక్టర్ వివరించారు. గ్రామసచివాలయంలో పరిష్కారం కాని సమస్యలపై మాత్రమే జిల్లా సచివాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు.
విజయనగరం జిల్లాలో గల 960 గ్రామ పంచాయితీలలో పారిశుధ్య నిర్వహణ యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నట్టు జిల్లా పంచాయితి అధికారి కె.సునిల్ రాజ్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో అన్ని గ్రామ సచివాలయాల పరిధిలో జరుగుతున్న పారిశుధ్య నిర్వహణపై కార్యదర్శిలకు తగు సూచనలు చేశామన్నారు. మురుగు, ప్లాస్టిక్, ఇతర వ్యర్ధములు తొలగింపు కార్యక్రమములు తరచుగా చేపట్టడంతోపాటు బ్లిచింగ్ చైన్ ఏర్పాటు కూడా చేయిస్తున్నట్టు చెప్పారు. ఎన్ని గ్రామసచివాలయాల్లో పారిశుధ్య నిర్వహణ ఏవిధంగా జరుగుతుందనే విషయమై ఈఓపీఆర్డీలు, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని కూడా డిపిఓ సూచించారు. ఈ పారిశుధ్య నిర్వహణను ప్రతి రోజు 4, 5 గ్రామాలు స్వయముగా పర్యవేక్షణ చేయాలని సదరు ప్రక్రియ జూన్ నెల వరకు కొనసాగించాలని అందరు కార్యదర్శిలకు ఆదేశాలు జారీచేసినట్టు వివరించారు. గ్రామాలను పరిశుభ్రముగా ఉంచడంతోపాటు ప్లాస్టిక్ ను గ్రామాలో వినియోగించుకుండా చర్యలు తీసుకోవాలని మండల పరిషత్ అభివృద్ది అధికార్లును, విస్తరాణాధికార్లలకు అప్పగించడంపై జిల్లా కలెక్టర్ ఆదేశించిన విషయాన్ని డిపిఓ తెలియజేశారు.
సర్ లూయిస్ బ్రెయిలీ అంధులపాలిట దేవుడులాంటివారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ కొనియాడారు. విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్, విజువల్లీ ఛాలెంజెడ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక నాల్గవతరగతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో, లూయిస్ బ్రెయిలీ 212వ జన్మదినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ముందుగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ హరి జవహర్‌లాల్ మాట్లాడుతూ, బ్రెయిలీ జన్మదినం ఒక పండుగలాంటిదని, దానిని జిల్లాలో నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు. అంధులు ఇతరులకు దేనిలోనూ తీసిపోరని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారని అన్నారు. అంధుడు అయినప్పటికీ, ఐఏఎస్ సాధించి, జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ గా శిక్షణ పొందుతున్న కట్టా సింహాచలం, అందరికీ ఒక స్ఫూర్తిప్రధాతగా పేర్కొన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని, ఉన్నత స్థానాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో అంధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం మాట్లాడుతూ లిపిని కనుగొనడం ద్వారా లూయిస్ బ్రెయిలీ, చూపులేనివారికి మహోపకారం చేశారని కొనియాడారు. అంధుల జీవితాల్లో వెలుగును నింపిన మహనీయుడని పేర్కొన్నారు. అంధులు తమలోని లోపాన్ని ప్రక్కనబెట్టి, తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని కోరారు. అదేవిధంగా సాటి అంధులు, నిరుద్యోగులకు సహకరించాలని సూచించారు. గొప్ప మానవతావాది అయిన జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ వద్ద తాను శిక్షణ పొందే అవకాశం రావడం అదృష్టమని పేర్కొన్నారు.
విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి.రవీంద్రబాబు మాట్లాడుతూ, అంధుల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషిని వివరించారు. వికలాంగుల హక్కుల చట్టం-2016 రూపొందడానికి జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్ ఎంతగానో సహకరించారని చెప్పారు. అవకాశాన్ని ఇస్తే, అంధులు కూడా తమలోని నైపుణ్యాన్ని చూపెడతారని, ఇతరులతో సమానంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. వారి పట్ల సానుభూతి చూపించవద్దని, ప్రతీఒక్కరూ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ వేడుకల్లో విజువల్లీ ఛాలెంజెడ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమాశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు జి.భాస్కర్రావు, ప్రధాన కార్యదర్శి రాము, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు వీరభద్రరావు, యూత్ అసోసియేషన్ నాయకులు ఓ.నర్సింగరావు, శ్రీనివాస్, జె.సతీష్, ఎల్.రత్నరాజు, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాలభాస్కర్రావు, నాల్గోతరగతి ఉద్యోగుల సంఘం పట్టణాధ్యక్షులు ఎం.గంగాప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
