ప్రతి ఒక్కరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ పిలుపునిచ్చారు. కోవిడ్ ప్రవర్తనా నియమావళి కార్యక్రమంపై మంగళ వారం కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నివాస్ పలు అంశాలను వివరించారు. కోవిడ్ వాక్సిన్ త్వరలో అందుబాటులో వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ కోవిడ్ సమయంలో ప్రజలు పాటించాల్సిన ప్రవర్తనా నియమావళిపై ప్రభుత్వ సూచించిన మేరకు కార్యక్రమాలను నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మునిసిపాలిటీల కమీషనర్లు, స్వచ్చంద సంస్ధలు, మండల, గ్రామ స్ధాయి కార్యక్రమాలు, విద్యాసంస్ధలు, వైద్య సంస్ధలు, రవాణా రంగంలో ఉన్నవారు, నైపుణ్య శిక్షణ, మతాధిపతులు, పర్యాటక తదితర అన్ని రంగాల వ్యక్తులతోను, అన్ని శాఖల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన చెప్పారు. జనవరి 19వ తేదీ వరకు 50 రోజుల కార్యక్రమం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కును ధరించాలని, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శుభ్రపరచుకోవడం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిందనే అపోహలో ఉండవద్దని ఆయన సూచించారు. ఇప్పటికి తీవ్రంగా ఉండే కేసులు నమోదు అవుతున్నాయని గుర్తించాలని తెలిపారు. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలు వేడుకలు నిర్వహించుకునే ముందు ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు పంటలు వచ్చే కాలమని పంటల విక్రయ సమయంలోనూ, ఇతర సమయాల్లోనూ జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వెంటనే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేసుకోవాలని కలెక్టర్ అన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికి ప్రజలకు మూడవ దశలో ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వాక్సిన రెండు డోసులు తీసుకోవలసి ఉంటుందని అప్పటి వరకు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు.
మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు : కోవిడ్ వాక్సిన్ ను మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు అందించడం జరుగుతుందని కలెక్టర్ నివాస్ చెప్పారు. ఇప్పటి వరకు 20,838 మంది హెల్త్ కేర్ వర్కర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. 105 ప్రదేశాల్లో వాక్సిన్ ను నిల్వ ఉంచుటకు ఏర్పాట్లు చేసామని ఆయన చెప్పారు. రెండవ దశలో మునిసిపల్, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, పోలీసులు తదితర ఫ్రంట్ లైన్ వర్కర్లకు అనంతరం 50 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి, 50 సంవత్సరాలు పైబడిన వారికి తదితర 30 శాతం మందికి వాక్సిన ఇవ్వడం జరుగుతుందని వివరించారు. వాక్సిన్ ను పొందుటకు ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. జనవరి 2వ తేదీన డ్రైరన్ ను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్ చెప్పారు.
ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో వార్డు, గ్రామ సచివాలయ విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి నాయక్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.బి.జగన్నాథ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారీ దేవి తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ వైఎస్ఆర్ బీమా పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ ఆదేశించారు. పేద కుటుంబాలకు బీమా ద్వారా రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్ఆర్ బీమా పథకం సంబంధిత అధికారులు, బ్యాంకర్లతో మంగళవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ బీమా పథకాన్ని అర్హులందరికీ వర్తింపజేసేందుకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 7వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే చివరిరోజు వరకూ వేచిఉండకుండా, వెల్ఫేర్ అసిస్టెంట్లు, డిఆర్‌డిఏ, మెప్మా సిబ్బంది తక్షణమే కార్యాచరణను ప్రారంభించాలని ఆదేశించారు. వీరంతా అర్హులనుంచి దరఖాస్తులను తీసుకొని, గడువు లోగా బ్యాంకులకు అందజేయాలని సూచించారు. అలాగే ఆగిపోయిన బ్యాంకు ఖాతాలను పునరుద్దరించడం, సంతకాల్లో తేడాలను సరిచేయడం తదితర పనులను కూడా పూర్తి చేయాలన్నారు. ఇలా సమర్పించిన దరఖాస్తులను బ్యాంకులు ఈనెల 21లోగా పరిశీలించి, వారందరికీ వైఎస్ఆర్ బీమా సౌకర్యాన్ని వర్తింపజేయాలని కలెక్టర్ అన్నారు. వైఎస్ఆర్ బీమా పథకం అమల్లో 58శాతం పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలోనే మన జిల్లా ఇప్పటికే నెంబరు 1 స్థానంలో ఉందని, దానిని నిలబెట్టుకోవడమే కాకుండా, శతశాతం పూర్తి చేయాలని కలెక్టర్ కోరారు.
ఈ టెలీకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు, డిఆర్‌డిఏ పిడి కె.సుబ్బారావు, మెప్మా పిడి కె.సుగుణాకరరావు, ఎల్‌డిఎం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్లు, బ్యాంకు అధికారులు, వెలుగు, మెప్మా అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
రాష్ట్రంలో కొన్ని దుష్ట శక్తులు అలజడి సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. మంగళవారం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మంత్రి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ, కొందరికి దేవుడి పట్ల భయం, భక్తి లేవు. ఓట్ల కోసం తప్ప.. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం వారికి రాదు.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ప్రజలను మభ్య పెట్టడానికే వరుసగా దేవలయాలు, దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీని ప్రజలు మరిచిపోతున్నారనే భయం, ఆందోళన తోనే ఈ విధంగా ఈ ఆందోళనలన్నీ చేస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనను చూసి ఓర్వలేకే కుట్రలు పన్నుతున్నారని మండి పడ్డారు. విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారు ఎవరనేది ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్న మంత్రి అన్ని విషయాలు నిగ్గుతేలుతాయన్నారు. వచ్చే నెలలో అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలను నిర్వహిస్తామని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం కల్పిస్తామని. ఆలయాల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకుముందు ప్రత్యేక మర్యాదలతో దర్శన ఏర్పాట్లను చేసిన ఈఓ పుష్పనాధం చేయగా, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకశర్మ ఆశీర్వచనాలు అందజేశారు. స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
జగనన్న అమ్మ ఒడి పధక౦ రెండవ విడత కార్యక్రమాన్ని ఈ నెల 11న రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలోని యస్.వి. జి. యస్ జూనియర్ కళాశాలలో ప్రారంభించనున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. సోమవారం ఈ మేరకు కళాశాల ప్రాంగణంలో ముఖ్యమంత్రి కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విద్యా శాఖ మంత్రి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరం లో జిల్లా అధికారులు , విద్యా శాఖ అధికారులతో ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్ల గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యా శాఖ మంత్రి మాట్లాడూతూ చదువుకు పేదరికం అడ్డు కాకూడధన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమ్మ ఒడి పధకం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిందని అందుకు సంబందించి రెండవ విడత కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంబించటం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమం 9 వ తేధీ కాకుండా 11వ తేధీన జరుగుతుందన్నారు. ఈ నెల 11వ తేధీన 11 గంటలకు ముఖ్యమంత్రి నెల్లూరుకు రావడం జరుగుతుందన్నారు. కోవిడ్ నేపద్యంలో కొన్ని ఇబ్బంధులు ఎదురై రాష్ట్ర ఆధాయ౦ గణనీయంగా తగ్గినప్పటికి ముఖ్యమంత్రి ఈ పధకాన్ని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి పధకం అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 6వ తీధి నాటికి అర్హుల తుధి జాబితాను తయారుచేయాలన్నారు . యస్.వి. జి. యస్ జూనియర్ కాలేజీ దగ్గరలో వున్న పాఠశాలల విధ్యార్ధులను తగిన జాగ్రత్తలతో ముఖ్యమంత్రి కార్యక్రమానికి తీసుకురావాలని వారికి కావల్సిన అల్పాహారం భోజన సదుపాయాలను కల్పించాలన్నారు . వీలైనంత ఏక్కువ మందికి ఈ పధకం వర్తించేలా సడలింపులు చేశాం అన్నారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో పని చేసి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు .
అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ అన్నీ సంక్షేమ పధకాలకన్నా జగనన్న అమ్మ వొడి పధకం గొప్ప పధకం అన్నారు . భారత దేశంలోనే ఎక్కడ ఇలాంటి పధకం ప్రవేశపెట్టబడలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి సారిగా ఇలాంటి గొప్ప పధకాని ప్రవేశపెట్టి రెండవ సంవత్సర౦ కూడా కొనసాగిస్తున్నారన్నారు . అందరూ కలిసి కట్టుగా పని చేసి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
అనతరం జిల్లా కలెక్టర్ కె. వి. ఎన్. చక్రధర్ బాబు మాట్లాడుతూ జగనన్న అమ్మ ఒడి పధకం క్రింద నెల్లూరు జిల్లాకు సంబందించి 3,46,899 మంధి అర్హత పొంది ఉన్నారన్నారు . అర్హులైన అందరికీ ఈ పధకం అందేలా చర్యలు తీసుకూవాలని విద్యా శాఖ వారిని ఆదేశించారు. మొదటి విడతలో అర్హత వుండి ఈ పధకం వర్తించని వారికీ కూడా ఈ పధకం వర్తించేలా చూడాలన్నారు . ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి వచ్చే పాటశాలల పిల్లల విషయం లో ప్రతి 50 మందికి ఒక టీచర్ ఉండేలా జాగ్రతలు తీసుకోవాలన్నారు . అమ్మ ఒడి నాడు నేడు కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో నెల్లూరు రూరల్ శాసనసబ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ డా ప్రభాకర్ రెడ్డి , మున్సిపల్ కమిషనర్ దినేష్ కుమార్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చిన్న వీర భద్రుడు , రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ డైరెక్టర్ కుమారి వెట్రీ సెల్వి పాల్గొన్నారు.