ఇంటింటికీ రేషన్ సరుకులను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న వాహనాలను పంపిణీకి సిద్దం చేయాలని జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్‌లో ఆదివారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల తనిఖీ, రిజిష్ట్రేషన్ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఒకటిరెండు రోజుల్లో జిల్లాలో వాహనాల పంపిణీని ప్రారంభమవుతుందని, అందువల్ల యుద్దప్రాతిపదికన ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. బ్యాంకులతో మాట్లాడి, లబ్దిదారులకు వాహనాల కేటాయింపు పత్రాలను సిద్దంచేసి ఉంచాలని సూచించారు. ఈ సమావేశంలో విజయనగరం డివిజనల్ అభివృద్ది అధికారి కె.రామచంద్రరావు, బిసి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్‌వి నాగరాణి, సివిల్ సప్లయిస్ డిఎం వరకుమార్, జిల్లా సరఫరా అధికారి పాపారావు, ఎస్‌సి కార్పొరేషన్, రవాణా, బ్యాంకులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లాలో బర్డ్‌ఫ్లూ తో ఇంతరకు కోళ్లు ఏవీ మరణించలేదని, ఈ వ్యాధిపట్ల ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు ఏ.వి.నర్శింహులు తెలిపారు. జిల్లాలో కొన్ని చోట్ల మరణించిన నాటుకోళ్లను లేబొరేటరీలో పరిశోధనలు చేయించామని, వాటిలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు లేవని పేర్కొన్నారు. సాధారణంగా వచ్చే వ్యాధులతోనే ఆ కోళ్లు మరణించాయని గుర్తించామన్నారు. ఎవరికైనా జంతువులు, కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు వున్నట్టు అనుమానాలు వుంటే సమీపంలోని పశువైద్యాధికారిని సంప్రదించాలని కోరారు. జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధానికి అన్ని చర్యలు చేపడుతున్నామని పశుసంవర్ధక శాఖ జె.డి. పేర్కొన్నారు. వ్యాధి నిరోధక చర్యల్లో భాగంగా ప్రతి మండలంలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. అటవీ, పశుసంవర్ధక శాఖల్లోని క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ వ్యాధిపై, వ్యాధి నిరోధానికి చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వ్యాధిని ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. జిల్లాలో రెవిన్యూ, పంచాయతీరాజ్, పురపాలక, అటవీ, వైద్య ఆరోగ్యశాఖ, పోలీసు శాఖల సమన్వయంతో వ్యాధి నిరోధక చర్యలు చేపడతామన్నారు.
బర్డ్ ఫ్లూ వ్యాధి ముఖ్యంగా ఒక రకమైన నీటి బాతులలో ఉంటూ ఇతర పక్షులకు వ్యాప్తి చెందుతుందన్నారు. వీటి బారిన పడే నాటుకోళ్లు, ఫారాల్లో పెంచే బ్రాయిలర్, లేయర్ కోళ్లు అతితక్కువ సమయంలో అత్యధికంగా మరణించే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా వలస పక్షులు, ఇతర జాతుల పక్షులలో కూడా కనిపించే అవకాశం ఉందన్నారు. అయితే బర్డ్‌ఫ్లూ మాత్రమే కాకుండా ఇతర శ్వాసకోస సంబంధ వ్యాధులైన కొక్కెర తెగులు(Ranikhet Disease), ఇన్‌ఫెక్యువస్ బ్రాంకైటిస్, పాశ్చురెల్లోసిస్(ఫేల్ కలరా) వంటి అంటువ్యాధులు మాత్రమే కాకుండా ఇతర వ్యాధులు కూడా కాలాలు మారే సమయంలో వ్యాపిస్తాయన్నారు. వర్షాకాలం నుండి శీతాకాలం, శీతాకాలం నుండి వేసవికాలం, వేసవి నుండి వర్షాకాలంనకు మార్పు చెందుతున్న సమయంలో వ్యాపిస్తాయని పేర్కొన్నారు. అంతేగాకుండా శీతాకాలం తీవ్రంగా ఉన్న కారణంగా చలికి తీవ్ర ఒత్తిడికి గురికాబడి శ్వాసకోస సంబంధ వ్యాధులు వ్యాపిస్తాయన్నారు. నాటుకోళ్లలో అంతర్గత పరాన్నజీవులు అనగా ఏలికపాములు, బద్దెపురుగుల వంటి వ్యాధులు తోడవడం వల్ల అధిక స్థాయిలో మరణాలు ఏర్పడుతున్నట్లు పేర్కొన్నారు.
బర్డ్‌ఫ్లూ బారిన పక్షుల ముఖాలు, తమ్మెలు వాచి నల్లబడటం, ముక్కు నుండి ద్రవాలు కారడం, ఇతర శ్వాస సంబంధిత లక్షణాలు, విరేచనాలు, నరాల సంబంధిత లక్షణాలు, మేత తినకపోవడం వంటివి జరుగుతాయని పేర్కొన్నారు. అయితే ఈ లక్షణాలు ఇతర వ్యాధులు అయినటువంటి కొక్కెర తెగులు, ఇన్ ఫెక్చువస్ బ్రాంకైటిస్, ఫేల్ కలరా వంటి ఇతర వ్యాధుల్లో కూడా కనిపిస్తాయన్నారు. ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పక్షుల్లో బర్డ్‌ఫ్లూ గా వ్యవహరించబడుతున్న ఏవియన్ ఇన్ ఫ్లూయెన్ జా నిర్ధారణ అయ్యిందన్నారు. ఈ వ్యాధి కారణంగా మన రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ వ్యాధి ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. అయినప్పటికీ రైతుల్లోను, ప్రజల్లోనూ నెలకొన్న సందేహాలు, భయాందోళనలను తొలగించేందుకు శాఖాపరంగా అన్ని చర్యలు చేపడుతున్నట్టు పశుసంవర్ధక శాఖ జె.డి. ఒక ప్రకటనలో వెల్లడించారు.