విశాఖపట్నం ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్ధి విభాగం అధ్యక్షునిగా పూడిసాయి చరణ్ ను నియమిస్తూ వైఎస్సార్సీపీ నగర అధ్యక్షులు వంశీ క్రిష్ణ శ్రీనివాస్ ఉత్తర్వులు అందజేశారు. సోమవారం విశాకలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, ఆంధ్రాయూనివర్శిటీలో యువత సమస్యలను పరిష్కరించడంలోనూ ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లడంలోనూ చురుకుగా పనిచేయాలని చరణ్ కు సూచించారు వంశీ. పార్టీలో పనిచేసేవారికి ఎల్లప్పుడూ గుర్తింపు వుంటుందనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. అనంతరం చరణ్ మాట్లాడుతూ, పార్టీ నగర అధ్యక్షులు తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చడంతోపాటు, ఆంధ్రాయూనివర్శిటీలో పార్టీ అభివ్రుద్ధితోపాటు, యువతను చైతన్య పరిచే కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షులు తిప్పల వంశీ రెడ్డి , బి కాంత రావు తదితరులు పాల్గొన్నారు.
కరోనా కష్టకాలంలోనూ వెనకడుగు వేయక సంక్షేమానికి సంబంధించి చెప్పిన ప్రతి మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సోమవారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని కరప మండలంలో నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కన్నబాబు ప్రారంభించారు. తొలుత జెడ్.భావారంలో రూ.349 లక్షల అంచనా విలువతో చేపట్టే 194 గృహ నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. దాదాపు 500 ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చెప్పిన సమయానికి చెప్పిన విధంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. వైస్సార్ రైతు భరోసా, జగనన్న అమ్మ ఒడి, వైస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా
తదితర ఎన్నో సంక్షేమ పథకాల అమలు జరుగుతోందన్నారు. దైనందిన జీవిత అవసరాలకు సంబంధించి మహిళలు ఇబ్బంది పడకూడదన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని, దీన్ని దృష్టిలో ఉంచుకుని అనేక పథకాలు ప్రారంభించారన్నారు. ఇళ్ల స్థలాలను అన్ని హక్కులతో మహిళలకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, అయితే దీనిపై కొందరు కేసులు వేయడం దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నామని, సమస్య సమసిపోయాక రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 30 వేల ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రామాలకు సమీపంలో లేఔట్లను అభివృద్ధి చేసి, ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని.. దీనివల్ల ఆయా గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. పేదలకు పరిపూర్ణ భద్రతను కల్పించే సొంత ఇంటి కలను ముఖ్యమంత్రి సాకారం చేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని సంక్షేమ పథకాలను లబ్దిదారుల ముందుకు చేర్చే వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి తనకు కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా రైతుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానట్లు మంత్రి పేర్కొన్నారు. జెడ్. భావారం పర్యటన అనంతరం మంత్రి కన్నబాబు.. కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగా గీతా విశ్వనాథ్ తో కలిసి వాకాడ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రూ. 80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే సీసీ రోడ్, బీటీ అప్రోచ్ రోడ్ పనులకు శంకుస్థాపన చేశారు. ఓసీ కాలనీలో సీసీ ప్రధాన డ్రైన్లను ప్రారంభించారు. బాబూ జగ్జీవన్‌రామ్ కమ్యూనిటీ హాల్‌కు ప్రారంభోత్సవం చేశారు. డా. బీఆర్ అంబేద్కర్ రాజ్యగృహ నిర్మాణాలను కూడా ప్రారంభించారు. కొత్తగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు గ్రామ సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. శ్రీ సూర్య పవన్ తేజ ఫంక్షన్ హాలులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ఇచ్చిన మాట కంటే ఎక్కువే కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కన్నబాబు చేపడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కరప ఎంపీడీవో కె.స్వప్న, తహసీల్దార్ సీహెచ్ ఉదయ్ భాస్కర్, స్థానిక నేతలు, అధికారులు హాజరయ్యారు.
పేదలందరికీ ఇల్లు పథకం లో జిల్లావ్యాప్తంగా మంజూరు చేసిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశం లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాలను అనుసరించి 7వ తేదీ నాటికి నూరు శాతం పంపిణీ పూర్తి కావాలన్నారు. లబ్ధిదారులయిన ప్రతి మహిళకు ఆమెకు కేటాయించిన భూమిని చూపి, దానికి సంబంధించిన పట్టా అందించాలన్నారు. పట్టా తో పాటు ముఖ్యమంత్రి లేఖను, స్థలం సరిహద్దులను చూపించి, ఇల్లు మంజూరు పత్రాలను తప్పక అందజేయాలన్నారు. ఇళ్ల మంజూరు పత్రం అందజేసిన లబ్ధిదారు సొంత స్థలంలో తీయించుకున్న ఫోటో తప్పనిసరిగా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి లబ్ధిదారులకు ఫోన్ కాల్ వచ్చే సమయానికి వారు పట్టా, స్థలం ఇంటి మంజూరు పత్రాలు అందుకుని, గృహ నిర్మాణ ఆప్షన్ ఇచ్చి ఉండాలన్నారు. జిల్లాలో ఉన్న లబ్ధిదారులందరికీ గ్రామ వాలంటీర్ల చేత పత్రాలన్నింటినీ వేగంగా సరఫరా చేయించాలన్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పంపిణీ కార్యక్రమాన్ని తాసిల్దార్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికార్లు ప్రతిరోజు సమీక్షించాలన్నారు.
8వ తేదీ నుంచి థర్డ్ పార్టీ తనిఖీ ఉండవచ్చని చెప్పారు. యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. విశాఖ నగర పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించ బోయే ఇళ్ల స్థలాలను ఏకమొత్తంగా చూపించే ఏర్పాట్లు చేయాలని జీవీఎంసీ కమిషనర్ ను ఆదేశించారు. నగరంలోని లబ్ధిదారులు అందరికీ ఇంటి పట్టా అందించి నిర్మాణపు ఆప్షన్లను తీసుకోవాలన్నారు. అలసత్వం వహించిన అధికారులను ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్ జి. సృజన, నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్. మౌర్య గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్, డిఆర్డిఏ పిడి వి.విశ్వేశ్వరరావు, యు సి డి పి డి శ్రీనివాస్, ఆర్ డి వో లు పెంచల కిషోర్, సీతారామారావు, లక్ష్మీ శివ జ్యోతి, ప్రత్యేక ఉప కలెక్టర్లు సూర్య కళ, పద్మలత, అనిత గృహ నిర్మాణ శాఖ, టిడ్కో ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో నిరుపేదలకు సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అందజేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తుందని కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎం.ఏ.హాఫిజ్ ఖాన్ వ్యాఖ్యానించారు. సోమవారం నవరత్నాలు--పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో భాగంగా కర్నూలు మునిసిపల్ కొర్పొరేషన్ పరిధిలోని 10, 11, 12, 13వ వార్డులకు లబ్ధిదారులకు పాతబస్తీలోని ఖడక్ పుర మైదానంలో, 22, 23, 24, 25 వ వార్డుల లబ్ధిదారులకు వినాయక్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన సభల్లో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్, నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ సొంతింటి స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ..అక్కచెల్లెమ్మల పేరిట ఇంటి పట్టాలను మంజూరు చేసి, పేదల కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని, అర్హతే ప్రామాణికంగా అర్హులైన లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అమ్మ ఒడి, జగనన్న చేయూత, ఉచిత వైద్య చికిత్స కోసం ఆరోగ్యశ్రీ, వాలింటీర్ల చేత ఉదయాన్నే పింఛన్ల పంపిణీ, ఆటోడ్రైవర్ల కు 10,000, మన బడి నాడు--నేడు ఇలా ఎన్నో పథకాలు ప్రజల జీవన పురోగతి కోసం ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారని తెలియజేశారు.
పట్టాల కోసం ఇంకా అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే 90 రోజులపు ఇంటి పట్టాను అందజేస్తామని చెప్పారు. జగనన్న కాలనీల నిర్మాణంలో ఇప్పటికే శంకుస్థాపన చేశామని 17,000 ఇళ్ళను నిర్మించి లక్ష జనాభాకు సరిపడ మౌలిక సదుపాయాలను కల్పిస్తామని చెప్పారు. మేము పాలకులుగా కాకుండా సేవకులుగా ప్రజలకు సేవ చేయడానికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు. అంతకుముందు కర్నూలు నగర పాలక కమిషనర్ డి.కె.బాలాజీ మాట్లాడుతూ...పట్టా పై ఉండే సంఖ్యలో మొదటలో వచ్చే ఆర్ అనే అక్షరంతో మొదలయే ఉంటే రుద్రవరం గ్రామం వద్ద, టి అని ఉంటే తడకనపల్లె గ్రామంలో ఇంటి స్థలాన్ని కేటాయించిన్నట్లు అని వివరించారు. మొత్తం 377 ఎకరాల లేఅవుట్ ను 39 బ్లాక్కులుగా విభజించడానికి మునిసిపల్, రెవెన్యూ, సర్వే, ప్లానింగ్ సెక్రెటరీలు, సచివాలయ సిబ్బంది అహర్నిశలు శ్రమించారని..వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. రాష్ట్ర మునిసిపల్ శాఖ ఆదేశాల మేరకు అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి ఇంటి పట్టాలను అందించడానికి కృషి చేశామన్నారు. కార్యక్రమంలో నగర పాలక అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, నగర పాలక ఎస్ఈ సురేంద్రబాబు, కర్నూలు అర్బన్ తహసీల్దార్ తిరుపతి సాయి, డిఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ రాచయ్య, తాలూకా సిఐ విక్రమ్ సింహ ఉన్నారు.
ప్రత్యేక సంక్షిప్త సవరణ-2021 కార్యక్రమం ద్వారా స్వచ్ఛమైన, వాస్తవికతను ప్రతిబింబించే ఓటరు జాబితాలను రూపొందించాలని జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్ కుమార్ ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలను కోరారు. జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ గా నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ పర్యావరణ, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి, మున్సిపల్ పరిపాలన కమీషనర్ అండ్ డైరక్టర్ జి.ఎస్.ఆర్.కె.ఆర్.విజయ్ కుమార్ సోమవారం జిల్లాలో జరిపిన పర్యటనలో భాగంగా సాయంత్రం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో జిల్లా కలెక్టర్, ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సంక్షిప్త సవరణ-2021 ప్రక్రియ జరుగుతున్న తీరును సమీక్షించారు. కార్యక్రమంలో తొలుత జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్.సత్తిబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల కమీషన్ నిర్థేశించిన షెడ్యూల్ ప్రకారం జిల్లాలో ప్రత్యేక సంక్షిప్త సవరణ-2021 క్రింద ముసాయిదా జాబితాల ప్రచురణ, అందిన క్లెయిములు, అభ్యంతరాల పరిష్కారం తదితర అంశాలను ఆయనకు వివరించారు.
నవంబరు 16వ తేదీన ప్రచురించిన ముసాయిదా జాబితాల ప్రకారం జిల్లాలోని 19 నియోజక వర్గాలలో గల 4597 పోలింగ్ స్టేషన్ల పరిధిలో, మొత్తం 42,71,956 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 21,11,772 మంది పురుషలు, 21,59,829 మంది మహిళలు, 355 మంది ఇతరులు ఉన్నారని డిఆర్ఓ తెలిపారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 742 మంది ఓటర్ల నిష్పత్తి ఉండగా, లింగ నిష్పత్తి ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు, 1023 మంది మహిళలుగా ఉందని తెలియజేశారు. ముసాయిదా జాబితాలపై మొత్తం 48,660 క్లెయిములు,అభ్యంతరాలు అందగా, వీటిలో 35,938 ధరఖాస్తులను ఇప్పటికే పరిష్కరించడం జరిగందని, మిగిలిన వాటిన్నిటినీ మంగళవారం నాటికి గడువులోపున ఈఆర్ఓలు పరిష్కరిస్తారన్నారు. జిల్లాలోని 4597 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల కమీషన్ నిర్థేశించిన కనీస సదుపాయాలను కల్పించడం జరిగిందని, వీటి మాపింగ్ పూర్తి చేసి వెబ్ సైట్లో అప్ లోడ్ చేశామన్నారు. అనంతరం రోల్ అబ్జర్వర్ విజయకుమార్ సమీక్ష నిర్వహిస్తూ జిల్లా ఓటరు జాబితాల్లో నమోదైన జనాభా-ఓటర్ల నిష్పత్తి, ఓటర్లలో స్త్రి-పురుష నిష్పత్తి పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
రంపచోడవరం నియోజక వర్గంలో తక్కవగా ఉన్న జనాభా-ఓటరు నిష్పత్తి జిల్లా సగటు కంటే బాగా తక్కవగా ఉందని, ఓటరు నమోదు మరింత పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈఆర్ఓ కు సూచించారు. అలాగే పిఠాపురం, ముమ్మిడివరం, అమలాపురం నియోజక వర్గాలలో తక్కవగా ఉన్న లింగ నిష్పత్తి సవరణకు ఆయా ఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జిల్లా జనాభాలోని 18 నుండి 19 ఏళ్ల వయస్సు యువత అందరూ ఓటర్లుగా నమోదైయ్యేట్లు ప్రోత్సహించారు , ఈ నెల 25వ తేదీన నిర్వహించే ఓటరు దినోత్సవ కార్యక్రమాల ద్వారా ప్రత్యేక చైతన్యాన్ని జాగృత చేయాలని సూచించారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు, ముఖ్యంగా దివ్యాంగ ఓటర్ల కొరకు అవసరమైన సదుపాయాలు ఉండేలా పర్యవేక్షించాలన్నారు. సంక్షిప్త సవరణ-2021 కార్యక్రమంలో అందిన క్లెయిమ్లు, అభ్యంతరాన్నిటిని 5వ తేదీలోగా పూర్తి చేసి, స్వచ్చమైన ఓటరు జాబితాలను సిద్దం చేయాలని అబ్జర్వర్ విజయ్ కుమార్ ఈఆర్ఓలను కోరారు. అధికారులతో సమీక్షకు ముందు రోల్ అబ్జర్వర్ విజయ్ కుమార్ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై ఓటరు జాబితాల సవరణకు, స్వచ్చీకరణకు అందరి సహకారాన్ని కోరారు. అలాగే వివిధ పార్టీల ప్రతినిధులు చేసిన సూచనలను స్వీకరించి, వారి సందేహాలను నివృత్తి చేశారు. సవరణ ప్రక్రియ జరుగుతున్న తీరు పట్ల అన్ని పార్టీలు సంతృప్తి వ్యక్తం చేయాయి. జిల్లా కలెక్టర్ డి.మురళీధరరెడ్డి మాట్లాడుతూ రోల్ అబ్జర్వర్ సూచించిన అంశాలపై ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) బి.రాజకుమారి, సబ్ కలెక్టర్లు హిమాంశు కౌశిక్, అనుపమ అంజలి, ఈఆర్ఓలు, ఎఈఆర్ఓలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఆర్.వెంకటేశ్వరావు (వైఎస్ఆర్ సిపి), జి.సాయిబాబు (టిడిపి), జి.జి.కళ్యాణ కుమార్ (బిజేపి), పి.అర్జున్ (ఐ.ఎన్.సి), సిహె.అజయ్ కుమార్ (సిపియం), ఎస్.అప్పారావు (బిఎస్పి) తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య ( నాని ) మంగళవారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మంత్రి మంగళవారం ఉదయం 11.00గం.లకు శ్రీకాకుళంకు చేరుకుంటారని అనంతరం అక్కడి నుంచి అరసవల్లి, శ్రీకూర్మంలోని దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 03.00గం.లకు శ్రీకాకుళం నుంచి బయలుదేరి విశాఖపట్నంకు వెళతారని కలెక్టర్ వివరించారు. మంత్రి రాక సందర్భంగా అధికారికంగా అన్ని ఏర్పాట్టు చేసినట్టు కలెక్టర్ వివరించారు.
కరోనా నియంత్రణపై మరింత అప్రమత్తతతో వుండవలసిన ఆవశ్యకత వుందని సంయుక్త కలెక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం జె.సి.క్యాంపు కార్యాలయంలో కోవిడ్-19 నియంత్రణపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా 50 రోజుల కేంపెయిన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదన్నారు. డిశంబరు ఒకటవ తేదీ నుండి జనవరి 19వ తేదీ వరకు 50 రోజులు కేంపెయిన్ కార్యక్రమాన్ని అధికారులు ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. సానిటైజరు వుపయోగించాలని, సామాజిక దూరం పాటించాలని, మాస్కులు తప్పని సరిగా ధరించాలని ఇంటింటికీ వెళ్ళి ప్రజలకు తెలియ చేయాలన్నారు. పండుగ సందర్భంగా మరింత అప్రమత్తతతో వుండాలని వారికి తెలిపాలన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్, వైద్య సిబ్బంది, వాలంటీర్లతో సహా అందరూ మంచి సేవలను అందించడం వలన మన జిల్లాలో కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు.
ప్రభుత్వం కరోనా సెకెండ్ వేవ్ ప్రబలకుండా అడ్డుకోవడానికి 50 రోజుల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. స్వయంశక్తి సంఘాలు, ఉపాధిహామీ సిబ్బంది, ఆర్.టి.సి. ఎండోమెంట్స్, ఎం.డి.ఓ.లు, సెక్రటరీలు, మున్సిపల్ కమీషనర్లు కార్యక్రమంపై ప్రత్యేక శ్రధ్ధ వహించాలన్నారు. గ్రామ స్థాయిలోను, మండల స్థాయిలోను కాంపెయన్ నిర్వహించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగించాలని తెలిపారు. సెకెండ్ వేవ్ ప్రబల కుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కలిగించి ప్రతీ ఒక్కరూ కరోనా పూర్తి నివారణకు సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమీషనరు పి.నల్లనయ్య, జిల్లా గ్రామీణ అభివృధ్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతి, జిల్లా పరిషత్ డిప్యూటీ సి.ఇ.ఓ. లక్ష్మీపతి, ప్రజా రవాణా శాఖ డిప్యూటీ సి.టి.ఎం. జి.వరలక్ష్మి, తదితర అధికారులు హాజరైనారు.
వ్యవసాయ మౌళిక సదుపాయాల కల్పనకు నాబార్డు ఆర్ధిక సహకారాన్ని అందిస్తుందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆప్కాబ్ మేనేజింగ్ డైరక్టర్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళంలో రాష్ట్రలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల సమీక్ష జరిగిందని, 2020- 21 సంవత్సరానికి వాటి పనితీరును పరిశీలించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్.బి.కే) పరిధిలో సౌకర్యాలు కలుగ జేయుటకు రూ.1,426 కోట్లు ఆర్ధిక సహాయాన్ని అందించుటకు నిర్ణయించడం జరిగిందని సుధీర్ కుమార్ తెలిపారు. ఆర్.బి.కేల పరిధిలో గిడ్డంగులు, కోల్డు స్టోరేజిలు తదితర సౌకర్యాల కల్పనకు ఆప్కాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుందని ఆయన వివరించారు. డిసిసిబిలు మంచి పనితీరును కనబరిచాయని, సంవత్సరాంతానికి నిర్ధేశిత లక్ష్యాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆప్కాబ్ మేనేజింగ్ డైరక్టర్ డా.ఆర్.శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 2020 – 21 ఆర్ధిక సంవత్సరానికి ఆప్కాబ్ రూ.20 వేల కోట్ల వ్యాపారాన్ని, డిసిసిబిలు రూ.40 వేల కోట్ల వ్యాపారాన్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరోనా కారణంగా లక్ష్య సాధనలో కొంత జాప్యం జరిగిందని, రానున్న మూడు నెలల కాలంలో లక్ష్యాలు పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆర్.బి.కెల పరిధిలో గిడ్డంగులు, కోల్డు స్టోరేజిల నిర్మాణానికి డిసిసిబిలు, పి.ఏ.సిఎస్ లకు ఆప్కాబ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. రానున్న రెండు సంవత్సరాల కాలంలో వీటిని పూర్తి చేయగలమని ఆయన పేర్కొన్నారు. జాయింట్ లయబిలిటి గ్రూప్ ల ద్వారా 6 వేల కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు రూ.14 వందల కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రూ.12,400 కోట్ల పంట రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు రూ.7 వేల కోట్ల రుణాలను అందించామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక రుణాలను అందించుటకు చర్యలు చేపడుతున్నామని, స్వయం సహాయక సంఘాలు (ఎస్.హెచ్.జి)లకు 9 శాతం వడ్డీ రేటుతోను, ప్రాసెసింగు ఛార్జీలు తగ్గించి మంజూరు చేయుటకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రూ.2 వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు.
శ్రీకాకుళం డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా మోబైల్ ఏటిఎం, పి.ఎ.సి.ఎస్ అభివృద్ధి సెల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్.హెచ్.జిలు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లకు మరింత సహాయాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. సహకార బ్యాంకు సిబ్బందికి వేతన రివిజన్ ఉదారంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.
అనంతరం ఎస్.హెచ్.జిలకు, వివిధ సంస్ధలకు ఆర్ధిక సహాయాక చెక్కులను అందజేసారు. ఈ మీడియా సమావేశంలో డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, ఇన్ ఛార్జ్ జిల్లా సహకార అధికారి కె.మురళీ కృష్ణ మూర్తి, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ సోవల్కర్ పాల్గొన్నారు. సమీక్షా కార్యక్రమంలో నాబార్డు డిజిఎం లు ఎస్.కె.సాహూ, ఆప్కాబ్ చీఫ్ జనరల్ మేనేజర్ డా.ఎం.రాజేశ్వరి, జనరల్ మేనేజర్లు విజయ భాస్కర రెడ్డి, ఆర్.సురేన్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జివిఎంసి ఈ-స్పందన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులు తక్షణమే స్పందించాలని కమిషనర్ డా.స్రిజన ఆదేశించారు. సోమవారం జివిఎంసిలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆయనా శాఖలు, జోన్లకు బదలాయించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి వచ్చిన స్పందనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మూడు రోజుల్లో సమాచారం అందించాలన్నారు. ఈ రోజు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ విభాగానికి 02, ఇంజనీరింగ్ పబ్లిక్ వర్క్స్ విభాగానికి 05, ఇంజనీరింగ్ భూగర్భ మురికినీటి విభాగానికి 01, యుసిడి విభాగానికి 01 ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన కమీషనర్ డా. జి. సృజన ప్రధాన కార్యాలయ విభాగపు ఉన్నతాధికారులతోను, జోనల్ కమిషనర్లతోను మాట్లాడుతూ స్పందన కార్యక్రమంలో స్వీకరించిన ఫిర్యాదులు 03 రోజులలో పరిష్కరించేందుకుగాను తగు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు రమణి, సన్యాసిరావు, సి.సి.పి.విద్యుల్లత, ఎగ్జామినర్ ఆఫ్ అక్కౌంట్స్ వై. మంగపతిరావు, సి.ఎం.ఓ.హెచ్. డా. కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జె.డి.(అమృత్) విజయ భారతి, డి.సి.(ఆర్) ఎ. రమేష్ కుమార్, ఎఫ్.ఎ & ఏ.ఒ. మల్లికాంబ, డి.పి.ఓ. చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
పరిశోధకులు చేసిన ఫలితాలు రైతులు అందేవిధంగా చూడాలని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ శాస్త్రవేత్తలను కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలోని మినీ కాన్ఫరెన్సు హాలులో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జెసి డీఎఫ్ఆర్ఎల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యాపారస్తులు, సేవా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. డీఎఫ్ఆర్ఎల్(రక్షణ సంబంధిత ఆహార పరిశోధన ప్రయోగశాల) అధికారులు టమోటా ధర తక్కువగా తక్కువగా ఉన్నప్పుడు రైతులకు గల అవకాశాలను వివరించారు. టమోటా పేస్ట్, టమోటా పొడి, సాస్ వంటి ఉత్పత్తుల తయారీ వల్ల రైతులకు లాభసాటిగా ఉంటుందనీ.. ఆ తయారీకి కావాల్సిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నందున రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.
ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. రానున్న రోజులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమదేనన్నారు. నీళ్లు కూడా బాటిళ్లలో తాగుతున్న రోజులివి అని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయనీ.. రానున్న పది, పదిహేను రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో ముందుకు రావాలని డీఎఫ్ఆర్ఎల్ అధికారులను కోరారు. అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్.. జిల్లాలో నెలకొల్పగలిగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై పదిహేను రోజుల్లో డీపీఆర్ లు సిద్ధం చేయాలని డీఎఫ్ఆర్ఎల్ అధికారులను కోరారు. శాస్త్రవేత్తల పరోశోధనలు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సాగించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వినియోగ దారుడు కోరుకునే వస్తువులను తయారు చేయగలిగినప్పుడే రైతులైనా, వ్యాపారస్తులైనా వాటిని వినియోగించేందుకు ముందుకొస్తారన్నారు. వినియోగదారులు కోరుకోని ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు.
పరిశోధనా ఫలాలు రైతుకు చేరినప్పుడే రైతు అభివృద్ధి చెందుతాడన్నారు. ఆ దిశగా జరుగుతోన్న మరో ప్రయత్నంలో భాగంగానే డీఎఫ్ఆర్ఎల్ తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కిసాన్ రైలు వంటి కార్యక్రమాల ద్వారా మార్కెట్ గురించి జిల్లా యంత్రాంగం కూడా పాఠాలు నేర్చుకుందనీ.. వాటిని కూడా పరిశీలించి జిల్లా రైతులకు ఉపయోగపడే విధంగా డీపీఆర్ లు సిద్ధం చేయాలన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పండించే టమోటాను మధ్య ఆసియా దేశాల వంటి టమోటా పండించని దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుగుణంగా 30 నుంచి 40 రోజుల వరకూ నిలవ చేయగలిగే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులైన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మైసూరుకు చెందిన డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్- ఎఫ్ డా.ఆర్.కుమార్, సైంటిస్ట్- ఎఫ్ డా.పి.చౌహన్, సైంటిస్ట్- ఎఫ్ డా.టి.ఆనంద్, సైంటిస్ట్- ఈ డా.రుద్రేగౌడ, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, హార్టికల్చర్ డిడి పద్మలత, కె.వి.కె రెడ్డిపల్లి సైంటిస్ట్ లు జాన్ సన్, సుధ, హార్టికల్చర్ సైంటిస్ట్ దీప్తి, ఆదరణ రామకృష్ణ, రెడ్స్ సంస్థ భానుజ తదితరులు పాల్గొన్నారు.